Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాగల కార్యం

[అనుకృతి గారు రచించిన ‘కాగల కార్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

చంద్రం సిమెంట్ దిమ్మ మీద పడుకొన్న రాణి కేసి తదేకంగా చూస్తున్నాడు. ఒంటిగంటకు అన్నాలు తిన్నాక కూలీలు ఓ గంట సేపు రెస్ట్ తీసుకుంటారు.మళ్ళీ కాంట్రాక్టర్ వచ్చి అదిలిస్తే , పనిలోకి ఎక్కుతారు.

ఒళ్ళంతా సిమెంట్, దుమ్మూ, ధూళితో నిండిన చీర, అందరు ఆడ కూలీలకు మల్లే పైన తనదొక షర్ట్, నెర్రెలు బారిన పాదాలు, ఇదీ ఇరవై రెండేళ్ళ రాణి రూపం. పేరుకే రాణి, తనని చేసుకొని రోజు కూలీ అయ్యింది. జుట్టు పాడవుతుందని , తలకి గుడ్డ కట్టుకుంటుంది. తాను చిన్న మేస్త్రీ కాబట్టి ఎక్కువ కూలీ, రాణికి రోజుకూలి.

అయిదేళ్ల క్రితం పెళ్ళయ్యింది. తాగి, తాగి సచ్చిపోయిన తండ్రి జీవితం చంద్రానికి పెద్ద గుణపాఠం నేర్పింది. అయిదేళ్ల నుండీ తనకు తోడై నిలిచి, తనతో పాటు కష్టం చేస్తూ, డబ్బు కూడేలా చేసింది రాణి. ఈ ఐదేళ్లలో రెండెకరాల పొలం కొన్నాడు, రాణి బాబాయి దాన్ని సాగు చేస్తున్నాడు.

ఇదంతా రాణి వల్లనే సాధ్యమైంది. తల్లి యాదమ్మ అన్న దగ్గిరే ఉంటుంది. అన్న భార్య సాయమ్మ పరమ గయ్యాళి. అత్తని కూచోనియ్యదు, పడుకోనివ్వదు. సాయమ్మ చంద్రం సంపాదన చూసి ఓర్వలేక పోయింది. దూరంగా ఇల్లు తీసుకున్నదాకా ఊరుకోలేదు.

అన్న సంపాదన బాగానేవున్నా, సగం తాగుడికి పోతోంది. అది అతని కుటుంబంలో గొడవలకి కారణమౌతుంది. యాదమ్మ ఎటూ చెప్పలేక సతమవుతోంది. ఈ విషయాలన్నీ యాదమ్మకి తెలుసు, చంద్రం, అతని సంసారం చూసాక ఆమెకు ఎటువంటి దిగులు లేదు. అందుకే పెద్ద కొడుకు ఇంట్లోనే వున్నది ఇన్నాళ్లూ, సూర్యం జీవితం గురించి ఆమెకు దిగులు.

కొడుక్కి ‘రవీంద్ర’ అని పేరు పెట్టుకున్నాడు చంద్రం. కొడుకుని రోజూ రాణి వాళ్ళ అమ్మదగ్గిర దింపి, సాయంత్రం తీసుకొస్తున్నారు. రోజూ దింపి రావటం కష్టంగానే వున్నది. రాణి వదినకి రోజురోజుకీ, ఇది ఇష్టం లేకుండా పోయింది. అయినా వాళ్ళకి తమ సంపాదనే కనబడుతోంది కానీ, తమ కష్టం అర్థం కావటం లేదు. మాల్ బొచ్చె నెత్తికెత్తుకొని, నడవాలంటే ఎంత కష్టమో వాళ్లకి అర్థం కాదు.

ఇంతలో కాంట్రాక్టర్ అరుపులు వినబడ్డాయి. మళ్ళీ పనిలోకి దిగారు. చంద్రం ఆలోచిస్తూనే, పని చేస్తున్నాడు. ఇంత కష్టం తన కొడుక్కి వుండకూడదనేగా, తన ఆలోచన. వదిన ఏ పనికీ పోదు. ఇంటి దగ్గిరే ఉండి, ఇచ్చకాల కబుర్లతో కాలక్షేపం చేస్తుంది. తన చుట్టూ వున్న వాళ్లంతా కష్ట జీవులే, కానీ సాయంత్రం అయ్యేసరికి అంతా తాగుడికి బానిసలై బ్రతుకులకి నిప్పెట్టుకుంటున్నారు. పిల్లలికి సరైన చదువులుండవు, ఇంటి యజమాని తాగి, తాగి చనిపోతే, మిగిలిపోయిన భార్యా పిల్లాడి అధోగతే.

చంద్రానికి జీవితం పట్ల మంచి అవగాహన వుంది, జీవితంలో పైకి రావాలి అంటే సవ్యంగా జీవిస్తేనే పైకి రాగలమని అతని నమ్మకం. పెద్దగా చదువులేదు. ఉన్నదల్లా కష్టం చేయగలిగిన శరీరం, తెలివితేటలూ, అంతే, తండ్రి వ్యసనాలకు ఆయన సంపాదనంతా ఖర్చయి పోయింది, మిగిలిందేమీ లేదు,

బొచ్చెలో మాల్ అందిస్తున్న భార్య మొహం లోకి చూసాడు చంద్రం. దుమ్ము, ధూళితో మాలిన్యమయిన ఆమె బట్టలు, ఒళ్ళు ఆమె రూపాన్ని మార్చేశాయి. పెళ్లప్పుడు ఎంత బాగుండేది! గువ్వ పిట్టలా కువకువ లాడేది. అయిదేళ్ల నుండి తనతో సమానంగా, పనికి వచ్చి, సంపాదనంతా తన చేతుల్లోనే పోస్తోంది. అందుకే డబ్బు దాచి, పొలం కొనగలిగాడు. పొలం కొని ఆమె పేరునే పెట్టాడు, వద్దంది, తాను వినలేదు. ఇవ్వాళ ఇట్లా ఉన్నాడంటే ఆమె తోడ్పాటు, మంచితనమే కారణం. ఎందుకో రెండు రోజులనించి దిగులుగా ఉంటోంది. మాటిమాటికీ కళ్లనీళ్లు పెట్టుకొంటోంది. ఇవ్వాళ విషయమేంటో కనుక్కోవాలి అనుకున్నాడు చంద్రం.

అయిదింటికి పని దిగారు. కాళ్ళూ, చేతులూ, మొహం కడుక్కొని, ఆ రోజు కూలీ తీసుకొని ఇంటికి బండిమీద బయల్దేరారు. దారిలో ఓ చెట్టుకింద ఆపాడు. ఆ వేప చెట్టుకింద, చుట్టూ కట్టిన చప్టా మీద కూర్చుని, రాణిని కూడా కూర్చోమన్నాడు.

“ఇక్కడ ఆపావెంటి పిల్లడు ఎదురుచూస్తా వుంటాడు” అన్నది.

“సంగతేంటి చెప్పు, ఎందుకు కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నావు? రెండు రోజులనుంచి చూస్తున్నా, ఒంట్లో బాలేదా?” అడిగాడు.

రాణికి దుఃఖం పొంగి వచ్చింది. “మా వదినకు పిల్లాడిని మా అమ్మ చూట్టం సహించట్లేదు, ఏదో ఒక కారణం చెప్పి, అమ్మని తిడుతోందిట. అక్కడికీ నేను వాడికి కావలిసిన గుడ్లూ, పళ్ళూ, పెసరపప్పు బియ్యము కలిపి ఇస్తానే వున్న కదా! అప్పుడప్పుడు చీరో, రవికనో ఇస్తానే వున్న, అమ్మ ఇంట్లో పని చెయ్యకపోతే కుదరదు కదా. ” దుఃఖం గొంతు నిండిపోగా, ఆగిపోయింది.

కంట నీరు కారుతుండగా మళ్ళీ చెప్పసాగింది, “రెండేళ్లు కూడా లేవువాడికి, మట్టి చేతులు బకెట్ నీళ్లలో పెట్టి, ఖరాబు చేసాడని, బండ తిట్లు తిడుతూ, వీపు మీద చరుస్తుంటే, పరుగున పోయి అడ్డం పడ్డాను. కానీ ‘పిల్లలని మంది మీద పడేసి, సంపాదన మీద పడ్డారు’ అంటూ తిడుతుంటే, అమ్మ గుడ్ల నీళ్లు కక్కుకుంటూ, నించుంది. ఇవ్వాళ వాడిని అమ్మకిచ్చి వచ్చాను కానీ, మనసు మనసులోలేదు” అన్నది ఏడుస్తూ.

భార్య దుఃఖం చూస్తుంటే, చంద్రానికి కష్టం వేసింది. రాణి తలమీద చేయివేసి, “రేపు ఫస్ట్ కదా, పని ఉండదు కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాములే, ఏడవమాక” అని, బండి స్టార్ట్ చేసాడు. పిల్లాడిని తీసుకొని ఇంటికెళ్ళేసరికి, చంద్రం తల్లి, యాదమ్మ అరుగు మీద కూర్చొని ఉంది.ప్రక్కన బట్టల బ్యాగ్ ఉంది.

రాణి గబా, గబా తాళం తీసి “లోపలి రా, అత్తమ్మ” అన్నది. తనని గుర్తు పట్టి, ఎగిరి తనమీదకి దూకిన మనవడిని ముద్దాడుతూ, లోపలికి నడిచింది యాదమ్మ.

“అత్తమ్మ, స్నానం చేసి వచ్చి, వంటచేస్తా” అన్నది రాణి.

“సరేలే, ఆరేగా అయ్యింది, తిండికేమి తొందర, ముందు వీడికేమైనా పెట్టు” అన్నది.

సూర్యం, చంద్రం వేరుపడ్డాక, తల్లిని తనతో తీసుకు పోయాడు సూర్యం. ఎప్పుడైనా వచ్చి, ఒకరోజుండి పోతుంది.

“ఇంక ఆడికి పోనురా చంద్రం, తెగతెంపులు చేసుకొని వచ్చా” అన్నది యాదమ్మ కళ్ళొత్తుకొని.

“ఏవయిందే అమ్మా, గొడవ పడ్డారా?” అడిగాడు చంద్రం.

“నాకు చేతనయినంత చాకిరీ చేస్తనే వున్నరా, మీ నాన్న తాగి, పాడు చేసిన పొలం మాటెత్తి తిడుతుంది, సూర్యం తాగి వచ్చి, గొడవ పడుతున్నాడు, అదీ ఊరుకోదు, వాడూ ఊరుకోడు. మీరు పొలం కొనుక్కున్న దగ్గరనించి ఓర్వలేకపోతున్నది. మాటిమాటికీ మీరు సంపాయించుకుంటున్నారు, నాకు ఈ ఎదవ దొరికాడు” అని తిడుతది, వాడిని పెంచినట్టే నిన్నూ పెంచాను, నా తప్పేముంది ఇందులో? ఇప్పటిదాకా వాళ్లనే చూసాను, రోజూ వీడిని అంత దూరం దిగబెట్టి, మళ్ళీ తెచ్చుకొంటున్నారు. నేను ఈడ్నే ఉంటా, వీడిని చూసుకొంటా, ఏమంటవురా” అన్నది.

ఆమె మాటలు విన్న రాణి రివ్వున వచ్చి మంచం మీద కూర్చున్న అత్త కాళ్ళను చుట్టి, బావురుమంది. చంద్రం నెమ్మదిగా అన్నాడు “వాళ్ళ వదిన పిల్లాడేదో చేసిండని కొట్టిందని, నిన్నట్నుంచీ ఏడుస్తున్నది” చెప్పాడు చంద్రం, రాణి తల నిమురుతూ.

యాదమ్మ కోడలి తల నిమురుతూ, “నేనేడికీ పోనే, ఏడవమాక, నా మనవడిని సక్కగ చూసుకుంటా, పో, పో, పోయి నీళ్లు పోసుకో” అన్నది మనవడిని ముద్దాడుతూ.

Exit mobile version