[శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘జ్వాలాతోరణం’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]
క్షీర సాగర మథన సమయమందు
కడలి కడవ ఆమె సర్పము కవ్వంపు
తాడు ఆమె! మంధరగిరి కవ్వమాయె!
పాల్కడలి దధికుంభ కుదురు! హరియె
కూర్మావతారుడై మంధరగిరిధారి ఆయె!
సంద్రము చిలికి లచ్చి చేపట్టె..!
కొండగిర గిర తిరుగు వేగమున భుగ భుగ
శబ్దముల పాదప విషజ్వాల వ్యాపించగా
సంద్రంపు ఒడ్డున కొండ మల్లెల తావి
తాపమును పోగొట్టి సమీర మాయె!
భళా భళి! భళి భళ! మని చిలక సాగిరి
రాక్షసులు తల పట్టి దేవతలు తోక పట్టి
వాసుకి సర్పమె రజ్జు వై చిలకగా
ఆ పాలవెల్లిలో కీల కోలాహలముతో
హాలాహలము అగ్నికీలల జ్వాలల తొ
మహా ప్రళయ కాలకూటమ్ము..లో కములు
దగ్ధమ్ము చేయునని ప్రాణాలు కోల్పోయిరి
కొందరు! ఆ సమయమున విధాతాది
దేవతలు, దానవులు కైలాసగిరి కేగి
శంకరుని దర్శించి హాలాహలమునుండి
కాపాడుమని కోరి, ప్రార్ధించి వేడుకొనుచు,
శరణు !శరణు! శరణు! ఆర్తులము!
దీనులము!లయ కారకా! మమ్ము కాపాడమని
కోర,హరిహర స్వరూప! ముక్కంటి కావుమని,
వేడుకొన పరమేశుడు.. భవాని చూసి
దీనులను కాపాడ వెర పేల నాకు!
హాలాహలము భక్షించి జీవకోటిని
కాపాడ గలవాడ! అనిన భవునితో భవాని
మీ చిత్తము నకు తగిన రీతి చేయవలె
ప్రభూ!కరుణాంతరంగ! అంబమనమున
ప్రజలను కాపాడఇట్లు తలచే!
ప్రాణేశుడు గరళము మింగినప్రాణికోటికి
మేలగునని హాలాహలము మింగమనియె!
సర్వమంగళ! శంభుడు కట్టిన మంగళ
సూత్రమును మనముననమ్మి పంపె
పరమేశ్వరి!అంత మహాదేవుడు మంగళ
రూపిణి. మంగళ కర మాంగల్యము
మంగళ మొసగునని ‘హరుడు కాలకూట
విషము ‘జంబూఫల’మంతచేసి మింగెను
‘హాలాహలము’ మింగుసమయమున
అంబ పరమేశ్వరి ‘హవ్యవాహనుని’
ప్రార్ధించి చిచ్చర నేత్రు’న కాపద
సంభవించకుండ కాపాడుమో అగ్ని దేవా!
హరుడు క్షేమముగా కైలాసము చేరిన నీకు
‘కార్తీక పున్నమి’ పర్వదినమున ‘జ్వాలా
తోరణము’న ముమ్మూరు తిరిగెదము
జాతవేద! అని ప్రార్థించి ‘మొక్కు’కొనియె!
గరళమును కోరి ‘కబళము’గ మింగిన
*చిచ్చర నేత్రుడు విషచిచ్చును. కంఠమున
నిలిపి ‘నీలకంఠు’డవగ, బ్రహ్మదేవుడు,
విష్ణువు, దేవేంద్రుడు, శివాని – మేలు మేలని
మెచ్చి ‘హాలాహల భక్షణ కథనము’ వినిన
వారికి విష ప్రాణుల భయము కలుగబోదని తెలిపె!
గరళము గళము దాటని కారణమున
కార్తీక మాసమున శుక్ష పార్ల మి పర్వమున
‘దేవళము’లన్ని ‘దీపజ్యోతు’లతో ‘ఆది
దంపతుల’ నర్చించి పరమేశు, ఈశ్వరిని
‘స్యందన’మున ‘వేదఘోషల తోడ’
‘జ్వాలాతోరణము’ ముమ్మార్లు దాటించిరి!
వేదార్చనల తోడ అర్ధనారీశ్వరులు
త్రిపురాసుర సంహారము చేసిన హరునికి
దృష్టి దోష నివారణకు త్రిపుర పున్నమి
నాడు ‘త్రిపురాసుర సంహార శివుని’
శాంభవి శంభుని తోడ ‘జ్వాలాతోరణము’
ముమ్మూర్లు దాటించి.. భక్తులందరు దాటి,
భక్తి శ్రద్ధలతోడ ‘తోరణ భస్మము’ను
నుదుటధరించి, ‘యమ ద్వార’ భయము
పోగొట్టుకొని.. ఆ భస్మము గోశాల యందు,
కేదారములలో, ధాన్యాగారములందు,
గృహమునందుంచి ‘సర్వేశు జగదంబ’
అనుగ్రహము పొంది సుఖసంతోషములతో
దీపములు వెలిగించి ‘దీపదానము’ చేసి,
తరియించి ‘కోటిదీపార్చనల’ వృషభోత్సవ
ములు, కార్తీక సమారాధనలు చేసి అన్నపూర్ణ,
విశ్వనాథులను సేవించి.దైవానుగ్రహ
వరమును పొందెదము!
ఓం ఉమామహేశ్వరాయ నమః!
ఓం అర్ధనారీశ్వరాయ నమః!
ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ..
ఓం నమశ్శివాయ!
*చిచ్చర నేత్రుడు = ముక్కంటి
