[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ధైర్యేణోపదృతో రాజా శుశ్రువాన్నా సహిష్ట తాన్। బాలోగ్ని కణవిప్లుష్టః పద్మరాగయివామలమ్॥ (జోనరాజ రాజతరంగిణి 1237)
అగ్నికణాల వేడి తగిలిన పిల్లవాడు, ఎంత శుభ్రమైనదైనా పగడ రత్నానికి దూరంగా ఉండేట్టు, పండితుడు, సర్వం తెలిసిన సుల్తాన్ తురుష్కులను భరించలేక వారికి దూరంగా ఉన్నాడు.
ఈ శ్లోకంలో జోనరాజు చెప్పింది అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. జోనరాజు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆలోచించాల్సి ఉంటుంది.
మ్లేచ్ఛులు, యవనులు, అనాగరికులు అంటూ జోనరాజు, భారతీయులను తప్ప ఇతరులందరినీ సంబోధించటం కనిపిస్తుంది. నాగులు సైతం తురుష్కుల పొడను భరించలేక అడవులకు పరిమితమయ్యారని రాశాడు. తరువాత శ్లోకంలో పిల్లవాడు ఒకసారి కాలగానే అగ్నికణాలకు దూరంగా ఉండేట్టు, ఎంత మంచివారయినా తురుష్కులకు రాజు దూరంగా ఉంటున్నాడని అంటున్నాడు. దీని ఆధారంగా ఆలోచిస్తే ఆ కాలంలో నెలకొన్న ఉద్విగ్నతలను ఊహించే వీలు చిక్కటమే కాకుండా పండితులకు ఆశ్రయం కల్పించటం, భారతీయ పద్ధతులకు ప్రాధాన్యమిచ్చి పాటిస్తూండటం వల్ల జైనులాబిదీన్ ఎదుర్కుంటున్న వ్యతిరేకతలను కూడా ఊహించే వీలు చిక్కుతుంది.
నాగులు తురుష్కులకు దూరంగా ఉండటం, తురుష్కులు నాగులంటే భయపడటం అర్థం చేసుకోవటం కష్టం కాదు, కానీ సుల్తాను – నిప్పు పట్టుకుని కాలిన పిల్లవాడు మళ్ళీ నిప్పు జోలికి వెళ్ళనట్టు – తురుష్కులకు దూరంగా ఉండటం అన్నదాన్ని అర్థం చేసుకోవటం కష్టం. సుల్తాను, పండితులు, వారి పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తున్నాడు కాబట్టి సుల్తాన్ మతస్తులే ఆయనను వ్యతిరేకించటం, కుట్రలు పన్నటం, నిరసన ప్రదర్శించటం వంటివి చేస్తుంటే సుల్తాను వారికి దూరంగా ఉంటున్నాడేమో అనుకోవచ్చు. మరోవైపు సుల్తాన్ ఇప్పుడు వెళ్తుంది, మంచుకొండలలో కొలువై ఉన్న అమరేశ్వరుడిని దర్శించటం కోసం. అదీ ఎందుకంటే, లిద్దర్ నది నీళ్లు మళ్ళించాలంటే అమరేశ్వరుడి అనుమతి అవసరం అన్న నమ్మకం వల్ల. ఇస్లామీయులు ఇలాంటి వాటికి వ్యతిరేకులు. పైగా, పరదేవతను కొలవటం, నమ్మటం వారికి నచ్చదు. కాబట్టి కూడా సుల్తాన్ వారికి దూరంగా ఉంటూండి ఉండవచ్చు. ఈ ఆలోచనలకు తరువాత శ్లోకాలు కాస్త బలం ఇస్తున్నట్టు కనిపిస్తుంది.
కపీనామివ బద్ధానం భీతానామపి చ ధృవమ్। మ్లేచ్ఛానాం చ దురాచార చాపల్యం విన్యవర్తత॥ (జోనరాజ రాజతరంగిణి 1238)
యదుద్గర్జద్భురుద్యర్భః సవిద్యుద్భి ర్ఘనైర్ఘనైః। కోపనేవాభవత్తేషు తతః కాలముఖం నభః॥ (జోనరాజ రాజతరంగిణి 1239)
కాతరేష్వివ సంగ్రామాద్ధిరేస్తూర్లాపలాయిషు। మ్లేచ్ఛేషు కరకావర్షైర్నష్ట ధైర్యేషు తత్క్షణమ్॥ (జోనరాజ రాజతరంగిణి 1240)
ఈ మూడు శ్లోకాలలో పొందుపరిచిన విషయాలు, అవి చెప్పిన పద్ధతి పరిశీలిస్తే జోనరాజు బహుశా ఇంత ధైర్యంగా ఇలా చెప్పి ఉండక పోవచ్చనిపిస్తుంది. ఎందుకంటే ఆరంభం నుంచీ జోనరాజు ఎంతో జాగ్రత్తగా, సంయమనం పాటిస్తూ తన మనసులోని ఆవేశాలు, ఆవేదనలకూ , తానుంటున్న పరిస్థితులలో చెప్పలేని అంశాలకూ నడుమ సమతౌల్యం పాటిస్తూ, సంయమనంతో విషయాలు ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఎంతటి కఠినమైన చేదు నిజాన్నయినా వీలయినంత సౌమ్యంగా చెప్తున్నాడు. వీలుకాకపోతే ఆ ప్రస్తావన వదిలేస్తున్నాడు. కాబట్టి ఈ శ్లోకాలు తరువాత ఎవరో రాసి జోడించారేమో అనిపిస్తుంది.
బంధితులైన కోతుల్లాగా, మ్లేచ్ఛులు, భయభీతులై తమ దురాచారాల చాపల్యాన్ని అదుపులో పెట్టుకున్నారట. సుల్తాన్ వెంట ఉన్న వారిని బంధితులైన కోతులతో పోల్చడం, మ్లేచ్ఛులు అనటం, వారు భయభీతులయ్యారని అనటం, దురాచారాల చాపల్యాన్ని అదుపులో పెట్టుకున్నారనటం జోనరాజు నుంచి ఊహించనిది. ఇక్కడ అంత తీవ్రమైన పదజాలంతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
సుల్తానుతో పాటు అమరేశ్వరుడి దగ్గరకు వెళ్ళేందుకు మంచుకొండలు ఎక్కుతున్న మ్లేచ్ఛులు, అనాగరికులు గర్జిస్తున్న నల్లటి మేఘాలను ఆకాశంలో మృత్యువులా భావించి పారిపోయారట. మంచుకొండలలో వర్షం అతి ప్రమాదకరమైనది. ముందే జారే మంచు మరింత జారటమే కాదు, పలు రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి కూడా మేఘాల గర్జన, ఆకాశంలో మృత్యువులా అనిపించడటం స్వాభావికం. కానీ ఎందుకో జోనరాజు ఇలా రాసి ఉండడని అనిపిస్తుంది. అందుకు ఈ శ్లోకాలను ప్రధాన రాజతరంగిణిలో చేర్చకుండా, రాజతరంగిణి చివరన పొందుపరచారు.
నల్లటి మేఘాలలో మృత్యువును చూసి భయభీతులైన మ్లేచ్ఛులు, కొండపైన కురుస్తున్న వడగళ్ల వాన చూసి యుద్ధంలో శత్రువుకు భీతి చెంది పలాయనం చిత్తగించినట్టు సుల్తాన్‌ను ఒంటరిగా వదలి పారిపోయారు. సాధారణంగా తమ దైవం తప్ప ఇతర దైవాలను నమ్మని వారికి, క్రోధంతో, ద్వేషంతో ధ్వంసం చేసే ఉద్దేశాలతో పరమతాల పవిత్ర స్థలాలలో అడుగుపెట్టటం, వాటిని ధ్వంసం చేయటంలో ఎలాంటి నేర భావన కలుగదు. పవిత్ర కార్యం నెరవేరుస్తున్న భావన కలుగుతుంది. దైవకార్యం నిర్వహించటంలో గర్వం కలుగుతుంది. అదే ఆయా పవిత్ర స్థలాలలో భక్తి భావనతో అడుగు పెట్టటం నేర భావనను కలిగిస్తుంది. సుల్తాన్ వెంట అమరేశ్వర మందిరానికి వెళ్తున్నవారికి కూడా అలాంటి నేర భావన కలిగి ఉంటుంది. నేర భావన భయాందోళనలకు దారి తీస్తుంది. అందుకని మంచుకొండల నడుమ నల్లటి మేఘాలు, వడగళ్ళ వానలకు వారు భయపడి పారిపోవటంలో ఎలాంటి ఆశ్చర్యం కలుగదు. పైగా వీరిలో మతం మారినవారు కూడా ఉండి ఉండవచ్చు. వారిలో ఇంకా పాత సంస్కారాలు పూర్తిగా చచ్చి ఉండవు. వారు కూడా ఈ పరిస్థితిని దైవాగ్రహ ప్రదర్శనగా భావించటం స్వాభావికం.
తన వెంట ఉన్నవారు తనని ఒంటరివాడిని చేసి పారిపోయినా సుల్తాన్ తన పట్టుదల వదలలేదు. పథం నుంచి వైదొలగలేదు. మంచివాడు ఎట్టి పరిస్థితులలో మంచిని వదలనట్టు, రాజు అమరేశ్వర దర్శన కాంక్షను వదలలేదు.
మాంత్రికేష్ణివ మేఘేషు గర్జత్సు యవనోరుగైః। త్యక్తో నిధిరివ క్ష్మాపో దేవో నాగైశంస్థత॥ (జోనరాజ రాజతరంగిణి 1242)
ఇది జోనరాజు రాయలేని శ్లోకం.
మేఘాలు మాంత్రికులలా గర్జిస్తున్నపుడు ‘యవనోరుగైః’. పాముల్లాంటి యవనులు, ప్రాణభయంతో పాములు పాముల పుట్టను వదిలి పారిపోయినట్టు తమ రాజును వదలి పారిపోయారు. ఇంతవరకూ ‘మ్లేచ్ఛులు’ అంటూన్న జోనరాజు హఠాత్తుగా ‘యవనులు’ అనటం అనౌచిత్యం. ఎందుకంటే ఇంతవరకూ రాజతరంగిణిలో జోనరాజు మ్లేచ్ఛులు, యవనులకు నడుమ స్పష్టమైన తేడా చూపిస్తూ వస్తున్నాడు. ఈ ఒక్క శ్లోకంలో యవనులు, మ్లేచ్ఛులు అన్న పదాలను పర్యాయ పదాలుగా వాడటం ఈ శ్లోక రచయిత జోనరాజు కాదేమో అనిపించేట్టు చేస్తుంది. యవనులు ఇలా పాముల్లా పారిపోతున్న సమయంలో నాగులు తమ దైవాన్ని ప్రార్థించారు.
యవనులను తక్కువ చేసి, నాగులను ఎక్కువ చేసి చూపటం, నాగులు దేవతలను ప్రార్థన చేయటం, యవనులు రాజును వదలి పారిపోవటం వంటివి నిజంగా జరిగి ఉన్నా, జోనరాజు మాత్రం ఆ నిజాన్ని ఇలా వర్ణించడనిపిస్తుంది. ఈ మొత్తం సంఘటన ఇస్లామీయులను తక్కువ చేసేందుకో, చులకనో చేసేందుకో రాసినట్టు తోస్తుంది.
తన మార్గం వదలని రాజుకు స్వప్నంలో దివ్యపురుషుడు దర్శనమిచ్చాడు. కలలో కనిపించిన ఆ దివ్యపురుషుడు “రాజా.. నువ్వు ఇక్కడి నుంచి వెనుదిరిగి పో. నువ్వు చేపట్టిన కార్యం సఫలమవుతుంది. ‘పూజోపకరణం శంభోః ప్రాప్తమేర విసృజ్యతామ్’ (1243)” అన్నాడు. శివుడిని పూజిచే ఆలోచనని వదలి వెనక్కు వెళ్ళిపో.. నువ్వు కశ్మీరంలో తలపెట్టిన కార్యం సఫలమవతుందని ఆ దివ్య పురుషుడు రాజుకు కలలో కనపడి చెప్పాడు. అంటే, మొత్తానికి సుల్తాన్‌కు శివుడి దర్శనం కాలేదు. సుల్తాన్ శివుడిని పూజించలేదు. కానీ కార్యం సఫలం అయింది. దాంతో ఉదయాని కల్లా సుల్తాన్ వెనక్కు తిరిగి కశ్మీరం చేరుకున్నాడు.
శౌర్యభట్టును పిలిచి లిద్దర్ నదిని పర్వత కనుమ ప్రాంతాల గుండా మార్తాండ నగరం నుంచి మళ్ళించమని ఆజ్ఞాపించాడు. మహారాజు ఆజ్ఞలను శిరసావహిస్తూ శౌర్యభట్టు వెంటనే నది దారి మళ్ళించే పనిని ఆరంభించాడు. సుల్తాన్ ఆజ్ఞానుసారం అన్ని ప్రాంతాలలోని ప్రముఖులకు, అధికారులకు వారి జనాలను ఇటువైపు పంపమని ఆజ్ఞాపించాడు.
రాళ్లతో, బండలతో నదీ ప్రయాణ మార్గాన్ని ఏర్పాటు చేశారు. కొండలలో గుహలను తొలిచారు. వంపులు తిరుగుతూ నది నీరు కొండలో ప్రవహించే ఏర్పాట్లు చేశారు. ఇలా పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నది, తన ఒడ్డున నిలిచిన వృక్షాలకు నీటిని అందించింది. నీటి లోకి వంగిన కొమ్మలున్న వృక్షాలను తనతో పాటు తీసుకు వెళ్లిపోయింది. ఈ రకంగా ప్రవహించే నది రాజు ఊరేగింపును తలపుకు తెచ్చింది. ఇలా ఊరేగింపుగా వెళ్ళేవారు రాజ సమర్థకులను వెంట తీసుకువెళ్తారు. రాజు వ్యతిరేకుల ప్రాణాలు తీస్తారు. ఇలా ప్రవహిస్తున్న నది ప్రవాహవేగం కాలక్రమేణా తగ్గింది. ఈ నది మనిషి పాండిత్యం లాంటిదే. వల్లె వేస్తున్న కొత్తల్లో ప్రతి పదం గుర్తుంటుంది. కానీ కాలక్రమేణా జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుంది. పాండిత్యం క్షీణిస్తుంది. ప్రజల పుణ్యం వల్ల లిద్దర్ నది ప్రవాహంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవలేదు. కొన్ని ప్రాంతాలలో నది ప్రవాహం పర్వతోముఖమైంది. ఇతర ప్రాంతాలలో అది కొండల పైనుంచి దూకుతూ ప్రవహించింది. తన ప్రియుడికి దూరమై నియంత్రణ లేని దానిలా మరి కొన్ని ప్రాంతాలలో ప్రవహించింది.
(ఇంకా ఉంది)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జగదీష్ రాజ్ యొక్క బీరకాయ-బిర్యానీ కథ
జీవన రమణీయం-78
99 సెకన్ల కథ-27
సామెత కథల ఆమెత-17
కమ్మని ‘చిలక పలుకులు’
చిరుజల్లు-41
డా. ఎస్.వి.సత్యనారాయణ గారికి భీమనాథం హనుమారెడ్డి స్మారక సాహిత్య పురస్కారం
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-22
చిరుజల్లు-76
గాంధారి వినతి!!
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®