Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జోలపాటలో ఊయలలూగే అమ్మదనం!-1

[నంద్యాల సుధామణి గారు రచించిన ‘జోలపాటలో ఊయలలూగే అమ్మదనం!’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.]

ప్రతి అమ్మా ఊయల ఊస్తూ, జోలపాట పాడుతూ తనను యశోదమ్మగా, తన బిడ్డను కృష్ణయ్యగా ఊహించుకుంటూ వుంటుంది.

అమ్మ పాట వింటూ, అమ్మ గొంతులోని ఆప్యాయతను, ప్రేమనూ మనసులోకి ఇంకింపజేసుకుంటూ.. అమ్మ ఒళ్లో పడుకున్నట్టూ, అమ్మ తనను గోము చేస్తున్నట్టూ, ముద్దులు పెట్టుకుంటున్నట్టూ.. కమ్మని కలలు కంటూ అమ్మ నా దగ్గరే వుందనీ, ఉంటుందనే భరోసాతో పసిబిడ్డ నిదురమ్మ ఒడిలోకి జారుకోవడం వాడికి ఎంత మధురమైన అనుభవం కదా?

నిజానికి అమ్మ పాడే పాటలోని సాహిత్యం అర్థమయ్యేంత భాష వాడికి రాదు. పాటలోని రాగ మాధుర్యాన్ని, భావాన్ని.. అది ప్రేమనా.. ఆప్యాయతనా.. కోపమా.. అన్నదాన్ని కొంతవరకు మాత్రం వాడు ఆస్వాదించగలడు,

వాడికి పంచేంద్రియాలూ కొంత వరకూ పనిచేస్తూ వుంటాయి. స్పర్శ, వినికిడి శక్తి, చూపు, వాసన, నాలుక అన్నీ పరిమిత స్థాయిలో పనిచేస్తూవుంటాయి. నాలుక రుచి చెబుతుంది. కొన్ని ధ్వనులు మాత్రం చెయ్యడానికి పనికి వస్తుంది.

ఇంద్రియాలు పనిచేయడం వల్ల అన్నీ తెలుస్తూనే వున్నా, అవి పూర్తి స్థాయిలో అర్థమయ్యే స్థితి వాడి మనసుకు వుండదు. భాష రాకపోవడం పెద్ద బాధ వాడికి. తనంతట తను లేవలేడు. నడవలేడు. తన పనులేవీ చేసుకోలేడు. తనకేం కావాలో చెప్పలేడు. అసలు తనెవరో, తన వారెవరో తెలీదు. తాను ఇంత నిస్సహాయంగా ఎందుకున్నాడో తెలీదు. తాను క్షేమంగా వున్నాడో, లేదో తెలీదు. యేదైనా ఆపదలో చిక్కుకుంటానేమోననే భయం వాడిని నిరంతరం వెంటాడుతుంటుంది.

అందుకే కొత్త వారెవరైనా దగ్గరి కొచ్చినా, ఎత్తుకున్నా యేడుస్తాడు. పిల్లలు ఎత్తుకుంటే కిందపడిపోతానేమోనని భయపడతాడు. అంటే పెద్దవాళ్లు ఎత్తుకోవడంలోని వారి జాగ్రత్తనూ, పిల్లల ఎత్తులోని అపరిపక్వతనూ స్పర్శ ద్వారా అనుభూతి చెంది, తనకేది భద్రమో తెలుసుకుని, దాని కోసం డిమాండ్ చేస్తాడు.

అంటే గురుత్వాకర్షణ శక్తి ప్రభావం తనపై ఎలా వుంటుంది.. అన్నది వాడికి సహజప్రేరణ (నాచురల్ ఇన్ స్టింక్ట్) రూపంలో వుంటుంది. నిద్రలో కూడా అలాంటి అభద్రతను సూచించే కల లొస్తాయేమో.. ఉలిక్కిపడి లేచి యేడుపు లంకించుకుంటాడు.

ఈ అభద్రతా భావం వల్లనే అమ్మ నిరంతరం తనతోనే, తన పక్కనే వుండాలని కోరుకుంటాడు. అమ్మ స్తనం ఎప్పుడూ తనకు అందుబాటులో వుండాలి. అమ్మ రక్షణ అనుక్షణం కావాలి వాడికి. ఆ భరోసా అమ్మ నుంచి అనవరతం కావాలి.

నిజానికి జీవుడి అంతర్గత వేదన ఇదే కదా? తన యోగ క్షేమాలు పూర్తిగా తన చేతిలో లేవని తెలుసు. తన జీవితం తన చేతిలో లేదు. తనెందుకు ఇంత అస్వతంత్రుడో తెలీదు. అందుకే దేవుడిపై ఆధారపడతాడు. తన మంచిచెడ్డలు అన్నీ దేవుడు చూసుకోవాలనీ, చూసుకుంటాడనీ, అదే విశ్వాసంతోనే ఎల్లప్పుడూ దేవుడిని స్మరించుకుంటూ ఆయనను ఎల్లవేళలా తన వెంటే వుంచుకోవాలనుకుంటాడు. ఆ దేవుడు కనిపించని శక్తి అయితే, ఈ అమ్మ తన పిల్లల పాలిట కనిపిం(పెం)చే దేవత!

అమ్మ మనసూ పూలతేరూ..!

అమ్మ బొజ్జలో వున్నప్పటి నుంచీ అమ్మ మాటలను ఆలకిస్తూ, ఆ మాటల్లో వ్యక్తమయ్యే ఆమె అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు గర్భస్థ శిశువు.

ఆమె శ్వాస తన శ్వాసయై, ఆమె తిన్న ఆహారమే తనకు పోషణై, ఆమె రక్తమే తన రక్తమై, ఆమె మాంసం తన మాంసమై, ఆమె సంతోషమే తన సంతోషమై, ఆమె బాధయే తన బాధయై ఆమె పొట్టలోని ఓ చిన్ని ప్రపంచంలో తాను పెరుగుతాడు.

చివరికి అమ్మ గర్భద్వారం నుంచి బయటపడేటప్పుడూ అమ్మతో పాటు తానూ ఎంతో కొంత వేదన అనుభవిస్తాడు. వాడు అమ్మ కడుపులోనుంచి బయటకు వచ్చేటప్పుడు అతి ఇరుకు ద్వారంలో నించి బయటికి రావాలి. లోపలి నించి యేవో వాయువులు తోస్తూ వుంటాయి. బిడ్డ బయటికి రావడానికి తల్లీబిడ్డలిద్దరూ శ్రమించాలి. అందుకే తల్లీ బిడ్డలిద్దరిదీ అంత విడదీయరాని బంధం!

పంచేంద్రియాలు పని చేస్తున్నా, ఆ అనుభూతుల నన్నింటినీ క్రోడీకరించుకుని, అవగాహన చేసుకుని, ఎదుటి వారి భావాలకు అనుగుణంగా తను ఎలా స్పందించాలో తెలిసే పరిపక్వత వాడి మనసుకు ఇంకా రాలేదు. చిట్టీపొట్టీ ఆలోచనలే గానీ, గొలుసుకట్టులా సాగే ఆలోచనలు చేసే శక్తి లేదు వాడి మనసుకు.

ఏవో కోరికలు అస్పష్టంగా వుంటాయి. వాటిని ఎలా తీర్చుకోవాలో తెలీదు. వాడి ప్రపంచమంతా అమ్మే మొదట్లో.

ఎందుకంటే తనకు కడుపు నింపేది అమ్మే! పాలిచ్చే అమ్మ స్తనాలే తనకు సర్వస్వం! తనను రక్షించేది అమ్మే! తనకు సకల సౌకర్యాలూ కల్పించేది అమ్మే! తన మనసు అర్థం చేసుకోగలిగేది అమ్మే! తనకేం కావాలో తెలుసుకుని ఆ విధంగా తనను చూసుకోగలిగేది అమ్మే! ఆ విధంగా వాడి యోగక్షేమాలకు అమ్మే వాడికి ఆధారం!

వాడికి కొన్ని విషయాలు సౌఖ్యాన్ని ఇస్తాయి. అప్పుడు వాడు సంతోషంగా వుంటాడు. కాళ్లూచేతులూ ఆడిస్తూ ఆడుతాడు. అమ్మ మెచ్చుకుంటుంది. ముద్దుచేస్తుంది. ఇలా తను ఆడితే అమ్మకిష్టమని తెలుసుకుంటాడు. వీలున్నప్పుడల్లా అలా చేయాలని ప్రయత్నిస్తాడు.

కొన్ని విషయాలు వాడికి అసలు నచ్చవు. అప్పుడు వాడికి కోపం, విసుగు, చికాకు వస్తాయి. అప్పుడు వాడు చెప్పగలిగేది యేడవడం ద్వారానే!

ఎవరూ పట్టించుకోకపోతే ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోతాడు. నిదురమ్మ కూడా వాడికి ఒకానొక తల్లే!

ఒక్కోసారి అమ్మకు కూడా వాడేం చెబుతున్నాడో అర్థం కాదు. ఎన్నో రకాలుగా సముదాయిస్తుంది. చీమ కుట్టిందేమో, దోమ కుట్టిందేమో, కడుపు నొప్పిగా వుందేమోనని రకరకాల పరీక్షలు చేస్తుంది.

అలాంటప్పుడు తల్లి తన స్తన్యాన్నిస్తే, పాలు తాగుతూ నిద్ర పోతాడు. ఆ మూడ్‌లో నుంచి బయటకు వస్తాడు. అమ్మకు వాడి యేడుపును మాన్పే బ్రహ్మాస్త్రం పాలుపట్టడమే! దాంతో చికాకును మరిచిపోతాడు. అమ్మ పక్క నుండి పాటపాడి నిద్రపుచ్చితే హాయిగా నిద్రపోతాడు.

వాడికున్న వ్యక్తీకరణలు అతి తక్కువ. యేడుపు, నవ్వు, ఆట, కొన్ని కదలికలు, కొన్ని శబ్దాలు చెయ్యడం ఇవే వాడి పనిముట్లు. ఇవే వాడికొచ్చిన మౌలికవిద్యలు.

దాంతోనే తనకు యేది ఇష్టమో, దాన్నెలా నెరవేర్చుకోవాలో, అది అమ్మకు అయిష్టమైతే.. దాన్ని ఎలా సర్దుకోవాలో నేర్చుకోవాలి. అమ్మను అర్థం చేసుకోవాలి. చుట్టుపక్కల పరిస్థితులనూ, మనుషులనూ గమనిస్తూ, వాటిని గురించిన జ్ఞానాన్ని పొందాలి.

అది వాడి స్థాయికి ఎంత కష్టమో చూశారా? అదే నేర్చుకోవడం! అదే వాడి స్థాయి విద్య. అమ్మే తొలి గురువు. వాడి ఉయ్యాల, అమ్మ ఒడి వాడి తొలి విద్యాలయాలు! ఆ నేర్చుకోవడంలోని స్థాయీభేదాలే ఆయా జీవుల యొక్క పూర్వజన్మ సంస్కారాలను బట్టి, తెలివి తేటలను బట్టీ వుంటాయి.

తన జీవితానికి మూలాధారం అమ్మ అని వాడికి తెలుసు. అమ్మను సంతోషపెట్టడం ద్వారా తనకు కావలసిన వాటిని సాధించుకోవచ్చనీ తెలుసు. అందుకే..

“అమ్మా, నువ్వు నాతోనే వుండు. ఎక్కడికీ పోవద్దు. నాకు నువ్వే కావాలి! అమ్మా, నాకు ఆకలే సిందనుకో.. నువ్వు లేకపోతే నాకు పాలెవరు ఇస్తారు? నన్ను చీమ కుడితే ఎవరు చూస్తారు? నన్నెవరన్నా ఎత్తుకుపోతే నువ్వు లేకపోతే నన్ను ఎవరు కాపాడుతారు? అమ్మా.. నాకు నువ్వే కావాలి!” అన్న భావాలను పిల్లవాడు తల్లితో ఏడుపు, నవ్వు ద్వారా, చూపుల ద్వారా, తన స్పర్శ ద్వారా, తన చేష్టల ద్వారా వ్యక్తపరుస్తాడు. (వ్యక్తపరుస్తుంది). ఒక రకంగా సర్వశ్య శరణాగతి చేసుకుంటాడు అమ్మకు. అందులో తన దైన్యమే గానీ, అహంకారం మచ్చుకు కూడా వుండదు.

భక్తుడి అచంచల భక్తికి, శరణాగతికీ కరిగిపోయి, అంతులేని దయతో అమ్మ వారెలా అతడి సర్వ బాధ్యతలనూ స్వీకరించి, అతడిని కృతకృత్యుడిని చేస్తుందో అమ్మా అదే చేస్తుంది.. తన శక్త్యానుసారం. అమ్మవారి శక్తి అనంతం.. అలౌకికం.. అమ్మ శక్తి పరిమితం.. లౌకికం.. అంతే తేడా! అనుగ్రహించడంలో, తనను తాను భక్తుడికి అంకితం చేసుకోవడంలో తేడా యే మాత్రం లేదు.

బిడ్డ నిస్సహాయతతో తన ప్రేమను, రక్షణను కోరడం, తనే లోకంగా భావించడంతో.. అమ్మే అమ్మవారై వాడి కోసం తన సర్వస్వాన్నీ ధారపోస్తుంది. తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేస్తుంది. పిల్లవాడికి యేదైనా జబ్బు చేస్తే.. వాడికి బాగవ్వాలనీ, ఆ జబ్బేదో తనకు రావాలనీ, దేవుడిని ప్రార్థించని తల్లులెవరైనా వుంటారంటారా? పిల్లవాడికి ప్రాణం మీదికి వస్తే, ‘నా ఆయుష్షు వాడికి పోసి, నన్ను తీసుకుపో తండ్రీ!’ అని వేడుకోని తల్లి వుంటుందా?

తన పిల్లల జోలికెవరైనా వస్తే తల్లి పులిలా మీద పడుతుంది. వాడిని స్వతంత్రుడిగా చూసేవరకూ నిద్రపోదు. తన సుఖం చూసుకోదు. త్యాగమే జీవనంగా బతుకుతుంది. అసలు తన గురించి ఆలోచించడమే తగ్గించివేస్తుంది. తన బిడ్డ యోగక్షేమాలే తనవి. వాటి లోనే తన సుఖాలను వెదుక్కుంటుంది. ఒకవేళ అది కష్టమైనా, అదే సుఖమని తనను తాను నమ్మించుకుంటుంది. తనకంటూ వేరే సుఖాలు అవసరం లేదు. తన చివరి క్షణం దాకా వాడి సుఖాన్నే తన సుఖంగా మార్చుకుంటుంది. దాని కోసం ఎంతైనా శ్రమిస్తుంది. ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. వాడిని తన శక్త్యనుసారం రక్షించాలనే సంకల్పాన్ని చివరి క్షణం వరకూ వీడదు.

చిత్రం యేమిటంటే.. వాడు సర్వ స్వతంత్రుడైనా కూడా ఇంకా తన మీదే ఆధారపడాలన్న పామరం పోగొట్టుకోలేదు. ఇంకా వాడికేమీ తెలియదని, అమాయకుడేనన్న భ్రమలో తానుండిపోతుంది.

పిచ్చిప్రేమతో మనసును వాడి చుట్టూ అల్లుకుని, ఆ అల్లికలో తనను తాను బంధీకృతం చేసుకుంటుంది. ఇది అమ్మకూ, పిల్లవాడికీ కూడా చిక్కులు తెచ్చిపెడుతుంది.

తన బిడ్డ తనను పూర్తిగా నమ్మాడు.. విశ్వసించాడు.. అదే చాలు అమ్మకు! బిడ్డకు తాను ఇచ్చే భద్రత చాలదని అమ్మకు తెలుసు. తన పరిమితి తనకు తెలుసు. అందుకే ‘నాన్న తామిద్దరికీ రక్షకుడు’ అని బిడ్డకు అర్థం అయ్యేలా చేస్తుంది. తర్వాత కుటుంబంలోని ఇతరులు కూడా అతనికి తోడ్పడతారని చెబుతుంది.

అమ్మ పాట (మాట)లో వ్యక్తమయ్యే మార్దవం, ప్రేమ, కోపం, విసుగు లాంటి భావాల అనుభూతి మాత్రమే వుంటుంది బిడ్డకు మొదట. తర్వాత తర్వాత అమ్మ మాటలను అర్థం చేసుకునే అవగాహన వస్తుంది. పెద్దవాడ య్యేసరికి అంతరార్థాలూ, పరమార్థాలూ, వాచ్యార్థాలూ, లక్ష్యార్థాలూ కూడా తెలుసుకుంటాడు. ఒకచో అపార్థాలూ చేసుకుంటాడు.

ఈ ఉయ్యాల ఊపులలోని ఆనందాన్నీ, అమ్మ పాడే జోలపాట లోని మాధుర్యాన్నీ కోట్లాది మంది పిల్లలు గతంలో ఆ ఆనందాన్ని ప్రోదిచేసుకున్నారు. ఆ అమ్మకు సంగీతం రాకపోవచ్చు. అమ్మ గొంతు శ్రావ్యంగా లేకపోవచ్చు. బొంగురుగా వుండవచ్చు. ఒక అమ్మ విద్యలేని శ్రామికురాలు కావచ్చు. ఆ పాటలో సాహిత్య గంధం పెద్దగా లేకపోవచ్చు.

అయినా తన తల్లి పాడే జోలపాట ముందు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడినా వాడికి నచ్చదు. తల్లి సౌందర్యవతి కాకపోవచ్చు. అందవికారి కూడా కావచ్చు. కానీ, ఆమె అమ్మదనమే ఆమె సౌందర్యం! అమ్మే వాడి సర్వస్వం!

తన తల్లి మాట, పాట, నవ్వూ , ఆమె సాన్నిధ్యం ముఖ్యం వాడికి. ఇంక యేదీ వద్దు వాడికి. అంతటి అనన్యభక్తిని ప్రదర్శిస్తాడు పిల్లవాడు!

ఊగవే.. ఊగవే.. ఉయ్యాలా..

ఉయ్యాల ఊగడం అంటే ఆనందకరమైన అనుభవం! అమ్మ కడుపులో వున్న హాయిని తిరిగి అందిస్తుందేమో చంటివాళ్లకి ఉయ్యాల! నిద్రాదేవి కొలువై వుంటుందేమో ఉయ్యాలలో. అందుకే దేవీదేవతలకు సైతం రోజూ పడుకోవడానికి ఉయ్యాల కావాలి! ఉయ్యాల ఒక వైభోగానికి చిహ్నం!

అమ్మ కట్టిన ఆ ఉయ్యాల చేని గట్టు మీద చెట్టుకు చింకిచీరతో కట్టిన ఉయ్యాల కావచ్చు.. శ్రీమంతుల ఇంట్లో కట్టిన బంగారు ఉయ్యాలే కావచ్చు.. మధ్యతరగతి ఇంట్లో పాతచీరతో కట్టిన ఉయ్యాలే కావచ్చు.. కానీ, అందరు తల్లీపిల్లల అనుబంధం మాత్రం ఒక్కటే! ప్రేమ వ్యక్తీకరణలో, సౌకర్యాలు కల్పించడంలో స్థాయీభేదాలు వుండవచ్చు.

తల్లి సాన్నిధ్యం కోసం బిడ్డ పడే తపన, బిడ్డను కాపాడుకోవాలనీ, వాడికి ఏ లోపం లేకుండా మహారాజు లాగా పెంచాలనే తల్లి తపన మాత్రం ఒక్కటే!

అమ్మలే కాక అమ్మమ్మలూ, నాన్మమ్మలూ, తాతమ్మలూ, మేనత్తలూ, పిన్నమ్మలూ ఇలా పిల్లలకు కమ్మని జోలపాటలు పాడుతూ నిద్ర పుచ్చేవారు పూర్వం రోజుల్లో. తాతలు కూడా ఏ పోతన పద్యాలో పాడుతూ పక్కన పడుకో బెట్టుకునేవారు.

మనకి అమ్మ పాడిన జోలపాట మనకు గుర్తు వుండదు గానీ, మన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అక్క పిల్లలకు, లేదా చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలకు పాడిన పాటలు మనకు బాగా గుర్తుండేవి.

ఆ పాటలను మన పిల్లలకు, మనవలకు పాడుకుంటుంటే.. ఆ జోలపాటల మాధుర్యం మనసుకు పట్టి మరీ ఊపేస్తుంది.

ఒక్కొక్క ఇంట్లో పాడే లాలి పాటలో ఒక్కో విశిష్టత వుంటుంది. ఉమ్మడి కుటుంబాలు వున్న రోజుల్లో అందరి ఇళ్లలో జోలపాట నిరంతరం వినిపిస్తూ వుండేది. కొందరు సృజనాత్మకత గల తల్లులు అప్పటికప్పుడు కొత్త చరణాలను అల్లి పాడేవారు.

ఉమ్మడి కుటుంబాలతో పాటు మనం లాలిపాట వైభవాన్ని కూడా చాలా వరకూ దూరం చేసుకున్నాము.

ఇప్పటికీ కొందరు తల్లులు జోల పాటలు పాడుతున్నా.. అవి ఏవో ఒకటి రెండు సినిమా పాటలు, ఇంగ్లీషు రైమ్స్ వంటివే పాడుతుంటారు.

చూశారా ఈ వింత! శతాబ్దాల తరబడీ పనికొచ్చిన ఉయ్యాల ఇప్పుడు పనికిరావడం లేదు. అది పిల్లల మానసిక ఎదుగుదలకు అడ్డువస్తుందట! డాక్టర్లు వద్దంటారట! కానీ, ‘టైమ్ టెస్టెడ్ కదా!’ అన్నది నా వాదన!

కొన్ని వందల వేల సంవత్సరాలుగా కొన్ని కోట్లమంది పిల్లలు వుయ్యాలలూగినవారే కదా! మరి వారందరికీ యేమి మానసిక వైకల్యాలు వచ్చాయి?

నేడు ఒకరిద్దరు పిల్లలు కావడం వల్ల, విడి సంసారాలు కావడం వల్ల తర్వాత జోలపాట వినే అవకాశమే వుండదు పిల్లలకు. ఎంత దురదృష్టం!

అంతేకాదు, పిల్లలను వేరే గదిలో పడుకోబెట్టడం ఫ్యాషన్! పిల్ల ఆ గదిలో యేడుస్తుంటే.. ఈ గదిలో పడుకున్న తల్లికి వినపడడానికి మిషన్లొకటి! పిల్ల కదిల్తే సంగీతం వినిపించే మిషన్లు కొన్ని. ఇవన్నీ అన్ని అనుబంధాలనూ, ప్రేమలనూ భౌతికస్థాయిలో మాత్రమే చూసే పాశ్చాత్యుల పద్ధతులు! సెక్స్ తప్ప యేదీ అత్యవసరం కాదనే దుష్ట సంస్కారం వారిది. ప్లాస్టిక్ పువ్వుల లాంటి బతుకులు వాళ్లవి.

తల్లీపిల్లల మధ్య ఆత్మీయ బంధాలను దూరం చేసి, పిల్లల పెంపకాన్ని ప్రేమపూర్వకమైన, ఆనందదాయకమైన బాధ్యత లాగా, ముందుతరాన్ని తీర్చిదిద్దే అపూర్వ అవకాశంలా, దేశానికి ఒక ఉత్తమ పౌరుడినీ (పౌరురాలినీ) ఇచ్చే మహత్తరకార్యంలా కాకుండా అదీ జీవితంలోని ఒక పనిలా చూడటం నేర్పిస్తోంది పాశ్చాత్య దుష్ట సంస్కారం!

పిల్లల పెంపకాన్ని కూడా రొటీన్ పనిలా మార్చేస్తే.. అమ్మాబిడ్డల మధ్య ఆత్మీయతను ప్రోదిచేసే మార్గమేదీ? ఎటుపోతోందీ సమాజం!

తల్లిదండ్రుల మధ్యలో పడుకొని, వారి శరీరస్పర్శను అనుభవిస్తూ, వారి శరీరగంధాలను ఆస్వాదిస్తూ, ‘అమ్మానాన్నా నాకు రక్షణగా వున్నారు..’ అనే నిశ్చింతతో నిద్రపోయిన పిల్లలు ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు.

సరే.. ఇప్పటి పిల్లల పెంపకం బాధ్యత ఆయా తల్లిదండ్రులదే కదా! చెప్పడం వరకే మన పని! కానీ, మనం అనుభవించిన బంగారు బాల్యాన్నీ, మన అమ్మ పాడి మనలను నిద్రపుచ్చిన జోలపాటను, మనం మన పిల్లల కోసం పాడిన పాటలనూ ఒక్కసారి గుర్తుచేసుకుందాం!

1.నవరసాలు నిండిన జోలపాట!

జోలపాటలో తల్లి నవరసాలనూ ప్రదర్శిస్తుంది. ముందు బిడ్డకు పాలిచ్చి, త్రేన్పు వచ్చేదాకా భుజాన వేసుకొని తిప్పుతుంది. నిద్ర వస్తున్నట్టు వాడు కళ్లు మూస్తూ తెరుస్తూ వుంటాడు. ఉయ్యాల్లో వేసి ఊపి, పాటపాడుతుంది. నిద్ర పోకపోతే ముందు కొంచెం బతిమాలుతుంది.

తర్వాత కళ్లెర్ర చేస్తుంది. ‘బూచివాడు’ వస్తాడని బెదిరిస్తుంది. కడుపు నిండలేదేమోనని మళ్లీ పాలిస్తుంది.

వాడు అల్లరి మొదలెడతాడు. అమ్మ మంగళసూత్రాలతో ఆడుతాడు. అమ్మ చీరకొంగు పట్టుకుని దాగుడుమూత లాడుతాడు. అమ్మకు సంబంధించి నదేదైనా అపురూపమే వాడికి. ఈ ఆటలు ఒక్కో దశలో ఒక్కోలా వుంటాయి.

ఒక్కోసారి నోటి నిండా పాలు వుంచుకుని అమ్మ మొహం మీదికి ఊస్తాడు. వాడి అల్లరికి అమ్మకు నవ్వు, కోపం, వాడు నిద్రపోలేదనే ఉక్రోషం, ఒక పక్క పని తొందర అన్నీ కట్టగట్టుకొని వస్తాయి.

‘తొందరగా నిద్రపోతావా? లేదా?’ అని బెదిరిస్తూ మళ్లీ ఉయ్యాల్లో వేసి ఊపుతుంది. ఆ ఉయ్యాల ఊపులు అమ్మ కోపాన్ని ప్రతిబింబిస్తూ, విసురుగా సాగుతుంటాయి. చేతి గాజులు గలగల లాడుతూ వాడిని భయపెట్టేలా సద్దు చేస్తుంటాయి. మెడలో మంగళ సూత్రాలు, గొలుసులు కోపం చప్పుళ్లు చేస్తుంటాయి.

పిల్లవాడికి (పిల్లదానికి) అమ్మకు అంత కోపం ఎందుకొచ్చిందో అర్థం కాదు. తన తప్పేంటో తెలీదు. తనకెందుకు నిద్దర రాలేదో తెలీదు. బిక్కమొహం వేసుకుని అమ్మ ప్రేమగా పలకరిస్తుందేమోనని ఎదురు చూస్తూంటాడు.. బుంగమూతి పెట్టి.

ఏమన్నా కూయ్ కయ్ మంటే అమ్మకు మరింత కోపం వస్తుందని గతానుభవం నేర్పింది వాడికి. అందుకే వచ్చే యేడుపును పెదవుల బిగింపుతో ఆపేసుకుంటూ, బిక్కమొహం వేసుకుని వుంటాడు.

పిల్లాడి భావం అమ్మకు అర్థం అవుతుంది. తన ‘దిల్ కా టుకడా’ గురించి అమ్మకు తెలీకపోవడమా?

ఓసారి ఉయ్యాల్లోకి తొంగిచూసి, నవ్వుతూ “పడుకోమ్మా! అమ్మకు పని వుందిరా! నిన్ను నేను కోప్పడ్డానా? ఇంక మీదట కోప్పడనులే.. నా వరాలమూటవి కదూ.. యేడవద్దులే.. పడుకోమ్మా” అని అనునయిస్తుంది.

అప్పుడు వాడికి యెక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చి బావురుమంటాడు. ఎత్తుకుని, బోలెడు కబుర్లు చెప్పి, సముదాయించి మళ్లీ ఉయ్యాల్లో పడుకోబెడుతుంది అమ్మ. అమ్మపాటతో బాటు తామూ రాగాలు తీస్తారు కొందరు పిల్లలు. ఆ రాగం తీస్తూ తీస్తూ నిద్రలోకి వెళ్లిపోతారు.

ఒక్కోసారి ఉయ్యాలలో నుంచి తల బయట పెట్టి, అమ్మ యేం చేస్తోందో చూస్తుంటారు. కొందరు పిల్లలకైతే మాటలు త్వరగా వస్తాయి. దాంతో వాళ్లకేపాట ఇష్టమో దాన్నే పాడమని డిమాండ్ చేస్తారు.

ఒక్కోసారి ఎంతకీ నిద్ర పట్టించుకోలేడు పిల్లవాడు. అప్పుడు రాముడి గురించీ, కృష్ణుడి గురించీ పాడి భక్తిని ప్రబోధిస్తుంది. తన పిల్లవాడి(పిల్ల)నీ కాపాడమని దేవుడిని వేడుకుంటుంది. దేవుడికి కూడా ఆశ చూపుతుంది. ‘నువ్వు నా పిల్లలనూ, మా ఆయననూ, మావాళ్లనూ కాపాడితే.. నీకు సేవ చేస్తా.. నిమ్మపండ్లు పెడతా.. పనసపండ్లు పెడతా’ అని దేవుడిని ప్రలోభ పెడుతుంది.

ఇంతలో తన పుట్టిల్లు ఇంత గొప్పదనీ, అంత గొప్పదనీ గొప్పలు పోతుంది. ఇంకా పిల్లడు నిద్రపోలేదే అని కసురుతుంది. చిన్న దెబ్బ కూడా వేస్తుంది. వాడు ఏడిస్తే తానూ కన్నీళ్ల పర్యంతం అవుతుంది. వాడిని గుండెలకు హత్తుకుంటుంది. ముద్దులు కురిపించి, బుద్ధులు చెప్పి, ఎంత చేసినా వాడు నిద్ర పోకపోతే.. వాడిని చాపపై కూర్చోబెట్టి, నాలుగు బొమ్మలు వాడి ముందు పడేసి, విసురుగా తన పనిలో కెళ్తుంది.

లేదా ఒక పళ్లెంలో బొరుగులు (మరమరాలు) పోసి వెళ్లిపోతుంది. వాడు కాసేపు కాలక్షేపం చేసి మళ్లీ అమ్మ కోసం గోల మొదలెడతాడు. ఒక్కోసారి వాడిని ఎత్తుకొనే పని చేసుకోవలసి వస్తుంది.

పిల్లవాడు ఒక్కోసారి ఎంత సేపటికీ నిదురలేవడు. అమ్మ పాలిండ్లు పాలతో బరువెక్కి పోతాయి. అప్పుడు బలవంతంగా వాడిని లేపి అయినా పాలు పట్టుతుంది.

ఒక్కోసారి పిల్లవాడిని ఎవరి దగ్గరైనా విడిచి తానేదో అర్జెంటు పని మీద వెళ్తుంది. వాడికి ఆకలి వేసేస్తుంటుందేమోనన్న బెంగ ఆమెను తినేస్తుంది. ఇంటికి రాగానే బిడ్డ యేడుస్తూ ‘అమ్మా’ అని దగ్గరికి రాగానే ఆమె స్తనాల్లో పాలసునామీ వెల్లువెత్తుతుంది. ఆ క్షీరోధృతికి తట్టుకోలేక, పాలతో నోరు నిండిపోయి, అన్ని పాలు ఒకసారి మింగలేక, వాడికి పొరపోయి ఉక్కిరిబిక్కిరి అవుతాడు. మళ్లీ వాడిని మామూలు స్థితికి తెచ్చేందుకు ఎన్ని అవస్థలో తల్లికి! ఇలా తల్లీబిడ్డల మధ్య ఎన్ని రసవత్తర సన్నివేశాలుంటాయో చెప్పతరమా?

ఇక జోలపాటల మాధుర్యాన్ని ఒకసారి ఆస్వాదిద్దాం రండి!

2 అమ్మ పాడే కమ్మని జోలపాట!

– “చిచ్చీ హాయీ..

– “చిన్నవాడా రారా చంద్రుడా రారా..

చంద్రుడా నీ చేతి పండిచ్చిపోరా..

– చిచ్చీ..హాయీ..”

త్వరగా నిద్రపోతే చంద్రుడొస్తాడనీ, పండు తెచ్చిస్తాడనీ ఆశ చూపుతుంది తల్లి తన గారాబు పట్టికి.

– చిన్నవాడా రారా చంద్రుడా రారా

ఓ మద్దికాయలా బాలుడా రారా.. చిచ్చీ హాయీ”

– “మద్దికాయలు ముద్దు మాటల్లు ముద్దూ..

తా ముద్దు కన్నయ్య తన వారిలోనూ.. చిచ్చీ హాయీ”

మద్దిచెట్టును అర్జున వృక్షం అంటారు. ఇది వైద్యపరంగా చాలా ప్రాముఖ్యం కలది. దీని నుంచే ఆయుర్వేదంలో ‘మృతసంజీవని’ వంటి ఔషధాలను తయారు చేసేవారట! ( కీ.శే. బాలరాజ్ మహర్షి గారు అనే ప్రముఖ ఆయుర్వేద నిపుణులు మద్దిచెట్టు నుంచి ‘అమృతజీవన్’ అనే మందును తయారుచేశారు)

అంతేగాక ఈ అర్జునవృక్షాన్ని శివస్వరూపంగా భావిస్తారు. శ్రీశైలంలో అర్జున వృక్షాన్ని మల్లెతీగ అల్లుకున్నందువల్ల ఆయనకు మల్లికార్జునుడని పేరు వచ్చింది.

అదేగాక కర్నూలు జిల్లాలో అహోబిలం అడవులలో మరొక వైపు ‘మద్దులేరు’ అనే యేటి ఒడ్డున వున్న నరసింహస్వామిని ‘మద్దులేటి స్వామి’ అంటారు.

ఈ నుడుగు కట్టిన ఇల్లాలు ఆయుర్వేదం తెలిసిన ఇంటినుంచి వచ్చిందేమో! అందుకే ముద్దుగా తోచే మద్దికాయల లాగా తన బిడ్డ మాటలున్నాయని పొగుడుకుంటోంది.

అటు శ్రీశైలం శివుడినో, మద్దులేటి నరసింహస్వామిని గురించో.. ‘ఓ మద్దికాయలా బాలుడా రారా!’ అని పిలుస్తోంది.

– “ఎందుకూ ఏడ్చేవు.. ఏల ఏడ్చేవూ..

పాలకూ ఏడ్చేవు పసిబిడ్డ నీవూ.. చిచ్చీ హాయీ”

అని తన బంగారుకొండకు పాలు సరిపోలేదేమోనని పొట్ట తడిమిచూస్తుంది.

– “ఎవరమ్మ పాపనూ కొట్టినా వారూ..

కొట్టి గోవుల పాలు కొని పోసినారూ.. చిచ్చీ హాయీ”

ఎవరో తన పాపను కొట్టారట.. ఏడుస్తూంటే చూడలేక ఆవుపాలు కొని మరీ తాగించారట! తన సంరక్షణలో వున్న పాపాయిని కొట్టేదెవరు? తనకే కోపం వచ్చి ఓ చిట్టిదెబ్బ వేసివుంటుంది. ‘కొడితేనేమి? ఆవుపాలు కొని మరీ పోశానులే!’ అని తన చర్యను తాను సమర్థించుకుంటోంది.

– “హాయి హాయీ హాయి ఆపదలుగాయీ

చిన్నవాండ్లను కాయి శ్రీరంగ శాయీ.. చిచ్చీ హాయీ”

తన సంతానాన్ని కాపాడమని శ్రీరంగనాథుడిని ప్రార్థిస్తోంది ఈ తల్లి.

– “నిద్రకూ నూరేళ్లు నీకు నూరేళ్లూ

నిను గన్నవారికీ నిండు నూరేళ్లూ.. చిచ్చీహాయీ”

– “నిద్రకూ నూరేళ్లు నీకు నూరేళ్లూ..

నీ తోటి పాపలకు నిండు నూరేళ్లూ.. చిచ్చీహాయీ”

ఇదీ తల్లి మనసులో పిల్లల పట్ల నిరంతరం మెదిలే ఆశీర్వచనం. ‘నిను గన్నవారికీ నిండు నూరేళ్లూ’ అన్నది అమ్మమ్మల, నాన్నమ్మల ఆశీర్వచనం.

 – “చిన్నారి మా పాప చీరకేడ్చిందీ.. (చిన్నారి కన్నయ్య పంచె కేడ్చాడూ..) నేయవోయి సాలెవాడా నెలకొక్కపోగూ.. – చిచ్చీ హాయీ”

ఇక్కడ తన బిడ్డను హాస్యం చేస్తోంది. ఆహా.. నీకు చీర కావాలా? (పంచె కావాలా?) అందుకేడుస్తున్నావా? సాలె అతను నెలకొక్క పోగు నేస్తాడులే.. అని తమాషా చేస్తోంది. ఆ చీర- పంచె ఎప్పటికి తయారయ్యేటట్టూ?

– “చిన్నారివే నీవు చిలుకవే నీవూ

పొన్నారివే నీవు పంజరపు చిలుకా.. (చిచ్చీ..హాయీ)”

నీవు చిట్టిచిలకమ్మలా వున్నా వని ముద్దుచేస్తూ, చిలుకను గుర్తు చేస్తుంది. ఉయ్యాలకు కట్టిన చిలుకలను చూపిస్తుంది. చిలుకను తలచుకుంటూ నిద్రపోతాడేమోనని అనుకుంటుంది.

వాడు నిద్రపట్టించుకోలేక యేడుస్తుంటే..

– “ఏడువకు ఏడువకు వెర్రినాగన్నా

ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారూ..

నీలాలు కారితే నేచూడలేనూ..

పాలైన కారవే బంగారుకనులా.. (చిచ్చీ హాయీ)..” అని బాధ పడుతుంది. తన బిడ్డ యేడ్పు మాన్పలేని తన నిస్సహాయతకు ఉసూరుమంటుంది.

 – “అన్నయ్యకు పెట్టరే తియ్యరటి పండ్లూ

చిన్నవాడికి(చిట్టిపాపకు) పెట్టరే పాలు మీగడలూ.. చిచ్చీ హాయీ”

అని అన్నయ్యను గుర్తుచేస్తుంది. నీవు నిద్రపోతే నీకు పాలూ మీగడా పెడతాలే.. అని ప్రమాణాలు చేస్తుంది.

వాడింకా గునుస్తూనే వుంటాడు.

– “ఏడ్చేటి వారికీ ఎర్రావుపాలూ

ఊరుకున్న అన్నయ్యకూ ఉట్టి మీది వెన్నా..! చిచ్చీ హాయీ”

నీవు యేడుపు మానితే ఎర్రావు పాలు తాగిస్తాననీ, ఇలాగే యేడుస్తే వెన్నంతా అన్నకే పెడతాననీ బెదిరిస్తుంది.

 అకస్మాత్తుగా రాముడు గుర్తొస్తాడు.

 – “నిద్రపో.. నిద్రపో భద్రాద్రిరామా!

రాఘవుడ నిద్రపో వరాహావతారా!.. చిచ్చీ హాయీ” అని తన కొడుకు రాముడన్నట్లు, తాను కౌసల్య అన్నట్లూ భావించు కుంటుంది.

-“నిద్రల్లు వచ్చింది నీలికన్నులకూ..

భద్రకన్యకలొచ్చి నిద్రలూపేరూ..

నాగకన్యకలొచ్చి నాట్యమాడేరూ.. చిచ్చీ హాయీ”

నీవు నిద్రపోతే కలలో దేవకన్య లొచ్చి పాటలు పాడతారనీ, నాగ కన్యకలొచ్చి నాట్యమాడతారనీ ప్రలోభపెడుతుంది. ఈ భద్రకన్యక లెవరో ఎవరైనా తెలిసినవారు చెప్పాలి. ‘పిల్లలకు భద్రతను కల్పించే ఒకానొక దేవతాజాతి’ అని అంతదాకా భావించుకోవచ్చు.

– “చిన్న నా కన్నయ్య చెన్నగిరి మొగ్గా..

వాచాలకల్పమే వాడన్ని మల్లే..

వాడన్ని మల్లెకూ వీడన్ని తొడిమే

రాజు వంటి అయ్యకూ రంభ వంటి ఆలీ.. చిచ్చీ హాయీ”

 ‘చెన్ను’ అంటే అందమైన అని అర్థం కదా! అందమైన కొండ మీద పూసిన విశిష్టమైన, ప్రత్యేకమైన, అందమైన పువ్వువి నువ్వు అంటోంది ఆ తల్లి. అందమైన కొండ అంటే యే హిమాలయాన్నో వుద్దేశించిందనుకుంటా! లేదా వాళ్ల వూరికి దగ్గరగా వున్న శ్రీశైలం కొండను గురించి, అక్కడ పూసే ప్రత్యేకమైన పువ్వును గురించి చెప్పి వుండవచ్చు. తన కొడుకు దేవలోకపు పారిజాతమో, హిమాలయాలలో పూసే సౌగంధికా పుష్పం లాంటి వాడోనన్నమాట!

నీవు అందమైన కొండలమీద పూసే అరుదైన పువ్వు మొగ్గ వంటి వాడివి, నీవు పెద్దవాడివయ్యే సరికి చక్కటి వాగ్ధాటితో, కవితా కల్పనలతో ఎప్పటికీ వాడని మల్లెపువ్వులా సువాసన వెదజల్లుతావు. జగత్ప్రసిద్ధి పొందుతావు. అలాంటి విశిష్టమైన వాడని మల్లెపువ్వు లాంటి నీకు, నిన్ను విడవకుండా వుండేటటు వంటి రంభ వంటి భార్య దొరుకుతుంది.. అని భవిష్యత్ వాణి కూడా పలుకుతుంది. అంత నమ్మకానికి హేతువేమో మనకు తెలీదు. ఆ పిల్లవాడు అలాంటి అరుదైన ప్రతిభ గలవాడు అయి తీరుతాడనడానికి అతని తండ్రి గొప్ప నాయకుడో, కవో, పండితుడో, నాటి సమాజంలో ప్రఖ్యాతి వహించినవాడో అయివుడొచ్చేమో! లేదా తల్లిలో తన బిడ్డను అంత గొప్పవాడిని చేయగలిగే యేదైనా అపురూపమైన సుగుణాలున్నాయో! ప్రజ్ఞాపాటవాలున్నాయేమో! ఏమైనా ఒక విలక్షణతను సంతరించుకున్న నుడుగు ఇది!

పిల్లవాడేమో ఉయ్యాల్లో పడుకుని ఊగుతున్నాడు. ఎప్పుడో జరగబోయే వాడి ప్రగతి, వాడి పెళ్లి, వాడి భార్య, వారి మధ్య నెలకొనే ప్రేమాభిమానాలు.. వీటన్నింటి గురించి రంగురంగుల ఈస్ట్‌మన్ కలర్ కలలు కంటుంది ఆ పిచ్చి తల్లి. తల్లి ప్రేమకు దేశకాలాలూ, సాధ్యాసాధ్య వివేచనలూ వుండవు కదా!

(సశేషం)

Exit mobile version