Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జంతువును మనిషిగా మార్చే నిరుపయోగ ప్రయత్నం – జీనీ కథ

స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు…

ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా జీవించడానికి ఒక సహజ వాతావరణం సృష్టి నిర్మిస్తుంది. కాని ఆ సహజ వాతావరణం నుండి ఆ ప్రాణిని దూరం చేసి దాన్ని మరో వాతావరణానికి అలవాటు చేసి అది అతి కష్టంతో తన సహజ లక్షణాలను మార్చుకుని మరో వాతావరణానికి అడ్జస్ట్ అయిపోయి జీవిస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని దాని సహజ వాతావరణంలోకి వదిలేయడం వల్ల ఏ ప్రాణి అయినా జీవించలేదు. కొద్ది కాలంలోనే మరణిస్తుంది. మనిషి ప్రయోగాల పేరుతో సహజంగా బ్రతికే జంతువులను తమ మధ్యకు తీసుకువచ్చి తనలా జీవించడం నేర్పిస్తాడు. తరువాత ఆ జీవిని భరించడం ఏ కారణం వల్లనయినా కష్టమయినప్పుడు మళ్ళీ దాన్ని తన సహజ వాతావరణంలోకి పంపించినప్పుడు అది పడే బాధ చెప్పనలవి కానిది. అయినా ప్రేమ పేరుతో ఇలాంటి తప్పిదాలను మనిషి చేస్తూనే ఉంటాడు. ఎవరు ఉండవలసిన చోట వారు ఊండకపోతే ఎంత కష్టమో తెలిసినా ఈ ప్రయోగాలు సాగుతూనే ఉంటాయి. అలాంటి ఒక ప్రయోగానికి సంబంధించిన నవలే “జీని”. డగ్లస్ ప్రెస్టన్ రాసిన ఈ నవల మొదట 1994లో ప్రచురించారు. డా. హ్యూగో అర్చిబాల్డ్ అనే ఒక ఆంత్రొపాలజిస్ట్ ఆప్రికన్ అడవులలో చింపాంజీల ఎముకలపై పరిశీలన చేయడానికి వెళతాడు. అతనికి ఒక ఆడ చింపాజి తల అవసరమవుతుంది. అందుకని వేటగాళ్ళు అతని కోసం ఒక చింపాంజీని వేటాడి తీసుకుని వస్తారు. దాన్ని విషపూరిత బాణాలతో గాయపరిచినందువలన హ్యూగో దగ్గరకు తీసుకువచ్చేటప్పటికి అది కొనఊపిరితో ఉంటుంది. అతని ముందే ఒక బుల్లి చింపాంజీకి జన్మనిస్తుంది. ఆ బిడ్డ బొడ్డూ తనే కోస్తాడు హ్యూగో. చేతిలో ఆ బిడ్డను తీసుకోగానే అది కళ్ళూ తెరిచి అతన్ని చూసిన చూపు అతనిలో ఒక కలవరాన్ని కలిగిస్తుంది. తల్లి చింపాజీ బిడ్డను అతని చేతిలో చూసి మరణిస్తుంది. ఆ చింపాంజీ తల తనకు అవసరం లేదని ఈ చిన్ని చింపాంజీని పెంచుకోవాలని నిశ్చయించుకుంటాడు. పుట్టిన క్షణం నుండి అతనితో అలవాటూ పడిన ఆ చింపాంజీకి జీని అని పేరు పెట్టీ తనతో పాటూ అమెరికా తీసుకువెళతాడు. కళ్ళూ తెరిచి భూమి మీదకు వచ్చాక చూసిన మొదటి ప్రాణిని తల్లి స్థానంలో చూసుకుని ఆ ప్రాణికి కట్టుబడి ఉండడం చింపాజీల నైజం. అందుకే జీనీ హ్యూగోకి విచిత్రంగా అలవాటు పడిపోతుంది. ఎప్పుడైతే హ్యూగో కుటుంబాన్ని చూస్తుందో అది తన కుటుంబంగానే భావిస్తుంది. హ్యుగో భార్య లియా జీనిని సొంత బిడ్డలా చూడడం మొదలెడుతుంది. అంతే కాకుండా ఆమె కొడుకు సాండీ జీనిని తన తోబుట్టువులా భావించి ఆమెతో గడపడం మొదలెడతాడు. హ్యూగో కూతురు సారా మాత్రం మొదటి రోజు నుండే జీనిని ఇష్టపడదు. కాని జీని కుటుంబంలోని ఒక వ్యక్తిలా కలిసిపోతుంది. ఆ ఇంటి వారితో టేబిల్ పై భోజనం చేస్తుంది. వారి గది మంచం పంచుకుంటుంది. మనిషిలాగే బట్టలు తొడుక్కుంటుంది. పనులు నేర్చుకుంటుంది. మనుష్యుల మధ్య ఉన్న గోరిల్లాలు ఎలా ప్రవర్తిస్తాయో అని జీనిని గమనిస్తూ ఉంటారు హ్యూగో అతని తోటి సైంటిస్టులు.

జీని తనను తాను మనిషిగానే అనుకుంటుంది. మొదటిసారి తనను అద్దంలో చూసుకుని తాను అందరిలా లేనని తెలుసుకున్నా అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడదు. సాండి అతని స్నేహితులతో ఆడుకుంటూ వారితో సమానంగా ఉండాలని ప్రయత్నిస్తుంది. తన కోసం ప్రత్యేకమైన గది, బట్టలు ఆఖరికి తొక్కడానికి సైకిల్ కూడా అమరుస్తాడు హ్యూగో. మనిషి లాగే తన జీవన విధానాన్ని మార్చుకుంటుంది జీని. బాత్రూంకి వెళ్ళడం నుండి పడుకోవడం దాకా మనిషి లాగే పని చేస్తూ ఉంటుంది. ఇంటి పనుల్లో సహయం చేస్తుంది. కొన్ని చిలిపి పనులు కోతి చర్యలు చేస్తునే ఉన్నా హ్యూగో అన్నా లీ అన్నా భయం ప్రదర్శిస్తు కొన్నిసార్లు చనువు చూపుతూ ఉంటుంది. మనుష్యులను హత్తుకోవడం జీనీకి చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన వారికి సిగరెట్లు వెలిగించి ఇవ్వడం. కావల్సినవి అందించడం లాంటి పనులు చేయడం కూడా నేర్చుకుంటుంది. జీనీకి ఒక పెంపుడు పిల్లిని ఇస్తాడు హ్యూగో కాని దానితో ఆడుకుంటూ ఉండే క్రమంలో ఆ పిల్లి తలకు గాయమై చనిపోతుంది. జీనీ విపరీతంగా భయపడుతుంది. అప్పటి నుండి పిల్లిని చూస్తే ఏడవడం చేస్తుంది. దానిలో మనిషిలాగే ఎమోషన్స్ ఉన్నాయని అర్థం చేసుకుంటారు సైంటిస్టులు.

హ్యూగో ఇంటి పక్కన ఒక వృద్ద మత ప్రచారకుడి కుటుంబం నివసిస్తుంటుంది. వారికి పిల్లలుండరు. హెండ్రిక్స్ పాలిసర్ అనే ఈ పాస్టర్ ముందు హ్యూగో ఇంటికి చింపాంజీని పంపేయమని చెప్పడానికి వచ్చినా జీని చిలిపితనంతో ఆకర్షితుడవుతాడు. జీనీతో సమయం గడుపుతూ దానితో ప్రేమను పెంచుకుంటాడు. మతాన్ని జీనీకి తెలపాలని. ఏసు క్రీస్తు గురించి, భగవంతుని గురించి చెప్పడం మొదలెడతాడు. ఈ పాఠాలతో పాటు జీనీ మాట్లాడడానికి కావలసిన భాషను నేర్పించడానికి డా. ప్రెంటీస్ అనే మరో సైంటీస్ట్ ఇంటికి వస్తూ వుంటుంది. ఈమె జీనీకి అమెరికన్ సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తూ ఉంటుంది. జీనీతో సంభాషించడానికి ఇంటిలోని వ్యక్తులండరూ ఆ భాష నేర్చుకుంటారు. ముఖ్యంగా సాండి ఆ భాషను నేర్చుకుని జీనీతో సంభాషించడం మొదలెడతాడు. జీని అందరి పిల్లలలాగే విపరీతంగా అల్లరి చేయడం అబద్ధాలు చెప్పడం, తనకు కావల్సిన వాటి కోసం ఇతరులను మోసం చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. చాలా సార్లు మనిషి కన్నా తెలివిగా ప్రవర్తించడం కనిపిస్తుంది. పుట్టినప్పటి నుండి మనుష్యుల మధే ఉండడం వలన అది మనుష్యుల జీవితానికి అలవాటు పడుతుంది. టి.వీ చూడడం. అందులో తిండికి సంబంధించిన ఆడ్స్ వచ్చినప్పుడు అది కావాల్ని గోల చేయడం చేస్తూ ఉంటుంది. తను చెప్పాలనుకున్నది బలంగా చెప్పాలనుకున్నప్పుడు రెండు చేతులను ఉపయోగించి మాట్లాడడం కనుక్కుంటుంది. మిగతా చింపాజీలకు సహజంగా కుక్కలంటే భయం కాని జీనీ కుక్కలను భయపెడుతూ వాటిని ఇంటి చుట్టు పరిగెత్తిస్తూ ఉంటుంది. కొద్దినా వైన్, విస్కీ తాగడం కూడా నేర్చుకుంటుంది. వేరే చింపాంజీల బొమ్మలు చూడడానికి కూడా ఇష్టపడదు. ఎవరిని కలిసినా వారిని కౌగలించుకోవడం జీనికి ఇష్టం. ఆ ఇంటికి వచ్చిన వారికి జీనీ ఒక గొప్ప వినోదం. ఇంటి పక్కనున్న పాస్టర్ భార్య కేన్సర్‌తో మరణించినప్పుడు ఆమె కనిపించట్లేదని గోల చేస్తుంది జీని. అలాగే ఆ పాస్టర్ ఆరోగ్యం దెబ్బతిని అతను శాశ్వతంగా హోమ్‌లో చేరినప్పుడు అతన్ని చూడాలని గోల చేస్తుంది కూడా. సాండితో జీనీ అతుక్కుపోతుంది. ఇద్దరికి ఒకే ప్రపంచంలా గడుపుతారు. కాని సాండి యువకుడయి తన ప్రత్యేక ఆడ స్నేహితులతో కలవడానికి ఉత్సాహం చూపుతున్నప్పుడు జీనీ అది ఇష్టపడదు. అసూయ పడుతుంది కూడా. జీని కూడా వయసుకు వచ్చిన తరువాత తనలో కోపం ఎక్కువవుతుంది. లైంగిక వాంఛలు పెరుగుతాయి. ఈ వయసులో ఆడ చింపాంజీలు చాలా రోషంగా ఉంటాయట. వాటికి నచ్చని వారిని గాయపరుస్తూ ఉంటాయట. ఇప్పుడు జీనిని నియంత్రించడం కుటుంబానికి కష్టం అవుతుంది. ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. మగవారి పైకి దూకుతూ తన శరీర బాధ అర్ధం కాని స్థితిలో అయోమయంలో అందర్ని గాయపరిచే క్రూర జీవిగా జీనీ మారిపోతూ ఉంటుంది. అలాంటి స్థితిలో కూడా అందరి మగవారిపై కామ భావాన్ని ప్రదర్శిస్తూ సాండి, హ్యూగోతో మామూలుగా ఉండడం చుస్తే జీనీ లోని మానవీయ కోణం ఆశ్చర్యపరుస్తుంది. సాండి జీనీని తన గర్ల్ ప్రెండ్ ఇంటికి తీసుకునివెళతాడు. అక్కడ జీనీ అక్కసుతో సాంటీ చిటికిన వేలు పూర్తిగా కొరికేస్తుంది. ఇక హ్యూగో కుటుంబం జీనిని భరించలేం అనీ అభిప్రాయానికి వచ్చేస్తారు. శరీరం పెద్దదయి అమితమైన బలంతో దాడి చేసే జీనీ పట్ల అందరిలో భయం ప్రవేశిస్తుంది. డా. ప్రెంటిస్ ఇలాంటి ప్రయోగాలకు గురి అయి తరువాత వదిలేయబడ్డ జంతువుల కోసం ఒక రీహాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తూ ఉంటుంది. జీనీకి ఆ ప్రదేశానికి మత్తు మందు ఇచ్చి హెలికాప్టర్‌లో తీసుకేళ్ళి ఒక రకమైన మోసంతో ఆ సెంటర్ లోని ఒక గదిలో వదిలిపెడతారు. జీనీని అక్కడ వదిలేసాక హ్యూగో మళ్ళీ మామూలు మనిషి కాలేకపోతాడు. జీనీ ఇప్పుడు జంతువులతో ఉండడానికి ఇష్టపడదు. జంతువులను దగ్గరకు రానీయదు. తాను మనిషినే అని పూర్తిగా నమ్మినందువలన తన సాటి జంతువులతో ఉండలేదు. చాలా వైలెంట్‌గా తయారవుతుంది. రెండు నెలలో అలాగే బంధించబడి ఉండిపోతుంది. జంతువుగా తినడానికీ ఇష్టపడదు. ఒకసారి సాండీ జీనీని చూడడానికి వెళతాడు. అతన్ని జీనీతో కలవనివ్వరు. కాని సాండీ బలవంతంగా జీనీ గదిలోకి వెళతాడు. అతన్ని చూసి జీని గుండేలు పగిలేలా రోదిస్తుంది. అతన్ని గట్టిగా పట్టుకుని వదలదు. అక్కడ నిర్వాహకులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి జీనీని సాండి నుండి దూరం చేస్తారు. కళ్ళు మూసుకుపోతూ సాండిని అందరూ లాక్కుపోవడం జీనీ చూస్తుంది. తను అక్కడనుండి వెళ్ళడం ఇక జరగదని తను శాశ్వతంగా తన కుటుంబానికి దూరం అయ్యానని తెలుసుకుంటుంది. మరుసటి రోజు నిర్వాహకులు తల పగిలి మరణించిన జీనీని ఆ గదిలో చూస్తారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని వారు చెప్పినా సాండి మాత్రం చిన్నప్పటీ నుంది జీనీతో పెరిగి ఉన్నానని జీనీని తాను అర్థం చేసుకున్నట్లు ఎవ్వరూ చేసుకోలేరని, తన కుటుంబం తనకు శాశ్వతంగా దూరం అయ్యిందని ఆ బాధ భరించలేక జీనీ తల ఊసలకు కొట్టుకుని ఆత్మహత్య చేసుకుందని అర్థం చేసుకుంటాడు.

జీనీ మరణంతో హ్యూగో కృంగిపోతాడు. ఒక చిన్న గాల్ బ్లాడర్ ఆపరేషన్ కూడా తట్టుకోలేక మరణిస్తాడు. జీని మరణం అతనిలో జీవితేచ్ఛను చంపేసిందని కుటుంబం నమ్ముతుంది. లో ఒంటరిగా జీవిస్తుంటుంది. సాండి ప్రపంచంతో మమేకం కాలేక ఒంటరయిపోటాడు. జీనీ స్నేహం కోల్పోవడం అతని జీవితంలో కూడా వెలితిని తీసుకుని వస్తుంది. చిన్నప్పటినుండి జీనీని ఇష్టపడని సారా న్యూ యార్క్ వెళ్ళిపోటుంది. జీనీ మరణాం ఆ కుటుంబంలో అందరిపై ప్రభావం చూపిస్తుంది.

ఎన్నో నిజమైన ప్రయోగాల సమాచారాన్ని సేకరించి రచయిత ఈ నవల రాసారు. మనిషి చింపాజీ డి.ఎన్.ఏలు 99 శాతం కలుస్తాయి. ఆ ఒక్క శాతమే మనిషికి చింపాజీకి తేడా నిర్ణయించేది. అందుకే ఈ రెండు జీవాలలో చాలా స్పందనలు ఒకేలా ఉంటాయి. ఆఖరికి మోసం, క్రూరత్వం కూడా ఒకే స్థాయిలో ఉంటాయి. జంతువులు ఇతర జంతువులను ఆహారం కోసం తప్ప వేటాడవు అన్నది కూడా అబద్ధం. చింపాంజీలు మనుష్యుల లానే ఒకరినొకరు అకారణంగా గాయపరుచుకుని మరణించిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతారు.

జీనీ మరణీంచినాకా ఆమె అస్థికలను సాండి కుటుంబం తమ ఇంటికి తీసుకువచ్చి సమాధి నిర్మిస్తారు. వారికి ఒక కుటుంబ వ్యక్తిని కోల్పోయినటువంటి బాధనే జీనీ మరణం కలిగించింది.

సాండి దృష్టిలో తన తండ్రి జీనీ తల్లిని చంపడం తోనే ఒక తప్పు మొదలయ్యింది. తరువాత జీనిని మనిషిగా మార్చే మరో తప్పిదం ఆ కుటుంబం చేసింది. అందువల్ల జీనీ చివరకు మనిషిగా ఉండలేక, జంతువులతో గడపలేక దుర్భరమైన బాధను అనుభవించి మరణించింది. దాన్ని సహజ జీవితానికి దూరం చేసిన వారందరికి జీనీ మరణం పట్ల బాధ్యత ఉందని సాండి నమ్ముతాడు. ప్రయోగాల పేరుతో ఎన్ని జంతువులు మానవుల ప్రేమ పేరుతో హింసకు గురి అయి ఉంటాయో ఇప్పటిదాకా. మొదటిసారి భూమి మీద పడ్డప్పుడు హ్యూగోని చూసి అతన్ని తల్లి స్థానంలో స్వీకరించి జీనీ చివరకు ఒంటరిగా అతను లేక ఎంత బాధ పడి ఉంటుందో. మనకూ చింపాంజీలకు డి.ఎన్.ఏ లో ఎన్నో పోలికలుండడం వలన జీనీ స్థానంలో మనల్ని ఊహించుకుంటే అది పడ్డ వేదన అర్థం చేసుకోవచ్చు. జంతువులను మానసికమైన హింసకు గురి చేసే మనుష్యుల ప్రయోగాల గురించి ఆలోచన కలిగించే పుస్తకం ఇది. జంతువును సహజంగా జంతువుగా ఉండనీయడమే సహేతుకమైన మానవీయ చర్య అని చెప్పే ఈ పుస్తకం చాలా అరుదైన పుస్తకం అని చెప్పవచ్చు.

Exit mobile version