Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితమొక పయనం-3

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[తాను దరఖాస్తు చేసిన ఉద్యోగం కోసం కన్యాకుమారికి రమ్మని రాఘవకి సమాధానం వస్తుంది. ఇంట్లో చెప్పకుండా, రైలెక్కి బయల్దేరిపోతాడు. రైలు బాగా రద్దీగా ఉన్నప్పటికీ, ఓ మూల కూర్చొని, తనకొచ్చిన ఉత్తరాన్ని తీసి చదువుకుంటాడు. కాసేపయ్యాకా, ఆ ఉత్తరాన్ని పెట్టెలో పెట్టి, పెట్టెకి తాళం వేస్తాడు.  కొన్ని గంటలు గడిచాకా, కొన్ని స్టేషన్లు దాటాకా, బోగీ కాస్త ఖాళీ అయి, కూర్చోడానికి సీటు దొరుకుతుంది. రాత్రవుతుంది. బోగీలో ఉన్నవారు తాము తెచ్చుకున్న పదార్థాలు బయటకు తీసి తింటుంటారు. రాఘవ తినటానికి ఏమీ తెచ్చుకోలేదు. రైల్లో ఏదో ఒకటి అమ్మకపోరు, కొనుక్కుని తింటే సరిపోతుంది అనుకుంటాడు. కానీ అమ్మకానికి ఏవీ రావు. ఒక స్టేషన్‍లో ఆగినప్పుడు గబగబా వెళ్ళి కుళాయిలో నీళ్ళు తాగివస్తాడు. అతనికెదురుగా ఓ ఉత్తరాది కుటుంబం కూర్చుని ఉంటుంది. ఒక పెద్దావిడ, ఆమె భర్తా, ఒక యువకుడూ, అతని భార్యా మొత్తం నలుగురు. ఆ యువకుడు పెద్దావిడని దాది మా అని పిలుస్తూంటాడు. ఆ యువకుడు రాఘవతో పరిచయం చేసుకుంటాడు. తను ఉద్యోగం నిమిత్తం కన్యాకుమారికి వెళుతున్న విషయాన్ని దాచిపెట్టి, వాళ్ల ‘దాది మా’ అంగీకరిస్తే తానూ వాళ్లతోపాటు వస్తానని, వాళ్లింట్లో ఏదైనా పని ఇప్పించి సాయం చేయమని అడుగుతాడు రాఘవ. తాను అడగలేనని, మీరే అడగడండని అంటాడతను. రాఘవ ఆవిడని దాది మా అని పిలవబోతుంటే, కసురుకుంటుంది. రాఘవకి ఆకలవుతోందని గ్రహించిన ఆవిడ, రాఘవకి కూర, రొట్టెలు తిచ్చి తినమంటుంది. మర్నాడు కన్యాకుమారి చేరాకా, నీకు మంచి ఉద్యోగం వస్తుందని రాఘవకి ధైర్యం చెప్తుందామె. రిక్షాలో వివేకానంద కేంద్రానికి వెళ్తాడు రాఘవ. అక్కడున్న యువతికి తన వివరాలు చెప్తాడు. ఈ పూటకి విశ్రాంతి తీసుకోమని, రాత్రి భోజనాలయ్యాక, తొమ్మిది గంటలకు యోగా హల్లో జరిగే సమావేశానికి తప్పకుండా హాజరవమని చెప్తుంది. అతిథుల కోసం కేటాయించిన గదిలోకి వెళ్ళి, కాస్త ఖాళీగా ఉన్న చోట తన సామాన్లు పెట్టుకోబోతుంటే, ఓ వ్యక్తి – అక్కడ ఫ్యాన్ గాలి సరిగా రదాని, తన పక్కకి వచ్చి సూట్‍కేస్‍ను సర్దుకోమని హిందీలో చెప్తాడు. స్నానం చేయాలనిపించినా, రాత్రంతా రైల్లో నిద్రలేకపోవటం వల్ల – అక్కడిక్కడే నిద్రపోతాడు. పొద్దున్న పరిచయమైన హిందీ వ్యక్తి – నిద్ర లేపి స్నాక్స్, టీ ఇస్తున్నారు, తెచ్చుకోమని చెప్తాడు. వాళ్ళు పెట్టిన నాలుగు ఆలూ బోండాలు తిని టీ తాగాకా, ఓపిక వస్తుంది. పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. రాత్రి తొమ్మిందింటికి ఒక వ్యక్తి హ్యాండ్‌మైక్‌తో ప్రత్యక్షమై – వారికి స్వాగతం పలికి – యోగా నేర్చుకునేందుకు దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పరిచయం చేస్తాడు. ఈ మూడు వారాల పాటు మీరు గడపబోయే ప్రతి క్షణమూ మీ కొత్త జీవితానికి గట్టి పునాది వేస్తుందని భావిస్తున్నామని అంటాడు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాఘవ కాక మరో ముగ్గురు వస్తారు. రాఘవ వారిని బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఆ వచ్చినతను మరుసటి రోజు నుంచి ఏమేం చెయ్యాలో, ఎలా నడుచుకోవాలో వివరించి, వెళ్ళిపోతాడు. అందరూ ఆ హాల్ నుంచి బయటకు నడుస్తారు. – ఇక చదవండి.]

6. బాబాయ్‌ పరిచయం

రుసటి రోజు ఉదయం 4.30 గంటలకల్లా నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తయారై తన దుప్పటిని తీసుకుని, యోగా హాల్‌కు చేరుకున్నాడు రాఘవ. అప్పటికే అక్కడికి చాలామంది చేరుకున్నారు. వాళ్లందరి ఉత్సాహం చూస్తుంటే అతనికెంతో ఆశ్చర్యం కలిగింది. కొందరు అప్పటికే అక్కడ స్థలాలు ఆక్రమించి మ్యాట్లు పరుచుకుని కూర్చుని ఉన్నారు.

సరిగ్గా ఐదు గంటలకు యోగా శిక్షకుడు హాల్లోకి ప్రవేశించాడు.

అందరినీ ఒక పద్ధతిలో, వరుసల్లో, మనిషికీ మనిషికీ మధ్య కొంత దూరం ఉండేటట్టుగా చూసుకుని కూర్చోమని చెప్పాడు. అందరూ అలాగే కూర్చున్నారు.

యోగా శిక్షకుడు ఇంగ్లీషులో తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు..‘‘యోగమును నేర్చుకోవటానికి వచ్చిన మీ అందరికీ శుభోదయం. ఇన్ని కోట్లమంది భారతీయులలో మీకు మాత్రమే యోగాను నేర్చుకోవాలన్న తలంపు రావటం పూర్వజన్మ సుకృతం. అసలు యోగా అంటే ఏంటీ?..” అంటూ అందరివైపు చూస్తూ.. ‘‘మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ శక్తిని బయటికి తీసుకొచ్చి, అతణ్ణి పరిపూర్ణత వైపు పయనింపజేసే ఒక క్రమపద్ధతినే ‘యోగము’ అంటారు. ఇవి నా మాటలు కావు, శ్రీ అరవిందులు చెప్పిన మాటలు. మనిషి, సమాజము.. నిత్యమూ సుఖాన్ని, ఆనందాన్ని, సృజనాత్మకతను, ఉన్నతమైన మానసిక శక్తిని సాధించేందుకు ప్రయత్నిస్తుండటం చేత వాటిని సమన్వయం చెయ్యటానికి యోగమే అసలైన పరిష్కారంగా నేడు భారతదేశమంతటా దీన్ని గుర్తిస్తున్నది..’’ అంటూ ఆయన తన తొలిపలుకుల్ని ప్రారంభించి.. ముందుగా యోగ మునిశ్రేష్ఠుడైన పతంజలి ప్రార్థనను అందరికీ నేర్పించాడు. తర్వాత కొన్ని శిథిలీకరణ వ్యాయామాలు (వార్మప్‌ ఎక్సర్‌సైజెస్‌) నేర్పించి మొదటి రోజున కొన్ని తేలికపాటి ఆసనాలను చెప్పించాడు.

తర్వాత ఓంకార ధ్యానం, ప్రాణాయామం.. ఇవన్నీ పూర్తికావటానికి గంటన్నరకు పైగానే సమయం పట్టింది. చివరగా శాంతి మంత్రంతో ఆనాటి తరగతిని ముగించాడు. తర్వాతి యోగా క్లాసు సాయంత్రం 4.30 గంటలకు ఉంటుందని తెలిపాడు.

యోగా తరగతి పూర్తయ్యాక అర్థగంటపాటు భగవద్గీత శ్లోకాలను నేర్పించారు.

తర్వాత అందరూ తమతమ హాళ్లకు తిరిగొచ్చి యోగామ్యాట్లను పక్కన పెట్టేసి స్నానాలకు వెళ్లారు. ఇప్పుడే వెళితే రద్దీగా ఉంటుందని కాసేపు పడుకున్నాడు రాఘవ.

పడుకున్న వెంటనే ఇల్లు గుర్తొచ్చింది అతనికి. ‘తను రాసిన ఉత్తరం ఈపాటికి ఇంటికి చేరే ఉంటుంది. తను తీసుకున్న నిర్ణయంతో అందరిలోనూ కంగారు మొదలై ఉంటుంది. తను ఉత్తరంలో తెలిపినట్టు పోలీసు రిపోర్టు ఇవ్వకుండా ఉంటారా? లేదూ ఇస్తారా? ఒకవేళ ఇస్తే, పోలీసులు ఇక్కడికీ వస్తారేమో? చూడాలి! ఏం నిర్ణయం తీసుకుని ఉంటారో కొద్దిరోజుల్లోనే తెలిసిపోతుంది.’ అనుకుంటూ టైమ్‌ ఎంతైందో చూసి లేచి స్నానానికి బయలుదేరాడు.

ఆ తర్వాత భోజనశాలకు వెళ్లి అల్పాహారం పూర్తిచేశాడు.

వేడివేడి టీ కప్పును చేతపట్టుకుని నడుచుకుంటూ పక్కనే ఉన్న తోటలోకి అడుగుపెట్టాడు.

అక్కడొక పెద్ద చేదబావి కనిపిస్తే దాని దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూశాడు. స్వచ్ఛమైన తేటనీళ్లు పైన్నే కనిపించాయి. చుట్టూ చూశాడు. ఒకవైపు కొబ్బరితోట మరోవైపు మామిడి తోపు కనిపించాయి. అక్కడక్కడా జామ చెట్లూ కనిపించాయి.

దూరంగా ఒక చదునైన బండరాయి కనిపిస్తే వెళ్లి దానిమీద కూర్చుని రెండు గుక్కలు టీ తాగాడు. అది ఇంకా వేడిగానే ఉంది. కప్పును పక్కన పెట్టి చుట్టూ చూస్తూ కూర్చున్నాడు.

వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి. ఇంతలో ఒక ఉడుత కొమ్మలమీద నుండి తుర్రున పరుగెత్తుకుంటూ కిందికి దిగొచ్చింది. తన సమీపానికి రావటానికి ప్రయత్నించింది. తను కదిలేసరికి అది చెట్టు మొదట్లోనే ఆగిపోయింది. తను మెదలకుండా ఉండేసరికి దగ్గరికి రావటానికి తటపటాయిస్తోంది. దాన్నే చూస్తూ కూర్చున్నాడు రాఘవ. తళుక్కున దాని వీపుమీద ఉన్న చారలు అతని కళ్లకు కనిపించాయి. ఏదో ఆలోచనలో పడ్డాడు.

అంతలో ఎవరో వస్తున్న అలికిడి కావటంతో అది వేగంగా కొమ్మల్లోకి పారిపోయింది. దాన్నే చూడసాగాడు రాఘవ.

‘‘ఏం చూస్తున్నావు అక్కడ కూర్చుని?’’ అని ఆప్యాయంగా తెలుగులో అడుగుతూ దగ్గరికొచ్చాడు వరంగల్‌ వాసి మాధవరెడ్డి గారు.

అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడుతున్న ఆ స్ఫురద్రూపిని తలపైకెత్తి చూస్తూ..‘‘ఏం లేదు బాబాయ్‌, ఊరకనే ఇలా కూర్చున్నా!’’ నవ్వుతూ అన్నాడు రాఘవ. అతనికెందుకో ఆయన్ను అలా సాన్నిహిత్యంతో సంబోధించాలనిపించింది.

ఒక అపరిచితుడు తనను అలా సంబోధించటంతో.. క్షణంలో వెయ్యోవంతు కోపం ముంచుకొచ్చింది మాధవరెడ్డికి.      కళ్లెర్రచేస్తూ రాఘవ కేసి చూశాడు. కానీ అదే వేగంతో ఆ కోపం పాలపొంగులా బుస్సున తగ్గిపోయింది.

కారణం, రాఘవ ప్రశాంతమైన చూపులతో, గౌరవం ఉట్టిపడుతున్న అభిమానంతో అలా బంధుత్వాన్ని కలిపి పిలవటాన్ని అదే ఆదరణతో స్వీకరించాడు మాధవరెడ్డి. వెటకారమో, ఉత్తుత్తి పిలుపో కాదది. మనసులోంచి పెల్లుబికొచ్చిన భావన అది. ఎంతో జీవితానుభవాన్ని గడిరచిన ఆయన.. ఆ పిలుపులోని స్వచ్ఛతను, నిజాయితీని గుర్తించి రాఘవకు మరింత చేరువగా వెళ్లాడు.

‘‘ఆ ఉడుతలో అలా నువ్వేం చూస్తున్నావు బాబూ..” ఆయనా తనను ప్రేమతో అడిగేసరికి రాఘవ ఇలా అన్నాడు: ‘‘ఏం లేదు బాబాయ్‌, ఆ ఉడుత ఎంత అదృష్టం చేసుకున్నదో కదా? లంకకు వారధిని నిర్మించే సందర్భంలో వానరులు, సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఇలా ఎందరో యోధానుయోధులంతా శ్రమిస్తున్నప్పుడు.. ఈ ఉడుత ఒక చిన్నప్రాణే అయినా తన శక్తికొద్దీ చేసిన సాయం రాములవారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఒక బృహత్కర కార్యంలో ఎంత గొప్పగా సాయం చేశామన్నది కాదు, ఎంత నిబద్ధతతో సాయం చేశామన్నదే ముఖ్యం అని ఈ జీవి రుజువుచేసి స్వామివారి కృపకు పాత్రురాలైంది. ఆయన దీన్ని అరచేతిలోకి తీసుకుని ప్రేమగా నిమిరిన ఆ చిహ్నాలు ఇప్పటికీ దాని ఒంటిమీద ఉండటం మనకు ఆ గొప్ప సంఘటనను గుర్తుకు తెస్తూనే ఉంటుంది. అదే ఆలోచిస్తూ కూర్చున్నాను బాబాయ్‌.’’ నవ్వుతూ అన్నాడు రాఘవ.

‘‘బాగుంది, చాలా చక్కగా చెప్పావు బాబూ.. ముందు చల్లారిపోతున్న ఆ టీని తాగు, తర్వాత తాగితే రుచి

ఉండదు..’’ అన్నాడు. రాఘవ కప్పును అందుకొని మెల్లగా టీని చప్పరించసాగాడు.

‘‘నిజానికి ఆ సంఘటన వాల్మీకి రాయలేదు. ఇదేకాదు ఇంకా మరికొన్ని సంఘటనలు కూడా వాల్మీకి తన రామాయణంలో రాయలేదు. కానీ తర్వాత్తర్వాత రాయబడిన రామాయణాలలో ఇలాంటవన్నీ వచ్చి చేరాయి. రామాయణంలో ఇవన్నీ చేర్చబడినా, ఇవన్నీ అతికినట్టుగా ఆయా సందర్భాలకు తగినట్టుగా సరిపోవటంతో రామాయణానికి ఒక ప్రత్యేకత ఏర్పడిందేమోననిపిస్తుంది. ఇలాంటివన్నీ చేర్చిన కవులెవరో మనకు స్పష్టంగా తెలియకున్నా అవన్నీ వాల్మీకే రాశాడన్నట్టుగానే ఆయన పేరుమీదనే చలామణి అవుతుండటం మనం కాదనలేని విషయం.’’

‘‘బాబాయ్‌, ఉదుతాభక్తి లాగానే ఇంకా ఏయే సంఘటనలు రామాయణంలో చేర్చబడ్డాయంటారు. చెప్పండి బాబాయ్‌, నాకు తెలుసుకోవాలనుంది.’’ అన్నాడు ఆసక్తిగా.

‘‘ఈ ఉడుతాభక్తి లాగానే, ఇంద్రుడు కోడై కూయటం, లక్ష్మణ రేఖ ఉదంతం, ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు ఇలాంటివన్నీ వేర్వేరు కవులు రచించినటువంటివే. కానీ అవి రామాయణంలో ఎంత బాగా ఒదిగిపోయాయో చూశావా..’’ అంటూ అతడి కళ్లల్లోకి సూటిగా చూస్తూ.. ‘‘పర్వాలేదే, నీకు పురాణాలపైన బాగానే ఆసక్తి ఉన్నట్టుందే..’’ నవ్వుతూ అన్నాడు మాధవరెడ్డి.

‘‘అవును బాబాయ్‌, చాలానే ఆసక్తి ఉంది!’’ తనూ నవ్వుతూ అన్నాడు రాఘవ.

‘‘మంచిది! నీలాంటి యువకులకు పురాణాలపట్ల ఆసక్తీ, అభిమానం ఉండటం ఆశ్చర్యకరమే. అయితే ఇంకా నీ అభిరుచులేమిటో, ఆశయాలేమిటో, ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావో ఆ వివరాలన్నీ చెప్పు, తెలుసుకోవాలని ఉంది!’’ అన్నాడు మాధవరెడ్డి కుతూహలంగా.

‘‘పుస్తక పఠనం నా ప్రధానమైన అభిరుచి బాబాయ్‌. పాత సినిమాలు చూడ్డం కూడా ఇష్టమే. ఇక ఆశయాలు అంటూ గొప్పగా ఏమీ లేవు. కానీ అన్ని విషయాల్లో నీతిగా, నిజాయితీగా ఉండాలని మాత్రం కోరుకుంటాను. ప్రస్తుతం నేనొక ఫైనాన్స్‌ అండ్‌ చిట్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాను. దానితోనే ఆగిపోకుండా, ఇంకా మంచి ఉద్యోగానికి వెళ్లాలన్నది నా కోరిక. యోగా, ధ్యానం నేర్చుకుని జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలన్నది కూడా నాకున్న మరో కోరిక.’’ అంటూ ముగించాడు రాఘవ.

‘‘బాగుంది, చక్కటి అభిరుచులు.’’ అంటూ ప్రశంసించాడు మాధవరెడ్డి.

‘‘మరి మీ గురించి చెప్పండి బాబాయ్‌!’’ నవ్వుతూ అడిగాడు రాఘవ.

‘‘నేను మిలట్రీ ఎక్స్‌`సర్వీస్‌మెన్‌ను. రిటైర్‌ అయ్యి ఇరవయేళ్లు కావస్తోంది. నాకు కొడుకూ కూతురూ ఉన్నారు. కొడుక్కి పెళ్లయ్యింది. ఈమధ్యే తాతయ్యను కూడా అయ్యాను. కూతురికి ఇంకా పెళ్లికాలేదు. మన పురాణాలన్నా, సంప్రదాయాలన్నా, తెలుగు భాష అన్నా నాకెంతో ప్రీతి. క్రమశిక్షణే ఊపిరిగా బ్రతికే నేను, ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తపనతోటే ఇంత దూరం వచ్చాను. అందరి మధ్యా ఉన్నతంగా బ్రతకాలన్నది నా ఆశయం. ఎవరికీ, ఎందుకూ ఉపయోగపడని బ్రతుకు వృథా అన్నది నా నిశ్చితాభిప్రాయం.’’

‘‘భలే భలే..’’ అంటూ ఆనందంగా రాఘవ చప్పట్లు కొట్టటంతో మహదానందపడ్డాడు మాధవరెడ్డి.

‘‘ఇలాంటి గొప్ప ఆశయాలవల్లే మీరు ఇంత చక్కగా ఆరోగ్యంతో ఉన్నారని నేను భావిస్తున్నాను బాబాయ్‌!’’

‘‘అదేంటీ?’’ అర్థంగాక అడిగాడు మాధవరెడ్డి.

‘‘అవును బాబాయ్‌, మీలో స్వార్థం, కల్మషం, అసూయాద్వేషాలు ఉండుంటే ఎప్పుడో ముసలివాడైపొయ్యి కదల్లేని పరిస్థితి వచ్చుండేది. అలాంటివన్నీ మీకు లేవు కాబట్టే మాతో సమానంగా ఈ కన్యాకుమారికి వచ్చి యోగాసనాలు నేర్చుకోగలుగుతున్నారు.’’ అంటూ ప్రశంసించాడు.

నవ్వి ఊరుకున్నాడు మాధవరెడ్డి.

7. ముఖాముఖి

ఆ సాయంత్రం రెండవ ఉపన్యాసం అయ్యాక, రాఘవ తమ హాల్‌కు వెళ్లి యోగా తరగతికి వెళ్లేందుకు తయారవుతున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి అతని దగ్గరికొచ్చి.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ నుండి వచ్చిన రాఘవ గారంటే మీరేనా?’’ అని ఇంగ్లీషులో అడిగాడు.

‘‘ఔను!’’ అన్నాడు రాఘవ.

‘‘మిమ్మల్ని ఆఫీసులో రమ్మంటున్నారు.’’ అన్నాడతను.

‘‘ఎందుకూ?’’ అంటూ ప్రశ్నించాడు రాఘవ.

‘‘ఏమో తెలియదు సార్‌. వెళ్లేటప్పుడు మీ ఒరిజినల్‌ ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్స్‌ తీసుకెళ్లండి.’’ అని చెప్పి అతను వెళ్లిపోయాడు.

‘ఓహో! ఉపాధ్యాయుల ఇంటర్వ్యా కోసం అయ్యుంటుంది.’ అనుకుని సూట్‌కేస్‌ తెరిచి సర్టిఫికెట్స్‌ ఉన్న కవరును తీసి బయటపెట్టి మళ్లీ దానికి తాళం పెట్టాడు. లేచి ప్యాంటు వేసుకుని, తల దువ్వుకుని నేరుగా ఆఫీసుకేసి నడిచాడు.

ఎంక్వయరీలోని వ్యక్తితో తననిక్కడికి రమ్మన్న విషయం చెప్పాడు. అతను రాఘవ నుండి సర్టిఫికెట్స్‌ తీసుకుని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు. అతను సర్టిఫికెట్సన్నీ పరిశీలించి, తమ రికార్డులో నోట్‌ చేసుకుని, వాటిని అటెండర్‌ ద్వారా ఆఫీసరు గదిలోకి పంపించాడు.

కొంతసేపయ్యాక రాఘవను ఆఫీసరు గదిలోకి వెళ్లమని చెప్పాడు అటెండరు.

రాఘవ ఆఫీసరు గదిలోకి అడుగుపెడుతూ.. ‘‘గుడీవినింగ్‌ సార్‌!’’ అంటూ ఆఫీసరుకు విష్‌ చేశాడు. ఆఫీసరు మర్యాదపూర్వకంగా తల ఊపుతూ తన ముందున్న సీటును చూపిస్తూ.. ‘‘ప్లీజ్‌ బి సీటెడ్‌!’’ అన్నాడు ఇంగ్లీషులో.

తర్వాత రాఘవకు సంబంధించిన సర్టిఫికెట్లను చూస్తూ..‘‘డిగ్రీ.. ఓకే! టైప్‌రైటింగ్‌ ఓకే!..’’ అంటూ ఒక్కొక్కటిగా సర్టిఫికెట్లన్నింటినీ పరిశీలించాడు.

తలపైకెత్తి రాఘవను చూస్తూ.. ‘‘బి.కాం. డిగ్రీ పూర్తిచేసిన మీరు మీ సొంత ఊళ్లోనే ఉద్యోగం చూసుకోక ఇంతదూరం ఎందుకొచ్చారు?’’ అని ప్రశ్నించాడు.

‘‘నాకిక్కడ ఉద్యోగం కావాలని నేనుగా మీకు అప్లికేషన్‌ పెట్టలేదు సార్‌.. మీరే ‘సేవాభావంతో ఉపాధ్యాయులుగా పనిచెయ్యటానికి గ్రాడ్యుయేట్లు కావలెను’ అని పేపర్లో ప్రకటన ఇస్తే.. దాన్ని చూసి దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పుడు మీరిక్కడికి రమ్మంటేనే వచ్చాను.’’

‘‘ఓకే! బి.కాం. డిగ్రీ చదివిన మీరు ఉపాధ్యాయులుగా ఎలా పనిచేద్దామనుకుంటున్నారు. మీకు కనీసం టీచర్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ కూడా లేదుగా. పోనీ.. ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసిన అనుభవం ఉందా?’’

‘‘లేదు సార్‌. ‘గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఈ ఉద్యోగానికి అర్హులే!’ అని మీరిచ్చిన ప్రకటనను చూసి నేను అప్లై చేశాను. ఈ ఉద్యోగానికి నన్ను ఎన్నుకుంటే మీరే దానికవసరమయ్యే శిక్షణను కూడా ఇస్తారనుకున్నాను.’’

‘‘రైట్‌! మీ జీవితంలో ఇప్పటిదాకా ఎప్పుడైనా సమాజసేవ చేశారా?’’ అని సూటిగా రాఘవను ప్రశ్నించాడు.

‘‘లేదు సార్‌.’’ అన్నాడు రాఘవ.

‘‘ఏం, ఆసక్తి లేదా?’’ అని మళ్లీ వెంటనే అడిగాడు ఆ ఆఫీసరు.

ఆ ప్రశ్నకు ఒక్కక్షణం మౌనం వహించిన తర్వాత.. ‘‘సమాజసేవ చెయ్యటానికి కావలసింది ఆసక్తి కాదని నా అభిప్రాయం సార్‌.’’ నింపాదిగా అన్నాడు రాఘవ.

‘‘మరింకేం కావాలి?’’ అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఆసక్తిగా అడిగాడు ఆ ఆఫీసరు.

‘‘అవగాహన ఉండాలి. ఈ సమాజం పట్ల సరైన దృక్కోణం ఉండాలి. అన్నిటినీ మించి విశాలమైన హృదయం కావాలి. మధ్య తరగతిలో పుట్టిన నాలాంటి వాడికి తనకు తాను నిలదొక్కుకుని బ్రతకటమే కష్టమైనపుడు, ఇక సాటి మనిషికి సేవ చెయ్యాలన్న తలంపు ఎలా కలుగుతుంది?’’

‘‘అలా అనుకుంటే నువ్వు ఎప్పటికీ సేవ చెయ్యలేవు?’’ పెదాలు విరుస్తూ అన్నాడు ఆ ఆఫీసరు.

‘‘సారీ సార్‌! రాంగ్‌ ఒపీనియన్‌. నన్నే తీసుకోండి. ఉద్యోగ భరోసా ఉందన్న నమ్మకంతోటే నేనింత దూరం వచ్చాను. ఇప్పుడు మీరు కనుక నాకీ ఉద్యోగం ఇచ్చారంటే, మీరు చెయ్యమన్న సేవ చెయ్యటానికి నేను తయారుగా ఉంటాను. కాబట్టి వ్యక్తులకు ఉద్యోగమో, ఆర్థిక సోమతో ఉన్నప్పుడు మాత్రమే సమాజసేవ చెయ్యటానికి వీలు కలుగుతుంది.’’

‘‘మరి ఇప్పటివరకూ సమాజసేవచేసిన వాళ్లందరికీ ఇవి ఉన్నాయని మీరనుకుంటున్నారా. ఏదీ ఒక్కరిని ఉదహరించండి చూద్దాం.’’

‘‘క్షమించండి, నేనెవరినీ ఉదహరించలేను. కానీ మరొక విషయం చెప్పగలను. జీవితంలో అన్నింటినీ తృణప్రాయంగా ఎంచి సర్వస్వాన్ని త్యజించినపుడు సేవే పరమార్థంగా అనిపిస్తుంది. అప్పుడు తమ జీవితాన్ని సేవకే అంకితం చేసి చరితార్థులు అవుతారు. అటువంటివాళ్లు కోట్లమందిలో ఒక్కరో ఇద్దరో ఉంటారంతే! కానీ అటువంటి వాళ్లను మీరు నాలాంటి సామాన్యుల్లో వెతక్కండి.’’

‘‘శెభాష్‌, బ్యూటిఫుల్‌ ఎనలైజేషన్‌. మీ ఇంటర్వ్యూ పూర్తయింది. కానీ, మీరు టీచరుగా ఎంపిక అయ్యిందీ, లేనిదీ తర్వాత తెలియజేస్తాం. ఒక విషయం గుర్తుంచుకోండి. కేవలం ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్స్‌ను మాత్రమే మేము పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చెయ్యదలచుకోలేదు. వాళ్ల ప్రవర్తనను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలనుకుంటున్నాము. అంటే, ఇతరులతో మీరెలా ప్రవర్తిస్తున్నారు, మీలో కలివిడితనముందా, నలుగురినీ కలుపుకుని ముందుకు వెళ్లే సామర్థ్యముందా.. ఇలాంటి అంశాలన్నీ పరిశీలిస్తాము. మీకు తెలియకనే మేము మిమ్మల్ని పరిశీలిస్తూ ఉంటాము. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి! ఇక మీరు వెళ్లొచ్చు.’’ అనగానే ఆయన్నుండి సెలవు తీసుకుని తమ హాలుకు చేరుకున్నాడు రాఘవ.

(ఇంకా ఉంది)

Exit mobile version