[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]
[సంపత్ గారు చెప్పినట్టుగా, చిత్తూరులోనే ఉండిపోలేకపోతాడు రాఘవ. సెలవలు పూర్తవటంతో హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఇక్కడే ఉండి ఏదైన ఉద్యోగం చేసుకోమని తల్లి వనజమ్మ బ్రతిమాలుతుంది. కనీసం ఓ ఏడాదైనా పని చేసి ఆ తర్వాత వచ్చేస్తానని తల్లికి నచ్చజెప్పి, వెళ్ళిపోతాడు. విధుల్లో పడి తండ్రిని మరిచిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఓ రోజు అతన్ని కలవడానికి మాధవరెడ్డి కుమార్తె సురేఖ స్కూలికి వస్తుంది. ఆ సమయంలో ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది అర్థం కాదు. హాఫ్-డే సెలవు పెట్టి తనతో రమ్మని కోరుతుంది. పనేంటి అని అడిగితే, చెప్తే కానీ రారన్న మాట అంటూ వెళ్ళిపోబోతుంది. సరేనని సెలవు చీటి రాసిచ్చి ఆమెతో పాటు వెళ్తాడు. తన స్నేహితురాలు మాధవి కారులో ఎక్కించుకుని వాళ్ళింటికి తీసుకువెళ్తుంది. ఆ రోజు మాధవి తమ్ముదు చంటి పుట్టినరోజు. కేక్ కటింగ్, భోజనాలూ అయ్యాకా సురేఖ, మాధవి చంటిలతో సినిమాకి వెడుతూ, రాఘవని కూడా తీసుకెళ్తుంది. ‘ప్రిడేటర్’ అన్న ఇంగ్లీషు సినిమా చూసి, పొద్దుపోయాకా, బసకి చేరుతాడు రాఘవ. ప్రధానాచార్యులు ఆరా తీసే, సగం నిజం, సగం అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఓ రోజు పాఠశాల పూర్తయ్యాక, రాఘవ విశ్రాంతిగా తన గదిలో పడుకుని ఉండగా, హిందీ మాస్టారు కుమార్ వచ్చి ఓ ఉత్తరం తెచ్చి ఇస్తాడు. అది సురేఖ రాసిన ఉత్తరం. ఈమధ్య తాము కలిసి గోల్కొండకు వెళ్ళడం తనకెంతో ఆనందన్నించదని, అతని సాన్నిహిత్యం నచ్చిందని రాస్తుంది. తాను తరచూ స్కూల్‍కి వస్తే, రాఘవకి ఇబ్బంది కావచ్చ కాబట్టి, ప్రతీ నెలా రెండో ఆదివారం బయట కలుసుకుందామని అంటుంది. ఆ ఆదివారం పదకొండు గంటలకు ట్యాంక్‌బండ్ దగ్గరకు రమ్మని రాస్తుంది. ఆ అమ్మాయి చొరవ రాఘవకి నచ్చదు. అలా ఆ అమ్మాయితో కలిసి తిరగడం మాధవరెడ్డి గారికి తెలిస్తే బాగుండదు, తన మీద మంచి అభిప్రాయం పోతుందని అనుకుంటాడు రాఘవ. టాంక్‍బండ్‌కి వెళ్ళకూడని అనుకుంటాడు. సురేఖ స్కూలికి వచ్చినా, తాను ఉండకూడదని అనుకుని రోజంతా ఎక్కడైనా బయట తిరిగి రావాలనుకుంటాడు. స్కూల్ నుంచి బయటకొచ్చి, కాసేపు అటు ఇటూ తిరిగి, ట్యాంకుబండ్‌మీదుగా వెళ్లే సిటీబస్సు కనిపిస్తే యాంత్రికంగా ఆ బస్సులోకి ఎక్కేసి, అప్రయత్నంగా ట్యాంకుబండ్‌కు టికెట్ తీసుకుని దిగుతాడు. అక్కడ సురేఖ కనబడి, అతన్ని తనతో తీసుకువెళ్తుంది. లాంచీ ఎక్కి బుద్ధ విగ్రహం వద్దకు వెళ్తారు. కాసేపు అక్కడ కూర్చున్నాకా, తన హ్యాండ్‌బ్యాగులో నుండి చిన్ని కెమెరాను బయటికి తీసి, ఒక యువతిని పిలిచి తామిద్దరనీ ఒక ఫోటో తీయిస్తుంది సురేఖ. బుద్ధుడి గురించి, యశోధర చెప్తుంటే, సురేఖ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆమె ఎందుకు ఏడుస్తోందో అర్థం కాక, కారణం చెప్పమని బ్రతిమాలుతాడు. చివరికి ఆమె చెప్పింది విని, చరిత్రలో జరిగిపోయినదాన్ని మరో విధంగానో, మరొకరి కోణం నుండో చూసి బాధపడకూడదని చెప్పి, బయల్దేరదీస్తాడు. – ఇక చదవండి.]
43. ప్రేమ వివాహం
తలుపులు దబదబ మంటూ శబ్దం కావటంతో వెళ్లి తలుపు తీసింది రాఘవ తల్లి వనజమ్మ. ఎదురుగా నిలబడ్డ జంటను చూసి నిర్ఘాంతపొయ్యింది. అప్రయత్నంగా ఆమె నోటి నుండి.. “ఒరేయ్ ఏమిట్రా ఇదీ? ఎంత పని చేశావురా?” అన్న మాటలు వెలువడ్డాయి. గుమ్మం బయట మెళ్లో పూలదండలతో నిలబడున్న కొడుకునూ, ముక్కూ మొహమూ తెలీని ఓ అమ్మాయిని చూసి ఆదుర్దాకు లోనైంది వనజమ్మ.
వాళ్ల వాలకం చూస్తుంటే గుళ్లో పెళ్లి చేసుకుని సరాసరి ఇటే ఇంటికొచ్చినట్టుగా వున్నారు.
చప్పున స్పృహలోకొచ్చింది వనజమ్మ. వాళ్లను గుమ్మం బయటే నిలబెట్టి మాట్లాడుతుంటే నలుగురూ చూశారంటే పరువు పోతుందనీ, వాళ్లు చేసిన పనికి అందరి ముందూ నవ్వులపాలు అవుతామని స్ఫురించి చప్పున పక్కకు తప్పుకుని వాళ్లకు లోపలకు దారిచ్చింది.
వాళ్లు లోపలికి వచ్చాక, “ఏమిట్రా ఇదీ, ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొస్తావా? నేను చచ్చాననుకున్నావా, ఏం?” అంది ఆవేశంగా.
“లేదమ్మా, మేమిద్దరమూ ఒకరినొకరు ఇష్టపడ్డాము. పెళ్లి చేసుకోవాలనుకున్నాము.”
“అయితే పెద్దవాళ్లకు చెప్పకనే, వాళ్ల అంగీకారం తీసుకోకనే పెళ్లిచేసుకొని వచ్చేస్తారా?”
“చెబుదామనే అనుకున్నానమ్మా. కానీ వాళ్ల తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేయటంతో ఇక ఆలస్యం చెయ్యకూడదనుకుని, గణపతి గుళ్లో మాలలు మార్చుకుని మేమే పెళ్లి చేసేసుకున్నాం.”
“ఈ విషయం నలుగురికీ తెలిస్తే ఎంత అవమానం?”
“ఇందులో అవమానకరమైన పని ఏముందమ్మా. ఇద్దరమూ ఒకరినొకరు ఇష్టపడ్డాము. ఒకటవ్వాలనుకున్నాము. ఆమెను మోసం చేసి వదిలించుకోకుండా నా భార్యను చేసుకున్నాను. ఇందులో తప్పేం ఉందీ?”
“తప్పు కాక మరేమిటీ? ఇట్టాంటిది మన ఇంటా వంటా ఉందాని? మనది ఎంత పరువుగల కుటుంబం. నా కొడుకు ఎవరో అమ్మాయిని ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేస్కొచ్చాడని తెలిస్తే నలుగురూ మనల్ని ఎంత చులకనగా, హేళనగా చూస్తారు.” అంది కుమిలిపోతూ.
“ఎవరో నలుగురు ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటే మేము ఒకరికొకరం దూరమైపోయి జీవితాంతం ఆవేదనతో కుమిలిపోవలసిందేనమ్మా. మా జీవితాలు సంతోషంగా ఉండాలనే ఈ నిర్ణయానికొచ్చాం. తల్లిగా నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకోమ్మా.”
“ఏం అర్థం చేసుకోమంటావు రా. రేపు ఈ పిల్లను ఈ ఇంట్లో చూసి ఎవరీ అమ్మాయి అంటే నేనేం చెప్పాలిరా?”
“నీ కోడలని చెప్పూ. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని చెప్పూ. నీక్కూడా చెప్పకుండా మేము పెళ్లి చేసుకుని వచ్చేశామని చెప్పూ. ఉన్నదే చెప్పమ్మా. నెపమంతా నామీదే నెట్టేయమ్మా. నేను చూసుకుంటాను. ఏం తలదీసి మొలకేస్తారా ఏం? అదీ చూస్తా.”
“ఎంత బరితెగించావురా. వాళ్లు మన తల తియ్యరు కానీ, తల దించుకునేలా నాలుగు మాటలంటే భరించగలమా? ఇప్పటిదాకా ఎవరితోనూ ఒక్కమాట అనిపించుకోని మనం ఇప్పుడు అందరిచేతా నానా మాటలూ పడాల్సి వస్తుంది. అదెంత అవమానకరమో అర్థమవుతోందా?”
“ఎవడైనా మనల్ని అవమానకరంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. మాటకు మాటా నేనూ మాట్లాడతాను. అయినా ఇది మన సొంత విషయం. ఎవడికీ ఇందులో జోక్యం చేసుకునే హక్కు లేదు. కాదని ఎవడైనా ఏదైనా కూస్తే వాడి మూతి పళ్లు రాలగొడతాను.”
“ఊ మూతి పళ్లు బలే రాలకొడతావులే. నువ్వూ నీ పనికిమాలిన మాటలూనూ. ఇదేనా నీ సమాధానం. ఇక్కడి వాళ్లు సరే, రేపు ఈ పిల్ల తల్లిదండ్రులొచ్చి నిలదీస్తే ఏం చెప్తావురా? వాళ్ల మూతిపళ్లూ రాలగొడ్తావా?”
“మేమిద్దరమూ ఒకరినొకరం ఇష్టపడ్డ విషయాన్ని చెప్తాను. చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు క్షమించమని కోరతాను. ఆశీర్వదించమని వాళ్ల కాళ్లపై పడతాను.”
“నువ్వు చేసిన పనికి వాళ్లు ఆపాట్నే సంతోషంగా ఇద్దర్నీ ఆశీర్వదిస్తారనుకుంటున్నావా? నీ పళ్లు రాలగొడతారు. కాదూ కూడదని నువ్వు మొండికేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసి, జైల్లో పడేస్తారు. అది గుర్తు పెట్టుకో ముందు.”
“అమ్మా, వాళ్లు అలా కేసు పెట్టటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు మేజర్. ఆమె ఇష్టానుసారం ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు ఆమెకుంది. దాన్ని కాదనేందుకు వాళ్ల తల్లిదండ్రులకు ఏ అధికారమూ లేదు. కాదూ కూడదని నాపైన కేసు పెడితే, అది నిలవదు. నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను.”
“నువ్వొక్కడికి ఏం చెయ్యగలవు రా.”
“నేనొక్కడికే కావచ్చు కానీ నాలాంటివాళ్లకు సపోర్టుగా ఎన్నో ఆదర్శ సమాజాలు, సంఘాలూ ఉన్నాయి, కొన్ని రాజకీయ పార్టీలూ ఉన్నాయి. వాళ్లకు చెప్పానంటే వాళ్లే చూసుకుంటారు అన్నీ.” తెగేసి చెప్పాడు.
“అయినా నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదురా. ఈ విషయం తెలిశాక ఎందరి ఉసురు పోసుకోవాల్నో ఎన్నెన్ని మాటలు పడాల్నో? అంతా నా తలరాత. అవన్నీ చూడలేక నేను చచ్చినా బాగుణ్ణు. నా ప్రాణం తీసేందుకే నువ్వు ఈ పని చేశావురా.” అంటూ విసవిసా గదిలోకి వెళ్లి మంచంపై పడుకుని గొణుగుతూ, ఏడుస్తూ ఉండిపోయింది వనజమ్మ.
44. విషాదం
“నువ్వు వెంటనే రావాలి. ఇక్కడ అమ్మ ఆరోగ్యమేమీ బాగాలేదు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. కలవటమూ లేదు, వేసిన పడక వేసినట్టుగానే ఉంటోంది. బాగా చిక్కి సగమైపొయ్యింది. నిన్ను బాగా కలవరిస్తోంది. ఇప్పటికే మనం నాన్నను పోగొట్టుకున్నాము. ఇప్పుడు అమ్మను దూరం చెయ్యకు. ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా వచ్చి అమ్మను కాపాడు. ఈ ఉత్తరం చూసిన వెంటనే బయలుదేరి రా.”
ఉత్తరం చదవగానే రాఘవకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అసలు అమ్మకేమైంది? ఎందుకింతగా ఆరోగ్యం పాడుచేసుకుంది. అక్కడ తమ్ముడుండీ ఏం చేస్తున్నట్టు? ఏమీ అర్థం కాలేదు రాఘవకు.
ఆ రాత్రంతా బాగా ఆలోచించి..అమ్మను కాపాడుకోవటమే తక్షణ కర్తవ్యంగా భావించి ఊరికి వెళ్లటానికి నిర్ణయించుకున్నాడు. మరునాడు ప్రధానాచార్యులకు తల్లి అనారోగ్యం విషయం చెప్పి, వారంరోజులు సెలవు కోరాడు. ఆయన అయిష్టంగానే సెలవు మంజూరు చేశాడు.
గదికి తిరిగొచ్చి సూట్‌కేసులో బట్టలు సర్దుకుని ఉన్న డబ్బును తీసుకుని ఊరికి బయలుదేరాడు.
మరునాడు చిత్తూరు చేరుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు రాఘవ. తమ్ముడి అడుగుల శబ్దానికి వంటింట్లో నుండి బయటికొచ్చింది పెద్దక్క జానకి. అతణ్ణి చూసి పలకరింపుగా నవ్వింది.
హాల్లో మంచంపై నిస్త్రాణగా పడుకొని ఉన్న తల్లి దగ్గరికెళ్లాడు. చిక్కి సగమైన తల్లిని చూసి తల్లడిల్లిపొయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ మెల్లగా పలకరించాడు.
వనజమ్మ కళ్లు తెరిచి చూసి మళ్లీ మూసుకుంది.”ఎలా ఉందమ్మా ఇప్పుడు?” అని కొడుకు అడిగితే మెల్లగా తలూపింది అంతే, కానీ నోరు తెరిచి ఏమీ బదులివ్వలేదు.
తమ్ముడికి టీ తీసుకొచ్చి ఇచ్చింది జానకి. టీ తాగుతూ.. “ఎలా ఉన్నావక్కా?” అని అడిగాడు.
“నాకేం బాగానే ఉన్నాను. అమ్మే..” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది జానకి. తల్లి ముందు అక్కను ఇంకేమీ అడగకూడదని మౌనంగా టీ చప్పరించసాగాడు. జానకి కూడా ఏమీ మాట్లాడలేదు.
టీ పూర్తిగా తాగాక కప్పు కిందపెట్టి తల్లి దగ్గర నుండి గదిలోకి వెళుతున్న రాఘవ వెనకే వెళ్లింది జానకి.
“అసలు అమ్మకు ఏమైందక్కా?” అని దీనంగా అడుగుతున్న రాఘవను చూసి దీర్ఘంగా నిట్టూరుస్తూ.. “అమ్మ అనారోగ్యానికి కారణం చిన్నా ప్రేమ వివాహం! వాడు తనతోపాటు ఉద్యోగం చేసే అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. అమ్మ వాళ్ల వివాహాన్ని ససేమిరా అంగీకరించకపోవటంతో, వాడు వేరు కాపురం పెట్టాడు. ఆ దిగులుతోనే మంచం పట్టింది. ఇక నువ్వే ఈ వ్యవహారాన్ని సరిదిద్దాలి.” అంది జానకి.
అంతా విని నిర్ఘాంతపొయ్యాడు రాఘవ.
వ్యవహారాన్ని తను సరిదిద్దటమా? అయిపోయిన తమ్ముడి పెళ్లి విషయంలో ఇక తను కలుగజేసుకుని మాత్రం ఏం ప్రయోజనం? వాడు భార్యను వదిలి వచ్చెయ్యగలడా? ఆ పాపం తనకెందుకు? తల్లికే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి ఆమె కోలుకునేలా చెయ్యాలి అనుకున్నాడు రాఘవ.
‘తను వచ్చి వారం రోజులైందనీ, తన అత్త తనమీద గుర్రుగా ఉందనీ’ ఆ సాయంత్రమే ఊరికెళ్లిపోయింది జానకి.
రాఘవకు తల్లి పరిస్థితి పూర్తిగా అర్థమైపొయ్యింది. చిన్నా చేసిన పనికి మానసికంగా ఎంతగానో క్రుంగిపోయింది. తిండీ తిప్పలు మానేసి వాడు చేసిన నిర్వాకం గురించే ఆలోచిస్తూ అనారోగ్యం కొని తెచ్చుకుంది.
‘చిన్నా అలా చెయ్యటం ముమ్మాటికీ తప్పే’ అని తల్లిని ఎంతగానో ఓదార్చేందుకు ప్రయత్నించసాగాడు రాఘవ. కానీ ఆమె మాత్రం మామూలు స్థితికి రాలేకపొయ్యింది.
ఉన్నట్టుండి ఒకరోజు వనజమ్మకు కాళ్లూ చేతులూ వాచాయి. ముఖం కూడా ఉబ్బింది. రాఘవ భయంతో తల్లిని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాడు.
డాక్టరు అన్ని పరీక్షలూ చేసి.. “మీ అమ్మకు షుగరుంది. అంతేకాక, కిడ్నీలు కూడా బాగా పాడయ్యాయి. మీరు చూసుకోలేదా? బి.పి.కూడా అబ్‌నార్మల్‌గా ఉంది.” అంటూ ప్రశ్నించేసరికి ఏం చెప్పాలో తెలియలేదు రాఘవకు.
“నిజం చెప్పాలంటే పేషంట్ ఈజ్ ఇన్ క్రిటికల్ కండీషన్.” డాక్టరు మాటలకు హతాశుడయ్యాడు రాఘవ.
అతని పరిస్థితిని అర్థం చేసుకుని డాక్టరు కొన్ని మందులు రాసిచ్చి వాటిని క్రమం తప్పకుండా వేసుకోవాలనీ మళ్లీ పది రోజుల తర్వాత పేషెంటును తీసుకురమ్మని చెప్పి పంపాడు.
తల్లిని ఆటోలో తీసుకొస్తుంటే ఆలోచనల్లో కూరుకుపొయ్యాడు రాఘవ.
‘నాన్నేమో అమ్మను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపొయ్యాడు. తనేమో ఉద్యోగం పేరిట వరంగల్, హైదరాబాద్ అంటూ ఊళ్లు తిరుగుతున్నాడు. తమ్ముడు ఏమీ పట్టించుకున్నట్టు లేడు. దాంతో అమ్మ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసినట్టుంది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం ప్రమాదస్థితిలో పడింది. ప్రాణానికే ముప్పుందని డాక్టరు హెచ్చరిస్తున్నాడు. దీనికి తను కూడా బాధ్యుడే. ఇప్పుడైనా మేల్కొని తల్లి ప్రాణం ఎలాగైనా కాపాడుకోవాలి. ఈ పరిస్థితిల్లో తను మళ్లీ హైదరాబాదు వెళ్లటం కుదరదు. అందుకని తల్లి పరిస్థితిని తెలుపుతూ.. సెలవును పది రోజులు పెంచమని కోరుతూ ప్రధానాచార్యులకు ఉత్తరం రాశాడు.
అందుకు సమాధానంగా.. పది రోజుల తర్వాత రాఘవను వెంటనే వచ్చి ఉద్యోగంలో చేరమనీ, లేకుంటే అతని ఉద్యోగానికి తాను హామీ ఇవ్వలేనని ప్రధానాచార్యులు ప్రత్యుత్తరం రాశారు.
ఏం చెయ్యాలో తోచలేదు రాఘవకు.
అయితే రోజులు గడిచికొద్దీ అతని తల్లి పరిస్థితి మరింత దిగజారి ఒకరోజు రాత్రి నిద్రలోనే కన్నుమూసింది.
అక్కలతో పాటు తమ్ముడు చిన్నాకు కూడా విషయం తెలియజేసి అంత్యక్రియలను పూర్తిచేశాడు రాఘవ.
పదిహేనవ రోజు జరిపే కార్యాలు ఇక మూడు రోజులు ఉందనగా.. మాధవరెడ్డి వాళ్లమ్మాయి దగ్గర నుండి రాఘవకు ఒక ఉత్తరం వచ్చింది. కవరు చింపి చదవసాగాడు.
“రాఘవగారికి! నేను క్షేమం. మీరు క్షేమమని తలుస్తున్నాను. మీరు నాకొక్క మాటకూడా చెప్పకుండా ఉన్నపళంగా ఊరెళ్లిపోయి అక్కడే ఉండిపోవటం నన్నెంతో ఆవేదనకు గురిచేస్తోంది. ప్రధానోపాధ్యాయులు మాత్రం మీరు తప్పక తిరిగొస్తారనే ఆశాభావంతో ఉన్నారు. కానీ రోజులు గడిచేకొద్దీ నాకైతే నమ్మకం సన్నగిల్లుతోంది. అనుకోకుండా కొందరు వ్యక్తులు మన జీవితంలో తారసపడతారు. వాళ్లతో సాన్నిహిత్యం మనకెంతో ఆనందాన్నిస్తుంది. ఆ ఆనందంలో ఏవేవో ఆలోచనలూ కలుగుతాయి. కానీ అవి మధ్యలోనే ముగింపుకొచ్చినప్పుడు అలవికాని నిరాశనూ ఆవేదననూ మిగులుస్తాయి. నేనైతే మీ సాన్నిహిత్యం ఇలా అర్ధాంతరంగా ఆగిపోతుందని కలలో కూడా ఊహించలేదు.
ఈ ఉత్తరంతో పాటు నేను పంపుతున్న ఫోటోను ఒకసారి చూడండి..
(గబగబ కవరులో ఉన్న ఫోటోను బయటికి తీశాడు.)
ఆ ఫోటో.. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం ముందు సురేఖా తానూ నవ్వుతూ ఉండగా తీయించుకున్నది. ఓ క్షణం పాటు ఫోటోను చూసి మళ్లీ ఉత్తరంలోకి దృష్టిని మరల్చాడు.
“..ఆనాడు బుద్ధుడి విగ్రహం ముందు నేను విలపించిన సందర్భం గుర్తుకొచ్చి ఇప్పుడు మరింతగా విలవిలలాడుతున్నాను. రాజు, బుద్ధుడుగా మారాక అతని భార్య పరిస్థితే ప్రస్తుతం నాదీ అనిపించింది. కాకపోతే ఆమె అతనికి భార్య, నేను మీకేమీ కాను, అంతే! కానీ ఇద్దరమూ స్త్రీలమే కదా, అదే అసలైన సామ్యం. ఏ కాలంలోనైనా ఆడవాళ్ల మనసుల్ని ఎవరు అర్థం చేసుకున్నారనీ? జరిగే పరిణామాలకు మనసున కృంగిపోవటం మినహా వాళ్లింకేం చెయ్యగలరనీ?
కానీ.. ఎందుకో మళ్లీ మనం కలుస్తామనే ఆశ నాలో ఏ మూలో మినుక్కు మినుక్కుమంటోంది. ఈ ఉత్తరం అందగానే వెంటనే ప్రత్యుత్తరం రాయండి. మీ ఉత్తరం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటాను.
ఇట్లు,
సురేఖ.
ఉత్తరం చదవటం పూర్తిచేశాక అతని మనసు కకావికలమైపొయ్యింది. ఆ అమ్మాయిని తాను మోసం చేశాడా అన్న ఆలోచనలో పడ్డాడు.
మాధవరెడ్డిగారి అమ్మాయని ఆమెను తాను గౌరవించాడు. ఆమెతో మర్యాదగా ప్రవర్తించాడు. ఆమెకు తన స్నేహ హస్తాన్ని అందించాడు. ఆమెతో కలిసి ఎన్నో ప్రదేశాలకు వెళ్లేందుకు సమయం వెచ్చించాడు. ఏనాడూ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నట్టుగా గానీ, ప్రేమిస్తున్నట్టుగా గానీ చెప్పలేదు. తాను తన పరిమితుల్లో ఉండే ఆమెతో మాట్లాడాడు. మసలుకున్నాడు.
అయినా ఆమెలో ఇలాంటి భావనలు కలిగేందుకు కారకుడయ్యాడు. ఇందులో తన బాధ్యత ఎంత ఉంది? నిస్వార్థంతో తను ఆ అమ్మాయితో స్నేహం చేసినా ఇంతటి భావావేశాలకూ, ప్రేమోద్రేకాలకూ లోనయ్యిందంటే ఆమె మనసు ఇంత బలహీనమైనదా? ఆమె తనపై ఇంతగా ఆశలు పెంచుకుందంటే తానేం చెయ్యగలడు? ఇందులో తన తప్పు ఎంతవరకూ ఉంది? ఇక ఇంతకు మించి ఏ చెడు పర్యవసానాలకూ తను ఆస్కారమివ్వకూడదు. దీన్ని ఇంతటితో ఆపెయ్యాలి. ముందుకు సాగనివ్వకూడదు.. అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
చేతిలోని ఉత్తరాన్నీ, ఫోటోనూ నిర్లిప్తంగా చూస్తూ వాటిని నాలుగు ముక్కలుగా చించి చెత్తబుట్టలో పడేశాడు.
ఆ వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రధానాచార్యులకు ఉత్తరమూ రాశాడు.
(ఇంకా ఉంది)
1961 లో జన్మించిన జిల్లేళ్ళ బాలాజీ 1983 నుండి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత ‘కామధేను’ వారపత్రికలోనూ, మొదటి కథ 1984లో ‘పల్లకి’ వారపత్రికలోనూ ప్రచురితమయ్యాయి.
వీరివి ఇప్పటి వరకూ 150 కి పైగా కథలూ, 120 కి పైగా కవితలూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి.
1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా.. 5) పగడాలు.. పారిజాతాలూ.. 6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)మొ!! పుస్తకాలను వెలువరించారు. వీరి తొలి నవల, మరి రెండు కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది.
వీరి సాహిత్య కృషికి గాను 1) గురజాడ కథా పురస్కారం (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) శ్రీమతి కామాక్షీబాయి – శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది.
తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు… 130 కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం.. అనువదించారు.
1) కాల ప్రవాహం 2) జయకాంతన్ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి 7) బహిర్గతం కాని రంగులు మొ!! కథా సంపుటులు వెలువడ్డాయి.
అలాగే 1) కల్యాణి 2) ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం 3) ప్యారిస్‌కు పో! 4) యామం 5) గంగ ఎక్కడికెళుతోంది? మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. అలాగే 1) కాపరులు (వ్యాస సంపుటి) 2) ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి (కవితా సంపుటి) వెలువడ్డాయి. మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అనువాదంలో.. 1) ప్రతిష్ఠాత్మకమైన ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం’ (2010) 2) ‘నల్లి దిశై ఎట్టుమ్’ పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం (2011) 3) ‘కె.ఎస్.మొళిపెయర్పు విరుదు’ పురస్కారాలను పొందారు (2023).