Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితమొక పయనం-20

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[అమ్మవారు తగ్గాకా, రాఘవ తిరిగి తన నిలయానికి వచ్చేస్తాడు. పదవ తరగతి పరీక్షలు పూర్తయి, మిగతా తరగతుల వారికి వార్షిక పరీక్షలు మొదలవుతాయి. ప్రధానాచార్యులు పిలిస్తే రాఘవ ఆయన గదికి వెళ్తాడు. మే 1 నుండి హైదరాబాదులో జరిగే కొత్త టీచర్ల శిక్షణకు రాఘవని ఎంపిక చేశామనీ, అక్కడ రాఘవకు తెలుగుతో పాటుగా సంస్కృత భాషలో కూడా శిక్షణనిస్తారనీ, శిక్షణలో పాసయినవారిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణించి, వారికి జీతపు స్కేలును నిర్ణయిస్తారని చెప్తారు. పిల్లల పరీక్షలయ్యాకా, పేపర్లు దిద్దిచ్చేసి వెళ్ళమని చెప్తారాయన. రాఘవ త్వరగా పేపర్లు దిద్దేసి హైదరాబాద్‌కు వెళ్తాడు. అక్కడి కార్యాలయంలో ప్రధానాచార్యులు రాసిచ్చిన ఉత్తరాన్ని చూపించగా, వారు ఒక హాల్‍ని చూపించి, అందులో అతని సూట్‌కేస్ సర్దుకోమని చెప్తారు. రానున్న శిక్షణార్థుల కోసం చెయ్యవలసిన ఎన్నో ముందస్తు పనులలో సాయం చేస్తాడు రాఘవ. మే 1 న శిక్షణా శిబిరం ప్రారంభమవుతుంది. ప్రాతఃకాలంలో యోగాసనాలు, ఉదయం పూటు  తెలుగు, మధ్యహ్నం సంస్కృతం పాఠాలు చెప్తారు. సంస్కృతం నేర్పించే పురుషోత్తమాచార్య చాలా సులువుగా అలవడేలా సంస్కృతం బోధిస్తారు. నెలరోజుల శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి, రాతపరీక్షలో కూడా ఉత్తీర్ణుడవుతాడు రాఘవ. జూన్‌7వ తేదీన తుది ఫలితాలను ప్రకటించి, రాఘవకు హైదరాబాదులోనే ప్రధాన కార్యాలయపు అనుబంధ పాఠశాలలో పోస్టింగ్ ఇస్తారు. తండ్రికి ఉతరం రాసి, జరిగిన వివరాలన్నీ తెలిపి, హైదరాబాద్ అడ్రస్ ఇస్తూ, ఇకపై ఉత్తరాలు ఇక్కడికే రాయమని చెప్తాడు. తామరగుంట వెళ్ళి అధ్యాపకులకు, పిల్లలకు వీడ్కోలు చెప్తాడు. ఊళ్లోకెళ్లి.. ‘బాబాయ్‌బావగారికి’ కూడా విషయం తెలిపి తన కృతజ్ఞతలను తెలియజేస్తాడు. తర్వాత మాధవరావు ఇంటికి వెళ్ళి ఆయననీ పలకరించి, వీడ్కోలు తీసుకుంటాడు రాఘవ. – ఇక చదవండి.]

39. భూకంపం

హైదరాబాదులో రాఘవకు 6, 7 తరగతులకు తెలుగు, అలాగే 6 నుండి 9 వ తరగతి వరకు సంస్కృతం క్లాసులను కేటాయించటం జరిగింది.

అతనికి విరామం ఉన్నప్పుడు.. సంస్కృతం చెప్పే సీనియర్‌ ఉపాధ్యాయుడు చెప్పే తరగతికి వెళ్లి చివరనున్న బెంచీలో కూర్చుని పాఠం విని, దాన్ని తక్కిన తరగతులకు చెప్పవలసిందిగా సర్క్యులర్‌ పంపించారు.

రాఘవ దాన్ని పాటిస్తూ సంస్కృతంలో బాగా తర్ఫీదు పొందసాగాడు.

అంతేకాక అతనికి ఆవాసం బాధ్యుడుగా కూడా అదనపు బాధ్యతను కేటాయించటం జరిగింది. దాంతో అతనికి సమయం గడవటమే తెలియటం లేదు.

తామరగుంట పిల్లలకు, ఇక్కడి పిల్లలకు ఉన్న తేడాను గ్రహించాడు.

ఏమైనా నగరంలోని పిల్లలు యమా ఫాస్ట్‌గా ఉన్నారన్న విషయాన్ని పసిగట్టాడు. మాటకారితనమూ, చురుకుతనమూ, పోటీపడి చదివే గుణమూ వీటన్నింటిలో నగరం పిల్లలు దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండటం గమనించాడు.

తక్కువ సమయంలోనే పిల్లలందరూ రాఘవకు బాగా దగ్గరయ్యారు. అందరికీ అతనంటే బాగా ఇష్టం ఏర్పడింది.

ఒకరోజు రాత్రి పిల్లలందరూ రాఘవ చుట్టూ చేరి ఏదైనా కథ చెప్పమని పోరు పెట్టారు.

అతను తనకు నచ్చిన కథను చెప్పటం ప్రారంభించాడు. అందరూ ఆసక్తిగా వినసాగారు. చెప్పటం పూర్తయ్యేసరికి రాత్రి 10 దాటింది. అది మొదలు, రోజూ కథ చెప్పమని పోరు పెట్టటం మొదలుపెట్టారు. ఏదో ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు రాఘవ.

పిల్లలెవరు తప్పుచేసినా వెంటనే ఆవేశంతో దండిరచకుండా, వాళ్లు తమ తప్పును తెలుసుకునేలా చేస్తున్నాడు. కానీ, వాళ్లే మళ్లీ మళ్లీ అదే తప్పును చేసినపుడు మాత్రం దండిస్తున్నాడు.

పిల్లల్ని ఎప్పుడు దగ్గరకు తీసుకోవాలో, ఎప్పుడు కఠినంగా ఉండాలో అతను బాగా గ్రహించాడు.

చూస్తూ ఉండగానే.. అక్కడి పాఠశాలలో చేరి అప్పుడే మూడు నెలలు గడిచిపొయ్యాయి.

29 సెప్టెంబరు 1993.

ఆ రాత్రి చాలాసేపటి వరకూ రాఘవ చెప్పే కథ విని అందరూ ఆలస్యంగా నిద్రపొయ్యారు.

రాఘవ మాంచి నిద్రలో ఉన్నాడు.

ఉన్నట్టుండి అతనికి తన వెనకనున్న గోడ కదిలినట్టుగా అనిపించి గబుక్కున మెలకువ వచ్చింది.

పడుకునే చుట్టూ చూశాడు.

ఈసారి మళ్లీ గోడ కదిలినట్టుగా అనిపించి చటుక్కున లేచి కూర్చున్నాడు.

తలుపు తీసుకుని బయటికెళ్లాడు.

నిలయాల ప్రాంగంణంలో చాలా కుక్కలున్నాయి.

అతను ఉన్న నిలయం గోడకు అటు పక్కన చాలా కుక్కలు పడుకుని ఉంటాయి. అవి రాత్రిపూట పరుగుపెట్టి ఆడుకుంటూ ఒకదానితో ఒకటి గొడవపడుతూ ఉంటాయి. ఒకదాన్ని ఒకటి రక్కుతూ, కొరుకుతూ, పరుగులు తీస్తూంటాయి.

గోడ కదలటానికి అవే కారణమై ఉండొచ్చు అనుకుంటూ గోడ వెనక్కెళ్లి చూశాడు.

ఆశ్చర్యంగా అక్కడ ఒక్క కుక్క కూడా కనిపించలేదు. అవి ఇంకెక్కడికో వెళ్లి పడుకుని ఉన్నట్టున్నాయి.

ఈసారి తాను నిలబడి ఉన్న నేల కొద్దిగా కంపించినట్టుగా అనిపించి కంగారుపడ్డాడు రాఘవ.

ఏం జరుగుతోందో అర్థంకాక అయోమయానికి గురయ్యాడు. అసలు అదేమిటో గ్రహించలేకపొయ్యాడు.

ఇందాక గోడ కదిలింది, ఇప్పుడు నేల కంపించింది. ఏమీ అర్థంకాక ఆలోచలనలోపడ్డాడు.

కొంతసేపటికి కానీ అతను దాన్ని భూకంపం అని గ్రహించలేకపొయ్యాడు.

ఈలోపు కుక్కలు ఎక్కడున్నాయో ఏమో.. అవన్నీ ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టాయి.

దాంతో ప్రధానాచార్యులు తలుపు తీసుకుని బయటికొచ్చాడు.

సగం చీకటిలో నిలబడున్న రాఘవను చూసి, “ఎవరదీ?..” అంటూ పిలిచాడు.

“నేను ఆచార్యజీ.. రాఘవను!” అని బదులిచ్చాడు.

“రాఘవగారా.. ఏంటిలా బయటికొచ్చారు? కుక్కలన్నీ ఎందుకిలా కలిసికట్టుగా ఏడుస్తున్నాయి?” అని ప్రశ్నించాడు.

“ఏం లేదు ఆచార్యజీ. మా నిలయం గోడ కదలినట్టుగా అనిపిస్తే, అది కుక్కల పనేమోనని బయటికొచ్చి చూశాను. కానీ బయట ఒక కుక్కకూడా కనిపించలేదు. అవెక్కడికెళ్లాయబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే నేల కొద్దిగా కంపించింది..”

“మీరూ గ్రహించారా, నాకూ అలాంటి అనుభవమే కలిగింది. ఏంటో ఏమో అనుకుంటూ బయటికొచ్చాను. ఈలోపు కుక్కలన్నీ గుంపుగా ఏడుస్తున్నాయి చూశారా. నా అనుమానం ఏంటంటే, అది భూకంపమోమోనని అనుకుంటున్నాను.”

“అవును ఆచార్యజీ.. నాకూ అదే అనుమానంగా ఉంది!”

“కుక్కలకు అన్నీ తెలుస్తాయి.” అంటూ టైమెంతైందో గోడ గడియారం కేసి చూసి.. “అబ్బో, తెల్లవారటానికి ఇంకా చాలా సమయముంది.” అని అక్కడే ఉన్న కోవెల తిన్నెమీద కూర్చుని ఓ అర్థగంట వరకూ ఆమాటా ఈమాటా మాట్లాడుతూ ఉండిపొయ్యారు.

ఆ తర్వాత భూమి కంపించలేదు.

తర్వాత ఎవరి మటుకు వాళ్లు తమతమ నిలయాల్లోకి వెళ్లిపొయ్యారు.

రాఘవ తమ నిలయంలోకొచ్చి పదినిమిషాలు అయ్యుంటుందేమో..

ఈలోపు ప్రధానాచార్యులు మళ్లీ రాఘవ హాలు దగ్గరికొచ్చి బిగ్గరగా..”రాఘవగారూ.. రాఘవగారూ..” అని పిలిచాడు.

రాఘవ వేగంగా లేచి తలుపు తీసుకుని బయటికి వెళ్లాడు.

“రాఘవగారూ మనం అనుకున్నదే కరెక్టు. అది భూకంపమే! నేను వెళ్లి ఎందుకైనా మంచిదని బి.బి.సి. రేడియో పెట్టాను. వాడు తాజా వార్త అందిస్తున్నాడు. భూకంపం మహరాష్ట్రలోని లాతూర్‌ కేంద్రంగా చాలా తీవ్ర స్థాయిలోనే వచ్చినట్టుంది. ఎంత నష్టం జరిగిందీ రేపటికి కానీ మనకు తెలిసే అవకాశం లేదు. ఆస్తి నష్టం పక్కన పెడదాం, ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా ఉంటే అంతే చాలు భగవంతుడా!” అంటూ ఆయన ఆందోళన పడసాగాడు.

ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే మరికొందరు ఆచార్యులు తమతమ గదుల్లో నుండి బయటికొచ్చి విషయం తెలుసుకుని అందరూ మాటల్లో పడ్డారు.

అప్పుడు ఏమీ ఎరగనట్టుగా సూర్యుడు మెల్లగా తూర్పున ఉదయించసాగాడు.

40. తండ్రి మరణం

ఆరవ తరగతిలో తెలుగు పాఠం చెబుతున్నాడు రాఘవ. పిల్లలందరూ శ్రద్ధగా పాఠం వింటున్నారు.

ఈలోపు గుమస్తా అక్కడికి గబగబా నడిచివచ్చి.. “మిమ్మల్ని ప్రధానాచార్యులు వెంటనే రమ్మంటున్నారు.” అని చెప్పేసరికి విషయమేమై ఉంటుందా అన్న ఆదుర్దాతో పాఠాన్ని మధ్యలోనే ఆపేసి, గబగబా కార్యాలయం చేరుకున్నాడు.

“రాఘవగారూ, మీకు టెలిగ్రాం వచ్చింది? ఇదిగోండి!” అంటూ టెలిగ్రాంను అతని చేతికందించారు ప్రధానాచార్యులు. విప్పి చూస్తే అందులో..”ఫాదర్‌ ఎక్స్‌పైర్డ్‌.. స్టార్ట్‌ ఇమ్మిడియెట్లీ..” అని ఉంది.

ఒక్కక్షణం రాఘవకేమీ అర్థంగాక అలాగే మౌనంగా ఉండిపొయ్యాడు.

మెల్లగా అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు. అంతా శూన్యంగా అనిపించింది. కళ్లు ఎటో చూస్తున్నాయి. ప్రధానాచార్యులు అతని పరిస్థితిని గమనించి కుర్చీలో నుండి లేచొచ్చి రాఘవ భుజమ్మీద చెయ్యేసి.. “ఏంటలా ఉన్నారు. మీనాన్నకేమైనా ఆరోగ్యం బాగోలేదా?” అని అనునయంగా ప్రశ్నించాడు.

“తెలియదండీ.. అలాంటిదేమైనా ఉండుంటే ముందుగా నాకు తెలియజేసి ఉండేవాళ్లు.” అన్నాడు కన్నీళ్లు కారుస్తూ..

“సరే, మీరు వెంటనే బయలుదేరండి. చేతిలో డబ్బులున్నాయా?” అంటూ టేబుల్‌ డ్రాయరు తీసి వెయ్యి రూపాయలు అతని చేతికిచ్చి, “ఇది ఉంచండి. అక్కడన్నీ సర్దుకున్నాకే వద్దురుగానీ, ఏ విషయమూ నాకు ఉత్తరంలో తెలియజేయండి.”

రాఘవ లేచి బయటికొచ్చి తన గదికెళ్లి బట్టలు మార్చుకుని తనకు కావలసిన వస్తువులన్నీ తీసుకుని బయటికొచ్చాడు. అప్పటికే అక్కడ ఇంకో ఆచార్యుడు స్కూటర్‌మీద తయారుగా ఉన్నాడు.

“రాఘవగారిని మెయిన్‌రోడ్డు వరకూ తీసుకెళ్లి విడిచిపెట్టి రండి. అక్కణ్ణించి సెంట్రల్‌ స్టేషన్‌కు చాలానే సిటీబస్సులు దొరుకుతాయి.” అన్నారు ప్రధానాచార్యులు.

రాఘవ వెళ్లి స్కూటర్‌ వెనక కూర్చోగానే అతను బండిని స్టార్ట్‌ చేశాడు.

రాఘవ మెయిన్‌రోడ్డు దగ్గర దిగి అక్కణ్ణించి ఎలాగో సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ చేరుకుని చిత్తూరు బస్సు ఎన్నింటికో విచారించాడు.

డైరెక్ట్‌ బస్సు లేకపోవటంతో కడప బస్సుంటే ఎక్కి కూర్చున్నాడు. అక్కణ్ణించి బస్సు మారుదాం అన్న నిర్ణయానికొచ్చాడు.

బస్సు బయలుదేరగానే సీట్లో వెనక్కు వాలి పడుకున్నాడు. అతణ్ణి ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టాయి.

ఆ రాత్రంతా ప్రయాణించి తెల్లవారి నాలుగుగంటల ప్రాంతంలో కడపకు చేరుకుంది బస్సు. అక్కడ చిత్తూరు బస్సుకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అది ఎంతకీ రాకపోయేసరికి తిరుపతి బస్సుంటే అందులోకి ఎక్కి కూర్చున్నాడు.

మూడున్నర గంటల ప్రయాణం అనంతరం బస్సు తిరుపతి చేరుకుంది. మళ్లీ అక్కణ్ణించి చిత్తూరు బస్సుంటే ఎక్కి కూర్చున్నాడు దాదాపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అతను ఇంటికి చేరుకున్నాడు.

ఇంటి బయటే తండ్రి శవాన్ని పడుకోబెట్టి ఉన్నారు. అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉంది.

రాఘవను చూడగానే మళ్లీ రోదనలు మిన్నుముట్టాయి. వెళ్లి తండ్రి కాళ్ల దగ్గర మౌనంగా నిలబడ్డాడు.

తండ్రిని చూస్తున్నకొద్దీ అతని గుండె ద్రవించి కళ్లల్లో నుండి కన్నీళ్లు ఉబికి బయటికి రాసాగాయి. మౌనంగా ఏడుస్తూ ఉండిపొయ్యాడు. అతని భుజానికున్న బ్యాగును ఎవరో తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు.

కాసేపయ్యాక నిలబడ్డానికి కూడా శక్తిలేక నీరసంతో తూలి పడబోయాడు. అతణ్ణి పట్టుకుని అరుగుమీద కూర్చోబెట్టారు.

ఎవరో టీ తీసుకొచ్చి ఇచ్చారు. మంచినీళ్లతో నోరు పుక్కిలించి టీ తాగాడు. అతని ముఖమంతా వాడిపోయింది.

రావలసినవాళ్లంతా ఒక్కొక్కళ్లుగా వస్తున్నారు.

‘మనిషి బాగానే ఉన్నాడమ్మా, మూడురోజుల క్రితం గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పాడట. ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కోలుకున్నాడనే అనుకున్నారు. కానీ మళ్లీ గుండెపోటు వచ్చి ఈసారి ప్రాణమే పొయ్యింది.’ ఎవరో చెబుతుంటే రాఘవ నిర్లిప్తంగా విన్నాడు.

ఆ సాయంత్రమే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. రాఘవే తండ్రికి తలకొరివి పెట్టాడు.

తండ్రిమీద కప్పిన వస్త్రం కొసను కొంత చింపి రాఘవ చేతికి చుట్టారు.

దాన్ని కార్యాలయ్యేంతవరకూ విప్పకూడదని పెద్దలు చెప్పారు.

ఆ సాయంత్రమే దాదాపు వచ్చినవాళ్లందరూ వెళ్లిపోయారు. బాగా దగ్గరివాళ్లు నలుగురైదుగురు మాత్రం మిగిలారు.

రాఘవ 15వరోజు కార్యాలయ్యేంత వరకూ ఊరి ఎల్లల్ని దాటకూడదని చెప్పారు.

ఆ రకంగా 15 రోజులకు పైగా సెలవును మంజూరు చెయ్యమని కోరుతూ హైదరాబాదుకు ఉత్తరం రాశాడు.

రోజూ ఇంట్లోచేసిన ఆహారాన్ని తండ్రి ఫోటో ముందు విస్తరిలో వడ్డించి, ముందు కాకికి పెట్టి తర్వాత అందరూ భుజిస్తున్నారు.

ఆ 15 రోజులూ రాఘవ దగ్గరి బంధువులు.. రోజుకొకరు చొప్పున రాఘవ వాళ్ల నాన్నకు వండి విస్తరి వేశారు.

పది రోజులు గడిచేసరికల్లా రాఘవకు గడ్డం బాగా పెరిగింది. మీసమూ గడ్డమూ దాదాపు కలిసిపొయ్యాయి.

ఒకరోజు రాఘవ.. తన ప్రాణమిత్రుణ్ణి కలుసుకుని ఓ వీధిలో నడిచి వెళుతున్నాడు.

ఇంతలో ఎవరో.. “రాఘవా..రాఘవా..” అని గట్టిగా పిలిచినట్టు అనిపించి వెనక్కు తిరిగి చూశాడు.

దూరంగా ఎవరో ఒక పెద్దాయన అతణ్ణి దగ్గరకు రమ్మంటున్నట్టుగా చేత్తో సైగచేస్తున్నాడు.

ఎవరా అనుకుంటూ దగ్గరికి వెళ్లాడు రాఘవ.

“రాఘవా.. నేను గుర్తున్నానా?..” అని ఆయనే ముందుగా పలకరించాడు.

“మా నాన్నగారితో పాటు పనిచేసేవారు కదూ? మీ పేరు నాకు గుర్తులేదు సార్‌.” వినయంగా అన్నాడు రాఘవ.

“ఔను, మీ నాన్నా నేనూ కలిసి పనిచేశాం. నాపేరు సంపత్‌. ఇలా వచ్చి మా తిన్నెమీద కూర్చో, నీతో నాలుగు మాటలు మాట్లాడాలని ఉంది. నీకింకేమైనా పనులున్నాయా?” అని ప్రసన్నంగా అడిగాడు.

“ఏంలేదు సార్‌, చెప్పండి..” అంటూ ఆ ఇంటి తిన్నెమీద కూర్చున్నాడు రాఘవ.

“నువ్వు బాగా తగ్గిపోయావు రాఘవా..” అతణ్ణి ఎగాదిగా చూస్తూ అన్నాడాయన.

సన్నగా నవ్వి ఊరుకున్నాడు రాఘవ.

“ఎక్కడెక్కడో తిరిగావు, ఏదేదో ప్రాంతాలకు వెళ్లావు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నట్టు చెప్పాడు మీ నాన్న.”

“ఔనండీ..”

“మళ్లీ హైదరాబాదుకు వెళతావా?”

“కార్యాలూ.. అవీ పూర్తయ్యాక వెళదామనుకుంటున్నాను సార్‌.” దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు రాఘవ.

“ఊ.. అక్కడ నీకు సంతృప్తికరంగానే ఉందా? అంటే జీతమూ అదీ..”

మౌనం వహించాడు రాఘవ.

“మీ తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నాను. నా మాట కొంచెం వింటావా?” అనునయంగా అన్నాడాయన.

చెప్పమన్నట్టుగా తలూపాడు.

“నువ్వు ఇలా దేశాలు పట్టి పోవటం మీనాన్నకెంతటి మనస్తాపాన్ని కలిగించిందో నీకు తెలుసా రాఘవా? ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టమో, ప్రేమో ఎవరికీ తెలయదు, నాకు తప్ప!

నువ్వు పుట్టినపుడు ‘మగపిల్లాడు పుట్టాడన్న’ ఆయన ఆనందానికి అంతులేకుండా పొయ్యిందట. అప్పుడాయన పనిచేస్తున్న పింగాణీ ఫ్యాక్టరీలో తయారైన డజను కప్పు సాసర్ల మీద పట్టుబట్టి నీ పేరు రాయించి మరీ ఇంటికి తీసుకొచ్చాడట.

నిన్ను చూడాలనుకున్నప్పుడల్లా వాటిని చూసి ఓదార్పు పొందుతున్నట్టుగా నాతో చెప్పేవాడు. నువ్వు డిగ్రీ పూర్తిచేసినపుడు.. ఆయనే పూర్తిచేసినంత సంబరపడ్డాడు ఆఫీసులో! అవన్నీ నీకు తెలిసే అవకాశమే లేదు రాఘవా.

‘నాకన్నా నా కొడుకే పెద్ద చదువు చదివాడు. డిగ్రీ పూర్తిచేశాడు.’ అంటూ మురిసిపోయాడు మీ నాన్న.

ఇక్కడ నువ్వు ఫైనాన్స్‌ కంపెనీలో, టైల్స్‌ ఫ్యాక్టరీలో, హోటల్లో పనిచెయ్యటం.. చూసి ఆయన సహించలేకపొయ్యేవాడు. నీకొక చక్కటి ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసివ్వలేని చేతకాని తండ్రిని అయిపోయానని నాదగ్గర వాపొయ్యేవాడు. అంతేకాక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాలెంటరీ రిటైర్మెంట్‌కు ఆస్కారం లేకుండా పోయినపుడు.. ఆయన ఎంతగా కుమిలిపోయాడంటే చాలారోజుల వరకూ అసలు మనిషే కాలేకపొయ్యాడు.

నువ్వు కన్యాకుమారికి చెప్పకుండా వెళ్లిపోయావని తెలిసి నా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు మీ నాన్న. నేను ఆయనను ఎప్పుడూ ఆ స్థితిలో చూడలేదు. కానీ ఎలాగో నువ్వు తిరిగివచ్చావు. సంతోషించాడు. కానీ నువ్వు మళ్లీ వరంగల్‌కు వెళ్లిపోయాక పిచ్చిపట్టిన మనిషిలా మారిపొయ్యాడు. ఎందుకో నువ్వు ఆయన్నుండీ, మీ కుటుంబం నుండీ దూరంగా వెళ్లిపోతున్నావేమోనని ఆయనకు భయం పట్టుకుంది. నీకు పెళ్లి చేసి మీ దంపతులను నిండుగా చూసుకుని సంతృప్తిగా కళ్లు ముయ్యాలని చాలాసార్లు నాతో అనేవాడు. నువ్వు అస్సలు ఉత్తరాలే రాయటం లేదని ఆయన ఎంతగా మథనపడ్డాడో నేను చెప్పలేను. నువ్వు రాయకపోయినా ఆయనే వారానికో ఉత్తరం రాసేవాడని నాతో చెప్పాడు. దానికీ నువ్వు ప్రత్యుత్తరం రాయలేదటగా.

రాఘవా, నిజం చెప్పనా.. ఆయన చాలా నిజాయితీగల మనిషయ్యా. అందరిలా లంచాలు తీసుకోవటమో, అవినీతికి పాల్పడటమో, ఇతరుల నుండి ఇంకేదో ఆశించటమో చెయ్యలేదు. మా అందరిలోనూ ఆయనే గొప్ప నీతిమంతుడు. రాత్రీపగలూ కష్టపడి పనిచేసేవాడు. నిజాయితీగా వ్యవహరించేవాడు. నీ ఉద్యోగం కోసం ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. ఎక్కని గుమ్మం లేదు. ఎందరెందరినో కలిశాడు. కానీ ఒక పర్మనెంటు ఉద్యోగాన్ని కొడుక్కి తీసివ్వలేకపోయానే అని ఎంతో బాధపడేవాడు.

నీకు ఉద్యోగం రానందుకు నువ్వెంత బాధపడ్డావో ఏమో కానీ, ఆయన నీకన్నా ఎన్నో రెట్లు బాధపడ్డాడు. ఆయన అనారోగ్యంతో ఏమీ చనిపోలేదు. నీమీద దిగులుతోటే కుమిలి కుమిలి చనిపొయ్యాడు. తన గుండెలోని భారాన్ని దించుకోలేక గుండెనొప్పి తెచ్చుకుని మరీ చనిపొయ్యాడు.

ఆయన అర్థాంతరంగా చనిపోయినా నీకు అన్యాయం మాత్రం చెయ్యలేదు రాఘవా. ఎంత మేలుచేసి పొయ్యాడో నేను చెప్పనా?!

ఆయన చనిపోతే మీ అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు చెయ్యటం నీకు భారమవుతుందని, తాను బ్రతికి ఉండగానే కూతుళ్లందరికీ పెళ్లిళ్లు చేసేశాడు. ఒకవేళ చెయ్యకపోయి ఉంటే ఆ భారమంతా నీమీద పడి ఉండేది కదూ? అప్పుడు నువ్వేం చేసి ఉండేవాడివి? ఒక్కళ్లకైనా పెళ్లి చేసి ఉండేవాడివా? నువ్వెంతో కష్టపడాల్సి వచ్చేది. ఔనా!

అది ఆయన నీకు చేసిన మేలు కాదా? ఆలోచించు బాబూ..

రాఘవా.. మీ తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నాను.. నువ్వు తీసుకుంటున్నావే జీతం.. అంతే జీతానికి ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకోకూడదా. ఇది నా కోరిక మాత్రమే కాదు, మీ నాన్న కోరిక కూడా! నాతో ఎన్నోమార్లు చెప్పాడు. తాను ఈలోకం నుండి వెళ్లిపోతే.. మీ అమ్మ, తమ్ముడూ ఒంటరివాళ్లైపోతారు. తర్వాత వాళ్లకు దిక్కెవరు? వాళ్లనెవరు చూసుకుంటారు.. అని ఎంతగానో బాధపడ్డాడు.

మనుషులు దూరాబారం పోవాలంటే.. ఒకటి, అది గొప్ప ఉద్యోగమైనా అయి ఉండాలి, లేదూ గొప్ప జీతమైనా రావాలి. ఏదీ లేకపోతే అంతంత దూరం వెళ్లి అలాంటి ఉద్యోగాలు చెయ్యటం దేనికీ? అలోచించు రాఘవా..

ఇక్కడే ఉండి ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుని మీవాళ్లకు ఆదరవుగా ఉండు.. అప్పుడే ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చినవాడివి అవుతావు..!” అంటూ ముగించారు సంపత్‌గారు.

అలాగే అన్నట్టుగా తలూపి ఆయన నుండి సెలవు తీసుకుని ఇంటికొచ్చేశాడు రాఘవ.

ఇంటికొచ్చినా సంపత్‌గారి మాటలు రాఘవకు పదే పదే గుర్తుకు రాసాగాయి. తండ్రికి తనపైనున్న ప్రేమను గుర్తుచేసుకుని ఎంతగానో కుమిలిపొయ్యాడు.

15వ రోజు తండ్రికి చెయ్యాల్సిన కార్యాలు పూర్తిచేశాడు రాఘవ.

(ఇంకా ఉంది)

Exit mobile version