Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితమొక పయనం-18

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ఆదివారం కావడంతో తమ తమ పిల్లల్ని చూసి వెళ్లటానికి తల్లిదండ్రులు వస్తారు. ఆదివారం పూట అక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరికీ అదనపు పని భారం ఉంటుంది. తల్లిదండ్రులతో నవ్వుతూ మాట్లాడుతూ, వాళ్ళ ప్రశ్నలకు ఓపికగా జవాబులు చెప్పాల్సి ఉంటుంది. ఆ ఆదివారం చాలామందే వస్తారు. పైగా ఆ రోజు శుభదినం కావడంతో, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని కొత్తగా హాస్టల్‍లో చేరుస్తారు. అలా ఆ రోజు ఓ పిల్లాడిని కొత్తగా చేరుస్తారు. ఆ పిల్లవాడి బాధ్యతను రాఘవకి అప్పగిస్తారు ప్రధానాచార్యులు. ఆ పిల్లవాడు బాగా భయపడి అక్కడ ఉండనని గొడవ చేస్తాడు. రాఘవ  ఆ పిల్లవాడిని పదవ తరగతి పిల్లలకు అప్పగించి, వంటశాల పనులు చూసుకోడానికి వెళ్తాడు. వచ్చిన తల్లిదండ్రులకు భోజనాలు ఒకవైపు, పిల్లలకు భోజనాలు మరొకవైపు.. తీరిక లేకుండా పోతుంది రాఘవకు. భోజనాలంతా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం మూడు దాటుతుంది. రాఘవ చిన్న కునుకు తీసి లేచేసరికి కొత్తగా చేరిన పిల్లవాడు కన్పించడు. ఎంత వెతికినా కన్పించడు. ఉపాధ్యాయులు, పిల్లలు, కొందరు తల్లిదండ్రులు కూడా వెతుకుతారు. అయినా ఫలితం ఉండదు. మర్నాడు ఉదయం ఓ బిచ్చగాడు పాఠశాల కార్యాలయం లోకి వచ్చి ప్రధానోపాధ్యాయుడిని కలిసి, నమస్కరించి, మీ బళ్లో సదూకునే పిల్లవాడెవడైనా తప్పిపోయినాడా అని అడుగుతాడు. అవునని చెప్పి, నీకెమైనా కనబడ్డాడా అని అడుగుతారు ప్రధానోపాధ్యాయుడు. ఆ పిల్లాడు కనిపించాడని చెప్పి, తమకి ఎలా దొరికాడో చెప్తాడు. ఆ కుర్రాడిని, తన భార్యని హరిజనవాడ దగ్గర ఉంచి వచ్చానని చెప్తాడు. రాఘవ ఆ బిచ్చగాడితో పాటు వెళ్ళి, కుర్రాడికి నచ్చజెప్పి, బుజ్జగించి దగ్గరకు తీసుకున్నాడు. ఆ బిచ్చగాళ్ల దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసి, పిల్లవాడిని తీసుకుని పాఠశాలకి వచ్చేస్తాడు. కొన్నాళ్ళకి ఆ పిల్లవాడికి అలవాటవుతుంది. ఓ రోజు వంటశాలలో వెంకటయ్యతో మాట్లాడుతూ ఉండగా ప్రధానాచార్యులు పిలిపిస్తారు. ఆ మర్నాడు, ఆ పై రోజున హుజూరాబాద్‍లో తమ శాఖా పాఠశాలలో బోధనా నైపుణ్య తరగతులు నిర్వహిస్తున్నారని, తమ పాఠశాలనుంచి రాజారావుని, రాఘవని పంపిస్తున్నట్లు, ఆ మధాహ్నమే బయల్దేరాలని చెప్తారు. దాంతో రాఘవ, రాజారావు బయల్దేరి, హుజూరాబాద్ చేరుతారు. సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్తారు. చీకటి పడుతుంటే, తమ బసవైపు నడుస్తారు. రాజారావు కాలివేలికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అది గమనించిన రాఘవ ఆయనకా విషయం చెబితే, తనకి రేచీకటి అని, రాత్రుళ్ళు సరిగా కనిపించదని చెప్తాడు. రాఘవ అతని చేయి పట్టుకుని నడుస్తాడు. మర్నాడు వారికి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం భోజనానికి ఒక్కో ఉపాధ్యాయుడికి ఒక్కో సీరియల్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ గల ఉపాధ్యాయుడికి కొందరు పోషకులు తమ ఇళ్ళల్లో భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఈ పోషకులే ఈ రెండు రోజుల పాటు మీకు భోజనం ఏర్పాట్లు చూస్తారని ప్రకటిస్తారు. రాఘవకి, రాజారావుకి దిల్దార్ హుస్సేన్ అనే ఒక ముస్లిం కుటుంబంలో ఆతిథ్యం లభిస్తుంది. వారు ఎంతో ఆదరంగా చూసుకుంటారు. కానీ ఈలోపు ఊర్లో గొడవలై, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో, మధ్యాహ్న భోజనం సగంలో ఆపేస్తారు. సాయంత్రం తమని తమ శాఖా పాఠశాలలో దింపేయమని అడుగుతారిద్దరూ. కానీ బయట పరిస్థితులు బాలేవని చెప్తాడు దిల్దార్. రాత్రి చపాతీలు తిని నిద్రపోతారు. మర్నాడు మధ్యాహ్నానికి పరిస్థితి సర్దుమణుగుతుంది. శిక్షణా తరగతులు కూడా రద్దవుతాయి. దిల్దార్, అతని కొడుకు రాఘవని, రాజరావుని బస్సెక్కిస్తారు. – ఇక చదవండి.]

35. ఆదర్శ గ్రంథం, రామాయణం!

తామరగుంట,

19-12-92.

గౌ!! నాన్నకు రాఘవ వ్రాయు ఉత్తరం.. ఇక్కడ నేను క్షేమం. అక్కడ మీరు, అమ్మ, తమ్ముడు క్షేమమని భావిస్తున్నాను.

గతవారం నేనూ మరో టీచరు ఓ ట్రైనింగు కోసమని హుజూరాబాద్‌ వెళ్లాము. అక్కడ అనుకోకుండా మేము ఒక భయానక పరిస్థితిలో చిక్కుబడిపోయాము. మమ్మల్ని అందులో నుండి కాపాడింది మాత్రం మాకు ఆశ్రయం కల్పించిన ఓ ముసల్మాను కుటుంబమే. వాళ్లకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అవుతుంది. ఆజన్మాంతం రుణపడి ఉంటాము.

ఇక పాఠశాలలకు జనవరి 11 నుండి 17 వరకూ సంక్రాంతి సెలవులు ఇస్తున్నమాట వాస్తవమే కానీ, నేను సెలవులకు చిత్తూరు రావటం లేదు. కారణం, అర్ధవార్షిక పరీక్షా పేపర్లను దిద్ది అప్పగించాకే ఊళ్లకు వెళ్లాలని మా ప్రధానాచార్యులు గట్టిగా చెప్పారు. ఆ ప్రకారం దిద్ది ఇవ్వటానికి రెండురోజులు పడుతుంది. ఇక మిగిలింది ఐదు రోజులు! ఆ ఐదురోజుల్లో అక్కడికొచ్చి తిరిగి రావటానికే  రెండురోజులు సరిపోతాయి. మిగతా మూడురోజుల కోసం నేను అంత దూరం డబ్బు ఖర్చుపెట్టుకుని రావాలా అని ఆలోచిస్తున్నాను.

అంతేకాదు, ఈ సంక్రాంతి సెలవులలో నేను వెయ్యిస్తంభాల గుడి, మహంకాళి దేవాలయం, భద్రాచలం, రామప్పగుడి, పర్ణశాల మొదలైన ప్రదేశాలకంతా వెళ్లాలనుకుంటున్నాను. తర్వాత ఇలాంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చని భావిస్తున్నాను.. కనుక నాకోసం సంక్రాంతి సెలవులకు ఎదురుచూడవద్దని కోరుతున్నాను.

ఇట్లు,

రాఘవ.

రాఘవ అనుకున్నట్టే.. సంక్రాంతి పండగనాడు భద్రాచలం వెళ్లాడు.

పండుగరోజు ఎక్కువ రద్దీ ఉండదని భావించి స్వామి దర్శనానికి వెళ్లాడు. అతను అనుకున్నట్టే ఆ దినం భక్తులు పలుచగా ఉన్నారు.

గర్భగుడిలోని శ్రీరామచంద్రుని విగ్రహం ముందు నిలబడి తనివితీరా దర్శనం చేసుకున్నాడు.

‘రామో విగ్రహవాన్‌ ధర్మః సత్య ధర్మ పరాక్రమః’ అన్న మహితోక్తి అక్షర లక్షలు. ఇలలో ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించిన మహితాత్ముడు ఒక్క శ్రీరాముడే కనిపిస్తాడు. మాటకోసం, తండ్రి మీదున్న మమత కోసం కఠినమైన అరణ్యవాసం చెయ్యటం ఆ రాముడికే చెల్లుతుంది! ఆ కోదండరాముని చెంతనున్న దేవేరి సీతమ్మ, భర్త అడుగుజాడల్లో నడిచి సహధర్మచారిణి అనిపించుకున్నది.

చేతులు జోడించి ఆ దేవతా మూర్తులనే కళ్లార్పకుండా చూడసాగాడు. ఎంతటి రమణీయ కమనీయ దృశ్యం.  స్వామివారు సుఖాశీనులై మందహాసంతో భక్తులకు దర్శనమిస్తుంటే, అమ్మ సీతమ్మ స్వామివారి ఎడమ అంకపాళిపై అమరి అర్ధనిమీలిత నేత్రాలతో భక్తి పారవశ్యాన్ని కలిగిస్తున్నది. సీతమ్మకు ఎడమవైపున లక్ష్మణుడు సేవాతత్పరుడై నిలబడ్డ తీరు అమోఘం.

కానీ, ఆశ్చర్యం! రామభక్తుడైన హనుమంతుడు ఏడీ? కనిపించడే! మారుతి లేని రఘురాముడా?

ఏ కోదండరాముని గుడిలోనైనా స్వామి పాదాల చెంత భక్తితో వినమ్రుడై ఉండే హనుమే దర్శనమిస్తాడు కదా?! మరి ఇదేమిటీ? హనమంతుడు కనిపించడే!

బహుశా ఇదే భద్రాచల దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమో?! మరెక్కడా ఇలాంటి మూలవిరాట్టులు కనించరు.

ఔనూ.. ఆ రఘురామునికి నిజమైన భక్తుడుగా ఎవరిని చెప్పాలి? అంజనీ పుత్రుణ్ణా? శబరినా? రామదాసునా?

అరణ్యవాసంలో కలిసిన హనుమ, దాశరథి బాధను అర్థం చేసుకుని, లంకకు లంఘించి వెళ్లి సీతమ్మజాడను కనిపెట్టటమే కాదు, రావణ సంహార సమయంలోనూ రామునికి భాగస్వామే అయ్యాడు. దీన్నంతా రామునిపై గల భక్తి కాదని చెప్పగలమా?

రాముని రాకకోసమే ప్రాణాలను ఉగ్గబెట్టుకుని ఎదురుచూపులతో గడిపిన శబరి, ఆయన రాకతో నిలువెల్ల పులకించిపోయింది. ఇంటికొచ్చిన అపురూప అతిథైన తన స్వామికి తినడానికి పండ్లను పళ్లెంలో పెట్టి, బాగున్నవాటినే స్వామి భక్షించాలని ముందుగా తాను రుచి చూసి, ఆనక వాటిని ఆయన అరచేతిలో పెట్టింది.

ఆమె కళ్లల్లో కనిపించే భక్త్యానురాగాలకు స్వామి కరిగిపోయాడే కానీ అది ఎంగిలి అని అసహ్యించుకోలేదు. అంతటి నిష్కల్మషమైన శబరి భక్తిని తేలికచెయ్యగలమా?

ఉద్యోగరీత్యా పోగుచేసిన రొఖ్ఖాన్ని ఖజానాలో జమ చెయ్యకుండా నీలమేఘశ్యాముని దేవాలయ జీర్ణోద్ధరణ కోసం వెచ్చించి, కటకటాల పాలై, కడకు కళ్లను సైతం పోగొట్టుకుని గుడ్డివాడైన రామదాసు భక్తిని తక్కువచేసి చెప్పగలమా?

ఇలా రాఘవ ఆలోచిస్తూ.. దేవాలయం నుండి బయటికొచ్చి అక్కడున్న మంటపంలో ప్రశాంతంగా కూర్చున్నాడు.

ఆలోచిస్తే వీళ్లందరికన్నా నిజమైన గొప్ప భక్తుడు కోదండరాముని సోదరుడైన లక్ష్మణుణ్ణే చెప్పాలేమో!

శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే తానూ వస్తానని చెప్పినపుడు, రాముడు వారించినా, అన్న ఎక్కడుంటే తానూ అక్కడే ఉంటానని, అతనికి సేవ చెయ్యటమే తన పరమావధి అని చెప్పి బయలుదేరటం మూర్ఖత్వమనిపించుకోదు. భక్తి అనే చెప్పాలి.

కైక దుర్బుధ్దితో రాముణ్ణి అరణ్యవాసం చెయ్యాలని కోరుకుంది.

కానీ, లక్ష్మణుడు అకారణంగా అరణ్యవాసానికి వెళ్లటం అతనికి తన అన్న మీదున్న భక్తిప్రపత్తుల్ని తెలియజేస్తుంది.

కనుక నిజమైన రామభక్తుడు లక్ష్మణుడనే చెప్పాలేమో!

ఇలా ఆలోచిస్తుంటే.. కన్యాకుమారిలో బాబాయ్‌ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి రాఘవకు.

“బాబాయ్‌, మీకు ఏ గ్రంథం అంటే ఇష్టం? భారతమా, రామాయణమా లేదూ ఇంకేదైనా పురాణ గ్రంథమంటే ఇష్టమా? చెప్పండి బాబాయ్‌!” అని ఒకరోజున రాఘవ, మాధవరెడ్డిని అడిగాడు.

“అనుమానం లేదు, రామాయణమే! అందుకు చాలా కారణాలే ఉన్నాయి. రామాయణంలో లేని అంశమే లేదు.

ఒక మంచి తండ్రీకొడుకులు, ఒక ఆదర్శ భార్యాభర్తలు, ఒక అపూర్వ అన్నదమ్ములు, గొప్ప గురుశిష్యులు, నిజమైన ప్రాణస్నేహితులు.. ఇలా అన్ని రకాల బంధుత్వాలకు రామాయణాన్ని ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.

యాగసంరక్షణార్థం విశ్వామిత్రుడు, రాముణ్ణి తనవెంట పంపమని కోరినపుడు.. దశరథునికి రాముడు ఒక ముక్కుపచ్చలారని తనయుడుగానే కనిపించాడు కానీ ఒక వీరుడుగా కనిపించలేదు.

కైక మాటను కాదనక దాన్ని తన తండ్రి ఆజ్ఞగా భావించి రాముడు అరణ్యవాసాన్ని ఆనందంగా స్వీకరిస్తే, కొడుకు తననుండి దూరమయ్యాడన్న దిగులుతోటే ప్రాణాలు విడవటం దశరథునిలోని అలవికాని పుత్రవాత్సల్యాన్ని తెలుపుతుంది. ఇంతకన్నా గొప్ప తండ్రీకొడుకులు ఇంకెక్కడైనా ఉంటారా?

రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతూ సీతను అయోధ్యలోనే ఉండమన్నప్పుడు.. రాముడులేని అయోధ్యలో తాను ఒక్కక్షణం కూడా ఉండలేననీ, రాముడు ఎక్కడుంటే అదే తనకు అయోధ్య అని అతని వెంట సంతోషంగా బయలుదేరిన సీతకన్నా భర్తను బాగా అర్థంచేసుకున్న ఇల్లాలు ఈ భూమ్మీద ఇంకెవరైనా ఉంటారా? కష్టాలలోనూ సుఖాలలోనూ కలిసి చేదోడువాదోడుగా ఉన్న ఆ భార్యాభర్తల్ని ఆదర్శ దంపతులుగా మనం పరిగణించకుండా ఉండగలమా?

లక్ష్మణుడే కాదు ఆఖరుకు భరతుడు కూడా గొప్ప సోదరుడుగానే చెప్పాలి.

తండ్రి చనిపోయాడని తెలిసి అయోధ్యకు వచ్చిన భరతునికి తల్లి పన్నిన దుష్ట పన్నాగం వల్ల తన అన్న అడవుల పాలయ్యాడని తెలుసుకుని, రాముడి చెంతకు వెళ్ళి అయోధ్యకు తిరిగి రమ్మని ప్రాధేయపడతాడు. తండ్రికిచ్చిన మాటను జవదాటటం ఏ కొడుక్కీ మంచిది కాదని చెప్పి రాముడు అయోధ్యకు రానంటాడు. అయితే తానూ సింహాసనాన్ని అధిష్ఠించనని తెలిపి రాముడి పాదుకల్ని తీసుకెళ్లి పట్టాభిషేకం చేసి పద్నాలుగేళ్లు అతనూ అయోధ్యకు బయటే అరణ్యవాసం చేస్తాడు. ఇంతకన్నా గొప్ప సోదరుడు ఇంకెవరుంటారు?

యాగసంరక్షణార్థం రామలక్ష్మణుల్ని తన ఆశ్రమానికి తీసుకెళుతూ దారిలో వాళ్లకు సరైన మార్గదర్శకాన్ని, ఎన్నో విలువైన ఆయుథాలను, రాముని పూర్వీకుల చరిత్రను తెలియజేసి రాముణ్ణి ఒక చక్కటి శిష్యుడుగా తీర్చిదిద్దిన ఘనత గురువైన విశ్వామిత్రునిది కాదనగలమా?

శ్రీరామునితో సుగ్రీవుని మైత్రి అప్రతిహతంగా కొనసాగింది. స్నేహధర్మం కోసం తన వానరసైన్యాన్ని మొత్తం ఏకతాటి మీదికి నడిపి రాముడు చేసిన యుద్ధంలో సహకరించాడు. సుగ్రీవుడంతటి గొప్ప స్నేహితుడు రామునికి లభించటం అదృష్టం కాదా.

ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణంలో లేని అంశమే లేదు. అందుకే నాకు రామాయణం అంటేనే ఎంతో ఇష్టం.” అని చెప్పి ముగించాడు మాధవరెడ్డి.

ఆనాడు ఆయనిచ్చిన వివరణకు ఎంతో సంతోషించాడు రాఘవ.

అవన్నీ గుర్తుకొచ్చి సంతృప్తిగా నిట్టూరుస్తూ.. లేచి పర్ణశాలను దర్శించటానికి బయలుదేరాడు రాఘవ.

36. మాతృ దేవోభవ!

ఫిబ్రవరి నెల!

ఎండలు మాడ్చేస్తున్నాయి. పాఠశాల ముందు భాగాన కానగ, వేప, పాఠశాల వెనక తైలంచెట్లు ఉన్నప్పటికీ ఎండల్ని తట్టుకోవటం కష్టంగా ఉంది. పైగా పాఠశాల ముందున్న మైదానం ఎండ వేడిమిని రెండింతలు చేసిందనే చెప్పాలి.

వేడిగాలులు వీస్తుంటే ఆ సెగకు ఒళ్లంతా చెమటలు కమ్మేస్తున్నాయి. బట్టలన్నీ తడిచి ముద్దవుతున్నాయి. దాహానికి ఎన్ని మంచినీళ్లు తాగుతున్నా నాలుక పిడచకట్టుకు పోతోంది. మధ్యాహ్నం ఏమీ తినబుద్ధి కావటం లేదు. నీళ్లు తాగుతూ ఉండిపోదామా అనిపిస్తోంది. ఒంటేలు రావటం కూడా చాలా కష్టంగా ఉంది.

ఒకరోజు ఉదయం ఐదుగంటలు కావస్తున్నా రాఘవ మాత్రం పడకనుండి లేవలేదు. ‘ఆచార్జీ ఇంకా నిద్ర లేవలేదు, ఎందుకు నిద్ర చెడగొట్టటం, నిద్రపోనీ’ అనుకుని.. పదవ తరగతి పిల్లలు మిగతా విద్యార్థులను లేపి అధ్యయనం తరగతిని చూసుకుంటున్నారు.

ఆ తర్వాత అందరూ యోగా క్లాసుకు మైదానంలోకి వెళ్లినా రాఘవ మాత్రం లేవలేదు. అసలు కళ్లే తెరవలేదు.

చల్లా రవి రాఘవ దగ్గరికెళ్లి నిద్రలేపే ప్రయత్నం చేశాడు. చేతిని పట్టుకుని కుదిపి చూశాడు. మెల్లగా మూలుగు వినిపించింది కానీ, రాఘవ మాత్రం లేచి కూర్చోలేకపొయ్యాడు.

ఎందుకో వాడికి భయమేసి వెళ్లి మోహనరావుకు చెప్పాడు.

మోహనరావు గబగబా వచ్చి రాఘవను నిద్రలేపే ప్రయత్నం చేశాడు. నుదుటిమీద చెయ్యి పెట్టి చూశాడు. వేడిగా తగిలింది. జ్వరం కాస్తున్నట్టుగా ఉంది. ‘సరే, పడుకోనీలే’.. అనుకుని అతను వెళ్లిపోయాడు.

అందరూ స్నానాలూ అవీ కానిచ్చి, అల్పాహారం కూడా ముగించి తరగతులకు వెళ్లిపొయ్యారు.

వంటమాస్టరు వెంకటయ్య రాఘవకోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఏంటీ ఆచార్జీ ఉదయం అల్పాహారానికి కూడా రాలేదు. అసలు మనిషే కనిపించలేదు. ఏమై జరిగుంటుంది?’ అనుకుంటూ వంటగదిలోనే కూర్చుని ఉన్నాడు.

ఈలోపు అంకయ్య భార్య వంటగదిలోకి అడుగుపెట్టింది.

“ఏమ్మా, రాఘవగారు ఎందుకో ఈవేళ ఇటువైపే రాలేదు. వెళ్లి చూసిరా పో. అట్లే, మధ్యాహ్నం ఏం వండాలో కూడా కనుక్కొని రా.” అంటూ ఆమెను పురమాయించాడు వెంకటయ్య.

అంకయ్య భార్య రాఘవ ఉన్న నిలయానికి వెళ్లింది.

గుమ్మంలో అడుగుపెడుతుండగానే రాఘవ చిన్నగా మూలుగుతున్న శబ్దం వినిపించింది. అర్థంగాక దగ్గరికెళ్లి అతణ్ణి లేపే ప్రయత్నం చేసింది.

ఎందుకో అతని ముఖంలోకి చూసి ఉలిక్కిపడిరది.

ముఖంలో అక్కడక్కడా చిన్నచిన్న ఆవగింజలంత బొబ్బలు కనిపించాయి. అనుమానంతో పైనున్న చొక్కా బొత్తామును తీసి చాతీకేసి చూడగానే ఆమెకు అవేమిటో రూఢీ అయిపోయింది.

చొక్కాను సర్ది లెంపలేసుకుంటూ వడివడిగా వెంకటయ్య దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి ప్రధానాచార్యుల దగ్గరికి వెళ్లి, “ఆచార్జీ, రాఘవగారికి అమ్మోరు పోసినట్టుంది. పైగా జ్వరంతో మూలుగుతున్నారు. ఆయనకిప్పుడు ఏకాంతమూ, ప్రశాంతతా అవసరం. ఒక మనిషి ఆయన్ను శ్రద్ధగా చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో పిల్లలమధ్య ఆచార్జీని ఉంచటం అంత మంచిది కాదు. అది పిల్లలకు సోకితే ప్రమాదం.” అంటూ చెప్పాడు వెంకటయ్య.

ఆలోచనలో పడ్డారు ప్రధానాచార్యులు.

“ఆచార్జీ, రాఘవగారిని మా గదిలో ఉంచుదాం. నేను దగ్గరుండి ఆయన్ను చూసుకుంటాను. అక్కడికి పిల్లలు రాకుందా మీరు చూడండి.” చెప్పింది అంకయ్య భార్య. ఆ ఆలోచన సరైనదిగానే అనిపించింది ప్రధానాచార్యులకు. అది తప్ప ఇక వేరే మార్గమేదీ ప్రస్తుతానికి కనిపించలేదు.

“అలాగే చేద్దాం..” అన్నారాయన.

“ఆచార్జీ, నేనువెళ్లి మా గదిని శుభ్రంచేసి ఆయన్ను పడుకోబెట్టటానికి అనువైన పడకను ఏర్పాటు జేస్తాను. పదినిమిషాలు అయినంక ఆచార్జీని ఎంటబెట్టుకుని రండి.” అని చెప్పి తన గదికేసి చరచరమంటూ నడుచుకుంటూ వెళ్ళింది.

పది నిమిషాలాగి ఇద్దరూ రాఘవ చేతుల్ని చెరొకరి భుజంమీద వేసుకుని నడిపించుకుంటూ అంకయ్య గదికి తీసుకెళ్లి నేలమీద పరిచి ఉన్న తెల్లని చీరమీద పడుకోబెట్టారు.

“వెంకటయ్యా.. కొంచం వేపాకుంటే తీస్కరావా? అలాగే ఒక గుండుజెంబులో కొంచం పసుప్పొడి కలిపి తీస్కచ్చివ్వు.” అంటూ అతనితో చెప్పింది.

ఈలోపు గది లోపలికి గాలి బాగా వీచేటట్టుగా గుమ్మం తలుపుల్ని బార్లా తెరిచింది. కిటికీ తలుపుల్ని కూడా తెరిచింది. రెండు పాత చీరల్ని నీళ్లల్లో తడిపి ఒకదాన్ని గుమ్మానికి అడ్డుగా, మరొక దాన్ని కిటికీకి అడ్డుగా తెరలాగా కట్టింది.

ఇప్పుడు బయటినుండి వీచే గాలి కాస్త చల్లగా ఒంటికి తగిలేసరికి కళ్లు తెరిచి చూశాడు రాఘవ.

ఈలోపు వెంకటయ్య తెచ్చిన వేపాకుల్లో కొన్ని రెమ్మల్ని విరిచి ఇంటి గుమ్మానికున్న చూరులోకి చెక్కింది. మూడు రెమ్మల్ని పసుపునీళ్ల చెంబులో ముంచింది. మిగిలిన వేపాకును రాఘవ చుట్టూ అక్కడక్కడా ఉంచింది.

కళ్లు తెరిచి చూస్తున్న రాఘవతో “ఆచార్జీ.. ఏమైనా తింటరా?” అని ఆత్మీయంగా అడిగింది.

వద్దు అన్నట్టుగా తలూపాడు. “అవును గిసుమంటి సమయంలో ఏమీ తినాలనిపించదు, నోరు సేదుగా ఉంటది.”

“పోనీ ఏమైనా తాగుతరా?” అని మళ్లీ అడిగింది. అలాగేనన్నట్టుగా తలూపాడు రాఘవ.

వంటశాలకు వెళ్లి గ్లాసులో కొంచెం మజ్జిగా ఉప్పూ వేసి కలిపి రాఘవ దగ్గరికొచ్చి నోట్లో కొద్దికొద్దిగా వొంపింది.

రాఘవకు అమ్మవారు సోకిందనీ, ఎవరూ ఆ గదివైపు వెళ్లకూడదని విద్యార్థులకు ఆజ్ఞలు జారీచెయ్యటం జరిగింది.

పిల్లల బట్టలుతకటం పూర్తిచేసి తమ గది దగ్గరకొచ్చాడు అంకయ్య.

అతనికి తెల్లవారి జరిగిన విషయం తెలియదు.

“ఇగ్గో ఆగాగు, గాపాట్నే గింట్లోకి వొచ్చేబోతావు. రాఘవ ఆచార్జీకి అమ్మోరు పోసింది. గింట్లోకి వొచ్చే ముందుగాల బయటున్న పసుపునీళ్లను తలమీంద సల్లుకోని రావాలె, తెల్సిందా?” అనగానే అంకయ్య అలాగే అంటూ పసుపునీళ్లు తలమీద చల్లుకుని లోపలికొచ్చాడు.

రాఘవను చూసి చిన్నగా నవ్వాడు. రాఘవ నవ్వే ప్రయత్నం చేశాడు, కానీ నీరసంతో నవ్వలేకపోయాడు.

“ఎట్టుండే మనిషి, ఒగ దినానికే ఎట్టయిపోనారు. ఏం గాదులే ఆచార్జీ, నయమైపోతుందిలే!” ఓదార్పుగా అన్నాడు.

ఆ సాయంత్రం మోహనరావు ఊళ్లోకెళ్లి నాలుగు లేత కొబ్బరి బోండాలను కొనుక్కొచ్చాడు. అంకయ్య గదికొచ్చి, చెంబులోని పసుపునీళ్లు తలపై చల్లుకొని లోపలికొచ్చి, వాటిని రాఘవ పక్కన పెట్టి, “దీన్ని తాగించమ్మా! కాస్త చల్లగా ఉంటుంది.” అన్నాడు.

ఆ మరునాడు మరింత ఎక్కువైంది రాఘవకు. వీపంతా ముత్యాల్లా ప్రాకిపోయింది. జ్వరం కూడా ఎక్కువైంది.

అంకయ్య భార్య రాఘవ దగ్గరే ఉండిపొయ్యింది. వంటశాలకేసి అస్సలు వెళ్లలేదు.

అంకయ్య పిల్లల బట్టలు ఉతకటానికి వెళ్లకుండా ఆమె బదులు వెంకటయ్యకు సహాయకారిగా వంటశాలలోనే ఉండిపొయ్యాడు.

ఆమె వేపాకును ఇంట్లో అక్కడక్కడా పెట్టి, పసుపునీళ్లను ఇల్లంతా చల్లింది.

రాఘవ పక్కనే కూర్చుని విసనకర్రతో విసర సాగింది. రేగే మంటకు తట్టుకోలేక విలవిల్లాడసాగాడు రాఘవ.

ఒక బట్టను నీళ్లల్లో ముంచి నుదురంతా తుడిచింది. కొద్దిగా వేపాకును నూరి ఆ పుండ్లమీద అక్కడక్కడా పెట్టింది.

ఆ మధ్యాహ్నం ఒఠి మజ్జిగ అన్నం మాత్రం అతనికి తినిపించింది. నాలుగు ముద్దలు తిని ఆపైన తినలేకపొయ్యాడు.

ఆ సాయంత్రం.. ఆమె టీ తాగటానికి వంటశాలకు వెళ్లినట్టుంది. పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు.

గుమ్మం దగ్గర ఎవరో కదిలినట్టుగా అనిపించి కళ్లు తెరిచి చూశాడు రాఘవ.

ఎవరో తలుపుకు ఆనుకుని తలను మాత్రం లోపలికి పెట్టి చూస్తున్నారు.

“ఎవరూ?..” రాఘవకు గొంతు పెగల్లేదు. ఈసారి మరింత బాగా కనబడింది ఆ ముఖం.

అక్కడున్నది చల్లా రవి అని గ్రహించాడు. అతణ్ణి రమ్మన్నట్టుగా చేతిని పైకెత్తి పిలిచాడు.

కానీ అతను గది లోపలికి అడుగుపెట్టకుండా గుమ్మం దగ్గరే ఆగిపోయి రాఘవను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

“ఆచార్జీ, ఏమైంది మీకు, జొరమా? పైకి లెగలేరా..” అంటూ వాడు అక్కడే కూర్చున్నాడు.

“ఊ.. ఏడవకు. నాకేం కాలేదు. ఇంకో రెండు రోజుల్లో మన నిలయానికి వచ్చేస్తాగా?”

“గిప్పుడే వొచ్చేయండీ ఆచార్జీ.” అన్నాడు వాడు ఆప్యాయంగా.

“నేనొచ్చేస్తే, అది మీకందరికీ అంటుకుంటుంది. అందుకనే నేను అక్కడికి రాకుండా ఇక్కడే ఉంటున్నాను. నాకు నయమై పోగానే వచ్చేస్తాగా.” అని రాఘవ మెల్లగా అన్నాడు.

ఈలోపు అంకయ్య భార్య వస్తున్నట్టుగా అలికిడయ్యింది. చల్లా రవి లేచి నిశ్శబ్దంగా పిల్లిలా నక్కుతూ చెట్టు చాటుకెళ్లి నిలబడ్డాడు. ఆమె పసుపునీళ్లు చల్లుకుని ఇంట్లోపలికి అడుగుపెట్టగానే రవి చల్లగా అక్కణ్ణించి జారుకున్నాడు.

టీచర్లు ఒక్కొక్కరూ వాళ్ల వాళ్ల ఖాళీ సమయాల్లో వచ్చి రాఘవను పలకరించి వెళుతున్నారు.

ఎనిమిది రోజులకు కానీ తగ్గలేదు అమ్మోరు.

బాగా నమ్మకం కుదిరాక ఆమె ఒక పాత్ర నిండుగా నీళ్లు పోసి ఎండలో పెట్టి అందులో వేపాకు వేసింది.

ఆ మిట్టమధ్యాహ్నం రాఘవను మెల్లగా నడిపించుకుంటూ వెళ్లి బయటున్న ఒక రాతిమీద కూర్చోబెట్టి ఎండకు  వేడెక్కిన నీళ్లతో అతనికి స్నానం చెయ్యించింది. అలా మొదటి తలంటు స్నానం పూర్తి అయ్యింది.

ఇంకా రెండు తలకలు పొయ్యవలసి ఉంది!

ఇప్పుడు రాఘవ కాస్త లేచి కూర్చోగలుగుతున్నాడు. కానీ అతనిలో అమ్మోరు ఇంకా పూర్తిగా దిగిపోలేదు.

మరునాడు ఉదయం.. అంకయ్య పిల్లల బట్టలు ఉతకటానికి కెనాల్‌ దగ్గరికి వెళ్లిపోయాడు.

అతని భార్య స్నానంచేసొచ్చి గుమ్మం బయటే బట్టలు మార్చుకోసాగింది.

అలికిడికి కళ్లు తెరిచి ఆమెను చూసి వెంటనే ఠక్కున కళ్లు మూసుకున్నాడు రాఘవ.

‘అయ్యో భగవంతుడా? ఎంత కష్టమొచ్చింది ఆమెకు? ఆమె ఒక స్త్రీ! పరాయి స్త్రీ!! మరుగున బట్టలు మార్చుకోవాలి. కానీ తాను ఇంట్లో ఉన్నానని ఆరుబయటే గబగబా బట్టలు మార్చుకుంటోంది. తనవల్ల ఆమెకెంత ఇబ్బంది? కానీ.. దాన్ని పట్టించుకోకుండా ఆమె తనకెందుకు ఈ సపర్యలన్నీ చేస్తోంది? తనకూ ఆమెకూ మధ్య ఏం సంబంధం ఉందనీ? ఏ సంబంధమూ లేకపోయినా ఎవరికైనా సేవ చెయ్యగలిగేది ఒక్క తల్లి మాత్రమే. ఔను! ఆమె తనకు తల్లి లాంటిదే. ఆ తల్లికి తను ఏమిచ్చి ఈ రుణం తీర్చుకోగలడు? ఆమె పాదాలకు నమస్కరించటం తప్ప!’ అని మనసులోనే ఆమె పాదాలకు ప్రణమిల్లాడు రాఘవ.

అప్పుడతని కనుకొలకుల్లో నుండి కన్నీళ్లు యథేచ్ఛగా కిందికి జారిపోసాగాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version