Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎదుగుదలే గమ్యంగా సాగే నవల ‘జీవితమొక పయనం’

[శ్రీ జిల్లేళ్ళ బాలాజీ గారి ‘జీవితమొక పయనం’ అనే నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

మెరికా 38వ ఉపాధ్యక్షుడు హ్యూబర్ట్ హెచ్. హంప్రీ ఓ సందర్భంలో అద్భుతమైన మాటలు చెప్పారు.

“If there is dissatisfaction with the status quo, good. If there is ferment, so much the better. If there is restlessness, I am pleased. Then let there be ideas, and hard thought, and hard work. If man feels small, let man make himself bigger.”

ఈ మాటలు శ్రీ జిల్లేళ్ళ బాలాజీ గారి ‘జీవితమొక పయనం’ అనే నవలలోని కథానాయకుడు రాఘవకి సరిగ్గా వర్తిస్తాయి. ఆశించిన ఉద్యోగం రాక, తండ్రి మీద ఆధారపడడం ఇష్టం లేక, ఉన్న ఊర్లోనే రకరకాల ఉద్యోగాలు చేసి, చాలీ చాలని జీతంలో తనకి నచ్చని విధంగా బ్రతుకుతాడు రాఘవ. తనలో రాజుకుంటున్న అసంతృప్తికి అడ్డుకట్ట వేయడానికి – తనెవరో ఎవరికీ తెలియని ప్రాంతానికి వెళ్ళిపోవాలని భావిస్తాడు. పేపర్లో వచ్చిన ఓ ప్రకటన అతన్ని ఆకర్షిస్తుంది. సేవాభావంలో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి గ్రాడ్యుయేట్లు కావాలని కన్యాకుమారి లోని వివేకానంద కేంద్రం వారిస్తారా ప్రకటనని. దరఖాస్తు చేస్తాడు. ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వస్తుంది. వెంటనే, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చిత్తూరు నుంచి బయల్దేరి కాట్పాడి వచ్చి, అక్కడ రైల్వే స్టేషన్‍లో కూర్చుని తండ్రికి ఉత్తరం రాస్తాడు. తనని వెతకొద్దని, జీవితంలో స్థిరపడ్డాకా తానే వస్తానని రాస్తాడు. హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి కన్యాకుమారి బయల్దేరుతాడు. జనరల్ కంపార్ట్‌మెంట్ కావడంతో, చాలాసేపటి వరకూ సీట్ దొరకదు. చివరికి ఓ ఉత్తరాది కుటుంబం కూర్చున్న చోట సీట్ దొరుకుతుంది. ఆ బృందంలోని కుర్రాడు అడిగిన మీదట రాఘవ తాను ఉద్యోగార్థియై కన్యాకుమారి వెళ్తున్నట్టు చెప్తాడు. మొదట్లో కసురుకున్నట్టుగా ప్రవర్తించినా ఆ కుటుంబంలోని పెద్దావిడ రాఘవకి రొట్టెలు పెట్టి, మంచి నీళ్ళు ఇస్తుంది. వెళ్తున్నది బతుకు తెరువు కోసమే కదా, పోనీ ఈ కుటుంబంతో వెళ్ళి వాళ్ళ దగ్గరే ఏదైనా పని చూసుకుందామా అని రాఘవ భావిస్తాడు. కానీ పెద్దావిడ ఒప్పుకోదు. “నువ్వు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళు. నీ ఆశలను సజీవంగా ఉంచుకో” అని చెప్తుంది.

కన్యాకుమారిలో దిగి వివేకానంద కేంద్రానికి వెళ్ళి రిసెప్షన్‌లో తనని తాను పరిచయం చేసుకుంటాడు రాఘవ. ఓ అమ్మాయి రాఘవ వివరాలన్నీ ఓ రిజిస్టర్‍లో రాసుకుని, ఆ పూటకి విశ్రాంతి తీసుకోమని, రాత్రి యోగా హాల్‍లో జరిగే సమావేశానికి తప్పక హాజరవమని చెప్తుంది.

వాళ్ళు చెప్పిన టైమ్‍కి యోగా హాల్‍కి వెళ్తాడు. అక్కడ ఇన్‌స్ట్రక్టర్ వారందరిని స్వాగతించి, నియమ నిబంధనలు వివరిస్తాడు. తరువాత అందరినీ పరిచయం చేస్తాడు. మొత్తం హాజరైన 109 మందిలో మధ్యప్రదేశ్ నుంచి అధికం 27 మంది వస్తారు. తెలుగువాళ్ళు రాఘవతో కలుపుకుని నలుగురు. వారిలో వరంగల్ నుంచి వచ్చిన మాధవరెడ్డితో పరిచయం పెంచుకుంటాడు. ఆయనని బాబాయ్ అని పిలుస్తాడు రాఘవ.  వారి తొలి పరిచయంలోనే మాధవరెడ్డి – రాఘవకి సందర్భానుసారం రామాయణంలో అవాల్మీకాలను వివరిస్తాడు. వివేకానంద కేంద్రం ఆధికారి రాఘవని ఇంటర్వ్యూ చేస్తూ ఎప్పుడైనా సమాజ సేవ చేశారా అని అడిగితే, ఏం ఆసక్తి లేదా అని అంటాడాయన. అప్పుడు రాఘవ గొప్ప సమాధానం చెప్తాడు. అక్కడున్న 21 రోజులలో రాఘవ, మాధవరెడ్డి అత్యంత ఆత్మీయులవుతారు. ఆ శిక్షణలో యోగాసనాలు, ఆధ్యాత్మికాంశాలు, దేశభక్తి గీతాలు తదితర అంశాలు నేర్చుకుంటాడు రాఘవ. ఓ రోజు ఉదయమే బాబాయితో వెళ్ళి సముద్రం వద్ద సూర్యోదయాన్ని చూసి పులకించిపోతాడు. మార్నాడు వివేకానంద కేంద్రం వాళ్ళు మొత్తం అందరినీ రాక్ మెమోరియల్‌కి తీసుకువెళ్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకూ అక్కడే గడుపుతారు. బాబాయ్ అప్పుడొక సంఘటన గురించి చెప్తారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ రాక్ మెమోరియల్ సందర్శనకి వచ్చినప్పుడు జరిగిన ఘటన అది. తరువాత ధ్యానమందిరంలోకి వెళ్తారు. వివేకానందుడు ధ్యానం చేసిన చోట ధ్యానం చేస్తారు. రాఘవ ధ్యానం కుదరక బయటకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కూర్చుంటాడు. అలల్ని చూస్తుంటే తన జీవితంలో ఎదురవుతున్న ఆటుపోట్లు గుర్తొస్తాయి. ఇంకో రోజు సమీపంలో ఒక పర్వతంపైకి ట్రెక్కింగ్‌కి తీసుకువెళ్తారు. అక్కడ ఉన్న ఓ గుహలో ఓ ముని తపస్సు చేస్తూంటాడని ఎవరో అంటే రాఘవ, బాబాయ్ చూస్తారు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. భోజనాలయి కాసేపు విశ్రాంతి తీసుకున్నాకా, వాళ్ళందరికి పర్వత కొస ప్రాంతానికి తీసుకువెళ్తాడు గైడ్. అక్కడ్నించి ఊరంతా కనిపిస్తుంది, సముద్రం కనిపిస్తూంటుంది. జాగ్రత్త చూస్తే మూడు సముద్రాలు కలవడం, మూడు రంగులలో ఉన్న నీటి ద్వారా సముద్రంలోని తేడాని గుర్తిస్తారంతా. ఈ త్రివేణి సంగమ వీక్షణం అందరికీ దొరకదనీ, మీరు పుణ్యాత్ములనీ గైడ్ చెప్తాడు. చివర్లో ఆ పర్వతం పేరు ‘మరుతువళ్ మలై’ చెప్పి, దాని విశిష్టతని చెప్తాడు. శిక్షణ ముగుస్తుంది.. కానీ కొన్ని కారణాల వల్ల టీచర్లుగా ఎవరిని ఎంపిక చేశారో తెలియజేయరు. అందరిని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపొమ్మని, ఎంపిక చేసినవారికి ఉత్తరం ద్వారా తెలియజేస్తామని అనడంతో, నిస్పృహకి లోనవుతాడు రాఘవ. అది చూసిన మాధవరెడ్డి, “జీతంతో అవసరం లేనప్పుడు, ఏ ఉద్యోగమైనా చేస్తావా?” అని అడిగి, “హైదరాబాద్ లోని వీణాపాణి విద్యానికేతనం వారిది వరంగల్‍లో ఓ ఆవాస విద్యాలయం ఉంది, దానికి మా బావగారే కార్యదర్శి, ఆయన్ను కలిసి, నీ ఉద్యోగం విషయం అడిగి చూస్తాను” అని చెప్తాడు. అయితే తాను ఆయన వెంట వరంగల్ వస్తానని రాఘవ అంటే, అలా వద్దని తాను ముందుగా ఆయనతో మాట్లాడి, ఉత్తరం రాస్తాననీ అప్పుడు రావచ్చని చెప్తాడు బాబాయ్. శిక్షణ పూర్తయి బయల్దేరుతుండగా, బాబాయ్ సూచన మేరకు ఆయనతో పాటు తిరువనంతపురం వెళ్ళి, పద్మనాభస్వామి ఆలయం దర్శించుకుంటాడు రాఘవ. అక్కడ్నించి స్టేషన్‌కి వచ్చి, మాధవరెడ్డి వరంగల్‍కి, రాఘవ కాట్పాడికి టికెట్లు తీసుకుంటారు. ప్రయాణం పూర్తవుతుంది. కాట్పాడిలో దిగి, బాబాయికి వీడ్కోలు పలికి, అక్కడ్నించి ఇంకో రైలు పట్టుకుని ఇల్లు చేరతాడు. కొడుకు ఇంటికి వచ్చినందుకు తల్లిదండ్రులు సంతోషిస్తారు. రెండు రోజుల పాటు మౌనంగా గడిపిన తరువాత, తాను కన్యాకుమారి వెళ్ళిన సంగతి అమ్మానాన్నలకు చెప్తాడు. వివేకానంద కేంద్రం గొప్ప సంస్థ అనీ, అక్కడ ఉద్యోగం వస్తే మంచిదేనని అంటాడు తండ్రి.

రాఘవ బాబాయ్ రాసే ఉత్తరం కోసం ఎదురుచూస్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత బాబాయ్ నుంచి ఉత్తరం వస్తుంది. ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారనీ, వీలైనంత త్వరగా వరంగల్ రమ్మని రాస్తాడు. ఏయే దుస్తులు ధరించాలో కూడా చెప్తాడు. ఆ ఉత్తరం చదువుకున్న రాఘవ తండ్రికి చూపిస్తాడు. ఆయన ఒప్పుకున్నా, తల్లి వద్దంటుంది. తండ్రి పెళ్ళి ప్రస్తావన తెస్తే రాఘవ ఒప్పుకోడు. ఎట్టకేలకు అన్నిరకాలుగా సన్నద్ధమై రైలైక్కి వరంగల్ చేరుతాడు. ఉత్తరంలోని సూచనల ప్రకారం మాధవరెడ్ది ఇల్లు చేరుతాడు. బాబాయ్ రాఘవని ఆప్యాయంగా పలకరించి, కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు. భోజనాలయ్యాక, ముందు తన బావగారైన రమణారెడ్డి గారింటికి తీసుకువెళ్ళి పరిచయం చేసి, అక్కడ్నించి, ఆయనతో కలిసి ఆవాస విద్యాలయం ఉన్న తామరగుంట అనే ఊరికి వెళ్తారు. రమణారెడ్ది రాఘవను ప్రధానాచార్యులకు పరిచయం చేసి, పాఠశాలకు ఉపయోగపడేలా మలచుకోమంటాడు. రాఘవకి 6, 7 తరగతి పిల్లలకు తెలుగు, సాంఘిక శాస్త్రం చెప్పమని చెప్తాడు ప్రధానాచార్యులు.

కొద్ది రోజులకే రాఘవ అక్కడి పిల్లలకీ, తోటి ఆచార్యులకి అలవాటు పడతాడు. పిల్లలకు అర్థమయ్యేలా సులువుగా పాఠాలు చెప్తాడు. బోధనా బాధ్యతలకి అనుగుణంగా భోజన విభాగపు బాధ్యతలు స్వీకరిస్తాడు. తన ప్రవర్తనతో, బోధనతో అందరి మన్ననలు పొందుతాడు. ఒకానొక ఉదంతంలో రాడికల్స్‌ తారసపడతారు రాఘవకి. రెండు రోజుల తర్వాత, పేపర్లో వచ్చిన ఓ వార్త ప్రధానాచార్యుడిని రాఘవని కంగారు పెడుతుంది. ఆ అర్ధరాత్రి సిఆర్‌పిఎఫ్ పోలీసులు ఆవాస కేంద్రానికి వచ్చి పిల్లల్ని నిద్రలేపి చెక్ చేస్తారు. తీవ్రవాదులు అక్కడికి వచ్చివెళ్ళారని తెలిసిందనీ, ఇకపై వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించవద్దని హెచ్చరించి వెళ్తారు. మూడు నెలల తర్వాత పాఠశాలకి సెలవులు ఇస్తే ఇంటికి వెళ్తాడు రాఘవ. ఓ రోజు సాయంత్రం శ్రీకర్ అనే మిత్రుడిని కలిస్తే, ఆత్మవంచన చేసుకుంటూ, ఆ చిన్న ఉద్యోగం ఎందుకు చేయడమని అంటాడతను. తనది ఆత్మవంచన కాదని, ఆత్మ పరిశీలన అంటాడు రాఘవ. ఈ ఎపిసోడ్ రాఘవ మనస్తత్వానికి, అతనిలో నిడిబీకృతమైన భావాజాలానికి అద్దం పడుతుంది. పెళ్ళి చేసుకోమని రాఘవని మళ్ళీ కోరతారు తల్లిదండ్రులు. వద్దని గట్టిగా చెప్తాడు. సెలవలు పూర్తవడంతో, మళ్ళీ తామరగుంటలో విధుల్లో చేరుతాడు.

ప్రత్యేక శిక్షణ నిమిత్తం రాఘవనీ, రాజారావనే మరో ఆచార్యుడిని హుజూరాబాద్ పంపుతారు. అయితే ఆ సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర గొడవలు జరగడంతో, శిక్షణాకార్యక్రమం రద్దవుతుంది. తమకు ఆతిథ్యమిచ్చిన ముస్లిం కుటుంబ సభ్యుల సహాయంతో, ఎలాగొలా తామరగుంట చేరుకుంటారిద్దరూ. రాఘవ ఉద్యోగంతో పాటు తన ప్రవర్తనని కూడా మలుచుకుంటూ ఆత్మసంతృప్తిని పొందుతుంటాడు. ఒకరోజు రాఘవకి అమ్మవారు పోస్తుంది. ఆవాసనిలయంలోని సహాయకుడి భార్య తల్లిలా అతనికి సేవలు చేస్తుంది. ఆమెకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటాడు.

హైదరాబాద్ కార్యాలయం కొత్త ఆచార్యులకిచ్చే శిక్షణకి రాఘవకి ఆహ్వానం వస్తుంది. ప్రధానాచార్యుల ప్రోత్సాహంతో రాఘవ హైదరాబాద్ వెళ్ళి శిక్షణలో పాల్గొంటాడు. అక్కడ అతనికి సంస్కృతం బోధించడంలో ట్రైనింగ్ ఇస్తారు, తరువాత పెట్టిన పరీక్షలో రాఘవ పాసవుతాడు. దాంతో హైదరాబాద్ పాఠశాలలోనే సంస్కృతం, తెలుగు అధ్యాపకుడిగా పోస్టింగ్ ఇస్తారు. తామరగుంటలో ఆచార్యులకీ, వరంగల్‍లో బాబాయికి వీడ్కోలు చెప్పి హైదరాబాద్‍లో చేరుతాడు రాఘవ. ఇక్కడ ఉండగా, రాఘవ తండ్రి చనిపోతాడు. ఊరెళ్ళి తండ్రికి అంత్యక్రియలు జరిపించి వస్తాడు. ఈలోపు హైదరాబాద్‍లో ఉంటున్న మాధవరెడ్డి కూతురు సురేఖ రాఘవపై ప్రేమ పెంచుకుని అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రెండు మూడు సార్లు ఆమెతో పాటు బయట తిరిగినా, ఆమె ఆంతర్యం గ్రహించి వద్దనుకుంటాడు రాఘవ. ఈలోగా ఊర్లో తల్లి కూడా జబ్బు చేసి చనిపోతుంది. సొంతూరు వెళ్ళిన రాఘవ ఇక హైదరాబాద్ రాడు. అక్కడే ఏదో ఉద్యోగం చూసుకోవాలనుకుంటాడు. చిన్నక్క ప్రోత్సాహంతో నీరజని వివాహం చేసుకుంటాడు. తిరుపతి వెళ్ళి ఉద్యోగం చూసుకుంటాడు. సొంతూరిలో ఇంటిపై అన్ని హక్కులని పూర్తిగా రాఘవకు ఇచ్చేస్తారు తోబుట్టువులు. ఇల్లు అమ్మకానికి పెట్టి, తిరుపతిలో చిన్న టీచరు ఉద్యోగంలో చేరుతాడు.  తొలిసారి గర్భం ధరించిన నీరజకి అబార్షన్ అవుతుంది. ఆ బాధ నుండి దృష్టి మరల్చుకోడాని నీరజ కూడా అదే స్కూల్లో టీచరుగా చేరుతుంది. ఎట్టకేలకు సొంతూరిలో ఇల్లు అమ్మకం జరిగి డబ్బు చేతికి అందుతుంది. రెండు లక్షలు బ్యాంకులో వేస్తాడు. భార్యకి నగలు కొనిస్తాడు. ఓ రోజు సోషల్ టీచర్ జయరాం ప్రోద్బలంతో అతని మిత్రుడికి లక్ష రూపాయలు వడ్డీకి అప్పుగా ఇస్తాడు. కాలక్రమంలో రాఘవ వడ్డీ వ్యాపారంలో దిగుతాడు. నీరజకి మళ్ళీ గర్భం దాల్చి కొడుకుని కంటుంది. వడ్డీ వ్యాపారంలో హేమాద్రి అనే బ్యాంకు ఉద్యోగి చేతిలో దారుణంగా మోసపోతాడు రాఘవ. మీరయ్య అనే పక్కింటి ఆయన ద్వారా ఓ పత్రికలో ఉద్యోగంలో చేరతాడు రాఘవ. మీరయ్య రాఘవ వద్ద తీసుకున్న అప్పులు తీర్చలేకపోతుంటాడు. నీరజ మరోసారి గర్భవతి అవుతుంది. రాఘవ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. కొన్నాళ్ళకి చిన్నక్క సలాహా మేరకు పీలేరుకి వెళ్ళిపోదామనుకుంటాడు. మీరయ్య తను తీసుకున్న డబ్బుకి బదులుగా ఆవుని ఇచ్చేస్తాడు. తరువాత కొన్నాళ్ళకి తిరుపతి చేరుతాడు రాఘవ. పాడి వ్యాపారం చేసి పైకొస్తాడు. పిల్లల్ని బాగా చదివించుకుంటాడు. జీవితపు చివరిదశలో ఎంతో తృప్తిని అనుభవిస్తాడు. ఇదీ నవల సారాంశం.

రాఘవలో తొలుత అసంతృప్తి ఉండేది. దాన్నుంచి బయటపడేందుకు అవకాశాలను వెతుక్కుంటాడు. మాధవరెడ్డి లాంటి మంచిమనిషి సాయంతో ఓ అవకాశం వస్తుంది. తన శ్రమతో, ప్రతిభతో సంబంధిత వ్యక్తుల్ని మెప్పించి ఆ సంస్థలోనే ఎదుగుతాడు. తర్వాత సురేఖ వ్యవహారంలో బాబాయి దగ్గర మాట పడకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్ వదిలేస్తాడు. అక్కడ్నించి ఎన్నో మలుపులు తిరిగిన రాఘవ జీవితం చేరాల్సిన గమ్యం చేరుతుంది. పాఠకులకు తృప్తినిస్తుంది.

ఇది రచయిత శ్రీ జిల్లేళ్ళ బాలాజీ తొలి స్వంత నవల కావడం విశేషం. సంచికలో 26 వారాల పాటు ధారావాహికంగా ప్రచురితమైంది. ఎదుగుదలే గమ్యంగా సాగిన జీవిత ప్రయాణమిది.

***

జీవితమొక పయనం (నవల)
రచన: జిల్లేళ్ళ బాలాజీ
ప్రచురణ: పార్వతి విశ్వం ప్రచురణలు
పేజీలు: 248
వెల: ₹ 300/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
జిల్లేళ్ళ బాలాజీ
9-535, ఓం శక్తి గుడి పక్క సందులో,
లింగేశ్వర నగర్, బైరాగిపట్టెడ,
తిరుపతి 517501
7382008979, 9866628639
gillella.balaji@gmail.com

~
శ్రీ జిల్లేళ్ళ బాలాజీ ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-gillella-balaji/

Exit mobile version