[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘జీవితం.. ఒంటరితనం ఒంటి స్తంభం మేడ!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అందరినీ దీక్షగా చూస్తున్నా..
ప్రతి మనిషి దిగులుగానే వున్నాడు!
అందరికీ..
ఎద లోయల్లో మంటలు
ఎగిసెగిసి పడుతున్నాయి!
ఆ మంటల తాలూకూ సెగలు
కళ్ళల్లో.. ‘లావా’లా
పొంగి పొర్లుతున్నాయి!
ఆప్యాయతానుబంధాల నడమ
అపార్థాల అడ్డగోడలు నిర్మితమై
ఒకరికి మరొకరు శత్రువులై
ఒంటరితనం ఒంటిస్తంభం మేడలో
ఏకాకి జీవితాన్ని అనుభూతిస్తూ
జీవితమంతా విషాదం చీకటిలో
బ్రతుకు బండిని భారంగా లాగుతున్నారు!
ఈ నగర వాటికలో
బ్రతుకంతా కలిసి నడుస్తారని
నమ్మిన సహచరులందరూ..
ఒక్క రొక్కరుగా
అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారు!
ఎన్నెన్నో వ్యయ ప్రయాసల కోర్చి
నిర్మించుకున్న బంధాల ఆశాసౌధం
రోజు రోజుకీ పగుళ్ళు బారుతోంది!
రేపటి రోజున శిధిలమై
కళ్ళ ముందే కూలిపోతే..!?
అందరూ పోయిన తర్వాత
మిగిలిపోయిన జీవితమంతా
దుఃఖాన్ని మోస్తూ బ్రతకాల్సిందే కదా!?
ఒంటరితనం వేదన
గుండె లోతుల నుండి వెలువడి
కళ్ళల్లో ఉప్పెనలా ప్రవహిస్తోంది!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.