Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం మేడీజీ..!!

[శ్రీమతి బి. కళాగోపాల్ రచించిన ‘జీవితం మేడీజీ..!!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]

నాన్న పోయినప్పటి నుండి వెంటాడే బతుకు భయం
అమ్మనోట “ఎందుకైనా మంచిదంటూ..” వల్లెవేసే పెద్ద బాలశిక్ష ఊతపదమైంది
ఎందుకైనా మంచిది కాలేజీ వదలగానే తిన్నగా ఇంటికే వచ్చేయమన్న
పెద్దరికం పరుగులు తీసే పరువానికి కంచెలు వేస్తే

ఎందుకైనా మంచిది మీ ఆయనకు ఎదురు చెప్పవద్దన్న హెచ్చరికల పర్వం
గడపదాటనీయని ముందర కాళ్ళ బంధమైంది
అందరితోటి జాగ్రత్తగా మసలుకోమంటున్న
నాలుగ్గోడల ఆదేశిక సూత్రాల మాటున
మదిగదిలో సునామీలా చెలరేగే నిరసనల్ని ఆవేదనల్ని
వ్యక్తం చేయనీయని మొహమాటం పరువు ప్రతిష్ఠలంటూ
రాజీల రాయబారం ఒప్పంద పత్రాల్లో
ఊపిరిని నొక్కిపట్టే
ఒత్తిడి కొండచిలువై చుట్టేసింది
ఎందుకైనా మంచిదన్న అర్థంకాని బ్రహ్మపదార్థాన్ని
బతుకు కవచంలా ధరించిన అమ్మ ముఖమెప్పుడు
దీనంగా దిగులుగా సాలెగూటిలో చిక్కుకున్న పురుగులా
జీవన్మరణ పోరాటంతో గిలగిల్లాడేది
నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత
కర్ణుడి చావుకు కారణాలున్నట్లు అమ్మను నోరెత్తనీయకుండా
చేసిన మెతకదనం
ఎందుకైనా మంచిదనే
మూసినగది చీకటి భయాన్ని నేర్పిన
వ్యవస్థీకృత రహస్యం
ముసుగుతెరలలో తన వ్యతిరేకతల్ని, ఇష్టాయిష్టాల్ని
ప్రకటించనీయని నిస్సహాయ మౌనంలో కాగి కాగి
త్రిశంకు స్వర్గంలో వేలాడి వేలాడి
ఏదీ తెగక నాని నాని
ఉబ్బిపోయిన బతుకు భయంతో అమ్మ పోయినపుడు
తనకివ్వబడిన సరళరేఖ లాంటి జీవితం
వాగ్వాదాలు లేని ప్రశాంతమైన సరస్సు లాంటి జీవితంలో
అణచిపెట్టుకున్న బానిసత్వం భగ్గుమంటున్న కోపతాపాలు ఆగ్రహావేశాలు
ఇవి ఇలాగే ఉండే జీవితమెలా అవుతుందని? ప్రశ్నిస్తూ..
ఫెళఫెళమని కపాలమోక్షం పొందాయి
లోపాలను, బలహీనతలను గుర్తించడానికి నిరాకరించే సంకెళ్ళమాటున
నేర్పిన ఎందుకైనా మంచిదన్న మాట..
ఎందుకూ మంచిది కాదని
ఎవరేమనుకున్నా ఎదురు చెప్పలేక
తగ్గి బతికే పిరికితనాన్ని జయించి
చిన్నప్పుడు ఇంటిపక్క అబ్బాయిలా జెండా మోస్తూ
తిరగబడితే పోయేదీ ఏమీలేదు బానిససంకెళ్ళు తప్ప అంటూ
చుట్టూ ఉన్న
కాసింత ‘జీవనాన్ని మేడీజీ’ చేసుకోవాలని
అతడు నేర్పిన పాఠాన్ని దిద్దుకుంటూ..
నాకు నచ్చనిది.. నచ్చలేదని
ఇప్పటికైనా చెప్పాలని లోపలి గొంతేదో
కొత్త పలుకు వల్లె వేస్తూ చిగురించసాగింది..!!

Exit mobile version