[ఝాన్సీ కొప్పిశెట్టి గారి ‘జీవితం అంచున..’ అనే నవలని సమీక్షిస్తున్నారు శ్రీమతి సత్యగౌరి మోగంటి.]
మొట్టమొదట ఝాన్సీ గారొక ధీర వనిత.
తరువాత ఝాన్సీగారు మంచి రచయితగా అందరికీ సుపరిచితమే. తనది వినూత్నమైన విశిష్టమైన రచనా శైలి.
“అప్పుడే పుట్టిన పసికందు పురిటి వాసనలా అప్పుడే ప్రెస్ నుండి పుట్టుకొచ్చిన కొత్త పుస్తకం వాసనా ఏదో మైమరపుకి లోను చేస్తుంది.. బిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నప్పటి తన్మయత్వమే పుస్తకాన్ని తొలుతగా స్పృశించినప్పుడూనూ…” ఇదీ ఆమె భావుకత.
కథనం కూర్పు నడక అన్నీ విశిష్టమైనవే. వాస్తవ సంఘటనలే అయినా వాటిని కథాత్మకంగా మలచేటప్పడు ప్రతి వాక్యంలోను ఆమె నైపుణ్యం కనబడుతుంది. ఆమె ప్రతిబింబిస్తుంది.
ఈ నవలలోని గాఢత (అన్న మాట సరిపోదు) మనకు అనుభూతిని ప్రసాదిస్తుంది.
ప్రతి సంఘటనను మనం చూడగలుగుతాం మనసుతో.
కథానాయకి, అమ్మ, సత్తి పండు, గంగ, పాలు పోసే మనిషి,స్నేహితుడు ఆపతుడు,ప్రేమికుడు అయిన రాఘవ. అన్ని పాత్రలు, విదేశాల్లో ఆమె నర్సింగ్ కోర్సు, తన గడ్డ మీద అమ్మ కోసం ఆరాటం పడే జానూ మనకు ఈ లోకంలో ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటారు.
ఇక ముఖ్యమైన పాత్ర రాఘవ.
ఇదేమిటీ ఈ వయసులో ఈ పైత్యం అనుకుంటారు. అన్ని బాధ్యతలు తీరి రెండవ దశలోకి అడుగుపెట్టిన వయసులో వెంపర్లాటలు, అసభ్యత ఉండవు. ఇప్పుడు జనించేది నిజమైన ప్రేమ.
మనుషులను దగ్గర చేసేది మొదట మాటలు. అతని ప్రేమను అలా వ్యక్తం చేయడం సహజం. రాఘవ మాటలు తనను ప్రేమలోకి జారిపడేస్తుంటే ఛఛ నేనేంటి..ఇలా అయిపోతున్నాను అనుకుంటూ మాట విననని మనసును హెచ్చరిస్తూంటుంది
తన అంతులేని ప్రేమ, కదిలిన మనసును గాంభీర్యంతో దాచేస్తుంది. సూర్యుణ్ని నల్ల మబ్బు కమ్మేసినట్టు.
ఈ మలి వయసులో నిరాశ, క్రుంగుబాటు లేకుండా మనలను గాఢంగా ప్రేమించే వాళ్లుండాలి. మనలను ఎంత ప్రేమించే పిల్లలు మనవలూ ఉన్నా కడవరకూ తోడుండే మనిషి ఉండాలి.
మన జీవితం మనది. అన్నీ మలుపులూ తిరిగి బాధ్యతలు తీరాక మనకంటూ మన గమ్యం, కొంత సమయం మిగుల్చుకోవాలి.
నిజమైన ప్రేమ రాఘవది. రెండో వసంతం కథానాయికని వరించడం ఆమె అదృష్టం.
అలుపెరుగని ప్రయాణం ఎన్నో అనుభవాలు,అనుభూతులు ఆమె లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండటం వలనేనేమో ఆమె వ్యక్తిత్వం, రచనలూ కూడా గుబాళిస్తాయి.
***
‘జీవితం అంచున..’ ఇది ఒక ఆత్మకథ.
ఆత్మకథ రాయాలంటే ధైర్యంతోపాటు నిజాయితీ కూడా ఉండాలి.
తన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, అనుభవాలు, ఆలోచనలు, భావోద్వేగాలను ఎంత సున్నితంగా మనముందుంచారో.
తన మూడు దేశాల ప్రయాణాల సంఘటనలను, తన ఆకాంక్షలు, బాధ్యతలు, ఎత్తుపల్లాలు, మంచి చెడులు అన్నీ నిజాయితీగా రాశారు.
నవల చదువుతుంటే అప్పుడప్పుడు పసిపాపలా అనిపిస్తారు. అంతలోనే ఎనలేని మెచ్యూరిటీ కనబడుతుంది.
***
‘జీవితం అంచున..’ నవల.
ఇది కథ కాదు జీవితం. ఏ కథ చదివినా ప్రేమలూ పెళ్లిళ్లు విడాకులు లేదా పిల్లలకు పెద్దలకూ అంతరాలు సంఘర్షణలు ఇవే. వీటికి మించిన సమస్యలున్నాయి, కథలున్నాయి.
ఒక ఒంటరి స్త్రీ ఆత్మకథ. తన కథ ఒక్కటే కాదు. ఇటువంటి చాలా మంది స్త్రీల కథ.
ఇది ప్రేమకావ్యం కాదు. తన ఒంటరి పయనం. త్రికోణ దారులలో ప్రయాణం.
అందులో కాస్తంత తడిసిన తన ఎద లోపలి సంఘర్షణ.
అనేక బాధ్యతలు, లంపటాలు ఉన్న ఒంటరి స్త్రీ ఎదుర్కొన్న అనేక విపత్కర పరిస్థితులు, మానసిక సంఘర్షణ, మైలురాళ్లు, తాత్విక చింతనలు, కలబోసిన రంగుల కథ.
చిన్న వయసులోనే వివాహం. దానికి అర్థం తెలిసేలోపు పిల్లలు. సుమారు నలభై వసంతాలకే భర్త వియోగం. అనేక సమస్యల నడుమ అదరక, బెదరక తన తల్లి కోసం, పిల్లల కోసం సాగించిన జీవనయానం.
~
జీవితం రెండు భాగాలు. 60 వరకూ ఒకటి. 60 నుండి పునర్జన్మ అనొచ్చు.
ఎందుకంటే బాధ్యతలు కాస్తంత తగ్గాక అప్పటి వరకూ కుటుంబం బాధ్యతలలో అలసిన ఇరువురు ఈ రెండవ ఫేజ్ లో ఒకరి కోసం ఒకరు బతుకుతారు.
అలాంటి ఈ ఫేజ్ లో గడ్డకట్టిన మేఘానికి చల్లగాలి తగిలినట్టు ప్రేమ తన మనసులో తిష్ట వేయడానికి చేసే
చిత్త శుద్దితో చేసే ప్రయత్నం. ఈ ప్రేమలో వెకిలితనం ఉండదు. కోరికలుండవు.
సప్తవర్ణాలకు మించిన రంగులుంటాయి. మరో కొత్త ప్రపంచం ఆవిష్కృతం అవుతుంది.
గాఢమైన ప్రేమకు లొంగనివారుండరు. ఈ నవలలో నాయకి స్పందన అద్భుతం. ఆ మోహానికి లొంగిపోతుంది. కానీ విజ్ఞతతో ఆలోచిస్తూ తన చైతన్యానికి ఆనకట్ట వేసుకుంటూంటుంది.
ఈ సంఘటనలు చదువుతుంటే.. మనకు దృశ్యాలై మనలను వెంటాడతాయి. ప్రేమ ఆకు సంపంగి పరిమళం. ఎక్కడ దాచినా దాగనిది. ఆ పరిమళం గుప్పుమన్నప్పుడల్లా మనసు విహంగమైపోతుంది నాయకికి.
ఆ ప్రేమ ముప్పిరిగొన్నప్పుడల్లా గుండె తడై గొంతుక లోకొచ్చినప్పుడు తెచ్చిపెట్టుకున్న అందమైన చిరుకోపాన్ని ప్రదర్శిస్తూంటుంది. ఒడుపుగా తన ప్రేమనంతా గుండె పొరలలో నిక్షిప్తం చేస్తూంటుంది.
నాయకుడి వర్ణన పొగడ్తలను లోలోపల ఎక్కడో నిద్రాణమై ఉన్న నిధిని తడుతూంటుంది. పాపం ఇన్నాళ్లూ బాధ్యతలనే మోస్తున్న తనను అత్యంత నిజాయితీతో ప్రేమిస్తున్న అతగాని వలపు గంధం తనను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నా కుటుంబం, పిల్లలు, సమాజం ఇవన్నీ ఏమనుకుంటాయోనన్న ఓ సన్నని భీతి తన లక్ష్మణ రేఖను దాటనీయదు.
ఒంటరియైన జీవితంలో ఉప్పెనలా అల్లుకుంటున్న బంధానికి మనసు మంచులా కరిగిపోతుంటే.. కరడుగట్టిన హృదయంతో బింకంగా మాటాడటం భలే దృశ్యమానం చేశారు రచయిత్రి.
ఈ దృశ్యమానాలన్నింటిలో నాయకి వ్యక్తిత్వం ఆకాశంలో తారకలా మెరుస్తుంటుంది.
అందుకే ఆమె జీవితం అంచున కాదు, నింగిలోని జాబిలిలా నిలిచింది.
అతని ప్రేమలో తను కర్పూరంలా కరిగిపోతున్నా ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తన ఆలోచనల విజ్ఞతను మరింత విశాలం చేసుకుంటూ అతని వలపు లోతులను కొలవడానికి ప్రయత్నిస్తుంది.
ఆ లోతును కొలవగలిగే పరికరాలు లేవని, ఆ ప్రేమ తల్లి మనసంత స్వచ్ఛమైనదని తెలుసుకుని తన నిర్ణయం మాత్రం ఎవ్వరూ తెలుసుకోలేనంత ఎదలోపల దాచిపెడుతుంది.
నిజమైన ప్రేమికుడు సులువుగా కనిపెట్టగలడు. అందుకే నాయకి అడిగిన ప్రశ్నలకు విసిగిపోక ప్రేమతోనే జవాబు ఇస్తుంటాడు. అటువంటి వలపుకు మురిసిపోకుండా ఎలా ఉండగలరు ఎవరైనా.
కానీ ఇలా అనడం మనకు చాలా సులభం. అది అనుభవించినవారికి సవాళ్లతో కూడుకున్నది. పైగా పక్కలో బల్లెంలా సమాజం.
ఇంతటి దుఖంలో మాలిన్యంలేని ఈ ప్రేమ మాధుర్యం ఆమెకో ఓదార్పు. మనసుకు ఉపశమనం.
తనని నిజాయితీగా ప్రేమించి ‘నీకోసం జీవితాంతం ఉంటాను’ పక్కనే అన్న అతని చేయి పట్టుకు ముందుకు నడవాలని.
ఝాన్సీగారు ఈ నవలా రచన సామాజిక స్పృహతో చేశారు.
సాహిత్య సృజన ఒక సామాజిక బాధ్యత.
అది గుర్తెరిగి చేసిన రచన.
అందుకే ఇటువంటి సాహిత్యం ఓ నదీ ప్రవాహంలా నిత్య నూతనంగా విరాజిల్లుతుంది.
***
రచన: ఝాన్సీ కొప్పిశెట్టి
పేజీలు: 214
వెల: ₹180.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/jeevitham-anchuna
కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.