ఓ మనిషీ,కంటిముందు
ఎదుగుతున్న మొక్కను చూడు
బోధపడుతుంది జీవిత సత్యం
విత్తునాటి నీరుపోసి వేచిచూడు కొద్దికాలం
మట్టిలోనుంచి వచ్చే చిగురును చూసినపుడు
కలుగును కదా ఎనలేని సంతోషం
కొమ్మలు రెమ్మలుగా విస్తరించినపుడు
మనకు తోచును ఏదో సందేశమిచ్చినట్టు
పూలు పూచి మనసును మురిపించును కొన్ని
ఆ పూలనుంచి పిందెలు కాచి కూరగాయలు పండ్లుగా మారును కొన్ని
విత్తును నాటి ప్రాణం పోసింది నేనే అని మురిసిపోతాము
మొక్కలను సంరక్షించి చీడపీడలనుంచి కాపాడి నపుడు
మన కన్న బిడ్డలనే పెంచినట్టు కలుగుతుంది ఆనందం
మొక్కలు మనకు ఆహారము ఇస్తాయి మంచి వాతావరణం
మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి మనకోసం ఎన్నో ఇస్తాయి
కన్నబిడ్డలు రెక్కలువచ్చి ఎగిరిపోయే పక్షులు వంటివారు అయితే
మొక్కలు మనతో ఉండి అనుక్షణం పలకరిస్తూ ఆనందం కలిగిస్తాయి
పుట్టుకనిచ్చే ప్రకృతి పాఠాలు నేర్పుతుంది
మనిషి మనుగడకు పరమార్ధం బోధిస్తుంది.
అందుకే మట్టిని ప్రకృతిని ప్రేమిద్దాం
పచ్చని తోటలో సేద దీరుదాం!
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.