Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవనగమనాలు

వేదనాభరిత గీతమేదో
గత జ్ఞాపకాల దొంతరలలో
నిప్పుకణికలు రాజేసింది
కలవరపు గుండె
పాతకలలను మరల తోడి
దుఃఖలిపిలో తిరగరాసి
మానని గాయాలపై ముల్లై పొడుస్తూ
వలయాలు వలయాలుగా
హృదయపు లోతులను స్పృశించి
విషాదం నింపుతోంది
ప్రశాంత మనఃసరస్సులో
దావాగ్నిజ్వలనం ఆరంభమై
వ్యాకులరాగపు వేణువు
శోకరాగాన్ని శృతి చేస్తోంది
వెలుగుమయమైన ఆకాశం
ఆకస్మాత్తుగా మబ్బుపట్టి
కన్నీళ్ళను వర్షిస్తోంది
మోడువారిన కొమ్మ చివర
ఒదిగి కూర్చున్న చిన్న పిట్ట
పల్లవి మరచిన పాటగా మూగదైంది
వ్యధాతరంగాలు తీరాన్ని ఢీకొని
నెమ్మదిగా వెనుదిరిగాయి
వెలుగుచీకట్లు జీవనగమనాలు
సంజె చీకటినాహ్వానిస్తేనే కదా
ఆనక వేకువ వేంచేసి సూర్యోదయయేది
వేదన రుచి చూస్తేనే కదా
వెన్నెలనాస్వాదించగలం.

Exit mobile version