[శ్రీమతి పద్మిని నాగరాజు గారి ‘Uriva Benkige Maiyella Bai’ అనే కన్నడ కథని అనువదించి ‘జీవనది’ పేరుతో అందిస్తున్నారు చందకచర్ల రమేశ బాబు.]
“అమ్మా! నా కొడుకు పైన మీ కొడుకు వైపు రెడ్డి తరఫు వాళ్ళు పోలీస్ కంప్లెంయింట్ ఇచ్చారట. మీరే దారి చూపాలి” లతీఫ్, పద్దమ్మ వద్ద తన సమస్యను పరిహరించమని దీనంగా వేడుకుంటున్నాడు.
“చూడు లతీఫ్! నా కొడుకు ఇప్పుడు ఒడిలోని బిడ్డ కాదు. నన్నే సరిగ్గా చూసుకోడు. ఇక నా మాట వింటాడా? అయినా.. చూడు. నీ కొడుకు ఏం చేశాడు అన్నది నీకు కూడా తెలుసు. అలా ఉన్నప్పుడు..”
“వాడి ఒంట్లో సైతాన్ ఆవహించాడు అనిపిస్తుంది. నా మాటే వినడు. తనదే ఏదేదో మాట్లాడతాడు. మీరు, నేను మన కాలంలో ఎలా ఉండేవాళ్ళం? ఇప్పటివాళ్ళకు ఏమయ్యింది?” లతీఫ్ మాటలకు పద్దమ్మ అప్పటి రోజుల వైపు మళ్ళింది.
లతీఫ్ ఈ ఊరికి వచ్చిందే ఒక కథ. మాయసంద్ర గ్రామంలో ఆ కాలంలో ప్లేగు వ్యాధి ప్రబలి, వందల కొద్దీ ప్రజలు రాలిపోగా, చచ్చినవాళ్ళ కోసం కన్నీరు పెట్టుకునేవారైనా మిగులుతారో లేదో అనే పరిస్థితి వచ్చినప్పుడు ఊరి పెద్దలు వలస వెళ్ళిపోవాలని నిర్ణయించారు. తమ ప్రాణాలు మిగిలితే చాలనుకుని ప్లేగు సోకినవారిని నిర్దయగా ఊళ్ళోనే వదిలేసి, నెలల తరబడి కొత్త స్థలంలో గుడిసెలను వేసుకుని, ప్లేగు ఇక్కడికి కూడా వస్తే ఎలా అనే భయంతో పగలు రాత్రి గడిపారు. రోజులు గడిచిన కొద్దీ, రోగం తగ్గి బ్రతికే ఆశ కళ్ళ ముందు కనిపించినప్పుడు, తాము గుడిసెలు వేసుకున్న జాగాలోనే ఇళ్ళు కట్టుకోవాలనుకున్నారు. ఊరి పేరు గురించి కూడా ఎవరూ ఆలోచించలేదు. పాత మాయసంద్ర కొత్త మాయ సంద్రగా మారి చివరికి మాయసంద్రగా ప్రజల నోళ్ళో నిలిచిపోయింది. చుట్టూతా కావలసినన్ని మాయసంద్రలు ఏర్పడ్డ తరువాత ఈ ఊరిని జడ మాయసంద్ర అని పిలవసాగారు. జడముని ఆశీర్వాదం అనే ఒక కథ కూడా వచ్చి చేరుకుంది.
ఇలాంటి జడ మాయసంద్రకు వచ్చి తమ బ్రతుకు ప్రారంభించిన వారిలో అన్ని జాతుల వారూ ఉన్నారు. పాత ఊళ్ళో నివసిస్తున్న రెండు ముస్లిం కుటుంబాలు వలస వచ్చి కొత్త ఊళ్ళో జీవితం ప్రారంభించారు. తరువాతి రోజుల్లో ఇతర ఊళ్ళనుండి వచ్చిన వాళ్ళతో కలిసి మాయసంద్రకు ఒక కొత్త కళ వచ్చింది. ఊరిని కాపాడే కొల్లాపుర అమ్మ, జైనుల బస్తీ, హిందువుల గుడి, ఇలా ఏర్పడిన ఊరుతో పాటు జనసంఖ్య కూడా పెరిగింది.
ఒక్కొక్క వీధి కూడా ఆ ఆ జాతి జనుల పేరుతో గుర్తించుకోవడం ఆరంభించాయి. అగ్రహారం, జైనులు వీధి, హరిజన వాడ, తురకల వీధి ఇలా. వ్యవసాయం, వ్యాపారాలే ప్రధానమైన ఊళ్ళో, పద్దమ్మ తండ్రి ధర్మన్న తన తలిదండ్రులతో నివాసం ఏర్పరచుకున్నాడు. జైనుల వీధిలో ఉన్న ధర్మన్న సంతలలో వక్కల వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించాడు. తలిదండ్రులు కుదిర్చిన బంధువులలోని పిల్ల జ్వాలను పెళ్ళి చేసుకున్నాడు. చిన్న వయస్సు పిల్ల జ్వాల హాసన దగ్గర దేవేహళ్ళినుండి మాయసంద్రకు ఎడ్లబండిలో చాలా కలలను మోసుకుని వచ్చింది. అత్త-మామల సేవ, పద్ధతిగా వంటావార్పూ చేస్తూ తొందరగానే అందరి మనసుల్లో నిలిచింది. ధర్మన్న తానేమో, తన వ్యాపారమేమో అనుకుంటూ ప్రశాంతంగా ఉండేవాడు.
ఒక రోజు శుక్రవారం సంతకు దగ్గరలోని ఎడెయూరికి వెళ్ళాడు. అలా వెళ్ళినవాడు తిరిగి వస్తూ ఒక ఎనిమిది పది సంవత్సరాల పిల్లవాణ్ణి వెంటపెట్టుకుని వచ్చాడు. “అమ్మా! వీడు లతీఫ్. రేపటినుండి మన ఇంట్లోనే ఉంటాడు. ఎవరూ లేని అనాథ. సంతలో అదీ ఇదీ అంటూ పనులు చేస్తాడు. ఈ రోజు డబ్బులు దొంగిలించాడు అని ఆ బోడివెధవ కాంతాగాడు నోటికి వచ్చినట్టు ఈ పిల్లవాణ్ణి తిట్టాడు. నాలుగు తగిలించాడు కూడా. నేను మధ్యలో వెళ్ళుండక పోతే వీడి బదుకు వీధికుక్క బ్రతుకయ్యేది. అందుకే తీసుకొచ్చాను”
“అది కాదురా ధర్మా! ఆ కాంతాకు నీకు వక్కల వ్యాపారంలో గొడవలు ఉన్నాయి. అలాంటప్పుడు వీడి ఊసెందుకు?” అంటూ వాళ్ళమ్మ రాగం తీసింది. వాళ్ళ నాన్న కూడా “ఏందిరా.. ఏదో ఇతర జాతివాళ్ళ కోసం మన జాతివాళ్ళతో వైరం పెట్టుకుంటామా? నీకు బుద్ధుందా? వీడికి డబ్బులకు కష్టంగా ఉంది అన్నాడు అని నువ్వే అన్నావు. అలాంటప్పుడు దొంగని ఇంట్లో పెట్టుకుని.. తెలిసీ తెలిసీ పామును పెంచే పని కాదా? కుదరదు. వాడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు.” అని పుల్ల విరిచినట్లు లోకన్న మాట్లాడాడు. ఈ వాగ్వాదాన్నంతా అక్కడే ఉండి వింటున్న లతీఫ్‌కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నేను దొంగను కాను అని గుండెను చీల్చి ఎలా చూపాలి అనే గాబరా ఒకవైపు అయితే ఇంకో వైపు తన తరువాతి బ్రతుకు ఎలాగ అనేది. ఈ రకమైన ద్వంద్వంలో ఇరుక్కుని, మాట్లాడుతున్న వారి వైపు దీనంగా చూస్తున్నాడు. “నేను సంతలో ఈ కుర్రాణ్ణి చాలా రోజుల్నుండి చూస్తున్నాను. కాంతాగాడి వైరత్వాన్ని ఎదురించి వీణ్ణి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు వాణ్ణి పంపించేసే మాటే ఎత్తకండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు ఇక్కడే ఉంటున్నాడు. అంతే” అంటూ ధర్మన్న గట్టిగా మాట్లాడడంతో లతీఫ్‌కు జన్నత్ నుండి ఒక ఆశా కిరణం కనిపించినట్టయింది. “ఉండన్నివ్వండి మామయ్యా.. మనం తినే ముద్దలోనే ఒక ముద్ద వేస్తే అయింది. దానికిన్ని మాటలెందుకు?” అని అప్పటి దాకా గమ్మునున్న జ్వాల మాటలాడింది. “నీకు ఇవన్నీ తెలియవు. గమ్మునుండు. ఏదో జాతివాడిని ఇంట్లో రానిస్తే ఊళ్ళోవాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోలేక గీరుకున్నారట్టు మనకు అవసరమా?” లతీఫ్‌కు నిలబడి నిలబడి కాళ్ళు తిమ్మిరెక్కసాగాయి. ఎవరూ తనను కూర్చోమనకుంటే తను కూర్చునేదెలాగ అనే ఇబ్బంది ఒక వైపైతే, తిన్న దెబ్బల బాధ ఎక్కువ కాసాగింది. పొద్దిన్ననగా తిన్న రెండు ఇడ్లీలు ఎప్పుడో పాతాళానికి చేరుకుని, కళ్ళు తిరుగుతున్నాయి. “వచ్చినప్పటినుండి మాట్లాడుతూనే ఉన్నారు. అవి తరువాత. ముందు భోంచేద్దురు కానీ, లేవండి” అంటూ లతీఫ్ మనసును చదివిన దానిలా జ్వాల అనగానే ధర్మన్న “హే లతీఫ్.. పెరటి తలుపు నుండి రా పో” అని వాడికి తలుపు చూపించాడు. లోకన్న “నీకేమైనా బుద్ధుందారా? ఏమని నిర్ణయం కానిదే ఇంట్లోకి ఎలా రానిస్తావు?” అనడానికి ముందే లతీఫ్ పెరటి తలుపునుండి వచ్చేశాడు.
అలా ధర్మన్న ఇంటికి వచ్చి చేరిన లతీఫ్ ఇంటివాడే అయింది ఒక కథ. మొదటంతా వ్యతిరేకించిన ధర్మన్న తలిదండ్రులు తరువాత అన్ని పనులకు లతీఫ్‌నే ఆశ్రయించేవారు. జ్వాల అయితే తన స్వంత తమ్ముడిలా లతీఫ్ను ఏ భేద భావం లేకుండా చూసుకునేది.
అమ్మా నాన్నలను ప్లేగ్ మహమ్మారి బలి తీసుకున్నాక లతీఫ్ తుమకూరు బస్టాండులో కూలి నాలి చేసేవాడు. వాడిని ఎడెయూరుకు తెచ్చింది ఆకు కూరలు అమ్మే టెంపోవాడు. లోడు ఎక్కించి “ఒరేయ్! ఎడెయూరుకు వచ్చి లోడు దించి వద్దువు రారా” అంటూ డ్రైవర్ మణి అడిగినాక లతీఫ్ టెంపో ఎక్కాడు. ఎడెయూరు సంతలో లోడు దించిన లతీఫ్ మొదటి సారిగా సంతనంతా చుట్టి వచ్చాడు. వెన్న అమ్మే మహిళలు, పూజా సామాగ్రి అమ్మేవారు ఒక వైపు, సిలవారు పాత్రలు, కొడవళ్ళు కత్తుల అమ్మకాలు, గాజులు, రిబ్బన్లు, బోండాలు, బజ్జీలు, కొబ్బరి, కూరగాయలు, పోకలు, తమలపాకులు, చిలక జోస్యం చెప్పేవారు, నశ్యం అమ్మేవాళ్ళు, పశువులకు నాడా కొట్టేవాళ్ళు, వెదురు బుట్టలు, చింతపండు, ధాన్యం అమ్మేవాళ్ళు, గుడ్డల తాన్లను అమ్మేవాళ్ళు. ఇవి కాక ముసురుతున్న ఈగలను తోలుతూ అలసిపోతున్న మిఠాయి అంగడిని చూసిన లతీఫ్ అడుగులు ఫెవికాల్ అంటించినట్టు ముందుకు వెళ్ళమని మొండికేశాయ. జేబులో ఒక కానీ లేకపోయినా లతీఫ్ నోట్లోనుంచి మాత్రం చొంగ కారనారభించింది. దాన్ని ఎవరో తొడుక్కుని తనకిచ్చిన చొక్కా భుజానికి తుడిచాడు. మిఠాయి అంగడిలో డబ్బాల్లోంచి మైసూర పాకు, జిలేబి, బూంది, కారప్పూస అన్నిటిని చక్కగా ఒక చేత్తో అమరుస్తూ మరొక చేత్తో ఈగలను తోలడానికి కష్టపడుతున్న మైలారికి లతీఫ్ కనబడ్డాడు. చేతి సైగతో రమ్మన్నాడు. లతీఫ్ రొట్టెజారి నేతిలో పడ్డట్టయింది. “ఏవూరు?” అన్న ప్రశ్నకు తుమకూరు అనాలా తురువిన హళ్ళి అనాలా అని అనుకునేంతలో నాలుక “తుమకూరు” అనేసింది. “పేరు?” లతీఫ్ అని చెప్పేంతలో ఎవరో గిరాకి అర్ధ కిలో మైసూరు పాకు ఇమ్మనగానే మైలారి పేరును పక్కకు పెట్టి “అంగట్లోకి రా” అని “ఈ గుడ్డ తీసుకో. ఈగలను తోలు” అని ఒక చిన్న కర్రకు కట్టిన మురికి గుడ్డను ఇచ్చి, మైసూరు పాకును తూచనారంభించాడు. “తీస్తావెందుకు? వెయ్యి” అన్న గిరాకికి “ అన్నా.. నూనె, చక్కెర రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?” అంటున్న మైలారి మాటలు వినబడినా వినబడనట్టు అక్కడే తుంచిన ఒక పీసును నోట్లోకి వేసుకున్నాడు ఆ గిరాకి. ఈగలు తోలడానికి కూర్చున్న లతీఫ్‌కు తన చొక్కాతో కారుతున్న చొంగను తుడుచుకోవడం ఒక సవాలైతే, ఈగలు తోలడం మరో సవాలుగా మారింది. గిరాకీలతో నిండిపోయిన అంగట్లో మైలారికి లతీఫ్ పేరు అడిగే అవకాశమే లేకపోయింది. ఈ మధ్య గిరాకిలు తగ్గుతున్నారు అని గొణిగేవాడికి ఈ రోజు దండిగా గిరాకీలు రావడం గమనించిన మైలారికి ఈ కుర్రాడి కాలు గుణమేమో అనిపించక పోలేదు. ఈగలు తోలుతున్న లతీఫ్‌తో “వదిలెయ్యి.. ఒకే రకంగా చేస్తుంటే చేయి నొప్పెడ్తుంది.. ఈ కవర్ ఇవ్వు. ఆ డబ్బాలో ఉన్న జిలేబి అమర్చు” అంటూ మైలారి వేరే పన్లు చెప్పనారంభించాడు. అలా అమరుస్తూనే మైలారికి కనబడకుండా ఒకట్రెండు జిలెబి కడ్డీలను నోట్లో వేసుకున్న లతీఫ్ ఇదే పరమ సుఖమన్నట్టు మెల్లిగ తినసాగాడు. “అదెందుకు అలా విరిగిన వాటిని నోట్లో వేసుకుంటావు? తరువాత ఒకట్రెండు ఇస్తాలే. పోయి భోంచేసి రా.” అంటూ అరచేతిలో డబ్బులు పెట్టాడు.
ఇలా ‘మహదేశ్వర స్వీట్ స్టాల్’ లో చేరిన లతీఫ్ మరుసటి రోజు మైలారి పేరడినప్పుడు తన పేరు చెప్పాడు. ఒక నిమిషం ఏం చెప్పాలో తోచకుండా “తురుకోళ్ళ కుర్రాడివా?” అంటూ రాగం తీస్తూ గుటక వేస్తూ వీణ్ణి అంగట్లోకి తీసుకోవాలా వద్దా అనే మీమాంసలో ఉండగానే లతీఫ్ కర్రతో ఈగలు తోలసాగాడు. ఆ మహదేశ్వర స్వామి ఎలా చేస్తాడో అలా చేయని అనుకుని మైలారి అంగట్లోకి వచ్చాడు. ఆ వారం కూడా బాగా వ్యాపారం జరిగింది. ఎవరో “ఏమన్నా! కొత్త కుర్రాణ్ణి పెట్టుకున్నట్టుంది” అని అడగగా అవునన్నాడు. మిఠాయి తీసుకోవడానికి వచ్చిన మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు “ఏ ఊరు కుర్రాడు వీడు? పేరేమిటి? తలిదండ్రులు ఎవరు? స్కూలుకు వెళ్తావా?” అని అడిగినప్పుడు మైలారే “అక్కా.. మనవాడే కుర్రాడు. ఎవరూ దిక్కులేదు. మీ కోసం కొత్తగా ఈ మిఠాయి చేశాను. తిని చూడు” అంటూ ఒక ముక్క తుంచి వాళ్ళ నోట్లో వేసి ముందు ప్రశ్నలు అడక్కుండా నోరు మూయిస్తున్నాడు. ఇది తెలిసినాక లతీఫ్ తన పేరును ఎక్కడా చెప్పకుండా మైలారి కొట్లో ఈగలు తోలుతూ తన బ్రతుకును చూసుకున్నాడు.
ఆ శుక్రవారం అదేం గ్రహచారం వక్రించిందో, మైలారి సాయంత్రం కొద్దిగా గిరాకీలు తగ్గినాక లతీఫ్‌కు “ఒరే! ఒక పావు వక్కలు, ఒక కట్ట తమలపాకులు తీసుకురా” అని పంపాడు. ఇది ప్రతి శుక్రవారం మామూలుగా జరిగేదే. వక్కలు అమ్మే వరసలో మొదట కనిపించేదే ధర్మన్న. అతడు గట్టి గట్టిగా గిరాకీలను తన వైపు తిప్పుకోవడానికి “ఏ సుందరమ్మా.. రా ఇటు. ఎంత నున్నని వక్కలు చూడు. నోట్లో వేసుకుంటే ఇట్టే కరగిపోతాయి. నీ శోభనం రోజుకూడా ఇలాంటి వక్క తినుండవు..” అంటూ గిరాకీలను మాటల్లోనే మరులు గొలిపి జోరుగా వక్క అమ్మేవాడు. ధర్మన్న చుట్టూ ఆడవాళ్ళు తమ కొంగులో ఒక వైపు పావు, అర్థసేరు అంటూ వక్కలు కొలిపించుకుని కట్టుకునేవారు. “నీ సవతి కూడా ఇలాంటి చీరే కట్టుకుంది” అని అన్నప్పుడు “ఆమె ఊసు నాకెందుకు” అంటూనే “ ఎంత వక్కలు తీసుకుంది?” అంటూ కుతూహలపు మూట విప్పేవారు. “తను ఒక సేరు తీసుకుంది” అంటుండగానే “మరి గిరాకీలందరికీ ఇచ్చే లోపలకి రమ్మనాలిగా! నా దగ్గర ఏం లేదని దాని వెంట పడతాడో నా మొగుడు” అంటూ సొర సొరమని ముక్క చీదుతూ కొంగుతో తుడుచుకుంటుంటే పక్కన నిల్చున్నామె ఓదారుస్తుంది. ధర్మన్న మాటల మోడీకి వక్కలు ఖాళీ అవడంతో పాటు గిరాకిలుగా వచ్చే ఆడవాళ్ళ అంతరంగపు బాధ కరిగేది. ఇదంతా అతడి పక్కలోనే రాసి పోసుకుని గిరాకీల కోసం కాచుకున్నవాళ్ళకు నిరాశ కలిగేది. ధర్మన్న పక్కనే కొట్టు పెట్టుకున్న కాంతన్న దగ్గరికి మామూలుగా అయితే ఒకటో రెండో గిరాకీలు వచ్చేది, ఆ రోజు మామూలుకంటే ఎక్కువే గిరాకీలు చుట్టుముట్టారు. దానికి కారణం ధర్మన్న దగ్గరున్న వక్కలన్నీ అయిపోవడం. ఖాళీ సంచులను మూట కడుతున్న ధర్మన్న వద్దకు అప్పుడే లతీఫ్ వక్కల కోసం అతడి వద్దకు వచ్చాడు. “అరే అంతా అయిపోయాక వచ్చావు కదరా! పక్క దుకాణంలో తీసుకో. వాడికి కూడా ఈ రోజు లాటరి తగలనీ” అన్నాడు. అతడి మాటకు లతీఫ్ నవ్వుతూ కాంతన్నకొట్టుకు వెళ్ళి “ఒక పావు వక్కలివ్వన్నా” అని అడిగాడు. ఇంకో గిరాకీకి వక్కలు కొలిచి ఇస్తున్న కాంతన్న లతీఫ్ దగ్గరనుండి మొదటే డబ్బులు తీసుకున్నాడు. అందరూ గిరాకీలను పంపేసి వీడి వైపు చూశాడు. ఒక పావు వక్కలు కొలిచి ఒక గుడ్డ సంచీలోకి వేసి డబ్బులు అడిగాడు. అప్పుడే ఇచ్చాను అన్నాడు లతీఫ్. అబద్ధం చెప్తావా అంటూ ధర్మన్న పైని కోపాన్నంతా లతీఫ్ పైన చూపాడు. ధర్మన్న నేను చూశాను వాడు డబ్బులు ఇవ్వడం అని చెప్పడానికి వచ్చినప్పుడు వృత్తిద్వేషం పెరిగి పోట్లాట ఎక్కడినుండి ఎక్కడికో వెళ్ళి, లతీఫ్ ధర్మన్న ఇంటికి చేరడం జరిగింది.
ధర్మన్న చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ వక్కలు మోసుకుని పోయి అమ్మేవాడు. లతీఫ్ అతడి వెంట వెళ్ళి వక్కల మూటలు దింపడం, అమర్చడం, అమ్మడం లాంటి పనులను చేసేవాడు. సంతలు లేనప్పుడు శివమొగ్గ నుండి తీసుకొచ్చిన వక్కలను సైజుల వారీగా వేరు చేయడం, రంగువేయడం లాంటి పనులు ఉండేవి. వీటన్నిటితో పాటు పొలం పని, తోటపని అంటూ లతీఫ్ సహాయానికి తయారయ్యేవాడు. నిజాయితీ అంటే లతీఫ్ అనే మాట మాయసంద్రలో అంతా పాకింది. లతీఫ్ వచ్చిన కొత్తలో మూడు నాలుగు కుటుంబాలు మాత్రమే ఉన్న వాడి జాతివాళ్ళు కొద్ది సంవత్సరాలలోనే ఎక్కడెక్కడినుండో వలస వచ్చి చేరుకుని యాభై అరవై కుటుంబాలయ్యాయి. అక్కడెక్కడినుండో వచ్చిన కొద్దిమంది నాయకులు మసీదు కట్టే ఆలోచన చేయసాగారు. లతీఫ్ కూడా ఆ సభకు వెళ్ళాడు. డబ్బుల సేకరణ జరిగి కొద్ది నెలల్లోనే మసీదు లేచి నిలుచుంది. ఒక మౌల్వి వచ్చి రోజూ తెల్లవారు జాము ఐదు గంటలకు, సాయంత్రం ఐదు గంటలకు “అల్లాహో అక్బర్” అంటూ నమాజ్ ప్రారంభించాడు. మొదట మసీదులో మాత్రమే వినబడుతున్న నమాజ్ మైక్ ద్వారా ఊరికంతా వినబడసాగింది. ముందు ముందు కిరికిరి అన్నవారు క్రమంగా దానికి సర్దుబాటు కావించుకుని “అల్లా.. వినిపించింది. లేవండి” అని గడియారం చూసుకోకుండా లేవనారంభించారు. సాయంత్రం అల్లా అరిస్తే టెంటులో సినిమా మొదలవుతుంది అని తొందర తొందరగా తయారయ్యేవారు. చీకటి పడ్డాక ఏమీ తినని జైన్ల ఇళ్ళల్లో “అప్పుడే నమాజ్ శురువయ్యింది. సాయంత్రం భోజనం వేళయింది” అంటూ భోజనానికి కూర్చునేవారు. ఇలా నమాజ్ ఒక ముస్లిం సముదాయానికే కాక ఊరివారందరికీ ఒక జీవనాడి అయింది. ముందంతా నమాజ్ అంటే ఏమిటి అని తెలియని లతీఫ్ ఒకట్రెండు సభలకు వెళ్ళొచ్చిన తరువాత ముసల్మానుగా పుట్టినందుకు రోజుకు ఐదు సార్లు మక్కా వైపు తిరిగి నమాజ్ చేయకుంటే, జుమ్మా రోజూ చేయకుంటే కలిగే పరిణామాల గురించి విని రోజూ పొద్దున, సాయంత్రం నమాజ్ చేయడం ప్రారంభించాడు.
కాలచక్రం అలా ఒక దశాబ్దం తిరిగి, ధర్మన్న తలిదండ్రులు కాలం చేశారు. ధర్మన్నకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు పుట్టి కుటుంబం పెద్దదయింది. చిన్నతనంలోనే కొడుకులిద్దరూ బండి చక్రాలకింద పడి చనిపోయిన తరువాత నిస్సహాయుడయ్యాడు. జ్వాలమ్మ బాధ నూరు రెట్లు ఎక్కువయింది. దిక్కు తోచని కుటుంబ సభ్యులను లతీఫే ఊరడించాడు. చిన్న పాప అయిన పద్మ ఇంకా పాలబుగ్గల పసిపాప. పాప పూర్తి బాధ్యతను తనదన్నట్టు లతీఫ్ చూసుకున్నాడు. ధర్మన్న అయితే వంశాంకురం లేదని బాధపడుతూ, చేస్తున్న వ్యాపారాన్ని పక్కకు పెట్టి అన్యమనస్కుడిగా కూర్చుని ఉండేవాడు. అలాంటి సమయంలోనే ధర్మన్నకు జయమ్మ జత అయింది.
మొగుణ్ణి వదిలేసి పుట్టింటికి చేరిన నాయకసాని జయమ్మ బాధలో ఉన్న ధర్మన్నకు అదేం మోడీ చేసిందో, ధర్మన్న ఇల్లు వదలి అక్కడే ఉండనారంభించాడు. ఇవన్నీ అర్థం కాని జ్వాలమ్మ ఇవ్వాళ కాకపోతే రేపు వస్తాడు అనుకుంటూ ఎదురు చూస్తున్న ఆమె నిరీక్షణను వమ్ము చేసి ధర్మన్న ఆ ఇంటిలోనే ఉండిపోయాడు. ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటే చాలు అనుకుంటూ ఈమె తన మనసును నెమ్మది పరచుకున్నా, లతీఫ్‌కు మాత్రం ఇది సహించరాని అపరాధంగా అనిపించింది. “అన్నా! అక్క కూడా ఇద్దరూ పిల్లలను పోగొట్టుకోలేదా? అలాగని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందా? పాప మొహం చూసయినా ఇంటికి రావాలి కదా!” అంటూ అన్ని విధాలా ఆలోచించి ఊరి పెద్దలకు బుద్ధి చెప్పమని కోరాడు. “నువ్వూరుకో! వాడి నోట్లో ఎవరు నోరు పెడతారు?” అంటు వారందరూ దూరం జరిగారు. కొన్ని రోజులలోనే పండిన పంట, వ్యాపారం, వ్యవహారం అంతా ఆ ఇల్లు చేరింది. జయమ్మ పిడికిలిలో ధర్మన్న బందీ అయ్యాడు. ఆమెకు కూడా ఒకట్రెండు పిల్లలను ప్రసాదించాడు. ఇంటి వైపు వెళ్ళనే వెళ్ళక పోతే ఇల్లు గడవడం ఎలాగ? లతీఫే ఆ ఇంటికి, ఈ ఇంటికి వారధిగా నిలిచి ఒకింత డబ్బులు వసూలు చేసుకుని వచ్చేవాడు. బాగా సాగుతున్న వక్క వ్యాపారం ఆగిపోగానే, లతీఫ్‌కు కూడా పనిలేకుండా పోయింది. కొన్ని రోజులు ఇలాగే బాధపడుతూ కూర్చున్న జ్వాలమ్మ ఒక రోజు “లతీఫా! మరమరాల బట్టీ వేద్దాం. ప్రతి సారీ డబ్బుల కోసం వాడి ముందు చేయి చాచే ఖర్మ ఇంతటితో ముగిసి పోనీ. బట్టీ సామాను ఒక వారంలో తెచ్చుకుని ప్రారంభిద్దాం” అని ఒక గట్టి గొంతుతో చెప్పింది. “ఆ బట్టీ వ్యవహారం మీకు తెలుసునా అమ్మా?” సందేహిస్తూనే అడిగాడు లతీఫ్. “మా నాన్న మరమరాలు వేయించి సంతలలో, జాతరలలో అమ్మేవాడు. చూశాను. నేర్చుకోవడం అదేమంత కష్టం కాదులే. జీవితం కంటే పెద్ద పాఠమా? నువ్వే చూస్తున్నావు కదా! మా బ్రతుకులు అదేదో దొరసాని ఇష్టానికి నడుస్తాయని నువ్వేమైనా అనుకున్నావా? లేదా నేనేమైనా కలగన్నానా?” అన్నది. కొన్ని రోజులలోనే ఇంటి పెరట్లో మరమరాల బట్టీకి కావాలసిన తయారీలను చేసుకుంది. బెళ్ళూరునుండి మరమరాలు వేయించే రామన్న దొరికినాక జ్వాలమ్మకు ఇల్లు నిభాయించడం ఏమంత కష్టం కాలేదు. బట్టీకి కావలసిన మూలధనాన్ని బెళ్ళూరు దేవేంద్రయ్య గారి వద్ధ తన మూడు వరసల హారాన్ని అమ్మి కుదిర్చింది. ఇదంతా చూసిన లతీఫ్ “అమ్మా! ధర్మన్నకు తెలిస్తే..” అని రాగం తీశాడు. “ఆ దొరసానికి ఇల్లు ఇప్పించాడు.. పొలం రాసిచ్చాడు.. పిల్లలనిచ్చాడు. నేనేమైనా ఏరా దాసయ్యా ఎందుకిలా చేశావు అని అడిగానా? ఇప్పుడు నా విషయానికి వస్తే అంతే” అంటూ మొగుడి పైని కోపాన్ని గొంతులోంచి బయటికి కక్కింది. దానికి లతీఫ్ “మీరు కొంచెం ఆ రోజే గొడవ చేసుంటే ఇలా అయ్యేది కాదు. జుబాన్ చలాయించాల్సింది.. అప్పుడు ఈ ఇంటికి ఇలాంటి గతి పట్టేది కాదు” అన్నాడు. “పరిగెత్తేవాణ్ణి పట్టుకోగలనా? వాడొక్కడేనా పిల్లలను పోగొట్టుకున్నది? నాకు మాత్రం బాధ ఉండలేదా? వాడు వెళ్ళినట్టు నేను కూడా ఎవడి దగ్గరికైనా వెళ్ళవచ్చునే? మగవాడు చేస్తే సబబు, అదే ఆడది చేస్తే గుండెలు బాదుకుని ఏడవరా వీళ్ళు. ఎవరికి భయపడకపోయనా ఆత్మ అని ఒకటుందే దానికైనా భయపడాలి కదా?” ఒంటి పైన పూనకం వచ్చినట్టు జ్వాలమ్మ మాట్లాడుతూ ఉంటే లతీఫ్ కళ్ళు నోరు తెరచుకుని చూస్తుండిపోయాడు.
లతీఫ్ మరమరాలను సంతలకు తీసుకువెళ్ళి అమ్మి, వాటి డబ్బులను నిష్ఠగా జ్వాలమ్మ చేతిలో పెట్టేవాడు. ఇంటి దగ్గరికే వచ్చి కొని తీసుకువెళ్ళే గిరాకీలు పెరగడం జరిగి, జ్వాలమ్మ ధర్మన్న ఎదురుగ్గా తల ఎత్తి నిలిచేలా చేసింది. దొరసాని వేడి తగ్గిన తరువాత ధర్మన్న మళ్ళీ జ్వాలమ్మ వద్దకు రానారంభించాడు. మొగుణ్ణి తిడ్తున్న జ్వాలమ్మ, అతడు ఇంటికి రాగానే అతడికిష్టమైన వంటలు వండి తినిపించేది. లతీఫ్ అప్పుడు “అక్కా! మీ దిల్ ఏమని అర్థం కాదు” అని ఏడిపించేవాడు. అది ఆమెకు నచ్చేది కూడా. “పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాడు అనే సామెత వినలేదా! ఉంచుకున్నది ఉన్నంతవరకు, కట్టుకున్నది కడదాకా! తెలుసా” అని బదులిచ్చేది. ఇవన్నీ జరుగుతూ ఉండగా లతీఫ్ వయస్సు కూడా పెరిగింది. ధర్మన్న లేని ఇంట్లో ఆడవాళ్ళే ఉన్నప్పుడు తను ఉండకూడదు అని లతీఫ్‌కు అనిపించింది జ్వాలమ్మతో ఆ మాట అనగా ఆమెకు కూడా అది సబబే అనిపించి వేరే ఇంట్లో ఉండమని చెప్పింది. ముస్లింలే ఎక్కువగా ఉన్న చోట ఇల్లు దొరికి, అదే ఊరులోని అతడి జాతిదే అయిన ఫాతిమాతో పెళ్ళయి, జీవితం గడవసాగింది. పద్దమ్మకు తన బంధువుల్లోనే పెళ్ళి చేసిచ్చి, ధర్మన్న చనిపోయిన తరువాత జ్వాలమ్మ ప్రశాంతంగా మైసూరులో కూతురితో ఉండసాగింది.
మాయసంద్ర చెరువుకు పాతనీరు పోయి కొత్త నీరు వచ్చేటట్టుగా పద్దమ్మకు ఇద్దరు మగ పిల్లలు. పెరిగి పెద్దవారై ఇంజనీర్లయ్యి బెంగళూరు చేరారు. లతీఫ్‌కు కూడా నలుగురు పిల్లలు. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు. కొడుకు ఎలెక్ట్రికల్ కంట్రాక్టరయ్యి తమ ఊరులోనూ, దగ్గరి ఊళ్ళలోనూ పనులు చేయిస్తున్నాడు. పదిహేను రోజులకొకసారి జ్వాలమ్మ, తన కూతురు పద్దమ్మతో కలిసి మాయసంద్రకు వచ్చి, తన ఇంట్లో ఉంటూ, ఊరివాళ్ళను లతీఫ్‌ను మాట్లాడించి వెళ్తే ఆమెకదేమో ఓదార్పు. ఇటీవలి కాలంలో మాయసంద్ర కూడా మారుతోంది. లతీఫ్ దీన్నే జ్వాలమ్మకు చెప్పేవాడు. “అమ్మా! ఊళ్ళో ఒకట్రెండు సార్లు గొడవలు జరిగాయి. నమాజ్ చేస్తున్నారు అని గుళ్ళో జోరుగా దేవుడి పాటలు పెడుతున్నారు. ‘భగవత్ సంఘం’ అని వాళ్ళు పెడ్తే, ‘అబ్బాస్ ఖాన్ సంఘం’ అని వీళ్ళు పెట్టుకున్నారు. ఏదో ఒక కారణంతో వాళ్ళను వీళ్ళు, వీళ్ళను వాళ్ళు రెచ్చకొట్టడం, కొట్టుకోవడం జరుగుతోంది” అని చెప్తూ నిట్టూర్చాడు. ఇప్పుడు గడ్డం పెంచి, తలకొక టోపీ పెట్టుకుంటున్నాడు. దాన్ని సూక్ష్మంగా గమనించిన పద్దమ్మ “నువ్వు కూడా మారావులే” అన్నది. “అమ్మా! నా బయట స్వరూపం మారినా నేను ఇంకా అప్పటి లతీఫ్‌నే పద్దమ్మా” అంటూ నవ్వాడు.
పద్దమ్మ కొడుకు బెంగళూరులో ఆర్కిటెక్ట్ అయ్యి, ఇంటి ప్లాన్లను గీసి కట్టించి ఇచ్చేవాడు. “ఇళ్ళలో ఎలెక్ట్రిక్ పనులను చేయడానికి మన లతీఫ్ కొడుకునే పిలిపించి చూడు” అని జ్వాలమ్మ మనమడితో అన్నది. అవ్వ చెప్పిన కథలనన్నిటినీ విన్న ప్రసాద్‌కు అదు కథగానే అనిపించింది తప్ప వాళ్ళ నడుమ ఉన్న బాంధవ్యపు వేడి తగలలేదు. “అవ్వా! తెలిసిన వాళ్ళను పనులలో పెట్టుకోవడాం అంత సబబు కాదు. చెప్పడానికి రాదు, అలాగని వదిలెయ్యలేము. వాళ్ళకూ నాకూ ఇబ్బందికరమే. సంబంధాలు వ్యవహారలవక పోవడమే మంచిది” అని సూటిగా చెప్పాడు. మైసూరుకు వచ్చినప్పుడల్లా అవ్వ, అమ్మ అదే విషయాన్ని చెపుతూ, ఇతర మతం వాడయినా లతీఫ్ మన ఇంటి మనిషి, మన బంధం లాగే అతడి పిల్లలు, మనమల వరకూ అది కొనసాగాలని చెప్పడం వినీ వినీ ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని ఫోన్ చేసి లతీఫ్ కొడుకు జబ్బార్ ను పనికి పిలిపించి ఎలెక్ట్రిక్ పని అప్పగించాడు. కానీ అది ఇలాగవుతుందని ఎవరికి తెలుసు?
అయితే అయినదయినా ఏంటి? జబ్బార్‌కు ప్రసాద్ అప్పగించింది పేరుగాంచిన రెడ్డి కుటుంబం వారు కట్టిస్తున్న ఇంటికి ఎలెక్ట్రిక్ పనులు చెయ్యమని. “వీళ్ళు నా ముఖ్యమైన క్లయింట్. పనులు జాగ్రత్తగా చేయాలి” అని ప్రసాద్ చెప్పాడు. జబ్బార్ కూడా అప్పటికి కొన్ని ఇళ్ళ పనులు చేసి విశ్వాసం సంపాదించుకున్నాడు. ఆ రోజు తెల్లవారు జామున రెడ్డి ఫోన్ చేసి, తన కూతురిని జబ్బార్ లేపుకు పోయాడని కేకలు వేసినప్పుడే ప్రసాద్‌కు విషయం తెలిసింది. పరువు పోతుంది అనుకుని తెలిసిన వారందరికీ చెప్పి వెతికించినా, దొరకనప్పుడు లతీఫ్‌ను పిలిచి బెదిరించారు. జబ్బార్, రెడ్డి కూతురు సౌమ్య మొబైల్ స్విచాఫ్ అయ్యుండి వాళ్ళిద్దరూ దొరకకుండా పోయేసరికి చివరికి రెడ్డి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. జబ్బార్ వద్ద పని చేస్తున్న కుర్రాళ్ళను విచారిస్తే వాళ్ళు తమకు ఏమీ తెలియదని జారుకున్నారు. ప్రసాద్ మైసూరుకు వచ్చి అవ్వ, అమ్మలతో “మీ మాటల పైన వాడిని పనులలోకి చేర్చుకున్నాను. ఇప్పుడు చూడండి! నా పరపతి అంతా పోయింది. లతీఫ్ మీ వాడు అయ్యి ఉండవచ్చు. కానీ వాడి కొడుకుకు అంత నిష్ఠ ఉండాలిగా? రెడ్డి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కానీ, తన మనుషులను వెతకడానికి పంపాడు. వాళ్ళ చేతికి దొరికితే మాత్రం జబ్బార్ కథ ముగిసినట్లే” అని ఎగిరాడు. పద్దమ్మకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ప్రసాద్ మళ్ళీ బెంగళూరుకు వెళ్ళగానే లతీఫ్ పద్దమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. తన కొడుకును ఎలాగైనా కాపాడండి అని దీనంగా వేడుకున్నాడు.
“అమ్మా అమ్మా” అన్న లతీఫ్ పిలుపులకు పద్దమ్మ ఈ లోకంలోకి వచ్చింది. “దేవుడున్నాడు. ఏం కాదులే. ధైర్యంగా ఉండు” అని తన లోని భయం అతడికి కనబడకుండా ఏదో సర్ది చెప్పి ఊరికి పంపింది.
రెడ్డి హీబస్ కార్పస్ పిటీషన్ వేశాడు. ‘తన కూతురిని మత మార్పిడి చేస్తారు. ఆమెను ‘లవ్ జిహాద్’ పేరుతో పెళ్ళి చేసుకునే కుట్రతోనే ఇదంతా జరిగింది” అని వాఙ్మూలం ఇచ్చాడు. పోలీసులు కష్టపడి వెతికి సౌమ్యను కనిపెట్టి కటకటాలలో నిలబెట్టారు. లతీఫ్, ప్రసాద్ కళ్ళు జబ్బార్ కోసం వెతికాయి. జడ్జిగారు “చూడమ్మా! నీకిప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండాయి. నువ్వు నీ మనసుకు నచ్చినవాడితో పెళ్ళి చేసుకోవచ్చు. జబ్బార్‌తో నువ్వు లేచిపోయావని మీ నాన్న కేసు దాఖలు చేశారు. దీనికి నీ అభిప్రాయమేమిటి?” అని ప్రశ్నించారు. సూది పడినా శబ్దం వినిపించేలా కోర్టు నిశబ్దమయింది. భగవత్ సంఘం, అబ్బాస్ ఖాన్ సంఘం సభ్యులు సౌమ్య ఏమంటుందో అని కుతూహలంగా ఉన్నారు. సౌమ్య చేతులు జోడించి “నేను లేచిపోయింది నిజం, పెళ్ళి చేసుకుందీ నిజం. ప్రేమించిందీ నిజం. జిహాద్ ఉన్నది మా నాన్నకు, మా మేనమామకు. నేను నా మేనమామ కొడుకును చిన్నప్పటినుండి ప్రేమిస్తున్నాను. కాని మా నాన్న వృత్తి వైషమ్యాల కారణంగా మేమిద్దరం పెళ్ళి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ‘దారిని పోయే దానయ్యకయినా ఇచ్చి చేస్తాను కానీ, వాడికి మాత్రం నా కూతురిని ఇవ్వను’ అని మా నాన్న ఎప్పుడూ అనేవారు. ఎవరితోనో పెళ్ళి తయారీలు కూడా ఆరంభమయ్యాయి. అందుకని నేను జబ్బార్‌ను సహాయం అడిగాను. అతడు నన్ను శేఖర్‌ను కలిపాడు అంతే.” అన్న ఆమె మాటలకు రెడ్డి కుటుంబం స్థాణువయ్యింది. అప్పుడే కోర్టులోకి అడుగు పెట్టిన జబ్బార్, శేఖర్ లు కూడా సౌమ్య మాటలకు ఒత్తాసు పలకడంతో భగవత్ సంఘం, అబ్బాస్ ఖాన్ సంఘం సభ్యులు తాము తెచ్చి పెట్టుకున్న కత్తులు, కొడవళ్ళకు రక్తం రుచి చూపించే అవకాశం రాకపోయింది అని బాధపడుతూ, నిరాశగా కోర్టునుండి బయటికి కదిలారు.
కన్నడ మూలం: శ్రీమతి పద్మిని నాగరాజు
అనువాదం: చందకచర్ల రమేశ బాబు