మా బావగారింటి పక్కన కనకాద్రి శాస్త్రి గారింట్లో కూడా నేను ఎక్కువ కాలం ఉండలేను అనిపించింది. నాకు కొన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండగా ఒక మత్తు కమ్మింది. అది భక్తి. ప్రతి గురువారం భజనలకు వెళ్ళడం. పుట్టపర్తి నుంచి జ్యోతి వస్తుందంటే అట్టహాసం, ఇంటి వాళ్ళింట్లో ఆయన సమస్యలకి జవాబులివ్వడం, తీర్థాలివ్వడం… సహజంగా నేను చిన్నప్పటి నుండీ తర్కంతో పెరిగినదాన్ని. ఏది చేసినా లాజిక్ లేకుండా చెయ్యను. ‘ఇదంతా వీళ్ళు కేవలం భక్తితో మాత్రమే చేస్తున్నారా? ఇందువల్ల ఏదైనా వేరే లాభం వుందా?’ లాంటి అనేక ప్రశ్నలు నాలో కలిగేవి!
***
నా బాల్యం అంతా అమ్మమ్మ దగ్గరా, ఆవిడ చదివించిన పుస్తకాల్లో గడిచింది. అమ్మమ్మ జీవితమే మాకో పాఠం. పెళ్ళయిన నాటి నుండీ తాతగారి స్వాతంత్ర్య సమరపు బాటలో నడుస్తూ, పద్దెనిమిదేళ్ళ పిల్ల ఖద్ధరు కట్టి, ముక్కుకి చేతికీ బంగారం లేకుండా, ఆయన వెంట అడవులు పట్టి నడుస్తూ, ‘ఆన్ ఫుట్ బ్యాచ్’ అన్న పేరుతో విజయవాడ నుంచి లక్నో దాకా తాతయ్య, ఇంకో ఏడుగురు మగపిల్లలతో కాలి నడకన ఫస్ట్ కాంగ్రెస్ మీట్‌కి ఏడాది పసిపిల్లని భుజాన వేసుకుని నడిచిన ధీర వనిత!
మా తాతగారు సూరంపూడి శ్రీహరిరావు గారు గొప్ప దేశభక్తులే కాక ఫిలాసఫర్ కూడానూ! అమ్మమ్మ వెంకట రమణమ్మ ఆ రోజుల్లో హాస్టల్లో ఉండి దుర్గాబాయి దేశ్ముఖ్తో పీ.యూ.సి చదివి, ఆంగ్లంలో గడగడా మాట్లాడగల ఆధునిక భావాలు గల స్త్రీ.
మడీ ఆచారం కల వంశంలో పుట్టిన అమ్మమ్మని, హరిజన హాస్టల్ పెట్టి అక్కడ వండి వడ్డింప చేశారు తాతయ్య. ఆవిడకి ముగ్గురు ఆడపిల్లలు. దుర్గా సావిత్రీ, శ్రీదేవి, సత్యవతీ. సత్యవతి మా అమ్మ. పెద్ద కూతురుకి ఆవిడకి వరసకి తమ్ముడైన వల్లూరి శేషగిరికిచ్చి చేసుకుంది. అప్పట్లో భవానీ శంకర్ నియోగి, మహారాష్ట్రలో మినిస్టర్‌గా ఉంటే, తాతగారు ‘మా అల్లుడు ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడ’ని చెప్తే, నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర ఎలెక్ట్రిసిటీ బోర్డ్‌లో ఉద్యోగంలో పెట్టారు మా పెదనాన్నని.
రెండో కూతురికి ఆయన సంబంధం చూడలేదు. స్వతంత్ర్యం వచ్చిన కొత్తల్లో కుటుంబాన్ని నైజాం తీసుకొచ్చి హైదారాబాద్ లోని జటా భవన్లో పెట్టి ఆయన రాజకీయ ఖైదీగా అరెస్ట్ అయ్యారు. స్వతంత్ర్యం వచ్చి టంగుటూరి ప్రకాశం పంతులుగారు సి.ఎం. అయ్యాకా కూడా “నీ తోటి స్వాతంత్ర్య సమరయోధులు మినిస్టర్లయ్యారు… నువ్వూ ఓ పదవి తీసుకో” అంటే వినక, గవర్నమెంటులో అవకతవకలు ప్రశ్నించీ, సరోజినీదేవీ నాయుడు కుమారుడు జయసింహతో కలసి ‘విప్’ అనే పత్రిక పెట్టి, గవర్నమెంట్ సప్రెస్డ్ కేసులని బయటకి తోడి, మళ్ళీ మళ్ళీ అరెస్టు అవుతూనే ఉన్నారు.
ఆ పరిస్థితులలో అమ్మమ్మ అల్లుడు వరసయ్యే రామ్మోహనరావు, శేషమ్మ దంపతులు ఓ సంబంధం తెస్తే, శ్రీదేవికి రెండో సంబంధమైనా మొదటి సంబంధానికి పిల్లలు లేరు కదా అని గౌతరాజు నరసింహారావుతో పెళ్ళి జరిపించింది. అదృష్టవశాత్తు తాతయ్య విడుదలై ఆ పెళ్ళి టైం కొచ్చారట.
ఆ తరువాత మా అమ్మ సత్యవతిని బంధువుల్లోనే అంకరాజు ఆనందభూషణరావు కిచ్చి చెయ్యడానికి నిశ్చయించింది. తాతయ్య పెళ్ళికి వస్తుండగా మళ్ళీ అరెస్టు చేసి జైల్లో పెట్టారుట. మా చిన్న తాతయ్యని తీసుకుని అమ్మమ్మ బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గరకు వెళ్ళి “తెల్లారితే మూడో కూతురి పెళ్ళి, మీ పంతుల్ని అరెస్టు చేశారు” అని చెప్తే ఆయన ఎంతో బాధపడి “అమ్మా… తెల్లారి లేస్తే మా మినిస్టర్లు చేస్తున్నది పడుపు వృత్తీ, కాసుకు అమ్ముడుపోయాం అని ఆందోళన చేసే నీ భర్త నా మిత్రుడు. నేను విడిపించినా వాడు అట్టే కాలం బయట ఉండడు…. దేన్నీ చూసి సహించలేడూ… భరించలేడూ…!” అని ఉత్తర్వులిచ్చి విడిపించారుట.
ఆ విధంగా మా అమ్మ సత్యవతి పెళ్ళి అంకరాజు ఆనందభూషణరావుతో జరిగింది. ముగ్గురాడ పిల్లలకీ పెళ్ళిళ్ళు జరిగి, మనవలు పుట్టినా శ్రీహరిరావుగారి నడవడికలో పెద్ద మార్పు రాలేదు!
ఓనాడు ఆవకాయకి నూజివీడు నుంచి కాయ తెస్తాననీ, కారాలు కొట్టించమని అమ్మమ్మతో చెప్పి వెళ్ళిన ఆయన ఇంక రాలేదు! నూజెళ్ళ ప్లాట్‌ఫాంపై మీద హార్ట్ ఎటాక్ వచ్చి, కుటుంబానికి ఆఖరి చూపు కూడా మిగల్చకుండా కన్నుమూశారు.
ఆ వార్త రేడియో విననీ, పత్రికలు చదవనీ ఆయన భార్యాపిల్లలకు తెలియలేదు. రేడియోలో శ్రీహరిరావుగారి మరణ వార్త ఎనౌన్స్ చేసిన మూడో రోజు కాంగ్రెస్ ఆఫీసు వాళ్ళే ఊరేగించి, గంధపు చెక్కల మీద దహనం చేసేశారు.
పసల సూర్యప్రకాశరావు అనే మిత్రుడు ఈయన కుటుంబం గురించి ఆరా తీసి మూడో రోజుకు పట్టుకుని వచ్చి చెప్తే, అమ్మమ్మ రెండో అల్లుడు గౌతరాజు నరసింహారావుతో వెళ్ళి అస్తికలు తెచ్చుకుందిట.
అప్పటి నుండీ మా అమ్మమ్మ ఒంటరి పోరాటం మొదలు! గాంధీ భవన్లో నూలు వడికీ, హిందీ ట్యూషన్లు చెప్పీ, సర్వోదయా పాత్ర వసూలు చేసీ, కుటుంబాన్నీ ఆవిడ తల్లినీ పోషించేది. పెద్ద కూతురు మహారాష్ట్రలో ఉండడం వల్ల, ఆమె ముగ్గురు పిల్లల్నీ (ఆఖరి పిల్ల తల్లిదండ్రులతో ఉండేది) మా అమ్మనీ, అమ్మ యిద్దరు పిల్లల్నీ (అంటే అన్నయ్యనీ, నన్ను) పెట్టుకుని ఉండేది.
చిన్నతనంలో అమ్మమ్మ పదకొండుమంది మనవలతో వచ్చి పోయే చుట్టాలతో మా ‘రమణమ్మ గది’ అనే పుష్పక విమానం లాంటి గది నిండుగా ఉండేది. ఆంధ్రా నుంచి ఎవరొచ్చినా ఇది విడిది. కోర్టు పనులకీ, ఆస్పత్రి వైద్యాలకీ, ఇక్కడ ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తే, ఇదే వాళ్ళకి మకాం!
తరువాత మా అమ్మకి సెన్సస్‌లో, ఆ తరువాత నేను పుట్టాకా ఆర్.టి.సి.లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు మా జీవితాల్లో పెద్ద మలుపు! అమ్మకి ఆర్.టి.సి. వాళ్ళు క్వార్టర్స్ ఇచ్చారు.
(సశేషం)
రొమాంటిక్ రచనలతో అనేక తెలుగు పాఠకుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని తీయతేనియలొలికే సంభాషణలతో అందరి హృదయాలను దోచుకుంటున్న ప్రఖ్యాత రచయిత్రి. ‘కాలమ్ దాటని కబుర్లు’ అనే పుస్తకం, ‘రేపల్లెలో రాధ’, ‘ఎవరే అతగాడు’, ‘అనూహ్య’, ‘ఖజూరహో’, ‘ఆ ఒక్కటి అడిగేసెయ్’ వంటి నవలలు వెలువరించారు.
Chala bagundi madam…
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
చారిత్రాత్మక నవలల్లో మేటి – ‘నరమేధము’
జ్ఞాపకాల పందిరి-139
ప్రేమించే మనసా… ద్వేషించకే!-22
వారెవ్వా!-51
నీతిమాలినవాళ్ళ నీతికథలు 2 – పుస్తక పరిచయం
మరుగునపడ్డ మాణిక్యాలు – 6: ద బాయ్ ఇన్ ద స్ట్రైప్డ్ పజామాస్
నా మనసు..!
పిడికెడు మట్టి
‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -10
భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-16
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®