Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన రమణీయం-58

టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం.

స్క్రిప్టు ఘట్టం అయిపోయాకా, ఇంక కేస్టింగ్ మొదలైంది. నాయుడు గారు కొత్త అమ్మాయిలని చూద్దాం అని ముంబయి నుండి సుష్మా అనే కో-ఆర్డినేటర్ ద్వారా చాలా ఫొటోలు తెప్పించారు. కొన్ని పక్కన పెట్టాం. పెట్టాం అని ఎందుకు అన్నానంటే దర్శకుడు, సత్యానంద్ గారూ, నేను అన్నింట్లో పాలుపంచుకోవాలి. మేమూ చూడాలి. మాకు ఇద్దరు అమ్మాయిలు కావాలి మరి! కానీ సినిమాకి ప్రధానమైనది హీరో!

నేనూ చంద్ర సిద్ధార్థ ఒకనాడు, నాయుడుగారు టైం తీసుకుని పంపిస్తే, వెంకటేష్ కాటేజ్‌కి వెళ్ళాం. ఆయనకి కథ చెప్పాం.

ఆయన కాటేజ్ ఒక ఆశ్రమంలా వుంటుంది, రమణ మహర్షి పటాలు, ఆధ్యాత్మిక పుస్తకాలతో. ఎక్కువగా ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇష్టపడే హీరో. మిగతా హీరోల్లా కాదు! నాయుడు గారు “మిగతా హీరోలు సంవత్సరానికి రెండు సినిమాలు చేసి కోట్లు సంపాదిస్తుంటే, వీడేందీ ఇట్లా… ఇంకా ఏం చేస్తాంలే… చాల్లే! అంటాడు?” అని ఆశ్చర్యపోయేవారు.

వెంకటేష్ మాతో చాలా బాగా మాట్లాడారు. నేను కథ చెప్పగానే విని, కళ్ళు మూసుకుని ఆలోచించి, “మంచి కథ – కొంత టైం కావాలి నాకు. నేను ‘తులసి’ తర్వాత ‘ఆడవారి మాటలకు… అర్థాలే వేరులే!’ కమిట్ అయి వున్నాను. కానీ నాకీ హీరో కేరెక్టర్ చాలా నచ్చింది” అన్నారు.

నేనూ, చంద్ర సిద్ధార్థ పొంగిపోయాం. ఆరు నెలలు అంత పెద్ద హీరో కోసం వెయిట్ చెయ్యడం పెద్ద టైమేమీ కాదు! ‘మా ఇద్దరి భవిష్యత్తూ చాలా బాగుంటుంది, పెద్ద హీరో సినిమా చేస్తే’ అని ఆలోచించాం. సత్యానంద్ గారు కూడా ఆనందపడ్దారు అతని స్పందనకి! సురేష్ బాబు ఈ సంగతి తెలిసి, “వెంకటేష్ కథలన్నీ నేనే వింటా, కనుక, నాకు చెప్పండి” అన్నారు.

ఇంతవరకూ బావుంది కదా! కానీ ‘విధి చేయు వింతలన్నీ…’ అన్న పాట గుర్తుందిగా…. బాలచందర్ భలే అతికేటట్టు రాయించారు ఆ పాట!

నాయుడుగారు “ఆరు నెలలు ఆగను! అనుకోగానే షూటింగ్‍కి వెళ్ళి వెంటనే తీసెయ్యాలి. సురేష్ ఇన్‌వాల్వ్ అయితే ఆలస్యం అవుతుంది” అన్నారు.

నేనిది వూహించలేదు అసలు. ఆయనకి ఎవరూ ఎదురు చెప్పలేరు. కథ చెప్పమని నన్ను గోపీచంద్ దగ్గరకి కూడా పంపారు. అతను అసలు నాయుడుగారు పంపారు అనే రెస్పెక్ట్ కూడా లేకుండా, నన్ను ఎదురుగా తన ‘వంశీరామ్ అపార్ట్‌మెంట్స్’లో లివింగ్ రూమ్‌లో కూర్చోపెట్టి, శేఖర్ సూరి అనే దర్శకుడితో (ఎ ఫిల్మ్ బై అరవింద్ తీసాడు) తెగ మాట్లాడాడు. అతను వెళ్ళిపోయాక నేను కథ చెప్పబోతే, “నేను అసలు రొమాంటిక్ కథలు చెయ్యదలచుకోలేదండీ. మీరు కథ చెప్పడం అనవసర ప్రయాస!” అన్నాడు. పైగా ఎప్పుడు వెళ్తావ్ అన్నట్టు వాచీ చూసుకున్నాడు.

నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, తర్వాత ఎన్నో ఏళ్ళకి చిరంజీవి గారు కానీ నాతో ఇలా ప్రవర్తించలేదు! నవలా రచయిత్రిగా, స్త్రీగా, నన్ను ఎంతో గౌరవించి మాట్లాడి, స్వయంగా ‘కాఫీ’ అందించి, స్త్రీ జాతి పట్ల వారి గౌరవాన్ని చూపించారు. పైగా పెద్ద హీరోలు!

‘ఇంక వెళ్ళు’ అన్నట్లు తను లేచి నిలబడ్డాడు. నేను కథ చెప్పకుండానే పదిహేను ఇరవై నిమిషాల్లో స్టూడియోకి తిరిగొచ్చేసాను. శ్రీకాంత్‍ని పంపించారు. శ్రీకాంత్ చాలా మర్యాదస్తుడు. గతంలో వాళ్ళ అక్కయ్య నిర్మల నాకు బాగా పరిచయం అని చెప్పానుగా! అతను కథ కూడా వినకుండానే, “నేను చేస్తాను” అని నాయుడుగారితో చెప్పాడు.

ఈమాట శేఖర్‌బాబుగారితో ఆనాడు శ్రీకాంత్ చెప్పి వుంటే, రవితేజ సీన్ లోకి వచ్చేవాడు కాదు; అప్పుడప్పుడే పైకొస్తున్న ఛార్మీ, శ్రీకాంత్‍లతో, మొదట అనుకున్నట్లుగా, ‘నీకూ నాకూ మధ్య’ సినిమా పూర్తయ్యేది! అల్లు అరవింద్ కొనడం, రామానాయుడిగారికి ఇవ్వడం, ఇవన్నీ అలా జరిగేవి కావు!… నాకు ఆ సినిమాకే ‘మనం రాసే స్క్రీన్‌ప్లే వుత్తదే… పైవాడు రాస్తాడు మంచి మలుపులతో, వూహించరాని ముగింపులతో స్క్రీన్‌ప్లే’ అని తెలిసింది! రోజుకో మలుపు తిరిగుతుండేది నా భవితవ్యం…

‘గోదావరి’ రిలీజ్ అయింది. ఆ సినిమా శేఖర్ కమ్ముల చాలా బాగా తీసాడని విని, నాయుడు గారు తెప్పించి ప్రివ్యూ థియేటర్‌లో వేయించారు! అంతా కూర్చుని చూశాం. సగంలోనే నాయుడుగారు నాతో “వద్దన్న పిల్లని చేసుకుంటానని వెంటబడ్డాడేం హీరో? నాకు ఇది నచ్చలేదు” అన్నారు.

సినిమా అయిపోయాక, హడావిడిగా నేను కారు వైపు వెళ్తుంటే, ఆయన ఆఫీసు ముందు చంద్ర సిద్ధార్థ, సత్యానంద్ గార్లతో నిలబడ్డ నాయుడుగారు ‘రమణీ’ అని నన్ను పిలిచి, దగ్గరకు వెళ్తే, “సుమంత్ ఎలా వుంటాడు మన సినిమాకి?” అని అడిగారు. “బావుంటాడు” అన్నాను. నాకు అతని ‘సత్యం’,’గోదావరి’ సినిమాలు నిజంగా ఇష్టం.

“సరే… రేపు మాట్లాడ్తా… ఓసారి వెళ్ళి కథ చెప్పు” అన్నారు.

నేనూ, చందూ మొహాలు చూసుకున్నాం. ఇలా వెళ్ళి కథ చెప్పడం నాకూ, నా వెంట రావడం డైరక్టర్‌కీ అలవాటయిపోయింది!

అక్కినేని నాగేశ్వరరావుగారితో రచయిత్రి

నేను మర్నాడు పొద్దుటే, మొదట అక్కినేని నాగేశ్వరరావుగారికి ఫోన్ చేసాను. “నాయుడు గారు ఇలా అనుకుంటున్నారు…” అని చెప్పాను. “తప్పకుండా చెప్పు. నేనూ సుమాతో మాట్లాడ్తాను. ఆల్ ది బెస్ట్… నవలా చిత్రాలకి మా వాడు వారసుడవుతాడేమో… ఎవరు చెప్పగలం?” అన్నారు. మనస్ఫూర్తిగా నన్ను దీవించారు!

ఆయనకి సుమంత్ అంటే చాలా ఇష్టం. తను వుంటున్న ఇల్లు అతనికి రాసిచ్చి, అతనితోనే వుండేవారు. కీర్తి రెడ్దితో డైవోర్స్ అయ్యాకా, ఆయన తన కోసం, తననీ, తన భార్యనీ వదిలిపెట్టి వుండలేక సుమంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అని ఫీలయి, రెండు మూడు సార్లు ఆమెకి ఫోన్ చేసి, “మాదేం లేదమ్మా… నూరేళ్ళ జీవితం మీది. మీరూ మీరూ బావుంటే, మేం దూరంగా వుంటాం. సుమ మాతో వుండాలని కండీషన్ లేదు” అని చెప్పాననీ, నాతో చెప్పారు. నేను నా చెవులతో విన్న విషయాలనీ, పెద్దల మంచితనం గురించిన విషయాలని మాత్రమే నా ఆత్మకథలో రాస్తాను. నాతో వాళ్ళు మనసు తెరిచి పంచుకున్న ప్రతీ విషయం మాట్లాడను… ఎందుకంటే.. నన్ను ఒక ఆత్మీయురాలిగా, చాలా దగ్గరి వ్యక్తిగా తలచి నాగేశ్వరరావుగారు కానీ, రామనాయుడుగారు కానీ, చాలా స్వవిషయాలు చెప్పేవారు!

అందులో మంచివీ, వారి ఔన్నత్యం నలుగురికీ తెలిసేలాంటివీ మాత్రం రాయాలని మొదటే నిర్ణయించుకున్నాను. వ్యక్తిగతంగా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే నేను ఇన్నేళ్ళు వారిని స్మరించుకుంటూ, వారి కోసం ఇప్పటికీ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను!

(సశేషం)

Exit mobile version