[శ్రీ తుర్లపాటి నాగభూషణ రావు గారి ఆత్మకథ రెండవ భాగం ‘జీవన రాగాలు-2’ ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
తుర్లపాటి నాగభూషణ రావు గారి ఆత్మకథ ‘జీవన రాగాలు’ మొదటి భాగంలో బాల్యం, కౌమారం, తొలి యవ్వనపు రోజులను ప్రధానంగా ప్రస్తావిస్తే, రెండో భాగంలో బాధ్యతల బరువులు, పెళ్ళి పిల్లలు, సంసార ఉద్యోగ బాధ్యతలు, ప్రముఖులతో పరిచయాలు, ఆధ్యాత్మిక పథంలో ప్రవేశం, తండ్రిగా బాధ్యతలు పూర్తి చేసుకుని, తాతగా కొత్త బాధ్యతలని ఆస్వాదిస్తూ జీవనయానం కొనసాగించడం కనిపిస్తుంది.
మొదటి భాగంలో 20వ అధ్యాయంతో విరామం ఇచ్చి, రెండవ భాగంలో 21వ అధ్యాయం నుంచి ప్రారంభించారు నాగభూషణ రావు గారు.
‘సింహం నవ్వింది’ అనే అధ్యాయంలో ఈనాడు సంస్థలో ట్రైనీ సబ్ ఎడిటర్‌గా చేరే ముందు రామోజీరావు గారే స్వయంగా ఇంటర్వ్యూ చేయడం తుర్లపాటి వారికి ఓ గొప్ప అనుభవాన్ని మిగిల్చింది. అక్కడ పని చేస్తుండగా, ఒక అనువాదంలో దొర్లిన పొరపాటును పతంజలి గారు ఎంత సరళంగా ఎత్తి చూపారో చెబుతూ, అహంభావం లేని వారి వ్యక్తిత్వాన్ని అభినందిస్తారు. ఆంద్రప్రభలో పని చేస్తుండగా, వాసుదేవ దీక్షితులు గారు చేసిన ‘నువ్వు వంద తప్పులు చేయి. ఫర్వాలేదు. కానీ ఏ తప్పు రిపీట్ కాకూడదు’ అనే సూచన ఎవరికైనా అనుసరణీయమే.
22వ అధ్యాయం ‘దనా ధన్’ లో మెడికల్ కాలేజీలో సీటు సంపాదించడానికి రాయాల్సిన ఎంట్రన్స్ టెస్టులో పాసవడం కోసం మిత్రులతో కల్సి గుంటూరు రవి కాలేజ్ లో శిక్షణ పొందడం గురించి, ఆ కాలేజ్ వ్యవస్థాపకుడు శ్రీ సి. వి. ఎన్. ధన్ గురించి, పల్లెల్లో చదువుకున్న పిల్లలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్న ఆయన కోరిక గురించి వివరిస్తారు. ఇక్కడ రచయిత నేర్చుకున్న గొప్ప పాఠం ఒకటుంది! పేర్లు పెట్టుకునే పద్ధతిని అనుకరిస్తే సరిపోదనీ, ‘అనుకరణ’ అనేది ఇలా కాదనీ వారి స్థాయికి ఎదగడంలో అనుకరించాలన్న సంగతి చక్కని పాఠం.
23వ అధ్యాయం ‘పెళ్ళిసందడి’ లో 80వ దశకంలో మధ్యతరగతి వర్గంలో సామాజికంగా వచ్చిన ఒక మార్పుని చక్కగా విశదీకరించారు. చేతిలో డబ్బులు ఆడకపోయినా గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అని అప్పుజేసి పెళ్ళి ఖర్చు తడిసి మోపెడు చేయడం, ఆపైన చేతులు కాల్చుకోవడం గురించి, మరీ ఆధునిక పోకడ అయిన ప్రీ-వెడ్డింగ్ షూట్ గురించి ప్రస్తావించారు. మన్నవ గిరిధరరావు గారి పెద్ద అమ్మాయి శ్రీదేవిగారితో తన వివాహం గురించి ఈ అధ్యాయంలో సవివరంగా చెప్పారు. తమ వివాహానికి హాజరైన ప్రముఖులలో పుచ్చా పూర్ణానందంగారు, ప్రసాదరాయ కులపతి గారు ముఖ్యులని చెప్తారు.
24వ అధ్యాయం ‘గోవిందా గోవిందా’లో తిరుమల వేంకటేశ్వరునిపై తనకున్న ఓ అపోహ ఎలా తొలగిపోయిందో చెప్పారు తుర్లపాటి గారు. మన జీవితంలో కొన్ని ఘటనలు సంభవించడంలో మన ప్రమేయం కన్నా దేవదేవుడి అభిమతమే ఎక్కువని తెలుస్తుంది. ఈ అధ్యాయంలో తిరుపతిలోని భీమాస్ హోటల్ గురించి, ఆ హోటల్ వ్యవస్థాపకుడి గురించి వివరించారు. టిటిడీలో ఇవోగా సేవలందించిన ఐఎఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ గురించి చెబుతారు.
25వ అధ్యాయం ‘అచ్చు ముచ్చట’లో కాలేజీ రోజుల్లో సావనీర్లో రచన పడేందుకు చేసిన ప్రయత్నాల గురించి, కాలక్రమంలో ముద్రణారంగంలో వచ్చిన మార్పుల గురించి చక్కగా తెలియజేశారు. ఒకప్పటి పత్రికలలో వార్తల కంపోజింగ్ ఎలా జరిగేదో వివరించారు.
26వ అధ్యాయం ‘టెనెంట్ని కరిచిన ఓనర్’లో క్షణికావేశంలో చేసిన పని ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఒక ఉదంతం ద్వారా వెల్లడిస్తారు. కోపాన్ని అదుపు చేసుకోలేకపోతే, ఇబ్బందులు తప్పవని ఈ అధ్యాయం సూచిస్తుంది. ఈ అధ్యాయంలోనే జాలాది గారితోనూ, వేటూరి గారితోను కలిగిన పరిచయం గురించి చెప్తారు.
27వ అధ్యాయం ‘ఠీవీగా..’లో దూరదర్శనలో ప్రసారమైన రామాయణం, మహాభారతం – సీరియల్స్ తమపై ఎంతటి ప్రభావం చూపాయో వివరించారు. టెలివిజన్ రంగంలో వచ్చిన మార్పులను ఈ అధ్యాయం రికార్డ్ చేసింది.
‘పాడువారు..’ అనే 28వ అధ్యాయంలో గాయకుడవ్వాలనే తన అభిలాష గురించి, అందుకు చేసిన ప్రయత్నాల గురించి, ఘంటసాల పాటల గురించి, నండూరి ఎంకి పాటల గురించి వివరించారు, “పాడలేక పోవచ్చు, కానీ పాట తన ప్రాణంమని అన్నారు. రాగ జ్ఞానం లేకపోవచ్చు, కానీ రాగం నా గుండె బలం అని చెప్పి తన యీ జీవనరాగాల్లో పాటకు పెద్దపీట వేసిన వైనం వివరించారు.
‘రికార్డుల మోత’ అనే 29వ అధ్యాయంలో కాలేజీ రోజుల్లో ట్రేసింగ్ పేపర్ ఉపయోగించి, రికార్డులలో బొమ్మలు గీసిన వైనం వెల్లడించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కి సాధించిన ఘనతను వినమ్రంగా వెల్లడించారు.
తరువాతి అధ్యాయలలో జీవితంలోని చీకటి వెలుగులను ప్రస్తావించారు. షిర్డీకి చేసిన పాదయాత్ర గురించి తెలిపారు. నమ్మశక్యం కాని విధంగా షిర్డీ నడుస్తూ చేరిన విషయం ఆసక్తి కలిగిస్తుంది. గుండెకి ఆపరేషన్ చేయించుకున్నాకా, తనలో వచ్చిన మార్పు గురించి వివరించారు. కోలుకున్నాకా, తమ ఛానెల్ ద్వారా తాము చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. చివరగా తాను చేసిన విదేశీ యాత్రను వివరించి, ఆయా పర్యాటక ప్రదేశాల గురించి సంక్షిప్తంగా వెల్లడించారు.
ప్రతీ ముగింపు కొత్త ప్రారంభం అంటూ ఆత్మకథను ముగించారు.
284 పేజీల నిండా ఎన్నెన్ని అనుభవాలో, ఎన్నెన్ని అనుభూతులో! అందుకే ఈ జీవిత చరిత్రని అనుభవాల ప్రోది, అనుభూతుల నిధి అనవచ్చు!
వ్యక్తిగత సమాచారంతో పాటు సమాజంలో అర్ధ శతాబ్దం పాటు సంభవించిన ఎన్నో మార్పులను ఈ ఆత్మకథ రికార్డు చేసింది. పాఠకులను ఏ మాత్రం నిరాశపరచదీ పుస్తకం!!
***
రచన: తుర్లపాటి నాగభూషణ రావు
పేజీలు: 284
వెల: ₹ 355/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్
రచయిత: 9885292208
~
తుర్లపాటి నాగభూషణ రావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-turlapati-nagabhushana-rao-2/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.