Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆలోచింపజేసే కవిత్వం – ‘జీవన పోరాటం’

సుప్రసిద్ధ కవి, రచయిత శ్రీ గుడిమెట్ల చెన్నయ్య వ్రాసిన కవితల సంపుటి ‘జీవన పోరాటం’. ఇందులో 42 కవితలున్నాయి. పుస్తకం చివరలో రచయిత మరో కవితా సంపుటి ‘మనిషి కనబడుట లేదు’పై ప్రముఖుల సమీక్షలు అభినందనలు ఉన్నాయి.

***

“చెన్నయ్య కవిత్వములో కథా కథన పద్ధతిన నిత్య జీవితంలో ఎదురుపడ్డ దృశ్యములను దృశ్య కవితలుగా అల్లారు. దృశ్య కవిత అంటే చూసిన సంఘటన, సన్నివేశము, వ్యక్తుల ప్రవర్తనను చిత్రించేది. అది మనసుకు సూటిగా తావవచ్చును. లేదా వ్యక్తుల మనస్తత్వాలను తెలుపవచ్చును. ఈ సంపుటి లోని కవితలన్నీ కవి మాట్లాడుతున్నట్టుగాను, తనలో తాను అనుకుంటున్నట్టుగా ఉంటవి. ఈ కవితల్లో సహజత, వ్యగ్రత, వ్యంగ్యము, తరానుభూతులున్నవి. ఇంకా సూటిగా చెప్పాలంటే రన్నింగ్ కామెంటరీ (చూసున్న అంశానికి వ్యాఖ్యానము) అందించారన్న మాట.

~

ప్రతి కవితా మనం చూస్తున్న ఘటనలను తనదైన మూసలో చెప్పి, తన నేత్రాలలో ప్రజ్వరిల్లిన వాటిని మన మనః చక్షు ఇంద్రియాలకు సాక్షాత్కరింపజేసారు అనుటలో ఏమీ సందేహం లేదు. తోచిందే కాదు చూసిందే చెప్పడం ఇక్కడ ప్రధానంగా సాగినవీ కవితలు. జీవన మాధుర్యాన్ని, వెతలను సారూప్యతఓ అందించారు. ఇందుకు చెన్నయ్య గారిని అభినందిస్తున్నాను.” అని వ్యాఖ్యానించారు కవి, విమర్శకులు శ్రీ టి. రంగస్వామి గారు తమ ముందుమాట ‘దృశ్య కవితా సారము’లో.

***

“ప్రతి కవిత ఒక కథలాగా అన్పిస్తుంది. ఆసాంతం చదివిస్తుంది. అహింసను బోధించటం, నేటితరం ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు, తాగిన మైకంలో జరిగే అనర్థాలు, అక్రమ సంబంధం తాలూకు వ్యథ, నిజమైన స్నేహానికి నిర్వచనం, కొత్త కోడలితో వ్యవహరించాల్సిన తీరు, చేసిన తప్పును దిద్దుకోవటం, వృద్ధుల ఆత్మాభిమానపు విషాదాంతం, ఆలుమగల అన్యోన్యత. ‘కల’ అయిపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, స్త్రీల ఉద్యోగాలు, భ్రమ కలిగించే అందం, నిజమయిన స్వాతంత్ర్యానికి నిర్వచనం, తోటి రచయితల పట్ల ప్రతి రచయిత బాధ్యత, స్వీయ పరిజ్ఞానం, గిడుగు రామ్మూర్తి పంతులుగారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, నిరుద్యోగం, భార్యపట్ల భర్తల ప్రవర్తనలో రావలసిన అవగాహన, అతిథులకు గౌరవం, యువతరం పెంచుతున్న ప్రమాద వేగం, వృద్ధుల పట్ల కోడళ్ళ విసురులు, విశ్వనరుడు జాషువా, ప్రతిభకు కొరవడుతున్న గుర్తింపు, అమానవీయత, దొంగతనం, అతినమ్మకం, అందమైన తెలుగు, ఆడపిల్లల విలువ, అమ్మాయిలకు హెచ్చరిక, అత్యాచారం, తెలుగు తల్లి ఆవేదన ఇలా… ప్రతి కవిత ఆద్యంతమూ కొన్ని పాత్రల్ని సంఘటనను జీవన చిత్రంగా మన కందించారు.” అని పేర్కొన్నారు ప్రముఖ రచయిత్రి డా. సి. భవానీదేవి గారు తమ ముందుమాట ‘జీవన చిత్రాలు’లో.

***

“ఈ కవితలను వారి నిర్మొహమాటం, సూటిదనం, భావాల పట్ల స్పష్టత, భావ వ్యక్తీకరణలో చక్కని శైలి అన్నీ కలబోసి అపారమైన జీవితానుభవాన్ని రంగరించి అక్షరమాలగా పేర్చినట్లు భావిస్తున్నాను. ఆ భావనల వ్యక్తీకరణలో ఎక్కడా వెనుకడుగు వేసినట్లు కనిపించలేదు. ప్రతి కవిత వారి మనోభావాలకు అక్షర సత్యంగా నిలుస్తుంది.

~

కుటుంబ సంబంధాలు, సామాజిక బంధాలు ఎంత బలహీనంగా ఉన్నాయో వేలెత్తి చూపుతూ తన అనుభవానికి తగిన సూచనలు తెలియజేయడంలో ఈ కవితా సంపుటి పరమావధి దాగి ఉందని విశ్వసిస్తున్నాను.” అని వ్యాఖ్యానించారు ఆచార్య విస్తాలి శంకరరావు గారు తమ ముందుమాట ‘అనుభవాల సంగమం’లో.

***

‘ఆది గురువు’ అమ్మంటూ “అహంకారముతో నువ్వు కాలితో తన్నినా/నీ కాలికి దెబ్బ తగిలిందేమోనని బాధ పడేది అమ్మ” అంటారు కవి.

“మానవత్వాన్ని మేల్కొలిపే మతం నీది/కులమతాల తారతమ్యాలను నిలదిస్తూ/మార్పు కోసం చేసే పోరాటం నీది” అంటారు జాషువా గురించి కవి.

హెల్మెట్ ధరించడం ఎందుకు అత్యావశ్యకమో ‘యువతరం’ కవితలో చెబుతారు.

ఆలూమగల మధ్య ‘అవగాహన’ ఉండాలంటూ, “రెండు చక్రాలు అవసరమే/సంసారమనే త్రొక్కుడు బండికి” అంటారు కవి.

దయనీయమైన ఓ నిరుద్యోగి జీవితాన్ని ‘పోరాటం’ కవిత్వంలో వివరించారు.

రచయితలు తోటి రచయితల రచనలనూ చదవాలనే ‘విశాల మనస్తత్వం’ కలిగి ఉండాలని చెబుతారు కవి.

“నేను మీలో సగమైనప్పుడు/ఎందుకుంటాయండీ మన మధ్య అభిప్రాయ భేదాలు” అనే ‘అర్ధాంగి’ గురించి ఓ కవితలో చెబుతారు.

ఇంకా ఇలా ఎన్నో ఆలోచింప చేసే కవితల సమాహారం ఈ సంపుటి.

***

జీవన పోరాటం (కవిత్వం)
రచన: గుడిమెట్ల చెన్నయ్య
పుటలు: 92
వెల: ₹ 100/-
ప్రచురణ: జనని ప్రచురణలు, చెన్నై.
ప్రతులకు:
గుడిమెట్ల చెన్నయ్య
13/53, 2వ వీధి, వాసుకి నగర్,
కొడుంగైయూర్,
చెన్నై 600118
ఫోన్: 9790783377

Exit mobile version