[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వి. ప్రసాదరావు గారి ‘జీవన మధురిమ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
పోస్ట్‌మాన్ తన వైపే రావడం గమనించిన జీవన్ ట్రాక్టరు ఎక్కబోతూ ఆగిపోయాడు. సస్యరక్షణ.. వ్యవసాయ రంగాలకు సంబంధించిన శాఖల నుండి సర్క్యులర్లు.. సంబంధిత పత్రికలకు బదులుగా.. అతని చేతిలో ఓ గులాబీరంగు కవర్‌ను చూసి ఆశ్చర్యపోయాడు!
అది రిజిష్టర్డు కవరు! సంతకం పెట్టి దాన్ని తీసుకున్నాడు. అదెక్కడించి వచ్చిందో గమనించిన అతని ముఖంలో చిరునవ్వు పూసింది! అప్పటికే కూలీలందరు తొట్టెలో ఎక్కివుండటం గమనించి ట్రాక్టరు ఎక్కి స్టార్ట్ చేసి పోనిచ్చాడు. ట్రాక్టరు కాస్సేపటికి గమ్యస్థానం చేరింది. కూలీలకు అక్కడి పనులు పురమాయించి దగ్గర్లోనే వున్న చిన్న ఫార్మ్ హౌస్ కేసి నడిచాడు. అక్కడ కవరు విప్పి దాన్లోంచి కవరు రంగులోనే వున్న కాగితాన్ని తీసి చదివిన జీవన్ ఆశ్చర్యానికి అవధి లేకపోయింది!
***
“ఏంటి మధూ.. ఎప్పుడో ఓసారి బాగున్నావా? అని ఫోన్ పలకరింపులే తప్ప ఉత్తరాల్లాంటి వుండవు. ఏంటి విశేషం..? పెద్ద ఉత్తరమే రాసావు. మూడు సార్లు చదివాను. అయినా నీ లేఖా సారాంశం మాత్రం పూర్తిగా అర్థం కాలేదు. ఏదో పెద్ద విశేషమే లేకుంటే – తప్పకుండా రమ్మని రిపీట్ చేస్తూ రాయవు! చెప్పు ఏదన్నా సంబంధం విషయమా..?”
తలెత్తి అదోలా చూసింది మధురిమ.
“అయినా ఈ రోజుల్లో పెళ్లిళ్ల పేరయ్యలూ.. పంతుళ్లూ ఎక్కడున్నారు.? మీ సిటీ యువతరమంతా మాట్రిమోనియల్ సైట్సు.. లేదంటే వాట్సప్ ఫ్రెండ్‌షిప్‌ల ద్వారానే కద పార్ట్నర్స్ సెలెక్షన్..!”
“అదేం కాదులే..”
“సరే.. ఇంకేదైనా విశేషమా..?”
“అన్నీ వివరంగా చెప్తా.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారు.. ముందుగా ఫ్రెష్ అయి రండి.. అదిగో అదే బాత్రూం, లోపల గీజరుంది. వేడినీళ్ళ స్నానం చేసి రండి..”
“ఆ కార్యక్రమాలన్నీ.. స్టేషను దగ్గర్లోనే వున్న మా బ్రహ్మచారి స్నేహితుడి ఇంట్లోనే అయిపోయాయి.”
“అవునా.. సరే.. ఆ పేపరు చూస్తూ కూర్చోండి. పావుగంట లోపునే వస్తా..” అని వెళ్లబోతూ గోడకున్న స్పీకర్స్ ఆన్ చేసింది, ‘ప్లే’ మోడ్‌లో పెట్టి. పాత సినిమాల్లోని మధురగీతాలు మృదుస్వరంలో మెల్లగా వినబడసాగాయి! ఆమె వెళ్లాక ఆ హాలును పరిశీలనగా చూసాడు జీవన్.
మధుకు శాస్త్రీయ సంగీతమంటే చాలా ఇష్టం! వీణ, వోకల్లో డిప్లొమా కూడా చేసింది. తను ప్రకృతి ప్రేమికురాలే కాదు మంచి ఆర్టిస్ట్ కూడా! ఆమె వేసిన పెయింటింగ్సూ.. హాల్లో వున్న ఫ్లవర్ వాజుల్లో ఉంచిన సహజ పూల గుత్తులు.. సోఫా కవర్లు.. అన్నీ ఆమె అభిరుచిని తెలియచేస్తూనే వున్నాయి!
మధు బి.టెక్. చేసింది.. తల్లి తండ్రులు బలవంతమ్మీద! ఆమెకా చదువులు ఇష్టం లేదు! ఆ ఇంజనీరింగ్ పాసయిన ఏడాదే దురదృష్టవశాన కార్ ఏక్సిడెంట్లో తల్లి తండ్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు, ఉన్న ఒక్క కూతురి అచ్చట ముచ్చట చూడకుండానే! మేనమామ మధును తన వద్దకు రప్పించుకుని అండగా నిలిచాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. ఆరు నెలల క్రిందట అతనికి కలకత్తా బదిలీ అయింది. ఆయన వద్దే వుంటూ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న మధు తప్పనిసరయి వర్కింగ్ విమెన్స్ హాస్టలుకు వెళ్ళిపోయింది! కానీ అక్కడి వాతావరణం.. తీరూ నచ్చక ఒక ఖరీదయిన ఎపార్ట్మెంట్లో ఒక ప్లాట్ అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. మేనమామ చాలా సార్లు చెప్పాడట.. పెళ్లి చేసుకుని స్థిరపడమని! పెళ్లికి బి.టెక్ చేసిన అతని రెండో కొడుకే వున్నాడు. అతను విలాస పురుషుడట! ఏదో చిన్న స్థాయి కంపెనీలో చేస్తున్నాడు! నలభయ్ వేల పైనే ఇస్తారట! ఇంటికి రూపాయి ఇవ్వడు..! అర్ధ రూపాయి దాచుకోడు! ఇది కాదు అసలు కారణం! “మేనరికం నా కిష్టం లేదు మామయ్యా..” అని పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా విముఖత చూపించేది!
“ఏవండీ.. పాపం తల్లీ తండ్రిలేని ఒంటరిదని జాలి చూపించి మనం అండగా నిలిచాం.. ఇప్పుడు మనమూ.. మన వాడక్కర్లేదుట..! ఈవిడ బీటెక్‌కు కాదండీ.. అసలయిన ముదురు టెక్కు..” అంటూ రుసరుసలాడింది మేనమామ భార్య! ఆ పిదప – “మేం కలకత్తా వెళ్లిపోతున్నామమ్మా.. ఇక నీ దారి నీవు చూస్కో..” అంటూ మధు ముఖాన్నే చెప్పేసింది. అతనేదో చెప్పేందుకు ప్రయత్నించగా కటువుగా వారించింది! ఫలితమే ఈ స్థాన చలనం!
తనకు ఎగ్రికల్చర్లో డిగ్రీ చేయాలని వుందని తన స్కూల్ డేస్ నుండే చెప్తుండేది మధు!
తనూ.. మధు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ బస్తీకి దగ్గర్లోనే వున్న రామాపురం తన స్వగ్రామం. తమది వ్యవసాయ కుటుంబం. మధు నాన్నగారు బ్యాంక్ ఉద్యోగి.. పలాసా లోనే చేసేవారు.
మధు హైస్కూల్లో చేరిన ఏడాదే తను టెన్తుకు వచ్చాడు. టెన్తు అయ్యాక అదే వూళ్లో ఇంటర్లో చేరాడు. ఇద్దరికీ స్కూల్ పరిచయం ఒక్కటే కాదు.. దూరపు బంధుత్వం కూడా వుంది! మధు పదో తరగతి పరీక్షలు రాసాక వాళ్ల నాన్న గార్కి విశాఖ బదిలీ అయిన కారణంగా అక్కడికి వెళ్లిపోయింది!
మధు పెద్ద నాన్నగారిది రామాపురమే! వేసవి సెలవుల్లో ఆ నానమ్మ దగ్గరకు వచ్చేది! అక్కడి పచ్చని వాతావరణంలో కొన్ని రోజులు గడిపి వెళ్లేది. అక్కడి పరిసరాలు.. చూడదగ్గ ప్రాంతాలను తనను తీసుకువెళ్లి చూసేది! తను ఓ గైడ్‌గా వ్యవహరించేవాడు! ఓసారి మధు పెద్ద నాన్నమ్మ దగ్గరికొచ్చినపుడు – “పెళ్ళెప్పుడు చేస్కుంటావ్..? మీ మేనమామ సంబంధాలు చూడ్డం లేదా..? అన్నట్టు మీ మేనబావే వున్నాడుగా..” అని ఒక్కసారి కాదు పలుమార్లు ప్రస్తావించేది! పాపం ఆవిడ ఏడాది క్రిందటే పోయింది! పెద తాతగారు ఆమె కన్నా మూడేళ్లు ముందరే గతించి వున్నారు. నాన్నమ్మ పోయిన సందర్భంలోనే వచ్చి మూడు రోజులుండి వెళ్లిపోయింది! అప్పట్నించే మళ్లీ రాలేదు! అప్పుడప్పుడు ఫోన్లు చేసేది! కానీ ఈసారి ఓ లేఖ! అంతలో మధు రాకను గమనించాడు.
చేతిలో ట్రే తో వస్తున్న మధు తడబడుతున్న అడుగులతో వచ్చి తన ముందున్న టీపాయ్ మీద తూలి పడబోతుండగా చటుక్కున లేచి ఆసరాగా అడ్డుకున్నాడు! “ఏమైంది మధూ?” కంగారుగా అడుగుతూనే ముఖాన్ని పరిశీలనగా చూసాడు.
“కాస్త నీరసం.. అంతే..!”
“అంతేనంటావేంటి..? ఒళ్లు కూడా వెచ్చగా అనిపిస్తోంది..! జ్వరమా..?”
జీవన్ కళ్లలోనికి సూటిగా చూసింది మధురిమ.
“ఈ మధ్య వర్కు లోడ్ పెరిగిందిలే.. వర్క్ ఫ్రమ్ హోం కదా..! దానికి తోడు మా పనిమనిషి రెండు రోజుల నుండి రావడం లేదు.. ఆ పనీ..”
జీవన్ నిట్టూర్చాడు! “డాక్టరు దగ్గరకు వెళ్దామా..?” అన్నాడు
మధురిమ నవ్వింది! “ఇవన్నీ నాకు మామూలే! నాకే కాదు మాలాంటి వాళ్లందరికీ..! నా సంగతి సరే.. అక్కడ మన వాళ్లందరూ హేపీయే కదా..?”
“హేపీయే.. ఫీవర్ తగ్గడానికి మాత్రలున్నాయా..? బయటకు పోయి తీసుకురానా?”
“మహాశయా.. అన్నీ వున్నాయ్. తొమ్మిది దాటింది. ముందు టిఫిన్ తినండి.. తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు..” అంటూ ట్రే ను జీవన్ ముందుకు జరిపింది. దాన్ని చూసాడు. ఉప్మా! సగానికి పైగా జీడిపలుకులే! నెయ్యి వేసి కాల్చిన బ్రెడ్ ముక్కలు..! నెయ్యి వాసన ఘుమాయిస్తోంది!
మరో ప్లేట్ నిండా ఏపిల్ ముక్కలు! నిట్టూర్చాడు.
“నీవేం తీస్కోవా..?” ఒక్క ప్లేట్లోనే ఉప్మా వుండటం గమనించి అన్నాడు
“తీసుకుంటా.. మీరు కానియ్యండి.”
“మధూ జ్వరంతో వుండీ నా కోసం ఎందుకిలా శ్రమ తీసుకుంటున్నావ్..?”
“ముందు బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి మహాశయా.. తర్వాత తీరికగా కబుర్లు చెప్పుకోవాలి..”
“అలాగే.. నీవూ తీస్కో.. తిన్నాక, టాబ్లెట్స్ వున్నాయన్నావుగా.. అవి వేస్కో.”
“చిత్తం.. అలాగే..” అంటూ బ్రేక్ఫాస్ట్కని సిద్ధపడుతుండగా ఫోన్ రింగ్ అయినందున దాన్ని స్విచ్ఛాఫ్ చేయబోయి ‘నంబరు’ చూసి ఉలిక్కిపడింది!
“ఒక్క నిముషం” అంటూ లేచి తన బెడ్రూమ్ లోనికి వెళ్తున్న ఆ మెను చూస్తూ నిట్టూర్చాడు.
నాలుగు నిముషాల తర్వాత వచ్చి చూస్తూ – “పెట్టినవన్నీ అలానే వున్నాయేంటీ..?” అంది.
“నీవు లేకుండానా..?”
“అయ్యో… జీవన్.. ముందు వాటి సంగతి చూడండి.. ఇలాంటి అంతరాయాలు మాకు మామూలే! మరి కాస్త ఉప్మా .. బ్రెడ్ పీసెస్ తేనా..”
“వద్దోద్దు.. అల్పాహారం అర్థం మార్చొద్దు” అంటూ బ్రెడ్ ముక్కను అందుకున్నాడు.
మధురిమ తనో బ్రెడ్ ముక్కను అ౦దుకుంది.
ఎవరు ఫోన్ చేసారు..? అడగాలనుకున్న జీవన్ అడగలేదు.
“ఇలాంటి బిజీ లైఫ్‌తో కుస్తీ పడుతూనే వున్నావనుకుంటా.. అదీ ఒంటరిగా..! అరె అదేంటీ ఉప్మా ప్లేట్ నా వైపుకు నెట్టేస్తున్నావ్..?”
ఆమె జవాబివ్వలేదు..!
“జీవితమంటే ఏంటి జీవన్..?” అడిగింది.
హఠాత్తుగా టాపిక్ మారడంతో ఆశ్చర్యపోయాడతను!
“చెప్పండి జీవన్ జీ..”
“సారీ మధూ.. నాకు లెక్కలు.. సోషలు.. సైన్సు లాంటి సబ్జెక్టు పాఠాలే తప్ప జీవితపాఠాలు ఏ మాస్టారూ నేర్పలేదు. కనుక జీవితమంటే ఏం చెప్పనూ..?”
తన మాటలకు నవ్వుతుందనుకున్నాడు. అదేమి వ్యక్తం కాకపోవడంతో ఆమెను పరిశీలనగా చూస్తూ వుండిపోయాడతను.
మధురిమ నిట్టూర్చింది! “జీవితమంటే తెలీదా మీకు..?!” అంది.
ఆలోచనలో పడ్డవాడిలా నటిస్తూ కాస్సేపుండి పోయాడు. తర్వాత – “ఆఁ.. గుర్తొచ్చింది! ప్రవచనకారు డొకాయన టీవీలో చెప్పిన మాటలు గుర్తున్నాయి..!” అన్నాడు.
“ఏంటవీ?..”
“ప్రేమిస్తూ.. ప్రేమించబడుతూ.. ప్రేమను పెంచుకుంటూ దాన్ని అందరికీ పంచుకుంటూ పోయేదీ.. ఆ ప్రేమమూర్తుల్లో దైవాన్ని చూసుకుంటూ ప్రేమతోనే కడదాకా బ్రతికేదే అసలయిన జీవితమంట..!”
కళ్లు పెద్దవి చేసి చూసింది మధురిమ.
“థాంక్స్ టు హిమ్. బట్ అలాంటి జీవితాలు నేడు చాలా చాలా అరుదయిపోయి వున్నాయి! ఇక్కడ నా విషయమే చూడండి.. ఇందాక ఫోన్ చేసింది మా జూనియర్ బాస్! ఓ స్టార్ హోటల్లో తన బర్త్ డే పార్టీ ఇస్తున్నాడట..! నన్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నానని చెప్తున్నాడు. ఆ ప్రత్యేకత ఏంటో నాకు తెల్సు..!”
“ఏంటదీ..?”
“అమ్మాయిలను మాత్రమే ప్రత్యేకంగా పిలుస్తాడతను! అతనే కాదు ఇప్పటికే మరో నలుగురు పురుషులు.. కాదు పురుగులు.. ఫోన్లు చేస్తూ వాట్సప్‌లు పెడుతూ.. వాళ్లని వాళ్లు అసలు రూపంలో ప్రదర్శించుకుంటూ వుంటారు! ఏం జీవన్.. నేనేమన్నా ద్రౌపదినా..?”
గతుక్కుమన్నట్టుగా కళ్లెగరేసాడు జీవన్.
“అయినా ఈ హై కల్చర్డ్ ముసుగేసుకున్న మగవాళ్లందరూ ఒక్కటే..” ఆవేశంగా అంది మధురిమ. “వాళ్లకు వైఫ్ అంటే జస్ట్ ఎ థ్రిల్ ఫర్ ఎ వైల్..!” మరింత ఆవేశపడింది!
“మధూ.. బిజీ ప్రాజెక్టు వర్కులని కాబోలు రాత్రీ పగలు విశ్రాంతి లేకుండా పని చేసుకుంటూ పోతున్నావ్.. జ్వరం కూడా తెచ్చుకున్నావ్.. ప్లీజ్.. రిలాక్స్..”
ఆమె కళ్లు తడి బారడం గమనించాడు.
“ప్లీజ్.. ఎమోషనల్ కావద్దు..”
ఆమె కళ్లల్లో ఏదో అసహనం.. అశాంతినీ గమనించాడు.
‘ఓదార్చి సేద తీర్చే అమ్మా.. నాన్న లేని జీవితం.. అయినవాళ్లూ దూరంగా పెట్టిన విషయం తలచుకుంటూ అప్సెట్ అవుతోంది..’ అనుకున్న జీవన్ నివారణ చర్యలకు పూనుకున్నాడు.
“మధూ.. జీవితమంటే వెలుగూ చీకట్ల మయం! కష్ట సుఖాల ద్వయం! రాగ ద్వేషాల కలబోత! జయాపజయాల కలనేత అని నీకూ తెలుసు. అన్నిటినీ అనుభవిస్తూ అధిగమిస్తూ పోవడమే కదా జీవితం!”
“నిజమే! కానీ ఈ రోజుల్లో ముఖ్యంగా ఇలాంటి జనమహారణ్యాల్లో జీవితమంటే – రోబోల్లాంటి మనుషుల మధ్య రోబోగా మారి.. రోబోటిక్‌గా మారి రోజుల్ని గడపడంగా మారిపోయింది.. పిటీ..!”
“మధూ..”
“అవును జీవన్.. జీవితమంటే నాలాంటి వారికిక్కడ ఏముందీ..? చెప్పుకోవడానికి ఇక్కడ అన్నీ హైటెక్ ఫెసిలిటీసే వున్నాయి! వాటితో పాటు అభద్రత.. అతి జాగ్రత్త.. అతి భయాలు హై సెక్యూరిటీల మధ్య బ్రతకాల్సి వస్తోంది! ఇదేనా జీవితమంటే..?!”
క్షణమాగింది..
“మీరే చూసారుగా, ఇంటికి ఆత్మీయులు వస్తే ఇంటి వారే వెళ్లి స్వయంగా వీధి గేట్ తీసి వారిని ఆదరంగా ఆహ్వానిస్తే ఎలా వుంటుంది..? అలా ఆహ్వానిస్తే వచ్చారా మీరు..? ఎపార్ట్మెంట్స్ మెయిన్ గేట్ దగ్గర మీ ఐ.డి. చూపించి వచ్చారు. తర్వాత ఎలా వచ్చారు..?! నేనిచ్చిన ఏక్సెస్ పర్మిషన్ తీసుకుని దాన్ని మీ సెల్ డిస్ప్లేలో చూపించి మరీ వచ్చారు! ఆ తర్వాత ఈ ఫ్లాట్ మెయిన్ డోర్స్‌ను పిన్ నంబరు సహాయంతో ఓపెన్ చేసి లోని కడుగుపెట్టారు. ఆ సమయంలో నేను బాత్రూంలో వున్నందున పిన్ చెప్పా..! మిమ్మల్ని గుమ్మం దగ్గర వెయిట్ చేయించడం ఇష్టం లేక అలా చేసాను. తొలిసారి వచ్చిన ఆత్మీయ అతిథికి స్వయంగా ఎదురు వచ్చి స్వాగతం చెప్పలేని స్థితి! హాల్లోనికి రాబోతున్న మీకు రికార్డెడ్ వాయిస్ చెప్పింది ‘వెల్కమ్!’. ఐ డిస్లైక్ దిస్ ఫినామినా..”
ఆశ్చర్యంతో వింటూ వుండిపోయాడు జీవన్!
“కనుకనే ఇలాంటి జీవితం వదులుకుని దూరంగా కృతిమత్వం లేని తావుకు వెళ్లి పోవాలన్న వెళ్లిపోవాలన్న ఆలోచన కలుగుతోంది!”
‘ఆ తావు ఎక్కడుందని అనుకుంటున్నావు..? అక్కడ జీవితం ఎలా వుండొచ్చు..? అని అనుకుంటున్నావు..’ అడగాలనుకున్న జీవన్ అడగలేకపోయాడు. కానీ అతని లోని ప్రశ్నను తెల్సుకున్న దానిలా క్షణం కళ్లు మూసుకుని తలెత్తింది.
“ఏ అభద్రత.. ఏ భయమూ లేని చోట .. స్వేచ్ఛా వాతావరణంలో స్వచ్ఛమయిన మనుషులు.. మనసులు ముడిపడే జీవితం అందంగా మధురంగా వుంటుందని నా భావన..!” గంభీర స్వరంతో అంది.
నిట్టూర్చి కొద్దిగా తలాడించాడతను.
“జీవితం ఒక నేచురల్ ఫినామినాగానే వుండాలి తప్ప.. ఆర్టిఫిషియల్‌గా మెకానికల్లీ ప్రాసెస్డ్గా వుండకూడదు కదా! ఒక సహజ జీవితంలో కొనసాగుతున్న వారిలో కొందరు.. అందరూ తన లాంటివారే అని అమాయకంగా నమ్మేస్తూ వుంటారు. కాలవశాన వారు కృత్రిమ జీవితంలోనికి లాగబడితే దానిలో అడ్జస్టు కాలేరు..! అలవాటు పడనూ లేరు. ఫలితంగా మానసికంగా దెబ్బతినడమో లేక తమ జీవితాల్ని అర్ధాంతరంగా ముగించుకునే ప్రయత్నమో చేస్తారు..!”
జీవన్ కుతూహలంగా చూడసాగాడు.
“ఏడాది క్రిందట జరిగిన ఒక సంఘటన చెప్పనా..?”
తలూపాడు,
“మారిపోతున్న లోకం గురించి అంతగా తెలియని ఒకమ్మాయి వుంది. చదువుల్లో మాత్రం తెలివైనది. గిరిజన ప్రాంతమయిన అరకు లోయ పరిసరాల్లోని ఓ గ్రామం నుండి వచ్చింది. బీ.టెక్. చేసింది. క్యాంపస్ సెలెక్షన్లోనే సెలెక్ట్ అయింది! ఈ సిటీలోనే మా కంపెనీలోనే జాయిన్ అయింది. తర్వాత మంచి జీతం వస్తుందని ఒకతను ఆమెను ప్రలోభపెట్టి మా దగ్గర్నుంచి రిజైన్ చేయించి – తను చేస్తున్న కంపెనీలో జాబ్ వచ్చేలా చేసాడు. తనను పెళ్లి చేసుకుంటే స్వర్గం చూపిస్తానని నమ్మించాడు. ఆ అమ్మాయి అతన్ని పూర్తిగా నమ్మింది! ఫలితంగా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది! తర్వాత స్వర్గం చూపిస్తానన్న ఆ మనిషి యూ.యస్. చెక్కేసాడు! ఆ అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పూనుకుంది! సకాలంలో వెళ్లి హాస్పిటల్లో ఎడ్మిట్ చేయించాం. ఎబార్షన్ అయింది. రెండు వారాల పిదప ప్రాణగండం నుండి బయటపడింది! ఆ తర్వాత ఆ అమ్మాయి జాబ్ వదిలి పెట్టేసింది! వాళ్ల వూరెళ్లి పోయింది! అక్కడే ఓ టీచరు ఉద్యోగం ఓ సంపాదించుకుంది.. అమ్మ.. నాన్న.. నాన్నమ్మ.. తాతయ్యల మధ్య హాయిగా బ్రతుకుతోంది..! ఇంటర్ దాకా చదివిన ఓ బంధువుల అబ్బాయి ఆమె గతం తెల్సినా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు! ‘ఇప్పుడు హాయిగా.. స్వేచ్ఛగా వున్నాను. ఓసారి నా దగ్గరకు రా మధూ’ అని నన్ను చాలా సార్లు రిక్వెస్ట్ చేసింది.. చేస్తూనే వుంది..!”
సానుభూతిగా చూసాడు జీవన్.
“ఇప్పుడు చెప్పండి జీవన్. ప్రకృతిలో పుట్టి పెరిగిన ఆ అమ్మాయి బ్రతుకును శాశ్వతంగా వికృతి చేయబోయాడు ఓ హైటెక్ మనిషి! అదృష్టం కొద్దీ ప్రాణగండం తప్పింది కనుక మరో నచ్చిన జీవితాన్ని పొందగల్గింది! ఆ ప్రకృతి కన్య ఇక్కడకు రాకున్నా.. వచ్చి అలాంటి వంచకుడ్ని నమ్మకుండా వున్నా ఆమె బ్రతుకు విచ్చిన్నమయ్యే పరిస్థితి దాపురించేది కాదు కదా..”
తల వూపాడతను.
“మనిషి రోజురోజుకూ హై టెక్నాలజీలోనికి అడ్వాన్స్ అవుతూనే వున్నాడు అదే రేంజ్లో ‘అనాగరికంగా’ – ఈ పదం ఈ సందర్భంలో సరికాదేమో..? మరీ యంత్ర మానవుడిలా.. హృదయంలేని క్రూరజీవిగా మారిపోతున్నాడు! అందుకే నా తత్వానికి సరిపడని ఈ హైటెక్ లైఫ్ అంటేనే పరమ చిరాకు విసుగూ ముంచుకొస్తున్నాయి!”
జీవన్ మౌనంగా ఉండిపోయాడు.
“ఓ పదీ.. పదిహేనేళ్ల క్రితం వరకూ ఈ స్మార్ట్ ఫోన్లూ.. ఎట్సెట్రాలు లేవు. వెబ్ సైట్లూ.. ఫేస్బుక్, వాట్సప్.. ట్విట్టర్, ఇప్పుడేమో ఎక్స్ట. అవీ.. సెల్ కెమెరాల్లాంటి వేవీ లేవు! ఉండినా మన వరకూ రాలేదు! కానీ.. ఇప్పుడవన్నీ మారుమూల గ్రామాల్లోకి సైతం వచ్చేసాయి! జేబులో ఓ పెన్నుండదు, పుస్తకం నామోషీ! కానీ ఓ స్మార్ట్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా వుండి తీరాల్సిందే నేటి యువతలో చాలా మందికి! దాంతో పాటు కనీసం ఓ టూ వీలర్.. ఇంకా కలిగివుంటే ఫోర్ వీలర్ కూడా వుండి తీరాల్సిందే!
టెక్నాలజీ. వాటిని కనుగొన్నప్పుడు లేదా ఆవిష్కరించినప్పుడు వాటికి ఒక సామాజిక ప్రయోజనాన్ని నిర్దేశించారు. కొన్ని పరిమితులను విధించారు! కానీ వాటిని ప్రక్కకు నెట్టి ఇప్పుడేం చేస్తున్నారు..?
అమ్మాయిలు.. ఒంటరిగానో.. బాత్రూముల్లోనో ఉంటే రహస్యంగా సెల్‌తో ఫోటోలు తీస్తున్నారు! తర్వాత వాటితో అమ్మాయిలను లోబరుచుకునేందుకు బ్లాక్మెయిల్ చేసే సాధనాలుగా వాడుకుంటున్నారు! లవ్కూ లైక్కూ తేడా తెలియక ఛాటింగ్‌లు చేస్తున్నారు..! మెస్సేజ్‌లు పెడుతున్నారు.. వాట్సప్‌లు పంపిస్తున్నారు! అలా కొద్దిగా పరిచయమైతే చాలు! అవుటింగ్‌లు.. లాంగ్ డ్రైవ్‌లూ.. క్లబ్బు పబ్బులకు ఆహ్వానిస్తున్నారు..! వాటికి రెగ్యులర్ విజిటర్స్ అయిపోతున్నారు! వాళ్లు తమ మైండ్స్ ఏం కోరుకుంటున్నాయో తెలుసుకోగలిగే తెలివితేటలు పెంచుకోరు..! అవక్కర్లేదు.. ఫిజికల్ నీడ్స్ నెరవేరితే చాలు! అందుకోసం ‘టెక్నాలజీ’ని చాలా నేర్పుగా.. చక్కగా ఉపయోగించుకుంటున్నారు! ఈ సంగతి ఈ యువతరం తల్లితండ్రులకూ తెల్సు.. చదువులు చెప్పే గురువులకూ తెల్సు. తెల్సినా ఎందరు పట్టించుకుంటున్నారు.. ? సరిదిద్దగల్గుతున్నారు..?” ఆగి ఊపిరి తీసుకుంది. రెండు క్షణాల పిదప –
“ఇప్పుడు ఆరేళ్ల పిల్లలు సైతం భయంకరమయిన వీడియో గేమ్‌లకు ఎడిక్ట్ అయిపోతున్నారు! మెదడుకు పదును పెట్టేవా..? తీర్చిదిద్దేవా ఆ చెత్త గేమ్సు..? ఛేజింగ్స్.. రేసింగ్స్.. గన్ షాట్స్.. లాంటివన్నీ ఆ పిల్లల్ని భవిష్యత్తులో ఎలా తీర్చిదిద్దగలవని ఆ పెద్దలు.. గేమ్సును రూపొందించిన టెక్నోక్రాట్స్ ఆలోచిస్తున్నారో వారికే తెలియాలి..!
బాల్యం వీడని ఆ పిల్లతరం వీడియో గేమ్సు ఆడినా.. వాటి కారణంగా వాళ్ల బ్రెయినూ.. బాల్యం చితికిపోతున్నా.. భ్రష్టుపట్టిపోతున్నా ఎవరూ పట్టించుకోరు! ఆ మధ్య ‘బ్లూ వేవ్’ వీడియో గేమ్ కారణంగా ఎంతమంది పిల్లలు.. టీనేజర్స్ ఆత్మహత్యలకు పాల్పడ్డారో మీకు తెల్సు కదా, పేపర్లలోనూ.. టీవీల్లోనూ చూసే వుంటారు. షిట్!”
జీవన్ ప్రాణం వున్న బొమ్మలా వినసాగాడు!
“పార్న్.. టీనేజ్ సెక్స్.. వయొలెన్స్.. శాడిజమ్.. ఈవ్ టీజింగ్ మెథడ్స్, ఇగోయిజమ్ వంటి ముదనష్టపు అంశాలన్నింటిని అక్షయ పాత్రల్లా మార్చి మరీ అందిస్తున్నాయి నేటి కొన్ని సినిమాలు.. యూత్ జేబుల్లోని స్మార్ట్ ఫోన్లు!! కొద్ది రోజుల క్రిందటనే జరిగిన సంఘటనను గుర్తు చేసుకోండి! ఆ ఓ పదిహేడేళ్ల కుర్రాడు ఇంటర్ చదివే అమ్మాయిని సెక్సువల్ పాషన్ తోనూ ఉన్మాదం నింపుకున్న అనుమానంతోనూ పీక పిసికి ప్రీ-ప్లాన్డ్గా చంపేసినట్టు టీవీల్లో చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.. ప్రతీ రోజున్నూ..!
మరికొందరికి వెర్రితలలు మొలుస్తున్నాయేమో.. తమ వెర్రి మొర్రి వేషాలనీ.. పిచ్చి పిచ్చి హావభావాలనూ పబ్లిక్‌గా ప్రదర్శించుకోవాలనే పిచ్చి తపన ఎక్కువైపోతోంది! సామాజిక మాధ్యమాలను వారి వెర్రి పోకడలకు వేదికగా మార్చుకోవడమేంటి..? వాళ్ల మైండ్ సెట్స్.. థాట్స్ ఎలాంటివి..? సామాజిక శాస్త్రవేత్తలే ఆలోచించాలి. పరిష్కారం కనుగొనాలి! ఇక మొన్నటి కరోనా కారణంగా ఆన్లైన్ క్లాస్‌ల పుణ్యమా అని హైస్కూల్ స్థాయి పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్లు.. ట్యాబ్‌లు అందుబాటులోని కొచ్చేసాయి! ఆ పిల్లలు వాటిని కేవలం తమ క్లాసుల కోసమే ఉపయోగిస్తున్నారా..? మరెందుకైనానా..? ఎంతమంది ఆ పిల్లల పెద్దలు నిశితంగా పరిశీలన చేస్తున్నారు..? ఎంతమందికి పట్టించుకొనే తీరిక.. సమయం ఉంటున్నాయ్..? అందరూ ఆలోచించుకోవాలి..!”
జీవన్ తదేకమై పోయాడు.. తడిసిపోసాగాడు మధు అంతరంగ ధారలో!
“జీవన్.. నాలో ఓ ప్రశ్న తేలుకొండిలా మారి కొన్నాళ్ల నుండీ కుట్టేస్తోంది. ఇలాంటి ఘోరాలు.. నేరాలు మరింతగా హైటెక్ పద్ధతుల్లో జరిగే దానికేనా ఈ టెక్నాలజీ రోజురోజుకూ ఎడ్వాన్స్ అయ్యేది..! ఆ టెక్నాలజీ మనలో చాలామందిని ఊబిలా లోపలికి లాక్కుంటున్నా.. అనకొండలా చుట్టేస్తూ బలి తీసుకుంటున్నా మనం ఏమీ చేయలేం – అని నిర్లిప్తంగా ఉండిపోవడమే మంచిదా..? చెప్పండి..”
మధు గొంతులో క్రమంగా ఆవేశం పెరుగుతున్న తీరును గమనిస్తున్న జీవన్ ఆశ్చర్యపోయాడు! కర్తవ్యం వెన్ను తట్టింది!
“మధూ.. ప్లీజ్ నిన్ను నీవు కంట్రోల్ చేసుకో. నీ మానసిక వేదన.. ఘర్షణలన్నీ బయటికొస్తూ నిన్ను బాగా ఎమోషనల్‌గా చేస్తున్నాయ్. ప్లీజ్ రిలాక్స్. నీ మనసునూ.. అంతరంగాన్నీ పూర్తిగా అర్థం చేసుకున్నాను. నేటి విష పరిణామాల్ని.. అందుకు పురికొల్పుతున్న పరిస్థితులనూ చక్కదిద్దడానికి పూనుకోవాల్సింది నేటి పాలకులూ.. పాలితులే! అంటే మొత్తంగా సమాజమే! ఓ.కే..” రెండు క్షణాలు ఆగి మళ్లీ కొనసాగించాడతను.
“మధూ.. ఒక్క విషయం తెల్సుకో. ప్రస్తుతం ఈ హైటెక్ కల్చర్‌లో చెడు ఒక్కటే లేదు! ఎంతో మంచి కూడా వుంది! మన జీవితాలను సరళం చేసే ఎన్నెన్ని ప్రక్రియలున్నాయో నీకు తెలియనిది కాదు! కానీ ఆ మంచి కన్నా వాటిలోని చెడునే కొందరు ఆశ్రయిస్తున్నారు! ఆ చెడు ప్రక్రియనే వారిని అమితంగా ఆకర్షిస్తున్నాయి! వాటి కారణంగానే వారందరూ తమ భవితను కోల్పోయే పరిస్థితులను కల్పించుకుంటున్నారు. కాలక్రమంలో మనందరిలో అంటే సమాజంలో మళ్లీ మంచి దిశగా మార్పు వస్తుంది! అది అనివార్యమవుతుంది. అందుకోసం మనలో కొందరయినా పూనుకుంటున్నారు! వారి ప్రేరేపణతో స్తబ్దుగా ఉండిపోయిన ఎందరెందరో ఉత్తేజితులవుతారు.. స్పందిస్తారు..! అది గొప్ప పరిణామం..! అది తప్పదు.. అని నీవు కూడ నమ్మాలి..” చెప్పి నిట్టూర్చాడు.
కొన్ని క్షణాల పిదప –
“ఇక ప్రస్తుతానికి వద్దాం.. చెప్పు ఎందుకు నన్ను రమ్మన్నావ్..?!”
“సారీ జీవన్.. సారీ..! నిజంగా ఎమోషనల్ అయ్యా! ఇక విషయానికే వస్తున్నా..”
జీవన్ ముఖం నిండా కుతూహలం నిండిపోయింది!.
“మా పెద్ద నాన్నమ్మ గారి పొలాన్ని అమ్మేస్తున్నాడు అమెరికాలో వున్న ఆవిడ మనవడు! దాన్ని నేను కొనదల్చుకున్నాను. ఆ అమ్మకాలు.. కొనడాల సంగతి నాకు ఏ మాత్రం తెలియవు! వాటి విషయం మాట్లాడేందుకే మిమ్మల్ని రమ్మన్నాను.”
జీవన్ ఆశ్చర్యపోయాడు!
“పొలం కొని కౌలుకిస్తావా..?!”
“ఎందుకూ..? నేనే వ్యవసాయం చేస్తా..”
జీవన్ ఆశ్చర్యం రెట్టింపు అయిపోయింది!
“సాఫ్ట్వేరు తప్ప మరేదీ తెలియని అమ్మాయివి హార్డ్‌కోర్ లాంటి ఎగ్రికల్చరెలా సాగిస్తావు..?”
“జీవన్.. మీరు ఎగ్రికల్చర్ రంగంలో కొత్త కొత్త విధానాలతో ముందుకు సాగుతూ ఎందరికో మార్గదర్శకుడవుతున్నారు! మీ ప్రగతికి సంబంధించిన గుర్తింపూ.. బహుమతులూ అందుకుంటున్నారు! ఆ విషయాలన్నీ పేపర్లూ ఆ టీవీల్లో చూస్తూనే వున్నా! మరి ఆ జీవన్ నాకు మార్గదర్శకుడిగా.. ఒక తోడుగా ఉండలేరా..?”
యథాలాపంగా వింటున్న జీవన్ ఉలిక్కిపడ్డాడు!
“నేనా..?”
“అవును.. మీరే..”
“కాస్త అర్థమయ్యేలా చెప్పు మథూ..”
మధురిమ నిట్టూర్చింది! కాసేపు కళ్లు మూసుకుని విప్పింది!.
“నేను ఇక్కడి వాతావరణంలో ఇమడలేకపోతున్నాను. ఇక్కడ నేను సంపాదించిన దెంతంటే నెలకు వచ్చే దాంట్లో మూడోవంతు దాకా ఈ హై సెక్యూరిటీ నివాసానికున్న అద్దెకూ.. సేవలకూ పోతుంది! ఇక మిగిలిన ఖర్చులూ అదే స్థాయివి! దానిక్కాదు నేను బాధ పడేది.. ఇక్కడ మానసిక తృప్తి.. ఆనందాలు జీరో! కనుక మన రామాపురం వెళ్లి సేద్యం పనులు చేపడితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది..! దానికి బలమిచ్చింది.. ప్రేరణగా నిల్చిందీ మీరే! సేద్యం పనుల్లో శరీరానికి చక్కని శ్రమ.. మనసుకు తృప్తి ఉంటాయి కదూ..”
అప్రయత్నంగా చిన్నగా నవ్వి తల వూపాడు జీవన్
“మధూ..” అతను ఏదో అనబోతుండగా అడ్డుకుంది.
“జీవన్.. మీరు చాలా తెలివయిన వారు! శ్రమ విలువ.. కాలం విలువ తెల్సినవారు! మనిషీ విలువ తెల్సినవారు. వాటి గురించి హైస్కూల్ రోజుల్లోనే మాకు చెప్పేవారు! నేను మర్చిపోలేదు. ఇందాక జీవితమంటే ఏమిటి..? అనడిగితే ఆ పాఠాన్నెవరూ బోధించలేదని నంగనాచి పోజిచ్చారు! బట్ ఐ నో యూ ఆర్ ఏన్ ఇంటెగ్రేటెడ్..!”
జీవన్ వైపు ప్రశంసగా చూసింది!
బదులుగా చిన్న నవ్వుతో చూసాడతను!
ఆ సమయంలో పదేళ్ల గతం గుర్తు కొచ్చింది!
కొత్తగా వస్తున్న హైటెక్ చదువుల మీద మోజుతో మధును వాళ్ల నాన్నగారు విశాఖ లోని ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు. హైస్కూల్ రోజులో కూడా వేరే ధ్యాసలు పెట్టుకోకుండా కేవలం పుస్తకాల చదువుల ఆమె దృష్టి.. ధ్యాస వుండేలా కనిపెట్టుకుని వుండేవారు!
“ఆ పల్లెటూరి బైతు గాడితో నీకు అస్తమానం కబుర్లేంటి..?” అని మధును చీవాట్లు పెట్టేవారు. వాటిని పట్టించుకోకుండా ఆమె వీలున్నపుడల్లా తన దగ్గరకే వచ్చేది! ఫలితంగా తను వాళ్లింటికి రాకూడదని తీవ్ర హెచ్చరికలూ మధుకు తల వాచేలా చీవాట్లు ఆ పేరెంట్సు నుండి లభించేవి! అవి తలపుకు రాగా తనలో నవ్వుకున్నాడు జీవన్.
అది గ్రహించినట్టుగా అంది మధు –
“ఏం ఒక అమ్మాయికి తను ఇష్టపడే చదువులు నేర్చేందుకూ.. తను కోరుకునే జీవితం పొందేందుకూ స్వేచ్ఛ వుండదా..? పిల్లలు పెడదారిన వెళ్తున్నట్టు గ్రహిస్తే వాళ్లను సవ్యమైన దారిలో పెట్టడానికి ఆ తల్లి తండ్రులు ఆంక్షలు విధించవచ్చు. దాన్ని కాదనలేం! కానీ ఆ పిల్లలు యువకులైనా సరే.. మానసికంగా ఎదిగి వున్నా సరే.. వాటిని కూడ హైజాక్ చేసేందుకు సిద్ధమయితే వాళ్ల మనసులు ఎలా స్పందించాలి..? ప్రతీ క్షణం ఆ పెద్దల కట్టడి లోనే వుంటే ఆ యువత జీవితంలో ముందుకు సాగుతుందా..? చెప్పండి జీవన్..?”
జీవన్ మౌనంగా ఉండిపోయాడు!!
“ఇప్పుడయినా నా కిష్టమయిన దారిని ఎంచుకోవడంలో నా ఆలోచన నా నిర్ణయం తప్పంటారా..?”
జీవన్ బలంగా ఊపిరి పీల్చాడు.. వదిలాడు! మధును పరీక్షగా చూసాడు. ఆమెలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనబడుతోంది!
“తప్పు కాదు! కానీ..” పెదవులు కదిలించాడు.
“చెప్పండి..”
“అక్కడ నీవు ఒంటరిగా..”
చిన్నగా నవ్వింది మధురిమ!
“మీరు లేరా తోడుగా.. ఉండరా నీడగా..!”
“మధూ..”
“నాకు జీవన మాధుర్యాన్ని అందిస్తారన్న ఆశతోనూ.. నమ్మకంతోనూ అడుగుతున్నాను. అందించలేరా జీవన్..?” సమీపించింది మధు.
అతని చేతుల్లో తన రెండు చేతుల్ని వుంచింది!
జీవన్ చకితుడై పోయాడు! వాటిని గట్టిగా అదిమి వుంచాడు. అది అప్రయత్నమే అయినా తీవ్ర ఉద్వేగం.. ఉత్తేజం ఆవహించాయి నాలుగు చేతులకూ..!