[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘జీవన కాంక్ష’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
జీవితం చాలా చిన్నదేగానీ..
జీవించినంత కాలం సాగించే
సుదూర ప్రయాణాలు మాత్రం..
కచ్చితంగా జీవితాన్ని పెద్దదిగా చేస్తాయి!
నా జీవన యానంలో..
అగాధాలూ లోయలూ
దాటే నిరంతర ప్రక్రియలో
ప్రాణం అలసిపోయింది!
శక్తి హరించుకు పోయింది!!
జీవితమే స్తంభించి పోయిందనే భావన
నా మనసును అతలాకుతలం చేసింది!
బంధాలను ప్రేమించాను..
అనుబంధాలను, రక్త సంబంధాలను
సుసంపన్నం చేయడం కోసం
త్యాగాలెన్నో చేశాను!
జీవన రహదారుల్లో నడిచే వేళ..
సుడిగుండాలను దాటేసి
ముందుకు సాగిపోయాను!
సూర్య చంద్రుల్ని చూస్తూ..
నక్షత్రాల్ని లెక్కిస్తూ..
నెలలూ, ఏళ్ళూ, దశాబ్దాలూ కరిగిపోయాయి!
ఆయువు చిన్నదై పోయింది!!
వయసు భారంతో..
ఉచ్ఛ్వాస నిశ్వాసాల ధారలు తగ్గిపోయి
ఆశలు, ఆకాంక్షలు పలచనై పోయాయి!
ఈ జీవితం చరమాంకంతో
బలమైన కోరిక ఒకటి
నన్ను వెంటాడుతూ వేధిస్తోంది!
నా త్యాగాల రక్తంతో ప్రాణం పోసుకున్న
నా ఆత్మబంధాలన్నీ..
ఎక్కడెక్కడో సుదూర తీరాలలో
హాయిగా సేదదీరుతూ..
నా ఉనికినే విస్మరించాయి!
ఆ బంధాలతో..
తిరిగి అనుబంధాన్ని
అనుభూతించాలని
చిట్టచివరి చిరుకోరిక!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.