[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘జీవం లేని చిరంజీవి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పాపం ఆ రహదారి విశ్రాంతన్నదే ఎరుగదు
పగలూ రేయిల స్పృహ దానికి ఉన్నట్టూ లేదు.
పగలంతా మందల వందల వరుస వాహనాలు
రాత్రంతా రాకాసి వాహనాల స్వైర విహారాలు
ఆ రహదారిలో నిశ్శబ్దం.. తన జీవిత కాలానికి
శబ్దానికి అంకిత భావంతో దాసోహమైపోయిందేమో!
శబ్దం ప్రతిక్షణం తన ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది
నిత్యం.. యంత్ర ఘీంకారాలతో కర్ణ కఠోర శబ్దాలతో.
మనిషి మనుగడకు పూలమెత్తలా ఆ రహదారి
తనపై ఎంత భారం మోపినా.. సునాయాసంగా,
సువిశాలంగా సుదీర్ఘంగా, నిత్యమూ..
పెంపుడు ఖర రాజంలా కొనసాగుతునే ఉంది..
అవును జీవం లేకపోయినా అది చిరంజీవి.
మనిషి నిర్లక్ష్యానికి ఆతని తప్పిదాలకి
మూల్యంగా చెల్లింపబడ్డ అమూల్యమైన
జీవితాల వైకల్యాలకు,ముగింపు వ్యథలకు
మూగ సాక్షిగా తాను..
పాపం! తనువంతా గాయాలతో..
ఆరని ఆ తడి ఆరేంత వరకూ
రోదిస్తున్నట్టే ఉంటుంది..
పాపం! తనకి ఆ వ్యథ మానని గాయమేమో!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు,100 కవితలు రాశాను.