[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘జీవామృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తలకి దెబ్బ తగిలి అనకాపల్లి స్టేషన్ వెయిటింగ్ రూమ్‍లో నిద్రపోతుంది నీహారిక. తెల్లవారుతుండగా ఆమెకి మెలకువ వస్తుంది. అంతకుముందు నిద్రలోనే ఆమెకి తన తల్లిదండ్రులు గుర్తొస్తారు, స్వంత ఊరు జ్ఞాపకం వస్తుంది. వెంటనే లేచి కూర్చుంటుంది. స్టేషన్‍లోకాఫీ తాగి, బస్టాండ్‍కి వచ్చి మడుతూరు వెళ్ళే బస్ ఎక్కుతుంది. ఆమెకు గతం గుర్తుస్తొంది. పెళ్ళయ్యాకా, వేణు బావా కాకినాడ, తను వైజాగ్ వెళ్ళారు. బావ రాసిన ఉత్తరం విషయం గుర్తొస్తొంది. తానా ఉత్తరానికి జవాబు రాసిందో లేదో గుర్తురాదు. ఇంతలో మడుతూరు వచ్చినట్టుగా కండక్టర్ కేక వేస్తాడు. నీహారిక దిగుతుంది. తాను సొంతూరుకి వచ్చి 16 సంవత్సరాలు గడిచిపోయినట్లు జ్జాపకం వస్తుంది. రోడ్డు పక్కన పాకలో టీ తాగుతున్న రాము, ఆ గ్లాసుని వదిలేసి నీహారిక వైపు పరిగెత్తుకొస్తాడు. అతన్ని గుర్తుపట్టి పలకరిస్తుంది. తల్లిదండ్రుల గురించి ప్రశ్నలు వేస్తూ, ఇంటి వైపు నడుస్తుంది. లోపలికి అడుగుపెడుతూనే తెల్లచీరలో కనబడిన తల్లిని చూసి, కళ్ళు తిరిగి పడిపోతుంది. జరిగినదంతా రాము వివరిస్తాడు. భర్త చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుని, మామూలు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని నీహారికపై నీళ్ళు జల్లి, స్పృహ తెప్పిస్తుంది. వేడివేడి పాలు తాగిస్తుంది. నీహారిక వచ్చిందని తెలిసి ఊరి వారంతా ఇంటి ముందు గుమిగూడతారు. రాము వారందరికీ నచ్చజెప్పి తర్వాత రమ్మని పంపించేస్తాడు. నీహారిక కాస్త తేరుకున్నాకా, నాన్న అటక మీద ఉన్నాడు, పైకి వెళ్ళి కలువు అంటుంది. తండ్రి అటక మీద కాయితాలు దాచిపెట్టే పెట్టె కోసం అటక ఎక్కుతుంది. పెట్టె లోంచి నాన్న తనకి రాసిన ఉత్తరం బయటకు తీస్తుంది. అది చదివితే, వేణు బావ జాతకంలో అకాల మృత్యువు ఉండడం, అతనితో తన పెళ్ళి ఆపడానికి నాన్న ప్రయత్నించడం, కనీసం సంవత్సరమైన తామిద్దరూ విడిగా ఉండాలని కోరుకోవటం అన్నీ ఆయన ఆ ఉత్తరంలో రాస్తారు. అనుకోకుండా విషజ్వరం వచ్చి వేణు చనిపోయాడని, రాము విశాఖపట్నం చేరి ఆ వార్త చెప్పగానే నీహారిక స్పృహ తప్పి పడిపోయిందని, తల్లి ఆమెను ఆసుపత్రిలో చేర్చించనీ, కానీ ఆ రాత్రి నీహారిక కనిపించకుండా పోయిందని రాస్తాడా ఉత్తరంలో. నీహారిక ఎప్పటికైనా తిరిగి వస్తుందనీ, తనని క్షమించమని కోరుతాడాయన. ఉత్తరం చదవడం పూర్తి చేసిన నీహరికకి ఆ రోజేం జరిగిందో గుర్తొస్తుంది. – ఇక చదవండి.]
అధ్యాయం 7
తిరిగి కళ్ళు తెరిచేసరికి చాలామంది అమ్మాయిలు తన మీదకు వంగి చూస్తున్నారు. ఏదేదో మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటూ. వాళ్ళు ఎవరూ తనకు తెలియదు. తను ఎక్కడున్నదో తెలియలేదు.
తలనొప్పిగా అనిపిస్తూ ఉంటే మెల్లిగా చెయ్యెత్తి తడుముకోబోయింది.
“ఆ!ఆ! ఆగు! ఏయ్ పిల్లలూ! వెళ్లండి ఇక్కడి నుంచి.” గదుముతూ ఒక పెద్దావిడ వచ్చింది.
“ఎలాగుందమ్మా! కారు బోనెట్ తగిలి తలకు చిన్న బొప్పికట్టింది. అంతే! అదృష్టం. ఇంకెక్కడా దెబ్బలు తగలలేదు.”
ఆమె ఏమి చెబుతున్నదీ అర్థం కాలేదు. ఆమె ఎవరో పోల్చుకోడానికి ప్రయత్నించింది. కానీ గుర్తురాలేదు.
“డాక్టర్ వస్తాడు. ఇంజక్షన్ ఇస్తాడు. ఇప్పుడు కొంచెం పాలు తాగి పడుకో!” గ్లాసుతో పాలు అందించింది. గ్లాసు పట్టుకోలేకపోతే అమ్మలాగా చేరువగా కూర్చుని కొంచెం కొంచెం పట్టించింది.
మగతగా అనిపిస్తోంది. కళ్ళు మూసుకుని పడుకుంది.
అది ఒక ప్రైవేట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. ఆమె ఆ హాస్టల్ యజమాని కం వార్డెన్ వసుంధర దేవి. విశాఖ మహానగరంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేసే అమ్మాయిలు అన్ని వయసుల వాళ్ళు అక్కడ ఉంటుంటారు. చాలావరకు ఆమె వారందరినీ అదుపాజ్ఞలలోనే ఉంచుతుంది. కానీ వయసులో ఉన్న పిల్లలు అప్పుడప్పుడు బయటకు వెళ్లి వస్తుంటారు.
రాత్రి పది గంటలు దాటితే రాకపోకలకు ఎవరికి అనుమతి ఉండదు. బయటకు వెళ్లినవారు సమయానికి రాకపోతే గేటు వేసేసి లోపలికి అనుమతించరు.
అందులో ఉన్నవారందరికీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అరేంజ్ చేస్తారామె. ఆఫీసులకు వెళ్లేవాళ్లు అక్కడి నుంచే బాక్సులు పట్టుకొని వెళ్తూ ఉంటారు.
రాత్రిపూట అందరూ ఆమె చుట్టూ చేరి, వాళ్ళ ఆఫీసు కబుర్లు చెబుతూ, కంచాల్లో అన్నం తింటూ, టీవీ చూస్తూ, వాకిటి నిండా కూర్చుని, గలగలా కబుర్లు, కిలకిలా నవ్వులు చాలా సందడిగా ఉంటుంది. 10 దాటితే ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. రూముకి ఇద్దరు చొప్పున వుంటారు.
ఆ రోజు ఆదివారం సాయంత్రం అందరూ కారులో హుషారుగా బయలుదేరి, సినిమాకు వెళ్లి, అక్కడి నుంచి హోటల్‌కి వెళ్లి, బీచ్ రోడ్డుకి వెళ్లి, తిరిగి వస్తూ ఉండగా జరిగిందా సంఘటన.
హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న నీహారిక పరిగెడుతూ వచ్చి వాళ్ళ కారు కిందే పడింది.
వసుంధరదేవి నీహారికను తల్లిలాగా ఆదరించింది.
మళ్ళీ నిద్ర.. మెలకువ.. నిద్ర… మెలకువ.. మొదటిలో లీలగా ఏవేవో కంటి ముందు కదలినా క్రమేపి ఏవీ గుర్తుకు రావడం మానేశాయి.
నీహారిక తన పేరు కూడా చెప్పలేకపోవడం గమనించి, వివరాలేవీ తెలియకపోవడం చూసి, ప్రత్యేకంగా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించారు వసుంధర దేవి.
తన ఆఫీస్ రూములో ఆమె డాక్టర్ గారితో మాట్లాడారు.
“డాక్టర్ గారూ! ఈ అమ్మాయికి తెలివి రావటం లేదు. తనకి ఏమీ గుర్తుకు రావటం లేదు. మనం ఏం చేయగలము? ఈమె తల్లిదండ్రులు వెతుక్కుంటారేమో? మన కారు కింద పడడం వలన ఆమె జ్ఞాపకశక్తి పోయిందంటే పోలీస్ కేస్ అవుతుంది కదా! పోలీస్ స్టేషన్లో ఈమెను అప్పగించేద్దామా?”
డాక్టర్ శశాంక్ ప్రముఖ సైకియాట్రిస్ట్ ఆమెతో ఇలా అన్నాడు “మేడమ్. గత వారం రోజులుగా చూస్తున్నాను. ఈమె కొంచెం కోలుకుంటే గాని మనకు ఏ విషయం పూర్తిగా తెలియదు. తలకు దెబ్బ తగలడం వలన జ్ఞాపకశక్తి పోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను మర్చిపోవడం అంటే తన పేరు, వృత్తి, కుటుంబం, స్నేహితులు ఏవి గుర్తించలేకపోవడం కొందరిలో ఉంటాయి.
ఈ వ్యాధిని అమ్నీషియా అంటారు.
అంటే గుర్తులేకపోవడం, గుర్తించలేకపోవడం.
ఇందులో చాలా రకాలు ఉంటాయి.
రిట్రోగ్రేడ్ అమ్నీషియా; ఏంటిరోగ్రేడ్ అమ్నీషియా; డిస్సోసియేటివ్ అమ్నీషియా; సెలెక్టివ్ అమ్నీషియా;
కొందరికి వెంటనే తన గతం గుర్తుకు రావచ్చు. మరికొందరికి చాలా సమయం పట్టవచ్చు.
జ్ఞాపకశక్తి తిరిగి రావడం అనేది మనం ఇచ్చే మెడిసిన్ వల్ల కావచ్చు. పరిసరాల్లో జరిగే సంఘటన వలన కావచ్చు. ముఖ్యంగా ఆమెకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్ తను తన చుట్టూ ఉన్నవారి నుండి ‘సేఫ్’ అన్న భావన కలగాలి. అప్పుడే మనం ఇచ్చే ట్రీట్మెంట్ పనిచేస్తుంది. అలాగే బాధ కలిగించే విషయాలు ఆమెకు చెప్పకూడదు.
ఒకప్పుడు ఈ కొత్త జీవితం, ఇందులో స్నేహితులు, తాను నేర్చుకునే కొత్త విద్యలు ఈ కొత్తజీవితమే ఆమెకు ఆనందంగా ఉండి, కొన్నేళ్లపాటు గడిపేయవచ్చు. కొంచెం కోలుకునే వరకు మనం ఏమి చెప్పలేము. నా వరకు సలహా ఏమిటంటే ప్రస్తుతం ఏ రకమైనటువంటి జ్ఞాపకం లేని ఈమె బయట ప్రపంచంలో అయితే రక్షణ ఉండకపోవచ్చు. మీ దగ్గర ఆమె సేఫ్‌గా ఉంటుంది. తనకు బాగా తెలివి వచ్చిన తర్వాత వివరాలు అడిగి, మనం వారి తల్లిదండ్రుల వద్దకు పంపించేద్దాము. అంతవరకు మీరు, హాస్టల్లో ఉన్న వాళ్ళు అందరూ ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. నేను కూడా వారం వారం వస్తాను.” అని చెప్పాడు.
రోజూ పాలు, పళ్ళు, టిఫిన్, అన్నం దగ్గరుండి తినిపించే ఆమెను అందరిలాగే తాను కూడా అమ్మా! అనే పిలుస్తున్నాది. ఆమె చూపిన శ్రద్ధకు తనకు ఆరోగ్యం కుదుటపడింది. కానీ ఏమీ గుర్తుకు రావడంలేదు.
కృత్రిమమేదో సహజత్వం ఏదో తెలుసుకునే విచక్షణ లేదు. తలకు తగిలిన దెబ్బ మాను పట్టింది. కానీ..
కొత్తగా స్నేహితులైన అమ్మాయిలంతా నవ్వుతూ, కబుర్లు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, డాన్సులు చేస్తూ ఉంటే తనకు ఏమీ రావు. వారిని అలా చూడడం తప్ప. వాళ్లంతా ఎక్కడెక్కడికో తిరిగి వస్తున్నారు. అడిగితే షాపింగ్ అనీ, సినిమాలనీ చెప్తారు.
“నేను రానా?” అని అడిగింది.
“వద్దులే! అసలే బంగారుబొమ్మవి. అమ్మకు తెలిస్తే బ్యాండ్ బ్యాండ్” అంటూ వెళ్ళిపోయేవారు.
తనున్న గది అంతఃపురం అందులో తాను ఒక గాజు బొమ్మ. కాలం గడిచే కొద్దీ గాయాలు మానుతున్నాయి. ఏమీ తెలియకపోవడం, గుర్తు రాకపోవడం కొంత దుఃఖాన్ని కలిగించేది.
వాళ్లలో తాను కలిసిపోయింది. మేడ మీదకి, కిందకు వెళ్లి వచ్చేంత స్వాతంత్రం దొరికింది.
అదొక జీవన విధానం.
ఏ ఇష్టాలు, అయిష్టాలు, అభిరుచులు, సాధ్యాసాధ్యాలు గురించి ఆలోచనే లేదు. బొమ్మలా అలంకరించుకోవడం – ఆకలివేస్తే తినడం – నిద్ర వస్తే పడుకోవడం – ఏదీ జ్ఞాపకం లేని తనకూ అన్నీ జ్ఞాపకమున్న మిగతావారికి జీవన విధానం తీరు ఒకటే!
అమ్మ అందరినీ బయటకు పంపేది. కానీ తను అడిగితే “వద్దమ్మా! బంగారుతల్లి కదూ! నీకేం కావాలో చెప్పు తెప్పిస్తాను” అనేది.
పాలరాతి బొమ్మలాంటి తన శరీరం అందమైన తన రూపం అందరికీ తనంటే ఇష్టమే!
అందరూ కలిపి ఆమెకు ‘చందన’ అని పేరు పెట్టారు.
చందూ, చందనా! అని అందరూ పిలుస్తూ ఉంటే కొత్తగానే ఉండేది.
ఒకరోజు డాక్టర్ గారు వసుంధరాదేవితో ఇలా అన్నారు. “మనకు ఎన్ని రోజులైనా మార్పు కనపడటంలేదు అంటే ఆమెకి మందులతో పాటుగా సైకోథెరపీ కూడా అవసరమే! అంతేకాకుండా ఆమెతో చక్కని సంభాషణ చేసే వాళ్ళు ఉండాలి. అదే సమయంలో ఆమె ఆలోచనా విధానంగాని భావాలుగాని, ప్రవర్తనగాని ఎలా రియాక్ట్ అవుతుందో గమనిస్తూ ఉండాలి.
ముఖ్యంగా మీరు గమనించి నాకు చెప్పవలసినది ఒకటుంది. రాత్రిపూట ఆమెకు పీడకలలు రావటం గాని, అరవడం గాని, పాత సంఘటనలు ఏవైనా గుర్తుకు వచ్చి ఏడవటం గాని చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నదేమో చూసి చెప్పండి.
అదే విధంగా నా దగ్గర ఉన్న అసిస్టెంట్‌ని రోజూ పంపిస్తాను. కొంత సమయం తనతో గడిపి, సాయంత్రం పూట బయటకు తీసుకువెళ్తాడు. ఈ ఊరిలో కొన్ని ప్రదేశాలు తిప్పడం వలన తనకు ఏమైనా గుర్తుకు రావచ్చును. వీరు చాలా సున్నితంగా ఉంటారు. మంచిమాటలకే వింటారు. ఎవరైనా కోపంగా తిట్టినప్పుడు, అనుకోని సంఘటన జరిగినప్పుడు తెలివితప్పి పడిపోతూ ఉంటారు. లేదా మనసుకు నచ్చని సంఘటనలు జరిగినప్పుడు కూడా వారి ప్రవర్తన విపరీతంగా ఉంటుంది. దానిని బట్టి మనం మందులు మార్చుతూ ఉండవలసి ఉంటుంది. అందువలన అతడిని పంపడానికి మీరు అనుమతించాల్సి ఉంటుంది.” అన్నాడు.
“ముఖ్యంగా ఇటువంటి వారికి కళల మీదకు వారి దృష్టిని మళ్లించి శాస్త్రీయ సంగీతంగాని, నృత్యం గాని నేర్పించడం వలన వాటి మీద అభిరుచి పెంచుకొని, తమ వరకు తాము సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతారు.” అని చెప్పారు. అంగీకరించడం తప్ప ఏం చేయాలో ఆమెకు తెలియలేదు.
వారానికి ఒకసారి వచ్చి డాక్టర్ చూసి వెళ్లడం, ఫీజు ఇవ్వడం, మందులు కొనడం ఇవన్నీ వసుంధర దేవికి కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ తన బిడ్డతో సమానమైన, ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లుగా ఉంటున్న ఆమెను మైనార్టీ అయినా తీరని ఆ చిన్నారిని బయట ఎవరికో ఇచ్చేయడం ఆమెకు నచ్చలేదు. అందువలన తన సంరక్షణలోనే ఉంచాలని నిర్ణయించుకున్నది.
అధ్యాయం 8
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి.
తనున్నది ఏ ఊరు? ఏ ఏరియా? కూడా తెలియడం లేదు. తన దగ్గరకు వచ్చే అందరిలో డా.శశాంక్ మరియు ప్రణవ్‌ని తాను ఎక్కువగా ఇష్టపడేది. అతని లాలన, మాటతీరు ఎవరినో గుర్తుచేసేది. గుర్తురాక ఇబ్బంది పడేది.
“ప్రణవ్ ఏం చదువుతున్నావు? ఇదే ఊరు? నిన్ను చూస్తే నాకు బాగా దగ్గరగా కావలసిన వారెవరో అనిపిస్తోంది.” ప్రశ్నించింది.
అమ్మలాంటి వసుంధరాదేవి చందన దగ్గరకు వచ్చేటప్పుడే ఏ విషయాలు ఎత్తకూడదు అని ఆమెకు ఆనందాన్ని ఇచ్చేవి మాత్రమే సంభాషించాలని అందరికీ నియమాలు పెట్టేది. లేకుంటే ఏమాత్రం అనుమానం వచ్చినా వారిని తన దగ్గరకు ప్రవేశం నిషిద్ధం.
ప్రణవ్ మాత్రం తనను మామూలు చేయాలని ప్రయత్నించేవాడు. తన పేరు, ఊరు అడిగినా చెప్పలేకపోయేది. గతం గుర్తుకు రాకపోయినా ప్రస్తుతం తనకు ప్రణవ్‌తో బాగానే ఉండేది.
“వారానికి ఒకసారి బదులు రోజూ రావచ్చు కదా! రోజూ నా దగ్గర నువ్వే ఉంటే ఎంతో బాగుంటుంది.” అని చిన్నపిల్లలా చెప్పేసరికి అతడు ఎంత ఆనంద పడిపోయాడో!
వసుంధరాదేవితో అదే చెప్పాడు.
చందనకు జ్ఞాపకశక్తి నెమ్మదిగా రావచ్చును. లేదా సడన్‌గా రావచ్చును. ఈ అమ్మాయి ఈ ఊరు అమ్మాయి అయితే బయట కొన్ని ప్రదేశాలు తిప్పి తీసుకురావడం వలన జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వారానికి ఒకరోజు ఒక్కో ప్రదేశంకి తిప్పి తీసుకువస్తే ఒక మంచి ప్రయత్నం అవుతుంది. ఒక నెల రోజులు చూద్దాం.
జీవకోటిని సృష్టిస్తూనే భగవంతుడు వాటిలో అన్యోన్యానురాగాలు, రాగబంధాలు, విడిపోతే దుఃఖాలు అనే దారాలతో బంధించి పంపిస్తాడు అనుకుంటాను. వసుంధర దేవికి ఆమె తన కూతురు అన్నంత గాఢమైన ప్రేమ ఎందుకు కలిగిందో?
డాక్టర్ శశాంక్‌కి ఒక అపురూపమైన అందమైన శిల్పాన్ని తిరిగి ప్రాణం వచ్చేటట్టుగా చేయాలి అనే అభిలాష ఎందుకు కలిగిందో? కారణాలు మనం తెలుసుకోలేము. కార్య కారణ సంబంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి.
భగవద్గీతలో చెప్పినట్లు
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మాకర్మఫలహేతుర్భూర్మాతేసజ్ఞోన్త్వ కర్మణి” (2-47)
కర్మలు చేయుటయందే నీకు అధికారం కలదు. కర్మఫలములను ఆశించు అధికారము లేదు. అందువలన కర్మఫలములకు నీవు కారణభూతుడవు కాకుము. అట్లని కర్మలు చేయుట మానరాదు. నిష్కామకర్మలు చేసి ఫలమును నాకు వదలుము.
వసుంధరాదేవికి డాక్టర్ శశాంక్ ముందు నుంచి తెలుసు. వాళ్ళ కుటుంబం చాలా సంస్కారవంతమైన కుటుంబం. అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు, ముచ్చటైన సంసారం వారిది. అందుకనే ప్రణవ్‌ని పంపించి చందనను బాగు చేయటానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆమె ఎటువంటి అడ్డు చెప్పలేదు.
వసుంధరాదేవి అనుమతి తీసుకున్న తర్వాత ఒకరోజు ప్రణవ్ చందనను ఊరంతా తిప్పి తీసుకొచ్చాడు. ప్రతి ప్రదేశాన్ని పేర్లు చెప్పి గుర్తు చేశాడు. అయినా చందనలో ఏ మార్పూ రాలేదు.
ఇంటికి సంగీతం టీచర్ వచ్చి చందనకు పాఠాలు చెప్పేది. చందన ఎంత తొందరగా నేర్చుకునేది అంటే ఇంతకుముందు ఆమెకు వచ్చునేమో గుర్తు తెచ్చుకుని పాడుతున్నాది అన్నంత సహజంగా పాడేది. ఆమె గొంతు బాగుండడమే కాదు. చక్కగా సాధన చేసేది.
‘నాభీ హృత్కంఠ రసనా..’ అని ఆమె పాడుతూంటే అమ్మాయిలు అందరూ ఆమె చుట్టూ చేరిపోయేవారు. చందన గొంతులో ఒక ఆధ్యాత్మిక ఆర్ద్రత ఉందని అందరూ భావించేవారు.
చందనకు ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాడు. అందులో ఒకే నెంబర్ ఫీడ్ చేసాడు ప్రణవ్ నెంబర్. ఎంత మంచివారైనా ప్రణవ్, చందన కొన్ని సంవత్సరాలుగా కలిసి తిరిగే వేళలలో సామీప్యం సాన్నిహిత్యాన్ని పెంచింది. అనుకోకుండానే ఇరువురూ ఒకటవడం జరిగిపోయింది. అతనిని విడిచి ఉండలేనంతగా అల్లుకు పోయింది చందన.
దాని గురించి తప్పొప్పులు తెలుసుకునే స్థితిలో చందన లేకపోయినా ప్రణవ్‌కి అర్థమైంది. అందరికీ తెలిస్తే?????
చందనకు జరిగే నష్టం కంటే తన ఉద్యోగం పోయి పోలీస్ స్టేషనులో ఊచలు లెక్కపెట్టే పరిస్థితి రావచ్చునని ప్రణవ్ అనుకున్నాడు. మోసం చేయాలని అనుకున్నవారికి ఎదుటివారి కష్టనష్టాలతో పనేముంటుంది?
ఆమెను ఆ ఇంటినుండి తప్పించడమే అతనికి సులువుగా అనిపించింది. అందుకు తగ్గ ప్లాన్ ఆలోచించాడు.
ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు చెప్పాడు.
“మనం ఇక్కడ నుంచి వెళిపోదామా? దూరంగా వెళ్ళి అక్కడ ఒకే దగ్గర ఉంటే మనలను ఎవరూ వేరు చేయలేరు. వారానికోసారి కాకుండా నా దేవిని నేను రోజూ చూసుకోవచ్చును.
మనం ఇక్కడ నుంచి బొంబాయి వెళదాము. అక్కడ నేను ఏదో ఉద్యోగం వెతుక్కుంటాను.
నువ్వు ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి బయటపడు. మొబైల్ నీతో ఉంచుకుంటే మనం దొరికిపోతాము” అంటూ తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ చెప్పాడు. రైలు ప్రయాణం, సీటు నెంబరు అన్ని మాట్లాడి తను ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పాడు.
తాను వెళ్లిపోయినట్లు తెలిసిన వెంటనే వెతికించే ఏర్పాట్లు చేస్తుంది. మొబైల్ ద్వారా తాను దొరికిపోయే అవకాశం ఉంటుంది. కనుక మెసేజి చూసిన వెంటనే దానిని నీళ్లట్యాంక్‌లో పడేసి బయలుదేరింది.
స్టేషన్ చేరేవరకూ, రైలు ఎక్కేవరకూ తను అతడిని నమ్మింది.
తాను నిన్న సాయంత్రమే కదా! విశాఖపట్నం వదిలింది.
ఒక్కరోజేనా? ఎన్నియుగాలో అయినట్లుంది.
రైలు ఎక్కిన దగ్గర నుండి అందరూ పరిచయమైన వారిలాగే కనిపించారు. తర్వాత?? ప్రణవ్.. తనతో రాలేదు.
మరి తను అనకాపల్లి స్టేషన్‌లో దిగిపోవడం, అమ్మవారి గుడికి వెళ్లడం, తర్వాత ఉదయాన్నే బస్సు ఎక్కి ఈ ఊరు వచ్చింది. ఉదయం నుండి అమ్మతో ఉంది. 24 గంటలు మనసులో పడిన బాధ విపరీతమైన ఒత్తిడి.
మనసులో ఏవో ద్వారాలు తెరుచుకున్నట్లు, పొరలు విడిపోతున్నట్లు ఒక్క క్షణం ఆమెకు అంతా గుర్తొచ్చింది.
తండ్రి రాసిన ఉత్తరం .. అతని మానసిక క్షోభ ..
అయితే
వేణు, నాన్న ఇద్దరూ తనను వదిలి వెళ్లిపోయారా???
ఆమెకు ఒక్కసారిగా పట్టరాని దుఃఖం వచ్చింది..
‘అయ్యో! నాన్నా! నువ్వు చాలా మంచి జ్యోతిష్కుడువి కదా! బావకి మృత్యుగండం ఉందని అది ఎలా తప్పించాలా? అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయావు గాని ఇంకాస్త ముందుకు చూసి, నా జీవితం ఇంకెంత కష్టపడుతుందో చూడలేకపోయావా? అలా అయితే నా చేయి వదలకుండా పసిపాపలా చూసుకునే వాడివి కదా! నాన్న ఈ 16 సంవత్సరములు ఎలా గడిపానో తెలుసా? నా మొహం చూపడానికి సిగ్గు వేస్తుంది. అందుకే..
ఎంత పిచ్చి బ్రతుకు అయిపోయింది నాది. ఇంకా అలనాటి అమాయక కూతురునే అనుకుంటోంది అమ్మ. తప్పో రైటో తన చుట్టూ ఉన్నవారు నడిచిన ఆ నీడ లోనే తాను ఇన్నేళ్లు ఉంది. ఒకటా? రెండా? ఎన్నేళ్లు? తనకు 32 ఏళ్లు.
తనను చూస్తే తనకే అసహ్యం వేస్తుంది. తాను ఒక వితంతువు. పెళ్లయింది, భర్త చనిపోయాడు. ఇన్నాళ్లు తాను ఎలాంటి జీవితం గడిపింది. తలచుకుంటున్న కొద్ది దుఃఖం తెరలు తెరలుగా వస్తుంది.
ఇంతలో అమ్మ పెరుగన్నం గిన్నెలో కలిపి తెచ్చింది.
“బంగారు, ఏడవకురా! కొంచెం పెరుగన్నం తింటే బలం వస్తుంది.” అంటూ అమ్మ తినిపిస్తూన్న ఒక్కోముద్దా గుక్కెళ్ళతో మింగుతూ మంచినీళ్లు తాగుతూ తనను తనే సమాధానపరుచుకుందికి ప్రయత్నిస్తోంది.
తనలో ఉంది హాలాహలం! అమ్మ తినిపిస్తోంది అమృత భాండం!
రెండు జీవితాలను చవిచూసిన, అనుభవించిన నీహారికలోని మథనం చిలికి చిలికి హాలాహలమే వెలువడుతుందో ???? అమృతమే ఉద్భవిస్తుందో????
(సశేషం)
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచి’ అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం, ‘లేతమనసులు’ కథాసంపుటి వెలువరించారు.