Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవామృతం-1

[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘జీవామృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 1

దయం నుంచి చందన మనసు అల్లకల్లోలంగా ఉంది. మనసులోకి తొంగి చూస్తే అది తుళ్ళి తుళ్ళి పడుతోంది. మొబైల్ లోని ఆ ఆరు లైన్ల మెసేజ్ ని ఎన్ని వందలసార్లు చదువుకుందో తెలీదు.

సాయంత్రం ఆరు గంటలైంది. గబగబా స్నానం చేసి తయారయింది. బొట్టు పెట్టుకుంటూ అద్దంలోకి చూసింది.

ఎంత అందం. బాపూ గీసిన బొమ్మలాగా ఉంది.

నిజంగా బాపూ గనుక ఈమెను చూస్తే ‘అరె! నేను గీసిన బొమ్మే ఇది. ప్రాణం పోసుకుని నా ముందుకు వచ్చింది.’ అనుకుంటారు.

గడియారం వైపు చూస్తూ మరొకసారి మొబైల్ లోకి తొంగి చూసింది.

ప్రియా!

రాత్రి 9 గంటలకు కోణార్క్ ఎక్స్ప్రెస్; రెండవ నెంబర్ ప్లాట్ ఫారం మీదికి వస్తుంది. అందులో ఏ-వన్ లో సీట్లు 5,6 నెంబర్లు మనవి. నన్ను నిరాశపరచకు. నీ..

అది చదవగానే ప్రతిసారీ మనసు ఒక్కసారి ఉలిక్కిపడుతుంది. వెంటనే ఉల్లాసపడుతుంది. రెండు రెక్కలువచ్చి గాలిలోకి ఎగిరిపోతున్నట్లు ఉంటుంది. మరు నిమిషం నిలువెల్లా భయం ఆవహిస్తుంది.

ఏంటిది? తను ఏం చేయబోతుంది?

ఎవడితోనో లేచిపోతున్నావు కదూ! మనసు నిలదీసినట్లు అడుగుతుంటే దాని నోరు మూస్తూ..

ఏం కాదు! మేమిద్దరం మనసారా ప్రేమించుకున్నాం. తనివారా దగ్గరయ్యాం. ఇప్పుడు పెళ్ళిచేసుకుని జంటగా కాపురం చేయాలనుకుంటున్నాం. తప్పేముంది? మనసుకి సర్ది చెపుతున్నా అంతరంగం అంగీకరించడం లేదు. తప్పు చేస్తున్నావని వేయిగొంతులతో ఘోషిస్తోంది.

లేదు. తన ప్రణవ్ అలా మోసం చేయడు. అతడు తన ఆలనాపాలనా, అలకలు తీర్చడం, సముదాయించడం, ఏ మాత్రం నటనగా అనిపించలేదు.

ఎనిమిది గంటలు అవుతుంటే బయటకు వచ్చింది. ఒక చిన్న బేగ్. వీపు మీద వేసుకుని రెండు చేతులు బయటకు తెచ్చి ఖాళీగా వెళుతున్న ఆటోని పిలిచింది.

“ఏయ్! ఆటో బాబూ! స్టేషన్ కు వస్తావా?”

పిలిచి బేరమాడకుండా ఎక్కింది.

ఆటో ఎక్కి కూర్చుందే గానీ మనసు అప్పుడే రైలు ఎక్కి సీట్లో కూర్చుని అతనితో మాట్లాడుతున్నట్టుగా ఊహల్లో తేలిపోతుండగా ఆటో ఆగిపోయింది.

చందన ఈ లోకంలోకి వస్తూ ‘ఏమైంది?’ అడిగింది.

“పెట్రోల్ అయిపోయిందమ్మా! చూసుకోలేదు.” అన్నాడు.

దగ్గరలో పెట్రోల్ బంకులు లేవు. కొంచెం ముందుకు వెళితే వస్తుంది.

“మీరు అలా కూర్చుండమ్మా! నేను న్యూట్రల్ లో పెట్టి తీసుకెళ్తాను.” అన్నాడు.

“సరే! ఇంతకీ టైముకి స్టేషన్ చేరుస్తావా?” సంశయంగా అడిగింది.

“ఏ ట్రైన్?”

“కోణార్క్” అనగానే “చాలా టైం ఉందమ్మా!” అంటూ న్యూట్రల్ లో పెట్టి రోడ్డు డౌన్‌లో ఉందేమో రయ్యిమని తీసుకెళ్ళి పెట్రోల్ బంక్ ముందు ఆపాడు. బేగ్ లోంచి వంద రూపాయలు నోటు ఇచ్చిందతడికి. మళ్ళీ ఆటో బయల్దేరింది.

స్టేషన్ చేరి పరుగు పరుగున ఫ్లాట్ ఫాం నెంబరు-టు చేరేసరికి రైలు నెమ్మదిగా బయలుదేరుతోంది. ఎ-1 ఎక్కడ ఉందో అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటే రైలు కదిలిపోతోంది. ఏం చేయాలో తెలియక కనిపించిన బోగి ఎక్కిపోయింది. ఎక్కింది అనేకంటే డోర్ దగ్గర నిల్చున్న వాళ్ళు ఆమెను లోపలకు లాగారు రెండు చేతులతో.

అది ఎస్ – 8.

అదిరే గుండెలతో అలా స్థాణువులా నిలబడి పోయిన చందన ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే తెలిసేది.

రైలు దిగి గేటుదగ్గర ఉన్న టి.సి.కి ఫ్లాట్ ఫాం టికెట్ ఇచ్చి బయటకు వెళుతున్న ఆమె ప్రాణం ప్రణవ్ కనబడి ఉండేవాడు.

రైలు వేగం అందుకుంది.

స్టేషన్ వదలగానే చిమ్మ చీకటి.

ఇంతలో టి.సి. అందరి టిక్కెట్లు చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంచుమించు సాంకేతికతను అందరూ ఉపయోగిస్తూ మొబైల్ ను చూపిస్తున్నారు.

అతను చెక్ చేసినవి తన దగ్గర ఉన్న షీటులో రెడ్ పెన్తో రౌండ్ చేస్తూ వస్తున్నాడు. చందనకు ఏం చేయాలో తెలియలేదు.

ఏ-వన్ లో 5, 6 నెంబర్లు అని మాత్రమే చెప్పగలదు. చూపించడానికి తన దగ్గర మొబైల్ ఫోన్ లేదు.

అతను వచ్చి అడిగేసరికి ధైర్యంగా “ఎ-1 అండి! ట్రైన్ కదిలిపోతూంటే ఇందులోకి ఎక్కేసాను.” అనగానే,

“వచ్చే స్టేషన్లో ఐదు నిమిషాలు ఆగుతుంది. అక్కడ దిగి తొందరగా వెళ్లిపోండి. అక్కడి టి.సి. చెక్ చేసేలోగా.” అన్నాడతను.

“సరే!” అంది. కానీ మనసంతా దిగులుగా అయిపోయింది. ఆ చీకటిని చూస్తూంటే మరింత భయం వేస్తోంది.

ఈలోగా స్టేషన్ వచ్చింది.

అంతవరకూ డోర్ దగ్గరే ఉన్న చందన కిందకు దిగి “ఫస్ట్ క్లాస్ ఎటువైపండీ!” తనతోపాటు దిగిన టి.సి.ని అడిగి అతడు చూపిన వైపు పరుగు తీసింది.

ఎ-వన్ లో డోర్ పక్కనే ఉన్న 5, 6 నెంబర్లు చూసింది. ఒకటి ఖాళీగా ఉంది. ఇంకొకటి ఎవరో కూర్చుని ఉన్నారు.

ప్రణవ్ ఏడీ??ఎక్కడా??

“ఎక్స్‌క్యూజ్ మీ! ఇంతసేపు ఇక్కడ ఎవరైనా కూర్చున్నారా?” అతన్ని ధైర్యంగా ప్రశ్నించింది

“నేను భువనేశ్వర్ నుంచి వస్తున్నాను. ఈ సీట్ ఖాళీగానే ఉంది. బహుశా సామర్లకోటలో ఎక్కుతారేమో?”

అనకాపల్లి స్టేషన్ అది.

తను ఏం చేయాలి? ఆలోచనలు తరువాత.

తను ట్రైనులో ఉంటే ఇంకా ప్రమాదం. టి.సి. దగ్గరకు గబగబా పరుగెట్టింది.

“సార్! మా ఫ్రెండ్ ఏదో చిక్కుల్లో పడ్డాడు. బహుశా ఏదైనా ప్రమాదం జరిగిందేమో? అందువలన వైజాగులో ట్రైన్ ఎక్కలేదు. మేమిద్దరం కలవకపోవడం వలన టికెట్లు అతని వద్ద ఉండిపోయాయి. దయచేసి వైజాగ్ నుండి అనకాపల్లి వరకు నా ప్రయాణానికి పెనాల్టీతో టికెట్ కట్ చేసి ఇవ్వండి.” అని అడిగింది.

టి.సి. ఆమెను ఎగాదిగా చూసి ఏమనుకున్నాడో మౌనంగా టికెట్ కట్ చేసి చేతిలో పెడుతూ, ఆమె దగ్గర అమౌంట్ తీసుకోకుండానే

“జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా!” అంటూ కదులుతున్న రైలు ఎక్కిపోయాడు.

వెళుతున్న రైలుని తదేకంగా చూస్తూ ఆమె స్థాణువులా నిలబడిపోయింది.

“మోసపోవడం తప్పు కాదు అది తెలిసిన తరువాత నిభాయించుకొని గమ్యం వైపు పయనించడమే ధీరులు చేసే పని” అని ఎవరో మహానుభావుడు అన్నారు.

వెంటనే తేరుకున్న ఆమె ప్లాట్‌ఫామ్ ఖాళీ అవుతూ ఉండడాన్ని చూసి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి కాఫీ తాగాలని నిర్ణయించుకుంది.

రాత్రి సుమారు 11 అవుతుంటే ఇంత అందమైన అమ్మాయి ఆరు బయట కూర్చుని కాఫీ తాగుతూ ఉండడం ప్రయాణికులు అటు ఇటు తిరుగుతూ ఆమెవైపే చూపులు విసురుతూ వెళ్తూ ఉన్నారు.

కాఫీ తాగేలోగా ఆలోచించుకుంది.

అనకాపల్లిలో తనకు ఎవరు తెలుసా? అని ఆలోచిస్తూనే ఉంది. ఎవరూ గుర్తు రావడం లేదు. చిన్ననాటి స్నేహితురాలు మదిలో మెదిలింది. కానీ ఎక్కడ ఉందో తెలియదు. పేరు కూడా గుర్తు రావడం లేదు. అమ్మవారి గుడికి దగ్గరలో అని విన్నట్టు గుర్తు. అడ్రస్ తాను ఏం చెప్పగలదు? ఎన్ని మార్లు రమ్మని పిలిచినా తను వెళ్ళలేదు.

వాళ్ళ అత్తవారు ఏమనుకుంటారో? ఆమె భర్త ఏమనుకుంటాడో? సంశయిస్తూనే చేసేదేమీ లేక కాఫీ కొట్టు యజమానిని అడిగింది.

“ఇక్కడికి అమ్మవారి గుడి ఎంత దూరం?” అని

“దగ్గరేనండి. కానీ.. నూకాలమ్మ జాతర కదా! అటువైపు వెళ్ళడం కష్టం.”

“మరి గుడి పక్కనే మావాళ్ళ ఇల్లు ఎలా వెళ్ళడం? అందరూ ఏం చేస్తారు?” బింకంగా ప్రశ్నించింది.

“ఆటో వెళ్ళనిచ్చిన దాకా వెళ్లి, దిగి నడుచుకుంటూ వెళిపోవడమే.” చెప్పాడు కాఫీ కొట్టు యజమాని.

“ఆటో ఎంత తీసుకుంటారు?”

“మామూలప్పుడు ఏభై. ఇయాల పండుగ కదా! ఆళ్ళిష్టం.” అన్నాడు.

‘సరే!’ అనుకుంటూ కాఫీ డబ్బులు చెల్లించి బయటకు వచ్చింది.

అర్థరాత్రి అయినా ఊరంతా పండగ వాతావరణం. వీధులన్నీ రంగురంగుల బల్బులు వెలుగుతూ అమ్మవారి ఆకారంలో లైట్లు ఆరి, వెలుగుతూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఆటో ఎక్కకుండా నెమ్మదిగా నడక మొదలెట్టింది.

పండగ సంబరాలు, డప్పులు, అమ్మవారికి మొక్కుకున్న రకరకాలైన విచిత్ర వేషధారణలు, తలపై బిందెలతో నీళ్లు పెట్టుకుని వేపమండలు వేసి ఘటాలను పసుపు, కుంకుమలతో అలంకరించి, ముఖం నిండా పసుపు రాసుకొని పెద్ద బొట్టుపెట్టుకుని నడుస్తున్న ముత్తయిదువులు,

కొందరు తలపై కలశం దానిపై మట్టి మూకుడులో నూనె వేసి దీపాలను వెలిగించి పడిపోకుండా జాగ్రత్తగా నడుస్తున్న కన్నెపిల్లలు, మైకులో నాటకీయంగా పద్యాలు పాడేవాళ్లు, మైకులో సినిమా పాటలు, పై ఊళ్ళ నుంచి వచ్చేవారికి చలివేంద్రాల క్రింద మంచినీళ్లు, మజ్జిగ పొట్లాలు, పులిహార ప్యాకెట్లు అందిస్తున్న సేవాదళ సభ్యులు, వేదికలపై అమ్మవారి పాటలు పాడుతున్న వివిధ భజన మండలులు.

ఆలోచించుకుంటూ నడుస్తోంది చందన.

అప్పుడు గుర్తొచ్చింది. తన స్నేహితురాలి పేరు.

అధ్యాయం 2

జా..న..కి.

చిన్నప్పుడు జానకి చాలా అందంగా ఉండేది. పొడవుగా ఉండే ఉంగరాల జుట్టుతో, రెండు జడలు వేసుకుని, ఒక జడలో గులాబీ పువ్వు పెట్టుకునేది.

తను విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు మార్గశిరమాసం నెల రోజులు ఎంత వైభవంగా జరుగుతాయో చెప్తూ ఉండేది.

“మా ఇంటి దగ్గరే పందిళ్ళు వేసి రోజుకొక కార్యక్రమం బుర్రకథలు, హరికథలు, నాటకాలు, పాటలు, హాస్య కార్యక్రమాలు జరుగుతాయి. ఒకరోజు ఉదయం మీ ఇంట్లో చెప్పేసి వచ్చావనుకో! రాత్రి మనం చక్కగా చూడవచ్చును. మనమిద్దరం రాత్రి ఎన్నెన్నో కబుర్లు చెప్పుకోవచ్చు.” అనగానే నిజంగానే కనకమహాలక్ష్మి అమ్మవారి సంబరాలు సమయంలో ఒకరోజు రాత్రి తమ ఇంటికి వచ్చి ఉండేది.

అలాగే జానకి కూడా అనకాపల్లిలో ఉన్న గ్రామదేవత నూకాలమ్మ గురించి అనర్గళంగా చెప్పేది.

“మా అనకాపల్లిలో నూకాలమ్మ జాతర ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య (తెలుగు సంవత్సరాది, ఉగాది) రోజు నుండి నెలరోజుల పాటు నూకాలమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అధికసంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకుని వెళతారు. జాతర చివరిరోజు ‘నేలపండుగ’ అనే ఉత్సవాన్ని ఇక్కడి ప్రజలు జరుపుకుంటారు.

మా తాతయ్యగారు, నాయనమ్మ ఆలయపెద్దలు. అందుకే నాయనమ్మకు ఎన్నో విషయాలు తెలుసు.

శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారు తొమ్మిది శక్తి రూపాలలో ఒకటి. అంతేకాదు పురాణకాలంలో శ్రీ అనఘా దేవిగా ప్రసిద్ధి చెందింది. విశ్వసృష్టికర్త శ్రీశక్తి అమ్మవారు అని, ఫాల్గుణ బహుళ అమావాస్య నుండి చైత్రబహుళ అమావాస్య వరకు ఉన్న కాలంలో సృష్టి జరిగిందని నమ్ముతారు. ఈ పవిత్ర కాలంలో శ్రీ నూకాంబికా అమ్మవారికి చాలా మతపరమైన ఆచారాలు, పూజలు నిర్వహిస్తారు. తెలుసా?”

ఆమె ఆలోచనల ఒరవడిలో తన స్నేహితురాలి పేరు తనకు గుర్తుకొచ్చిన విషయం గుర్తించలేదు.

“కాకతీయరాజుల కాలంలో కొన్ని సంవత్సరాల తరువాత, ఆలయం పునరుద్ధరించబడింది. అదే అమ్మవారిని శ్రీ కాకతాంబ అనే పేరుతో పూజించారు. ఇక్కడ నిత్య పూజలు, దీపారాధనలు జరుగుతాయి. రాజులు తమ వంశాలను కోల్పోవడంతో, రోజువారీ పూజలు మరియు ఇతర ఆచారాలకు అంతరాయం ఏర్పడింది. నెమ్మదిగా ఆలయం పూర్వవైభవాన్ని కోల్పోయింది.

సుమారు 450 సంవత్సరాల క్రితం ఆర్కాట్ నవాబు అనకాపల్లి ప్రాంతానికి రాజుగా శ్రీ కాకర్లపూడి అప్పలరాజు పాయకరావును నియమించాడు. అతను అనకాపల్లి కోట నిర్మాణం మరియు కోటకు దక్షిణం వైపున కుటుంబ దేవత అయిన కాకతాంబికకు ఈ ఆలయాన్ని నిర్మించారు. నూకాంబిక దేవత కొలువై ఉంది. ఆమె తరువాత నూకాంబిక లేదా నూకాలమ్మ అని పిలువబడింది.

ఆదివారం, మంగళవారం మరియు గురువారాలు శ్రీ నూకాంబిక అమ్మవారికి పూజలు చేయడానికి అనుకూలమైన రోజులుగా భావిస్తారు. ఆ రోజుల్లో ఈ ఆలయంలో నిత్యపూజలు, అర్చనలు, దీపారాధనలు జరుగుతాయి.”

ప్రస్తుతం అన్ని ఆలయాలలాగే ఈ దేవాలయం కూడా దేవాదాయ ధర్మాదాయశాఖవారి ఆధీనంలోకి వెళిపోయి ఉంటుంది. అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న అష్టలక్ష్ములకు వేసిన మంచి ఆయిల్ పెయింటింగులు విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్నాయి.

పూజలు, అర్చనలు, ఇతర వివరాలకు 08924-225048 నెంబరుకు ఫోన్ చేసి సంప్రదించగలరు. అన్న ప్రకటన బోర్డు అమ్మవారి గుడి పక్కన కనిపించగానే చందన మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.

ఇంత దగ్గరలో ఉన్న జానకి అమ్మవారి పండుగకు తప్పకుండా కుంకుమ పూజ చేయించుకుంటుంది కదా! వారిని కనుక్కుంటే ఎలా ఉంటుందో అనిపించింది. కానీ తన దగ్గర మొబైల్ లేదు. అందువలన కార్యాలయం దగ్గరకు చేరుకుంది. ఇంత రాత్రి కదా! కుర్చీలో ఎవరో ఒకతను మాత్రమే ఉన్నాడు.

చందన కౌంటర్ దగ్గర నిలుచుని అతన్ని చూసింది.

ఏదో రాసుకుంటూ కనిపించాడు.

“సార్! కుంకుమ పూజలు చేయించుకున్న వారిలో ‘జానకి’ అని పేరు గల వారు ఎవరైనా ఉన్నారా?” అని అడిగింది.

అతడు తలెత్తి చూసి “మీకు ఎవరు కావాలి? జానకి పేరుతో పాటు నూకాలమ్మ, పైడిమాంబ, ఎల్లమ్మ, మారెమ్మ చాలా పేర్లు వాళ్ళు ఉన్నారు.”

వింటున్న చందనకి ఒళ్ళు మండింది.

అర్థరాత్రి వీడి హాస్యమేమిటి? కోపంగా ఏదో అందామనుకుంది. విచక్షణ ఆమెను ఆపింది.

“అవునండి! చాలామంది ఉంటారు. కోవెలకు దగ్గరే వాళ్ళ ఇల్లు. చాలా సంవత్సరాల బట్టి ఉంటున్నారు.” అంది.

“అవునా! నేను కొత్తగా వచ్చానండి. నాకు అంతగా తెలియదు.” అంటూ ఎవరినో కేకేసాడు.

ఆ వచ్చినవాడు చందనని ఎగాదిగా చూసి “ఏంటమ్మా?” అంటూ ప్రశ్నించాడు.

“కోవెల దగ్గరలో జానకి అని నా స్నేహితురాలు చాలా రోజులు బట్టి ఉంటున్నారు. ఇల్లు చూపించమని అడుగుతున్నాను.” అంది.

“ఓహో! ఆ జానకిగారా! వాళ్లు ఇల్లు మారిపోయారండి. వాళ్ళ నాన్నగారు ధర్మకర్తగా ఉండేవారు కదా!” అన్నాడు. చందనకి ఆధారం దొరికినట్టు రిలీఫ్‌గా అనిపించింది.

“అవునండి!” అంది.

“వాళ్ళ ఇల్లు చాలా దూరం” అన్నాడు.

“ఆటో అతనికి మీరు గుర్తులు చెప్పండి. నేను వెళతాను” అంది.

“అలా పోల్చుకోలేరండి.” అని ఏదో ఆలోచిస్తూ

“సరే! నేనూ వస్తాను పదండి.” అంటూ ఆటో పిలిచాడు.

అర్ధరాత్రి చీకటిలో అతనితో వెళ్ళడానికి చందన ఒక్కక్షణం తట పటాయించింది.

“సరే! మీరు ఇక్కడ కుర్చీ మీద కూర్చోండి. తెల్లారి ఆటోలో వెళుదురు గాని.” అంటూ వెళ్లిపోతున్నాడు.

“లేదు. పదండి వస్తాను.” అంది.

బలహీన మనస్కులపై బలవంతులు ఉపయోగించే బ్రహ్మాస్త్రమిది. అవసరం నీదే! నాకేం పోయింది. అని ఇరుకున పెట్టడం వెన్నతో పెట్టిన విద్య కొందరికి. నమ్మకం అపనమ్మకం అనే భావాల మధ్య ఘర్షణ పడుతున్న చందన నమ్మాలనే నిర్ణయించుకుంది.

అవును. ఎవరైనా నమ్మినవాళ్లనే మోసం చేయగలరు. నమ్మకుండా ఉండే దృఢమనస్కులను ఎవరూ ఏమీ చేయలేరు.

ఆటోవాడితో నెమ్మదిగా ఎక్కడకు వెళ్లాలో గొణిగాడు.

ఆ చీకట్లో చలిలో చందనకి ఒక్క క్షణం తను మరొక ప్రాబ్లంలో చిక్కుకోబోతోందా? అనిపించింది.

అడ్రస్సు చూపిస్తాను అన్నవాడు ఆటో డ్రైవర్ పక్కన కాకుండా చందన పక్కన కూర్చోబోయాడు. తనకు తెలిసిపోతోంది తను ఇప్పుడు జానకిని కలుసుకోవడం జరగని మాట. ఇందులోంచి ఎలా బయటపడాలి అనుకుంటూ

“బాబూ! ఆటో ఒకసారి ఆపు.” అంది.

“ఎందుకమ్మా?” అన్నాడు ఆటో డ్రైవర్

“మీకు నిజంగా జానకిగారి ఇల్లు తెలుసా?” అడిగింది.

“ఆ! తెలుసు. ఊరికి అటు చివర.” అన్నాడు ధీమాగా.

“అయితే ఒక పని చేద్దాం. ముందుగా స్టేషన్‌కు వెళ్దాం. అక్కడ లాకర్లో నా సామాన్లు ఉంచాను. మళ్ళీ జానకిగారి ఇల్లు దూరం అంటున్నావుగా! ఆ సామాను తెచ్చుకుని వెళ్లిపోతే మళ్ళీ ఇక్కడికి రానక్కర్లేదు. నేను ఒక వారం వాళ్ళ ఇంట్లో ఉంటాను.” అంది.

ఆ మాటల్లో తన మీద అపనమ్మకం కనబడకపోయేసరికి, “సరే! ఆటో స్టేషన్‌కు పోనీ.” అన్నాడు.

“మీరు డ్రైవర్ పక్కన కూర్చోండి.” కచ్చితంగా అంది.

ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వెళితే మొదటికే మోసం అనుకొని ఆమె చెప్పినట్లే చేశాడు.

ఆటో స్టేషన్ వైపు పరుగు తీసింది.

స్టేషన్ దగ్గరకు చేరేసరికి సమయం మూడు గంటలు అయింది. వాళ్ళను వదిలించుకోవడం ఎలా? రైల్వే పోలీసులకు చెప్తేనో?? వద్దు వద్దు వాళ్ల చుట్టూ తిరగడం ఇంకా తలనొప్పి.

చందనకు ఒక్కసారిగా నిస్పృహ ఆవరించింది.

ఎక్కడికి వెళ్లడం?? అసలు తనకు ఈ భూమి మీద ఎక్కడైనా నిలుచుందికైనా జాగా ఉందా?? తనకే ఎందుకిలా? సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటివరకు తను పడిన టెన్షన్ ఒక్కసారిగా కళ్ళ ముందు రీలు లాగా తిరిగింది.

ఆటో దిగి నిలబడి పోయిన ఆ అందమైన అమ్మాయిని చూస్తూ ఆమెలోని సంఘర్షణతో ఏ మాత్రం సంబంధంలేని ఆ బ్రోకర్ “తొందరగా వెళ్ళి లగేజి తెచ్చుకో!” కరుకుగా అన్నాడు.

లిప్తపాటులో గ్రహించింది. వాడు ఏకవచన ప్రయోగం చేయడం.

“లగేజీ పట్టుకురాడానికి సాయం రండి” అంది పోలీసులకు వాడిని పట్టించాలని అనుకుంటూ.

‘కరుడుగట్టిన క్రిమినల్ వాడు. వాడి ఫోటో ఆల్రెడీ స్టేషన్‌లో వాంటెడ్ వాళ్ళ షోకేస్ లో ఉంది.’ అని ఆమెకు తెలియదు.

“వస్తున్నాను. ఉండు.” అంటూ జేబులోంచి రుమాలు తీస్తూ ఉండడం చూసింది.

వెంటనే స్టేషన్ వైపు తిరిగి పరుగు తీసింది. స్టేషన్లోకి వెళ్లే మెట్లు ఎక్కుతూ తొందరగా పరిగెట్టడంతో కాలుజారి పడిపోతూ ‘అమ్మా!’ అని గట్టిగా అరిచింది. ఆమెని తీసుకుపోదామని ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ బ్రోకర్.

ఇంతలో లోపలి నుంచి నిద్రలో ఉన్న ఒకరిద్దరు ప్యాసింజర్లు, కూలీలు ఆమె చుట్టూ మూగారు.

ఇంక ‘పిట్ట జారిపోయినట్టే!’ అనుకుంటూ వాడు ఆటోలో వెళ్లిపోయాడు.

చుట్టూ ఉన్నవాళ్లంతా ఆమె మొహంపై నీళ్లు జల్లి తెలివిలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. తలకు గట్టిగా దెబ్బ తగిలింది. మొహం మీద చల్లని నీళ్లు తగిలేసరికి తెలివి వచ్చింది.

ఎదురుగుండా ఉన్న వ్యక్తి చేతుల్లోంచి మంచినీళ్లు గ్లాస్ తీసుకొని గటగటా తాగింది. ఒక్కసారి అందరి వైపు చూసి మళ్లీ అలా నేలపై వాలిపోయింది.

“అయ్యో! అలా నేలపై పడుకోకండి. రండి. వెయిటింగ్ రూములో కుర్చీలో కూర్చుందురు.” అంటూ అందరూ సాయం పట్టి ఆమెను లోపలకు తీసుకువెళ్లారు.

త్రోవలో చుట్టూ ఉన్నవాళ్లంతా ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ఆమె వేటికి సమాధానం చెప్పే స్థితిలో లేదు.

చల్లగా ఉన్న ఆ ఏ.సి.వెయిటింగ్ హాల్లో కుర్చీలో ఆమె ముడుచుకుని పడుకుంది.

సాయంత్రం నుంచి పడుతున్న టెన్షన్‌కి, పరిగెడుతూ పడిపోయి, నుదుటికి తగిలిన దెబ్బ నొప్పి పెడుతూ ఉంటే అలా మగతగా వాలిపోయింది.

(సశేషం)

Exit mobile version