Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘జీవాళి’ పుస్తక పరిచయ సభ – నివేదిక

ద్వారం దుర్గా ప్రసాదరావు గారు రచించిన ‘జీవాళి’ పుస్తక పరిచయ సభ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో 16 మే 2025 శుక్రవారం సాయింత్రం 6 గంటలకు సుమనస్పతి రెడ్డిగారు నిర్వహించ ఘనంగా జరిగింది. తొలుత ద్వారం సత్యనారాయణరావు గారి వయొలిన్ వాదనతో ప్రారంభం అయిన ఈ సభలో పలువురు అడిగిన ప్రశ్నలకు ద్వారం దుర్గా ప్రసాదరావు సమాధాలు ఇచ్చి సభను అలరించారు.

ప్రఖ్యాత వైణికులు అయ్యగారి శ్యామ్ సుందర్ కొన్ని సరదా ప్రశ్నలతో సభను కొద్దిసేపు నవ్వులతో ముంచెత్తారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సంగీత ఆచార్యులు రాధా సారంగపాణి నేటి విద్యార్థులకు తెలియ చెప్పడానికి గానూ సంగీతం – సాహిత్యం ఎలా సంఘటితం అయ్యాయన్న ప్రశ్నకు ద్వారం వారు తగిన రీతిలో సంతృప్తికరమయిన జవాబు చెప్పారు.

మరో వక్త, కలగా కృష్ణమోహన్ అడిగిన – పుస్తకం పైన హనుమాన్ బొమ్మ వేయడంలోని ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నకు సంగీతంలో ప్రధానంగా నారద తత్వం, హనుమత్ తత్వం ఉంటాయని, మన ప్రాంతమంతా హనుమత్ తత్వ ప్రధానంగా సంగీతం వుంటుందని, అందుచేత ప్రతీకగా హనుమాన్ బొమ్మను వేశానని తెలిపారు.

 

చాగంటి కృష్ణకుమారి మాట్లాడుతూ సహజమయిన తంబూరా వాద్యానికి, ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్ ‘శృతి బాక్స్’ వాదానికి గల తేడాని గూర్చి అడిగిన దానికి స్పందిస్తూ, ప్రస్తుత కాలంలో తంబూరాలను కచేరిల కోసం మోసుకు వెళ్ళే శిష్యబృందాలు లేనందున ‘శృతి బాక్సులు’  ఆవిర్భవించాయని, అయితే ప్రస్తుతం సెల్‌ఫోన్ లోనే శృతిని వినిపిస్తూ కచేరీలను కానిస్తున్నారనీ, మార్పు సహజమని ఆహ్వానించాలని పేర్కొన్నారు. సహజ తంబూరా శబ్దాన్ని పోలిన ఈ శృతి బాక్సు శబ్దం కూడా బావుంటుందని తెలిపారు. ద్వారం వారి సంగీతానికి ముందు. తరువాత అని చెప్పడానికి ఏమయినా వుదా అని SVK రంగారావు గారి ప్రశ్నకు ద్వారం వారు అంతటి సంగీత శిఖరాన్ని చేరారంటే దానికి బలమయిన, విస్తారమున బేస్ నిర్మితమయిందన్న సంగతి మనం గుర్తుంచుకోవాలని తెలిపారు.

ప్రచురణ సంస్థకు ‘జీవాళి’ని ప్రచురించే ఆవకాశం లభించినందుకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ, ద్వారం వారి అముద్రిత రచనలను ఆంగ్ల వ్యాసాలను రాబోయే ప్రచురణలుగా ప్రచురించే అవకాసం ఎన్.కె. పబ్లికేషన్సకి ఇవ్వాలని సభాముఖంగా అధినేత ఎన్. కె. బాబు కోరారు.

ఈ సభకు శొంఠినేని కిషోర్, వాసిరెడ్డి నవీన్, నాగసూరి వేణుగోపాల్, సింహపురి రైతు పత్రిక ఎడిటర్ నిరంజన్ రెడ్డి, ఛాయ పబ్లిషర్ మోహన్ బాబు, డా. శశికళ, బమ్మిడి జగన్మోహనరావు మొదలయిన విజ్ఞులందరూ పాల్గొన్నారు. సుమనస్పతి రెడ్డి నిర్వహణలో సభ ఎంతో హృద్యంగా సాగింది. గొప్ప సంగీత అనుభూతిని సభికులంతా పొందారనడంలో సందేహం లేదు.

Exit mobile version