Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జటాయువు దశరథుడికి స్నేహితుడు ఎలా అయ్యాడు?

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారి ‘జటాయువు దశరథుడికి స్నేహితుడు ఎలా అయ్యాడు’ అనే రచనని అందిస్తున్నాము.]

రాముడు పంచవటిలో ఆశ్రమం నిర్మించుకోవటానికి సీతా లక్ష్మణులతో వెళుతున్నాడు. ఒకచోట చెట్టుమీద పెద్ద ఆకారం గల పక్షి కనబడింది. మారురూపులో ఉన్న రాక్షసుడేమో అనుకుని “ఎవరు నువ్వు?” అని అడిగాడు రాముడు కోపంగా.

“నా పేరు జటాయువు. సూర్యుడి రథసారథి అయిన అనూరుడి కుమారుడిని. మీ తండ్రి దశరథమహారాజు మిత్రుడిని” అన్నాడు.

ఆ మాట వినగానే రాముడి ముఖంలో కోపం పోయి గౌరవం చోటు చేసుకున్నది. “మా తండ్రిగారి స్నేహితులా మీరు?” అని నమస్కరించాడు.

“నువ్వు, లక్ష్మణుడు ఆశ్రమానికి దూరంగా వెళ్ళవలసినపుడు సీతను సంరక్షిస్తూ ఇక్కడే ఉంటాను. అనుమతించు రామా!” అన్నాడు జటాయువు. ‘సరే’ అని అంగీకరించాడు రాముడు.

అయితే ఇక్కడ జటాయువు దశరథుడికి మిత్రుడు ఎలా అయ్యాడు? అని సందేహం వస్తుంది. రామాయణంలో జటాయువు ప్రసక్తి బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండలలో వస్తుంది. ఇక్కడ దశరథుడితో పరిచయం బాలకాండ లోనే వస్తుంది.

కోసలదేశాన్ని భానుమంతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు చంద్రభాగ. ఆ దంపతులకు ఒక్కతే కుమార్తె కౌసల్య. అతిలోక సౌందర్యరాశి. అయోధ్యాధీశుడైన అజమహారాజు కుమారుడు దశరథుడి గురించి కౌసల్య విన్నది. రూపురేఖలలో మన్మథుడి వంటి వాడు. శౌర్య పరాక్రమాలలో తనకు తానే సాటి. చెలికత్తె ఆయన చిత్రపటం గీసి చూపించింది. తొలిచూపులోనే దశరథుడిని ప్రేమించింది కౌసల్య. తండ్రి ఎప్పుడెప్పుడు స్వయంవరం ప్రకటిస్తాడా, అతడిని వరించే సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగింది.

ఇలా ఉండగా రావణుడు పరమేశ్వరుడు ఇచ్చి వరగర్వంతో ఋష్యాశ్రమాలకు నిప్పుపెట్టటం, యజ్ఞయాగాలను ధ్వంసం చేయటం, మునులను చంపటం వంటి అకృత్యాలు చేస్తున్నాడు. మునులు కోపించి “కౌసల్యకు పుట్టబోయే కుమారుడి చేతిలో నువ్వు మరణిస్తావు” అని చెప్పారు. కౌసల్యను వధిస్తే ఆమె కుమారుడి వలన వచ్చే ముప్పు తప్పిపోతుంది అని అనుకుని కౌసల్యను చెరపట్టి పుష్పకవిమానంలో తీసుకుపోసాగాడు రావణుడు. దారిలో నారదుడు కనబడి “కౌసల్య లాగా ఉన్నదే! ఈమెను ఎందుకు తీసుకువెళుతున్నావు?” అని అడిగాడు.

“అవును కౌసల్యే! ఈమెకు జన్మించే కుమారుడి చేతిలో నేను మరణిస్తానట. ఈమెను వధించి నాకు వచ్చే ముప్పు తప్పించుకోవాలనుకుంటున్నాను” అన్నాడు.

“అవివాహిత. తండ్రిచాటు బిడ్డ, ఎండ కన్నెరుగని సుకుమారి. ఈ అబల పైనా నీ ప్రతాపం? నువ్వు వీరుడవైతే ఈమె కుమారుడి పైన చూపించు నీ ప్రతాపం. స్త్రీ హత్య మహాపాపం. నా మాట విని ఈమెను విడిచిపెట్టు” అన్నాడు నారదుడు.

“సరే!” అని కౌసల్యను ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు రావణుడు. నారదుడు కూడా తన దారిన తాను పోయాడు. ఈ కథ ఇలా ఉండగా అక్కడ కుమార్తెకు స్వయంవరం చాటించాడు భానుమంతుడు. కౌసల్య అందచందాలు విని ఉన్న దశరథుడు ఆమెను వరించటానికి స్వయంవరానికి బయలుదేరాడు. కోసలదేశం వెళ్ళటానికి సరయూ నదిని దాటవలసి వచ్చింది. నావలో దాటుతూ ఉండగా పెద్దవాన వచ్చి కుంభవృష్టి కురియసాగింది. గాలి విసురుకి నావ సరయూనదిలో కొట్టుకుపోయింది. మంత్రులు, సైనికులు అందరూ చెల్లాచెదరు అయ్యారు. దశరథుడు స్పృహతప్పి పోయాడు.

మెలకువ వచ్చి చూసే సరికి ఒక ద్వీపంలో ఉన్నాడు. చుట్టూ జనసంచారం లేదు. అక్కడి చెట్ల కున్న పళ్ళతో కడుపు నింపుకుని అక్కడి నుంచీ బయటపడటానికి మార్గం అన్వేషిస్తూ అటుఇటు తిరగసాగాడు. నాలుగు రోజులు గడిచిపోయాయి. ఒకరోజు నదిలో దూరంనుంచీ పెద్ద పెట్టె ఏదో కొట్టుకువస్తూ కనిపించింది. పెట్టెను ఒడ్డుకు చేర్చి మూతతీసి చూశాడు దశరథుడు. అందులో కౌసల్యాదేవి సొమ్మసిల్లి పడిపోయి కనిపించింది. ఆమెకు ఉపచారాలు చేసి తెలివి తెప్పించాడు.

తర్వాత ఒకరికొకరు తెలిసింది. “దైవమే మనల్ని ఇలా ఒకచోటకి చేర్చింది. పంచభూతాల సాక్షిగా నిన్ను నేను గాంధర్వ వివాహం చేసుకుంటున్నాను” అని ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. అక్కడ నుంచీ బయటపడే దారి వెతుకుతూ ఉంటే, ఆ దారిలో వెళుతున్న జటాయువు వీరిని చూసి “మీరిద్దరూ నా వీపు మీద అధిరోహించండి. అయోధ్యకు తీసుకువెళతాను” అన్నాడు. ఇద్దరూ జటాయువు మీదకు ఎక్కారు. జటాయువు వారిని అయోధ్యకు తీసుకువచ్చి దింపాడు.

“ఆపదలో నాకు సాయం చేశావు. ప్రత్యుపకారం చేస్తాను. ఏం కావాలో కోరుకో” అన్నాడు దశరథుడు. “నాకేమీ వద్దు. ప్రతిఫలం ఆశించి నేను ఈ పని చేయలేదు” అన్నాడు జటాయువు. దశరథుడు జటాయువుని కౌగలించుకుని “ఈరోజు నుంచీ మనం మిత్రులం” అన్నాడు. అప్పటినుంచీ దశరథుడు జటాయువుని మిత్రుడిలా మన్నిస్తూ ఉండేవాడు.

దశరథుడికి సంతానం లేక పరితపిస్తుంటే మంత్రులు కామధేనువు కుమార్తె అయిన సురభి ధేనువుని సేవిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పారు. అలాగే చేస్తే శాంత అనే కుమార్తె కలిగింది. ఆమెను చిన్ననాటి మిత్రుడైన రోమపాదుడికి దత్తత ఇచ్చాడు. తర్వాత శాంత భర్త అయిన ఋష్యశృంగుడి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి చేస్తే నలుగురు కుమారులు కలుగుతారు దశరథుడికి.

ఆ తర్వాత రాముడు అరణ్యాలకు వెళ్ళటం, అక్కడ జటాయువుకి రాముడు కనబడటం, రావణుడు సీతను అపహరించుకు పోతుండగా ఎదిరించటం, రావణుడి చేతిలో జటాయువు మరణించటం మొదలైన సంఘటనలు అన్నీ జరుగుతాయి. ఈ సంఘటనలు అన్నీ వాల్మీకి రామాయణంలో వస్తాయి.

అయితే ఆంధ్రా వాల్మీకిగా పేరుపొందిన వావిలికొలను సుబ్బారావు అనే పండితుడు 1902లో ‘కౌసల్యా పరిణయం’ అనే పద్యకావ్యాన్ని రచించాడు. దానికి మూలం ‘కౌసల్యా పరిణయం’ అని అదే పేరుతో గల మరాఠీ కావ్యం అని పీఠికలో చెప్పాడు. ఇందులో కూడా దాదాపు ఇవే సంఘటనలు కొన్ని మార్పులతో వస్తాయి. అజమహారాజు వివాహం ఇందుమతీదేవితో జరగటం నుంచీ కథ మొదలు అవుతుంది. వారికి దశరథుడు జన్మించటం, పెరిగి పెద్దవటం మొదలైనవి చెబుతాడు.

కౌసల్యాదేవి దశరథుడికి చిలుకతో సందేశం పంపించటం, ఆమె విరహవేదన మొదలైనవి వర్ణించాడు. ఇంకా నారదుడు వచ్చి “దేవతలు విష్ణువుని శరణు గోరితే తాను కౌసల్య కడుపున శ్రీరాముడు అనే పేరుతో జన్మిస్తానని, రావణాదులను వధించి భూభారం తొలగిస్తానని విష్ణువు చెప్పినట్లుగా” రావణుడితో చెబుతాడు. కౌసల్య వివాహం జరగకపోతే కొడుకు పుట్టే ప్రసక్తి ఉండదు అని ఆమెను చెరబట్టటానికి బయలుదేరుతుంటే మండోదరి వారిస్తుంది. దేవరహస్యం వెల్లడి చేయటం మంచిది కాదు అని చెబుతుంది. అయినా కౌసల్యను తీసుకువచ్చి చంపబోతుంటే విభీషణుడు అడ్డుపడి విడిపిస్తాడు.

పెట్టెలో కొట్టుకుపోతున్న కౌసల్య లక్ష్మీదేవిని ప్రార్థిస్తుంది. లక్ష్మీదేవి ప్రత్యక్షమై నీకు శుభం జరుగుతుందని ధైర్యం చెబుతుంది. అక్కడ అయోధ్యలో దశరథుడు కనిపించక పోయేసరికి నదిలో మునిగి చనిపోయాడని మంత్రులు భావిస్తారు. ఇంతలో దశరథుడు, కౌసల్య జటాయువు సాయంతో అయోధ్యలో దిగుతారు. ఇద్దరి వివాహం జరిగిపోతుంది. రామాయణంలో లేని ఇలాంటి కొన్ని మార్పులు ‘కౌసల్యా పరిణయం’ కావ్యంలో కనిపిస్తాయి. చివరలో రాముడు జన్మించటం, సీతను రావణుడు అపహరించటం, వానరుల సాయంతో సేతువు కట్టి రాముడు రావణుడిని వధించటం మొదలైన ఘట్టాలన్నీ ‘కాలనిర్ణయ రామాయణం’ పేరుతో క్లుప్తంగా చెప్పి కావ్యాన్ని ముగిస్తాడు.

‘కౌసల్యా పరిణయం’ కావ్యంలో కథ కన్నా వర్ణనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఋతువుల వర్ణనలు, సూర్యోదయ, చంద్రోదయ వర్ణనలు, మన్మథ దూషణ మొదలైనవి వస్తాయి. పద్యాలు కూడా చాలా కఠినంగా, నారికేళ పాకంలో ఉంటాయి. ఓపికగా చదివితేనే కథ అర్థం అవుతుంది.

Exit mobile version