[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘జతానందులు’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]
శ్లో:
కాలః పచతి భూతాని కాలః సంహారతే ప్రజాః।
కాలః సుప్తేషు జాగర్తి కాలోహి దురతి క్రమః॥
భా:
కాలమే జీవరాశిని సంహరిస్తుంది, మింగి వేస్తుంది. జగత్తు నిద్ర లోకి వెళితే కాలం మేల్కొని ఉంటుంది. కాలం అతిక్రమిపజాలనిది!!
***
ఓం శ్రీరామ జయరామ జయజయ రామ!
ఓం శ్రీరామ జయరామ జయ జయ రామ!!
నార్త్ కేరళ కాజంగాడ్ -ఆనందాశ్రమం నుండి శ్రీమతి లక్ష్మీ మహదేవన్ గారి నేతృత్వంలో ప్రణవానంద సేవాశ్రమానికి వచ్చిన పదిమంది బృందంతో పాటు కలసి ఆశ్రమవాసులు చేసిన రామ నామ సంకీర్తనతో మారు మ్రోగిపోతుంది స్వామీ ప్రణవానందుల సమాధి మందిరం. సత్సంగానికి సమయం కావడంతో పారాయణకు విరామం ప్రకటించారు. “పాడిందే పాటరా పాచి పళ్ళ దాసరీ అని ఏమిటీ గోల?” అంది రొంగల భారతమ్మ చిరాగ్గా.
“యు డోంట్ నో ది పవర్ ఆఫ్ రామనామ పారాయణ” అంటూ నావైపు తిరిగి “రెడ్డీ జీ! ప్లీజ్ ఎక్స్‌ప్లైన్ హర్ ది పవర్ ఆఫ్ రామనామ” అంది లక్ష్మీ మహదేవన్.
“అమ్మా భారతమ్మా! ఒక మంచి చర్చకు తెర లేపినందుకు ధన్యవాదములు! పారము అంటే అవతలి తీరం అని అర్థం. పారంగతుడు అనే మాట వినే వుంటారు. దాని అర్థం పండితుడు లేదా ఆవలి తీరం చేరిన వాడు అని. పారాయణం అంటే భవ సాగరాన్ని దాటడం. సముద్రాన్ని దాటడం కంటే సంసారాన్ని దాటడం కష్టం అనే మాట వినలేదా? ‘తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం’ అనే పాట వినలేదా?” వివరించాను.
“ఆత్మను చేరుకోవాలంటే ఎంతదూరం వెళ్ళాలి బాబూ?” మమకారస్వామీ అని పిలువబడే నూలు నారాయణ ప్రశ్న.
“ఎక్కడికీ వెళ్ళనక్కరలేదు. ఆత్మ అంటే.. అనన్యః. అంటే మీకు వేరుగా లేనిది. మీలోపల వున్న సారః.. మీ స్వరూపం. అదే ఆత్మ! అదే దేవుడు! అదే మీరు!”
“తపస్సు అంటే ఏమిటి?” గునివాడ అప్పలరాజు ప్రశ్న.
“శీతోష్ణ సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించడమే!”
“సంసారం – సంసారి అనే మాటల్ని బాగా వివరించండి” రాజుల కాంతమ్మ ప్రశ్న.
“ఒకదానిని కోరి మరోదాన్ని ద్వేషించేవాడే సంసారి. సినిమాల్లో వుండే బొమ్మలు, దృశ్యాలు ఎటువంటివో సంసారంలో సంభవించే ఘటనలు అటువంటివే! సుఖాలు మాత్రమే కావాలి దుఃఖాలు వద్దు అనుకొనేవాడే సంసారి! మురికి గుంటలోని పురుగులు ఆ గుంట లోని మురికినీ – కంపునూ ఎలా ప్రేమిస్తాయో అలా సంసారి సంసారాన్ని ప్రేమిస్తుంటాడు” వివరించారు రెడ్డిగారు.
“ఈ మన ఆశ్రమవాసుల్లో సంసార భవ సాగరాన్ని దాటినవారివరైనా ఉన్నారా?” కోలా సత్యనారాయణ ప్రశ్న.
“నేనున్నాను. నా భార్య, నా కొడుకు, కోడలు, మనవలు కరణం గారి జంక్షన్‌లో నేను కట్టించిన ఇంట్లో వుంటారు, నేను ఒంటరిగా గాంధీనగర్‌లో నా కొడుకు కొన్న సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్‌లో వుంటూ గత సంవత్సరంగా ఈ ఆశ్రమ కుటీరం లోనే వుంటున్నాను. నేను సంసార భవ సాగరాన్ని దాటినట్టే కదా?” వివరించి ప్రశ్నించాడు శ్రీమాన్ కాటమరెడ్డి సత్యనారాయణ.
“కాదు! భార్యా బిడ్డలతో కలసి లేనంత మాత్రాన నీవు సంసారి కాకుండా పోవు. నా భార్య అన్నావు. నా కొడుకు, నా కోడలు, నా మనవలు, నేను కట్టించిన ఇల్లు అన్నావు. అంటే నీలో అహంకార మమకారాలు ఎంత మాత్రం నశించలేదు. అంటే నీవు సంసారివే! మనసా, వాచా, కర్మణా నీవు, నేను, నాది అనే భావాలను విడిచి పెట్టినవాడు మాత్రమే సంసార సాగరాన్ని దాటిన యోగి అవుతాడు! కుటుంబ సభ్యులతో కలసి జీవించవచ్చు. ఈ భావాలను మాత్రం జయించాలి! ప్రతీ భావం వెనుకా భగవంతుడు ఉంటాడు. శ్రీ రామకృష్ణులు చెప్పినట్టు ‘పడవ నీటిలో ఉండాలి గానీ నీరు పడవలో ఉండరాదు’. అలానే మనం సంసారంలో ఉండవచ్చు గానీ సంసారిగా, అంటే సంసారం మనలో ఉండరాదు. కుక్క తన తోకను ఆడించాలి గానీ కుక్క తోక కుక్కను ఆడించరాదు. మనిషి చిత్తంలో రెండే ఉంటాయి. ఒకటి సంసారం, రెండు ఈశ్వరుడు. సంసార భావాన్ని మనం తొలగించుకుంటే మిగిలేది ఈశ్వర భావమే! మానవ జన్మ వచ్చింది సంసార కూపంలో ఈదులాడడానికి కాదు – ఈశ్వరుణ్ణి పొందడానికే!” వివరంగా చెప్పారు శాంతిరెడ్డి గారు.
“అవును. ఎడారిలో పుట్టిన నది ఎడారి లోనే ఇంకిపోయినట్టు మనిషి జీవితం సంసారం తోనే ముగిసిపోరాదు.” అన్నారు కరుటూరి ప్రకాశరావు.
“అసలు.. ఈ సంసారం ఎలా పుట్టింది?” భారతమ్మ ప్రశ్న.
“సంసారం అన్న వృక్షం అవ్యక్తం నుండి ప్రభవించింది. ఆ చెట్టు యొక్క మొదలు బుద్ధి, అహంకారం దాని శాఖలు, పంచ మహా భూతాలు దాని ఉప శాఖలు, ఇంద్రియాలు దాని తొర్రలు, ఎడ తెగని ఆశలే దాని చిగుళ్ళు, శుభాశుభాలే దాని ఫలాలు, అట్టి సంసార వృక్షాన్ని జ్ఞానం అనే కత్తితో శేషం లేకుండా తెగనరికిన జీవుడు అహంకార మమకార రహితుడై ఆవశ్యం బ్రహ్మపదం చేరుకోగలడని మహా భారతంలోని అశ్వమేధ పర్వం చెబుతుంది.” చెప్పారు రెడ్డిగారు.
“ఈ సంసార దుఃఖాలను అదిగమించడానికి మనిషి ఏం చేస్తున్నాడు?” రొంగల భారతమ్మ అడిగింది.
“ఇప్పుడు మనం చేస్తున్నదే! సంసారంలో వచ్చిన కష్ట నష్టాలను అదిగమించడానికి జనులు ఆశ్రమాలకు, స్వాముల వద్దకు, దేవుడమ్మల వద్దకు, జ్యోతిష్యుల వద్దకు పరుగు పెడతారు. కానీ వారికి తెలియనిది ఒకటుంది. ఈనాటి ఆశ్రమాలు అతి పెద్ద సంసారాలు, ఈ స్వాములు, దేవుడమ్మలు, జ్యోతిష్యులు అతి పెద్ద సంసారులు!” చెప్పారు రెడ్డిగారు.
“నా ఈ సంసారం శాశ్వతమా?” రొంగల భారతమ్మ
“ప్రకృతి పురుషుడు వున్నప్పుడు మాత్రమే ఈ సంసారం ఉంటుంది. ఎల్లప్పుడూ నీతోనే వుండే దానిని మాత్రమే ‘నాది’ అనాలి. గతంలో నీతో లేనిది – భవిష్యత్తు లో నీతో ఉండనిది ఎప్పుడూ ‘నీది’ కాదు. ఇల్లు, భార్య, కొడుకు, ఉద్యోగం, కార్డు, బాంక్ బాలన్స్‌లు శాశ్వతంగా నీతో వుండవు. నీతో ఉండేది కేవలం ‘నీవు వున్నావు’ అనే ఎరుక మాత్రమే! ఆ నీవు ఎవరో తెలుసుకోడానికి సాధన చెయ్యి. సంసారంలో కళ్ళ నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏముంటుంది? మనసు దాని కదలికలే సంసారం. మనసు దాని నిశ్శబ్దమే ‘ఆత్మ’. బుద్ధుని వచనం ‘బి ఎ లైట్ అన్ టు యువర్‌సెల్ఫ్.’ గుర్తుంచుకో! సాధారణంగా సంసారులు ప్రతి దానికీ తాము భయపడుతూ ఇతరులను భయపెడుతుంటారు. చిన్న చిన్న అడుగులు వేసినవాడు చాలా దూరం వెళ్ళగలుగుతాడు. దూరాన్ని లెక్కలలో మాత్రమే కొలిచేవాడు వున్న చోటునే ఉంటాడు. ఆత్మ జ్ఞానం కలిగితే జీవుడే దేవుడు అవుతాడు. ఆత్మ జ్ఞానం లేని దేవుడు కూడా జీవుడే!! బాహ్యంలో వుండే చీకటి ఎవరికీ ఏ హానీ చెయ్యదు. మన అంతరంగంలో వుండే చీకటి చాలా ప్రమాదం. దాని పేరే అజ్ఞానం.” వివరించారు రెడ్డిగారు.
“మరి ఎలా? సన్యాసమే పరిష్కారమా?” భారతమ్మ.
“కాదు.. కాదు.. కాదు! సన్యాసం సమస్యల నుండి దూరం చేయలేదు. సమస్యలకు పరిష్కారం సన్యాసమే అయితే ఈ జగత్తులో అందరూ సన్యాసులే ఉండేవారు! సన్యాసం సన్యాసిగా రియలైజ్ కావడానికే గానీ తనని తాను ప్రత్యేకంగా పేర్కొంటూ ఇతరుల నుండి వేరు చేసుకోడానికి కాదు” గట్టిగా నొక్కి చెప్పారు రెడ్డిగారు.
“అదీ కాదంటారు ఇదీ కాదంటారు. మరెలా?” భారతమ్మ.
“చాలా ప్రపంచ విషయాలపై మన జ్ఞానం ఎంత వరకంటే మరొక ప్రశ్న అడగటం వరకే! మీలో నలుగురు ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకొనేటప్పుడు మీ కబుర్లు సాధారణంగా అక్కడ లేని ఐదో వాడి గురించే! ఆత్మ జ్ఞానం కలిగే వరకే ఈ చింతన. డూ యూ నో? ఎవ్విరి ప్లెజర్ ఈస్ ఎ సీడ్ ఫర్ ది పెయిన్. దేర్ విల్ బి వెరీ స్మాల్ టైం గ్యాప్ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్!” రెడ్డిగారు.
“ఆత్మ జ్ఞానిని.. అదే బ్రహ్మ జ్ఞానిని ఎలా గుర్తించాలి?”
“పొగిడితే సంతోషం – తెగిడితే దుఃఖం కలిగేవాడు సంసారి. పొగడ్తలకు దుఃఖం విమర్శలకు సంతోషం కలిగేవాడు సాధకుడు. పొగడ్తలను, తెగడ్తలను ఒకేలా భావించేవాడే సన్యాసి. అతనే బ్రహ్మ జ్ఞాని లేదా ఆత్మ జ్ఞాని” చెప్పారు రెడ్డిగారు.
“పవిత్రమైన జీవనం ఏది?” భారతమ్మ.
“నేనూ.. నాదీ (అహం.. మమ) లేని జీవనమే దివ్య జీవనం (డివైన్ లైఫ్)” రెడ్డి గారు.
“యోగాకి – ధ్యానానికి ఏమైనా తేడా వుందా?”
“శరీరం యోగా చేస్తేనే మనసు ధ్యానం చేయగలుగుతుంది.”
“జీవం – మరణం పై మీ వ్యాఖ్య..” భారతమ్మ.
“గాలి పీలిస్తే జీవం. పీల్చిన గాలి విడిచి పెట్టి మళ్ళీ పీల్చలేకపోవడమే మరణం!” రెడ్డిగారు.
“దుఃఖములను వ్యాఖ్యానించండి” కముజు అనంత లక్ష్మి ప్రశ్న.
“ద్వంద్వాలైన సుఖదుఃఖములు వచ్చి పోయేవే గానీ స్థిరంగా ఉండేవి కావు. ఈ ప్రపంచం నుండి మీరు ఏదైనా అపేక్షిస్తే ఒకసారి ఈ ప్రపంచం మిమ్మల్ని నవ్విస్తుంది. అదే సుఖం. మరోసారి ఏడిపిస్తుంది. అదే దుఃఖం. ఆశించిన వారికి మాత్రమే సుఖదుఃఖములు కలుగుతాయి. మనిషి జీవితంలో సుఖ దుఃఖ ప్రవాహములు ఉంటాయి. గుణాతీతుడు ఆ రెండింటినీ సమాన దృష్టితో గమనిస్తాడు. గుణములతో వున్నవాడు జీవుడు. గుణాతీతుడు దేవుడు. చైతన్యం దేహం వంటిదనుకుంటే జీవుడు. దేహాతీతం అనుకుంటే బ్రహ్మ! క్రియా శక్తిని వశంలో ఉంచుకున్నవాడే శివుడు. క్రియా శక్తికి లోబడి ఉండేవాడు జీవుడు!” చెప్పారు సువర్ణ లక్ష్మి.
“మంత్రాల తోనూ, మహిమల తోనూ గురువు జీవుణ్ణి దేవుడిగా మార్చగలడా?” లలిత కుమారి ప్రశ్న.
“సాధకులు తమ మార్గనిర్దేశకుడు అయిన గురువులో ఎలాంటి అద్భుతాలు వెదకరాదు. అంధ విశ్వాసాలలో మునిగిపోనప్పుడు గురుశిష్యులకు చెందిన ఒక ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, ఆదర్శవంతమైన పరంపర స్థాపితమౌతుంది. కర్మచారులంతా కర్మయోగులుగా మారిన నాడు దేశం ఉజ్వలత్వంతో వెలిగిపోతుంది” సువర్ణ లక్ష్మి జవాబు.
“మనం దుఃఖంలో వున్నప్పుడు మన పక్కవారు కూడా దుఃఖం పొందాలా?” అడిగింది శేషారత్నం.
“అవసరం లేదు. ద్రౌపది మాటలు గుర్తు చేస్కోండి ‘నా కొడుకులు పోయి నేను ఏడుస్తున్నాను. అశ్వత్థామను చంపేస్తే నాలాగే కృపి కూడా ఏడవడం నాకు ఇష్టం లేదు’ అంటుంది” ఉదాహరణతో చెప్పారు సువర్ణ లక్ష్మి.
“భగవద్గీత ప్రేమ వేరు, ఆసక్తి వేరు అంటుందేమిటి? ఎవరి మీద నైనా ఆసక్తి వుంటేనే కదా ప్రేమ కలుగుతుంది?” శేషారత్నం ప్రశ్న.
“తేనెటీగ పువ్వుల మీద మాత్రమే వాలుతుంది. కానీ.. ఈగ మిఠాయిల మీదా వాలుతుంది. పుండు మీదా వాలుతుంది. జ్ఞానులు తేనెటీగలైతే సంసారులు ఈగ లాంటివారు. దీపం వెలిగేది, గులాబీ వికసించేది, పసిపాప బోసి నవ్వులు రువ్వేది ఎవరి కోసం? ఏమీ ఆశించకుండా జరిగే క్రియల్లో ప్రేమే ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల మీద ఉండేది ప్రేమ అని చెబుతారు కానీ అది చాలా వరకూ ఆసక్తి మాత్రమే! దీనిని నిరూపిస్తూ ‘ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి’ అంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు” అంటూ వివరించారు సువర్ణ లక్ష్మి.
విచారణ చాలా గంభీరంగా సాగుతున్న తరుణంలో జరిగింది ఒక అద్భుతం. అక్కడున్న చాలామంది ఉలిక్కి పడ్డారు. సత్సంగం హాలు గుమ్మంలో నవ్వుతూ నిలబడి వున్నాడు జగదీష్! అందరూ చనిపోయాడనుకున్న మనిషి ప్రత్యక్షమయ్యేటప్పటికి అందరిలోనూ ఉద్వేగం! ఇది ఎలా సంభవం? దెయ్యమై వచ్చాడా? తాము చూస్తున్నది నిజామా? కలా? బెల్లంకొండ మూర్తి తనను తాను గిచ్చుకొని నిజమేనని తేల్చుకున్నాడు. అతని భార్య సుబ్బలక్ష్మి మరో గుమ్మం గుండా బయటికి పరుగేట్టేసింది. అందరిలోనూ ముందుగా తేరుకున్నది శాంతి రెడ్డి గారూ, సువర్ణ లక్ష్మీ.
“మీరు..?” అడిగారు రెడ్డిగారు.
“అవును నేనే! మీ అందరికీ తెలిసిన జగదీష్ నేనే!”
“అదే ఎలా సాధ్యం? మేం విన్నది.. వేరే!” రెడ్డి గారికి మాటలు తడబడుతున్నాయి.
“మీ అందరికీ తెలిసినట్టుగా నేను మూడు సంవత్సరాల క్రితం కరోనాతో చనిపోలేదు. ఆ పుకారు ఎందుకొచ్చిందో, ఎలా వచ్చిందో నాకు తెలియదు. కరోనా మొదటి ఫేస్‌లో నన్ను జతానందులు – నా ఎల్లర్జీ నీ, దగ్గునీ చూసి నాకు కరోనా వైరస్ సోకిందని ప్రచారం చేసి ఆశ్రమం నుండి పంపించేశారు. అదే నా పాలిట వరమై ఇప్పుడు గతంలో వున్న ఎలర్జీ కూడా నయమైంది
మీ అందర్నీ కల్సుకోవాలని ఆశ్రమానికి వచ్చాను. రిసెప్షన్ లోనూ, ఆఫీస్ లోనూ కూడా నన్ను చూడగానే మీలాగే భయపడ్డారు. ఇదంతా చూస్తే నామీద ఏవో పుకార్లు వున్నాయని అనుమానం వస్తుంది. నిజం చెబుతున్నాను నాకు ఏ విధమైన రోగం లేకుండానే నన్ను ఇక్కడినుండి పంపించి వేశారు. మా కుటుంబ సభ్యులు నాకు మాస్క్ వేసి నన్ను వాలంటీర్‍కు అప్పజెప్పారు. హాస్పిటల్‌లో నాకు పరీక్షలు చేసాకా నాకు కరోనా వైరస్ సోకలేదని తెలిసింది. అప్పటికి నాకున్న ఎలర్జీకి ట్రీట్మెంట్ ఇచ్చారు.
అంతా నయమయ్యింది! మాతాజీ సద్విద్యానంద సరస్వతి దర్శనం చేసుకొని మిమ్మలనందరినీ కల్సు కోవాలని ఇలా వచ్చాను. దయచేసి ఏవిధమైన అనుమానాలు పెట్టుకోకుండా మీరంతా ఎందుకు కంగారు పడ్తున్నారో చెప్పండి!” అంటూ లోపలికి వచ్చి కూర్చున్నాడు అందరూ కరోనాతో మరణించాడనుకొన్న జగదీష్!
***
గతం అందరి కళ్ళ ముందు సినిమా రీల్‌లా ప్రత్యక్షమైంది. అందరి మనస్సులో జతానందులు వారి బృందం మెదిలారు. మూడు సంవత్సరాల క్రితం జగదీష్ ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు అతనికి మాయాదేవి, పచ్చగడ్డి లక్ష్మి కుటీరాల మధ్యలోని కుటీరం కేటాయించారు. అదే అతనికి పెద్ద శిక్ష! ఒంటరిగా దొరికిన మగాడి మీద వారు పెట్టిన లైంగిక వేధింపులకు అతను అనుకూలంగా స్పందించలేదు. జతానందుల ముఠా కోపానికి గురయ్యాడు. ప్రతీ ఆశ్రమంలోనూ కులం పేరుతోనో, బలం పేరు తోనో ముఠాలుగా ఏర్పడి రాజకీయం చేయడం ఈనాటి ఆధ్యాత్మిక రంగానికి పట్టిన జాడ్యం!
అతని పూర్వ నామం ఎల్లారావో లేక పుల్లారావో! అమలాపురం దగ్గర్లో గోదావరి కాలువలో మూడు మునకలు వేసి, తన పేరు జపానంద అని చాటుకొని జపం చేసుకోడానికి ఈ ప్రణవానంద సేవాశ్రమం చేరాడు. తాతమ్మో, పీతమ్మో అతనికి బాడీ గార్డ్ అయ్యాడు. బాడీ గార్డ్‌ను లోతు గడ్డలో మూడు మునకలు వేయించి అతనికి ‘తపానంద’ అని నామ ప్రదానం చేసాడు.
ఆశ్రమవాసులెప్పుడూ దేన్నయినా నమ్మడానికి సిద్ధంగా వుంటారు. ఇప్పటి ఆశ్రమాలకు అలాంటి వాళ్ళే కావాలి. ఆశ్రమవాసులు నమ్ముతారు గానీ వెర్రివాళ్ళు మాత్రం కాదు. వాళ్ళిద్దరికీ కలిపి ‘జతానందులు’ అని నామకరణం చేసుకున్నారు. జతానందులకు మాయా మేడం, పచ్చగడ్డి లక్ష్మి, బొల్లిముంతల రమ్యా తోడయ్యారు. ఆ ఐదుగురు ఆడింది ఆట – పాడింది పాటగా ఆశ్రమాన్ని పాలిస్తున్నారు.
జగదీష్ ఆశ్రమంలో చేరిన కొత్తలో వారి లైంగిక అవసరాలకు పనికొస్తాడని భావించి అతని మీద చాలా ప్రేమ ఒలక బోసిన ఆ ముగ్గురు స్త్రీమూర్తులు, అతను వారి అంచనాలకు చిక్కడు, వారి కపట ప్రేమకు దొరకడు అని నిర్ణయించుకొన్నప్పటి నుండి అతన్ని ద్వేషించడం మొదలు పెట్టారు. ఎలాగైనా ఆశ్రమం నుండి వెళ్లగొట్టాలని జతానందులను శరణు వేడారు. ముఠా అంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కరోనా బెల్స్ మ్రోగాయి.
ప్రజలాంతా భయం గుప్పెట్లో బ్రతకటానికి అలవాటు పడుతున్నారు. ప్రపంచానికి మహమ్మారి అయినా ఈ ముఠా కు సువర్ణ అవకాశం అయ్యింది!
“అవును.. అతను.. అదే ఆ జగదీష్ దగ్గాడు” అంది పచ్చగడ్డి లక్ష్మి
“అతను తుమ్మాడు కూడా!” బొల్లిముంత రమ్య.
“అది కరోనా వైరస్ అయ్యుంటుంది” మాయా మేడం.
ఆ ముగ్గురు కలసి జతానందుల కుటీరానికి వెళ్లి “అతన్ని ఆశ్రమం నుండి పంపించెయ్యాలి. లేకపోతే ఆ వైరస్ ఆశ్రమమంతా పాకిపోతుంది. ఆశ్రమం అల్లకల్లోలం అయిపోతుంది” అంటూ జతానందుల చెవులు కొరికారు. వెంటనే కార్యరంగం లోకి దిగిన జతానందులు మాతా సద్విద్యానంద కుటీరానికి వెళ్లి వున్నవి లేనివి కల్పించి భయపెట్టేశారు. నమ్మిన ఆమె వెంటనే జగదీష్‌ను ఆశ్రమం నుండి పంపించేయమని ఆఫీస్‌కు ఆర్డర్ జారీ చేశారు.
***
ఈ విషయం అంతా తెలుసుకున్న జగదీష్ లేచి నిలబడ్డాడు.
“కూర్చో జగదీష్! కొద్ది నిముషాల్లో మాతాజీ వారి గైడెడ్ మెడిటేషన్ మొదలవుతుంది. “ అన్నారు రెడ్డి గారు.
“ఆ రోజు నన్ను ఆశ్రమం నుండి పంపించివేసి అప్పటికి నేను బాధపడుతున్న ఎలర్జీ ఇన్ఫెక్షన్ నుండీ విముక్తి పొందటానికి కారణభూతులైన ఆ జతానందుల దర్శనం చేసుకొని కృతజ్ఞతలు చెప్పుకొని ఆఖరి బస్సుకు మా ఊరు వెళ్లి పోతాను” చెప్పాడు జగదీష్.
అందరూ నవ్వారు. జగదీష్‌కు అర్థం కాలేదు.
“దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్! యు కెన్ నెవెర్ మీట్ దెమ్. దె లెఫ్ట్ దెయిర్ బాడీస్ విత్ కరోనా ఇన్ కరోనా థర్డ్ ఫేజ్!” నవ్వుతూ చెప్పాడు ఇంగ్లీష్ అప్పారావు.
ఆశ్చర్యపోవడం జగదీష్ వంతయ్యింది!
“కరోనా మూడవ ఫేస్‌లో ఆ ఇద్దరికి నీలాగే దగ్గు తుమ్ములు మొదలయ్యాయి. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుందేమోనని భయం. కుటీరాలు విడిచి బయటకు రావడం మానేశారు. భోజనాలు కూడా కుటీరానికే ఏర్పాటు చేసుకున్నారు. వారితో క్లోజ్‌గా వుండే పచ్చగడ్డి లక్ష్మి, బొల్లిముంతల రమ్య, మాయా మేడంలు ముఖం చాటేశారు. ఒక అమావాస్య రోజు కేరేజి పట్టికెళ్లిన అప్పారావు ఎంత కొట్టినా కుటీరం తలుపు తెరుచుకోలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా జపానంద, తపానందలు శవాలై పడి వున్నారు.” చెప్పాడు బెల్లంకొండ మూర్తి
మృత్యు దేవత తన కంటే ముందే ఆ కుటీరానికి వచ్చిందని అప్పారావు అనుకొన్నాడు!!
వారు రోగంతో మరణించలేదు. రోగ భయంతో మరణించారు. మరణం ఎవ్వరిని బాధించదు మరణ భయమే అందరినీ చంపుతుంది.
ప్రాణవానందుల సమాధి మందిరంలో లైట్లు ఆఫ్ చేశారు. మాతాజీ వారి గైడెడ్ మెడిటేషన్ ప్రారంభ మవడానికి సూచనగా!
స్వస్తి