[బాలబాలికల కోసం జంతువుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 9వ భాగం.]
ప్రశ్నలు:
81.
క్వాక్ క్వాక్ అని అరుపులు
బుడి బుడి బుల్లి అడుగులు
ప్రతి రోజూ బంగారు గుడ్లు
82.
పరుగులో ప్రథమస్థానం
నడకలో ఉట్టిపడే రాజసం
పాలిచ్చి పెంచే క్షీరదం
కాలిగోళ్ళు మనిషికి హారం
ఎవరిది చెప్పండి పిల్లలూ!
83.
అడవి అంతటికీ రారాజు
గుహలో ఉంటుంది, గర్జిస్తుంది
జూలు విదిల్చి పంజా విసుర్తుంది
ఎవరో గుర్తించండి పిల్లలూ!
84.
పచ్చిరక్తం పసందుగా తాగుతుంది
మాయావిలా మంచంలో దాక్కుంటుంది
ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన పరాన్నజీవి
85.
రెండు జతల పల్చని రెక్కలు
నీంఫ్ లనే పేరుగల లార్వాలు
అతుకులు గల ఆరు కాళ్ళు
చాలా వేగంగా ఎగిరే కీటకాలు
86.
వీపు మీద బరువు మూట
కానీ కూలీ కాదు
అడుగులో అడుగు వేసి నడక
కానీ పెళ్ళికూతురు కాదు
87.
పంటల్ని నాశనం చేసే పురుగు
అర్థరాత్రిళ్ళు అరిచే క్రిమి
శీతల రక్తం కలిగిన కీటకం
88.
చీటికి మాటికి పరుగులు పెడుతుంది
అలికిడయ్యిందా అదిరి పడుతుంది
తాబేలుతో పోటి పడిందా ఎప్పుడూ ఓడిపోతుంది
89.
చేపలను తింటుంది
తెలివిలో మేటి ఇది
మనుషులతో స్నేహం చేసి
ప్రదర్శనలను ఇస్తుంది
90.
కొమ్మమీంచి కొమ్మమీదకు
ఎగురుతుంది, దుముకుతుంది
కానీ ఇది కోతి కాదు
విసనకర్ర రెక్కలున్న పాకే జీవి
రెప్టీలియా విభాగానికి చెందింది
ఇది ఏమిటో తెలపండి?
జవాబులు:
81. బాతు 82. పులి 83. సింహం 84. నల్లి 85. తూనీగ 86. తాబేలు 87. కీచురాయి 88. కుందేలు 89. డాల్ఫిన్ 90. డ్రాకో (ఎగిరే బల్లి)
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.