[బాలబాలికల కోసం జంతువుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 7వ భాగం.]
ప్రశ్నలు:
61.
ప్రతి పువ్వు ఇంటికీ వెళుతుంది
అదిచ్చిన తేనె తాగి కబుర్లు చెప్తుంది.
62.
వరిచేలపై ఎప్పుడూ వాలుచుండు
వయ్యారం దీని పేరులోనుండు
63.
ఆకుపచ్చగా ఉంటుంది
ఆకులు అలముల్ని తింటుంది
దీని పేర ప్రసిద్ధమైన కథ ఉంది
64.
వస్త్రాన్నైనా, చెక్కనైనా
చక్కగా నాశనం చేస్తుంది
గుట్టలు గుట్టలుగా
పుట్టలు పెడుతుంది
65.
పాల సముద్రంలో తేలియాడేది
వేయి పడగలతో గొడుగులా కప్పేది
విష్ణుమూర్తి శయనించే పరుపు ఏది?
66.
మెదడులేదు, కళ్ళులేవు
కానీ ఐదు చేతులుండే చేప
దీని పేరేమిటో చెప్తారా?
67.
వెలుతురును ప్రేమిస్తాయి
లైటుచుట్టూ తిరుగుతాయి
మాడిమసైపోతాయి
68.
మంచులో నివసించే పక్షి
గులకరాళ్ళతో గూడు కట్టే పక్షి
అందమైన పక్షి, ఆటలాడే పక్షి
69.
తీక్షణమైన చూపు
వాడియైన ముక్కు
పాముల్ని పట్టే పక్షి
నేనెవరో చెప్పండి
70.
ఉత్తరాలను తెస్తుంది
కానీ పోస్ట్‌మాన్ కాదు
శాంతి దూతే కానీ
గాంధీ తాత కాదు
మరి ఎవరో చెప్పండి?
జవాబులు:
61. తుమ్మెద 62. వయ్యారి భామ 63. మిడత 64. చెద పురుగు 65. ఆదిశేషుడు 66. స్టార్ ఫిష్ 67. దీపం పురుగులు 68. పెంగ్విన్ 69. డేగ 70. పావురం
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.