Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జంతువుల పొడుపు కథలు-6

[బాలబాలికల కోసం జంతువుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 6వ భాగం.]

ప్రశ్నలు:

51.
ఒళ్ళంతా అందమైన కన్నులు
వానొస్తే పురివిప్పి నాట్యాలు
ఈకలు పిల్లల పుస్తకాల్లో
మన జాతీయ పక్షి ఇది

52.
ఎప్పుడూ నెమరు వేస్తూనే ఉంటుంది
తల్లిపాలలాగే మేలైన పాలిస్తుంది
పిల్లలకు పెద్దలకు మేలుచేస్తుంది
మహాలక్ష్మిగా పూజలందుకుంటుంది

53.
మృతకళేబరాలను తినే పక్షి
పర్యావరణాన్ని పరిరక్షించే పక్షి
అంతరించిపోయే దశలోనున్న పక్షి
నెత్తి మీద ఈకలు లేని పక్షి

54.
ఒళ్ళు మెత్తని మాంసం ముద్దలా ఉంటుంది
అందుకే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ వేసుకుంటుంది
చాలా నిదానమైన నడకకు చక్కనైన ఉదాహరణ

55.
వసంతకాలంలో కూస్తుంది
మామిడి పూత తిని మత్తుగా
కుహు కుహు రాగాలాలపిస్తుంది
రూపానికి కాదు గుణానికి ప్రతీక

56.
ఎనిమిది కాళ్ళతో గజిబిజి గూళ్ళలో
ఎప్పుడూ దారాలు నేస్తూ బిజీ
రెండు రోజులు తలుపులు మూశామో
ఇల్లంతా వలలు అల్లేస్తుంది

57.
పెద్ద పెద్ద మీసాలుంటాయి
కానీ మామయ్య గాదు
చెరువుల్లో ఉంటాయి
గానీ చేపలు గాదు
వీటిని పెంచుకున్నామో
ఇల్లంతా బంగారమే!

58.
నీళ్ళలో ఉంటే ఏనుగునైనా పట్టేస్తుంది
ఒడ్డున పడేస్తే విలవిలలాడుతుంది
నోటినిండా రంపంలా చీరేసే పళ్ళు

59.
స్వాతి చినుకుకై నోరు తెరిచి
ఎదురు చూసే సముద్ర జీవి
ముత్యమంటి బిడ్డను ప్రసవించి
కడుపులోనే దాచుకునే జీవి

60.
నల్ల గొంగళి కప్పుకుని
మెల్లమెల్లగా పాకుతుంది
గొంగళి ముసుగు తీసిందా
అందాల చిలకై ఎగురుతుంది

జవాబులు:

51. నెమలి 52. గోవు 53. రాబందు 54. నత్త 55. కోయిల 56. సాలీడు 57. రొయ్య 58. మొసలి 59. ఆల్చిప్ప 60. గొంగళి పురుగు

Exit mobile version