[బాలబాలికల కోసం జంతువుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 4వ భాగం.]
ప్రశ్నలు:
41.
అన్నిటికన్నా పెద్ద పాము
కానీ విషముండదు
దీని పేరులో కొండ ఉన్నా
కానీ కదులుతుంది
42.
వరిచేలలో గింజలేరుకుంటూ
అద్దంలో అందం చూసుకుంటూ
ఇంటి చూరులో సంసారం
కిచ కిచ లాడుతూ విహారం
43.
నీటిలో నివాసం
రక్తం పీల్చటమే దాని పని
ఒక్కసారి పట్టుకుందా
వదలనే వదలదు మరి!
44.
రంగురంగుల కోక కట్టుకుంది
రాముని భార్య పేరు పెట్టుకుంది
వన్నె చిన్నెల ఈ అందాల
భామ ఎవరో చెప్పండి చూద్దాం?
45.
చీకట్లో తిరుగుతుంది
చీకట్లో తింటుంది
మిడిగుడ్లేసుకుని
మింగేలా చూస్తుంది
46.
అమ్మగారికీ, అయ్యగారికీ
దణ్ణం పెడుతుంది
ఏం చెప్పినా తల ఊపుతుంది
సంక్రాంతికి మేళంతో
ఇల్లిల్లూ తిరుగుతుంది
47.
గణపతిని మోస్తుంది
ముల్లోకాలూ తిరుగుతుంది
వలలు కొరికి
పావురాలను రక్షిస్తుంది
48.
నీటిలో ఈదులాడుతుంది
కళ్ళు తెరిచే నిద్రిస్తుంది
జలపుష్పాలనే పేరు గలది
49.
బారెడుతోక, బుంగమూతి
చెట్లెక్కి దూకటాలూ, అల్లరిచేష్టలూ
అయితేనేం రాములవారికి
ఈ సేనే సాయం చేసింది
50.
కాడి మోస్తుంది
పొలం దున్నుతుంది
గానుగ తిప్పుతుంది
బరువులు లాగుతుంది
రైతులకు మిత్రుడు
జవాబులు:
41.కొండ చిలువ 42. పిచ్చుక 43. జలగ 44. సీతాకోక చిలుక 45. గుడ్లగూబ 46. గంగిరెద్దు 47. ఎలుక 48. చేప 49. కోతి 50. ఎద్దు
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.