Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జంతువుల పొడుపు కథలు-4

[బాలబాలికల కోసం జంతువుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 4వ భాగం.]

ప్రశ్నలు:

31.
నల్లగా ఉంటుంది
నాలుగుకాళ్ళతో నడుస్తుంది
తేనెపట్టుని తింటుంది
చెట్లెక్కి కునుకుతీస్తుంది

32.
గుడ్లు పెడుతుంది, ఎగురుతుంది
కానీ పక్షి కాదు
ఇపుడు బతికి లేదు గానీ
ఒకప్పుడు భూమ్మీద పెద్ద జంతువు

33.
ఇది మాటిమాటికీ
ఒంటి రంగులు మారుస్తుంది
తొండ జాతికి చెందింది
పొడవైన నాలుక ఉంటుంది
పార్టీలు మార్చే నాయకులను
దీనితోనే పోలుస్తారు మరి

34.
నల దమయంతుల
మధ్య రాయబారి
ధవళవర్ణంలో ఉండే
అందాల కొలికి!

35.
విషపు కోరలుంటాయి
కానీ పాములు కావు
నెట్టెల్లో నివసిస్తాయి
వంద కాళ్ళుంటాయి!

36.
ఎత్తు వేసి ఆహారం సంపాదిస్తుంది
జిత్తులతో మోసం చేస్తుంది
మాయమాటలతో నమ్మిస్తుంది
అందని ద్రాక్ష పుల్లనంటుంది

37.
సముద్రజీవి
పాలిచ్చి పెంచే తల్లి
మంచు ప్రాంతాల్లో
నివసించే ప్రాణి

38.
కొండి పైకెత్తి నడుస్తుంది
కోరినా, కోరకపోయినా
ఆ దారంట వెళ్ళేవారందరికీ
షేక్ హ్యాండిస్తుంది

39.
వంటిల్లు దాని సామ్రాజ్యం
అందరూ పడుకున్నాకే లేస్తుంది
ఎవర్నీ కరవదు, కుట్టదు
చిన్నదే అయినా దీన్ని చూస్తే
చాలా మందికి భయం

40.
నేలను తవ్వుతుంది
కానీ అరకగాదు
పైరుకు బలాన్నిస్తుంది
కానీ ఎరువుగాదు
మట్టిలో ఉంటుంది
కానీ మాణిక్యం గాదు

జవాబులు:

31.ఎలుగుబంటి 32. డైనోసార్ 33. ఊసరవెల్లి 34. హంస 35. కాళ్ళ జెర్రి 36. నక్క 37. సీల్ 38. తేలు 39. బొద్దింక 40. వానపాము

 

Exit mobile version