Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జనంలో కలిసిపోతాను

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘జనంలో కలిసిపోతాను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నా లోపల భావమేదో తలమునకలు వేస్తోంది
కూర్చోనివ్వదు నిలబడనివ్వదు పడుకోనివ్వదు
నిద్రను హంటరుతో అదిలించి పరుగెత్తిస్తుంది

పాపం కలలేమో నా చుట్టూరా ప్రదక్షణలు చేస్తాయి

భావాన్ని ఒడిసిపట్టి
ఓ పదం చేసి పట్టుకుందామంటే
పెదాలు బిగుసుకుంటాయి
నాలుక పిడుచకట్టుకు పోతుంది

ఆ పదమేమో గాజు ముక్కలా
గొంతులో ఇరుక్కుపోయి
బయటపడదు
లోనికి దిగదు

మనసులోని భావమయితే
నా శ్వాసలో
ఈతకొడుతూ ఊపిరి తీసుకుంటోంది

ఏదో ఒక క్షణం ఒడ్డుకు చేరి
‘కవిత’యి కుదురుకుంటుంది

నేనేమో భారం దించుకుని
జనంలో కలిసిపోతాను

Exit mobile version