[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]
సాహిత్య స్ఫూర్తి పతాక
తెలుగువాడి ప్రజాప్రాభవాన్నీ, ప్రతిభావ్యుత్పత్తుల ధిషణనీ ఉత్తర హిందూ స్థానంలో పతాక స్థాయిలో నిలిపిన యుగ సాహితీ వేత్త – జగన్నాథ పండితరాయలు. ఆయన కవి, పండితుడు. సంగీతకారుడు, అలంకారశాస్త్ర శేఖరుడు. ఏకంగా ఎనిమిది భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పండిత ప్రకాండుడు. తర్క, వ్యాకరణ, వైశేషిక, మీమాంసాది అనేక శాస్త్ర పారంగతుడు. హయగ్రీవోపాసకుడు. ఏకసంథాగ్రాహి; వాగ్గేయకారుడు. ప్రతివాద భయంకరుడు. మొగలాయీ చక్రవర్తుల కొలువులో న్యాయ ధర్మ శాస్త్రాధికారి. అంతకుమించి మతాతీత సామాజికాభ్యుదయానికీ, వ్యక్తి వికసనానికీ నిబద్ధతతో కృషి చేసిన సంస్కర్త.
భామినీ విలాసం, లహరీ పంచకం, జగదాభరణం, శతకసముచ్చయం – వంటి సార్వకాలికమైన సాహిత్య గ్రంథాలేకాక, ‘రసగంగాధరం’ అలంకారశాస్త్ర గ్రంథ రచనతో ప్రపంచ సాహిత్య శాస్త్రకారుల్లో నిలువెత్తు సంతకంగా నిలిచిన మేధామూర్తి-జగన్నాథుడు.
ఇంతటి అసమాన సాహిత్యానుష్ఠానమూర్తిని ‘లవంగి’ కథతో ముడిపెట్టి పాండిత్య పంచాననుడి వ్యక్తిత్వానికి మలినాన్ని పులిమింది లోకవదంతి. అది కేవలం అసూయామత్సరగ్రస్తులు చేసిన దుర్మార్గం అని సాక్ష్యాధారాలతో విజ్ఞులూ, పరిశోధకులూ నిరూపించారు. ఇది నేను ఈ రచనకు పూనుకోవటానికి ముఖ్యకారణం. పండితరాయలు ప్రతిభా సర్వస్వానికి జయహారతి నందించాలనే ఒక ఉద్విగ్న చిత్తశుద్ధికీల మరో కారణం.
ఈ నవల చారిత్రకాంశాలు, సాహిత్య గ్రంథాలు ఆధారంగా రచింపబడింది. గ్రంథరూపం నవలా ప్రక్రియ కనుక కథనాన్ని సంపుటనాత్మకమూ, శిల్ప భరితమూ చేయటానికి – అవసరమైనంత మేరకు స్వేచ్ఛతో, స్వాతంత్ర్యంతో కల్పనని ఆశ్రయించటం జరిగింది.
నవల జగన్నాథుడి ముంగండ జీవితంతో మొదలైంది. కాశీ, జయపురం, ఢిల్లీ, ఉదయపురం, ఆగ్రా వంటి ఆనాటి ముఖ్య నగరాల్లో పండితరాయల ఉజ్జ్వల, వైభవోన్నత చైతన్య సాహిత్య ప్రస్థానం చిత్రణతో నడిచింది. మంగళారంభం, మంగళ మద్యం, మంగళాంతం కావాలనే శుభాకాంక్షతో జగన్నాథుడు తన గంగాలహరి శ్లోకాలు – కాశీ/గంగా ఘాట్‌లో పఠింపబడటాన్ని చూసి ఆనందించిన పుణ్యావిష్కరణతో, ధన్య ఘట్టంతో నవల ముగిసింది.
జగన్నాథుడి కథ అక్కడ ముగియలేదు. ఆ తర్వాతి గాథ చరిత్రాభినివేశం, ఉత్సాహం కలిగిన వారికి పఠనీయం.
ఈ నవలా రచనలో నాకు అత్యంత ఉపయుక్తమైన గ్రంథాలు:
- శ్రీ జగన్నాథ పండిత రాజ సత్యచరిత్ర -ఖండవిల్లి సూర్యనారాయణ శాస్త్రి.
- జగన్నాథ పండితరాయలు – శిష్టా ఆంజనేయశాస్త్రి
- పండితరాయల భావతరంగాలు – డాక్టర్ మహీధర నళినీమోహన్.
- జగన్నాథ పండిత రాయల భామినీ విలాసము. డా. పుట్టపర్తి నారాయణాచార్యులు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి).
ఇవికాక ఆంధ్రాంగ్లాల్లో జగన్నాథ పండితరాయలకు సంబంధించిన ప్రస్తావనతో, ఉటంకింపులతో అనేక లఘుదీర్ఘ వ్యాసాల్నీ గ్రంథాల్నీ, చారిత్రక డాక్యుమెంట్లనీ, అంతర్జాలంలో లభ్యమౌతున్న అనేక ఆకరాల్నీ – సంప్రతించాను.
ఆయా గ్రంథకర్తలందరికీ – ప్రత్యేకించి మొదటి నలుగురికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘లవంగీ సంగ గాథ’ (ఖండవిల్లివారి ప్రయోగం) యొక్క అసంభావ్యత గురించీ, ఆధార రాహిత్యాన్ని గురించి – ఖండవిల్లి వారి పుస్తకం పంచమ ప్రకరణంలో అంశాల వారీగా వివరంగా ఉల్లేఖింపబడింది.
సుమారు 50 ఏళ్లుగా నా మననంలో సతమతమై – ఈనాటికి ఇలా వెలుగు చూస్తున్న ఈ నవల – 6,500 పద్యాల మహాకావ్యం నా ‘శ్రీ పదచిత్ర రామాయణం’ లాగానే, ఒక విశిష్ట రచనగా, సాహితీలోకం ఆదరణని పొందుతుందని ఆశిస్తున్నాను.
(సశేషం)
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.