[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఆరుపల్లి గోవిందరాజులు గారి ‘జాలి లేని బ్రహ్మయ్య’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
భళ్లున తెల్లవారింది.
అప్పటికే నానిగాడికి నిద్ర విచ్ఛిన్నమై చాలా సేపయింది. ఏ క్షణం సెల్లు రింగవుతుందోనన్న ఆరాటం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
ఊహిస్తున్న తడవే సెల్లు రింగయి “కంగ్రాట్స్ రా అన్నయ్యా, వదినకి బాబు పుట్టాడు. మదర్ అండ్ బేబీ సేఫ్” చెల్లెలు శిరీష చెప్పిన తడవే ఒక్కసారిగా ఎగిరి గెంతినంత ఆనందం పెల్లుబికి, “సాయంత్రం కోరమాండల్కి స్టార్టవుతా” అన్నాడు.
ఆ మాట విన్న క్రిష్టిగాడు “కంగ్రాట్స్ నానీ.. నీ కల ఫలించింది. ఆశలు చిగురిస్తాయి. ఆల్ ద బెస్ట్” అని చెప్పాడు.
నానిగాడికి లావణ్య ఆరో ప్రాణం.
తను అందరిలా అమ్మగారి ఇంటి నుండి లక్షలు కట్నకానుకలు, ఊహించని వెల చేసే సారె సామానులు వెంటేసుకొని కాపరానికి రాలేదు. పెద్ద చదువరి కాదు. తూ.. తూ.. మంత్రంగా స్కూలు ఫైనలు పాసయ్యింది. అందచందాలలో రూపు రేఖల సుందరి అంతకన్నాకాదు. మరి అటువంటి లావణ్య నానిగాడికి ఆరో ప్రాణానికి కారణం – తన స్నేహితుల భార్యల్లా గొంతెమ్మ కోరికలు కోరి దుబరా ఖర్చుల జోలికి పోదు అన్నది ఒక కారణం అయితే అత్తమామల్ని అన్ని వేళలా కంటికి రెప్పలా కాపాడుకొంటుంది. వాళ్ల ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. తోడికోడళ్లు, ఆడపడుచులతో చాలా సన్నిహిత భావంగా ఉండేది.
సంసారిక ఇబ్బందులతో నాని కొట్టుమిట్టాడేటప్పడు తన వంతు సహకారంగా ఎన్నో విషయాలలో సెక్రటరీలా సలహాలు అందించేది. ఆ సలహాలు తు.చ. తప్పకుండా పాటించడం వలన ఎన్నో సందర్భాలలో ఆపదల నుండి గట్టెక్కేవాడు. ఇప్పుడు కూడా కొడుకుకి జన్మనిచ్చి తన కలలకి మరింత జీవం పోసింది.
***
కాలగమనంలో రోజులు దొర్లి ముచ్చటగా మూడు సంవత్సరాలు గడచిపోయి లావణ్య అమ్మాయికి తల్లి అయ్యింది.
ఇప్పుడు నానిగాడి దృష్టి ఆ ఊరి స్కూళ్ల మీదకు సోకింది. తన కొడుకును ఎటువంటి స్కూల్లో భర్తీ చేసి విద్యావంతుడిగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో ఎంతో మంది స్నేహితులను సంప్రదించి విషయాలు సేకరించాడు. మనసులో – ‘రోజులు మారిపోయాయి. అన్నింటా ఇంగ్లీషు రాజ్యమేలుతుంది. కంప్యూటరు పరిజ్ఞానంలో ఆరితేరి ఉండాలి. అయినప్పటికీ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయక తప్పదు’ అనుకుంటూ, ఆ విషయాలపై తర్జన భర్జనలు జరిపి ఆ ఊరిలో పేరు మోసిన స్కూల్లో కొడుకుని అడ్మిషను చేయించాడు.
ప్రతిదినం తను రైల్వే డ్యూటీకి వెళ్లే ముందస్తుగా కొడుకును బైకు వెనుక కూర్చోబెట్టుకున్నపుడు గేటు గుమ్మం వద్ద నుండి లావణ్య చిరునవ్వుతో తన ముద్దుల కొడుక్కి చేయి సంజ్ఞతో బై చెప్పడం చూసి ఎంతో మురిసిపోయేవాడు.
కొడుకు తను ఊహించిన విధంగానే ఎల్.కె.జీ.లో పిల్లలందరిలో టాపరయ్యాడు. ఆ మేరకు భార్యాభర్తలిద్దరూ ఆనంద పరవశులయ్యేవారు.
పిల్లలకు చదువుతో బాటు ఆటలు కూడా అవసరమని తలంచిన నాని మార్కెట్టు నుండి కేరమ్ బోర్డు, వైకుంఠపాళీ చార్టు కొని ఇల్లు చేరి నేర్పించసాగాడు. అప్పుడప్పడు సాయంకాల సమయాన మేడ మీదకు చేరి చిన్న చిన్న పరుగులు తీసే దొంగాట లాటివి నేర్పించసాగాడు.
కొన్నాళ్లకు కొడుకుతో బాటు కూతురుని కూడా అదే స్కూల్లో అడ్మిషను చేయించగలిగాడు.
ఒక దినం భానుడి ప్రతాపానికి ప్రాణికోటి తహతహలాడిపోతున్న సమయాన, ప్రతి నెల భిక్షాటన జరిపే ఎనభై ఏళ్ల స్వామీజీ తాపానికి ముందుకు సాగలేక ఓ చెట్టు నీడన చితికిలపడ్డాడు. అప్పుడే డ్యూటీ నుండి ఇంటికి దారితీస్తున్న నానిగాడికి స్వామిజీ కనపడగా – జాలి, మానవత్వంతో దగ్గరకు వెళ్లి వారి జోలెను తీసుకొని అక్కడి గృహస్థుల నుండి బియ్యం, పప్పులు, నూనె కూరగాయలు సేకరించి ఒకరిద్దరు అబ్బాయిల సహాయంతో స్వామిజీకి అందజేశాడు.
నాని తనపై చూపించిన ప్రేమానురాగాలు, మానవత్వానికి స్వామీజీ ఎంతో ప్రశంసించి, నిండు మనసుతో – “సుఖీభవ! చల్లగా వర్ధిల్లు నాయనా! ఆ బ్రహ్మయ్య కరుణించుగాక!” అని ఆశీర్వదించాడు.
మరో పర్యాయం ఆఫీసులో ప్యూను రంగాచారి తన ఒక కూతురు పెళ్లి ప్రయత్నాలలో కనీస అవసరాలకు కావలసిన డబ్బు కోసం ప్రయత్నాలు జరిపి విఫలమై పెళ్లి ఆగిపోయినంత పరిస్థితిని గ్రహించిన నానిగాడు తన కో-వర్కర్లుని కేంటిను తీసుకొని వెళ్లి “కుటుంబాలను నడిపిస్తున్న మన అందరకూ డబ్బు విలువ ఎటువంటిదో తెలియనిది కాదు. అయినా సరే మనం కొన్ని కొన్ని సందర్భాలలో వేలకు వేలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాం. వాటిలో చాలా వరకు వృథా అవుతున్నాయి. ఈ రోజుల్లో ఎవ్వరం ఏ మంచి పని చేయలేక పోతున్నాం” అంటూ రంగాచారి కూతురు పెళ్లి ప్రస్తావన తెచ్చి, అతని అవసరం చెప్పి – “ఎలా అయినా ఆ ఆడకూతురికి పెళ్లి జరిగిలా చూడడం మనందరి పైనా ఉంది. అది ఏవిధంగా జరిపించారో చెప్తా వినండి. మనకు ప్రతి సంవత్సరం దుర్గా పూజలకు డిపార్టుమెంట్ ఊహకు అందని డబ్బు బోనసుగా చెల్లిస్తుంది. అయితే ఈ ఒక్క సంవత్సరం ఒక వెయ్యి రూపాయలు లేదనుకుంటూ తలా వెయ్యి వేసుకున్న పక్షంలో, పాతికవేలతో హాయిగా ఆ అమ్మాయి వివాహం జరిగిపోతుంది. ఇలా చేయడం వలన రంగాచారి ఎవరి కాళ్లు పట్టుకోనవసరం లేదు. నెలనెలా పది రూపాయిలు చొప్పన వడ్డీ కట్టి నవసరం ఉండదు” అని చెప్పాడు. ఆ మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు. తన ఉదార స్వభావానికి ఎంతో ప్రశంసించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సంతోషంతో ముందడుగు వేసారు.
విషయం వినిన రంగాచారి, అతని భార్య ఆనందానికి అవధులు లేకుండా పోయాలి.
వారి ఆనందం వర్ణణాతీతం!
నానిగాడు వివాహం చేసుకున్న ప్రారంభ దశ-
ఒక దినం అర్ధరాత్రి మూసిన తలుపులు చప్పుడయ్యాయి. నిద్ర విచ్చిన్నమైన నానిగాడు సంకోచంగా వెళ్లి తలుపులు తెరిచాడు. నలుగురు పిల్లలకు విద్యాబోధన చేసే అమ్మగారిని చూచి గతుక్కుమని, “అమ్మగారూ ఏం జరిగింది? ఈ సమయంలో మీరు..” అని ప్రశ్నించాడు. “అబ్బాయి క్రిష్ణకి బాగులేదు. జ్వరం ఉపద్రవంగా ఉండడంతో పరాకు మాట్లాడుతున్నాడు. వాళ్ల నాన్నగారు చూస్తే రెండు దినాలకై కేంపు వెళ్లారు!” అని కన్నీళ్లొత్తుకుందావిడ. “నడవండి. నేనొస్తున్నా” అంటూ బైటపడి ఆ అబ్బాయిని అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకొని వెళ్లి చేర్చి రెండు దినాలు అక్కడే గడిపి ప్రాణలు కాపాడాడు.
అంతేకాదు తన ఉద్యోగం వెలగబెడుతూ, తీరిక వేళల్లో శెలవు దినాలులో ఒకరికి గ్యాస్ సిలిండర్, ఇంకొకరికి రేషను కార్డు పుట్టించడం, అవసరం అంటూ కలిగినపుడు స్కూలుకి వెళ్లి ఫీజులు సహితం చెల్లించేవాడు. ఎవరి వద్ద పైసా ఆశించకుండా కొన్ని కొన్ని సందర్భాలలో తన చేతికి చమురు తగిలినా పట్టించు కునేవాడు కాదు.
తను రాజకీయ వ్యక్తి, ధనవంతుడు, అంత చదువరి కాకపోయినా లొకాలిటీలో అందరి మన్నలను చూరగొన్న వ్యక్తి! తన వలన ఎవరికి ఏ ఉపకారం జరిగినా అవతల వాళ్ళు పిల్లా పాపలతో క్షేమంగా నుండాలని కోరుకునేవారు.
***
అది చలికాలం ప్రారంభ దశ.
ఒక దినం పదకుండు గంటలకు వర్క్షాపు నుండి కార్మికులు భోజనాలకు ఇళ్లు చేరే సమయాన నానిగాడు సైకిలు తొక్కుతూ వెళ్తుండగా, గ్రేటు బజారు రావణ మైదానంలో మునిసిపాలిటీ వర్కర్లు మైదానాన్ని శుబ్రపరస్తూ కనబడ్డారు. ఎందుకో అర్థంగాక సైకిలు దిగి ఒకరిని ఎందుకు శుభ్రం చేస్తున్నారని ప్రశ్నించాడు. వాళ్లు మహా ఆనందంతో “సర్కసు వస్తుంది” అని చెప్పారు.
కొడుకు కూతురు కలిగిన తరువాత సర్కసు రావడం ఇదే మొదటి రౌండు. పిల్లలిద్దరికీ చూపిస్తే ఎంతో ముచ్చటపడతారు అని ఆలోచించుకొంటూనే ఇల్లు చేరి భోజనం చేస్తున్నపుడు రాబోవు సర్కస్ విషయం చెప్పాడు.
కొడుకు లావణ్య తినిపించే గోరు ముద్దలు తిననని మారాం చేస్తుంటే నానిగాడు కలిపించుకొని “ఊ.. గబుక్కున ఆమ్ చేసేయ్.. సర్కసుకి వెళ్దాం. అక్కడ ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు, గుర్రాలు, కోతులు ఎన్నో తమాషాలు చేస్తాయి. జోకరు గాడు భలే భలేగా నవ్విస్తాడు, కోతి పావురాన్ని ఎక్కించుకొని సైకిలు తొక్కుతుంది. గ్లోబులో మోటరు సైకిళ్లు రైయ్.. రైయ్మంటూ తిరుగుతాయి.. జడకూడదు మరి! ఆ తర్వాత ఎంతో ఎత్తులో మనుష్యులు ఉయ్యాలలు ఊగుతూ రకరకాల ఐటమ్స్ చేస్తారు..” అన్న మాటలకు లావణ్య గోరుముద్దలు తినిపించే కార్యక్రమం సమాప్తి అయింది.
***
ఆ దినం ఆదివారం.
వర్క్షాపు అరపూట మాత్రమే పనులు నిర్వహిస్తుంది. నానిగాడు సాయంత్రం లావణ్యను పిల్లలను సర్కస్కి తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకుని తొందరగా వర్కుషాపుకు బయలుదేరాడు – పనిలో తల దూర్చడానికి.
నానిగాడు రైలింజను లోనికి వెళ్లి మరమ్మత్తు చేస్తుండగా ఓ ఇద్దరు పరుగున వెళ్లి “నీ కొడుకు మేడమీద గాలిపటం ఎగరవేస్తే, అది కరెంటు తీగలకు చిక్కుకోగా తానేదో ప్రయత్నం చేయబోయి – ఎక్కిన గోడ మీద నుంచి కాలుజారి సరాసరి కిందపడి పోయాడు. ఎవరో రైల్వే ఆసుపత్రిలో చేర్చారట!”- అన్న పిడుగులాటి వార్త చెప్పగా, శరీరం స్వాధీనంలో లేకపోయినా ఒక్క పరుగున ఆసుపత్రి చేరుకున్నాడు. తల వెనుక భాగానికి తగిలిన దెబ్బకు అక్కడే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని డాక్టరు చెప్పిన విస్ఫోటం లాటి వార్తకు నిలువునా స్తంభించిపోయాడు.
విషయం తెలుసుకున్న ఎనబై ఏళ్ల అంజమ్మ నానిగాడితో “ఎంత ఘోరం జరిగిపోయిందిరా నాయనా. నువ్వు నాకళ్లెదుట పుట్టినవాడివి. నీకొక కొడుకు అంటే మురిసిపోయాను. వాడి మీద నువ్వు పెట్టుకున్న ఆశలన్నింటిని ఆ దేవుడు కుప్ప కూల్చేసాడు గదరా” అంటూ కళ్లొత్తుకుంది.
ఇప్పుడు నానిగాడు భార్యనీ కూతురిని దృష్టిలో పెట్టుకొని తన కన్నీళ్లకు కళ్లెం వేసుకున్నాడు.
***
కొన్ని సంవత్సరాలు కనుమరుగులో కూతురు లాస్య మెట్రిక్యులేషను పాసయ్యింది. నానిగాడికి ఉద్యోగంలో ప్రమోషను వరించింది. లాస్యను కాలేజిలో చేర్చాలనుకుంటున్న సమయంలో లావణ్య అనారోగ్యం పాలై అది చివరకు క్యాన్సర్కు దారితీసింది. ఒక దినం భర్తతో “చూసారా ఎంత ప్రమాదకరమైన రోగం పీడిస్తోందో! నేను బతికి ఉండగా ఓ ఇల్లు కట్టండి. అందులో నా ప్రాణాలు విడిచిపెడతాను. ఇది నా చివరి కోరిక!” – అన్న మాటల్ని నానిగాడు జీర్ణించులేకపో యాడు. ఆమె కోరిక తీర్చడానికి ప్రయత్నాలు కొనసాగించాడు. అందుకు తన సర్వీసు జి.ఎఫ్. లోనులు ఖాళీ చేయవలసి వచ్చింది. మరోవైపు ఇంట బంగారు నగల్ని కొదువ పెట్టవలసి వచ్చింది.
స్వల్ప తరహాలో గృహప్రవేశం జరిగిపోయింది.
లావణ్య ఆనందభరితురాలయ్యింది. భర్త తన కోరికను ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనై తీర్చినందుకు.
లావణ్య కూతురు లాస్యకు ఎన్నో విషయాలు తలకెక్కించేది. రకరకాల వంటలు, వడ్డనలు నేర్పించింది.
నానిగాడి పట్ల తిరిగి విధి వక్రించి లావణ్యకు చికిత్స జరుగుతుండగా ఒకదినం తుదిశ్వాస విడిచి పెట్టింది.
నానిగాడి ఒంటరి జీవితం, అమ్మాయి బరువు బాధ్యతలు, మంచి చెడులతో నడిసముద్రంలో చుక్కాని పడవ అయ్యింది. ఎలా జీవితంలో ముందుకు సాగాలో అర్థంకాక పిచ్చివాడయ్యాడు. నిరాశ, భయం, అతడి జీవితంలో గొడ్డలి పెట్టులయ్యాయి.
తిరిగి ధైర్యాన్ని కూడగట్టుకొని అమ్మాయికి వివాహం జరిపించాడు. అల్లుడు చాలా మంచి వ్యక్తి. మామగారు ఏకాకి బతుక్కి అండగా నిలవాలని తన ఊర్లో జీవించమని కోరాడు.
నానిగాడికి ఆ మాటలు ఎంతో బలానిచ్చాయి. రిటైరైన వెంటనే కట్టుకున్న ఇంటిని అద్దెకు ఇచ్చి కూతురు దగ్గరకు వచ్చి విజయనగరంలో తలదాచుకున్నాడు.
అక్కడ మనమడు, మనమరాలుతో కొన్ని బాధలు మరచి జీవిస్తున్నాడు. కూతురు సేవలకు తన తల్లి, భార్య మెదిలేవారు.
ఇటు అల్లుడు, అటు కూతురు నానిగాడిని కంటికి రెప్పలా చూచుకుంటున్నారు. కోరినది కల్పిస్తున్నారు. క్రమంగా తన ఆరోగ్య విషయంలో వైద్య పరీక్షలు జరిపిస్తునే ఉన్నారు. మానసిక ఆందోళన తొలగిపోవాలన్న తలంపుతో షికార్లకు, గుడులు గోపురాలు, బంధు వుల వద్దకు తీసుకొని వెళ్తూ ఆ ప్రాణానికి ఊరట కలిగించాలని చూసున్నారు.
అది కూడా ఆ బ్రహ్మయ్య చూడలేకపోయాడు. అందుక ఒక దినం మనమరాలుని తీసుకొని రావడానికి వెళ్లి రోడ్డును 12 దాటుతుండగా.. ఓ రాక్షస లారీ చక్రాలకి లాస్య బలై తుదిశ్వాస విడిచిపెట్టింది.
ఆ సంఘటనకు నానిగాడి నోరు మూగబోయింది.. కన్నీరు కరువైపోయి శిలాప్రతిమయ్యాడు.
పరామర్శించడానికి వెళ్లిన వారిలో ఓ తలనెరిసిన వ్యక్తి – “ప్రతీవారికీ గత జన్మ కర్మ ఫలం అనుభవించక తప్పదు. అయితే ఆ బ్రహ్మయ్య ఇంత దారుణమైన శిక్షలు విధించడం.. నిజంగా తనకి జాలి లేదు”- అన్న మాటలతో అందరి హృదయాలు పిండినట్లయ్యాయి.