Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇష్టసఖి

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ఇష్టసఖి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

యనాల నిండా ఆనందాలను నింపుకుని
నా వైపు అల్లరిగా చూస్తూ అలరిస్తుంటావు!
గుండెల్లో ప్రేమ పరిమళాలు ఉదయించేలా
ప్రేమలతలు చిగురింపజేస్తూ
సంబరానికి మారుపేరై నిలుస్తుంటావు!
అర్ధరాత్రి దాటాకెప్పుడో గబుక్కున గుర్తొస్తూ
మెలకువల కలల రాత్రులను
బహుమతిగా ఇస్తూ మురిపిస్తుంటావు!
నిజమేదో కానిదేదో అర్థంకాని అయోమయ స్థితికి నెట్టేస్తూ
అమాయకంగా నవ్వుతూ ఆటపట్టిస్తుంటావు!
నీ సన్నిధికి చేరాలని తపించేలా
నీ ప్రియమైన మాటలు ఆస్వాదించాలని అనిపించేలా
నీ చిరునవ్వుల సరాగాల సంగీత తన్మయాల పారవశ్యాల్లో ఓలలాడిస్తూ
నీ సాన్నిహిత్య మధురిమలకై ఆరాటాలు పెంచేస్తూ..
నీ కోసమే నేను అనే భావనలు మదినిండా కలిగిస్తూ..
జ్ఞాపకాల జడిని తీయని తలపుల అలల్లా
ప్రసాదిస్తున్న దేవతలా ఎదురవుతుంటావు!
జత చేరిన బంధమా..
అనురాగాల అనుబంధమా..
సదా నీ నేను!

Exit mobile version