Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇప్పుడు ఇల్లు

దేశంలో ప్రస్తుతం కురుస్తున్న అసాధారణ వర్షాలకు స్పందించి రాసిన కవిత.
~
ఇప్పుడు ఇల్లు
తడిసి ముద్దైంది
వర్షంలా కురిసే కవిత్వానికి

వానొచ్చిందా
నీటి మడుగులుగా మారిన
చిన్నచిన్న గదుల ఇల్లూ
చెరువైన వాకిలి చిత్రాలు

గుడిసెలో పాకో అయితే
చీకిపోతుంది విసిరు వానకు
గూన పెంకలో పాత రేకులో ఉంటే
ఇల్లు జల గీతమే కప్పు పగిలి
ఇదో మోడల్ హౌస్ దేశం వరదలకు

ఈ చేతులు ఎన్ని
ఎత్తిపోతల స్తంభాలలో
కుండపోత వానలో ఇల్లు

కడుపు కొర్రాయి మంట
ఇల్లంతా తడిసే వానకు
వెలుగుని పొయ్యిలో కదలదు పిల్లి

ఇల్లు కకావికలం జలధారల
బజారు అల్లకల్లోలం వరదలో
ఆట ఆగదు,ఈత ఒడువదు

ముసురు అసరు విప్పేది తర్వాతే
ఇప్పుడు మాత్రం కాదు సుమా!

వాన వరదలో
పాదాల కింద ఇసుక కదిలిపోగా
కలిగే పారవశ్యం కొలిచే స్కేల్ లేదు
అదే
వాన వరద మిగిల్చిన కొండ గుర్తు

Exit mobile version