Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇప్పుడైనా.. గుట్టు విప్పవా!?

[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘ఇప్పుడైనా.. గుట్టు విప్పవా!?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నా చూపులు నీ కళ్ళను తాకి
నా మనసును నీకు అంకితం చేసి
అయిదు దశాబ్దాలు గడిచాయి!
అందుకు మూల్యంగా
నేను అనుభవించిన వియోగ వ్యథ
ఓ పెద్ద కథే అయ్యింది!
హృదయాన్ని చాలా తేలికగా తీసుకున్నావు!
హృదయం ఎటో వెళ్ళిపోయాక..
ప్రేమించడాన్ని కూడా తేలికగానే తీసుకున్నావు!
అసలు ప్రేమంటే ఏమిటో?..
నీకు తెలియదు ప్రేయసీ!
ప్రేమంటే..
నువ్వు ఎవరి లోనికో ప్రవేశిస్తావు!
ప్రేమంటే..
నీలోనికి ఎవ్వరో ప్రవేశిస్తారు!
ఇంత పెద్ద ప్రహసనాన్ని..
టఆఁ.. ఏముందిలే’ అని..
ఆషామాషీగా, సరదాగా తీసుకున్నావు!
ఫలితంగా.. మన రెండు హృదయాలు
విరహాగ్నిలో కాలి బూడిదై పోయాయి!
నీ హృదయం నిన్ను కోల్పోయింది!
నా హృదయం ఎడారిలో నీ ఉనికి కోసం
జీవితమంతా ఎదురు చూపులే!
నా మనసు నీకు అర్పించి ప్రతిఫలంగా..
వియోగ వేదనను అనుభవిస్తున్నా!
మనం అనుభూతించిన చివరి క్షణాలు
నా కన్నుల ముందు కదలాడుతున్నాయి!

అప్పుడు.. నువ్వు..
నన్ను ప్రాణంగా ప్రేమించడం చూశాను!
కాలగమనంలో..
నా నుంచి కళ్ళు తిప్పుకోవడం చూశాను!
ఈ రెండు సంఘటనల మధ్య కాలంలో..
ఏదో అద్భుతం జరిగింది!?
అదేమిటో తెలుసుకోలేక అర్ధ శతాబ్ధంగా..
విలవిల్లాడి పోతున్నాను!
ప్రియసఖీ..
నాదో చిన్న అభ్యర్థన!
మనమిద్దరమూ..
జీవితం చివరి అంచులలో
విధాత విలుపు కోసం..
ఎదురుచూస్తూ ఉండిపోయాం!
మరి.. ఇప్పుడైనా గుట్టు విపి విప్పి..
నాకు మానసిక ప్రశాంతతను అనుగ్రహించు!
మన..
కలయికకు..
వియోగానికి..
మధ్య జరిగిన అద్భుతం ఏమిటి ప్రేయసీ!?

Exit mobile version