ఇంటింటికీ ఆప్తుడు అందరికీ ఆత్మీయుడు.
‘పాడుతా తీయగా’కి ఆద్యుడు.
‘స్వరాభిషేకా’నికి మకుటాయమానమైన చక్రవర్తి ఆతడు.
పాటకు పట్టంకట్టిన మహోన్నతుడు.
అమృతాన్ని గానంలో ముంచి పంచిన మధుర గాయకుడు.
అతడు అల్లరిచేసే బాలు సంగీతానికి అలంకారాలు చేసిన గొప్ప ‘బాసు’.
బాలు పాటలు ఆకాశంలో ప్రకాశించే ఉజ్జ్వల తారలు.
ఆ మాటల మాంత్రికుని మాయలో వలపులో పడని గాన ప్రియులు ఎవరు?
ఆయన కృషి పట్టుదల ఎందరికో సోపానాలు.
మీరు చేసిన శిల్పాలు ఎన్నివున్నా మీకు మీరే సాటి. మీకు లేదు పోటీ.
మీ కీర్తి హిమాలయ శిఖరం మీ గానం నటరాజుకు నీరాజనం.
పాటలకు పట్టంకట్టి ప్రజల హృదయాలలో కొలువైవున్న బాలూ గారూ
మీ వయసే మాకు గుర్తుకురాలేదు ఏనాడూ…..
అందుకే ఏ పాటనైనా ఏ వయసువారైనా….ఆస్వాదించారు.
అందుకే నమ్మలేకపోతున్నాం మీరు లేరని…..
జగతిపై నడయాడిన గానగంధర్వా మాకు
అమృతాన్నిపంచి తిరిగి నీలోకానికి చేరుకున్నావా….
నాకిష్టమైన పాటల్లో ఏయే పారిజాతమ్ములీయగలము….
మదిలోదాచుకున్న మధురోహలు తప్ప…
వెలకట్టలేని బంగారుగనులు మీ పాటలు…..
మాటల్లో చెప్పలేక గుండెలోతుల దాచుకున్న గౌరవాభిమానాలు తప్ప……
అక్షరాంజలితో ……
ఒక అభిమాని.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.