[సంచిక కోసం కవి డా. కె.వి.బి.ఆనంద్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
విద్యార్థి దశ నుండి సాహిత్యం పట్ల అభిరుచి ఉండడంతో ప్రసిద్ధ రచయితల రచనలు చదవడమేగాక తెలుగు, ఆంగ్లపత్రికలు చదవడం డా. ఆనంద్‌కు నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయింది. ఈయన మంచి కవి మాత్రమే కాకుండా, మంచి చిత్రకారుడు, కార్టూనిస్ట్ కూడా! దంతవైద్య వృత్తితో పాటు, దానికి సమానంగా సాహిత్యాన్ని ప్రవృత్తిగా స్వీకరించిన డా. కె.వి.బి. ఆనంద్, సాహితీ క్షేత్రంలో ఆయన అనుభవాలను, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
డా. కె.వి.బి. ఆనంద్: మిత్రుడు కె.ఎల్.వి.కి అభినందనలు. నమస్తే కెఎల్వీ.. మీకు, సంచిక అంతర్జాల మాసపత్రిక కార్యవర్గానికి, అభినందనలు. మీరు సంధించే ప్రశ్నావళికి.. వీలైనంత విపులంగా.. జవాబులివ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
~
ప్రశ్న1. మీ జన్మస్థలం, విద్యాభ్యాసం గురించి వివరంగా చెప్పండి.
జ: నేనుపుట్టింది, శ్రీకాకుళం జిల్లా (నేడు పార్వతీపురం మన్యం) పాలకొండ లో. డా, కడియం సీతారామ శాస్త్రి సావిత్రమ్మ గార్లు నా తల్లిదండ్రులు. నేను వారికి 5వ సంతానాన్ని. మేము మొత్తం 12 మందిమి. నా ప్రాథమిక విద్య 1 నుండీ 5 వ తరగతి వరకు సమితి ప్రాథమిక పాఠశాలలో జరిగింది. తదుపరి ఉన్నత విద్య 6 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. తదుపరి 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ పార్వతీపురం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1971- 73 మధ్య జరిగింది.
ఆపై 1974 -1979 వరకు BDS.. డెంటల్ వింగ్, ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగింది.
ప్రశ్న 2. తెలుగు భాషమీదమక్కువ ఎప్పుడూ ఎలా కలిగింది? దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జ: నా మాతృభాష తెలుగు. సహజం గానే అభిమానం, మక్కువ ఉంటుంది. ఇంట్లో, చుట్టుపక్కల్లో అందరూ తెలుగులోనే మాట్లాడుతూ ఉండేవారు. మాతృభాష ఇష్టం కావడం వల్ల మక్కువ కలిగి ఉండొచ్చు.
ప్రశ్న 3. మీ చదువు ఏ మాధ్యమంలో జరిగింది? వివరంగా చెప్పండి. ఏ మాధ్యమంలో చదువు ఉంటే బాగుండేదని మీరనుకుంటున్నారు?
జ: నా విద్యాబ్యాసం 1 నుండి ఇంటర్ వరకు తెలుగు మాధ్యమంలో జరిగింది. ఎవరి మాతృభాష ఏదో.. వారు, వారి మాతృభాషలో.. 7వ తరగతి వరకు చదవడం చాలా అవసరం. త్రిభాషా విధానంలో 7వ తరగతి వరకు మాతృభాష మొదటి భాష గాను, హిందీని రెండవ భాష గాను, ఇంగ్లీషు మూడవ భాష గాను.. విద్యను నేర్పడం తప్పనిసరై తరువాత అందరికీ ఇంగ్లీష్ మాధ్యమంలో ఇంటర్ నుండి తప్పనిసరై ఉంటే మంచిది.1వ తరగతి నుండో 6వ తరగతి నుండో ఇంగ్లీష్ మాధ్యమంలో చదవడం వల్ల వారి మాతృభాషలో ఉన్న మాధుర్యాన్ని చవిచూసే అవకాశం కోల్పోవచ్చు. అభిమానం, మక్కువ పోవచ్చు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఇంగ్లీషు నుండి పాఠ్యపుస్తకాలను తర్జుమా చేస్తున్నప్పుడు.. కొన్ని ముఖ్యమైన పదాలను మక్కికి మక్కిగా తర్జుమా చేయకుండా ఇంగ్లీషు పదాలను వాడటం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల.. తదుపరి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకున్నప్పుడు, చదువు అర్థమవుతూ చక్కగా సాగుతుంది.
డా. ఆనంద్ తల్లిదండ్రులు
ప్రశ్న 4. తెలుగు సాహిత్య మీద అభిరుచి ఏ వయసులో ఎలా కలిగింది? చదువుకునే రోజుల్లోనే రచనా వ్యాసంగం ఎలా ఉండేది?
జ: తెలుగు సాహిత్యం.. మీద అభిరుచి కన్నా ముందు బాలల బొమ్మల చిత్ర కథలు.. చందమామ బాలమిత్ర పత్రికలు పంచతంత్రకధలు మొదలైనవి చదవడం నాకు 6వ తరగతినుండే అలవాటైంది. 6వ తరగతి నుండి హైస్కూల్‌కి వెళ్ళేటప్పుడు దారిలో మా ఇంటికి దగ్గరలోనే ఉన్న బ్యాంక్ లైబ్రరీకి వెళ్లి చదవడం అలవాటైంది. 10వ తరగతి వరకు రచనా వ్యాసంగాలు లేవు. ఐతే భేతాళ కథ ఒకటి రాశాను. ఆ ప్రతి లేదు కానీ ఆ కథ అప్పుడప్పుడు మెదులుతూనే ఉంటుంది.
ఇంటర్‌లో మాత్రం అమ్మా నన్నెందుకు కన్నావు.. అనే కవిత రాశాను. నిరుద్యోగం మీద అదే నా మొట్టమొదటి రచన.
డా. ఆనంద్ దంపతులు
ప్రశ్న 5. మీ రచనావ్యాసంగంపై మీ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉండేది? విద్యార్థి దశలో ఏమైనా ఆంక్షలు ఉండేవా?
జ: రచనా వ్యాసంగం గురించి కుటుంబ సభ్యులకు ముందు తెలియదు. ఇంటర్లో తొలి కవిత పేపర్ మీద పెట్టాను. అమ్మ ఆ పేపర్ ముక్కను చాన్నాళ్ళ దాచుకుంది. నాన్నగారు ప్రాక్టీస్‌లో బిజీ. వదిన అడిగేది, ఏమైనా రాశావా అని.
విద్యార్థి దశలో నా రచనా వ్యాసంగం గురించి తెలియదు కనుక ఆంక్షలు లేవనే చెప్పాలి.
ప్రశ్న 6. మీ మొదటి రచన ఎప్పుడు ఏ పత్రికలో ప్రచురితమైంది? అప్పుడు మీ స్పందన ఎలాంటిది?
జ: నా రచన మొదటిగా అచ్చులో చూసుకున్నది ‘చదువుకో విద్యార్ది చదువుకో’ అనేది తెలుగు విద్యార్థి మాసపత్రిక నవంబర్ నెల సంచికలో ప్రచురించబడింది. పత్రిక ఇంటికి పంపబడింది. అయితే నా పేరును, తాత మనవడు సినిమాలో తప్పులు చెప్పినందుకు విజేతల లిస్ట్ ఆంధ్రపత్రికలో చూసినప్పుడు.. ఎంతో ఆనందం కలిగింది.. ప్రైజ్ మనీ 25 రూపాయలు MO గా పంపారు.
గ్లోబల్ అచీవర్స్ ఫౌండేషన్, ఢిల్లీ వారు 2012, డిసెంబర్ లో ఇచ్చిన అవార్డ్
ప్రశ్న 7. మీరు హైదరాబాద్‌లో చదువుకుంటున్నప్పుడు మీ సాహిత్య కార్యక్రమాలు ఎలా ఉండేవి? సాహిత్యానికి సంబంధించి కాలేజీలో ఎలాంటి కార్యక్రమాలు మీరు నిర్వహించేవారు?
జ: నేను హైదరాబాద్‌లో చదువుకుంటున్నప్పుడు నా సాహిత్య కార్యక్రమాలు అసలు ఏమి లేవనే చెప్పాలి. ఎప్పుడైనా మనసుకు తోచినప్పుడు కవితో కథో పేపర్ మీద పెట్టేవాడిని. అప్పుడప్పుడు.. ఆదివారాల్లో సుల్తాను బజార్‌లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ సారస్వతిక పరిషత్తులో సాయoత్రాలలో జరిగే సాహిత్య చర్చలు చూడడానికి వెళ్ళేవాడిని.
కాలేజీలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. అయితే 1, 2 సందర్భాలలో క్లాస్‌మేట్స్, జూనియర్స్‌తో కలసి ప్రార్థనా గీతాలు కాలేజీ ఫంక్షన్స్‌లో పాడాను.
ప్రశ్న 8. మీరు చదువుకునే రోజుల్లో ఏయే పత్రికలు (తెలుగు కానీ, ఇతర భాషలవి) ఎక్కువగా చదివేవారు? వాటివల్ల ఎలాంటి ప్రయోజనం పొందారు?
జ: నేను చదువుకునే రోజుల్లో ఇంటికి ఆంధ్రపత్రిక దినపత్రిక వచ్చేది. లైబ్రరీకి వెళ్ళి కొన్ని దినపత్రికలు, చందమామ, బాలమిత్ర పంచతంత్ర కథలు.. బాలల బొమ్మల రామాయణ భారత భాగవత కథలు.. ఇంకా దేశ నేతల కథలు చదివే వాడిని.
ఇంటర్ లోకి వచ్చేసరికి.. కొమ్మూరి, భగవాన్, విశ్వప్రసాద్ లాంటి వాళ్లు రాసిన డిటెక్టివ్ నవలలు, సినిమా పత్రికలు చదివేవాడిని.
ఇక డిగ్రీ హైదరాబాద్‌లో.. ప్రతీ ఆదివారం రూమ్‌కి దగ్గరలో ఉన్న లైబ్రరీకి, సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి తెలుగులోనూ, ఇంగ్లీష్ లోనూ ఉన్న వార మాస పత్రికలు తిరగేసేవాడిని.
కోటి బస్టాండ్ దగ్గర ఓ బుక్ స్టాల్ ఉండేది. అక్కడ ఏ పుస్తకమో.. పత్రిక మ్యాగజీన్.. ధర చెల్లించి, నెక్స్ట్ డే రిటర్న్ చేస్తే.. రెంట్ మనీ డిడక్ట్ చేసుకునేవాడు. వారి దగ్గర చాలా పుస్తకాలు రెంట్‌కి చదివాను. నచ్చినది ఉంటే.. రిటర్న్ చేసే వాడిని కాదు. మిర్రర్ మేగజైన్, రేపు అనే పత్రిక, ఆంధ్రభూమి వారపత్రికలకు చందాదారుడ్ని. ఇంగ్లీషులో Mirror, Illustrated Weekly, Blitz, Readers Digest.. నా అభిమాన పత్రికలు. ఇప్పటికీ రీడర్స్ డైజెస్ట్‌కి చందాదారుడిని.
రీడర్స్ డైజెస్ట్‌లో ‘డ్రామా ఇన్ రియల్ లైఫ్’ అన్న ఆర్టికల్, బ్లిట్జ్‌లో కె. ఎ. అబ్బాస్ ‘లాస్ట్ పేజీ’ నేను అమితంగా ఇష్టపడేవాడిని.
అలా చదవడం వల్ల.. దేశమానకాల పరిస్థితులు, మన చుట్టూ ఉన్న ప్రపంచం.. అవగతమవుతుంది చదవడం వల్ల కలిగే ప్రయోగం అదే.
నవలలు. కథలు, కవితల విషయానికి వస్తే.. పేరొందిన వాటిని చాలావరకు చదివాననే చెప్పాలి. శరత్ సాహిత్యం అంతా అనువాదంలో చదివాను. నాకు చాలా ఇష్టం.
ప్రశ్న 9. ఉద్యోగ పర్వంలో మీ రచనా వ్యాసంగం ఎలా కొనసాగింది? ఆయా ప్రాంతాలలో మీకు ఎలాంటి స్పందన లభించింది?
జ: నా ఉద్యోగ పర్వం ముచ్చటగా మూడు ఊర్లలో సాగింది. మొదటగా పార్వతీపురంలో..
ఇక్కడ 5 సంవత్సరాల 6 నెలలు ఉన్నాను. సాహిత్యాభిలాషులు పెద్దగా పరిచయం కాలేదు కానీ, కలం స్నేహితులతో.. ఎక్కువగా చదివిన కథలు నవలల గురించి చర్చించుకునేవాళ్ళము. మా హాస్పిటల్‌కి దగ్గరలోనే కోర్టులు. సబ్ కలెక్టర్ ఆఫీసు, గిరిజన్ కార్పొరేషన్ ఆఫీస్, వెటర్నరీ హాస్పిటల్ ఉండేవి. సాయంత్రం వేళల్లో ఆఫీసర్స్ మా దగ్గరకు తరచూ వచ్చేవారు. అక్కడ ఉన్నప్పుడే.. కవితలు, పాటలు పత్రికల్లో రావటం వల్ల.. నా అధికారులతో పాటు వీరు కూడా రాయమని ప్రోత్సహించేవారు.
ఇక్కడ ఉన్నప్పుడే రెండు సార్లు.. ఉగాది కవిసమ్మేళనంలో పాల్గొన్నాను. ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో జరిగిన కవిసమ్మేళనానికి శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు (పీడీ గిరిజన్ కార్పొరేషన్) ముఖ్య అతిథిగా వచ్చారు.
తణుకు.. 1987 జూన్ నుండి 1993 మార్చి వరకు రెండో మజిలీ. ఇక్కడ కొంతమంది సాహితీకారులు పరిచయం అయ్యారు. కవి సమ్మేళనాలకు వెళ్ళేవాడిని. పెనుగల్లు ఫ్రెండ్స్ వారు కూడా తణుకులోనే కవి సమ్మేళనాలు నిర్వహించేవారు. హాస్పిటల్‌కి కొంతమంది కవిమిత్రులు వచ్చేవారు. సితారె అని పిలవబడే రామిరెడ్డి గారు, విశ్వం అనే లాయర్ గారు ముఖ్యులు. శ్రీ తిరుమల రామచంద్ర గారి సోదరులు.. శ్రీకృష్ణమూర్తి గారు (పేరు మరిచినానేమో) మేముండే ఇంటికి రెండిళ్ళ అవతల ఉండేవారు. వారితో పరిచయమైంది. నా కవితలు, కథలు వ్రాతప్రతులు చదివి రచనలు మానవద్దనేవారు.
అనకాపల్లి నా మూడో మజిలీ. ఇక్కడ 1993 మార్చి నుండి 2011 నవంబర్ వరకు. దగ్గరగా 20 సంవత్సరాలు సాగింది. మొదటి 10 సంవత్సరాలు.. సాహిత్య పరిచయాలు ఏమీ లేవు. LIC లో పని పనిచేస్తున్న ప్రముఖ కథకులు స్వర్గీయ శ్రీ ఇచ్ఛాపురం రామచంద్రరావు గారిని వారి వర్క్ ప్లేస్‌లో కలిసాను. వారితో సంభాషణం స్ఫూర్తిదాయకం.
2002 లో ‘న్యాయానికి శిక్ష’ కవితాసంపుటిని ప్రింట్ చేయించాను. అది చదివి శ్రీ మాధవిసనారా గారు అభినందన లేఖ వ్రాశారు. తద్వారా పరిచయం పెరిగింది. వీరి ద్వారా శ్రీ చక్రపాణి గారు, ఇంకా చాలామంది కవిమిత్రులను కలవడం జరిగింది.
ఇంకా ప్రియమైన రచయితలు, అనకాపల్లి సాహితీ మిత్రులు, లాంటి అంతర్జాల బృందాల ద్వారా చాలామంది సాహితీమిత్రుల పరిచయ భాగ్యం కలిగింది. శ్రీయుతులు ఇందురమణ, రామశర్మ వంటి మిత్రులు లభించారు. ఇందురమణ గారు రెండుసార్లు సింహాచలంలో సాహితీ సభలు నిర్వహించారు. ఆ సభలకు నేనూ వెళ్ళాను. కొత్త మిత్రులు పరిచయమయ్యారు. అందులో స్వర్గీయ యాదగిరిరావు గారు సహృదయులు.
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సభలకు వెళ్ళాను. అక్కడ శ్రీయుతులు మీగడ రామలింగస్వామి గారు, తెలకపల్లి రవి గారు, స్వర్గీయ శ్రీ తుర్లపాటి కుటుంబరావు గార్ల పరిచయ భాగ్యం కలిగింది.
అనకాపల్లిలో సాహితీ కార్యక్రమాలు, శ్రీ చక్రపాణి ఆధ్వర్యంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. కారణాంతరాల వల్ల నేను పాల్గొనుట సాధ్యపడుట లేదు.
మదర్ థెరిసా – పెన్సిల్ డ్రాయింగ్
ప్రశ్న 10. మీరు కవిత్వం, పాటకు ఇచ్చినంత ప్రాధాన్యత కథ వంటి ఇతర ప్రక్రియలకు ఇవ్వలేదు. ఎందుచేత? వివరంగా చెప్పండి.
జ: నేను కథల కన్నా ఎక్కువగా నవలలు చదివేవాడిని. అది ఒక కారణం కావొచ్చు. నేను కవిత్వం ఎక్కువగా చదివాను. శ్రీశ్రీ, సి నా రె, ఆరుద్ర, తిలక్, ముద్దుకృష్ణ వైతాళికులు, ఇలా చాలామంది కవుల సంకలనాలు చదవడం వలన కవిత, పాట మీద అభిరుచి కలిగి ఉండొచ్చు. ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.
ప్రశ్న 11. సాహిత్యంతో పాటు, చిత్రకళ, సంగీతం, కార్టూనింగ్ వంటి ప్రక్రియల్లో మీకు ప్రవేశముంది. ఇవన్నీ మీకు ఎలా సాధ్యపడ్డాయి? వీటి వెనుక ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? వివరించండి.
జ: ఎలిమెంటరీ స్కూల్లో నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు పలక మీద అబ్బాయి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నట్లు.. ఒకవైపు, రెండోవైపు రాజు గారి తలను తీశాను. అది చూసి బాగుందని మెచ్చుకోవడం, హై స్కూల్‌లో ఉన్నప్పుడు సైన్స్ బొమ్మలు బాగా వేశావని టీచర్స్ అన్నప్పుడు.. ఇంకా బాగా గీయాలనే ఉండేది. అప్పటి నుండి పండగలకు గ్రీటింగ్స్ తయారు చేసి బంధువులకు పంపేవాడిని. అలా అలా చిత్రకళ మీద అభిరుచి కలిగింది. నఖ చిత్రాలు మా తాతగారు గీయటం చూసాను. సాధారణ తెల్ల కాగితం తీసుకుని అలవోకగా.. కాకి, నెమలివంటి చిత్రాలు గీయటం చూసి.. అభిరుచి కలిగింది.
మా చినప్పుడు అమ్మ బాటసారి, లైలా మజ్నూ, మిస్సమ్మ, విప్రనారాయణ వంటి పాత సినిమా పాటలు తరచుగా పాడుతుండేవారు. తను నేర్చుకున్న సంగీతం గురించీ చెపుతూ కొన్ని కీర్తనలు పాడేవారు. అలా సంగీతంలో అభిరుచి కలిగింది. రేడియోలో పాట నేర్చుకుందాం అనే కార్యక్రమం వచ్చేది. అలా లలిత సంగీతం, భక్తి సంగీతం మీద అభిరుచి కలిగింది.
కార్టూన్స్ మీద పత్రికల్లో జయదేవ్ గారు ‘కార్టూన్ గీయడం ఎలా?’ అనే శీర్షిక నిర్వహించారు. అది చూసి కార్టూన్లు వేయాలన్న అభిలాష కలిగింది. ఆ సమయంలో అయదేవ్ గారికి లేఖ వ్రాయగా. వారు ఎంతో అభిమానం చూపి నా దస్తూరి బాగుందని చెపుతూ, కార్టూన్ ఎలా వెయ్యాలి, పెన్స్ ఎక్కడ దొరుకుతాయో.. హైదరాబాద్ సుల్తాన్ బజార్ అడ్రస్ కూడా తెలియపరుస్తూ రిప్లై ఇచ్చారు. ఇలా ఒక్కో అభిరుచికి వారి వారి దీవెనలు అందాయనే అనుకుంటాను.
ప్రశ్న 12. ఒక రచయితగా మీ పిల్లలు మిమ్మల్ని ఎలా చూస్తారు? సాహిత్యపరంగా గానీ ఇతర కళల పరంగా గాని, మీ ప్రభావం పిల్లలపై ఎంతవరకూ పడింది? వివరంగా చెప్పండి.
జ: రచయితగా నా పిల్లలు ఆ దృక్కోణంలో నన్ను ఎన్నడు చూడలేదు. నేనెన్నడు సాహిత్య విషయాలు మాట్లాటం గాని, చర్చించడం గాని బహు అరుదు. అందువల్లనేమో సాహిత్య ప్రభావం వారి మీద పడలేదు. అయితే లెటర్ డ్రాయింగ్, కొంచెం చిత్రకళ మీద.. మాత్రం కొంచెం దృష్టి ఉంది. మట్టి వినాయకుడిని తయారు చేసి చవితి రోజున, పూజ చేసుకునే అలవాటు మా ఇంట్లో ఉంది. ఆ రోజున నా పిల్లలు కూడా బొమ్మను తయారు చేసి అలంకరిస్తుంటారు. ఈ సారి చవితి పండగకు నా మనవరాలు కూడా వినాయక ప్రతిమను చేసింది.
ప్రశ్న 13. మీ ముద్రిత/అముద్రిత రచనల గురించి చెప్పండి.
జ: రచయితగా నేను వ్రాసిన కథలు, కవితలు బహు స్వల్పం. 100 కు పైన కవితలు,10 లోపు కథలు, 30 వరకు పాటలు, అతికొద్ది పేరడీలు రాసాను. ఇందులో..
కవితలు.. తెలుగు విద్యార్థి, జయశ్రీ, యోజన, వంశీప్రియ మాసపత్రికలలోనూ, ఆంధ్రజ్యోతి వారపత్రిక.. బాలజ్యోతి లోనూ కొన్ని కవితలు, కోస్తావాణి అనే పత్రికలోనూ కాలేజీ మేగజైన్ లోనూ వచ్చాయి. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి మీద చిత్రరథం అనే పేరుతో రాసిన సుదీర్ఘ కవిత శివరంజని అనే సినీ పత్రికలో వచ్చింది.
కథలు కాలేజీ మ్యాగజైన్ లోనూ, అధినేత అనే పత్రికలోనూ వచ్చాయి.
పాటలు.. స్వాతివారపత్రికలో.. 3 పాటలు ప్రచురించబడ్డాయి.
ఓ పేరడీ రచన మా కాలేజ్ అనుబంధ సావనీరులో ముద్రితమైంది.
కొన్ని కవితలు.. 5 వరకు .. వివిధ కవితా సంపుటాల్లో వచ్చాయి.
స్వీయ ముద్రణ.. చాన్నాళ్ల క్రింద.. 2012లో కొన్ని కవితలతో ‘న్యాయానికి శిక్ష’ అనే పేరుతో కవితా సంకలనంను తీసుకొచ్చాను. దీనికి ముందుమాట మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారు రాసారు. మరొకటి తీసుకు రావాలనే ప్రయత్నం ఇంకా సఫలం కాలేదు.
ప్రశ్న 14. పాలకొండ నుండి విశాఖపట్నం వరకు సాగిన మీ జీవనయానంలో మరచిపోని ఓ సంఘటన గూర్చి చెప్పండి.
జ: మా చిన్నప్పుడు పాలకొండ నుండి విశాఖకు డైరెక్ట్ బస్ సౌకర్యం లేదు. ముందుగా శ్రీకాకుళం వెళ్లి, అక్కడనుండి విశాఖ వెళ్ళాలి. పాలకొండ నుండి ఐతే మూడు కిలోమీటర్ల దూరంలో నున్న సంకిలి అనే గ్రామంలో నాగావళి నదిని దాటి అక్కడ డైరెక్ట్ బస్ దొరికేది. నది మీద వంతెన 1978-79లో నిర్మించబడింది. నదిని దాటడానికి రెండు పక్కల పడవలుండేవి. 1976 మార్చిలో మా అన్నయ్య పెళ్లి జరిగింది. అప్పుడు నేను హైదరాబాద్‌లో చదువుతున్నాను. హైదరాబాద్ నుండి విశాఖ చేరాను. పాలకొండ వెళ్దామని, నేను డైరెక్ట్‌గా వెళ్తే పాలకొండ చేరిపోవచ్చని సంకిలికి బస్‌లో సాయంత్రం బయలుదేరాను. ఆ రోజుల్లో ప్రయాణదూరం నాలుగు గంటలపై మాటే.
సంకిలికి బస్ చేరేసరికి రాత్రి 9.00 గంటలు దాటింది. ఆ సమయంలో పడవలు నడపడం ఆపేశారు. ప్రయాణికులలో ఒక్కడు మాత్రమే పాలకొండ వెళ్లాలి. నది వెడల్పు సుమారు కిలోమీటరు పైన ఉంటుంది. ఆ రాత్రి వేళ అతను తోడున్నాడని తనతో కలిసి, నెత్తిమీద చిన్న సూట్‌కేస్‌ను పెట్టుకుని.. నదిని దాటాం. నదిని దాటాక ఒక్క రిక్షా కూడా లేదు. ఇంటికి వెళ్లాలంటే 3 కిలోమీటర్ల దూరం. ఒక కిలోమీటరు నడిచాక ఒక పల్లెటూరు రావడంతో నాతో ఉన్నాయన ఆగిపోయాడు. నేను మరో అరకిలోమీటరు నడిచాక ఓ రిక్షా కనబడింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరాను. ఇప్పటికీ తలచుకుంటే, నేనేనా నదిని దాటిందని భయంతో పాటు ఆశ్చర్యం వేస్తుంది. ఇదే నేను మరచిపోలేని సంఘటన.
ప్రశ్న 15. మీరు పొందిన అవార్డులు, పొందిన సత్కార్యాలు గురించి వివరించండి.
జ: నిజానికి సత్కారాలు పెద్దగా లేవు. నా కవిత ‘న్యాయానికి శిక్ష’ కు రాష్ట్ర స్థాయిలో వంశీ బర్కిలీ ప్రథమ బహుమతిని పొందింది. బహుమతి ప్రధానం హైదరాబాద్ హరిహర కళాభవన్‌లో జరిగింది. శ్రీ కోకా రాఘవరావు గారు బహుమతి ప్రదాత. అయితే ఇప్పటిలా కెమెరాలు లేవు. ఫోటో తీసిన సుధాకర్ అనే అతను తన చుట్టూ తిప్పించుకున్నాడు కానీ ఫోటో ఇవ్వలేదు.
అనకాపల్లిలో సన్మానం
తణుకులో ఉన్నప్పుడు రోటరీ క్లబ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు.. శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారితో చిరు సత్కారం.
తణుకు లోనే ప్రతీ సంవత్సరం జరిగే ఉగాది సంబరాల్లో కవితా పఠనం చేసేవాడిని. ఆయా సందర్భాలలో చిన్న చిన్న సత్కారాలు.
అనకాపల్లి మున్సిపాలిటీ 120 వసంతాల వేడుకలో ANR గారిని కలిసి వారికి అక్కినేని చిత్ర రథం అనే సుదీర్ఘకవిత వ్రాత ప్రతిని అందిస్తూ..
అనకాపల్లిలో మున్సిపాలిటీ 120 సంవత్సరాల ఉత్సవాల్లో శ్రీ అక్కినేని వారికి ఘన సన్మానం జరిగింది. ఆ సందర్భంలో నేను వారిని కలిసి నేను రాసిన చిత్రరథం కవితను పెంచి వ్రాత ప్రతిని అందంగా తీర్చి వారికి అందజేశాను. వారి ఆత్మీయ పలకరింపు, కరస్పర్శ నాకు ఓ చిరు సత్కారమే.
ప్రశ్న 16. పాఠశాల స్థాయి నుండి పిల్లలు తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి పెంచడానికి ప్రభుత్వపరంగా, స్వచ్ఛందసేవా సంస్థల పరంగా, తల్లి తండ్రుల పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? వివరంగా చెప్పండి.
జ: పిల్లలకు పాఠశాలకు వెళ్లేవరకు వారికి తెలిసిన భాష.. అమ్మ మాట, తెలుగు పాట. ఇప్పుడు విదేశీ వ్యామోహంలో పడి ఇంగ్లీషు మీడియం లోనే చదివించడానికి నేటి తరం తల్లిదండ్రులు తహతహలాడుతున్నారు. వారి వారి ఆర్థిక స్థితిగతుల్ని కూడా పక్కనపెట్టి పిల్లల కోసం వెంపర్లాడటం చూస్తూనే ఉన్నాము.
ముందు ప్రభుత్వపరంగా చేయాల్సింది, త్రిభాషా సూత్రాన్ని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలో త్రికరణ శుద్ధిగా అమలు పరచడం అవసరము. నేటి విద్యార్థి, యువ తరానికి ఇంగ్లీషులో పరిణతి, పరిజ్ఞానం తప్పనిసరి.
హైస్కూల్ విద్య వరకు నిష్ణాతులైన ఇంగ్లీష్ బోధకుల నియామకాలు జరగాలి.3వ భాషగా 10వ తరగతి వరకు ఇంగ్లీషుపై మంచి అవగాహన పట్టు ఉంటే, పై చదువు ఇంగ్లీష్ మీడియంలో చదివిన మంచి పట్టు ఉంటుంది.
తణుకు రోటరీ క్లబ్ లో గుమ్మడి గారితో డా.ఆనంద్.
10 తరగతి వరకు తెలుగు మీడియంలో, తెలుగును మొదటి భాషగా చదవడం వల్ల, తెలుగు పై పట్టు పెరుగుతుంది.
అంటే కాకుండా హైస్కూల్ స్థాయిలోనే తెలుగులో వివిధ పోటీల్లో పాల్గొనేటట్లు చేయడం, ప్రత్యేక దినాల్లో, ఆయా రోజులకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను పర్యవేక్షణ ద్వారా విద్యార్థులను సిద్దం చేయడం ఉపాధ్యాయుల బాధ్యత. ప్రభుత్వపరంగా జరగవలసింది త్రిభాషా వ్యవస్థను అమలుపరచడమే.
స్వంచంద సంస్థలకు.. త్రికరణశుద్ధిగా తెలుగు భాష పట్ల, వృద్ధి పట్ల అభిరుచి అభిమానం ఉంటే.. తరగతులను బట్టి వారికి ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా చిన్న ప్రోత్సాహక బహుమతులనిస్తూ ఆయా స్కూళ్ల లోనే పోటీలను నిర్వహిస్తూ పాఠశాల స్థాయిలోనే తెలుగు పై ప్రేమను పెంచవచ్చు.
పలువురు సాహితీ పెద్దలతో డా. ఆనంద్
తల్లిదండ్రులుగా ముందు తమ పిల్లలను కనీసం 5/7 తరగతుల వరకు తెలుగు మీడియంలో చదివించాలి. వారు పిల్లలతో ఇంటిలో తెలుగులోనే మాట్లాడాలి. రోజులో ఒక గంట సేపైనా పిల్లలతో కలసి TVలో మంచి తెలుగు కార్యక్రమాలను చూస్తుండాలి. పిల్లల అభిరుచుల్ని కనిపెట్టి, మంచివాటిని ప్రోత్సహించాలి.
పిల్లల్లో సాహిత్యాభిలాషను గుర్తించినప్పుడు.. చదువుతో పాటుగా తగు ప్రోత్సాహాన్ని యిస్తూ, దానివలన కలిగే ఆనందాన్ని తగురీతిలో చెప్పాలి.
చివరగా.. అటు ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు, ఇటు తల్లితండ్రులు చిత్తశుద్ధితో తెలుగు భాష యొక్క పూర్వ వైభవానికి, పరిరక్షణకు చిత్తశుద్ధితో పాటుపడాలి.
~
* ‘సంచిక’ వార, మాస పత్రికల తరఫున మీకు కృతజ్ఞతలు.
జ: మిత్రుడు కె.ఎల్.వి.కి అభినందనలు.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.

