[సంచిక కోసం ప్రముఖ కవయిత్రి శ్రీమతి సరళ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
మహిళలు ఒకప్పుడు కథలకు, నవలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, కవిత్వం వైపు కాస్త తక్కువగా చూసేవారు. ముప్పాళ్ల రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, సి. ఆనందా రామం, పరిమళా సోమేశ్వర్ వంటి వారు ఎందరో కథా, నవలా సాహిత్యాన్నీ అందించేవారు. వీరికి పాఠకులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. సమాజంలో మొబైల్ ఫోను రంగప్రవేశంతో, ఫేస్బుక్ మాధ్యమంలో అనేక సాహిత్య సంబంధమైన గ్రూపులతో పాటు అనేక కలగూరగంప గ్రూపులు ఆవిర్భవించడం, ప్రతి గ్రూపులోనూ కవితలనీ, పద్యాలనీ, నానీలనీ, కథ, నవల, వ్యాసం, ఇలా పలు ప్రక్రియల్లో సభ్యులను ప్రోత్సహించడం అంతమాత్రమే కాక, కవి సమ్మేళనాలు, కవితల పోటీలు పెట్టడం వంటి కార్యక్రమాలు రూపొందిస్తుండడంతో, కవిత్వం రాసే ఔత్సాహికుల సంఖ్య పెరిగింది. పాఠశాల స్థాయి విద్యార్థిని నుండి ఆపైన ఎలాంటి పెద్ద విద్యార్హతలున్న మహిళామణుల వరకూ ఇప్పుడు కవిత్వం రాయడానికి ఉరకలు వేస్తున్నారు. దూరాభారాలకు సైతం లెక్క చేయకుండా ఎక్కడ కవి సమ్మేళనాలు జరిగినా అక్కడ హాజరై తమ కవిత్వాన్ని వినిపించి సన్మానాలు పొందుతున్నారు. అదుగో అలాంటి జాబితా లోనివారే వర్ధమాన కవయిత్రి శ్రీమతి సరళ.
అసలు పేరు కంటే శ్రీమతి సరళ కలం పేర్లతోనే ప్రసిద్ధి. వీరి చదువు హైస్కూల్‌కే పరిమితమైనా, కవిత్వం రాయడంలో, అనుభవజ్ఞులైన కవయిత్రుల జాబితాలో నిలుస్తారు. వీరి కుటుంబంలో గానీ, బంధువర్గంలో గానీ సాహిత్యంతో సంబంధమున్నవారు ఎవరూ లేకపోయినప్పటికీ కేవలం స్వయం కృషితో, కవయిత్రిగా నిలబడగలిగినారు. అనేక సాహిత్య సంస్థలలో సభ్యత్వం, అనేక సాహిత్య గ్రూపులతో సంబంధాలు కలిగి వున్న ఈ కవయిత్రి , చిత్రకారిణి, సంగీతంలో స్వల్ప అనుభవం కలవారు కూడా. శ్రీమతి సరళ ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ, సమయం చిక్కినప్పుడు సాహిత్య కార్యక్రమాలకు తప్పక హాజరు అవుతుంటారు. ఈ కవయిత్రి తన సాహిత్య ప్రస్థానం గురించి ఇంకా ఏమి చెబుతారో పరిశీలిద్దాం.
*శ్రీమతి సరళ గారూ.. సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు హృదయపూర్వక స్వాగతం.
**నమస్కారం డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారు. సంచిక పాఠకులకు నన్ను పరిచయం చేస్తున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ప్రశ్న1) మీ సాహితీ ప్రస్థానంలోకి అడుగు పెట్టేముందు గమ్మత్తైన మీ ‘కలం పేర్లు’ పుట్టుకను గురించి వివరిస్తారా? మీ రచనలు రెండు మూడు కలం పేర్లతో రాయడం వెనుక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?
జ) కవిత్వం రాయకముందు, రాయడం మొదలుపెట్టిన ప్రాథమిక దశలో అసలు కలం పేర్ల గురించి పెద్దగా నాకు అవగాహన లేదు. తరచుగా సాహిత్య సభలకు, కవి సమ్మేళనాలకు హాజరవుతుండడం వల్ల, ఈ కలం పేర్ల గురించి ఓ మాదిరి అవగాహన కలిగింది. శ్రీశ్రీ, కరుణశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, గోరా.. వంటి పెద్దవారి కలం పేర్ల గురించి విన్నాక, నాకు కూడా ఒక కలం పేరు ఉండాలనే కోరిక పుట్టింది. ఇది అత్యాశే కావచ్చుగానీ, సాహితీ లోకానికి, నా సాహితీ మిత్రుల మధ్య నా కలం పేర్లతోనే నేను ప్రాచుర్యం పొందానని గట్టిగా చెప్పగలను. అలా ‘సరళ శ్రీ’, ‘లిక్కీ’, ‘గన్ను’ అనే కలం పేర్లతో కవిత్వం రాస్తున్న వీటి వెనుక పుట్టింటి/అత్తింటి పేర్ల నేపథ్యం కూడా ఉంది లెండి!
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారితో కవయిత్రి
ప్రశ్న2) ‘కవిత్వం రాయడానికి పెద్ద పెద్ద విద్యార్హతలు అవసరం లేదు’ అన్నదానికి మీరే పెద్ద ఉదాహరణ అనుకుంటాను. కవిత్వం రాయాలనే ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది?
జ) నిజమే, నాకు పెద్దగా తెలుగు సాహిత్యంలో విద్యార్హతలు లేకున్నా, నాకున్న చిరు తెలుగు పరిజ్ఞానంతో నా స్థాయిలో నేను కవిత్వం రాస్తూ వస్తున్నాను. సాహితీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు కూడా. నా కవిత్వం మెచ్చుకోవడమే కాకుండా అవసరమైనప్పుడు నాకు తగిన సూచనలు చేసే పెద్దలు, ఆప్త మిత్రులు నాకున్నారు. అందుచేత ఎలాంటి జంకు లేకుండా ముందుకు సాగిపోగలుగుతున్నాను. ఇక మొదట్లో నాకు బాధ/వ్యథల నుండే కవిత్వం పుట్టుకొచ్చింది. కారణం నా చుట్టూతా అల్లుకుని వున్న పరిస్థితులు. అలా కవిత్వంతో సేద తీరుతుంటాను.
శ్రీశ్రీ కళావేదిక భాద్యురాలిగా మాట్లాడుతున్న కవయిత్రి సరళ
ప్రశ్న3) కనీస సాహిత్య వాతావరణం లేని మీ ఇంట్లో మీకు కవిత్వం రాయడం ఎలా సాధ్యం అయింది? మీ రచనా వ్యాసంగానికి, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయా?
జ) అవును మా ఇంటా వంటా, ఎక్కడా సాహిత్య సువాసనలు నాకు తెలిసినంత వరకూ లేవనే చెప్పాలి. వడ్రంగం ప్రధాన వృత్తిగా వుండే మా ఇళ్లల్లో సాహిత్యం వైపు మళ్ళిన మొదటి మహిళను నేనే కావచ్చు. ఆ రకంగా ఇది ఒక రికార్డే నాకు. ఇక నాలో కవిత్వం రాయాలనే తపన ఏర్పడడానికి కారణాలు అనేకం. అందులో, జీవితం మీద అవగాహన లేని చిన్నతనంలో నాకు పెళ్ళి చేయడం ప్రధాన కారణం కావచ్చు. అయినా కవిత్వం రాయడం ఎలా సాధ్యమయింది? అంటే ఏమీ చెప్పలేను. ఇక ఇబ్బందులు అంటారా, కవిత్వం రాస్తూ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఇకపోతే నా సాహితీ ప్రస్తానం ‘కవిసాయంత్రం’ అనే వాట్స్ అప్ గ్రూపులో ‘నా చిత్రం – నా కవిత్వం’ అనే అంశం ద్వారా మొదలైంది. ఇక్కడ నన్ను బహుదా ప్రోత్సహించింది శ్రీ ముక్కెర సంపత్ కుమార్ గారు. ఇలా నేను ఆయనకు ఎప్పుడూ రుణపడి వుంటాను.
సిని గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారితో
ప్రశ్న4) రచనా వ్యాసంగం పుష్టికరంగా ఉండాలంటే, పుస్తక పఠనం కూడా బాగా ఉండాలంటారు కదా! మరి, మీరు ఏయే రచయితల/రచయిత్రుల పుస్తకాలు మీరు ఎక్కువ చదువుతారు?
జ) మీరు చెప్పినట్లు, పుస్తకాలు చదవాలి. కానీ దురదృష్టావశాత్తు ప్రస్తుత నాకున్న పరిస్థితులను బట్టి పుస్తకాలు కొనుక్కుని చదివే పరిస్థితిలో నేను లేను. గ్రంథాలయాలకు వెళ్లి చదువుకునే వెసులుబాటు కూడా లేదు. అందుచేత ప్రస్తుతం ఏ పుస్తకమూ చదవడం లేదు. కానీ, నా రచనా వ్యాసంగం మొదలు పెట్టడానికి ముందు మాత్రం, చందమామ, బాలమిత్ర, విపుల, చతుర వంటి పత్రికలూ కొన్ని బాలల నవలలు, నాకు నా పరిధిలో లభించిన మరికొన్ని మంచి నవలలు చదివిన అనుభవం వుంది.
మంత్రి శ్రీదేవి గారితో
ప్రశ్న5) మీ అభిమాన రచయిత/కవి ఎవరు? ఎందుచేత?
జ) కవిత్వ అభిమానిని అయినందుకో ఏమోగానీ, కవి అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేవారు, మహా కవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావుగారు). నన్ను సాహిత్యరంగం లోనికి ప్రవేశ పెట్టిన సాహితీ పెద్దలు కూడా నాకు మొదట చెప్పింది శ్రీశ్రీ గారి గురించే! చాలామంది లేత లేత కవులు, తమ ప్రాథమిక దశల్లో శ్రీశ్రీ గారినే అనుకరించి రాస్తారని చెప్పుకుంటారు. అలా ఆయన కవిత్వం విన్న తర్వాత, చదివిన తర్వాత, శ్రీశ్రీ గారే నాకు అభిమాన కవి అయినారు. సినిమా పాటల్లో సైతం కమ్మని కవిత్వం అందించగలిగిన మహానుభావుడు ఆయన.
శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా తోటి కవులతో
‘..కాదేదీ కవితకనర్హం’ అని ఆయన ఎలుగెత్తి చాటిన ఒక్కమాట చాలు, యువత కలం పట్టుకుని కవిత్వం రాయడానికి. ఇకపోతే, రచయితగా నాకు ఇష్టమైన రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. ఆయనను మించిన రచయితలు ఉండవచ్చును. కానీ నా పరిధిలో, కొన్ని ఆయన రచనలు మాత్రమే నాకు లభ్యమైనాయి. యండమూరి గారి కథలు సస్పెన్స్‌తో పాఠకులను బాగా ఆకట్టుకుని ప్రత్యేకంగా అనిపిస్తాయి.
ఒక గ్రూప్ ఆత్మీయ సమ్మేళనంలో ఎడమనుండి… శ్రీమతి దేవి, డా. కె. ఎల్. వి. ప్రసాద్, కథా రచయిత శ్యాం కుమార్, కవయిత్రి సరళ (చివర)
ప్రశ్న6) మీ కవిత్వంలో సాధారణంగా ప్రధాన వస్తువు ఏమై ఉంటుంది? ఎందుచేత?
జ) ప్రధాన వస్తువు అంటూ నేను పెట్టుకోను. సమాజంలో అవసరమైన ఎలాంటి అంశానికైనా స్పందిస్తాను, దానికి అనుగుణంగానే నా కలం కదులుతుంది. అయితే చాలామందిలానే, ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం. ప్రకృతి ప్రేమ, బాధ, వ్యథ, సందేశాత్మకం వంటి అంశాలను తీసుకుని కవిత్వం రాస్తుంటాను. కొన్నిసార్లు ఆయా సందర్భాలను బట్టి పోటీల కోసం కవిత్వం రాస్తుంటాను.
కవితా గానం చేస్తూ.. కవయిత్రి
ప్రశ్న7) ఇప్పుడు అందరి అరచేతిలో మొబైల్ ఫోన్ ఆభరణం అయిన మాట వాస్తవమే కదా! మీ రచనా వ్యాసంగంలో మొబైల్ ఫోన్ పాత్ర ఎలా ఉంటుంది?
జ) అవును. ఒకప్పుడు కలంతో, కాగితం మీద చిత్తు ప్రతి రాసి, తర్వాత మళ్ళీ తిరగ రాసి కవిత గాని, కథ గాని, పోస్ట్‌లో పంపించే విధానం ఉండేది. అన్నింటి మాదిరిగానే, మొబైల్ ఫోన్ ఇప్పుడు, కాగితాన్ని కలాన్నీ స్థానభ్రంశం చేసి, అక్కడ కూడా తన ప్రతాపం చూపిస్తున్నది. ఫోన్లో కానీ ల్యాప్‌టాప్‌లో గాని టైప్ చేసి, అవసరమైతే సరిదిద్దుకుని, పోస్ట్ చేసే అవసరం లేకుండా క్షణంలో పత్రికలకు మెయిల్ చేసే వెసులుబాటు ఇప్పుడు వచ్చింది. అందుచేత ఇప్పుడు కాగితం మీద రాసేవారు తక్కువైపోయారు. ఎక్కడైనా సంతకాలు పెట్టడానికి తప్ప, కలం/పెన్ను అవసరం రావడం లేదు.
శ్రీమతి హైమవతి భీమన్న గారితో
అయితే, ఇప్పటివరకూ నేను రాసిన కవిత్వం, ఇప్పుడు రాస్తున్న కవిత్వం, మొబైల్ సహకారం తోనే జరిగింది. ఈ విధంగా నా రచనా వ్యాసంగంపై మొబైల్ ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పక తప్పదు!
ప్రశ్న8) మీ జీవన శైలిలో మొబైల్ ఎంతవరకు ఉపయోగపడుతున్నది?
జ) ప్రస్తుత పరిస్థితిలో మొబైల్ లేకుండా ఏ పనీ జరగడం లేదు. అందుచేతనే, కూలిపని చేసుకుని బ్రతికే అతి పేదవారి వద్ద సైతం మొబైల్ అవసరం అయింది. సమయపాలన చేయడంలో ఇప్పుడు దీని పాత్ర అమోఘం. అందుకే ఈనాడు అందరికీ మొబైల్ ఫోన్ హస్తభూషణం అయింది. చాలామంది లానే, కేవలం రచనా వ్యాసంగానికి మాత్రమే కాకుండా, ఇంటా బయటా నేను కూడా అనేక అవసరాల కోసం మొబైల్ ఫోన్ వాడక తప్పడం లేదు.
ప్రశ్న9) ఫేస్బుక్లో అవతరిస్తున్న వివిధ సాహిత్య గ్రూపులపై మీ అభిప్రాయం ఏమిటీ? అవి సమాజానికి ఎంతవరకూ ఉపయోగపడుతున్నవి?
జ) ఫేస్బుక్లో సాహిత్య సంబంధమైన అనేక గ్రూపులు ఏర్పడడం ఎంతైనా ఆహ్వానించదగ్గ విషయం. అయితే ప్రతి గ్రూపులోనూ వందల/వేల సంఖ్యలో సభ్యులు నమోదు అయివుంటారు. దురదృష్టావశాత్తు అందులో 95 శాతం ఉత్సవ విగ్రహాలే. అతికొద్దిమంది మాత్రమే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మళ్ళీ ఇందులో రాసేవాళ్ళూ, చదివే వాళ్ళు తక్కువ. ఎత్తిపోతల పథకంలో పాల్గొనే వాళ్ళే ఎక్కువ. పూర్తిగా కాకపోయినా కొంతలో కొంత ఈ గ్రూపులు సాహిత్య సేవ చేస్తున్నాయని చెప్పక తప్పదు.
ఇకపోతే ఐదు సంవత్సరాల క్రితం ఫేస్బుక్లో నాకు తెలిసిన కొన్ని గ్రూపులు, ఉమ్మడిగా అభిమానంగా పనిచేసేవి. ఇప్పుడు, నాటి స్నేహితులంతా విడిపోయి ఎవరికీ వారు సొంత కుంపట్లు పెట్టుకుని ఎవరి గొప్ప వారు చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఏర్పడ్డ చాలా గ్రూపులు సాహిత్యానికి బదులు ఫోటో షోలు, రకరకాల కాంపిటిషన్లు పెట్టి సొంత డబ్బా కొట్టుకుంటూ చౌకబారు గ్రూపులుగా మారుతున్నాయి. సన్మానాలు చేయడం/చేయించుకోవడం ఒక వ్యసనంగా మారిపోయింది. కొన్ని గ్రూపులు, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి సామాజిక సేవలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి.
శిఖరం ఆర్ట్ థియేటర్స్ వారి సన్మానం
ప్రశ్న10) మీరు చాలా సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నారు. కానీ ఇంతవరకూ, ఒక్క కవితా సంపుటిని కూడా మీరు వెలువరించలేదు. కారణం ఏమై వుంటుందంటారు?
జ) మంచి ప్రశ్న వేశారు. అసలు నా కవితలు పుస్తక రూపంలో తీసుకు వచ్చే అంత అర్హతను కలిగివున్నాయా? అని, నా కవిత్వం మీద నాకే నమ్మకం లేకపోవడం. నా కవిత్వాన్ని చదివిన, చదువుతున్న కొందరు పెద్దలు ప్రోత్సాహించడం ఇప్పుడు నాలో నూతనోత్సాహాన్ని కలిగిస్తున్న మాట మాత్రం వాస్తవం. అందరు కవులు, కవయిత్రుల మాదిరిగానే, నాకూ నా కవితా సంపుటి తీసుకురావాలనే కోరిక లేకపోలేదు. కానీ, దేనికైనా కాలం కలిసిరావాలి కదండీ. ఏమో, త్వరలో నా మొదటి కవితా సంపుటి పాఠకలోకానికి అందించగలననే ఆశతోనే వున్నాను.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సన్మానం
ప్రశ్న11) మీ అవార్డులూ, సన్మానాలు గురించి వివరిస్తారా?
జ) చెప్పుకోదగ్గ అవార్డులు లేకపోయినప్పటికీ, ఉగాది సందర్భంగానూ, అనేక కవి సమ్మేళనాలలోనూ నాకు సన్మానాలు బాగానే జరిగాయి. ఉత్తమ ఉపాధ్యాయినిగా కూడా పురస్కారం పొందాను.
ప్రియమైన రచయితలు(విశాఖపట్నం) వేదికపై సన్మానం
శ్రీశ్రీ కళా వేదిక వారి సన్మానం
ప్రశ్న12) చివరగా, మీ చిత్రలేఖనం గురించి చెబుతారా?
జ) నేనేమీ గొప్ప ఆర్టిస్టుని కాదండీ. పైగా నేను ఏ గురువు దగ్గరా చిత్రకళను అభ్యసించలేదు. కేవలం నా అభిరుచి మేరకు నాకై నేను పట్టుదలతో నేర్చుకున్న కళ ఇది. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నాకు చిన్ని చిన్ని బొమ్మలు వేసే అలవాటు ఉండడం వల్ల, ఆ స్థాయి పిల్లలకు, చిత్రకళ గురించి బోధించే అవకాశం కలుగుతున్నది. నా ఈ చిరు కళను అప్పుడప్పుడూ స్నేహితుల కోసం ఫేస్బుక్లో ప్రదర్శిస్తుంటాను. సింపుల్ డిజైన్స్, ముగ్గులు కూడా వేస్తుంటాను. ఏదైనా కవిత్వం తర్వాతే ఇవన్నీ.
శ్రీమతి సరళ గీసిన చిత్ర మాలిక
ప్రశ్న13) మీరు ఎంతో బిజీగా ఉండి కూడా, సంచిక మాస పత్రిక కోసం మీ అమూల్యమైన సమయం కొంత వెచ్చించినందుకు, మీ సాహితీ ప్రస్థానం గురించి విలువైన సమాచారం అందించినందుకు, సంచిక పక్షాన, నా పక్షాన, మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
జ) అయ్యో.. నావంటి ఒక చిన్న కవయిత్రిని ఇలా పరిచయం చేసి నాకు మరింత ఉత్సాహాన్నీ, ప్రోత్సాహాన్నీ అందిస్తున్న మీకు, సంచిక అంతర్జాల మాసపత్రికకు ఎంతగానో రుణపడి ఉన్నాను. నాలానే ఇలా మరి కొంతమంది ఔత్సాహిక యువ కవయిత్రులను, సంచికకు పరిచయం బావుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. మీకు, సంచిక సంపాదక వర్గానికి హృదయ పూర్వక వందనాలు.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
చాలా సంతోషం సర్. అభినందనలు సరళమేడం గారు. మంచి రచయితను సంచిక ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదములు సర్ .
ధన్యవాదాలు 🌹 సాగర్ గారు
సరళ గారూ, మీ కవితా ధోరణి ప్రశంసనీయం . మాలాంటి సామాన్య మానవులకు కూడా అర్ధ అయ్యేట్లు వ్రాసే మీకవితలు అద్భుతం. సమాజం లో ఉన్న సమస్యల మీద కవితలు రాయడం ఇష్టం అన్నారు , ఇది చాలా అవసరం అని భావిస్తున్నాను. ప్రేమలు, విరహాలు, పూలు, చెట్ల మీద కవిత లు కాకుండా , పాఠకులను స్ఫూర్తిమ్ప చేసే కవితలు సమాజానికి మీరు అందించగలరని భావిస్తున్నాను. ముఖ్యం గా KLV ప్రసాద్ గారు మీ గురువు గారే మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యడం మీ అదృష్టం. మీ భావనలు, మీ ఆలోచనలు , అభిప్రాయాలు చాల బాగున్నాయి. ” సంచిక ” మ్యాగజైన్ వారు మీ లాంటి కవులను, దానితో పాటుగా కొత్త గా కధలు వ్రాసే రచయితలను ప్రోత్సహించడం చాలా సంతోషకరం.
శిశువులను,పశువులను కూడా అలరిచేదిగా ఉండాలి అన్నారు గానం అలాగే కవిత్వం కూడా సామాన్య మానవులకి కూడా అర్థం అయ్యేలా ఉండాలి.అందులోనే అందం ఉండాలి. సరళ గారు రాసే కవిత్వం అలా అందంగా ఉంటుంది. ఆమె చిత్ర లేఖనం, flower arrangement, ముగ్గులు కూడా బాగుంటాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సరళ గారిని ఇలా పరిచయం చేయడం అభినందనీయం.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
హిమాచల్ యాత్రానుభవాలు-6
అమెరికా ముచ్చట్లు-10
భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 12: పాపనాశని ఆలయాల సమూహం, ఆలంపూర్
జై తెలుగు తల్లి, జై భారత్ మాతా
రంగుల హేల 16: శుభకార్యాలూ – ఝండూ బామ్‌లూ
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర -2
కుసుమ వేదన-1
ద బ్రాండ్
ఫొటో కి కాప్షన్-6
సంచిక – పద ప్రతిభ – 35
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®