[సంచిక కోసం సాహితీవేత్త, చిత్రకారుడు శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ గారి ముఖాముఖి అందిస్తున్నాము.]
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ మాకినీడి సూర్య భాస్కర్:
శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ పేరెన్నిక గల కవి, విమర్శకుడు మరియు చిత్రకారుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ప్రవృత్తిరీత్యా సాహితీవేత్త. కవిత్వం, చిత్రలేఖనం రంగాలలో విశేష కృషి చేసిన సూర్య భాస్కర్ గారు తమ గురించి ఏం చెబుతారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
~
* మాకినీడి సూర్య భాస్కర్ గారికి సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన స్వాగతం. నమస్కారం.
నమస్తే.
~
1: మీ రచనా వ్యాసంగం ఎలా మొదలైంది? ఎలా సాగింది? ప్రేరణ ఏమిటి?
జ: రచనలు చేయాలనే తృష్ణ, ఆ తృష్ణను సాకారం చేసుకునేందుకు అవసరమైన జిజ్ఞాసలకు నాలో చిన్ననాటనే పునాది పడింది. పునాది వేసినవారు స్వయానా నా తల్లిదండ్రులే. మెలకువ తెప్పిస్తూ, పక్షుల కలకూజితాలతో పాటు కలిసి వినబడే నృసింహ శతకపద్యాలు వీనులకు విందయ్యేవి. రాత్రి భోజనానంతరం పోతనగారి భాగవత పద్యాలు, కరుణశ్రీ పద్యాలు, తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ పద్యాలు పాడుతుండేవారు. ఇంట్లోని ఈ వాతావరణమే నాలో సాహిత్య పునాది వేసింది.
మొదటి కథ ‘అంతస్సౌందర్యం’ ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక సంక్రాంతి కథల పోటీలో ఎంపికై 1991 జూలైలో ప్రచురింపబడింది. మొదటి సాహిత్య వ్యాసం ‘శ్రీశ్రీ ప్రతీకతా శిల్పం’ తెలుగు మాసపత్రికలో 1992 జూలైలో ప్రచురింపబడింది. స్వతంత్రంగా ప్రచురింపబడ్డ మొదటి పద్యఖండిక ‘దైన్య భారతి’ 1994 స్వాతంత్య్ర ప్రత్యేక సంచిక (ఆగస్టు, 15) ‘సర్కార్ ఎక్స్‌ప్రెస్’లో ప్రచురింపబడగా, తొలి వచనకవిత ‘నగర జీవితం’, 23.7.1995, ఆదివారం ఆంధ్రభూమి దినపత్రిక ‘దర్బార్’ శీర్షికలో ప్రచురితమైంది. అలాగే మొదటి హిందీ కవిత ‘మేరా ఘర్’, 1983 కాంపస్ జర్నల్లో వచ్చింది.
2: మీ కవితా వ్యాసంగం ఎప్పటినుంచి, ఎలా సాగింది? వస్తువు, అభివ్యక్తిలో మీ పరిణామ క్రమాన్ని ఒక విమర్శకునిగా మీరు ఎలా విశ్లేషిస్తారు?
జ: చిన్ననాట ఎన్నో సందేహ సంకోచాలతోనే కవితలు రాశాను. నాన్నగారు “దేవుడు నిరాకార నిర్గుణ నిర్వికార నిష్కళంక స్వరూపుడు” అని చెప్పేవారు. అటువంటి స్వరూపాన్నే స్తుతిస్తూ దాదాపు తొమ్మిదో తరగతినుంచీ పద్యాలు రాయడం మొదలుపెట్టాను. తొలిరోజుల్లో రాసిన పద్యాలు కొన్ని పోగా, ఉన్నంతలో మొదటిది ‘చూపునిమ్ము’ అనే ఖండికను 1980లో రాశాను. ఈ ఖండికలన్నీ ముద్రించడానికి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆర్ధిక సహాయం 1997లో లభించింది. ఆ విధంగా నా రెండో పుస్తకం ‘సుమకవితాంజలి’ వెలువడింది.
కవిత్వం సృజనక్రియ. రెండు పాయలుగా ఉంటుంది. సమాజం కోసం కవిత్వమనుకుంటే, అది నిబద్ధతతో సాగుతుంది. కళకోసం కవిత్వమనుకుంటే అది అనుభూతిపరంగా సాగుతుంది. ఈ రెండు పాయలూ నా కవిత్వంలో ఉన్నాయి. ఈ రెంటిలో దేనినీ వేరేదానికి పణంగా పెట్టదలచుకోలేదు నేను. నిబద్ధత లేదనుకున్నా సరే, అనుభూతిని వదులుకోలేను. అందుకే రెండు విధానాలనీ సమాంతరంగా అనుసరిస్తున్నాను. నా రెండుపాయల కవిత్వాన్నీ ఆంధ్రదేశంలోని విమర్శకులు ఆమోదించారు, సాహితీ పత్రికలు మెచ్చుకున్నాయి. అందుకే రెండు విధానాల్లోనూ సమాంతరంగా పయనిస్తూ వచ్చాను.
మొదటి వచన కవితా సంపుటి ‘ప్రకృతి గీసిన వికృత చిత్రం’ 2002లో వచ్చింది. ఇందులోని కవితలు పూర్తిగా సామాజిక స్పృహతో నిండి ఉన్నవే. రెండో సంపుటి ‘సెలవు రోజు’లో (2003) కూడా సామాజిక స్పృహ పాళ్ళు ఎక్కువే అయినా కొంత అనుభూతిపరమైన భావాలు కూడా చోటుచేసుకున్నాయి. మూడో కవితా సంపుటి ‘కలల పెదవులు నవ్వుల్లోకి..’ (2008) అనే దాంట్లో అనుభూతి పాళ్లే ఎక్కువ. ఆరో సంపుటి ‘తడితడిగా ఆలోచించే’ (2013)లో కవితలు అనుభూతిని రంగరించుకుని సాగాయి. ఆ తరువాత వచ్చిన సంపుటాలు ‘నాకు నేను దొరికిన క్షణాలు’, ‘అనేకులుగా’ అనేవి కూడా ఈ రకంగా సాగినవే. 2021లో వచ్చిన ‘చినుకు మనిషి-గోదారి సమాజం’ అనే కవితా సంపుటి ప్రత్యేకమైనది. ఇందులోని కవితలన్నీ ‘ఎక్ఫ్రాసిస్’ తరహా కవితలు. ఒక కళ ప్రేరణతో మరొక కళ వెలువడితే దానిని ‘ఎక్ఫ్రాసిస్’ అంటారు. ఒక చిత్రాన్ని చూసినప్పుడు, కవిత వెలువడవచ్చు; ఒక కవితను చదివినప్పుడు, ఆ ప్రేరణతో చిత్రం రూపొందవచ్చు. తెలుగులో మొట్టమొదటి ఎక్ఫ్రాసిస్ కవితాసంపుటిగా ఇది నిలుస్తుంది. ‘పాపికొండల్లో పడవ పాట’ (2011), ‘ఆమె’ (2012), ‘జీవితం’ (2017) దీర్ఘ కవితలతోను, మినీకవితల సంపుటి ‘మినీమెగా చురకలు’ (2017), 2017లోనే వచ్చిన ‘మాకినీడి వరణ కవితలు’ కలుపుకుని మొత్తంగా వచ్చిన వచన కవితా సంపుటాలు పన్నెండు.
ప్రక్రియ పరంగా కూడా కవిత్వం రెండు పాయలు. పద్య కవిత్వం, వచన కవిత్వం. మొదట్లో పద్య కవితనే నేను రాశాను. ముందే చెప్పినట్టుగా ‘సమకవితాంజలి’ (1997) నా మొట్టమొదటి పద్యకవితా సంపుటి. బాలసాహిత్యంలో భాగంగా రెండవ పద్య కవితా సంపుటి ‘సామెతకో పద్యం’, 2009లో వచ్చింది. నా సహోపాధ్యాయులు మద్దూరి సత్యనారాయణమూర్తి. ఆయన, నేను వాట్సాపులో పద్యాల్లో సంభాషించుకునే వాళ్లం. 2022లో ఆయన పరమపదించినప్పుడు, వారి స్మృతిలో ‘మాకినీడి-మద్దూరి పద్య సంభాషణ’ మూడో పద్యకవితా సంపుటిగా వచ్చింది. నాలుగో సంపుటి ‘రాధికాకృష్ణం’ విమర్శకుల దృష్టిని బాగా ఆకర్షించింది.
3: బాల సాహిత్యంలో భాగంగా ‘సామెతకో పద్యం’ అన్నారు. మీ బాలసాహిత్య వ్యాసంగ విషయాలను ముచ్చటిస్తారా?
జ: 1995లో నేను కాకినాడ జగన్నాథపురం చర్చిస్క్వేర్ బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తుండగా ఒకరోజు మునిసిపల్ ఛైర్మన్ శ్రీ జ్యోతుల సీతారామ్మూర్తిగారు పాఠశాల తనిఖీకి వచ్చారు. అసెంబ్లీలో ఒక విద్యార్ధిని పద్యం దాని భావం చెప్పింది. “ఈ పద్యం ఎక్కడిది? నేనెప్పుడూ వినలేదు. ఎవరు రాశారు?” అడిగారు సీతారామ్మూర్తిగారు. “ప్రతిరోజు పిల్లలు లైనులో సర్దుకుని అసెంబ్లీకి సిద్ధమవుతుండగా మొదలుపెట్టి పద్యం, భావం, విశిష్టార్థం అప్పటికప్పుడు రాసి, ఒక విద్యార్థిని చేత ఒకసారి ట్రయల్ వేయించి సరిగ్గా సమయానికి పంపుతారు సూర్యభాస్కర్ గారు” – సమాధానం చెప్పారు, హెడ్ మాష్టారు. అసెంబ్లీ అయిన తరువాత, అప్పటికి ‘మనసా!’ మకుటంతో రాసిన 64 కంద పద్యాలను చూసి, “చాల బాగున్నాయి పద్యాలు” అంటూ, “ఇలా పద్యాలు కాకుండా, పిల్లలకోసం ప్రత్యేకించి బాలగేయాలు ఏమీ రాయలేదా!” అడిగారాయన.
అప్పట్లో నేను సైన్స్ ఉపాధ్యాయుణ్ణి. అయినా, ప్రతి సంవత్సరం ఏదోక తరగతికి తెలుగు తీసుకునేవాణ్ణి. అలా ఆ సంవత్సరం ఎనిమిదో తరగతికి బోధిస్తున్నాను. సరిగా ఇంచుమించు అదే సమయంలో సిలబస్ ను అనుసరించి ఎల్లోరాగారి ‘బాలవాజ్మయం’ పాఠ్యాంశం బోధించాల్సి ఉంది. ఆ పాఠం చెబుతుంటే, అందులో ఉటంకింపబడిన బాలగేయాల తునకలు వింటూ, ఆ పదమూడేళ్ళ బాలికలు నోళ్ళు అప్పగించి వినడం నాకెంతో విస్మయం కలిగించింది. పిల్లలకు ప్రత్యేకించి బాలసాహిత్యం అవసరం ఎంతుందో ఆరోజు బాగా అవగాహనకొచ్చింది. ఆ రోజు నుంచి మా అమ్మాయి కోసం రోజుకో గేయం, నా సొంతంది తనకు వినిపించాలని రాశాను. ఆ పాటలు వింటూ, మా అమ్మాయే కాదు, ఎనిమిదో తరగతి అమ్మాయిలూ పగలబడి నవ్వుతూ ఆనందించారు. అవన్నీ ‘జ్యోతిబాల’గా 1996లో వెలుగులోకి వచ్చాయి. ఆ విధంగా పుస్తక ప్రచురణలోకి మొదటి అడుగు వేస్తే ఈ నాటికి ముద్రించిన పుస్తకాలు 109 కాగా, ప్రెస్ కాపీగా తయారై ముద్రణకు సిద్ధంగా ఉన్నవి యాభై వరకూ ఉన్నాయి.
4: మీ వ్యాస రచనా వ్యాసంగం ఎప్పటినుంచి ఎలా సాగింది?
జ: నేను ఆచంటలోని ముప్పన వీర రాఘవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తున్నపుడు చుట్టుపక్కల గ్రామాల రైతులనుంచి సమాచారం సేకరించి, ‘దూడల మరణాలు-ఒక పరిశీలన’ అన్న వ్యాసాన్ని రాసి తెలుగు అకాడెమీ ప్రచురించే ‘తెలుగు విద్యావైజ్ఞానిక మాస పత్రిక’కు పంపడం, అది మార్చి 1989 ప్రతిలో అచ్చయి రావడం జరిగింది. ఈ వ్యాసాన్ని పరిశీలనార్ధం అకాడెమీ ‘అన్నదాత’ సంపాదకులు, పశుసంవర్ధక శాఖ మాజీ సంచాలకులు డా. వాసిరెడ్డి నారాయణరావుగారికి పంపితే, “మీ పత్రికలో ప్రచురిస్తే ఎవరు లాభం పొందుతారు?” అనే కామెంటుతో ప్రచురణకు ఆమోదాన్నిచ్చారు. వారి కామెంట్ పెద్ద సర్టిఫికెట్‌గా అనిపించిందప్పుడు. ఇదే అచ్చయిన నా మొదటి రచన, అప్పటి నుంచి వరుసగా పాడి పరిశ్రమ, పశుయాజమాన్యం, పాలు-పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాసాలు పుంఖానుపుంఖంగా రాశాను. రాసినవన్నీ తెలుగు, అన్నదాత, ఏనిమల్ వెల్ఫేర్, యోజన వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఒక్క ‘తెలుగు’ పత్రికలోనే చాలా వ్యాసాలు వచ్చాయి. అప్పటి అకాడెమీ సంచాలకులు డా. ఆవుల మంజులతగారికి, సంపాదకులు డా. జి. చెన్నకేశవ రెడ్డి, డా. దీవి సుబ్బారావు గార్లకు, ఉపసంపాదకురాలు డా॥ తెన్నేటి సుధాదేవి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలుపుకోవడం కనీస ధర్మంగా భావిస్తున్నాను.
ఇప్పటివరకు 16 సాహిత్య విమర్శ గ్రంథాలు వచ్చాయి. కళాసాహితీతోరణం 1998, హైకూలు కవిత్వం అనుశీలన 1999, దృక్కోణం (సాహిత్య విమర్శ వ్యాసాలు) 2003, కవిత్వం చిరునామా (సాహిత్య విమర్శ/సమీక్ష వ్యాసాలు) 2017, కంచి చేరిన కథలు (కథానికలపై విమర్శ వ్యాసాలు) 2017 వీటిలో ప్రసిద్ధమైనవి.
5: చిత్రకారుడిగా కూడా మీకు మంచి గుర్తింపు ఉంది కదా! ఆ వివరాలు చెప్పండి.
జ: నాకు చిత్రలేఖనంలో కూడ ఆసక్తి ఉండేది. 1992-95 సంవత్సరాల్లో చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నాను. 50 వరకూ పెద్ద పెయింటింగులూ, 50 మినియేచర్లు (విజిటింగ్ కార్డుసైజులో) చిత్రించాను. ప్రతి చిత్రాన్నీ ఏదోక ప్రయోగార్థమే రచించాను. అయితే, చిత్రలేఖనం ఆర్థికంగా పెనుభారం కావడంవల్ల, ఇంకా ప్రదర్శనల్లో పాల్గోవడం కోరికగానే పదిలపడి, ‘కళావిమర్శ’గా కుదురుకొంది. మొదటి కళావిమర్శ వ్యాసం, ‘కళాశాస్త్ర దర్శనం-భిన్న దృక్పథం’ మిసిమి పత్రికలో 1994 జనవరిలో ప్రచురింపబడింది. కళావిమర్శ రంగంలో ఇదే నా మొదటి ప్రచురింపబడ్డ వ్యాసం. కళకు సంబంధించిన వ్యాసాలన్నీ మిసిమికి పంపుతూండేవాణ్ణి. సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్ గారు ఎంతో ఆప్యాయంగా ప్రచురించేవారు. కొద్దికాలం పాటు ప్రతినెలా మిసిమిలో నా వ్యాసం ఉంటుండేది. ఈ వ్యాసాలన్నీ మంచి ఆలోచనాపరుడిగా నాకు పేరు తెచ్చాయి. తరువాత 64కళలు.కామ్ వెబ్జీనులో ఐదు అంశాలపై సీరియల్ వ్యాసాలు రాశాను. ప్రస్తుతమున్న వేళ్లమీద లెక్కపెట్టదగ్గ కళా విమర్శకుల్లో నాకో సముచిత స్థానం ఆ వ్యాసాల ద్వారా లభించింది.
కళా విమర్శ రంగంలో ఇప్పటికి 21 పుస్తకాలు – ముఖ్యంగా ‘రామారావు నుంచి రామారావు దాకా’-2009, ‘దామెర్ల కళ-వారసత్వం’ అటు సాహితీవేత్తలను, చిత్రకారులను ఆకర్షించి చిత్రకళా విమర్శ రంగంలో నాకు ప్రఖ్యాతిని కలిగించాయి.
6: కథకుడిగా కూడా మీ రచన రాణించింది. ఒక వైజ్ఞానిక వాతావరణం మీ కథల్లో నెలకొని ఉంటుందంటారు. ఆ విశేషాలు చెబుతారా?
జ: వ్యాసాల్లానే కథలూ ఎప్పుడూ తిరిగి రాకపోయినా, పోటీకోసం రాసిన కథలు సాధారణ ప్రచురణకు ఎంపికయ్యేవి. కథల విషయంలో ఈ వైఫల్యం ఒక రకమైన నిరాసక్తతకు కారణమైంది. నెమ్మదిగా కథలు రాయడం మానేసి మొత్తం సమయాన్ని సమీక్షలు, వ్యాసాలూ రాయడానికి వినియోగించేవాడిని. వాటితోపాటూ కవిత్వమూ. అయితే కథల అసంతృప్తి వెంటాడుతూనే ఉండేది. అందుకే 2010 ప్రాంతంలో మళ్ళీ నా కథల రెండో ఇన్నింగ్సుకు శ్రీకారం చుట్టాను. మూడేళ్ళు విరివిగా కథలు రాశాను. నా మొదటి కథల సంపుటి ‘అంతస్సౌందర్యం’ 2003 లోను, మలి కథల సంపుటి ‘పునాస’ 2021లోను వచ్చాయి. క్రీ.శ.2050, మార్ఫింగ్ వంటి కథలతో తెలుగు వైజ్ఞానిక కథారంగంలో నా పేరు చేర్చారు విమర్శకులు. ఆక్రోశం, స్వర్గం జారిపోయింది వంటి చాలా కథలు ఒక విద్యా వైజ్ఞానిక వాతావరణం నేపథ్యంగా సాగుతాయి.
7: మీ పత్రికా రచనానుభవం గురించి తెలియజేయండి.
జ: నాకు నచ్చిన వ్యాసంగంలో నేను ఉండగా, లోకల్ డెయిలీ ‘సర్కార్ ఎక్స్ప్రెప్రెస్’లో నేను రాసి తీరాలని హుకుం జారీ చేశారు, ఎడిటర్ గొడవర్తి సత్యమూర్తిగారు. కాదనలేక మొదలుపెట్టిన ఆ కార్యక్రమం ఏడేళ్ళపాటు, పత్రిక ఆగిపోయేవరకు నిరాఘాటంగా సాగింది. వారానికి మూడురోజులు, మూడు పూర్తి పేజీ శీర్షికల్ని నిర్వహించే అవకాశమిచ్చారు. ప్రతి మంగళవారం ‘సాహిత్యం’, ప్రతి గురువారం ‘కళ’, ప్రతి శనివారం ‘బాల’ అంశాలుగా ఎన్నో శీర్షికలు నిర్వహించాను. సాహిత్యంలో శీర్షికలు – సమీక్షణం, కథ-సుధ, పద్యం-హృద్యం, విమర్శ-పరామర్శ, కొత్తచూపు, కొత్తపాళీ, పొయెట్రీ కార్నర్ మొదలైనవి. ‘కళ’లో – మన చిత్రకారులు, ప్లేబాక్ సింగర్స్, ఆర్ట్ స్కూల్, రామారావు నుంచి రామారావు దాకా.. (సీరియల్ వ్యాసాలు) మొదలైనవి నిర్వహించాను. ‘బాల’లో- పెద్దలు చెప్పిన చిన్నకథలు, నసీరుద్దీన్ కథలు, బాలగ్రంథాలయం, బాలగేయాలు (నా సొంతవి), సామెతకో పద్యం, మామయ్య కబుర్లు మొదలైన శీర్షికలు నిర్వహించాను.
తరువాత, చినుకు, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, ముంబయి వన్, తెలుగు తేజం, ఫ్రాగ్ క్రూన్, 64కళలు.కాం, భిలాయివాణి, ఈరోజు, వికాస్ తదితర పత్రికలు నాకు ప్రత్యేకమైన కాలమ్ నిర్వహణలను కేటాయించడంతోను, మామూలుగా ఉండే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌తో కలుపుకుని, నా సంపాదకత్వంలో వెలువడే ‘కాల్’ (ఆంగ్లం), నా విద్యార్థుల రచనలతో నిర్వహించే ‘యంగ్ పెన్స్’, ‘సృజనసేన’ పత్రికల బాధ్యత కలుపుకుని ప్రతి నెలా పంతొమ్మిది రెగ్యులర్ శీర్షికలు నిర్వహించేవాణ్ణి. నా రచనావ్యాసంగం మొత్తంమీద సంతృప్తికరంగానే సాగింది.
8: ‘చిరుగ్రంథ కానుక-మరుగంద మాలిక’ పరంపరగా కొన్ని గ్రంథాలు రాశారని వింటాము. ఆ విషయాలను విశదీకరించగలరా?
జ: అద్దేపల్లి రామమోహనరావుగారి అశీతి సందర్భంగా ఆయనమీద ఆయన సప్తతి అనంతరం వచ్చిన నా వ్యాసాలను పుస్తకంగా వేస్తానన్నారు. (సప్తతి వరకు వచ్చిన వ్యాసాలను ‘అద్దేపల్లి కవిత్వం, జీవితం తత్త్వం’ పేర ఆయనకు నా సప్తతికానుకగా తీసుకువచ్చారాయన). అయితే నాకెందుకో అలా విడివిడిగా ఉన్న వ్యాసాలకంటే, ఆయన సాహిత్యజీవితాన్ని ఆయన సమకాలీన తెలుగు సాహిత్యచరిత్ర అంతస్సూత్రంగా ముడివేసి రాయాలనిపించింది. ‘అద్దేపల్లి కవిత్వ పరిణామం’ అని వంద పుటల పుస్తకం రాశాను. ఆయన చంటి పిల్లాడిలా ఎంతో ఆనందపడిపోయారు. ఆ ఆనందాన్ని మరికొందరు సహసాహితీమిత్రులకు, నాకత్యంత ఆత్మీయులైనవారికి పంచిపెట్టాలనిపించింది. ‘చిరుగ్రంథ కానుక-మరుగంద మాలిక’ పరంపరగా ఇప్పటికి పదహారు మంది సాహితీ, కళామూర్తులపైన వచ్చాయి.
9: కవిత్వం మీద జరిగే సెమినార్లలో మిమ్మల్ని తరచుగా “తెలుగులో లఘుకవితా రూపాలు” అన్న అంశంపై ప్రత్యేకించడం గమనించాం. కారణాలేమిటి ? హైకూపై తొలి విమర్శ గ్రంథం రాసిన మీరు హైకూ కవితలు అంతగా రాయలేదేమో అనిపిస్తుంది కారణమేమైనా ఉందా?
జ: నేను రచనావ్యాసంగంలోకి రావడానికి ముందు తెలుగులో వచ్చిన లఘురూపాలైన రూబాయి, కూనలమ్మ పదాలు, లిమరిక్కు వంటివాటిని వదిలేస్తే, నా రచనకు సమకాలీనంగా వచ్చిన హైకు, నాని, రెక్కలు, నానోల వంటి లఘు రూప ప్రక్రియలపై మొట్టమొదటి విమర్శనాత్మక పుస్తకాలను నేనే రాశాను. ఆ విధంగా, ‘హైకూ కవిత్వం, అనుశీలన – ఒక పరిశీలన’ 1999, ‘నానీలు-నాలుగు వ్యాసాలు’ 2003, ‘తాత్విక రెక్కలు-ప్రస్థానం’2008 పుస్తకాలు వచ్చాయి.
1997లో ‘హైకూ చిత్రాలు’ అనే సంపుటిని తీసుకొచ్చాను. ఆ హైకూ రాసేటప్పుడు మొదట్లో ఎన్నో అనుమానాలు వచ్చాయి. హైకూకు ప్రత్యేకమైన చందస్సు ఏమైనా ఉంటుందా? దాని లక్షణాలు ఏమిటి? మామూలు కవిత్వం నుంచి దానిని వేరుగా చూడడానికి కారణమైన అంశాలు ఏమిటి? – ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ నా మొట్టమొదటి హైకూ సంపుటిని రాశాను. ఆ సమయంలో హైకూలు ఉధృతంగా రాస్తున్నారు కవులు. అయితే హైకూ అంటే ఏమిటో తెలియకుండానే రాసేస్తున్నారు. ఆ విషయాన్ని గ్రహించి నేను, హైకూ లక్షణాలను తెలిపే గ్రంథాన్ని రాశాను. అలాగే ఆ తర్వాత వచ్చిన లఘురూపాల మీద కూడా తొలి విమర్శ గ్రంథాలను రాశాను. ఇక హైకూకవిత్వం విషయానికి వస్తే అరడజను పుస్తకాలు రాశాను. హైకు చిత్రాలు 1997, ప్రకృతి (ఫోటో హైకు, ఈ రీతిలో తెలుగులో మొట్టమొదటి హైకూ సంపుటి నాదే కావడం ఆనందం కలిగిస్తుంది) 1988, రాలిన పుప్పడి, ఋతురాగాలు 2000, హైకూ-హైగా 2005 మొదలైనవి.
10: ప్రక్రియా వైవిధ్యానికి పెట్టింది పేరుగా మిమ్మల్ని చెబుతుంటారు. ఇంకా మీ ఇతర రచనలు, ప్రక్రియల గురించి తెలియజేయండి.
జ: ముందుమాటలు, ప్రత్యేక సావనీర్లకు వ్యాసాలు, బుర్రకథలు, పాటలు-లలిత గీతాలుకూడా సమాంతరంగా రాస్తూ వస్తున్నాను. ఇప్పటికి ముద్రితమైన పుస్తకాలు మొత్తం 109: కవిత్వం 16, హైకు సంపుటాలు 06, బాలసాహిత్యం 09, కథల సంపుటి 02, సాహిత్య విమర్శ 16, కళావిమర్శ 21, చిరుగ్రంథ కానుకలు 16, భాష-పరిభాషపై 02, ఎకడెమిక్ గ్రంథాలు 13, ఆంగ్ల కవితా సంపుటాలు, పుస్తకాలు 05; కాక నాపై వచ్చిన పుస్తకాలు 09. ఆంగ్లంలో ‘బోట్స్ సాంగ్ ఇన్ పాపి హిల్స్’, ‘పొయెట్రీ’ (poeTree) అనేరెండు కవితాసంపుటాలు వచ్చాయి. నా వ్యాసాలు 37, కవితలు 50 వరకు, నేను అనువదించగా ఆల్బట్రాస్, ఆసియన్-అమెరికన్ పొయెట్రీ, ది ఎంధాంటింగ్ వెర్సెస్, వెల్వెట్ ఇల్యూజన్, ఆల్ పొయెట్రీ, పొయెట్రీ ఫస్ట్, పొయెట్రీ ఫ్రీక్, పొయెట్రీ దట్ మూవ్స్, ఆకాషిక్, ఛిల్ బ్రీజ్, పొయెట్రీ సూప్, పొయెట్రీ నెవర్ డై, బుక్స్ అండ్ గాళ్ ఫ్రెండ్స్, మ్యూజ్ ఇండియా వంటి అంతర్జాతీయ ఆంగ్ల పత్రికల్లో వచ్చాయి. చాల వ్యాసాలు ఇటలీ, స్పెయిన్, జర్మన్, డచ్, ఫ్రెంచి భాషల్లోకి పత్రికలచే అనువదింపడి ప్రచురితమయ్యాయి.
11: మీ సాహిత్యంపై జరిగిన పరిశోధనల గురించి తెలియజేయండి.
జ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి చి. వ్యాపారం విజయకుమార్, తెలుగు మరియు ప్రాచ్యభాషా విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ ఇరపని మాధవిగారి పర్యవేక్షణలో ‘మాకినీడి సాహిత్యం-సమగ్ర పరిశీలన’ శీర్షికతో పి.హెచ్. పరిశోధన చేశారు. అలాగే చి. ఎం.శేఖర్, డా. పొన్నా లీలావతిగారి పర్యవేక్షణలో నా వచనకవితా సంపుటాలపై ‘మాకినీడి వచనకవితా సంపుటాలు – పరిశీలన’ పేర ఎం.ఫిల్., పరిశోధన గావించారు. ‘సాహిత్యానికి చిన్న పత్రికల సేవ’ అనే ఎం.ఫిల్., పరిశోధనలో ర్యాలి శ్రీనివాస్ సర్కార్ ఎక్స్ ప్రెస్లో నా రచనావ్యాసంగంపై చాల పరిశోధన చేశారు. ఆంధ్ర, నన్నయ విశ్వవిద్యాలయాల్లో నా సమగ్ర సాహిత్యంపై పిహెచ్.డి., పరిశోధనలు రిజిష్టరై ఉన్నాయి.
12: మీ విస్తృత రచనావ్యాసంగంలో మీరెన్నో అవార్డులు, రివార్డులు పొంది ఉంటారు. వాటిలో ముఖ్యమైన వాటిని తెలియజేయండి.
జ: వృత్తి, ప్రవృత్తులకు సంబంధించి ఎన్నో ప్రశంసల్ని, పురస్కారాలను అందుకున్నాను. వృత్తికి సంబంధించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులు పొందాను. ప్రవృత్తి కి సంబంధించిన ముఖ్య అవార్డులను 50 పైనే పొందాను.
ప్రతిష్ఠాత్మకమైన అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి బహుముఖీన కృషి పురస్కారం 2022, రామ్ షా శతజయంతి పురస్కారం 2024, శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు వచన కవితా పురస్కారం 2013 (పట్టాభి కళా పీఠం విజయవాడ), కందుకూరి వీరేశలింగం కథానిక అవార్డు 2018 (విజయ భావన -విజయనగరం), ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక మండలి 150 ఏళ్ల గాంధీ కథానికా పురస్కారం, ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక మండలి, కోనసీమ సంబరాల పురస్కారం 2017, డాక్టర్ రావూరి భరద్వాజ మెమోరియల్ కవితా పురస్కారం 2017 (సిపి బ్రౌన్ అకాడమీ బెంగళూరు), సోమనాధ కళా పీఠం విమర్శ పురస్కారం 2012 (పాలకుర్తి, చలపతిరావు సాహిత్య విమర్శ అవార్డు), భిలాయివాణి కవితా పురస్కారం 2010, చిత్రకళ వైజయంతి, చిత్రకళ విమర్శ అవార్డు 2010, తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) పురస్కారం 2006, టామా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) తెలుగుభాషా పురస్కారం 2006, వీటిలో కొన్ని.
13: మీ భవిష్య ప్రణాళికలు ఏమిటో క్లుప్తంగా తెలియజేయండి.
జ: నా సుమకవితాంజలి పుస్తకానికి ముందుమాట రాస్తూ, ‘కవిచిత్రకారుడు’గా నన్ను గుర్తించిన కీ.శే॥ నాగభైరవ కోటేశ్వరరావు గారు మంచి పద్యకావ్యం రాయవలసిందిగా సూచన చేశారు. అటువంటి కావ్యమొకటి రాసి, ఆయనకు అంకితమివ్వాలి. అలాగే, భారతీయ చిత్రకళ గురించి సర్వసమగ్రంగా మంచి గ్రంథం రాయాలి.
~
* మీ సమయాన్ని వెచ్చించి మీ గురించి తెలిపినందుకు ధన్యవాదాలు సూర్య భాస్కర్ గారు.
జ: సంచిక సంపాదక వర్గానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మాకినీడి సూర్య భాస్కర్ – 9491504045