పద్యం చిరంజీవి అన్నారు పెద్దలు. ఆధునిక సాహిత్యంలో ఎన్నిపోకడలు వచ్చినా, వచన కవితకు ఎంతమంది ఆకర్షింపబడ్డా, పద్యం విలువ పద్యానిదే, ఇందులో ఏ మాత్రం సందేహంలేదు. అయితే, పద్యం పదిమంది నోట్లో నానాలంటే, అది ఆ.. పద్యం మీదా, పద్యం పాడేవారి మీదా, పద్యాన్ని విశ్లేషించేవారి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మొక్కుబడి బోధనతో/చదువుతో అబ్బే కళ కాదు ఇది. పద్యం పట్ల అభిరుచి ఉండి పద్యం రాయగల, చదవగల, శ్రావ్యంగా పాడగల, వివరించగల ఉపాధ్యాయులుంటే, పద్యం పదిమందికి చేరుతుంది. అందులోని తియ్యదనాన్ని విలువనూ ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.
అదిగో.. అలాంటి లక్షణాలున్న,తెలుఁగు లెక్చరర్, పద్య కవి, మధుర పద్యగాయకుడు, ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత డా. వజ్జల రంగాచార్య గారి మాటల్లోనే, మరిన్ని విషయాలు తెలుసుకుందాం…
~ ~
1) డా,రంగాచార్య గారూ నమస్కారం. బాల్యంలో మీ చుట్టూ ఉన్నవాతావరణం ఎలా ఉండేది? అది మీ ప్రాథమిక విద్యకు ఎలా తోడ్పడింది?
♣ నమస్కారం డాక్టరు గారు. నేను పుట్టింది పాత పాల్వంచ, ఖమ్మం జిల్లా. 1957లో. మా నాన్నగారు టీచరు, ట్రయిబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటులో. మా ఊరు చుట్టు కోయగూడేలు, లంబాడా తండాలు. అంతా శ్రామికులు. నిరక్షరాస్యులు. ఊరిలో కూడా చదివేవారు తక్కువ. ఆడుతూ పాడుతూ తిరిగే వారే ఎక్కువ. అందువల్ల నేను ఒక పట్టాన బడికిపోలేదట. ప్రాథమిక విద్య సరిగా పట్టుబడకపోవడంతో మా నాన్నగారు తాము పనిజేసే ట్రయిబల్ స్కూలుకు సైకిల్‌పై కూర్చోబెట్టుకుని తీసుకొనివెళ్ళి చదువు చెప్పినారు.అక్కడ విద్యార్థులుగా ఉన్న కోయజాతివారితో నాకు స్నేహం కుదిరింది. వారితో ఆటపాటలు, నాన్న భయంతో చదువు అబ్బినాయి.
నాకెంతో నచ్చిన ఆ జాతివారికి నేను 2007 నుండి 2015వరకు జూ.లెక్చరరుగా తెలుగులో పాఠాలు చెప్పి వారి ఋణం తీర్చుకున్నాను, పాఖాల కొత్తగూడ మండలం వరంగల్ జిల్లాలో.
2) మీ హైస్కూల్ విద్యాసమయంలో ఏ సబ్జక్టులో మీకు అభిరుచి ఎక్కువగా ఉండేది? ఎందుచేత?
♣ నాకు చిన్నప్పటినుండి ఆటపాటలతో పాటు నటన, రచనలపై ఆసక్తి ఉండేది. యన్.టి.రామారావు అంటే మహా ఇష్టం. ఆయన ‘ఉమ్మడి కుటుంబం’లోని యమధర్మరాజు పాత్ర పద్యాలు పాటలు, ఒక పప్పుతెడ్డు భుజాన వేసుకుని ఆభినయించేవాణ్ణి ‘పోబేల పొమ్మికన్’ ఆంటూ. మా పనిమనిషి నన్నెంతో మెచ్చుకునేది. అమ్మ మందలించేది చదువుకొమ్మని. ఉన్నత పాఠశాలలో శ్రీ సోమయాజి తెలుగు ఉపాధ్యాయులు. ఏ పాఠం చెప్పినా అభినయించి చెప్పేవారు. ఆయన ఎర్రగా ఎత్తుగా లావుగా అచ్చం యన్.టి.ఆర్.లా ఉండేవారు.
ఆయన ప్రభావంతో తెలుగు భాషపై పద్యంపై మమకారం ఏర్పడింది. జీవితంలో నేనూ తెలుగు ఉపాధ్యాయుడినై గొప్పగా అభినయిస్తూ పాఠాలు చెప్పాలనే కోర్కె ఆనాడే నాలో బలంగా నాటుకుపోయింది.
ఆ ఉత్సాహమే 1980లో కరీంనగర్ భిషప్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడనై, రౌడీల వంటీ విద్యార్థుల మధ్య పద్యాలు అందంగా అభినయయుక్తంగా పఠించి, చేతులలోని డిటెక్టివ్ పుస్తకాలు ప్రక్కకు పెట్టించాను.
3) అందరూ డాక్టరు కావాలని ఏదో అయ్యానని చెబుతుంటారు మీరు ఏమి అనుకునేవారు?
♣ నేను మొదటినుండి అధ్యాపకుడిని కావాలనే అనుకున్నాను. నాకు చదువు చెప్పిన అధ్యాపకులు, శ్రీ భాష్యం విజయసారధిగారి అనర్గళ బోధనా పాండిత్యం, ఆచార్య సుప్రసన్నగారి లోతైన విమర్శనా దృక్పథం నన్ను ఆకర్షించాయి.అందువల్ల బోధనలో మా సహోపాధ్యాయుల ఈర్ష్యను (వారి తరగుతులు విడిచి వచ్చి విద్యార్థులు నా క్లాసులో కూర్చునేవారు); పరిశోధన పి.హెచ్.డి టాపిక్, పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శివతాండవకావ్య విమర్శకు పండిత ప్రశంసను పొందగలిగాను. సమాజ సేవ, నలుగురితోను, ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలతో స్నేహాన్ని యిష్టపడేవాడిని కనుక కళాశాలలో జాతీయ సేవా పధకాన్ని అయిదు సంవత్సరాలు నడిపించాను. పల్లెటూళ్ళలో ఐదు క్యాంపులు, జిల్లా స్థాయి యువజనోత్సవాలు మా కళాశాలలో విజయవంతంగా నిర్వహించి యాజమాన్యం వారి, యూనివర్సిటీ కో-ఆర్డినేటర్, అధికారుల మన్ననలు పొందగలిగాను. ఫలితంగా 2003లో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డ్ వరించింది.
4) తెలుగును బోధనాంశంగా మీరు ఎన్నుకొనడం వెనుక నేపథ్యం ఏమిటి? ఇష్టంగా ఎంచుకున్నారా? తప్పని పరిస్థితిలో ఎంచుకున్నారా?
♣ ఇష్టంగానే ఎంచుకున్నానండి. నా చిన్నప్పటినుండి అధ్యాపకుడనవ్వాలనే కోరిక. చాలామంది ఆంగ్లభాషపై మక్కువ పెంచుకొని తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో తెలుగు భాషాబోధన నెంచుకుని కావ్యాల తీయదనాలను పిల్లలకు పంచిపెట్టాలనే తపన. అప్పట్లో 10వ తరగతిలో కాంపోజిట్ మాథ్స్‌లో 95 మార్కులు పొందిన నాకు వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీలో సీటు వచ్చినా వెళ్ళకుండా, ఓరియంటల్ కళాశాలలో చేరి తెలుగు చదువుకున్నాను. నేను 10వ తరగతిలోనే ఉపాధ్యాయ దినోత్సవం రోజు తెలుగు అధ్యాపకుడిగా పాఠం చెప్పి బహుమతి, ప్రశంసలు పొందాను. నా బోధనా ఫలితంగానే తాము పిజిలో తెలుగు తీసుకొని అధ్యాపకులైన నా విద్యార్థులతో కలసి నేను ఇంటర్ స్పాటులో జవాబు పత్రాలు దిద్దించాను.
5) రచనా వ్యాసంగం ఎలా మొదలైంది. ఎప్పటినుండి మొదలుపెట్టారు?
♣ నాకు 13-14 సంవత్సరాలప్పుడు 7వ తరగతిలో గురులఘువులు గణాలు చెప్పారు సోమయాజులవారు. ఆయన గణాలకు ఉదాహరణగా తరగతి, బేంచి, కుర్చి పదాలను గణ విభజన చేసి చూపేవారు. నేను తరగతిలో ఛందస్సు చెప్పేటప్పుడు మా విద్యార్థుల పేర్లు, వారికి నచ్చిన సినిమా నటీనటుల పేర్లు బోర్డు మీద వ్రాయించి గణవిభజన చేయించేవాణ్ణి. దాంతో ఛందస్సు ఆటపాటలతో నేర్చుకునేవారు. నేను మా గురువుగారి ప్రేరణ తోనే తే.గీ, ఆ.వె. పద్యాలు రాసానప్పుడే. యన్ టి ఆర్ గూర్చి – రామ కృష్ణ పాత్ర రాణించ లేరురా/ ఇతరులెవరు ఒక్కనీవు తప్ప/ అని గిలికినట్లు జ్ఞాపకం.
ఆ రోజుల్లో రేడియోలో ఉగాది, సంక్రాంతి పర్వదినాల్లో కవి సమ్మేళనాలు ప్రసారమయ్యేవి. సినారె, గుంటూరు శేషేంద్రశర్మ, దాశరథి, వానమామలై వరదాచార్యుల వంటి కవుల కవిత్వాలను విని పరవశించి పోయేవాణ్ణి. నాకు వచనకవిత కూడా చాలా యిష్టంగా ఉండేది. కవులు పద్యాలను, వచన కవితలను చదివే విధానాన్ని బాగా గమనించేవాణ్ణి. వానమామలై పద్య పఠనం, సినారె, శేషేంద్రల వచనకవితా పఠనానికి ఆకర్షితుడ నయ్యేవాడిని. వచనం పద్యమే గాకుండా యద్దనపూడి సులోచనారాణి నవలలు, కుటుంబరావు నవలలు చదివి కథలు వ్రాసాను. ‘చిగురించిన మోడు’ అని రైతు జీవితం మా ఊళ్ళో ఫాక్టరీలు పడ్డాక ఎట్లా చిగురించిందో వ్రాసాను. స్క్రిప్ట్ పోయింది కానీ పేరు గుర్తుంది. అలాగే ‘పండుగ ఏడ్చింది’ అనే పేరుతో అత్తగారింట్లో అల్లుళ్ళ దాష్టీకాన్ని గూర్చి. వరంగల్ వచ్చాక కొంత సామ్యవాద ప్రభావంతో, ‘ఆకాశంలో చుక్కలను లెక్కబెట్టగలంగానీ ఆకలిడొక్కలను లెక్కపెట్టలేం’ అని వచనకవితలు వ్రాసాను. కానీ ఇవేవీ పుస్తక రూపంలో రాలేదు.
6) పద్యం పాడడంలోను, పద్యాన్నివివరించడం లోను మీది ప్రత్యేకశైలి అని అందరూ అంటారు, మీరు పద్యం పట్ల ఎలా ఆకర్షితులయ్యారు?
♣ పద్యపఠనం అనేది ఒక ఆకర్షించే లయాత్మకమైన ఆరోహ అవరోహణలతో కూడిన భావప్రకటనము.దీనికి మధురమైన గొంతు ఉంటే బంగారానికి సువాసన అబ్బినట్లే. చిన్నప్పటి నుండి రేడియోలో ఉత్పల సత్యనారాయణాచార్య, వానమామలై వారల పద్యపఠనం నన్నాకర్షించింది. పద్యాన్ని గొంతెత్తి చదవడం అలవాటుగా మారింది. దీనివల్ల రెండు లాభాలు. అపశబ్దాన్ని వెంటనే గుర్తించగలం. మనం పఠిస్తుంటే ఎదుటివారి మనసులో హత్తుకుపోతుంది. అందుకే క్లాసులో పద్యాన్ని రెండు మూడుసార్లు చదివి, పిల్లల చేత చదివించే వాణ్ణి. దాంతో సందర్భ సహితాలు బాగా గుర్తు పెట్టుకునేవారు. గణయతిప్రాసలుంటాయి. గనుక పద్యం నోటికి త్వరగా పట్టుబడుతుంది. నా ఉద్దేశంలో పద్యం పఠించే విధానంలోనే భావం అర్థం కావాలి శ్రోతకు. ఆ విధానం నాకలవాటైంది. ఏ పదాలైతే పద్యానికి ప్రాణం వంటివో వాటిపై ఊనిక చూపుతూ పఠిస్తే త్వరగా మనసుకెక్కుతుంది. భావాలు చెదరని ఒక ఫ్రేమ్ పద్యం. అందుకే నేను పద్యాన్ని ఇష్టపడతాను.
7) పద్యం భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? ఎందుచేత?
♣ పద్యం నిత్యనూతనమైంది. సమాజ అవసరాలను బట్టి కవులు పద్యాన్ని వాడుకున్నారు. ముందు ముందు వాడుకుంటారు. వీరేశలింగంగారు సంస్కరణవాదానికి, రాయప్రోలు నవ్యకవిత్వానికీ, కృష్ణశాస్త్రి భావ కవిత్వానికి, దాశరథి అగ్నిధార కురిపించడానికీ, రుద్రవీణలు మ్రోగించడానికి పద్యం వాహికగా నిలిచింది. జాషువా కరుణశ్రీల పద్యాలు, తిరుపతి వేంకట కవుల రాయబార దృశ్యాలు నెమరువేసుకోని ఆంధ్రుడుండడు. విశ్వనాథ కల్పవృక్షాన్నే సృష్టించాడు. ఇప్పుడు అంతర్జాల మాధ్యమంలో పద్యం మ్రోగిపోతూనే ఉంది. భవిష్యత్తులో వచన కవిత కంటే పద్యకవితనే ప్రజలాదరిస్తారనిపిస్తున్నది. మన సంస్కృతిని చరిత్రను భావితరాలకు మూటగట్టి భద్రంగా మోసుకుపోయేది పద్యమే కదా.
8) అవధానప్రక్రియలో పద్యం పాత్ర ఎలాంటిది? మీరు అవధానాలలో పాల్గొన్నారా?
♣ అవధానక్రీడలో పద్యమే బంతి. ఆటగాడు అవధాని. 8 గోల్స్ 8 మంది గోల్ కీపర్లనబడే పృచ్ఛకులు. వారి ప్రశ్నలను తప్పించుకొని తగిన సమాధానాలిస్తూ పద్యపు బంతిని గోల్లో పడవేయాలి. దీనికి వేగంగా ఛందస్సులో కదలడం, చాకచక్యంతో కూడిన సమయస్ఫూర్తి అవసరం. నేను చాలా అవధానాలలో పాల్గొన్నాను. ఈనాడు పద్యాన్ని సాధన జేసి కవులు అవధానులై విజయవంతంగా అవధాన విద్యను నడిపిస్తున్నారు.
9) మీరు రచయితగా, పద్యకవిగా తెలుగు పాఠకలోకానికి సుపరిచితులే. మీరు రచించిన గ్రంథాల గూర్చి వివరించండి?
♣ నేను 1980 ప్రాంతం నుండి శ్రద్ధగా పద్యకవిత్వం రాయడం ప్రారంభించాను. శతపుష్కర, భార్గవీ దీపరేఖ, కళ్యాణ మంగాధిపా, సుప్రభ, రత్నప్రభ, వేంకటరమణా ఇవి భక్తి భావ పద్యరచనలు. సులోచనాలు, సీతాఫలం, వచనకవితాసంపుటులు. సమాజాన్ని గూర్చిన బాగోగుల భావాలుంటాయి. నవలోకం పేరిట అమెరికా అనుభవాలను ఆటవెలదులలో రాసాను. ప్రకృతి ఒడిలో అని పర్యావరణ పరిరక్షణ గూర్చి, కాయలు కూరలు, మొక్కలు పెంచాలని, వాటిని ఆహారంగా తీసుకొని సాత్వికజీవనము అలవాటు చేసుకొమ్మనే హితబోధ ఉఃటుంది పద్యకావ్యరూపంగా. ఇవన్నీ ముద్రితాలే.
1989లోనే నా పరిశోధన డాక్టరేటుకోసం కాకతీయ విశ్వవిద్యాలయంలో, పుట్టపర్తి నారాయణాచార్య కావ్యాలు – శివతాండవ ప్రత్యేకాధ్యయనం,శీర్షికతో గ్రంథం రచించి ముద్రించాను. ఆనందనిలయము అనే పేరుతో వ్యాస సంకలనం. అముద్రితాలు చాలా ఉన్నాయి.
1500 పద్యాలు సమస్యాపూరణలు, సూక్తిముక్తావళి పేరుతో 2001 పద్యాలు, పద్యవ్యాఖ్యలు ఇవన్నీ డి.టి.పి చేయబడి ముద్రణ కొరకున్నాయి. వీటన్నిటిలో నాకు చాలా నచ్చినకావ్యము రత్నప్రభ. ఇది మా ఊరి గూర్చి వ్రాసింది. రత్నమాచార్యులవారు మా నాన్నగారు. వారి పేరు, మా ఇలవేలుపు వేంకటేశ్వరుని పేరు కలసి వచ్చేట్టు మకుటం తీర్చుకొని 118 సీసపద్యాలలో మాఊరి విశేషాలన్నీ చెప్పాను.
పాత పాల్వంచ పురవాస పాపనాశ/ విమల రత్న ప్రకాశ శ్రీవేంకటేశ/ మకుటంతో నా చిన్ననాటి తిరునాళ్ళు పొలాలు, తోటలు, చెరువులు, ఆయుర్వేద వైద్యులు, కళాకారులు, బడి పంతుళ్ళు, ఊరినంతా చెప్పి ఇందరినీ కాపాడేవాడివి నువ్వేన్నాను. మా ఊర్లో చాలామంది ఈ పుస్తకాన్ని చదువుకొని ఆనందించారు.
10) మీకు నచ్చిన కవి, రచయిత ఎవరు? వారి ప్రభావం మీ సాహితీ ప్రస్థానానికి ఎంతవరకూ ఉపయోగ పడింది?
♣ ప్రాచీనకవులలో పోతన,ఆధునిక పద్యకవులలో దాశరథి కవులు ఇష్టం. నా భక్తి పద్యాలపై పోతన ప్రభావం ఉంది. సూక్తిముక్తావళి వంటి సామాజిక దర్శనంలో దాశరథి తొంగిచూస్తారు.
11) కథ, నవల, వ్యాసం వీటిలో మీకు ఇష్టమైన ప్రక్రియ యేది? ఎందుచేత?
♣ చిన్నకథలను ఇష్టపడతాను. రావిశాస్త్రి కథల గూర్చి వ్యాసాలు వ్రాసాను, ఉపన్యాసాలు చెప్పాను. ఒక అనుభవాన్నిగానీ, ఒక అంశాన్నిగానీ తీసుకొని ఆసక్తియుక్తంగా కథనం చేస్తూ సందేశాత్మకంగా ముగించే కథలు పాఠకుని హృదయం మీద వెంటనే ముద్రవేస్తాయి. ఈ రోజుల్లో సాహిత్యానికి ఎక్కువ సమయం కేటాయించ లేకపోతున్నారు ప్రజలు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టివి ఛానల్స్, స్మార్ట్ ఫోన్ ఛాటింగు లెక్కువైనాయి కదా. మనిషితో మనిషి ముఖాముఖి మాట్లాడే రోజులు కరువైపోతున్నాయి.
12) తెలుగు భాష పట్ల నేటి యువతీ యువకుల్లో ఆసక్తి తగ్గిపోతుందనే అంశం బాగా ప్రచారంలో ఉంది, మీరేమంటారు?
♣ ఈ విషయంలో మనదే అంటే యువతీ యువకుల తండ్రి, తాత, ముత్తాతలదే తప్పు. ఎందుకంటే భాషాపరంగా మెడిసన్, లా, ఇంజనీరింగ్, కంప్యూటర్లు మొదలగు అనేకానేక ఆధునిక సబ్జక్టులన్నీ ఇంగ్లీషు భాషలోనే బోధిస్తున్నారు. పఠిస్తున్నారు. సమాజంలో కొచ్చిన కొత్త వస్తువు విదేయులు పెట్టిన పేరుతోనే చలామణి అవుతుంది. వేషభాషలలో మార్పు లేనపుడు దైనందిన జీవితంలో వాడే నిత్య వ్యావహారికభాషలో మూడు వంతలు ఆంగ్ల భాషా పదాలున్నపుడు సహజంగానే తెలుగు పట్ల ఆసక్తి తగ్గడంలో ఆశ్చర్యం లేదు.
13) విద్యారంగంలో మీరు మార్పులు ఆశిస్తున్నారా? ఎలాంటి మార్పులు కోరుతున్నారు?
♣ విద్యారంగంలో మార్పు రాకపోతే తెలుగు భాష నానాటికి అదృశ్యమైపోతుంది. చిన్నతరగతుల నుండే నీతిశతకాలు, తెలుగుభాషా నిఘంటువులు పద్యాలలో ఉండేవి పెట్టాలి. ఒక రకంగా పెద్దబాలశిక్ష వంటి పాఠ్యపుస్తకాలు వస్తేనే తెలుగు భాష, సంస్కృతి పిల్లలకు పట్టుబడుతుంది. చిన్నతనంలో నేర్చింది జీవితాంతం గుర్తుంటుంది. అందువల్ల సిలబస్ అధికమైనా ఐదు తరగతుల వరకు తెలుగే అన్ని సబ్జక్టులలో మాధ్యమంగా బోధించాలి. పరీక్షావిధానం మెరిట్ ఆధారంగానే తప్ప,హాజరుద్వారా పాస్ చేయకూడదు.
14) మీ కుటుంబ వాతావరణం మీ రచనా వ్యాసంగానికి ఎంత వరకు తోడ్పడుతుంది?
♣ మా తల్లి తండ్రిగారు శతావధానియని, పర్కాలలో (వరంగల్ దగ్గరి) పల్లకిలో ఊరేగాడని మా అమ్మ చెబితే తెలిసిందే తప్ప వారిని నేను చూడలేదు. ఆ మాతృవంశ రక్తమే పద్యంగా నాలో ప్రవహిస్తున్నదేమో. ఇక మా తండ్రిగారికి మడి,(పొలం) బడి, గుడి నిత్య కార్యక్షేత్రాలు. అందువల్ల నాకు శ్రమ, బోధన, భక్తి ఆనువంశికంగా వచ్చిన ధనాలు. సాహిత్య వాతావరణం లేదనే చెప్పాలి ఇంట్లో. సహజంగా నాలో పొటమరించిన సాహిత్యానురక్తి గురుబోధనలతోనే మొగ్గ తొడిగింది. వరంగల్ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో పుష్పించింది. నా రచనలలో శ్రమజేసే కర్మకు సత్యమైన భక్తికి, సమాజసేవకే ప్రాధాన్యం యిస్తాను. రోజూ బీడీలు చేసిన మాదిరి కవిత్వం రాయడం నాకు వీలు పడదు. నా మనస్సు తీవ్రంగా స్పందించినపుడే భావం మనసు పొరల్లోంచి చీల్చుకుని వచ్చినపుడే రాస్తాను.
జీవితమంతా పరిగెట్టడం పోరాడటంతోనే సరిపోయింది. విసిగిన క్షణంలో కవిత్వమూ, భక్తి భావమే నన్నుతీవ్రవాది గాకుండా కాపాడినాయి. భార్యను చదివించి MA, Phd చేయించడం, కొడుకును డాక్టరు చదివించడం, పెద్ద కూతురుకు చదువబ్బకపోతే పెండ్లి చేయడం, చిన్నకూతురును ఫిజియోధెరపీ చదివించి, దాని అదృష్టాన ఐ.పి.యస్. అల్లుడిని పొందడం, ఈనాటికి మనుమలు మనుమరాండ్రతో రిటైరైన తర్వాత నిలబడి నీళ్ళు తాగుతున్నాను. కుటుంబంలోని, కళాశాలలోని సమాజంలోని అనుభవాలు, ఘర్షణలు, మధ్య మధ్య ఒయాసిస్సు లాంటి సంతోషాలు ఇవే నా కవిత్వానికి ప్రేరణలు.
15) మీ సన్మానాలు, అవార్డుల గురించి చెప్పండి?
♣ మా విద్యార్థినీ విద్యార్థులు ఎక్కడైనా కలసి ‘నేను తెలుగులో పిజి చేసాను సార్ మీ ప్రవచన ప్రభావంతో’ అన్నపుడు అంతకంటే పెద్ద సన్మానం ఇంకోటుండదు నాకు. అంజయ్య, సదానందరెడ్డి అలాంటి వాళ్ళు. మొన్నీమధ్యనే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ తెలుగులో అసోసియేట్ ప్రొఫెసర్ గానున్నానని ఒకరు ఫోన్ చేసాడు. ఇంతకంటే ఆనంద మేముంది.
నా అధ్యాపక కృషిని, పాస్ పర్సంటేజిని గమనించి, జాతీయ సేవా పథక సేవా కార్యక్రమాలు పరిశీలించి, పీహెచ్‌డి ధీసిస్, కావ్యాలు, వ్యాసాలు తిలకించి 2003లో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డ్ ప్రదానం చేసింది ప్రభుత్వం.
———————————————————–
తోటను పూచికాచి కడుదోరపుకాయలు పండ్లు నిండుగాపేటల వెల్గు చెట్లు కడు పేరునుపొందిన వెన్నొ యుండగావేటగ నన్నుబట్టి తమ పేరిమిజూపితలంపు పచ్చనల్చాటగ నెన్నుకున్న గుణసాధువులొప్పగ పండ్లనిచ్చితిన్–రంగాచార్య
సంచిక అంతర్జాల పత్రిక పక్షాన మీకు దన్యవాదాలు సర్.
నమస్కారం.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎందరో మహానుభావు లు అందరికీ వందనాలు. కానీ అంత పెద్ద ఇంటర్వ్యూ ను అక్షర రూపంలో ఆవిష్కరించి న మీరు అభినందన నీ యు లు. మీ కృషి కి నా జోహారు లు.
ఉత్తమ పద్యకవి,ఉత్తమ ఉపాధ్యాయులు, గొప్ప విమర్శకులు డాక్టర్ వజ్ఝల రంగా చార్య గారి అంతర ఆవిష్కారం స్పూర్తి దాయకంగా ఉంది. వారి విశ్లేషణ గొప్పగా ఉంటుంది. అక్షరార్చన(whatsapp group)లో వారి పద్య పరిచయం కోసం ఎదురు చూస్తుంటాము. వారిని మీరు పరిచయం చేయడం చాలా బాగుంది, సహజంగా ఉంది.అక్షర ప్రేమికులనెప్పుడూ మీరు ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం.నమస్కారం. —–కుందావజ్ఝల కృష్ణ మూర్తి. హనుమకొండ.
మూర్తి గారు మీ స్పందన కు ధన్యవాదాలండీ
పద్యం ఎప్పటికీ గొప్పదే. అది తెలుగు వారి సొంతం. ఓ మహానుభావుడి గురించి వివరంగా తెలుసుకున్నాను. డాక్టరు గారికి ధన్యవాదాలు.
సరసి గారు మీ స్పందన కు ధన్యవాదాలండీ.
వఝల వారి తో మీకువచేసిన ముఖా ముఖి చాలానబాగుంది .తెలుగు పై పిల్లలకు శ్రద్ధ లేక పొవటానికి పెద్దలే కారణమన్న మాటతొ ఏకీభవిస్తాను.ప్రభుత్వం వారి విద్యా విధానంవకూడా కొంతవరకు కారణం.గతం లొ ఉర్దూ మీడియంలొ చదువుకున్నవారు సినారె జైశంకర్ మొదలైన వారు ప్రఖ్యాతులు కాలేదా?ఇతరభాషలలొ ప్రావీణ్య ంసంపాదించలేదా?ప్పభుత్వం కనీసం 10 వతరగతివరకు విద్యాబొధన మాతృభాషలొనే చేయాలని గట్టిప్రయత్నం చేయాలి.చట్టం పకడ్బందీగా అమలయ్యేట్టుచూడాలె. —-రామశాస్త్రి
శాస్త్రి గారు మీ స్పందన కు ధన్యవాదాలండీ.
పెద్దల గురించి మీరు చేసిన ఇంటర్వూ ఈ తరానికి స్పూర్తిదాయకం మరియు సరిక్రొత్త విషయాల పై అవగాహనకు ఆస్కారం కలాగిస్తుంది సర్ . మీకు ధన్యవాదములు
సాగర్ నీ స్పందన కు ధన్యవాదాలు.
మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. తెలుగు పండితుడిని చక్కగా పరిచయం చేశారు
ధన్యవాదాలు సర్ మీకు
విలువైన ఇంటర్వ్యూ … తెలుగుపద్యపు చిరునామాను తెలిపారు …. కమ్మని పద్యపఠన , విపులమైన వ్యాఖ్యాన పాండిత్యాన్ని అక్షరాల్లో చూపారు , రాబోయే తరాలకు అవసరమైన సందేశాన్ని అందించగలిగే ప్రతిభను దర్శింపజేశారు … అభినందనలు సర్ !!!
వారి పక్షాన ధన్యవాదాలు సర్ మీకు.
Dr. వజ్జల రంగాచార్యగారి అంతరంగ ఆవిష్కరణతో వారి గురించి తెలియని అనేక విషయాలు తెలిపారు. చిన్నప్పటి నుండీ పద్యం పై వారి మక్కువ, పప్పుగుత్తితో పద్య పఠనం చేస్తూ రామారావు గారి అభినయం, పద్యంపై ఇష్టం క్రమంగా బలపడి తెలుగు అధ్యాపకులవటం, అష్టావధానాలు చేయటం చాలా స్ఫూర్తిదాయకంగా వుంది. విద్యావిధానంలో తెలుగు భాష గురించి వారి సూచనలు ఆలోచింపచేసేవిగా వున్నాయి. చాలా ఎడుకేటివ్ ఇంటర్వ్యూ చదివిన తృప్తి కలిగింది.
ధన్యవాదాలు ఝాన్సీ గారు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కొరముట్ల కుమారి నానీలు
‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-15 – దిల్ మె కిసీ కె ప్యార్ కా
స్వాతంత్ర్య సమర యోధులకు శతాధిక కవుల కవితా హారతి – ‘సాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి’ పుస్తకానికి ముందుమాట
దౌష్ట్యానికి సమర్థన!!!!
జీవన’యానం’ – పుస్తక పరిచయం
జీవన రమణీయం-60
పెంటయ్య బాబాయి
ఆదర్శవాద ధోరణులతో వచ్చిన నవల – మొదటి చీమ
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-33: వేల్కూరు
మనమెక్కడ..??
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®