Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

49. సంభాషణం – డా. తుర్లపాటి రాజేశ్వరి అంతరంగ ఆవిష్కరణ

[సంచిక కోసం శ్రీమతి డా. తుర్లపాటి రాజేశ్వరి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

అనువాదంలో అందెవేసిన చేయి.. శ్రీమతి డా. తుర్లపాటి రాజేశ్వరి:

తెలుగులో అనువాద ప్రక్రియలో తమ ప్రత్యేకతను నిలుపుకున్న బహు కొద్దిమంది రచయిత్రులలో డా. తుర్లపాటి రాజేశ్వరి గారు ఒకరు. అలాగే నాగార్జునసాగర్ అందించిన ఆణిముత్యాలలో శ్రీమతి తుర్లపాటి రాజేశ్వరి గారు ముందువరుసలో వుంటారు. ఆంధ్రాంగ్ల భాషల్లో మంచి పట్టు సాధించిన  డా. తుర్లపాటి రాజేశ్వరి గారు ఇటీవలె అనువాదానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం సాధించారు. వారి  సాహితీ ప్రస్థానం గురించిన మరిన్ని విశేషాలు ఆవిడ మాటల్లోనే చూద్దామా..

~

* డా. తుర్లపాటి రాజేశ్వరి గారూ నమస్కారం. సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం.

డా. తుర్లపాటి రాజేశ్వరి: నమస్కారం డా. ప్రసాద్‌ గారూ.

~

1. మేడం గారు, మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? వివరంగా చెప్పండి.

జ: నా బాల్యం విద్యాభ్యాసం అంటే నాగార్జున సాగర్ అనే చెప్పాలి. మా నాన్నగారికి అక్కడ ఉద్యోగం వచ్చింది. ప్రాథమిక విద్య స్కూల్‌లో చదవకుండా నేను ఏడెనిమిది ఏళ్లు వయసులో 1958లో నేరుగా హైస్కూలులో – పరీక్ష రాసి చేరానండీ. అలా నేను పదమూడేళ్ళకే ఎస్.ఎస్.ఎల్.సి పాసై – తర్వాత రెండేళ్లు ఇంట్లో ఉన్నాను.

ఆ తర్వాత ఏలూరు, అనంతపురాలలో నా చదువు సాగింది. బి.ఎస్.సి.తో పాటు ఎమ్.ఏ. తెలుగు చేశాను.

చదువులో ముందుండేదాన్ని, చాలా చిన్నప్పటి నుంచే. అంటే ఏడో ఏట నుంచే నేను తెలుగులో కథలు, పుస్తకాలు మా అమ్మగారితో పాటు చదువుతూ ఉండేదాన్ని. పదో తరగతిలో చదువుతున్నప్పుడు అనుకుంటా మా తరగతి పిల్లలను మా స్కూల్ మాస్టరు నాగార్జున కొండ తీసుకెళ్ళి మ్యూజియమ్ – బౌద్ధ స్తూపాలు, యజ్ఞ వాటికలు – అవన్నీ చూపించారు. కృష్ణానది, ఆ సుందర ప్రకృతి – చారిత్రక ప్రదేశాలు – అన్నీ బాల్యంలో నాపై చెరగని ముద్ర వేశాయి. బాల్యం నుంచే నాకు ఆంగ్ల సాహిత్యం, తెలుగు సాహిత్యం, చరిత్ర మీద మక్కువ ఉండేది.

రచయిత్రి కుటుంబం

2. తెలుగు సాహిత్యాభిలాష మీకు ఎప్పుడు ఎలా ఏర్పడింది? ఈ విషయంలో ప్రత్యేకంగా ఎవరి ప్రోత్సాహమైనా లభించిందా?

జ: నాగార్జున సాగర్‍లో పదమూడు, పధ్నాలుగు ఏళ్ల వయసులో – హిల్ కాలనీలో ఒక అసోసియేషన్ ఉండేది. అక్కడికి వాళ్లు ఎంతోమంది కవులని, రచయితలని తీసుకొచ్చేవారు. నేను అప్పుడే విశ్వనాథ, కరుణశ్రీ, సి.నా.రె వంటి వారి ఉపన్యాసాలను విన్నాను. సి.నారె. ‘నాగార్జున సాగరం’ నుంచి, ‘కర్పూర వసంతరాయలు’ కావ్యాల నుంచి కొన్ని పంక్తులు లయాన్వితంగా, సంగీతాత్మకంగా పాడటం నన్ను ఎంతో ఆకర్షించింది. మా అమ్మగారికి సాహిత్యంలో మంచి అభిరుచి ఉంది. ఆవిడతో పాటు నేను వెళ్లేదాన్ని. అలాగే నేను అక్కడే ఉన్న చిన్న లైబ్రరీలో మెంబర్‌షిప్ తీసుకుని, పుస్తకాలు తెచ్చి, చదివేదాన్ని, అప్పుడే టాగూర్‌ని, శరత్‌ని కూడా చదివాను. మా అమ్మ భారతం, భాగవతం, పౌరాణిక కథలు, దేశభక్తికి సంబంధించిన అనేక విషయాలు, చెబుతూ రాగయుక్తంగా పద్యాలు పాడేది. చెప్పాలంటే మా నాన్నగారు పౌరాణిక నటులు – ఆయనకి సంగీతం వచ్చు. ఇవన్నీ నన్ను రచన వైపు నడిపించాయి. మా కుటుంబంలో సంగీత, సాహిత్యాల మీద అభిరుచి ఉన్నవారూ, సాధన చేసిన వారూ ఉన్నారు.

వసుమతీ మాధవ జీవన సాఫల్య పురస్కారం

3. విద్యార్థినిగా మీపై తెలుగు భాష ప్రభావం ఎట్లా ఉండేది?

జ: హైస్కూల్‌లో మా తెలుగు మాస్టారు గోలి వెంకట రామయ్య గారు పద్యం బాగా అనేవారు. పద్యం వినటం నాకు చాలా ఇష్టం. పద్యం ఎలా అనాలో బహుశః నాకు చిన్ననాడే పట్టుపడింది. తెలుగు వ్యాసరచన, వక్తృత్వం పోటీలలో బహుమతులు సాధించేదాన్ని. సత్యసాయి కాలేజి, అనంతపురంలో, ఎమ్ ఏ. ఫైనల్ ఇయర్‌లో 1974లో ఆంధ్ర ప్రదేశ్ సైన్స్ అకాడెమీ వారు అనంతపురం అన్ని కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో నిర్వహించిన అంతర్ కళాశాల వ్యాస రచన, వక్తృత్వ పోటీలలో రెండవ బహుమతి పొంది, సూరి భగవంతం గారి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నా. అలా మరువలేని  జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. మొదటిసారి ఆకాశవాణి వారు నాతో మాట్లాడించారు ఆ సందర్భంలో! నేను తెలుగు ఎమ్మే విద్యార్థిని అని నాకు సూరి భగవంతంగారు ఆంధ్రమహా భారతం – (ఒక్క అరణ్యపర్వం తప్ప,  మిగతా అన్ని పర్వాలు) బహుమతిగా ఇచ్చారు.

4. తెలుగులో మీ మొదటి రచన ఎప్పుడు, ఏ పత్రికలో ప్రచురింపబడింది? అప్పటి మీ అనుభవాలు చెప్పండి.?

జ: నా కథ ‘మూగబోయిన మురళి’ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 1970 నవంబరు నెలలో ప్రచురణ అయింది. ఆ ప్రతి నా వద్ద లేదు. వివరాలు గుర్తు లేవు. చాలా సంతోషం కలిగింది. డెబ్భై రూపాయలు పారితోషికం పంపారు. దీనితో మా అమ్మా నాన్నగారికి బట్టలు కొన్నాను. అచ్చులో రాసింది చూసుకోవటం సంబరంగా అన్పించింది. మా మేనమామ రెంటాల రాఘవరావు గారు భారత రాష్ట్రపతుల వద్ద పర్సనల్ సెక్రటరీగా పని చేసేవారు. హిందీలో అనువాదాలు (తెలుగు నుంచి) చేసేవారు. ఆయన చాలా ఆనందించారు. ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్‌లో వారు కొన్ని పదవులు నిర్వహించారు కూడా.

5. తెలుగు భాషకు సంబంధించి పరిశోధనా రంగంలో మీరు ఉన్నారు. మీ పరిశోధన అంశం ఏమిటి? పరిశోధనా గ్రంథం గురించి వివరించండి.

జ: ‘స్వాతంత్య్రానంతర తెలుగు నవల 1947-77’ అనే అంశం మీద నేను పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాను, అంటే ముప్ఫయేళ్ల తెలుగు నవల – ఈ కాలంలో వెలువడ్డ ప్రముఖమైన నవలలను విశ్లేషణాత్మకంగా, తెలుగు నవల స్వరూప స్వభావాలను వివరణాత్మకంగా ఆవిష్కరించి  నా పరిశోధనా గ్రంథంలో చిత్రించటం జరిగింది. మూడు దశాబ్దాలలో వెలువడిన నవలలను మొత్తం ఎనిమిది అధ్యాయాలలో చర్చించాను. మొదటి భాగంలో వస్తువును సాంఘికము, రాజకీయము, చారిత్రికము, తాత్వికము అనే నాలుగు అధ్యాయాలలో, రెండవ భాగంలో శిల్పాన్ని కథాకథనం, పాత్రచిత్రణ, కధా సంవిధానము, స్వప్నములు అనే నాలుగు అధ్యాయాలలో చర్చించాను. ఈ పరిశోధనా గ్రంథం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎమ్.ఏ. తెలుగు ప్రీవియస్‌కు రిఫరెన్స్ గ్రంథంగా నిర్ణయించబడింది కూడా!

పరిశోధన అంటే నాకు ఇష్టం. ఒరిస్సాలో తెలుగు, తెలుగు వారి ప్రాచీనతల మీద – పరిశోధన చేస్తూ ఎన్నో వ్యాసాలు రాశాను.

విశాఖ రచయితల సంఘం, భారతనిధి ఫౌండేషన్, బలివాడ కాంతారావు పురస్కారం 2023

6. మీరు ఒరిస్సా రాష్ట్రంలో స్థిరపడటం వెనుక నేపథ్యం ఏమిటి? భాషాపరంగా అక్కడ మీరు ఎలా సర్దుకుపోగలిగారు?

జ: ఒరిస్సా ఎడ్యుకేషన్ సర్వీస్ O.E.S Class II Gazetted Telugu Lecturer పోస్ట్‌కి నేను ఎంపిక 1976లో బరంపురం Khallikote College లో (ఇప్పుడు యూనివర్సిటీ అయింది) జాయిన్ అయ్యాను, సర్వీస్ కమీషన్ నిబంధనల ప్రకారం సంవత్సర కాలంలో ఒడియా 7th class పరీక్ష Pass అవ్వాలి. నేను ఆ విధంగా ఒడియాలో ఎమ్.ఇ. standard examination పాసయ్యాను ఆ గడువులో. ఎటువంటి ఇబ్బంది పడలేదు; ఎందుకంటే ఆఫీస్‌లో, మా స్టాఫ్ రూమ్‌లో ఆంగ్లంలో మాట్లాడేదాన్ని. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను – ఫరవాలేదు. అప్పట్లో బరంపురంలో మార్కెట్లో కూడా ఎక్కువ తెలుగు వ్యాపారస్థులే. తరువాత ఒడియా నేర్చుకున్నాను కదా! పెళ్లి అయింది కూడా బరంపురం వాస్తవ్యులు నిడదవోలు సత్యనారాయణమూర్తి గారితో. అందుచేత అక్కడే ఉండిపోయాం.

7. అనువాద ప్రక్రియ అన్ని ప్రక్రియలలోనూ చాలా క్లిష్టమైన ప్రక్రియ కదా. సంబంధిత భాషల్లో నిష్ణాతులైతే తప్ప సాధ్యం కాదు. ఇందులో మీరు పట్టు ఎలా సాధించారు? ఇందులో ఎదురయ్యే సమస్యలు ఏమిటి?

జ: ప్రారంభంలో నేను తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేశాను. చాలా విరామం తర్వాత అనువాదానికి సంబంధించి నా రచన – రవీంద్రుని ‘ఫ్రూట్ గేదరింగ్’కు చేసిన తెలుగు అనువాదం ‘నివేదన’. నిజానికి ఈ అనువాదం చేసినపుడు నాకు ఏమీ కష్టం అనిపించలేదు. రవీంద్రుడి రచన చదువుతుంటే నాకు వెంటవెంటనే తెలుగు వాక్యాలు వచ్చాయి. అది ఒక గొప్ప అనుభవం. అలాగే ఖలీల్ జిబ్రాన్ ‘ప్రొఫెట్’ కూడా! రవీంద్రుడి కావ్యానికి నేను చేసిన అనువాదం రెండు ముద్రణలు పొందింది. పలువురిని ఆకర్షించింది – ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ నన్ను రవీంద్ర జయంతి రోజు పిలిపించి – ఘన సన్మానం – 2014లో జరపటం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఒడియాకి సంబంధించిన అనువాదం అయితే మూలాన్ని బాగా చదువుతాను. మూల రచయిత వాడిన పదానికి సమానార్థకం – భావం – ఏదీ చెడకుండా తెలుగు లోకి వచ్చేవరకు – అంటే నాకు సంతృప్తి కలిగే వరకు విశ్రమించను. ఒడియా అనుకోండి- ఒడియా భాషకే సహజసిద్ధమైన జాతీయాలు, నానుడులు, ఒడియా వారి కుటుంబ సంప్రదాయాలు ఆచారాలు – అంటే సంస్కృతి – అలాగే ఆయా ప్రాంతాల వర్ణనలు – పేర్లు – అన్నింటిని గూర్చి తెలుసుకోవలసి వస్తుంది. వాటిని శక్తి మేరకు మన భాషలోకి తీసుకురావాలి. అదీ అందంగా నా శైలిలో!

ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ నుండి టాగోర్ జయంతి సందర్భంగా రవీంద్రుని ‘ఫ్రూట్ గేదరింగ్’ – ‘నివేదన’ అనువాదానికి సన్మానం (2014)

 

8. తెలుగు భాష నుండి ఇతర భాషలోకి అనువాదాలు జరగవలసినంత స్థాయిలో జరుగుతున్నట్లు మీరు భావిస్తున్నారా? వివరంగా చెప్పండి.

జ: వాస్తవానికి తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదాలు అంతగా జరగటం లేదనుకుంటాను. తెలుగు భాషాభివృద్ది సంస్థలు లాంటివి పూనుకుంటే బాగుంటుంది.

9. మీరు అనువాదాలు చేసేటప్పుడు అంశాన్ని మూల గ్రంథం నుంచి స్వీకరిస్తారా లేక ఆంగ్లం అనువాదాల ఆధారంగా చేస్తారా? ఎందుచేత?

 జ: నేను ఒడియా నుండి తెలుగు చేసిన రచనలన్నీ నేరుగా ఒడియా నుండి అనువాదం చేసినవే. నాకు వచ్చిన అవకాశాలు కూడా అలాగే వచ్చాయి. నేను ఒడిశా సాహిత్య అకాడమీకి, కేంద్ర సాహిత్య అకాడెమీకి, నేషనల్ బుక్ ట్రస్ట్ లకు – అదే మాదిరిగా విపుల, చతుర, సంచిక, పారిజాతం, నేటి నిజం – ఇలా ఏ పత్రికకు చేసినా కథలూ – కవిత్వం – ఏదైనా ఒడియా నుంచే నేరుగా అనువాదం చేశాను. ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ బుక్ ట్రస్టుకు శంతనుకుమార్ ఆచార్య గారి మంచి నవల ఒకటి అనువాదం చేస్తున్నాను. చాలా గొప్ప నవల అది! మూలభాష నాకు బాగా వచ్చినప్పుడు – నేను దాని ఇంగ్లీషు అనువాదాన్ని పట్టుకోవటం ఎందుకు? ఏ రచన నేను చేపట్టినా నాకు అన్ని విధాలా సంతృప్తికరంగా తోస్తేనే చేస్తాను. అలా చేయటంలో నాకు ఆనందం కలుగుతుంది.

ఉమ్మడిశెట్టి సాహితీ సభ ఎం. పార్వతి పురస్కారం – 2022

10. అనువాద ప్రక్రియలో మీకు ఈ మధ్య కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిన సందర్భంగా మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఏ గ్రంథానికి మీకు అవార్డ్ వచ్చింది? ఆ గ్రంథ విశేషాలు చెప్పండి.

జ: ధన్యవాదాలండీ. ఒరియా సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మశ్రీ గోపీనాథ్ మహంతి రచించిన నవల ‘దాదీబుఢా’. నేను ఈ నవలను తెలుగులోకి ‘ఈతచెట్టు దేవుడు’ పేరుతో అనువదించాను. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కొండల్లో నివసించే ఆదివాసీ సమాజం విశ్వాసాలను, జీవనశైలిని, వారిలో క్రమానుగతంగా వస్తున్న మార్పులని గోపీనాథ్ మహంతి ఈ నవలలో అక్షరబద్ధం చేశారు. ఈ నవలకి రంగస్థలం ‘లుల్లా’ గ్రామం. అద్భుతమైన కథ – కథనం! కరుణ రసాత్మకం. ఈ నవల అనువాదం చేస్తున్నంత కాలం నేను లుల్లా గ్రామ ప్రజల సుఖదుఃఖాలతో మమేకమయ్యాను. దాదీబుఢా అంటే ఆ గ్రామవాసులు తమ వంశ మూల పురుషుని పూజించే ఈత చెట్టు.

పరజా, కొంధుల భాషల కలయికతో ఏర్పడిన పదం ఇది.

ఆచార్య ఎస్. గంగప్ప సాహితీ పురస్కారం 2024

11. ఒక భాషలో నుంచి మరో భాషలోకి పుస్తకాన్ని అనువదించేటప్పుడు సాధారణంగా ఎదుర్కొనే సమస్య ఏమిటి? దానిని మీరు ఎలా అధిగమించారు?

జ: ఈ ప్రశ్నకి జవాబు నేను ఇంతకు ముందే చెప్పాను.

మూల భాషా వ్యక్తుల సంస్కృతి, సంప్రదాయాలు ఆ రచయిత తన రచనలో పేర్కొన్న ప్రదేశాలు అనేకమైనవి నాకు తెలియకపోతే నేను తెలుసుకుంటాను. ఆ విధంగా నా అనువాద రచనలో వ్రాస్తాను.

12. మీ కలం నుండి వెలువడ్డ ఇతర గ్రంథాల గూర్చి చెప్పండి.

జ: నావి ఇప్పటి వరకు ముద్రణ అయిన పుస్తకాలు 23. కథ, నవల, కవిత్వం, అనువాదం, రూపకం, వ్యాసం, విమర్శ – వివిధ ప్రక్రియలలో రచనలు వెలువరించాను.

స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు- గృహహింస – పురుషుల మధ్య వివక్ష నేపథ్యంగా అనేక కవితలు రాశాను. అలాగే కొన్ని కథలు కూడా!

నా తెలుగు కవితలని కన్నడ భాషలోకి కె.సుధాకరరావు గారు అనువదించి ‘హణ్ణినమర’ పేరుతో 2009 లో వెలువరించారు. తెలుగువారి ప్రాచీనత, ఒరిస్సాలో తెలుగువారు, తెలుగు – ఒరియా సాహిత్య సాంస్కృతిక సంబంధాలు మున్నగు విషయాల మీద కృషి చేస్తూ అనేక వ్యాసాలు రాశాను. బరంపురంలో 1933లో జరిగిన అభినవాంధ్ర కవి పండిత సభను నేను రూపకంగా 2016లో వెలువరించాను. ఒక చారిత్రక ఘట్టాన్ని, విద్వత్సభను రూపకంగా మలచటం ఆనందం, సంతృప్తిని కలిగించింది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నాచేత ‘ఒరిస్సాలో తెలుగు వారు’ గ్రంథం రాయించి 2012 లో తిరుపతిలో జరిగిన తెలుగు మహా సభల వేదిక పై ఆవిష్కరించారు.

13. మీరు పొందిన అవార్డులు, సన్మానాల గురించి వివరించండి.

జ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వారి రచయిత్రి. నాళం కృష్ణారావు పురస్కారం 2007లో మరియు ‘తెలుగుధనం’ వ్యాససంపుటికి 2011లో ఉత్తమ గ్రంథ సాహితీ పురస్కారం అందుకున్నాను. రవీంద్రుని ‘ఫ్రూట్ గేదరింగ్’ ఆంగ్లం నుండి తెలుగులోకి చేసిన అనువాదం ‘నివేదన’కు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ నుండి ఘన సన్మానం పొందాను. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి ‘తెలుగు వికాసం పురస్కారం’ (2007) కృష్ణాజిల్లా రచయితల సంఘం వారి గుత్తికొండ సుబ్బారావు  పురస్కారం (2015), విశాఖ రచయితల సంఘం, భారతనిధి ఫౌండేషన్, బలివాడ కాంతారావు పురస్కారం (2023) చలసాని వసుమతీ మాధవ పురస్కారం (2022) మొదలైన పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, సన్మానాలు అందుకున్నాను.

శ్రీమతి నారాయణదాసు వెంకట శేషమ్మ పురస్కారం 2025

14. నేటి ఆధునిక సమాజంలోని యువ రచయితలను/రచయిత్రులను తెలుగు భాష/తెలుగు సాహిత్యం పట్ల మరింత ఆకర్షితుతులను చేయడానికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు?

జ: రచయితలు తెలుగు సాహిత్యంలో వచ్చిన మంచి పుస్తకాలను ఎంచుకుని చదువుతుంటే క్రమంగా సాహిత్యంపై అభిమానం, పఠనాసక్తి పెరుగుతుంది. అలాగే సాహిత్యసభలకు వెళ్ళటం, పెద్దల ఉపన్యాసాలు వినటం తప్పకుండా వీరిని ప్రభావితం చేస్తుంది.

15. కొత్తగా అనువాద రంగంలో అడుగు పెడుతున్న లేత రచయితలకు మీరు ఇచ్చే సూచనలు సెలవీయండి.

జ: అనువాదం అనేది క్లిష్టమైన ప్రక్రియ. హడావిడిగా చేయకూడదు. మీ రచన మీ భాషలో చదివేవారికి అది మీ సొంత రచనలా అన్పించాలి. అలా అని మూల భాషా రచయిత భావోద్వేగాలకి, శైలీ సంపదకి ఎటువంటి అన్యాయం జరగకూడదు. అప్పుడే అది మంచి అనువాదం అవుతుందని నేను అనుకుంటాను.

~

* ‘సంచిక’ వార, మాస పత్రికల తరఫున మీకు కృతజ్ఞతలు.

జ: ధన్యవాదాలండీ.

Exit mobile version