[సంచిక కోసం కథకులు, బాల సాహితీవేత్త డా. ఎం. హరికిషన్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
బాల సాహితీవేత్త డా. హరికిషన్:
~
* డా. ఎం. హరికిషన్ గారికి సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన స్వాగతం. నమస్కారం.
నమస్తే.
~
1: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ ఎలా జరిగింది? వివరించండి?
జ: నా విద్యాభ్యాసం ఒకటో తరగతి నుండి పీహెచ్డీ వరకు మొత్తం కర్నూల్లోనే పూర్తయింది. నేను పుట్టింది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పాణ్యం. అప్పట్లో అది కర్నూలు జిల్లాలోనే ఉన్నప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నంద్యాల జిల్లాకు మారింది. పుట్టింది పాణ్యమయినా పెరిగింది, చదివింది, ఉంటున్నది, ఉండబోతున్నది అంతా కర్నూలు నగరమే. ప్రాథమిక విద్య కర్నూల్లోని సెయింట్ మేరీస్, టౌన్ మోడల్ హైస్కూలలో పూర్తి చేస్తే.. ఆ తర్వాత కోల్స్ కళాశాలలో ఎంపీసీ తీసుకున్నాను. లెక్కల మీద శ్రద్ధ తగ్గడంతో ఇంటర్లో మిగతా సబ్జెక్టులన్నీ మొదటి శ్రేణిలో పాసైనా లెక్కల్లో మాత్రం తప్పాను. దాంతో ఒక సంవత్సరం బ్రేక్ వచ్చింది. అది పెద్ద మలుపు అని చెప్పవచ్చు. డిగ్రీ ఎస్టీబీసీ కాలేజీలో అడ్వాన్స్ తెలుగు లెక్కలు లేకుండా తీసుకున్నాను. అలా సాహిత్యం నాకు ఒక సబ్జెక్టుగా మారింది. కర్నూల్ పిజి సెంటర్లో ఎంఏ తెలుగు చేరడంతో తెలుగు భాషా సాహిత్యలపై నెమ్మదిగా ఆసక్తి పెరిగింది.
2: మీరు తెలుగు సాహిత్యంలో పిహెచ్డి చేసినట్లున్నారు. మీ పరిశోధన అంశం ఏమిటి? ఆ అంశాన్ని మీరు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది?
జ: నాకు పిహెచ్డిలో గురువు తుమ్మల రామకృష్ణ. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు – సామాజిక దర్శనం’ అనేది నా పరిశోధనా అంశం. పరిశోధనా అంశాన్ని ఎన్నుకోవడంలో వ్యక్తిగతంగా నా ప్రమేయం ఏమీ లేదు. అప్పటికి నాకు అంత అనుభవం, మెచ్యూరిటీ కూడా లేదు. కేతు విశ్వనాధ రెడ్డి మా గురువుకు గురువు. దాంతో తన గురువు కథలపై మంచి పరిశోధన చేయించాలనే ఆసక్తితో సాహిత్యం మీద నాకు వున్న అభిమానం గమనించి నన్ను ఎన్నుకున్నాడు. కానీ ఆ పరిశోధన నాకు తర్వాతకాలంలో ఎంతగానో ఉపయోగపడింది. కేతు సామాన్యుడు కాదు. రాయలసీమ ప్రాతినిధ్య రచయిత. పదం పదం ఆలోచించి, ఆచితూచి అత్యంత పటిష్టంగా కథను నిర్మించేవాడు. ఆనాటికి అందరికంటే ముందుచూపుతో రాయలసీమ సామాజిక స్థితిగతులను, వెనుకబాటు కారణాలను బలంగా చిత్రించి ప్రాంతీయ సాహిత్యానికి పెద్దపీట వేసి ఉన్నతమైన విలువ తీసుకొని వచ్చినవాడు. నేను కథకుడిగా మారుతున్న తొలి దశలో నాలో ఒక దృక్పథం ఏర్పడటానికి, రాయలసీమ సమస్యల గురించి, అభ్యుదయ సాహిత్యం గురించి, కథా నిర్మాణం గురించి ఒకేసారి అవగాహన చేసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడింది.
3: మీ పరిశోధనకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? మీరు వాటిని ఎలా పరిష్కరించుకోగలిగారు?
జ: ప్రత్యేకంగా సమస్యలు అంటూ ఏమీ రాలేదు. ఎందుకంటే మా గురువు నాకు మంచి మిత్రునిలా ఉండేవాడు. రోజూ సాయంత్రం అతనితోనే యెప్పుడూ ఉండేవాడిని. అద్భుతమైన ఆధునిక సాహిత్య గ్రంథాలయం వాళ్ళ ఇంట్లో ఉండేది. దాంతో నాకు బయటకు వెళ్లి పుస్తకాలు సేకరించాల్సిన అవసరం కూడా పెద్దగా ఏమీ రాలేదు. కాకపోతే పరిశోథన మధ్యలోనే నాకు తెలుగు ఉపాధ్యాయునిగా ఉద్యోగం రావడం వల్ల, నేను రచయితగా అడుగులు వేస్తూ కథలు రాయడం, పుస్తకాలు వేయడం, సాహితీ సమావేశంలో పాల్గొనడం చేయడం వల్ల మధ్యలో కొంతకాలం ఆలస్యమై పరిశోధన పూర్తి కావడానికి దాదాపు ఐదు సంవత్సరాల పూర్తి కాలం పట్టింది. అప్పటికే కథా సాహిత్యాన్ని బాగా చదవడం రాయడం వల్ల నా పరిశోధన కూడా చాలా చిక్కగా, అనవసరమైన విషయాలు, అధ్యాయాలు లేకుండా సూటిగా సాగిపోయింది.
4: తెలుగు సాహిత్యం మీద మక్కువ ఎప్పుడు ఎక్కడ కలిగింది? ఇలా ఒక భాష మీద మక్కువ ఏర్పడడానికి గల కారణాలు వివరిస్తారా?
జ: చిన్నప్పటినుంచీ సమయం దొరికితే చాలు గ్రంథాలయాలకు పరిగెత్తడం, దొరికిన ప్రతి పుస్తకం చదవడం అలవాటుగా వున్న నేను పీజీలో మా గురువు తుమ్మల రామకృష్ణ గారి సాహచర్యం వల్ల కొత్త సాహితీ ప్రపంచంలోనికి, వాస్తవ జీవితంలోనికి అడుగుపెట్టాను. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రచయితల రచనల గురించి తెలుసుకోవడం, చదవడం అప్పుడే జరిగింది. మా గురువు అప్పుడప్పుడే కథలు రాయడం మొదలు పెడుతున్నాడు. ఎప్పుడూ వారి వెన్నంటే ఉండే నాకు వారికి ఉన్న సాహితీ మిత్రులందరూ పరిచయం కావడం మొదలైంది. ఆ పరిచయమే కర్నూలుకు చెందిన ‘కథా సమయం’ సంస్థలోకి అడుగుపెట్టడానికి కారణమైంది.
కర్నూలు సాహిత్య చరిత్రలో కథాసమయంది విశిష్టమైన పాత్ర. కర్నూల్లో ప్రాంతీయ జీవిత చిత్రణకి, మాండలికానికి పెద్దపీట వేసి ఆధునిక సాహిత్యానికి బాటలు వేసింది. కొత్త కథకుల్ని రూపొందించడంలోనూ, వారికి సరియైన దృక్పథం అందించడంలోనూ, ఇతర ప్రాంతాలకు ధీటుగా కర్నూలు రచయితలను నిలపడంలోనూ, సభలూ సమావేశాలూ అన్ని ప్రాంతాల కథారచయితలతో నిర్వహించి అనుబంధాలను విస్తరించడంలోనూ, కర్నూలు జిల్లాకు ఆధునిక సాహిత్యంలో గుర్తింపు తీసుకురావడంలోనూ విశేషమైన కృషి చేసింది.
కథా సమయం సభ్యుల్లో వయసులో అందరికంటే చిన్నవాన్ని నేనే అయినప్పటికీ కథా సమయం ప్రారంభం అయిన మొదటి సమావేశం నుంచీ వున్నాను. అంతకుముందు కేవలం పాఠకునిగా వున్న నన్ను కథకునిగా రాటుదేల్చిందీ, తీర్చిదిద్దిందీ కథాసమయం మిత్రులే. ఇతర ప్రాంతాలలోని సమకాలీన సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి, మన రచనలు మెరుగుపరచుకోవడానికి వీరు ఎంతగానో సహకరించారు. ప్రతి నెల రెండవ శనివారం జరిగే సమావేశంలో రచయితలు తాము రాసిన కథల్ని చదివి వినిపించేవారు. ప్రతి ఒక్కరూ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చేవారు. రచయితలు తమ లోటుపాట్లు గ్రహించి సవరించుకోవడానికి ఆ వాదోపవాదాలు ఉపయోగపడేవి. చంద్రశేఖర్, శ్రీనివాసమూర్తి, తుమ్మల రామకృష్ణ, రాప్తాడు గోపాలకృష్ణ, జి.ఉమా మహేశ్వర్, వెంకట కృష్ణ, తెలుగు వెంకటేష్, ఇనాయతుల్లా, రామ్‌చంద్ మొదలగువారు చురుగ్గా వ్యవహరించేవారు. కథాసమయానికి మంచి విమర్శకుడైన చంద్రశేఖర్ చాలా కీలకంగా వుండేవాడు. అలా వారందరి సాహచర్యంలో రూపుదిద్దుకున్న కథకున్ని నేను.
5: తెలుగు సాహిత్యంలో ఏ ప్రక్రియ అంటే మీకు ఎక్కువ ఇష్టం? ఎందుచేత?
జ: నాకు మొదటి నుంచి ‘కథ’ అంటేనే చాలా ఇష్టం. నేను ఒకేసారి కథ మొత్తం రాయలేను. ముక్కలు ముక్కలుగా రాసి కలుపుతూ ఉంటాను. రాసింది అనేకసార్లు సరి చేస్తుంటాను. అందువల్ల నవల లాంటివి నాకు సాధ్యం కావు. కవిత్వం అప్పుడప్పుడు రాద్దామనుకున్నా నాలుగు లైన్లు కూడా దాటి ముందుకు వెళ్ళేది కాదు. ఇప్పటి వరకు పట్టుమని పది కూడా కవితలు రాయలేకపోయాను. వ్యాసం మొదటి నుంచీ దూరమే. ఎటువంటి విషయాన్నయినా కథగా మల్చడమే నాకిష్టం. పెద్దపెద్ద సంభాషణలు, పేరాల పేరాల వర్ణనలు అలవోకగా నేను రాయలేను. అందువల్ల కూడా కథ వద్ద ఆగిపోయాను. పెద్దల సాహిత్యంలో రాయలేకపోయినప్పటికీ బాల సాహిత్యంలో మాత్రం గేయాలు, నవలలు, పొడుపు కథలు, సామెతలు, నవలలు వంటివి రాయగలిగాను.
6: మీ మొదటి రచన ఎప్పుడు ఏ పత్రికలో ప్రచురింపబడింది? అప్పుడు మీరు ఎలా స్పందించారు? మీ అనుభూతి ఎలా ఉంది?
జ: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో 1997లో నా మొదటి కథ ‘పడగ నీడ’ ప్రచురింపబడింది. కొత్తగా ఉద్యోగం వచ్చిన ఒక నగర యువకుడు ఫ్యాక్షన్ గ్రామానికి బయలుదేరినప్పుడు, మూడు రోజులకు ముందు అక్కడ ఒక హత్య జరిగితే.. అతనిలో కలిగే మానసిక సంఘర్షణనే కథాంశం. మ్యాజిక్ రియలిజం అందులో ఉపయోగించడం జరిగింది. ఈ కథ రాయడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం పట్టింది. ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రికలో కథ రావడం అప్పట్లో సామాన్యమైన విషయం కాదు. ప్రసిద్ధి చెందిన రచయితలందరూ ఆ పత్రికకు కథలు పంపిస్తూ ఉంటారు. అటువంటిది మొదటి కథనే ఆ పత్రికలో పడటంతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. పాఠకుల నుంచి, సాహితీ మిత్రుల నుంచి విశేషంగా ప్రశంసలు, విమర్శలు రావడం నా సాహితీ ప్రయాణం వేగంగా ముందుకు సాగడానికి దోహదం చేసింది.
7: బాల సాహిత్యంలో మీ కృషి అధికంగా ఉన్నట్టు కనిపిస్తోంది? బాలసాహిత్య రచయితగా మిమ్ములను మొదట గుర్తించిన పత్రిక ఏది?
జ: నేను మొదటి నుంచి పత్రికలతో సంబంధం లేకుండా బాలసాహిత్యాన్ని సృష్టిస్తున్న రచయితను. నేను కథలను కర్నూలు జిల్లా సరళ మాండలికంలో, అమ్మమ్మనో తాతయ్యనో పక్కన కూర్చొని చెబుతున్నట్లుగా రాయడాన్ని ఇష్టపడతాను. పత్రికల శైలికి, నా శైలికి అసలు పొంతన కుదరదు. ‘కథ బాగుంది. వ్యవహారిక భాషలో రాసి మరలా పంపించండి’ అని కొన్ని పత్రికల నుంచి సమాధానం వచ్చింది. పత్రికలలో పడటం కోసం నా శైలిని మార్చుకోవడం, రాజీపడడం నాకు నచ్చలేదు. దాంతో నేను పది కథలు రాయడం పూర్తికాగానే పుస్తకంగా ప్రచురించేవాడిని. ‘పిల్లలు చెప్పిన కథలు’ నా మొదటి బాలల పుస్తకం. కర్నూల్ బుక్ ట్రస్ట్ తరఫున నేనే స్వయంగా ప్రచురించాను. పుస్తకం కేవలం వెయ్యి కాపీలో, రెండువేల కాపీలో వేయగలం. దాంతో ‘పాఠకులను చేరుకోవడం ఎలా’ అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఫేస్‌బుక్ కనబడింది. నా కథల వ్యాప్తికి దానిని సాధనంగా ఉపయోగించాను. కొత్తతరం పాఠకులు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దాంతో నేను కూడా వాట్సప్, షేర్ చాట్, డైలీ హంట్, ప్రతిలిపి, కోరా, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఇలా ప్రతి సామాజిక మాధ్యమాన్ని బాల సాహిత్య ప్రచారం కోసం ఉపయోగించాను. యూట్యూబ్లో కూడా ‘హరికథలు’ అనే ఛానల్ ఓపెన్ చేసి స్వయంగా కథలు చెబుతూ వచ్చాను. పత్రికల కన్నా వేగంగా విస్తృతంగా ప్రజలకు నా కథలు చేరడానికి ఈ సామాజిక మాధ్యమాలు ఉపయోగపడుతున్నాయి. పత్రికలు వ్యతిరేకించిన నా శైలియే నా బలం. పాఠకులను ఈ ప్రత్యేకమైన శైలియే ఆకట్టుకుంటూ వుంది. ఇతరులకు భిన్నంగా నన్ను గుర్తించడానికి వీలవుతోంది.
8: పిల్లల కథలు రాయడం మామూలు విషయం కాదు. ఈ రచనా వ్యాసంగంలో పట్టు ఎలా సాధించారు?
జ: నా సాహిత్య ప్రవేశం పెద్దవాళ్ల కథలతోనే ప్రారంభమైంది. సామాజిక అంశాలే నా కథా వస్తువులు. నా మిత్రులు, సన్నిహితులు అంతా కూడా ఎక్కువగా వాళ్లే. దాదాపు 70 కి పైగా కథలు కర్నూలు జిల్లా జనజీవనాన్ని ప్రతిబింబిస్తూ రచించాను. మాయమ్మ రాచ్చసి, నయాఫత్వా, మూడు అబద్ధాలు, టీచర్ చెప్పిన కథలు, కందనవోలు కథలు ఇలా కొన్ని సంపుటాలు ప్రచురించాను. వీటిపై ఒకరు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ కూడా పూర్తి చేసి పట్టా పొందారు.
బాలసాహిత్యంలోకి నా ప్రయాణం అనుకోకుండా జరిగింది. పాఠశాలలో పిల్లలకు కథలు చెప్పడం నాకు అలవాటు. ఒకసారి ఎప్పుడూ నేనే చెప్పడం ఎందుకు వాళ్లతో చెప్పిద్దాం అని ఒక పిల్లవాణ్ణి పైకి లేపాను. ఆ పిల్లవాడు ‘చిన్న పాప – పెద్ద పాప’, ‘కిర్రు కిర్రు లొడ్డప్పా’ లాంటి కథలు చెప్పాడు. నేను కథలు చెబుతున్నప్పుడు చెవులు రిక్కించుకొని, కళ్ళు పెద్దగ చేసి, నోరు మూసుకొని, చేతులు కట్టుకొని వినే పిల్లవాళ్ళు.. ఆ పిల్లవాడు కథ చెబుతున్నంత సేపు ఒకటే నవ్వులు. అందరూ వానితో పాటే కథతో ప్రయాణం సాగించారు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ కథల్లో పిల్లల్ని సమ్మోహితుల్ని చేసే ఏదో అద్భుత అయస్కాంత శక్తి ఉంది అని అర్థమైంది. దాంతో మొదటిసారి ఆ జానపద కథలు కొన్ని రాసి ప్రచురించాలి అనుకున్నాను. అంతవరకు నేను రాస్తున్న వస్తువులు వేరు. రాసే శైలి వేరు. బాల సాహిత్యం ఎలా రాయాలో అర్థం కాలేదు. పది కథలు రాయడానికి దాదాపు తొమ్మిది నెలల పైన్నే పట్టింది. నేను పిల్లలు చెప్పిన కథను ఉన్నది ఉన్నట్టు రాయను. కథా వస్తువు మాత్రమే స్వీకరిస్తాను. సంభాషణలు, సంఘటనలు అన్నీ నాదైన శైలిలో పునర్నిర్మిస్తాను. నేను రాయడం పూర్తయ్యాక ఇది నేను చెప్పిన కథనేనా అని చెప్పిన వాళ్ళు సందేహపడతారు. ఒక్కొక్క కథ రాయడానికి చాలా సమయం తీసుకుంటాను. 125 జానపద కథలు రాయడానికి నాకు పట్టిన సమయం 12 సంవత్సరాలు. దీన్నిబట్టి మీకు అర్థమవుతుంది ఆ కథలు నేనంత మనసుపెట్టి రాశానో. 10 కథలు పూర్తి కాగానే ఒక పుస్తకంగా తీసుకురావడం మొదలుపెట్టాను. జనవిజ్ఞాన వేదిక నెల్లూరు మాల్యాద్రి గారు, మంచి పుస్తకం సురేష్ గారు, నవ తెలంగాణ ప్రచురణలు, దీప్తి పబ్లికేషన్స్ నాకు అండగా నిలబడ్డాయి.
ఈ జానపద కథలే కాకుండా నేను సొంతంగా అనేక కథలు రాయడం జరిగింది. సర్వ శిక్షా అభియాన్ ‘పిల్లల చేత కథలు రాపించి పుస్తకాలు వేయించాలి’ అని ఒక ప్రాజెక్ట్ ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. అందులో నేను స్టేట్ కమిటీ మెంబర్ గాను, కర్నూలు జిల్లాకు సంపాదకునిగాను పనిచేశాను. ఆ సమయంలో నేను విపరీతంగా బాల సాహిత్యాన్ని మరలా చదవడం జరిగింది. అప్పుడు నాకు బాల సాహిత్యంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు అర్థం అయ్యాయి. ప్రస్తుతం ఉన్న బాల సాహిత్యమంతా కూడా ఆరు ఏడు తరగతులు దాటిన వాళ్ళకి, చదవడం బాగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది గానీ అంతకంటే చిన్న వయసు పిల్లలకు, ఇప్పుడిప్పుడే చదవడం మొదలు పెడుతున్నవాళ్ళకి అర్థం కాదు. ఆ చిన్నారులకు అవసరమైన సరళపదాలతో బాలసాహిత్యం చాలా తక్కువగా వుంది. దాంతో ఆ గ్యాప్‌ను పూర్తి చేయడం కోసం నేను విపరీతంగా సాహిత్యాన్ని సృష్టించాను. నా అవసరం పెద్దల సాహిత్యంలో కాక బాల సాహిత్యంలోనే ఎక్కువగా ఉందని అర్థం కావడంతో తర్వాతి కాలంలో పూర్తిస్థాయిలో బాలసాహితీవేత్తగా మారిపోయాను.
9: పిల్లలు రాసిన సాహిత్యం బాల సాహిత్యమా? పిల్లల కోసం పెద్దలు రాసినది బాలసాహిత్యమా? కాస్త విపులంగా వివరించండి?
జ: ఎవరు రాశారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. వాళ్ళు ఎంచుకున్న వస్తువు ఏది, శైలి ఏది అనేది బాలసాహిత్యమో కాదో నిర్ణయిస్తాయి. చాలావరకు బాల సాహిత్య రచయితలు పెద్దలే. కానీ చాలామంది పెద్దలు ఎటువంటి దృక్పథం లేకుండా తమకు తోచిందంతా రాసి అది బాల సాహిత్యమంటూ దబాయిస్తున్నారు. కథకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం నీతులు, ఉపదేశాలను అందులో బలవంతంగా చొప్పిస్తున్నారు. అందుకే ప్రస్తుత బాలసాహిత్యం చాలా పేలవంగా ఉంటుంది.
ఈ మధ్యకాలంలో బాలలు కూడా అనేకమంది కథలు రాస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులు కథల సంకలనాలను పిల్లలు రాసిన కథలతో తీసుకొని వస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. కానీ వీటి మీద నాకు ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏమిటి అంటే నిజంగా ఆ కథలను పిల్లలు సొంతంగా రాస్తున్నారా అనేది ఒక సమస్య అయితే రెండవది అసలు ఆ పిల్లలతో రాయిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సాహిత్యం మీద కనీస అవగాహన కూడా ఉండడం లేదు. కథ అంటే ఏమిటో తెలియకుండానే పిల్లలతో కథలు రాయించి ప్రచురిస్తూ ఉన్నారు. వారికి సరైనటువంటి శిక్షణ ఇప్పించడం లేదు. పుస్తకం ముద్రించాక ఇక పిల్లల్ని పట్టించుకోవడం మానివేస్తున్నారు. నిజానికి ఉపాధ్యాయులు తాము త్వరగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం, పదిమంది కళ్ళలో పడడం కోసం పిల్లలతో అలా కథలు రాయించి పుస్తకాలు వేయడమే ఎక్కువగా జరుగుతోంది తప్ప పిల్లలను రచయితలుగా తీర్చిదిద్దడానికి కాదు. పిల్లలు ఎక్కువగా బాల సాహిత్యంలోనికి వస్తే వాళ్ళ భాష, ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలు, కష్టాలు, కన్నీళ్ళు మొదలైన విషయాలపైన పెద్దలకు మంచి అవగాహన కలుగి మరింత మచి సాహిత్యం సృష్టించడానికి దోహదం అవుతుంది.
10: ఈనాడు మనకున్న ప్రింటెడ్ పత్రికలు, అంతర్జాల పత్రికలు బాల సాహిత్యాన్ని, బాల సాహిత్యకారుల్ని ఎంతవరకు ప్రోత్సహిస్తున్నాయని మీరు భావిస్తున్నారు? మీ అనుభవాలను వివరించండి?
జ: పిల్లల కోసమే ప్రచురితమవుతున్న ప్రధానమైన ప్రింటెడ్ పత్రికలన్నీ దాదాపుగా మూతపడ్డాయి. వ్యక్తిగతంగా కొందరు అక్కడక్కడ నిర్వహిస్తున్నా వాటికి చందాదారులు గానీ, పాఠకులు గానీ చాలా తక్కువ. ప్రస్తుతం ప్రధాన వార్తాపత్రికలే బాల సాహిత్యానికి కొంత స్థలం కేటాయించి ప్రోత్సహిస్తున్నాయి. కానీ వాటికి ఇచ్చే స్థలం చాలా తక్కువ. చిన్న చిన్న కథలకు మాత్రమే అందులో స్థానం వుంది. ఇటువంటి సమయంలో బాలసాహిత్యాన్ని ఆదుకుంటున్నది అంతర్జాల పత్రికలే. పెద్ద పెద్ద కథలు, బాలల నవలలు అవే అందిస్తున్నాయి.
11: ఇప్పటి పిల్లలు కాకమ్మ కథలు వినే, చదివే పరిస్థితిలో లేరు. మరి మన బాల సాహిత్యకారులు ఇంకా పులులు, ఏనుగులు, కుందేళ్ళు మాట్లాడుకోవడాలు, రాక్షసుల గమ్మత్తులు, మాయలు మహత్యాల గురించి రాయడం ఎంతవరకు సమంజసం?
జ: ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు. పిల్లలు ఎప్పటికీ పిల్లలే. ప్రపంచవ్యాప్తంగా వాళ్లకు ఇష్టమైనవి పై కథలే. వాళ్లకే కాదు పెద్దలకు కూడా ఆ కథలంటేనే చాలా ఇష్టం. బాహుబలి, మగధీర లాంటి సినిమాలు నిరూపించింది అదే. ఇక్కడ సమస్య ఏమంటే రాసే శైలిలో, తీసుకునే వస్తువులో మార్పు రాకపోవడం వల్ల చెప్పిన కథలే మరల మరల చెబుతున్నట్లుగా కనపడుతోంది. దీనిని మనం గుర్తించాలి. నా వరకు నా కథల్లో ఎక్కువగా పక్షులు, జంతువులే ప్రధాన పాత్రలుగా ఉంటాయి. జానపద కథలు నాకిష్టం.
బాలసాహిత్యాన్ని గ్రేడ్లుగా విభజించి రాయకకపోవడం వల్ల ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పిల్లల్ని రెండో తరగతిలోపు, 5వ తరగతి లోపు, పదవ తరగతి లోపు అని ముందుగా విభజించుకోవాలి. రచయితకు తాను ఏ వయసు బాలలకు కథ రాస్తున్నానో స్పష్టంగా తెలిసి ఉండాలి. వయసును బట్టి చెప్పే విధానం, కథా వస్తువు మార్చుకోవాలి. పెద్ద పిల్లలకు మనం ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకునే కథలు అందించాలి. పెద్దపెద్ద కథలు, చిన్న నవలలు సృష్టించాలి. నేను అన్ని రకాల జానర్లలో పిల్లల కోసం కథలు రాస్తుంటాను. రాసిన మూడు నవలల్లో ఒకటైన ‘యువరాణి లాస్య’ జానపదం. కాకపోతే అందులో స్త్రీని ప్రధాన నాయకిగా పెట్టి శక్తివంతంగా తీర్చిదిద్దడం జరిగింది. మిగతా రెండు సాంఘిక నవలలు. ‘మిన్ను’ నవలలో పర్యావరణ పరిరక్షణ, పక్షులపై ప్రేమ ప్రధాన కథాంశంగా తీసుకుంటే, ‘చిన్ని – మిన్ను సాహస గాథా లో ఇసుక అక్రమ తవ్వకం వలన భూగర్భ జలం తగ్గి ఏ విధంగా పల్లెలు, పంటలు నాశనం అవుతాయి, స్వాతంత్రోద్యమంలో మన పూర్వీకులు చేసిన త్యాగాలు ఇతివృత్తంగా తీసుకున్నాను.
అలాగే రెండవ తరగతి లోపు చిన్నారుల కోసం వాళ్ళు సొంతంగా చదువుకునేలా వత్తులు లేకుండా, సంయుక్తాక్షరాలు లేకుండా అత్యంత సరళంగా గేయాలు, కథలు అనేకం జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా సృష్టించాను. అంతరించిపోతున్న జానపద బాలల సాహిత్యాన్ని వెలికి తీసి నేటి తరానికి అందిస్తున్నాను. ఇవన్నీ చిన్నారులను, బాలలను ఆనందపరచడమే గాక తెలుగు భాషను సులభంగా నేర్చుకొవడానికి ఎంతగానో సహకరిస్తున్నాయి.
12: ఇప్పటివరకు మీ కలం నుంచి వెలువడ్డ రచనల గురించి చెప్పండి.
జ: నా స్వీయ రచనలు, సంపాదకత్వాలు, సేకరణలు అన్నీ కలిపి దాదాపు 80 కి పైగా వుంటాయి.
సామాజిక రచనలు: |
1. మాయమ్మ రాచ్చసి |
2. నయాఫత్వా |
3. నేనూ మా అమ్మ |
4. మూడు అబద్ధాలు |
5. కందనవోలు కథలు |
6. టీచర్ చెప్పిన కథలు |
చరిత్ర: |
7. కర్నూలు జిల్లా చరిత్ర |
8. కొండారెడ్డి బురుజు |
9. కర్నూలు జిల్లా మహనీయులు |
సంపాదకత్వం: |
10. కర్నూలు కథ |
11. రాయలసీమ రచయిత్రుల కథలు |
12. రాయలసీమ ప్రేమ కథలు |
13. రాయలసీమ కరువు కథలు |
14. రాయలసీమ హాస్య కథలు |
15. రాయలసీమ వ్యంగ్య కథలు |
16. రాయలసీమ ఉపాధ్యాయ కథలు |
బాల సాహిత్యం: |
జానపద కథలు |
17.ఒకటి తిందునా రెండు తిందునా |
18.నాకు మూడు – నీకు రెండు |
19.నలుగురు మూర్ఖులు |
20.చిలక ముక్కు ఊడిపాయ |
21.నల్ల కుక్క |
22.సోమరిపోతు మహావీరుడు |
23.ఠింగురు బిళ్ళ |
24.నక్కబావ పిల్లిబావ |
25.తిండిపోతు దయ్యం |
26.దెబ్బకు ఏడుమంది |
27.నమ్మొద్దురా నాయనా దొంగనక్కల్ని |
28.బంగారు చేప గంధర్వ కన్య |
29.కిర్రు కిర్రు లొడ్డప్పా |
30.తెలుగువారి జానపద కథలు – (పై పుస్తకాలన్నీ కలిపి 125 కథలతో ఒకే పుస్తకంగా వేయబడింది) |
31.రాయలసీమ జానపద కథలు – (పై వాటిలో ఎంపిక చేసిన కొన్ని కథలు) |
బాలల నవలలు: |
32.మిన్ను |
33.చిన్ని – మిన్ను |
34.యువరాణి లాస్య |
బాలల గేయాలు: |
35.చిన్నారి గేయాలు |
36.మంచిమాట చెబుతా |
37.తేనె చినుకులు |
38.జానపద గేయాలు |
39.మెరుపుల వాన |
40.రేపటి వెలుగులు |
సామెతలు: |
41.బొమ్మలతో సామెతలు – 1 |
42.బొమ్మలతో సామెతలు – 2 |
పొడుపు కథలు: |
43. చెప్పుకోండి చూద్దాం |
44. కనుక్కోండి చూద్దాం |
బాలల కథల పుస్తకాలు: |
45. రాము టోపి |
46. మోసగాళ్ళ దేశం |
47. పుచ్చకాయ తపస్సు |
48. సముద్రంలో చిన్నచేప |
49. కోటకొండ మొనగాడు |
50. బూర |
51. భం… భం… చుక చుక |
52. పిండిబొమ్మ వీరుడు |
3. పిల్లలు కాదు పిడుగులు |
54. కమ్మని ఊహలు |
55. రేపటి వెలుగులు |
56. రెక్కల ఎలుక |
57. టక్కరికోతి |
58. అమ్మో దయ్యం |
59. చేయి చేయి కలుపుదాం |
60. చందమామలో కుందేలు |
61. మూడు కోరికలు |
62. గాడిద మెచ్చిన పాట |
63. గొడవపడకు – దెబ్బ తినకు |
64. పిల్లల హాస్య కథలు |
65. పిల్లలు మెచ్చిన వంద కథలు |
66. కథల ఖజానా |
67. బొమ్మలు చెప్పిన కమ్మని కథలు |
68. మరుగుజ్జు మాంత్రికుడు |
69. సులభంగా తెలుగు నేర్చుకుందాం |
70. ఒక వీరుని కథ |
71. గొప్పల కప్ప |
72.చిలుకముక్కు చిన్నోడు |
73. చందమామ చెప్పిన కథలు |
ఆంగ్లంలోకి అనువాదం అయిన పుస్తకాలు: 8 |
74. Indian Famous Folk Tales |
75. Indian Funny Folk Tales |
76. Young Talent |
77. Children’s Funny Tales |
78. Chandamama Stories |
79. Tales by Dolls |
80. Creative Thoughts |
81. Kurnool District History |
13: మీరు పొందిన అవార్డులు, సన్మానాలు తెలియజేయండి?
జ: అవార్డులు చాలా వరకు నాకు తక్కువే. వాటిపైన వ్యతిరేకత లేదు గానీ వాటి కోసం ప్రత్యేక దృష్టి పెట్టలేదు. అయినప్పటికీ నా సాహిత్యాన్ని చదివి మెచ్చుకొని కొంతమంది కొన్ని పురష్కారాలు ఇచ్చారు. అవి
- బాలసాహితీ రత్న (2011): నాకు మొదట వచ్చిన పురస్కారం ఇది. బాలసాహిత్య పరిషత్ వారు హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందజేశారు.
- అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023): వీరు అవార్డు ఇవ్వడమే కాకుండా ఒక రోజంతా నా సాహిత్యం పై సభను నిర్వహించి, అనేకమంది సాహితీవేత్తలు నా సాహితీ ప్రస్థానం గురించి రాసిన వ్యాసాలతో ఒక ప్రత్యేక సంచికను కూడా వెలువరించారు.
- తెలుగు బంధు పురస్కారం (2024): తెలుగు అభివృద్ధి సమితి రవీంద్ర భారతిలో అందజేశారు.
- కథాస్రవంతిలో స్థానం: అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు శాఖ వారు కథాస్రవంతి పేరుతో ఈనాటి తరానికి ప్రముఖ కథా రచయితలను పరిచయం చేయడం కోసం వారు రచించిన కథలలో కొన్నిటిని ఎన్నుకొని ఒకొక్క పుస్తకంగా ప్రచురిస్తూ వచ్చారు. అందులో భాగంగా నేను రచించిన 12 కథలతో ‘డా. ఎం. హరికిషన్ కథలు’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు.
- మంగాదేవి బాలసాహిత్య పురస్కారం: 2024 నవంబర్ 10వ తేదీన బాలకుటీర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గుంటూరులో ఇవ్వడం జరిగింది.
14: ఇంటా బయటా మీ సాహిత్యానికి ఎలాంటి ఆదరణ లభిస్తుంది?
జ: నా కథల్ని ప్రేమించే పాఠకులు అనేకమంది ఉన్నారు. కథ కింద నా పేరు లేకపోయినా కథను సులభంగా గుర్తుపట్టేయగల అభిమానులు కూడా వున్నారు. కరోనా సమయంలో ప్రపంచం స్తంభించి పోయింది. భయం రాజ్యమేలింది. పాఠశాలలు మూతపడ్డాయి. చదువులు అటకెక్కాయి. ఇటువంటి సమయంలో చిన్నారుల కోసం ఒక పక్క చదువు, మరొకపక్క వినోదం కలిగేలా ‘100 రోజులు 100 కథలు’ అనే పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ తయారు చేశాను. ఇది ఓన్లీ అడ్మిన్ గ్రూప్. రోజూ ఒక చిన్న కథ, గేయం, పొడుపు కథ, బొమ్మలతో సామెత.. పిల్లలు సొంతంగా ఇతరుల మీద ఆధారపడకుండా చదువుకునేలా తయారు చేసి పెట్టేవాన్ని. అలాగే పెద్దవాళ్లు చదివి పిల్లలకు చెప్పడం కోసం ఒక పెద్ద కథ అందించేవాన్ని. అప్పట్లో నాలుగు వేల మంది సభ్యులు ఇందులో చేరారు. గ్రూపులు 38 దాకా పెరిగాయి. వందరోజులు అనుకున్నది కాస్తా 200 రోజులు కొనసాగింది. ఇక గ్రూపు క్లోజ్ చేద్దాము అని అనుకుంటే మధ్యలో చాలామంది చేరారు కదా వాళ్ళు గ్రూపుని మరలా రిపీట్ చేయమని అడిగారు. దాంతో మరలా రెండవ బ్యాచ్ ప్రారంభించాను. అలా ప్రస్తుతం ఆగకుండా ఆరో బ్యాచ్ నడుస్తూ వుంది. ఇప్పుడు ఇందులో 29వేల మంది సభ్యులు ఉన్నారు. ఇది చాలు కదా బయట నా సాహిత్యానికి ఎంత ఆదరణ లభిస్తుందో తెలియడానికి. ఎవరైనాసరే నా నెంబర్ 9441032212కి మెసేజ్ చేస్తే చాలు గ్రూప్ లింక్ పంపిస్తూ ఉంటాను. ఒకరినుంచి మరొకరికి మౌత్ టాక్ ద్వారా వ్యాపిస్తూ వుంది. రెండు రాష్ట్రాలలోనే కాక తెలుగువాళ్ళు ఉన్న అనేక ప్రాంతాలకు ఈ గ్రూపు విస్తరించింది. ఇందులో నేను పెడుతున్నటువంటి కథలను, గేయాలను ఉపాధ్యాయులు తరగతి గదిలో తెలుగు భాష నేర్పించడానికి ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. ఇదంతా ఉచితమే. మరొక పక్క నా కథలను ప్రచురించే పబ్లిషర్స్ కూడా కొందరు ఉన్నారు. నేను పుస్తకం తయారీ ఖర్చు తప్ప వారి నుంచి ఎటువంటి పారితోషకము తీసుకోను. ఉచితంగానే ఇచ్చేస్తాను. కొత్త పుస్తకాల కోసం ఎప్పుడు అడుగుతూ ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి నష్టము నా పుస్తకాల వల్ల రావడం లేదని అర్థం అవుతోంది. పుస్తకాలన్ని పునర్ముద్రణలు వరుసగా పొందుతూనే ఉన్నాయి. ప్రతి పుస్తకం మీకు మార్కెట్లో దొరుకుతుంది.
నా శ్రీమతి డా. కర్నాటి చంద్రమౌళిని కూడా తెలుగులో ‘స్త్రీ చైతన్య కవిత్వం – పరిశీలన’ అనే అంశంపై పిహెచ్డి పూర్తి చేసింది. నాలాగే తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. మంచి ఉపన్యాసకురాలు, గాయని. స్వయంగా పాటలు రాసి పాడే శక్తి ఉంది. ఆమె కర్నూలు వైభవం పై రాసి పాడిన ‘కర్నూలుకు వస్తావా – మా ఊరిని చూస్తావా’ అనే పాట గానీ, రాయలసీమ కరువు గురించి రాసిన ‘సుగ్గికి పోతున్న తల్లీ’ అనే పాటగానీ చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె సహకారం నేను నిరంతరం ముందుకు పోపోవడానికి దోహదపడుతూ ఉంది. ఇదంతా ప్రేమతో ఇష్టంతో చేస్తున్న పని కాబట్టి మాకు ఎటువంటి శ్రమా ఉండదు. ఇంటా బయటా ఎటువంటి సమస్యలూ ప్రస్తుతం లేవు.
15: మీకు నచ్చిన ఒక బాల సాహితీవేత్త గురించి క్లుప్తంగా వివరించండి.
జ: ఇప్పుడున్న రచయితలు అందరూ నాకు మిత్రులు సన్నిహితులే. కాబట్టి వారి గురించి వద్దు. ఒక ప్రత్యేకమైన శైలిని సాధించి, పేరు కోసం కాకుండా నిజంగా పిల్లల కోసం రాసే రచయితలు అంటే నాకు చాలా ఇష్టం. కీర్తిశేషుల్లో, మా రాయలసీమకు చెందిన వారిని తీసుకుంటే చిత్తూరు జిల్లాకు చెందిన కలువకొలను సదానంద గారి బాలల కథలంటే నాకు చాలా ఇష్టం. పరుగులు పెట్టే ప్రవాహ శైలితో, కొత్త కొత్త ఇతివృత్తాలతో, ప్రయోగాలతో పిల్లల్ని పెద్దల్ని ఒకేసారి ఆకట్టుకుంటారు.
~
* మీ సమయాన్ని వెచ్చించి మీ గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.
జ: మీకూ, సంచిక యాజమాన్యం వారికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
డా. ఎం. హరికిషన్ – 9441032212
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.