[సంచిక కోసం డా. గుంజి వెంకటరత్నం గారితో సంచిక టీమ్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
కవి, రచయిత, సాహిత్య పరిశోధకులు డా. గుంజి వెంకటరత్నం:
డా. గుంజి వెంకటరత్నం ప్రసిద్ధ తెలుగు రచయిత, ఆయన అనేక పుస్తకాలు, ముఖ్యంగా కథా కావ్యాలు, నామ విజ్ఞానం, సూక్తి విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం మరియు సంస్కృత, ప్రాకృత భాషల చరిత్ర గురించి రాశారు. ఆయన ‘మహాభారత విజ్ఞాన సర్వస్వం’, ‘హంసవింశతి విజ్ఞాన సర్వస్వం’ వంటి పుస్తకాలు రచించారు. ఆయనకు ‘పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పురస్కారం’ కూడా లభించింది. ఈ విజ్ఞాన సర్వస్వ కళానిధి సాహితీ ప్రస్థానం గురించిన మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే చూద్దామా..
డా గుంజి వెంకటరత్నం గారిని చూడగానే ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది. ఆయన ఒక నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం లాంటివాడు. నిజానికి మహాభారత విజ్ఞానసర్వస్వం ఒంటరిగా తయారుచేయటం సామాన్యవిషయం కాదు. అలాంటిది, మహాభారతమేకాదు అనేక విజ్ఞాన సర్వస్వాలు తయారు చేసినవారు గుంజి వెంకటరత్నం గారు. కానీ, ఆయనకు ఇసుమంతయిన గర్వం, అహంకారాలు కనబడవు. పైగా, తాను గ్రహించింది ఇతరులతో పంచుకొనేందుకు ఆయన సంసిద్ధంగా కనిపిస్తారు. అందుకే వారితో సంభాషణ ఎంతో ఆనందకరమేకాదు, విజ్ఞానదాయకం కూడా!
~
* డా. గుంజి వెంకటరత్నం గారూ నమస్కారం. సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం.
డా. గుంజి వెంకటరత్నం: నమస్కారం.
~
1. మీ కుటుంబ నేపథ్యం వివరిస్తారా?
మా నాన్న కాస్తోకూస్తో చదువుకున్న వాడు అయినందున నన్ను, తమ్ముణ్ణి చదివించాడు. మేము మొదట్లో కలిచేడు ప్రాథమిక స్కూల్లో 4వ తరగతి వరకు చదివాము. అధ్యాపకులు భాస్కరరావు గారు, రమణయ్య గార్లు. 1948 ప్రాంతం అనుకుంటా మైకామైన్సు లేబర్ వెల్‌ఫేర్ ఫండ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేముండే మైన్సుకు సంబంధించిన కాలనీలోనే (పేరు పిళ్ళాగని) ఒక ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. మాథ్యూస్ మాస్టారు టీచరు. ఈ బడిలో 5వ తరగతి పూర్తి చేశాము. ఆ తర్వాత మా ఊళ్ళో పై చదువులు లేవు. మాకు 7 మైళ్ళ దూరంలో నున్న సైదాపురం అనే గ్రామంలోని హైస్కూల్లో మా నాన్నగారు మాథ్యూస్ మాస్టారు సహాయంతో చేర్పించారు. అక్కడ హాస్టల్లో ఉండి 10వ తరగతి వరకు చదివాము. ఆ తర్వాత ఎస్.ఎస్.ఎల్.సి, ఇంటర్, బియ్యే వరకు నెల్లూరు వి.ఆర్. హైస్కూలు, వి.ఆర్. కళాశాలలో విద్యనభ్యసించి 1961లో బియ్యే పూర్తి చేశాను. బియ్యే ఫైనలియర్‌లో ఉండగానే నాకు వివాహం అయింది. శ్రీమతి గుంజి ఆదిలక్ష్మీ.
బియ్యే పూర్తి కాగానే ఉద్యోగ ప్రయత్నం చేసి ఉంటే సులభంగానే ఉద్యోగం దొరికేది. అలా కాకుండా మైకా వ్యాపారంలో చేరడం జరిగింది. దానికి కారణం మా మామగారు శ్రీ ఆలకుంట అంకయ్య గారు మైకా మైన్సు కాంట్రాక్టు లీజు పద్ధతిలో నడిపిస్తుండడమే. అలా మూడు సంవత్సరాలు జరిగాయో లేదో నేను మైకా వ్యాపారానికి కొత్త కావడం, నాలో వ్యాపార లక్షణాలు లేకపోవడం కారణాలేమైనా గావచ్చు, ఆ స్వల్ప కాలంలోనే నేను చేతులు కాల్చుకొని అంటే నష్టాలు చవిచూచి బయటపడి ఇంటి పట్టుకు చేరుకున్నాను. అప్పటికి నాకిద్దరు కొడుకులు. గుంజి శ్రీనివాస వరప్రసాద్, గుంజి శ్రీనివాసబాబు.
నేను మైకా వ్యాపారం మానుకొని ఇంటికి వచ్చిన తొలి రోజుల్లో ఒక రోజు నన్ను దగ్గర కూర్చో బెట్టుకొని నీవు ఈ మైకా వ్యాపారంలో చేరకుండా ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉంటే, ఈ పాటికి నీ జీవితం ఒక గాడిన పడి ఉండేది. ఎక్కడయినా కష్టపడి పని చేయాల్సిందే. మనం శ్రమించి పనిచేస్తే ఫలితం అదే వస్తుంది. పరిశ్రమకు ప్రత్యామ్నాయం లేదురా. అంటూ నా చేతిలో పది రూపాలు పెట్టి, ఇప్పటికైనా నెల్లూరు ఎంప్లాయ్‌మెంట్‌లో నీ పేరు రిజిష్టరు చేయించుకో. త్వరలోనే ఉద్యోగం వస్తుంది అని ఉత్సాహపరుస్తూ పురమాయించాడు మా నాన్నగారు. అప్పుడాయన మాటలు నాకంతగా అర్థం కాకపోయినా ఒక్కటి మాత్రం బాగా అర్థమయింది. నేను వెంటనే ఉద్యోగం చూచుకోవాలి. నా కుటుంబ భారం మానాన్న మీద పెట్టవద్దు అని. అందుకే ఆ మరుసటి రోజే నెల్లూరు ఎంప్లాయ్‌మెంటులో పేరు నమోదు చేసుకుంటే అనతి కాలంలోనే వరంగల్ ఆజంజాహి మిల్లులో రైటరు ఉద్యోగానికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ విధంగా 1965లో వరంగల్ వచ్చి ఆజంజాహి మిల్లులో రైటరుగా చేరాను. అప్పుడు నా జీతం 92/- రూపాయలు. ఇది స్థూలంగా నేను వరంగల్ రాక ముందు మా కుటుంబ నేపథ్యం.
2. ‘హంసవింశతి’ పరిశోధనకు దారితీసిన పరిస్థితులను వివరిస్తారా?
జ: నేను వరంగల్ ఆజంజాహి మిల్లులో రైటర్‌గా ఉద్యోగిస్తున్నాననే గాని, అదెందుకో నాకు మనస్కరించ లేదు. అయినా తప్పనిసరి. ఎందుకంటే నాకిద్దరు పిల్లలు, భార్య, పోతన గారన్నట్లు నిజదారసుతోదర పోషణార్థం, ఇష్టం లేకపోయినా, కష్టంగానైనా ఉద్యోగం సాగిస్తూనే అధ్యాపక ఉద్యోగానికై దారులు వెదుకసాగాను. బి.యిడి. చేద్దామని కాలేజీలో అప్లికేషను పెట్టాను 1967లో. అదే సంవత్సరం ఓ.యు. పి.జి.సెంటరు ఆచార్య రామరాజు గారి ఆధ్వర్యంలో వరంగల్లులో స్థాపించడం జరిగింది. నేను యం.ఏ. తెలుగు విభాగంలో చేరి రెండు సంవత్సరాలు కోర్సు పూర్తి చేసి 1969లో ప్రథమ శ్రేణి పి.జి సెంటర్ ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాను. 1970 మార్చిలో సి.కె.యం. కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం. లెక్చరర్‌గా ఒక సంవత్సరం గడిచింది. నా మనసుకు నచ్చిన వృత్తిలో చేరినందుకు ఆనందంగాను, ఉత్సాహంగాను ఉన్నది. ఆ ఉత్సాహంలో పరిశోధన చేద్దామనే ఆలోచన. రామరాజు గారిని సంప్రదించాను. ఆయన సుప్రసన్నాచార్యులను కలవమని సలహా ఇచ్చాడు. వెంటనే కలిశాను. ఆయన ‘హంసవింశతి’ అనే కథా ప్రబంధాన్నిచ్చి దీన్ని చదివి వారం తర్వాత రా, డిస్కస్ చేద్దాం అన్నాడు. దాన్ని చదివిన తర్వాత మళ్ళీ ఆచార్యుల వారిని కలిశాను. ఆయన ఆ పుస్తకాన్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి? అని అడిగాడు. అవినీతిమయమయిన జారశృంగారానికి సంబంధించిన కథల పుస్తకమని చెప్పారు. అది కథల పరమైన విషయం. కాని హంసవింశతిలో ఆనాటి తెలుగు ప్రజల జీవిత విశేషాలు, శాస్త్ర విషయాలు బహుద్గా చెప్పబడి ఉన్నాయి. వాటిని గురించి నీవు పరిశోధన చేయాలి. అని ‘హంసవింశతిలోని విషయ పరిశీలన’ అనే టాపిక్ చెప్పి, అప్లై చేయమన్నాడు. ఓ.యు. ఇంటర్వ్యూలో అది చూచి ‘హంసవింశతి సమకాలీన జీవిత విధానం’ అనే అంశం మీద యం.లిట్.లో అడ్మిషన్ ఇచ్చారు. రామరాజు గారు గైడు. ఆ సంవత్సరం ఓయులో యం.లిట్. కొత్తగా ప్రారంభించారు. ఉత్సాహంతోనున్న నేను అనతికాలంలోనే రాత్రింబవళ్ళు కష్టపడి సిద్ధాంత వ్యాసం వ్రాసి సమర్పించి యం.లిట్. డిగ్రీ పొదాను. ఆ విధంగానేను ఓ.యు.లో ప్రప్రథమ యం.లిట్. డిగ్రీ హోల్డరునయ్యాను. నా తర్వాత అది యం.ఫిల్.గా మార్పు చెందింది.
యం.లిట్. తర్వాత మళ్ళీ సుప్రసన్న గారిని కలిశాను. ‘హంసవింశతి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు’ అనే టాపిక్ యిచ్చాడు. ఓ.యు.లో పి.హెచ్‌డి. గైడు సుప్రసన్నగారే. ఇవి స్థూలంగా హంసవింశతిపై పరిశోధనకు దారి తీసిన పరిస్థితులు.
3. విజ్ఞాన సర్వస్వ నిర్మాణం పట్ల ఆసక్తి కలిగించిన కారణాలు వివరించండి?
జ: హంసవింశతి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు అనే అంశంపై పరిశోధన చేసే క్రమంలో ముందుగా విజ్ఞాన సర్వస్వాలను అధ్యయనం ప్రారంభించాను. ఈ గవేషణలో తెలుగులో విజ్ఞాన సర్వస్వాల నిర్మాణం మిగతా భారతీయ భాషలతో పోల్చుకున్నా చాలా తక్కువగా ఉన్నాయనే విషయం తెలుసుకున్నాను. ఇంగ్లీషులో సాహిత్య పరమైన విజ్ఞాన సర్వస్వాలు బహుళంగానే ఉన్నాయి. అలాంటి విజ్ఞాన సర్వస్వాలు మనకు లేవనే విషయం అర్థమయింది. దానివల్ల మనము, మన భావితరాల వారు మన పూర్వతరాల వారి విజ్ఞానాన్ని ఎంతగా కోల్పోతున్నామో కూడా తెలిసివచ్చింది.
నాకు విజ్ఞాన సర్వస్వాల నిర్మాణం పట్ల ఆసక్తి కలగడానికి, అందులోను సాహిత్యపరమైన విజ్ఞాన సర్వస్వాల నిర్మాణమే చేపట్టడానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. మొదటిది హంసవింశతిలోని విజ్ఞానాంశాల మీద పరిశోధన. రెండవది ఆ పరిశోధనకు మార్గదర్శకులు ఆచార్య సుప్రసన్నాచార్య గారు. హంసవింశతిని ఒక విజ్ఞాన సర్వస్వంగా నిర్మించడంలో ఆయన చేసిన దిశానిర్దేశం.
1977లో పిహెచ్.డి. పట్టా పొందిన తర్వాత కూడా విజ్ఞాన సర్వస్వాల మీద జరిగిన విస్తృత అధ్యయనం కారణంగా, నేను పై పేరాలో చెప్పినట్లు మన తెలుగులో కొరతగా అనిపించిన సాహిత్య పర విజ్ఞాన సర్వసాల నిర్మాణానికి పూనుకున్నాను. మొదటిది హంసవింశతి విజ్ఞాన సర్వస్వం. రెండోది ప్రాచీన సమాజ విజ్ఞాన సర్వస్వం. మూడోది మహాభారత విజ్ఞా సర్వస్వం. ఇది మూడు సంపుటాలుగా దేనికదే ప్రత్యేక గ్రంథంగా నిర్మించిన విజ్ఞాన సర్వస్వము. మొదటి సంపుటం నామ విజ్ఞానం, రెండో సంపుటం సూక్తి విజ్ఞానం, మూడో సంపుటం శాస్త్రవిజ్ఞానం. ఇక నాలుగోది ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘భగవద్గీత-సంక్షిప్త విజ్ఞాన సర్వస్వం’. ఇవిగాక వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వాన్ని కూడా నిర్మించాను.
4. హంసవింశతి కథా ప్రబంధంపై ఒక పాఠకుడిగా మీ అభిప్రాయమేమిటి?
జ: హంసవింశతి అంటే హంస చెప్పిన ఇరవై కథల సంపుటి. ఈ కథలన్నిటిలోను విశృంఖల జార శృంగారం విచ్చలవిడిగా వర్ణించబడి ఉంది. ఇది సాధారణంగా పాఠకులకు కనిపించే విషయం. అందుకే ఈ గ్రంథం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో నిషేధింపబడింది. కాని లోనారసి చూస్తే.. పరపురుష సంగమాసక్తి అయిన నాయిక హేమావతి, ఆ ప్రాంత రాజయిన చిత్రభోగుని కలిసేందుకు పయనమైనప్పుడు, ఆమె నెచ్చెలియైన హంస ముందుకు వచ్చి పరపురుష సంగమం ప్రమాదకరమైనదనీ, అవమానకరమైనదనీ, తుచ్ఛమైనదనీ, నీచమైనదనీ, అనేక విధాలుగా నీతినుపదేశిస్తుంది. హంస మాటలు చెవికెక్కని హేమావతి మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండడంతో హంసనీత్యుపదేశం నిషేధ రూపంలో సాగింది. ఆమెను పొమ్మనే చెపుతూ ప్రియుని సంగమంలో ఉన్నప్పుడు భర్త వస్తే నీవెలా తప్పించుకుంటావు, ఏమి సమాధానం చెప్పుతావు, ఆ ధైర్యం, తెగువ, సమయస్ఫూర్తి ఉన్నాయా? అలాంటప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం కదా! ఇలా ప్రశ్నల పరంపరతో ఆమెలో భయాందోళనలు కలిగించి నెమ్మదిగా రోజురోజుకూ ఆమెలో మానసిక పరివర్తన కలిగేటట్లు చేస్తుంది. చివరకు హేమావతి నిజమే హంస చెప్పినట్లు ఇలాంటి నీచకార్యం నాబోటి కుల స్త్రీలకు తగినది కాదని మనసు మార్చుకొంటుంది. అదే విధంగా రాజు కూడా హేమావతిలో కలిగిన మానసిక పరివర్తనను గమనించి తాను కూడా మనసు మార్చుకొని సన్మనీషి అయినట్లు కవి చివరలో వర్ణిస్తాడు. దీనివల్ల హంసవింశతిపైకి జారశృంగార కథా ప్రబందకంగా కనిపిస్తున్నా, నిగూఢంగా పరిశీలిస్తే జారశృంగారం ప్రాణాపాయకకరం, సమాజహానికరం అనే నీతి ఉపదేశం. హంస చెప్పిన కథల్లో విధినిషేధ రూపాల్లో తెరచాటుగా మెరమెర లాడుతూ కనిపిస్తుంది. ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే ఇందులోని సమకాలీన విజ్ఞాన భాండాగారం మరో కోణం.
5. మీ పరిశోధనాత్మక రచనల్లో విజ్ఞాన సర్వస్వాలను గురించి చెప్పండి.
జ: ఈ ప్రశ్నకు సమాధానం రెండు మార్గాల్లో చెప్పవలసి ఉన్నది. ఎందుకంటే నా సాహిత్య పరిశోధన రెండు ప్రధాన మార్గాల్లో సాగింది. మొదటిది నా అభిమానాంశం విజ్ఞాన సర్వస్వాల నిర్మాణం. రెండోది మన ప్రాచీన సాహిత్యంలోని వివిధ సన్నివేశాలు, లేదా ఉపాఖ్యానాల్లోని విశేషాంశాలను నేటి మన సామాజిక దృక్కోణం నుండి సమన్వయ పూర్వకంగా విమర్శనాత్మకంగా విశ్లేషించి చెప్పడం.
మొదట విజ్ఞాన సర్వస్వాల నిర్మాణాన్ని గూర్చి వివరిస్తాను. హంసవింశతి-విజ్ఞాన సర్వస్వ నిర్మాణ క్రమంలో మొదట్లో కొన్ని అవరోధాలు కలిగాయి. తర్వాత సమాచార సేకరణ సందర్భంగా ఫీల్డు వర్కు అనేక గ్రామాలు, పట్టణాలు తిరిగి సమాచార సేకరణ. అందులోని ఇబ్బందులు, వ్యయప్రయాసలు. ఇలా అన్నిటిని అధిగమించి, ఆచార్య సుప్రసన్నాగారి మార్గదర్శనంలో హంసవింశతి-విజ్ఞాన సర్వస్వ నిర్మాణం జరిగింది. ఇది వ్రాతప్రతిలో నాలుగు సంపుటాల గ్రంథం. దాదాపు 4000 పైచిలుకు మనకు ఏ గ్రంథాల్లోని సమాచారం దొరకని అనేకాంశాల పదవివరణ ఇందులో ఉన్నాయి. హంసవింశతి-విజ్ఞాన సర్వస్వ నిర్మాణం సాహిత్య పరిశోధనా రంగంలో కొత్తబాటలు నేర్పరచింది. పరిశోధక ప్రముఖులు ఆచార్యులు రామరాజు, సి.నా.రె., సుప్రసన్నాచార్య, సంపత్కుమారాచార్య, హరిశివ కుమార్ మొదలైన ఆచార్యులు మరుగున పడిపోతున్న మన పూర్వుల విజ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో పాఠక లోకానికికందించిన తీరు వారి ప్రశంసకు పాత్రమయింది. 1989లో వెలువడిన మొదటి సంపుటానికి, 1995లో వెలువడిన రెండవ సంపుటానికి వీరు వ్రాసిన పీఠికల్లో ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ తర్వాత చాలాకాలం ఈ విజ్ఞానం సర్వస్వంలోని మిగిలిన రెండు సంపుటాలు ముద్రణకు నోచుకోక అలాగే ఉండిపోయాయి. ఆచార్య సుప్రసన్నాచార్యగారి ప్రోద్బలంతో ముద్రణ పొందిన రెండు సంపుటాలతో, మిగిలిన రెండు సంపుటాలను కలిపి ఏక సంపుటంగా అక్షర క్రమంలో నిర్మించిన హంసవింశతి విజ్ఞాన సర్వస్వాన్ని 2023లో ఎమెస్కో ప్రచురణ సంస్థ ప్రచురించి వెలుగులోకి తెచ్చింది.
వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వము-ఈ విజ్ఞాన సర్వస్వ నిర్మాణం గురించి, చాలా రోజులుగా గురువు గారు రామరాజుగారు నన్ను ప్రోత్సహిస్తుండేవారు. దానికి అనుకూలంగా మా కళాశాల ప్రిన్సిపాల్ డా.టి.సుధాకర్‌రెడ్డి గారు ఉత్సాహపరచసాగారు. వీరి ప్రోత్సాహంతో వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధపరిచాను. ఆ ప్రణాళిక ప్రకారం ఈ విజ్ఞాన సర్వస్వంలో 20 విజ్ఞాన శాఖలు 20 ప్రకరణాలుగా చేసి ప్రకరణాక్షర క్రమంలో (Sectional Alphabet) విషయసేకరణ, సెట్ చేయాల్సి ఉంది. ఇదంతా నేను ఉద్యోగంలో ఉండగానె 90-95వ మధ్య కాలంలో జరిగింది. ఆ తర్వాత సమాచార సేకరణలో అనేక కారణాలుగా ముందుకు జరగలేదు. 1995లో రిటైరైన సందర్భంగా నా పూర్వ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు పురప్రముఖులు కలిసి స్వర్ణ కంకణ (Bracelet) బహూకరణ, ‘‘విజ్ఞాన సర్వస్వ కళానిధి’’ అనే అవార్డు ప్రదానంలో జరిగిన అపూర్వ సన్మాన సభకు గురువులు రామరాజు గారు అధ్యక్షులు. ఆ సభలో ఆయన సభాముఖంగా ‘‘రత్నం నీవు వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వాన్ని నిర్మించి వరంగల్ రుణం తీర్చుకోవయ్యా’’ అని కోరారు. ఆయన కోరిక నేను ఆదేశంగా భావించి దాన్ని అతి కష్టం మీద పూర్తి చేసి 2008లో ప్రచురించాను. ఇది అప్పటి వరకు దాదాపు అన్ని జిల్లాలకు మండల సర్వస్వాల పేరుతో వెలువడి ఉన్న జిల్లా విజ్ఞాన సర్వస్వాలన్నీ విషయ క్రమంలోనున్న గ్రంథాలే. నేను నిర్మించిన వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వం మొట్టమొదట అక్షర క్రమంలో వచ్చిన మొదటి జిల్లా విజ్ఞాన సర్వస్వం. ఇది దీని ప్రత్యేకత. దీని నిర్మాణం ముందుగానే పేర్కొనట్లు ఆచార్య రామరాజు, సుప్రసన్న గారలే గాక మా ప్రిన్సిపాలు టి.సుధాకర్‌రెడ్డి ముద్రణకు ధనసాయం చేసిన అప్పటి మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు మొదలైన వారెందరో ఉన్నారు అందరికీ వందనాలు. ఇది అప్పటి ముఖ్యమంత్రి శ్రీయుత కిరణ్‌కుమార్ రెడ్డి గారిచే ఆవిష్కరింపబడడం మరో ప్రత్యేకత.
విజ్ఞాన సర్వస్వాల వర్గీకరణ (Classification) ప్రకారం, వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వము ప్రాంతీయ విజ్ఞాన సర్వస్వాల విభాగంలో చేరుతుంది. ఒక ప్రాంతీయ విజ్ఞాన సర్వస్వం, అందులోను ఒక జిల్లాకు మాత్రమే పరిమితమైన గ్రంథం విస్తృత రచనా ప్రణాళికతో A4 సైజులో 996 పుటల ఉద్గ్రంథంగా అక్షర క్రమం నిర్మింపబడడం ఆ రంగంలో అదొక ట్రెండ్ సృష్టించింది. వరంగల్ జిల్లాలోనే గాక అన్ని విశ్వవిద్యాలయాల్లోను మంచి స్పందన లభించింది. వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వంలో జానపద విజ్ఞానం మీద ఒక ప్రకరణం ఉంది. అదిచూచిన అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు వరంగల్‌లోని జానపద గిరిజన విజ్ఞాన పీఠం తరఫున రిసర్చ్‌ఫెలోగా నియమించి జానపద విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి కృషి చేయవలసిందిగా చెప్పాడు. ఆ సంస్థలో దాదాపు రెండు సంవత్సరాలు పనిచేసి (2010, 2011) జానపద విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో అకారాది క్రమంగా కొన్ని ప్రకరణాలు నిర్మించగలిగాను. ఆ తర్వాత కొన్ని అవాంతర కారణాలుగా నేను ఆ పదవికి రాజీనామా చేసి బయటకు రావడంతో ఆ ప్రాజెక్టు అంతటితో ఆగిపోయింది.
నేను విజ్ఞాన సర్వస్వాల మీద కృషి చేస్తున్న విషయం తెలిసిన అప్పటి తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య యాదగిరి గారు, హంసవింశతి తరహాలో ప్రాచీన సమాజ విజ్ఞాన సర్వస్వాన్ని నిర్మించవలసిందిగా కోరాడు. మన ప్రాచీన సాహిత్యంలో విజ్ఞాన సరస్వ లక్షణాలు అధికంగా ఉన్న పండితారాద్య చరిత్ర, సింహాసన ద్వాత్రింశిక, శుకసప్తతి, వాణీవిలాస వనమాలిక, హంసవింశతి, అనే కావ్యాలను ఎంపిక చేసుకొని, ఆ అయిదు కావ్యాల్లోని విజ్ఞానాంశాలను ఆరోపాలుగా తీసి, వాటికి విషయాన్ని సమకూర్చి అక్షర క్రమంలో క్రోడీకరించి ప్రాచాన సమాజ విజ్ఞాన సర్వస్వాన్ని నిర్మించాను. దాన్ని అకాడమీ తరపున 2012లో ప్రచురించారు.
ఈ సమయంలోనే దీనికి సమాంతరంగా మహాభారత విజ్ఞాన సర్వస్వం మీద కూడా పరిశోధన సాగుతుండేది. మహాభారత విజ్ఞాన సర్వస్వ నిర్మాణం నా జీవిత లక్ష్యం. ఇక ఇప్పుడు నడుస్తుండేది భగవద్గీత-సంక్షిప్త విజ్ఞాన సర్వస్వము (A shorter Encyclopaedia of Gita) .
6. మీ ఇతర పరిశోధనాత్మక రచనలను గూర్చి వివరించండి?
జ: ఇంత వరకు చెప్పినదంతా నా సాహిత్య పరిశోధనా నాణానికి ఒకవైపు మాత్రమే. (విజ్ఞాన సర్వస్వాల నిర్మాణము) ఆ నాణానికి మరోవైపు విమర్శనాత్మక విశ్లేషణాత్మక గ్రంథ రచనలు కూడా ఉన్నాయి. ఈ మార్గంలో రెండు ఆంగ్ల గ్రంథాలు కూడా వెలువడి ఉండడం విశేషం. ఇవి కూడా చాలానే ఉన్నాయి కాబట్టి, కొన్ని ముఖ్యమైన గ్రంథాల వివరాలు మాత్రమే ఇక్కడ చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఈ మార్గంలో విమర్శనాత్మక విశ్లేషణాత్మక గ్రంథ రచనలు దాదాపు 10కి పైనే ఉన్నాయి. ఇంకా అముద్రిత గ్రంథాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి జోలికి పోకుండా ముద్రిత గ్రంథాల్లో ముఖ్యమైన వాటిని గూర్చి చెపుతాను.
హంసవింశతి కావ్య స్వరూపం-విజ్ఞాన సర్వస్వ లక్షణాలు. ఇది నా పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథంలోని సిద్ధాంత ప్రకరణానికి సంబంధించింది. (1989) ఇందులో తొమ్మిది చాప్టర్లున్నాయి. హంసవింశతి ప్రబంధకర్త అయ్యలరాజు నారాయణామాత్యుని దేశకాల నిర్ణయం, వంశం, ఇతర రచనలు మొదలైన కవి వివరాలే కాకుండా, హంసవింశతిలోని కథా సంవిధానం, నీత్యుపదేశం, నిఘంటు లక్షణాలు, విజ్ఞాన సర్వస్వ లక్షణాలు మొదలైన విషయ వివరణలున్నాయి. చివరిలో గ్రంథ సంస్కరణావసరాన్ని గూర్చి కూడా సోదాహరణంగా వివరించడం జరిగింది.
విజ్ఞాన సర్వస్వాల మీద విస్తృత అధ్యయనం కారణంగా తెలుగులో వాటి నిర్మాణ పద్ధతులు, వర్గీకరణ, వ్యుత్పత్తి, ఆశయ ప్రయోజనాలు మొదలైన అంశాల ద్వారా విజ్ఞాన సర్వస్వాల స్వరూప స్వభావాలు తెలుసుకొనే విధంగా ‘‘తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు-విశ్లేషణాత్మక అధ్యయనము’’ అనే గ్రంథాన్ని రచించాను. అయితే దీన్నే ఆంగ్లంలో రాయవలసిందిగా కొంతమంది మిత్రుల ప్రోత్సాహంతో, ఆ తెలుగు గ్రంథాన్ని కొన్ని మార్పులు చేర్పులతో ఇంగ్లీషులో “Circle of Learning – A study in Encyclopaedia” అనే గ్రంథాన్ని వ్రాశాను. ఇది 1994లో ప్రచురింపబడింది. వెంటనే పై తెలుగు రచన కూడా 1995లో వెలగులోనికి వచ్చింది.
తెలుగు అకాడమీ తరపున ప్రాచీన విజ్ఞాన సర్వస్వం నిర్మిస్తున్న సమయంలో ఆ సంస్థ సంచాలకులు ఆచార్య యాదగిరి గారు విజ్ఞాన సర్వస్వాల మీద సరియైన విమర్శ గ్రంథాలు లేని కొతరను గమనించి ఆ మార్గంలో విజ్ఞాన సర్వస్వాలను పాఠకులు, ముఖ్యంగా విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే విధంగా గ్రంథ రచన చేయమని సూచించాడు. ఆయన సూచనానుసారం మొదట ‘‘తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు’’ అనే గ్రంథాన్ని రచించాను. ఇది ప్రత్యేకంగా తెలుగు విజ్ఞాన సర్వస్వాలను విశ్లేషణాత్మకంగా పరిచయం చేసే గ్రంథం. దీని తర్వాత విజ్ఞాన సర్వస్వాలు-వాటి నిర్మాణ పద్ధతులు అనే మరో గ్రంథం వ్రాసి ఇచ్చాను. ఇది విజ్ఞాన సర్వస్వాల నిర్మాణంలో కొంత సాంకేతికతను (Methodology) సంతరించుకున్న గ్రంథం. ఇందులో ప్రపంప వ్యాప్తంగా ఉన్న విజ్ఞాన సర్వస్వాల తీరు తెన్నులను బట్టి వాటి వర్గీకరణ, ఆ వర్గీకరణననుసరించిన నిర్మాణ పద్ధతలు ఏ విధంగా ఉంటాయో సోదాహరణంగా వివరించిన గ్రంథం. తెలుగు అకాడమీ వాళ్ళె ప్రచురించారు. (2012, 2014) ఈ తరహా గ్రంథాలు తెలుగులోనె గాదు ఇంగ్లీషులోను కనిపించలేదు. అందుకని ఆ గ్రంథాన్ని “Encyclopaedia and Its Making” అనే పేర రచించాను. అది 2015లో ముద్రణ పొందింది.
‘‘మహాభారతంలో ఇవి మీకు తెలుసా?’’ అనే గ్రంథం నా పరిశోధనాత్మక గ్రంథ రచనల్లో విశిష్ట రచన. మహాభారత విజ్ఞాన సర్వస్వాన్ని నిర్మించే క్రమంలో నా దృష్టికి వచ్చిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను, 27 సమస్యలను ప్రశ్నల రూపంలో శీర్షికలనేర్పాటు చేసి, ఆ సమస్యలకు నేటి సమాజానికి అన్వయిస్తూ పరిష్కారాలను చూపడం ఈ గ్రంథ రచనలోని ప్రత్యేకత. ఈ గ్రంథంలోని 27 వ్యాసాలు ‘‘మాండవ్య మర్యాద బాల నేరస్థుల పాలిట వరమా? శ్వేతకేతు మర్యాద ఆదిమ సమాజాల్లోని స్త్రీ పురుష సబంధాల నియంత్రణమా? దీర్ఘతముడి శాపం భారత మహిళల పాలిట పాపంగా పరిణమించిందా? ద్రౌపది ధర్మ విజితయా? అధర్మ విజితయా? ఇలాంటివే మిగతావన్నీ కూడా.
వ్యాసరత్న ప్రభావళి అనే గ్రంథం కూడా ఈ కోవలోనిదే. ఇందులో పరిశోధణాత్మక వ్యాసాలు 9 ఉన్నాయి. మహాభారతం శాస్త్ర కావ్యమా? కావ్య శాస్త్రమా? హంసవింశతి ఉపదేశాత్మక ప్రబంధమా? సాహిత్య పరిశోధనలో శాస్త్ర సాంకేతికాంశాలు జానపద వినోదం కోడి పందెం. ఇలా ఇందులోని తొమ్మిది వ్యాసాలు పరిశోధనా ఫలరూపాలే.
ఈ మార్గానికి చెందిన అముద్రిత రచనలు కూడా బహుళంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది హంసవింశతి సమకాలీన జీవిత చిత్రణము. ఆంగ్లేయ పాలనారంభంలో ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, వ్యాసరత్న ప్రభావళి 2 & 3 మొదలైన రచనలు మరికొన్ని కూడా ఉన్నాయి.
7. మహాభారత విజ్ఞాన సర్వస్వ నిర్మాణ విశేషాలను వివరించండి?
జ: మహాభారతం విజ్ఞాన సముపార్జన దృష్ట్యా మహాసముద్రం లాంటిది. మహాసముద్రం ఎన్నో అపూర్వ వస్తుసముదాయాన్ని, అనర్ఘ రత్న సంచయాన్ని గర్భీకరించుకొని ఉన్నట్లు మహాభారతం కూడా వేద విజ్ఞానం, గణిత, జోతిష, వాస్తు, ఆయుర్వేదాది శాస్త్ర విషయాలు, ధర్మం, దానం, యజ్ఞయాగాదులు, నోములువ్రతాదులు మొదలైన ఎన్నో విజ్ఞానాంశాలను తనలో ఇముడ్చుకొని యున్న ఒక మహాకావ్యము. అందుకే వ్యాసులవారే ఈనాటి పరిభాషలో చెప్పాలంటె మహాభారతాన్ని ఒక విజ్ఞాన సర్వస్వంగానే పేర్కొన్నాడు. ‘‘యదిహస్తి తదన్వత్ర యన్నేహస్తి నతత్‌క్వచిత్’’ అంటె ఏ విషయాలయితే మహాభారతంలో ఉన్నాయో అవి విశ్వమానవ సమాజాలంతటా ఉన్నాయి. ఏ అంశాలయితే ఇందులో లేవో అవి ప్రపంచంలో మరెక్కడా ఉండవు. ఒక విజ్ఞాన సర్వస్వానికి ఇంతకంటె గొప్ప నిర్వచనం ఏముంటుంది?
మహాభారతం మన భారతీయ సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు, సామాజిక జీవన విధానానికి మూల స్రోతస్సు. విజ్ఞాన సర్వస్వ లక్షణాలు సంపూర్ణంగా గల మహాభారతంలోని అన్ని రంగాలకు చెందిన విజ్ఞానాంశాలనన్నిటినీ సమీకరించి, ఒక క్రమపద్ధతిలో క్రోడీకరించి, ప్రతి అంశానికి తగిన సమాచారంతో వరుస క్రమలో (Alphabet System) చెప్పగలిగితే మన భారతీయమైన ఒక సామాజిక సాంస్కృతిక విజ్ఞాన సర్వస్వం తయారౌతోంది గదా. ఆ విధంగా మన పూర్వతరాలవారి విజ్ఞానం మనకే కాకుండా భావితరాల వారికి కూడా అందేబాటులోనికి వస్తుంది గదా అనే ఆలోచనలు మదిలో మెదలసాగాయి. సుప్రసన్నాచార్య గారిని సంప్రదించాను. ఆయన ప్రోత్సహించారు. అంతేగాదు అప్పుడే ఆయన టి.టి.డి. నుండి తెప్పించుకున్న మహాభారత గ్రంథ సంపుటాలు 15 నాముందుంచి, ఇవి తీసుకో నీ ప్రయత్నానికి ఉపయోగం అని చెపుతుంటే నానోట మాట రాలేదు. ఆశ్చర్యంలో అలాగే సారని చూస్తుండిపోయాను. అది గమనించిన సార్ మరేమీ ఆలోచించకు ముందు ఈ బుక్సు తీసుకొని నీ ప్రయత్నం మొదలు పెట్టు అవసరమైనప్పుడు నా సహకారముంటుంది. అంటూ ధైర్యాన్నిచ్చారు. ఆయన ప్రోత్సాహం నాలో కొండంత ధైర్యాన్ని నింపింది. ఎవరెస్టు శిఖరాన్నధిరోహించినంత ఆనందం కలిగింది. సార్ ప్రోత్సాహం, నా సంకల్పం భగవదనుగ్రహం ముప్పిరిగొని మహాభారత విజ్ఞాన సర్వస్వ నిర్మాణం నిర్వఘ్నంగా నిరాఘాటగా ఒక తపస్సులా సాగింది. ఇంతకు పూర్వమే తయారైయున్న ప్రణాళిక ప్రకారం మూడు సంపుటాల్లో నిర్మాణంగానున్న మహాభారత విజ్ఞాన సర్వస్వంలో మొదటి సంపుటం నామ విజ్ఞానం నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాను. ఒక విజ్ఞాన సర్వస్వ నిర్మాణం ప్రధానంగా అయిదు దశల్లోగాని పూర్తిగాదు. మొదటి దశలో ఆరోపాల ఎంపిక. రెండో దశలో ఒక్కో ఆరోపానికి తగిన సమాచార సేకరణ. మూడో దశ సమాచారాన్నంతటిని క్రమపద్ధతిలో క్రోడీకరించి అక్షర క్రమంలో సెట్ చేసుకోవడం. నాలుగోదశ డి.టి.పి. ప్రూఫ్ రీడింగ్. చివరి దశ ముద్రణ ప్రతి తయారీ ఇందులో టైటిల్ పేజీ, ఇన్నర్ టైటిల్, పీఠిక మొదలైవన్నీ కూర్చి ప్రచురణకు ప్రతిని తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రణాళిక ప్రకారం మహాభారత విజ్ఞాన సర్వస్వంలో వచ్చే చిన్నాపెద్ద పాత్రలన్నీ కలిపి దాదాపు 3000 పైచిలుకు పాత్రల పరిచయం ఉంటుంది. రెండో సంపుటంలో భారతంలోని వందల కొలది సూక్తుల్లో నేటి సమాజానికనువైన వానిని కొన్నిటిని (500 వరకు) ఎంపిక చేసి, ఆరోపాలుగా అక్షర క్రమంలో క్రోడీకరించి, సూక్తి సమయ సందర్భాలతో సహా, సామాజిక ప్రయోజనాలను కూడా వివరించి చెప్పడం జరిగింది. మూడో సంపుటం శాస్త్ర విజ్ఞానం. మహాభారతంలో ఆధ్యాత్మిక, ధర్మ, సమాజ, వాస్తు, గణిత, జ్యోతిష, భూగోళ, యోగ, సాంఖ్య మొదలుగాగల అనేక శాస్త్రాంశాల ప్రస్తావనలున్నాయి. వీటిలో ఒక్కో శాస్త్రానికి సంబంధించిన ఆరోపాల ఎంపిక, సమాచార సేకరణ, క్రోడీకరణ అక్షర క్రమంలో సెట్టింగ్ చివరిలో ముద్రణప్రతి. ఈ క్రమంలో మూడు వేరు వేరు సంపటాలుగా మహాభారత విజ్ఞాన సర్వస్వ నిర్మాణం, దాదాపు 10 సంవత్సరాలు సాగిన ఒక మహాయజ్ఞంలో పూర్తి అయింది. దీని నిర్మాణమే ఒక సమస్య అయితే. ముద్రణ సంస్థలు ముందుకు రాలేదు. చివరకు తెలుగు అకాడమీ వారి నుండి కూడా స్పందన లేకపోవడంతో మిత్రులు గిరిజామనోహరబాబు, సాంబమూర్తి గార్ల సహకారంతో ఎమెస్కో వారిని సంప్రదించగా వారు సహృదయముతో అంగీకరించారు. ఎమెస్కో హైదరాబాదు బ్రాంచి బాధ్యులు సహృదయులు డా.డి.చంద్రశేఖరరెడ్డి గారి సౌజన్యంతో మూడు సంపుటాలుగానున్న మహాభారత విజ్ఞాన సర్వస్వం, ఏక సంపుటంగా చక్కని ముఖచిత్రంతో 2019లో ప్రచురింపబడిరది. ఆయనకు మనఃపూర్వక ధన్యవాదాలు. మొదట నాలో ఉత్సాహాన్ని, ధైర్యాన్నినింపి, కార్యరంగంలోనికి దింపిన మా సుప్రసన్నాచార్యుల గారికి నమస్సుమనస్సులు. ఇంకా ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకున్న గిరిజామనోహరబాబు, సాంబమూర్తి మొదలైన ఎందో సహృదయులు అందరికీ వందనాలు.
8. మహాభారత విజ్ఞాన సర్వస్వానికి వచ్చిన స్పందనను గురించి చెప్పండి?
జ: మహాభారత విజ్ఞాన సర్వస్వానికి వచ్చిన స్పందన గూర్చి చెప్పే ముందు స్పందన పరంగా మరో విషయం కూడా ఇక్కడ చెప్పాలి. విజ్ఞాన సర్వస్వాల మీద పరిశోధన సాగిస్తున్న తొలి రోజుల్లో (1980వ దశకం) అప్పటికి నాకు లభించిన సమాచారంలో ‘‘విజ్ఞాన సర్వస్వాలు-విశ్లేషణాత్మక అధ్యయనం. మరో ఆంగ్ల గ్రంథం Circle of Learning-A Study in Encyclopaedia లను ప్రచురించడం జరిగింది. అప్పటికీరంగంలో అవి కొత్త రచనలే. జుఅషవషశ్రీశీజూaవసఱa మీద నేను చేస్తున్న పరిశోధనా కృషిని గుర్తించి స్పందించి “FUWAI” (Fellow United Writers Association of India) అవార్డుతో సత్కరించిన సాహితీ సంస్థ, United Writers Association of India, Chennai వారు. ఆ తర్వాత ‘కళాదీప్తి’ సాహితీ సంస్థ ‘‘విజ్ఞాన సర్వస్వ కళానిధి’’ అనే అవార్డుతో సత్కరించింది. ఈ విధంగా విజ్ఞాన సర్వస్వాల మీద నా పరిశోధనాత్మక రచనలకు మొదటి నుండి మంచి స్పందనే వస్తున్నది. ఆ తర్వాత వచ్చిన వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వానికి, ప్రాచీన సమాజ విజ్ఞాన సర్వస్వానికి కూడా మంచి స్పందనే లభించింది.
ఇక మహాభారత విజ్ఞాన సర్వస్వానికి తెలుగు రాష్ట్రాలనుండే గాక పొరుగు రాష్ట్రాల నుండి ఊహించనంత స్పందన వచ్చింది. 2019లో ఈ గ్రంథం వెలువడగానే మొదట స్పందించి నాకు టెలిఫోన్ చేసిన సహృదయులు రామకృష్ణ, విశాఖపట్నం. ఆయనొక కమర్షియల్ టాక్స్ అధికారి. తర్వాత చెన్నై నుండి వెంకట్రామిరెడ్డి (వ్యాపారి) తర్వాత చీరాల, విజయవాడ, గుంటూరు, కడప, పులివెందుల, హిందూపూర్, హైదరాబాద్, కరీంనగర్ ఇలా పలుచోట్ల నుండి రోజూ ఇప్పటికి ఆ మహాభారత విజ్ఞాన సర్వస్వానికి స్పందించిన వారు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నుండి ఆచార్య వెల్దండ నిత్యానంద గారు మాయిల్లు వెదుక్కుంటూ వచ్చి ఆ విజ్ఞాన సర్వస్వం మీద కొంత చర్చ జరిపి, వారు శాలువా కప్పి సత్కరించిన సంఘటన ఒక తీపి జ్ఞాపకం. డా. రేమెళ్ళ మూర్తి బెంగుళూరు, ఇస్రో స్పేస్ రీసెర్చ్ సెంటర్‌లో అధికారి మహాభారత విజ్ఞాన సర్వస్వంలో మూడు సంపుటాల మీద మూడు సుదీర్ఘమైన వ్యాసాలు రాసి పంపారు. ఇదంతా ఒక ఎత్తయితే హైదరాబాదు, హనుమకొండ, వరంగల్, నెల్లూరు మొదలైన నగరాల్లోని సాహిత్య సాంస్కృతిక సంస్థల నుండి కూడా విస్కృత స్పందన లభించింది.
మహాభారత విజ్ఞాన సర్వస్వానికి, విజ్ఞాన సర్వస్వాల మీద నేను వెలువరిస్తున్న పరిశోధనాత్మక గ్రంథ రచనలకు గుర్తింపుగా వరుసగా ఈ క్రింది సాహితీ సంస్థలు అవార్డులతో సత్కరిచాయి.
- వేద సంస్కృతీ పరిషత్ – మూసీ మాస పత్రిక బి.యన్.శాస్త్రి విశిష్ట పురస్కారం (2021)
- తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు) – కీర్తి పురస్కారం (2022)
- తెలంగాణ సారస్వత పరిషత్తు (హైదరాబాదు) – బ్రహ్మశ్రీ పోలూరి హనుమ్మజ్ఞానకీరామ శర్మ స్మారక పురస్కారం. (2023)
- సాహితీబంధు బృందం (వరంగల్లు) – ఓరుగల్లు సాహితీ కీర్తి పతాక పురస్కారం (2024)
ఇలా మహాభారత విజ్ఞాన సర్వస్వం కారణంగా ఊహించనంత స్పందన ఈనాటికీ వస్తూనే ఉన్నది. ఈ మధ్యనే తిరుపతి నుండి ఆయనొక రిటైర్డ్ బ్యాంకు మేనేజరట. మహాభారత విజ్ఞాన సర్వస్వాన్ని పుస్తకాల షాపు నుండి కొని, చదివి ఈ గ్రంథం మీద అరగంట సేపు ఫోనులో మాట్లాడినారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానె ఉన్నాయి. ఈ ఉద్గ్రంథం కారణంగా విస్తృత స్పందనతో పాటు, అలంకారికులు చెప్పినట్లు ‘‘యశసే అర్థకృతే, శివేతరక్షతయే, సద్వఃపర నిర్వృతయే’’ గ్రంథ రచనల వలన రచయితకు కలిగే ఈ ప్రయోజనాల్లో మిగిలినవన్నీ ఎలా ఉన్నా మొదటిది యశసే అంటే కీర్తి. రచనా రంగంలో ఒక గుర్తింపు పొందిన రచయితగా నాకు కీర్తి దక్కింది. చివరిది సద్యఃపర నర్వతి అంటే ఆత్మ సంతృప్తి. నా జీవిత లక్ష్యం ఈ గ్రంథం ద్వారా ఫలించినందుకు ఎంతో ఆత్మ సంతృప్తి కలిగింది.
9. పరిశోధనలో ముఖ్యంగా విజ్ఞాన సర్వస్వాల నిర్మాణంలో మీరు అనుసరించే విధాన పద్ధతులను గూర్చి చెప్పండి?
జ: పరిశోధనా పద్ధతులు రచయిత నిర్మించతలపెట్టిన విజ్ఞాన సర్వస్వ పరిధి, పరిమితిని బట్టి నిర్మాణ పద్ధతులు గూడా రకరకాలుగా ఉంటాయి. అంటే సామాన్య విజ్ఞాన సర్వస్వం, ప్రత్యేక విజ్ఞాన సర్వస్వం, ప్రాంతీయ విజ్ఞాన సర్వస్వం, బాలల విజ్ఞాన సర్వస్వం ఇలా దేని పద్థతులు దానికే. ఇప్పుడు వచ్చే వికీపీడియా లాంటి వాటి నిర్మాణం పైవాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
గ్రంథ రూపంలో సంపుటాలుగా వెలువడే విజ్ఞాన సర్వస్వ నిర్మాణాల్లో సాధారణంగా అనుసరించ వలసిన పద్ధతలనే నేను నా విజ్ఞాన సర్వస్వ నిర్మాణాల్లోను పాటిస్తున్నాను. వాటిలో గూడ మరీ ముఖ్యమైనవి. 1.విజ్ఞాన సర్వస్వ నిర్మాణ ప్రణాళిక. అంటే మనం నిర్మించ తలపెట్టిన విజ్ఞాన సర్వస్వ పరిధి పరిమితులకు లోబడి ప్రకృష్టమైన ప్రణాళికను ముందుగానె తయారు చేసుకోవాలి. ప్రకృష్టమైన ప్రణాళిక ఉంటేనే ప్రస్ఫుటమైన ఫలితాలు వస్తాయి. ఇది మొదటి దశ.
రెండోది ఆరోపాల ఎంపిక. అంటే మనం నిర్మించబోయే విజ్ఞాన సర్వస్వానికి సంబంధించి అందులో విజ్ఞానాంశాలను ఎన్నుకోవడం. ఆరోపాలు (Entry) ఎంపికలో నియమాలుంటాయి. క్రియా పదం, విశేషణము మొదలైనవి ఆరోపాలుగా తగవు. నామవాచకాలు, పేర్లు, స్థలాలు, సంఘటనలు మొదలైన వానిని ఆరోపాలుగా ఎంచుకోవాలి. ఆయా ఆరోపాలకు చాలినంత సమాచారం ఉండేటట్లు కూడా చూచుకోవాలి.
మూడోదశ సమాచారసేకరణ. మనం ఎంపిక చేసిన ఆరోపాలకు తగిన సమాచారాన్ని సేకరించి ఒక కార్డుమీద వ్రాసిపెట్టుకోవాలి. సమాచారం అధికారికంగా ఉండాలి కాబట్టి, సమాచార సేకసరణలో 1.అంతర్గత సాక్ష్యాధారాలు (Internal evidences) అంటే గ్రంథస్థ సమాచారం. సమాచారం ఏ గ్రంథం నుండి సేకరించామో దాని రెఫరెన్సు ఇవ్వాలి. రెండోది బాహ్య సాక్ష్యాధారం (External evidence) అంటే శాసనాలు, వైఫియత్తులు, స్థలపురాణాలు, ప్రముఖుల అభిప్రాయాలు మొదలైన పద్ధతుల్లో సేకరించిన సమాచారం. సాహిత్య పరమైన విజ్ఞాన సర్వస్వాలకు, హంసవింశతి లాంటి వాటికి తప్పఇతే మిగిలిన వాటికి బాహ్య సాక్ష్యాధార సమాచార సేకరణ అవసరం అంతగా ఉండదు.
నాలుగోదశ క్రోడీకరణ, సెట్టింగ్ అంటె ఆరోపాల వారిగా సేకరించిన సమాచారాన్నంతటిని ఒకచోటికి చేర్చి, సమాచార కార్డులను అక్షర క్రమంలో సెట్ చేసుకోవాలి.
ఇక చివరిది అయిదో దశ- ఈ దశలో అక్షర క్రమంలో సమకూర్చిపెట్టి గ్రంథానికి ముందు (Front Page) వెనుక (Back Page) సంబంధినది. అంటే ముఖపత్ర రచన (Title Page) లోపలిపేజి రచన (Inner Title) సెట్ చేసుకోవాలి. ఇంకా రచయిత ముందుమాట, కృతజ్ఞతలు, ప్రముఖుల అభిప్రాయాలు మొదలైనవన్నీ గూడా ఈ దశలోనే సమకూర్చుకోవాలి. ఇలా అయిదు దశల్లో ఒక విజ్ఞాన సర్వస్వం తయారు చేయవచ్చు. నేననుసరించే పద్ధతులు తీసుకొనే జాగ్రత్తలు ఇవి. అయితే ఇవే నిర్మాణ పద్ధతులు అన్నింటికి సరిపోవు. ఉదాహరణకు బాలల విజ్ఞాన సర్వస్వ నిర్మాణ పద్ధతులు వీటితో మరికొన్ని పద్ధతులను గూడా అనుసరించవలసి ఉంటుంది. బాలల విజ్ఞానమునకు తగినట్లు రచన, బోల్డు లెటర్స్ ప్రింటింగు. విజ్ఞాన సాధనాల (Knowledge Aids) కూర్పు, య్యోగమైన సమాచారం ఇలా దాని నిర్మాణ పద్ధతలు వేరుగా ఉంటాయి. అదేవిధంగా ఒక సంస్థ నిర్మించే విజ్ఞాన సర్వస్వ పద్ధతులు, వికీపీడియా లాంటి విజ్ఞాన సర్వస్వాల నిర్మాణ పద్ధతులు వేటికవే భిన్నంగా ఉంటాయి.
10. మీరు పరిశోధకులే గాక పద్య కవులని కూడా తెలుసు. ఆ దిశగా మీ సృజనాత్మక రచనా విశేషాలను వివరించండి.
జ: నా రచనా వ్యాసంగ నాణానికి బొమ్మవైపు పరిశోధనాత్మక రచనలైతే, బొరుసు దిశ సృజనాత్మక రచనలు. వీటిలోను మళ్ళీ రెండు వైవిధ్యాలు ఒకటి కవితలు, రెండు కథలు. వీటిలోని కవితల విభాగంలో 1.నీతిపద్య రత్నావళి. పద్యరచన. 1008 ఆటవెలది పద్యాల సమాహారం. తెలుగు బాల మహాశతకం. వేమన ప్రభావంతో నేటి సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, అత్యాచారాలు, దొంగలు, దోపిడీలు, ప్రభుత్వ ముసుగులో జరిగే స్కాములు, మొదలైన జనజీవితంలో ప్రతి రంగంలోని రుగ్మతలను ఎత్తిచూపుతూ, సునిశిత దృష్టితో విమర్శిస్తూ వాటిని తెలిసి మసలు కోవలసిందిగా తెలుగు బాలలకు హితవుగరుపుతూ ‘‘తెలసిమసలుకొనుమ తెలుగుబాల’’ అనే మకుటంతో వ్రాసిన 10008 పద్యాల మహాశతకమది.
రెండో పద్యరచన శ్రీమద్భగవద్గీత తెలుగు అనువాదం, తాత్పర్యసహితం. ఇది అనుకోకుండా అతిస్వల్పకాల వ్యవధిలోనె కేవలం రెండు నెలల్లో సంస్కృత భగవద్గీత 700 శ్లోకాలను దాదాపు అన్నీ తెలుగు తేటగీతి పద్యాలలో అనువదించి తాత్పర్యాలు సమకూర్చిన గ్రంథం. దీనికి నా జీవితంలో జరిగిన దయనీయ విపత్కర సంఘటన కారణం. అది మా ముదిమి వయసులో, నడివయస్కుడు మా చిన్నకొడుకు జి.వి. శ్రీనివాస బాబు మరణం. దాంతో చరమాంకంలోనున్న మా జీవితం చిన్నాభిన్నమై పోయింది. ఆ దుఃఖసాగరం నుండి బయటపడేందుకు నాకు దొరికిన ఉపకరణం భగవద్గీతా పఠనం. దుఃఖోపశమన సాధనంగా సాగిన గీతాపఠనం. రచనా వ్యాసంగా పరిణమించి గీతానువాదం పరిసమాప్తి వరకు నిరాఘాటంగా సాగింది.
ఇక మూడో రచన సూక్తి రత్న ప్రభావళి. సూక్తి అంటే మంచిమాట మనిషిని మంచిమార్గంలో నడిపించగల సాహిత్య సాధనం సూక్తి. ఈ గ్రంథంలో 153 సూక్తులున్నాయి. ప్రతి సూక్తి ఒక వచన కవితా ఖండిక.
కథా విభాగంలో కూడా మూడు రచనలున్నాయి. మొదటిది కాకతీయ పంచవింశతి (ఓరుగల్లు కథలు) ఇందులో కాకతీయుల చరిత్రకు సంబంధించిన 25 కథలున్నాయి. నాకు మొదటి నుండి తెలుగు రాజులు కాకతీయులన్నా, వారి మహిళలు కామసాని, బయ్యాంబ, మైలమాంబ, ముమ్ముడాంబ, రుద్రమదేవి మొదలైనవారి దానధర్మ విచక్షణ, గొలుసుకట్టు తటాకాల నిర్మాణం ద్వారా వాళ్లు చేసిన వ్యవసాయ శాఖాభివృద్ధి, సాహిత్యం, కళలపోషణ, మతసహనం మొదలైన అన్ని రంగాల్లో గావించిన ప్రజారంజక పాలన, సాధించిన అభివృద్ధి విజయాలు తెలుగువాళ్ళమయిన మనందరకు గర్వకారణం. ప్రాతఃస్మరణీయులు కాకతీయులు. చరిత్రకు దూరం కాకుండా ముఖ్య సన్నివేశాలను, వ్యక్తులను, సాధించిన యుద్ధవిజయాలను కేంద్రంగా చేసుకొని, కథా పఠనాసక్తి కల్గించేందుకు కొన్ని సన్నివేశాలను, వ్యక్తులను అవసరమైన చోట్ల కల్పిస్తూ, పాఠకుల ఆసక్తితో చదివే విధంగా కథా కథనాశైలిలో సాగిన కథా ప్రబంధం కాకతీయ పంచవింశతి-ఓరుగల్లు కథలు.
మరో కథా ప్రబంధం ‘కలిచేడు కథా విపంచి-మైకా మైన్సు కథలు’. మాది కలిచేడు గ్రామం. అరుదైన అభ్రకం ఖనిజ లభ్యతకు కేంద్రం. ఈ అభ్రకం ఖనిజం అండర్‌గ్రౌండ్ మైనింగ్, ఓపన్‌కాస్ట్ మైనింగ్ అనే రెండు ప్రధాన మార్గాల ద్వారా లభ్యమౌతుంది. ఇది దేశంలోనె ఒక అరుదైన పరిశ్రమ. కలిచేడు ప్రాంతమంతా అండర్‌గ్రౌండు మైనింగ్ విధానమే. ఇదొక కొత్త సబ్జెక్టు. నాకు తెలిసి ఇంతవరకు ఏ సాహిత్య ప్రక్రియలోను మైకా మైన్సును గూర్చిన రచనలు రాలేదు. మైకా మైన్సులో పనిచేసే వారు, వాటికి సంబంధించిన కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఇదంతా కార్మిక లోకం. వారిదో కొత్తలోకం వారి జీవన విధానం. మిగతా పల్లె జీవన విధానం కంటె కొంత ప్రత్యేకంగా ఉంటుంది. గని కార్మికులు ఎదుర్కొనె సమస్యలు, ప్రమాదాలు, కార్మిక హక్కుల కోసం పోరాట సమ్మెలు, కష్టాల్లోనె సుఖాలు వెదుక్కొనే వారి క్రీడావినోదాలు, కోడిపందాలు, పేకాట, రంకుబొంకుల వ్యవహారాలు, పండగలుపబ్బాలు, తీరునాళ్ళు తీర్థాలు, కర్మలు కళ్యాణాలు మొదలైన కార్మిక లోకంలోని సంస్కృతీ సంప్రదాయాలతో కూడిన 20 కథలు ఇందులో ఉన్నాయి.
ఈ కోవకు చెందించే ‘‘నా అమెరికా యానం’’ అనే గ్రంథం కూడా. మా మనుమడు చిరంజీవి వంశీకృష్ణ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో యం.ఎస్. పూర్తి చేసిన సందర్భంగా జరిగిన కాన్వోకేషన్‌కు ఆహ్వానం అందుకున్న నేను మా చిన్నకొడుకు శ్రీనివాసబాబు అమెరికా వెళ్ళాము. మా అమెరికా పర్యటన 2019 ఏప్రిల్. మధ్యలో దుబాయిలో నాలుగు రోజులుండి దుబాయిలో దర్శనీయ స్థలాలయిన దుబాయి మాల్, బటోకా షాపింగ్ కాంప్లెక్సు, జుబేరా పార్కు, దుబాయి ఫ్రేమ్, సాగరతీర ఆకాశహార్మ్యాల అందాలు, మెరీనాబీచ్ సెంటర్ సోయగాలు తిలకించాయి. బుర్జ్ ఖలీఫా, డెసర్ట్ సపారీ, గోల్డుసౌకు, డ్రైఫ్రూట్ డెక్, దుబాయి మ్యూజియం, బస్తాకియా (Old Dubai) దుబాయి ఫ్రీక్ (Sea Fort) జుమైరామాస్ మొదలైన దర్శనీయ స్థలాలన్నీ దర్శించాము. ఎడారిలో వెలసిన సుందర నగరం దుబాయి. అందమైన దుబాయి నిజంగా భూలోక నందనమే.
దుబాయి నుండి అమెరికా. అక్కడ మా మొదటి మజిలీ శాన్‌ఫ్రాన్సిస్కో. అక్కడున్న 10 రోజుల్లో గోల్డన్‌గేట్ బ్రిడ్జి, టుస్సాడ్స్ (మైనపు బొమ్మలు) మ్యూజియం. ఓడరేవు, సముద్రజల జంతువులు ఈల్సు సంరక్షణ కేంద్రం ఈల్సు పార్కు. సిలికాన్ వాలి, గోల్డెన్ గేట్ పార్కు, ఓపెన్ ఏర్ థియేటర్, ఆర్టు గాలరీ, చిత్ర ప్రదర్శనశాల, జపనీస్ పార్కు, శాన్‌ఫ్రాన్సిస్కో బొటానికల్ గార్డెన్ మొదలైన అనేక అపురూప దర్శనీయ స్థలాలను దర్శించాము.
రెండో మజిలీ మా మనుమడు వంశీకృష్ణ ఉంటున్న ప్రెసింటన్ సిటీ. అక్కడ నాలుగు రోజులుండి కాన్వోకేషన్ విశేషాలు, యూనివర్సిటీ అందాలు, నగర చుట్టు పక్కలనున్న అండర్‌గ్రౌండు పార్కు, దేవాలయాలు దర్శించాము.
మూడో మజిలీ ఫిలాడెల్‌ఫియా. అక్కడ దాదాపు 20 రోజులున్నాము. అక్కడ నుండే న్యూజెర్సీ వెంకటేశ్వరాలయం, స్వామి నారాయణ టెంపుల్, విశేషాలు. ఆమిష్‌విలేజ్, హర్లే చాక్లెట్ ప్రపంచం. కోమింగ్ గ్లాస్ మ్యూజియం. బఫెలో నగరం. ప్రపంచ అద్భుతాలు నయాగర జలపాతాలు, జెన్‌సీరివర్ జంట జలపాతాలు మొదలైన అద్భుతాలెన్నో చూశాము. తర్వాత మజిలీ లాస్ ఏంజిల్స్ హాలీవుడ్ రంగుల ప్రపంచం. బెవరెల్లీ హిల్సులోని సహజ సిద్ధమైన అంతర్జాతీయ సివెమా స్టూడియోలు, పెద్దపెద్ద రెస్టారెంట్లు, ఆ కొండల్లోనే సుందరనందనాలు, లోయలు, సరస్సులు, సినీ కళాకారులు సుందరహార్మ్యాలు. అక్కడ నుండే శాండియాగో నగరం. ఇది సముద్ర తీరంలో వెలసిన అందాలదీవి. దర్శనీయ స్థలం సీ వరల్డు (జలజంతు ప్రదర్శన శాల) ఒక్కటే. అయినా ఒకరోజంతా చాలలేదు. రకరకాల చేపలు, పీతలు సరోవరాలు, ఫ్లెమింగో కాటేజీలు, జలజీవుల పార్కులు, ఈల్సు షోలు, ఫిష్ మ్యూజియం కం జూ పార్కు. భూగర్భ నిర్మాణాలు డాల్ఫిన్ పెరేడ్ మొదలైన అద్భుతాలు అక్కడ చూశాము. తర్వాత మజిలీ న్యూయార్కు, వాషింగ్టన్. న్యూయార్కు లిబర్టీ స్టాచూ. వాషింగ్టన్ మాన్యూమెంట్. అబ్రహంలింకన్ మెమోరియల్, ఏరోనాటిక్ స్పేస్ మ్యూజియం, వైట్ హైజ్ మొదలైనవన్నీ దర్శించాము. నా అమెరికా యానమనేగ్రంథం కథా కథనశైలిలో నవలగా మలిచిన గ్రంథం.
11. ప్రస్తుతం మీ నిర్మాణంలోనున్న భగవద్గీత సంగ్రహ విజ్ఞాన సర్వస్వం గూర్చి చెప్పండి?
జ: మా చిన్న కుమారుని మరణంతో గీతానువాదం జరిగింది. అరవిందుల వారి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, గీత మీద నాకొక కాన్సెప్ట్ ఏర్పడిరది. ఆయనది దివ్యజీవనం. నాది శ్రమ జీవన సౌందర్యం. గీతలోని నిగూఢాంశాలను వివరిస్తూ, అవి నేటి సమాజానికి ఏ విధమైన మార్గదర్శనం చేస్తున్నవో వివరిస్తూ 45 వ్యాసాలతో ‘‘శ్రీమద్భగవద్గీత లోనారసి’’ (గీతావ్యాసవళి) అనే గ్రంథాన్ని రచించాను. అది ఇప్పుడు ముద్రణకు తయారుగా ఉన్నది. ఈ గ్రంథాన్ని వ్రాసే సమయంలోనె గీత ఇంకా పాఠకులకు చేరువ కావాలంటె దానికొక షార్టర్ ఎన్‌సైక్లోపిడియాగా తయారు చేయాలనే ఆలోచన కలిగింది. ఈ తరహా విజ్ఞాన సర్వస్వాలు ఇంగ్లీషులో చాలా వ్యాప్తిలో ఉన్నాయి. 9 యోగాల ఆరోపాల ఎంపిక, రెండు యోగాల సమాచార సేకరణ ఇప్పటి వరకు జరిగింది.
12. మీ భవిష్యద్రచనా ప్రణాళికను గూర్చి చెప్పండి.
జ: గ్రంథ రచనా విషయంగా నేను చేయవలసినవి ఇంకా చాలానె ఉన్నాయి. కాని ముదిమి ముంచుకు వస్తుంటె, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయినా వాటినధిగమించి నా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. కాని ఎక్కువ గంటలు పనిచేయలేకపోతున్నా. నా రచనా వ్యాసంగంలో భవిష్యత్ప్రణాళికలు-ఇప్పుడు నిర్మాణంలోనున్న గీతా సంగ్రహ విజ్ఞాన సర్వస్వాన్ని పూర్తి చేయడం. ఎంత లేదన్నా సంవత్సర కాలానికి పైనే పట్టవచ్చు. రెండోది నా తలంపుల్లో రూపుదిద్దుకుంటున్న భగవద్గీత ఆధారంగా ‘‘శ్రమజీవన సౌందర్యం’’ అనే సిద్ధాంత గ్రంథరచన. ఇవి రెండూ ముఖ్యమైనవి. తక్షణ కర్తవ్యాలు కూడా.
ఇకపోతే కొత్త రచనలను గూర్చిన ఆలోచనలు మదిలో మెదలకపోతే పదుల సంఖ్యలో అముద్రితంగా ఉన్న నా పూర్వ రచనల్లో కొన్నిటినైనా ప్రచురించే ప్రయత్నం చేయడం. అయితే ఈ ముదిమి వయసులో దేహము, మనసు సహకరించని పరిస్థితుల్లో ఈ నా ప్రయత్నాల్లో ఎంత వరకు కృతకృత్యుడినౌతానో.. ఏమో అంతా ఆ సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ కరుణాకటాక్ష వీక్షణా ప్రసాదం మీదనే ఆధారం.
13. మీ రచనా వ్యాసంగానికి మీ కుటుంబ సభ్యుల సహకారం గూర్చి వివరించండి.
జ: నా రచనా వ్యాసంగం నా జీవిత చరమాంకంలో ఊపందుకొనింది. నేను 1995లో ఉద్యోగ విరమణ పొందాను. అంతకుముందు 5 గ్రంథాలు మాత్రమే ప్రచురింపబడి ఉన్నాయి. 1995 తర్వాత దాదాపు 2005 వరకు పది సంవత్సరాలు నా రచనలు పూర్తిగా నిలిచిపోయాయి. దానికి కారణం మేము రత్నం హైస్కూల్ అనే పాఠశాలను స్థాపించడమే. 2005లో ఆ స్కూలు బాధ్యతలు మా పెద్దకుమారుడు జి.వి.యస్ ప్రసాద్‌కు ఒప్పించిన తర్వాత పది సంవత్సరాలుగా ఆగిపోయిన రచన తిరిగి పట్టాలెక్కింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 25 గ్రంథాల దాదాపు ముద్రణ పొంది వెలుగులోకి వచ్చాయి. వాటిలో మహాభారత విజ్ఞాన సర్వస్వం లాంటి ఉద్గ్రంథాలుండడం విశేషం.
ఇక నా కుటుంబ సభ్యుల సహకారం విషయం. నిరంతరం సాగే ఇలాంటి ఏ కార్యకలాపాలకయినా కుటుంబ సభ్యుల సహకారం అనివార్యంగా ఉంటుంది. లేని పక్షంలో ఇలాంటి కార్యకలాపాలు ఎక్కువ కాలం నడవవు.
నా కుటుంబ సభ్యులంటే 2005 నాటికి మా యిద్దరి కుమారులకు వివాహాలయినాయి. వారికి పిల్లలు కూడా. పెద్దకొడుకు రత్నం హైస్కూల్ మేనేజ్‌మెంట్ కారణంగా భార్యాపిల్లలతో రంగశాయిపేటలో స్థిరపడగా, చిన్నకొడుకు తెలంగాణ విద్యుత్ సౌధలో డివిజనల్ ఇంజనీరుగా ఉద్యోగం కాబట్టి భార్యా పిల్లలతో హైదరాబాదులో స్థిరపడ్డాడు.
ఇక మిగిలింది మేమిద్దరం వృద్ధ దంపతులం. మాకొక గృహ సంరక్షకురాలు (Home Caretaker). ఈ విధమైన మా కుటుంబ వాతావరణంలో నా నిరంతర రచనా వ్యాసంగానికి కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళ పూర్తి సహకారం ఉండేది. వారికి నా నిండు గుండె ఆశీస్సులు. ముఖ్యంగా మా శ్రీమతి ఆదిలక్ష్మి నా రచనలకు పూర్తి సహకారాన్ని అందించింది. ఆమెకు ప్రేమపూర్వక అభినందనచందనలు.
ప్రేమమ్-శాంతమ్-సుఖమ్.
~
* ‘సంచిక’ వార, మాస పత్రికల తరఫున మీకు కృతజ్ఞతలు.
జ: ధన్యవాదాలు