[సంచిక కోసం డా. చిటికెన కిరణ్ కుమార్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
సాహిత్య పిపాసితుడు కిరణ్ కుమార్..!!:
~
* సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన రచయిత, కవి డా. చిటికెన కిరణ్ కుమార్‌కు స్వాగతం. నమస్కారం.
డా. చిటికెన కిరణ్ కుమార్: నమస్కారం డా. ప్రసాద్ గారూ.
~
ప్రశ్న1. కిరణ్ కుమార్ గారు, మీ రచనా వ్యాసంగం వెనుక, మీ పూర్వీకుల సాహిత్యపరమైన చరిత్ర ఏమైనా ఉందా? వివరంగా చెప్పండి.
జ: నా రచన వ్యాసంగం వెనుక పూర్వీకుల చరిత్ర అంటే కొంతవరకు మా తాత చిటికెన నారాయణ గారు ఆధ్యాత్మికంగా ఉన్న విషయం గుర్తు చేసుకోవచ్చు. వృత్తి బాధ్యతలతో పాటు గీతాశ్రమం ద్వారా ఆధ్యాత్మిక చింతనతో ఆయన మనుగడ కొనసాగింది. కొన్ని పద్యాలు పాడిన విషయం కొంత వరకు తెలుసు. మా ఇంట్లో చెప్తుండేవారు. తను పాడిన పాటలు క్యాసెట్లలో రికార్డు చేసినవి కొన్ని విన్నాను. నా చిన్న వయస్సు ఉన్నప్పుడే మా తాతగారు పరమపదించారు. ఇకపోతే నాకు పెదనాన్న వరుస అయిన సినీ గేయ కవి, రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ గారితో సాహిత్యపరంగా నాకు సంబంధాలు కలిగినవి. ఒక రకంగా చెప్పాలంటే ఓర్పు, సహనం, సాహిత్య సృజన, సాహిత్యంలో క్రమశిక్షణ వంటివాటికి ఆయన ద్వారా నేను ఆకర్షించబడ్డాను. ఆయన రచించిన రచనలపై నేను పలు పుస్తకాలపై సమీక్షలు రాసాను. ఆయన రచనల్లో వస్తువు, భావ సారూప్యత, వైవిధ్యమైన విశ్లేషణ, ఆయన ఆశువుగా చెప్పే కవిత్వం నన్ను ఒక ప్రత్యేక కోణంలో ఆకర్షించింది. తనతో కలిసి కొన్ని సభలలో పాల్గొన్నాను. సిరిసిల్లలో పుట్టి పెరిగిన నేను చేనేత వృత్తి వ్యాపారంలో నిమగ్నమైనాను. నా భావాలకు అనుగుణంగా నాకు తెలియకుండానే నాలో సాహిత్యం మొలకెత్తింది. ఆలా సాహిత్యం చిన్నప్పటి నుంచి నాలో చదువుకునే రోజుల్లోనే పుస్తకాలు చదవడం, ముఖ్యంగా వార్తాపత్రికలు చదవడం పాఠశాల రోజుల్లో ఏకపాత్రాభినయం పలు విధాలుగా నా నడక సాగింది. పాఠశాల రోజుల్లో నుండి ఆలా వృత్తి వ్యాపారంలో సాగుతున్ననూ నా ప్రయాణం కలం తోనే సాగుతున్నది.
గిడుగు రామ్మూర్తి పంతులు భాష సేవా పురస్కారం మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారు అందజేస్తున్న సందర్భంగా..
ప్రశ్న 2. సంచిక అంతర్జాల వార/మాసపత్రికతో పరిచయం ఎప్పుడు ఎలా జరిగింది?
జ: కథలు పత్రికలకు రాస్తున్న సమయంలో కస్తూరి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంచిక మ్యాగజైన్‌కు కూడా ఒక కథ రాయడం జరిగింది. అది కరోనా సమయంలో ‘లవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ లాక్డౌన్’ పేరుతో రాశాను. ఆత్మీయులలో అనుబంధాలను, కొన్ని కుటుంబాలలో వారి వారి పరిస్థితులలో నెలకొన్నటు వంటి అనేక సంఘటనలను కథ రూపంలో నా వంతుగా ఒక కోణంలో చెప్పాలనుకున్నాను. సున్నితమైనటువంటి వస్తువుతో సంచిక మ్యాగజైన్‌కు కథ రాయడం జరిగింది. మురళీకృష్ణ గారికి అప్పట్లో నేను కథకుడిగా పరిచయమయ్యాను.
ప్రశ్న 3. పత్రికల పట్ల మీ అభిప్రాయం తెలియజేయండి.
జ: సాహిత్యపరంగా.. ఒక కవికి గాని రచయితకు గాని, రాజకీయపరంగా, సామాజికపరంగా పలు విధాలుగా అనేక అంశాలపై ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాన్ని పత్రికలు తెలియజేస్తాయి. సాహిత్య పరంగా గాని, సామాజికపరంగా కానీ ఇతర పరిశోధనాత్మక విషయాల ద్వారా కానివ్వండి ఏదైనా ఒక రచన పత్రికలో అచ్చు అయ్యింది అంటే అది ఆ సదరు కవి, రచయిత యొక్క రచనా శక్తి ని పత్రికా యొక్క యజమాన్యం ఒక కోణంలో సంపాదకులు, సహా సంపాదకులు గుర్తించటానికి ఒక వేదిక అవుతుంది. అలా ఆమోదయోగ్యమైన రచనలు బాహ్య ప్రపంచానికి తెలియజేయుటకు పత్రికలే వేదికలవుతాయి. పత్రికాముఖంగా ప్రచురితమైన రచన యొక్క శక్తితో పాటు రచయిత యొక్క ప్రతిభా పాటవాలకు స్థానం లభిస్తుంది. తద్వారా అనేక విభాగాలలో కొత్త బాటలు వేయడానికి అవకాశాలు కోకొల్లలు.
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారితో డా. చిటికెన కిరణ్ కుమార్
ప్రశ్న 4. మీ విద్యార్థి దశలో తెలుగు సాహిత్యం పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఎలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేవారు?
జ: తెలుగు సాహిత్యం ద్వారా ఎందరో మహానుభావులు తెలుగు గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి వారి యొక్క కృషి చెప్పుకోదగినది. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నందు గల సిరిసిల్ల ఒక ప్రత్యేకమైనది. జ్ఞానపీఠ పురస్కారంతో పాటు పలు కేంద్ర సాహిత్య పురస్కారాలు, అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని సాహిత్యకారులు సాధించినారు. అందులో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు నడయాడిన సిరిసిల్ల మానేరు గడ్డ ఒక ప్రత్యేకమైనది. సిరిసిల్లలో పుట్టి పెరిగిన నేను చదువుకునే రోజుల్లో సిరిసిల్ల ప్రాంతవాసిగా వారి గురించి విన్నాను. ఆ సాహిత్య అభిలాషతో విద్యార్థి దశలో పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవాడిని. భరతమాత ముద్దుబిడ్డలం అంటూ దేశభక్తితో కూడిన సందేశాత్మక గీతం నృత్య ప్రదర్శనలో, రాజకీయ నాయకుడిగా ఏకపాత్రాభినయం ఏడవ తరగతి చదువుతున్నప్పుడే పాల్గొన్నాను.
ప్రముఖ గజల్ కవయిత్రి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, జాతీయ కవి సినీగేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ లతో చిటికెన
ప్రశ్న 5. మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ఎలా మొదలైంది? ఈ విషయంలో మిమ్ములను అధికంగా ప్రోత్సహించినవారు ఎవరు?
జ: 8, 9 తరగతి చదివేటప్పుడు నాలో సాహిత్య బీజం బలంగా పడింది. సామాజిక పరిస్థితులపై ప్రముఖుల యొక్క సందేశాలు నన్ను ఆకర్షించాయి. నా కుటుంబ నేపథ్యంలోని స్వేచ్ఛాయుత వాతావరణం నన్ను ఒకే మార్గాన నడిపించకుండా స్వతంత్ర భావాలను నాలో ఐనుమడింపజేసింది. నాకున్న – ఏది నిజం.. ఏది అబద్ధం అనే అవగాహన నన్నే ప్రశ్నించింది. ఆ కోణంలో ప్రత్యేకంగా నన్ను చిన్నతనంలో ఏ ఒక్కరో ప్రోత్సహించిన వారంటూ ఎవరూ లేరు. అది ఒకరి స్ఫూర్తి వల్ల కొందరికి విజయ గాథల వల్ల సాహిత్యం వైపు మలుపు తిప్పింది. డిగ్రీ చదివే రోజుల్లో నేను రచించి కళాశాలకు అందించిన నివేదిక గ్రంథం ద్వారా కళాశాల అధ్యాపకులు విద్యార్థుల చేత అభినందనలు శుభాకాంక్షలు అందుకున్నాను. అలా దశలవారీగా నాలో ఉన్న కలం బయటపడుతూనే ఉంది. మా ఇంటిలో వంశపారంపర్యంగా వస్తున్న నేత వృత్తి వ్యాపారంలో కొనసాగుతూనే కళాశాల విద్యనభ్యసిస్తున్న సందర్భం ఒకవైపు అయితే సామాజిక పరిస్థితులలో.. కొంతమంది బతుకు జీవన పోరాటంలో వారి గాథలను ఆవిష్కృతం చేయాలనేటటువంటి ఆలోచనలో నన్ను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. 2019 సంవత్సరంలోపు ఆ తరువాత సామాజిక మాధ్యమం అయిన ముఖ పుస్తకం ద్వారా పరిచయమైన వరంగల్ జిల్లా మైలారం గ్రామంలో జన్మించిన శ్రీమతి దూదిపాల జ్యోతి రెడ్డి గారి జీవిత చరిత్ర ‘ఐనా నేను ఓడిపోలేదు’ ఆత్మకథగా వచ్చిన పుస్తకం నన్ను కొంతవరకు స్ఫూర్తిదాయకంగా సాహిత్య రంగం వైపు సాగించింది. ఏదో ఒక రంగంలో అని కాకుండా నాలో అంతర్గతంగా ఉన్న సాహిత్య కోణానికి తన ఆత్మకథ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కళాశాల విద్య అభ్యసిస్తున్న సమయంలో కొందరి విజయ గాథలు, కొన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు నన్ను చదివించాయి.
ఆచార్య ఎన్.గోపి గారితో రచయిత
ప్రశ్న 6. మీ రచనా వ్యాసంగం పట్ల ఇంట్లో మీకు ఎలాంటి ప్రోత్సాహం లభించేది?
జ: మా అమ్మానాన్నలు ఇద్దరూ చదువుకున్న వారు కావడం వల్ల నన్ను ఉన్నత స్థానంలో చూడాలనుకునేది వారి కోరిక. నిర్బంధితంగా నన్ను ఒకవైపు మాత్రమే సాగాలని వారు ఎప్పుడూ నన్ను కోరలేదు. వస్త్ర వ్యాపారంలో కొనసాగుతున్న మా నాన్న చిటికెన కనకయ్య గారు బి ఏ వరకు చదువుకొని రాజకీయంగా మున్సిపల్ కౌన్సిలర్‌గా, పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా సామాజికంగా సేవలు అందించారు. ఏకధాటిగా తను వృత్తిలో, రాజకీయంలో నిబద్ధతతో కొనసాగారు. సాగుతున్నారు కూడా.. ఆయన తన మార్గంలో తెచ్చుకున్న గుర్తింపు నేను స్వయంగా చూడగలిగాను. అప్పుడే నా ఆలోచన విధానంకు నన్ను కూడా సాహిత్య రంగాన కొనసాగడానికి దోహదమయింది. కుటుంబ నేపథ్యంగా ఆ ప్రోత్సాహం కూడా నా సాహిత్య అభిలాషకు తోడైనది.
శ్రీలంక దేశ ప్రతినిధులచే యు.ఎన్.ఐ. సి.సి.డి. ఆర్ – అంతర్జాతీయ పురస్కారం అందుకుంటున్న డా. చిటికెన కిరణ్ కుమార్
ప్రశ్న 7. నవల, నాటకం తప్ప, మీరు ఇంచుమించు అన్ని ప్రక్రియల్లోను రచనలు చేస్తున్నారు కదా! వీటన్నింటిలో మీకు ఇష్టమైన ప్రక్రియ ఏది? ఎందుచేత?
జ: కథా, కవిత్వం, వ్యాసం, విమర్శలలో నా రచనలు కొనసాగుతున్న విషయం మీ అందరికీ తెలిసినదే. నేను రాసిన రచనలు అనేకంగా పత్రికాముఖంగా అచ్చు అయినవి. నేను రాయదలుచుకున్న ప్రతి విభాగంలో ఒక సందేశం తప్పకుండా ఉండేట్లు చూసుకుంటాను. నేను రాసిన మొట్టమొదటి కథ లఘు చిత్రంగా నిర్మించబడినది. ఐదు ప్రభుత్వ నంది అవార్డులు అందుకున్న ప్రముఖ దర్శకులు శ్రీ గాదం శెట్టి ఉమామహేశ్వరరావు గారు పలువురు రచయితల నుండి చిత్ర నిర్మాణం కోసం కథలను ఆహ్వానించినప్పుడు నేను రాసిన కథ ఎంపిక కాబడినది. నేటి సమాజంలో జరుగుతున్న, కళ్ళకు కట్టినట్లు ఉన్నటువంటి సన్నివేశాలు ఆ కథలో ఉండడం ఒక ప్రత్యేకత. వ్యాసాల పరంగా సామాజిక నేపథ్యంలో చేనేతల బతుకుల జీవన చిత్రాన్ని, వారి గాథలను, అందులోని లోటుపాట్లను అనేక వ్యాసాల్లో రాశాను. పరిష్కార మార్గంగా వారికి కావలసినటువంటి సూచనలను నా పరిధిలో చెప్పగలిగాను. కవిత్వం విషయంలో చెప్పాలంటే వందల్లో కవితలు రాశాను ఇటీవల ‘మగ్గం మాట్లాడింది..!’ అనే కవిత చేనేతల జీవన చిత్రాన్ని తెలియజేసిన విషయం మీకందరికీ తెలిసిందే.
ఇకపోతే సమీక్ష, విమర్శ విభాగంలో ప్రముఖ సాహితీవేత్తలు రచించిన దాదాపు 85 పుస్తకాలకు నేను సమీక్షలు, విమర్శలు రాశాను. అన్ని విభాగాలను నేను సమపాళ్లలోనే చూడాలనే ఉద్దేశం నాది కాకపోయినప్పటికీ నాకు తెలిసి వచ్చిన సంఘటన గానివ్వండి, ప్రకృతి సిద్ధంగా నాకు లభించిన వస్తువు కానివ్వండి, కళ్ళ ముందు కదిలాడిన సమస్యలు కానివ్వండి ఇలా నాకు నచ్చిన, తెలిసి వచ్చిన, నేను చెప్పదలుచుకున్న విషయం సాహిత్య పరంగా ఏ విభాగానికి అనుకూలంగా ఉంటుందో ఆ విభాగంలో నా కలాన్ని కదుపుతాను. నిజానికి మీరన్నట్లుగా నవల, నాటకం మినహా అన్ని విభాగాలలో నా మార్కు చాటుకున్నాను. ఇకముందు మిగిలిన విభాగాలలో రాయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.
ప్రశ్న 8. మీ రచనల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు? మీరు ఏమి సాధించదలుచుకున్నారు? వివరంగా చెప్పండి.
జ: ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ, భారతదేశంలో స్త్రీ పాత్ర, స్థానం, ఔన్నత్యం లక్ష్యాలుగా ప్రధానమైనటువంటి నా రచనలు వెలువరిస్తూ ఉంటాను. సరిహద్దుల్లో ఎండనకా, వాననకా, రేయింబవళ్లు ఒక వైపు మన దేశాన్ని కాపాడుటకు సైనికులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని కాపాడుతుంటే.. మరోవైపు ప్రపంచ చరిత్రలో సాంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీటగా నిలిచిన మన దేశ సమాజంలో కొందరు యువత దారి తప్పుతున్న స్థితి, ప్రాచాత్య సాంస్కృతి, పెడదోవ పడుతున్న మార్గాలు అనేకంగా ఉన్నాయి. అత్యంత యువ సంపద గల మన దేశంలో అనేక నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంది. మారుతున్న పోటీ ప్రపంచంలో ప్రపంచానికి మార్గదర్శకంగా మన దేశ సమాజాన్ని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ నేపథ్యంలో నా వంతుగా కలాన్ని కదిలిస్తున్నాను. ఈ సందర్భంలో నన్ను గుర్తించి అంతర్జాతీయ ప్రపంచ శాంతి సంస్థలు నా నుండి సందేశాన్ని కోరుతూ వారు చేపట్టిన ప్రపంచ శాంతి శిఖరాగ్ర సదస్సులకు ఆహ్వానం పంపినారు. అంతర్జాల అంతర్జాతీయ విపణి ద్వారా దాదాపు 140 దేశాలతో పలుసార్లు వెబినార్లలో పాల్గొన్నాను. నా వంతుగా మన దేశం తరఫున సందేశాన్ని అందజేశాను.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి చంద్రయ్య గారి చేతుల మీదుగా సాహితీ పురస్కారం అందుకుంటూ
ప్రశ్న 9. మీరు కథలు, కవిత్వం, వ్యాసం కోసం ఎలాంటి వస్తువును తీసుకోవడానికి ఇష్టపడతారు? ఎందుచేత?
జ: సాహిత్య పరంగా నేను ఏ వస్తువును తీసుకున్న అది మానవీయకోణం, సామాజిక తత్వం ఉండేటట్లు చూసుకుంటాను. ఎందుకంటే మన రచన సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక మార్పును కొంటాను. కవిత్వం రూపంలో చెప్పాలనుకుంటే కప్పి చెప్పడం ఒక విధానం అయినప్పటికీ.. ఎక్కువ సమాచారాన్ని తక్కువ పదాలలో నిక్షిప్తం చేయడానికి ప్రయత్నిస్తాను.
ప్రశ్న 10. తెలుగుభాష /తెలుగు సాహిత్యం భవిష్యత్తును మీరు ఎట్లా ఊహిస్తున్నారు?
జ: తెలుగు భాష పై అభిమానంతోనే సాహిత్యంలో కొనసాగుతున్నాను. ‘తెలుగు భాషకు పట్టాభిషేకం’ అంటూ నా కవితను రాశాను ఇకపోతే నాకు లభించిన మొట్టమొదటి పురస్కారం మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి చంద్రయ్య గారి చేతులమీదుగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘సాహితీ పురస్కారం’ అందుకున్నాను.
ఎక్కడ చూసినా తెలుగే.. ఎక్కడ విన్నా తెలుగే.. అది యూనివర్సిటీలలో అయితేనేమీ, ఆఫీసుల్లో నైతేనేమీ ఎక్కడైనా తెలుగు స్వరం వినిపిస్తూనే ఉంది. మరి అది ఎక్కడ అనుకుంటున్నారు. మన రాష్ట్రం సరిహద్దు ప్రాంతాల్లోనో.. మనవారు మనదేశంలో ఇతర రాష్ట్రాల్లో వృత్తి బాధ్యతలు ఉపాధి నేపథ్యంగా వెళ్లిన ప్రాంతమో కాదు. ఖండాలు దాటి అగ్రరాజ్యమైన అమెరికాలో 350 భాషలలో 11వ స్థానంగా మన తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగి తెలుగు వెలుగు విశ్వవ్యాప్తం అయ్యింది. గత నాలుగేళ్లలో తెలుగు మాట్లాడే వారు, తెలుగు వారు వృద్ధి శాతం అధికంగా పెరిగి మన తెలుగు స్వరం వినబడుతుంది అంటే ఎంతో సంతోషమే కదా!!
భవిష్యత్తులో తెలుగు భాషను, సాహిత్యాన్ని పెంపొందించుటకు, కాపాడుటకు అనేక సాహిత్య సంస్థలు, సామాజిక మాధ్యమాలు వేదికలుగా కృషి చేస్తున్నాయి. నా వంతుగా ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ సంస్థను నడిపిస్తున్నాను. 300 పై చిలుకు కవులు, రచయితలు సమూహం నందు కలరు.
మాజీ గవర్నర్ శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు చే సన్మానించబడుతున్న డా. చిటికెన కిరణ్ కుమార్
ప్రశ్న 11. మీ ఖాతాలో ఇప్పటివరకు వున్న మీ పుస్తకాల గురించి, ఇతర రచనల గురించి వివరంగా చెప్పండి.
జ: 1) చైతన్య స్ఫూర్తి – చిటికన వ్యాసాలు 2) ఎ కేస్ స్టడీ ఆన్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ విత్ రిఫరెన్స్ టు సిరిసిల్ల టెక్స్టైల్ కంపెనీ [ప్రాజెక్ట్ రిపోర్ట్] 3) నాలుగు అముద్రిత పుస్తకాలు.
చిటికెన వ్యాస సంపుటి (చైతన్య స్ఫూర్తి)
చిటికెన రచించిన చైతన్య స్ఫూర్తి గ్రందాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ గారు తదితరులు.
ప్రశ్న 12. మీరు అందుకున్న అవార్డులు, పొందిన సన్మానాల గురించి వివరించండి.
జ: పలు బహుమతులు లభించాయి, చాలా సత్కారాలు జరిగాయి.
🌸 జపాన్ క్యూషు విశ్వవిద్యాలయం నిర్వహించిన వెబినార్, హెచ్.డబ్యూ.పి.ఎల్ హెవెన్లీ వరల్డ్ కల్చర్ అండ్ ప్లీజ్ రెస్టోరేషన్ ఆఫ్ లైట్, దక్షిణ కొరియా, సీయోల్ సంస్థ నిర్వహించిన ప్రపంచ శాంతి శిఖరాగ్ర సదస్సులు. ఏడవ వార్షికోత్సవం 8వ వార్షికోత్సవంలలో ఆన్లైన్లో పాల్గొన్న సందర్భంగా ప్రశంసా పత్రంలు.
🎖2021 ఆగస్టు 28న హైదరాబాద్ లో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ‘వే ఫౌండేషన్’ వారి ఆధ్వర్యంలో మాజీ గవర్నర్, శ్రీ కొణిజెట్టి రోశయ్య గారి చేతుల మీదుగా శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు భాష సేవ పురస్కారం-2021.
🎖2021అక్టోబర్ 28న రోజున HWPL దక్షిణ కొరియా సంస్థ నిర్వహించిన ప్రపంచశాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నందుకు మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారిచే హైదరాబాద్‌లో సన్మానం.
🏆2021 అక్టోబరులో హైదరాబాద్‌లో జలవిహార్ వేదికగా దసరా సమ్మేళనంలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిచే గౌరవ సన్మానాన్ని, సాంప్రదాయ మెమెంటో అందుకున్నాను
🔮2021 అక్టోబర్‌లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లమాటిక్ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో శ్రీలంక దేశ ప్రతినిధులచే ‘గ్లోబల్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ (యు.ఎన్.ఐ.సి.సి.డి.ఆర్.) అవార్డు అందుకున్నాను.
🎖 పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, కళా నిలయం సాహిత్య సాంస్కృతిక సంఘం వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి (న్యూ ఢిల్లీ) శ్రీ సముద్రాల వేణుగోపాలచారి గారి చేతుల మీదుగా డాక్టర్ సినారె సాహితీ పురస్కారాన్ని అందుకున్నాను.
🏆తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వేదికగా.. ‘వే పౌండేషన్’ తిరుపతి వారిచే వరల్డ్ అచీవర్- 2021 పురస్కారం.
🎖 అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ జి చంద్రయ్య గారి చేతులమీదుగా 2021 పురస్కారం.
👑 AK తెలుగు మీడియా ముంబై వారిచే ‘తెలంగాణ సాహిత్య రత్న’ బిరుదుపురస్కారం.
👑 సాహితీ బృందావన జాతీయ వేదిక, తెలుగు భాషా పరిరక్షణ సమితి, భారతీయ భాష మంచ్.. న్యూఢిల్లీ గార్లచే ‘కవి తేజ’ బిరుదు పురస్కారం.
🎖సూరేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పురస్కారం.
🎖నవభారత నిర్మాణ సంఘం వారిచే ‘శ్రీశ్రీ ప్రతిభా’ పురస్కారం.
🎖సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో కాళోజీ సాహితీ పురస్కారం-2021 అందుకున్నారు.
🌸 న్యూఢిల్లీ ఆది లీలా ఫౌండేషన్ వారిచే ‘జాతీయ సాహిత్య సేవ రత్న’ పురస్కారం.
🌸 న్యూఢిల్లీ భారతీయు భాషా మంచ్ వారిచే ‘రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ పురస్కారం’
🌸 మనం ఫౌండేషన్ వారి ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు
🌸 ప్రమీల శక్తిపీఠం హైదరాబాద్, తెలంగాణ మహిళ రచయితల సంఘం మహబూబ్‌నగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 2025 ఉగాది పురస్కారం.
🌸 100 పత్రికలలో రచనలు అచ్చు అయిన సందర్భంగా అంతర్జాతీయ మనం బుక్ ఆఫ్ రికార్డ్.
🌸 నేను రచించిన ‘ఓ తండ్రి తీర్పు’ లఘు చిత్రంనకు ఇంటర్నేషనల్ ఫిల్ మేకర్స్ అసోసియేషన్ వారిచే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం. పిన్ టివి వారి పురస్కారం
ఇలా సాహితీ సంస్థలచే 100కు పైగా సన్మానాలు, సత్కారాలు పొందాను. అవి నా బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తాయి.
మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి తదితరులచే సినారె సాహితీ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా..
ప్రశ్న 13. మీ కుటుంబ వృత్తి పరంగా మీ రచనా వ్యాసంగం ఎంతవరకూ ఉపయోగపడుతున్నది?
జ: కుటుంబ పరంగా, వృత్తిపరంగా సాహిత్యం నాకు ఉపయోగపడే విషయంలో సంతృప్తి గానే ఉంటుంది. అందుకు ప్రధానంగా చెప్పాలంటే ఇష్టంతో చేసిన పని ఏదీ కూడా కష్టం కాదు కదా! మరో విషయం చెప్పాలి అంటే.. నేను రాసిన ‘ఎగురుతోంది… ఎగురుతోంది మువ్వన్నెల జండా’ దేశభక్తి గేయం పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పిస్తున్నారు. ఒక రచయితగా అది నాకెంతో సంతృప్తినిచ్చింది. మన రచన మరొకరికి ఉపయోగపడుతుంది అంటే అంతకంటే సంతోషం ఏముంటుంది.
~
* ‘సంచిక’ వార, మాస పత్రికల తరఫున మీకు కృతజ్ఞతలు.
జ: ధన్యవాదాలు సర్.
డా. చిటికెన కిరణ్ కుమార్ +91 94908 41284
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.