Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంభాషణం: డా. సి.హెచ్. సుశీల అంతరంగ ఆవిష్కరణ

సంచిక కోసం ప్రముఖ సాహితీ విమర్శకురాలు డా.సి.హెచ్. సుశీల గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.

సద్విమర్శలో సాహితీ రత్నం.. డా.సి.హెచ్. సుశీల…!!

డా.సి.హెచ్.సుశీల

చిన్నప్పటి నుండి సాహిత్య వాతావరణంలో పెరిగి అప్పుడే ఎన్నో పుస్తకాలు చదివి, పుస్తకపఠనం ఒక యజ్ఞంగా కొనసాగించిన శ్రీమతి సి.హెచ్. సుశీల గారు, తెలుఁగు సాహిత్య రంగాన్ని తన వృత్తిగా ప్రవృత్తిగా ఎంచుకోవడం, ఎవరూ ఆశ్చర్య పడవలసిన విషయం కానే కాదు.

డా. సుశీల గారు పాఠం చెప్పినా, వ్యాసం రాసినా, సమీక్ష చేసినా, విమర్శ రాసినా, పుస్తకాలు రాసినా, ముందుమాటలు రాసినా, ఉపన్యసించినా, అవి ప్రత్యేకతను, ప్రామాణికతను సంతరించుకుని ఉంటాయి. అలాగే పరిశోధనా రంగంలో కూడా!

ఒక నిబద్ధత క్రమశిక్షణ పట్టుదల ఉన్న డా. సుశీల గారు, తన బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం, పరిశోధన, రిటైర్మెంట్ గుంటూరు పరిసర ప్రాంతాలలో జరిగినా, కొన్ని అవసరాలు, సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, డా.సుశీల  గారి రచనా వ్యాసంగం, పుస్తకాల ముద్రణా హైదరాబాద్ వచ్చిన తర్వాతనే వేగం పుంజుకుందని చెప్పాలి. స్త్రీవాదం అంటే కేవలం పురుషులను విమర్శించడం కాదని వాదించే నిఖార్సైన సాహితీ రత్నం డా.సుశీల గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం.

~~

1.సుశీల గారూ! మీరు తెలుగును ప్రధానాంశంగా తీసుకుని డిగ్రీ, పీజీ, పీహెచ్.డి. కూడా చేశారు. అందరూ డాక్టర్, ఇంజనీరు, ఐఏఎస్ వైపు దృష్టి మళ్ళిస్తున్న కాలంలో మీరు తెలుగు భాష వైపు మొగ్గు చూపడానికి గల కారణం ఏమిటి?

జ) నమస్కారమండీ డాక్టర్ ప్రసాద్ గారు! దాదాపు యాభై ఏళ్ల క్రితం పాఠ్యపుస్తకాలు తప్ప ఇతర కథలు నవలలు చదవడం తప్పు అనుకునే రోజుల్లోనే నాకు తెలుగు సాహిత్య పఠనం అనే అదృష్టం కలిగింది. మా నాన్నగారు రామాయణ భారత భాగవతాలు చాలా చాలా ఇష్టంగా చదువుకునేవారు. మాకు బోధించేవారు. మా అమ్మగారు ఆ రోజుల్లో ఎమెస్కో వారి ‘ఇంటింటి గ్రంధాలయం’కి ఐదు రూపాయలు చందా కట్టడంవల్ల చాలా ఉత్తమమైనటువంటి పుస్తకాలు ఇంటికి వచ్చేవి. ఆసక్తిగా వాటిని చిన్న వయసులోనే చదవడం మొదలు పెట్టడం వల్ల గొప్ప గొప్ప వారి పుస్తకాలు చదవడం జరిగింది. స్కూలు, కాలేజీకి వెళ్లి రావడం, ఇంట్లో పుస్తకాలు చదువుకుంటూ, రేడియోలో మంచి సాహిత్య కార్యక్రమాలు, పాత పాటలు వినటమే ఆ రోజుల్లో నాకున్న ఆసక్తి. కాబట్టి ప్రాథమికంగా నాకు తెలుగు పట్ల ఆసక్తి కలగడానికి తల్లిదండ్రులే కారణం.

2.మీరు తెలుగులో ఎం.ఏ. మరియు పరిశోధన చేసారు. మీరు చదువుకుంటున్న కాలంలో మీ గురువుల నుండి ఎలాంటి ప్రోత్సాహం ఉండేది?

జ) నేను విద్య నేర్పిన నా గురువులను ఎప్పటికీ మర్చిపోలేనండి. గుంటూరు జేకేసీ కాలేజీలో జూనియర్ ఇంటర్‌లో నేను స్పెషల్ తెలుగు తీసుకున్నప్పడు సర్వశ్రీ నాగళ్ళ గురుప్రసాదరావు గారు, కడియాల రామమోహన రాయ్ గారు, పులిచెర్ల సాంబశివరావు గారు, గుండవరపు లక్ష్మీనారాయణ గారు, గొల్లపూడి ప్రకాశరావు గారు మొదలైన వారు మాకు వచ్చేవారు. కేవలం పాఠ్యాంశాలే కాకుండా తత్సంబంధమైన కవుల గురించి కావ్యాల గురించి చెప్పేవారు. నేను లైబ్రరీకి వెళ్లి ఆ పుస్తకాలు చదివేదాన్ని. నిజం చెప్పాలంటే బి.ఏ.లో ఉన్నప్పుడే గురజాడ, రాయప్రోలు, శ్రీ, నారాయణరెడ్డి, జాషువా, ఆరుద్ర, త్రిపురనేని, తాపీ ధర్మారావు, కుందుర్తి వంటి వారి రచనలు చాలా వరకు చదివాను. తర్వాత ఎమ్.ఏ. మొదటి సంవత్సరం ప్రొ. జోగారావు గారు, ప్రొ. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు, ప్రొ. బొడ్డుపల్లి పురుషోత్తం గారు వద్ద చదువుకున్నాం. రెండో సంవత్సరంలో ఉండగా నాగార్జున యూనివర్సిటీ ఏర్పడింది. అప్పుడు ప్రొ. తూమాటి దొణప్పగారు, యార్లగడ్డ బాలగంగాధర రావు గారు వచ్చారు యూనివర్శిటీకి. మా మొదటి బ్యాచ్ అదృష్టం ఏమిటంటే సాహిత్య చరిత్ర (History of Telugu Literature) కొర్లపాటి శ్రీరామ మూర్తి గారి వద్ద, భాషా చరిత్ర (Language and Linguistics) దొణప్పగారి వద్ద చదువుకోవడం. ఎం.ఫిల్. ‘కిన్నెరసాని పాటలు’ కూడ (యూనివర్శిటీ మొదటి బ్యాచ్) ప్రొఫెసర్ దొణప్ప గారి దగ్గర చేశాను. చాలా అరుదుగా లభించే దొణప్ప గారి ప్రశంసలు కూడా పొందగలిగాను.

‘పడమటివీథి’ కవితా సంపుటి ఆవిష్కరణ సభలో ఆత్మీయులు పెనుగొండ లక్ష్మీనారాయణ, పాపినేని శివశంకర్ లతో.

3.విశ్వనాథవారి ‘కిన్నెరసాని పాటలు’ మీరు ఎం.ఫిల్. కోసం ఎన్నుకున్న అంశం కదా! మీరు ఆ అంశాన్ని ఎన్నుకోవటానికి దానిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? దానిని ఎంచుకోవటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?

జ) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి మనవరాలు రాజేశ్వరి నాకు 8వ తరగతి నుండి క్లాస్‌మేట్. చాలా మంచి స్నేహితురాలు. వాళ్ళింట్లో చాలా పుస్తకాలు ఉండేవి. పక్కపక్క ఇళ్లలో ఉండటం వల్ల పుస్తకాలు ఇచ్చి పుచ్చుకుంటూ, విపరీతంగా చదివేవాళ్ళం, చర్చించుకునేవాళ్ళం. అప్పుడప్పుడు విజయవాడ నుంచి విశ్వనాథ వారు కూతురింటికి వస్తూ ఉండటం వల్ల ఆయనను చూసే, మాట్లాడే అదృష్టం కూడా కలిగింది. మనమరాలు రాజేశ్వరితో తన కొడుకు శ్రీ పావనిశాస్త్రికి వివాహం చేశారు ఆయన. ఆ కుటుంబంతో 50 ఏళ్ల నుంచి నా స్నేహం (వారిద్దరు మరణించినా, ఇప్పటికీ వారి పిల్లలు ‘పిన్ని’ అని నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ, తరచుగా ఫోన్ చేస్తూ, కలుస్తూనే ఉంటాము).

ఇక ఎంఫిల్ విషయం. ఎం.ఏ.లో ఉండగా ఒకసారి సెమినార్ పేపర్ కోసం ‘ఆధునిక సాహిత్యంలో ఊహా ప్రేయసులు’ అన్న అంశం మీద విశ్వనాథ వారి కిన్నెరసాని, దేవులపల్లి వారి ఊర్వశి, నండూరి వారి ఎంకి గురించి రాశాను. 1976 లో ఎం.ఏ. ద్వితీయ సంవత్సరంలో వుండగా విశ్వనాథ వారు మరణించారన్న వార్త. వారి కుటుంబంతో అనుబంధం ఉండటం, కిన్నెరసాని పాటలు నాకు చాలా ఇష్టంగా ఉండటం, చదివి ఒకసారి సెమినార్ పేపర్ రాయటం వల్ల ఎం ఫిల్ కోసం ఆ అంశాన్ని తీసుకోవడం జరిగింది.

పడమటి వీధి ముఖచిత్రం

4.మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ఎలా మొదలైంది? మీ మొదటి రచన ఏ పత్రికలో ప్రచురింపబడింది? అప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు?

జ) ఏదో సరదాగా ఎనిమిదో క్లాస్‌లో ఉండగానే ఒక కథ రాసి, ఎవరికీ చూపెట్టకుండా దాచుకున్నాను. దాని పేరు ఏమిటో గుర్తులేదు. తొమ్మిదో తరగతిలో ‘ కైలాసంలో కాలం మార్పు’ అనే హాస్య నాటిక రాసాను. నేను, తమ్ముడు, చెల్లి, కొందరు స్నేహితులతో కలిసి రెండు మూడు సార్లు ప్రదర్శన కూడా చేశాం. దాన్ని పేరడీ రచన అని అంటారని నాకు అప్పుడు తెలియదు. ఎం.ఏ. మొదటి సంవత్సరంలో ఉండగా ‘వనిత’ మాసపత్రికకి రాసిన ‘ఏ మగువ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నారీ జాతి చరిత్ర సమస్తం పురుష సేవా పరాయణత్వం’ అని శ్రీశ్రీ దేశచరిత్రలుకు ప్యారడీ ప్రచురింపబడింది. 1976లో అప్పుడు అది ఒక సంచలనమే అయింది. నాటి విజయచిత్ర పత్రికలో ‘సినిమా కథ- పరిణామం’ అనే అంశం మీద పోటీ ప్రకటించారు. నేను రాసిన వ్యాసానికి ద్వితీయ బహుమతి వచ్చింది. న్యాయనిర్ణేత ప్రముఖ సినీ రచయిత డి.వి.నరసరాజు గారని తెలిసి ఎంతగానో ఆశ్చర్యానందాలు. తరువాత ఎక్కువగా కవితలు ప్రజాసాహితి, వనిత, విశాలాంధ్ర, విశ్వరచన, తెలుగు విద్యార్థి, ఎక్స్ రే పత్రికలలో వచ్చాయి.

5.మీరు పిహెచ్.డి. కోసం ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యం ఎంచుకున్నారు. వారి సాహిత్య పరిశోధన చేయడానికి ప్రయత్నించడానికి ప్రధాన అంశాలు ఏమిటి ? వెంకటరమణ గారి సాహిత్య పరిశోధనలో మీ పరిశీలనకు వచ్చిన ప్రధాన అంశాలు ఏమిటి?

జ) పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, బాధ్యతలతో పదేళ్ళ తర్వాతనే పి.హెచ్.డి. చేయాలనుకున్న కోరిక, తీరిక కలిగింది. అప్పటికే ముళ్ళపూడి వారి పుస్తకాలు అన్నీ చదివేసి, ఆ ప్రభావంతో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి లలో పేరడీలు రాసివున్నాను. ముళ్ళపూడి వారి సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, ప్యారడీ, సెటైర్ చాలా ఇష్టం. కానీ ఆయనను కేవలం హాస్య రచయిత అనడం అన్యాయం అనిపించింది – వారి ఆకలి ఆనందరావు, యువరాజు మహారాజు, కానుక వంటి కథలు చదివాక. బుడుగులో చిన్న పిల్లవాడి స్వచ్ఛమైన మనస్తత్వం, ఋణానందలహరిలో అప్పుల అప్పారావు హాస్యం, రాజకీయ బేతాళ పంచ వింశతిలో రాజకీయాలు, విక్రమార్కుని సింహాసనంలో సినిమా సిత్రాలు, జనతా ఎక్స్‌ప్రెస్‌లో మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలు, రాధాగోపాలంలో అందమైన రాధ, బామ్మ మొదలైన జీవం తొణికిసలాడే పాత్రలు – మరింతగా పరిశోధించాలి అనుకున్నాను. ఆ సందర్భంగా మద్రాస్ వెళ్లి రమణ గారి ఇంటిలో ఆతిధ్యం పొంది, బాపు గారి గదిలో వారి రంగుల ప్రపంచాన్ని అబ్బురంగా చూసి పొంగిపోయాను నా అదృష్టానికి.

తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎ.బి.కె. ప్రసాద్, నాటి డిప్యూటీ కలెక్టర్ నరసింహం గారు.

6.మీ రచనా వ్యాసంగంలో కథలు/కవిత్వం/నవల వీటికి చోటు ఉన్నట్టు లేదు. ఎందుచేత?

జ) చెప్పానుగా డాక్టర్ గారు! మొదట కథ, నాటకమే రాశాను. తర్వాత దాదాపు ఇరవై పైగా కవితలు, పది కథలు రాసాను. కానీ చదువుకొనేటప్పుడు గాని, బోధనా రంగంలో గానీ నాకు ‘క్రిటిసిజం’ పేపర్ చాలా ఇష్టమైనది. ఆచార్య నాగార్జునా యూనివర్శిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో బి.ఏ. వారికి మొదటి సంవత్సరం కొన్ని పాఠాలు, రెండో సంవత్సరం పాఠాలతో పాటు సహ సంపాదకురాలిగా వ్యవహరించాను. మూడవ సంవత్సరం ‘విమర్శ’ పాఠాలు రాసాను. ప్రస్తుతం విమర్శవ్యాసాలే ఎక్కువగా రాస్తున్నాను.

నా అభీష్టం మేరకు ఎం.ఏ., ఎం.ఫిల్. వరకు చదివించిన (పి.హెచ్.డి. తర్వాత నేను చేసాను) మా నాన్నగారి పేరిట ‘శ్రీ సిహెచ్.లక్ష్మీనారాయణ స్మారక సాహిత్య పురస్కారం’ గత సంవత్సరం నెలకొల్పి మొదటగా మా గురువుగారు, ప్రముఖ విమర్శకులు డా. కడియాల రామమోహనరాయ్ గారికి అందించాను.

7.పేరడీలు అంటే ఏమిటి? వీటిని మీరు ఒక పుస్తకం రాసినట్టున్నారు. దాని గురించి వివరించండి. పేరడీ యొక్క సాహిత్య ప్రయోజనం ఏమిటి?

జ) తెలుగులో వ్యంగ్యం, శ్లేష, వ్యాజస్తుతి, నిందాస్తుతి వంటివి ఉన్నాయి. కానీ ప్యారడీ, సెటైర్ వంటివి ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్లనే వచ్చాయి. ఏదైనా ఒక ప్రఖ్యాతమైన రచన తీసుకొని దానిని వ్యంగ్యంగా, వెక్కిరింతగా చెప్పటం ప్యారడీ. దీనికి జరుక్ శాస్త్రి గారు శ్రీ రమణ గారు ప్రముఖులు. పేరడీ చదవగానే మూల రచన గుర్తుకు వచ్చినప్పుడే అది మంచి హాస్యం చిందిస్తుంది. అసలు రచయిత కూడా తన రచన పై వచ్చిన పేరడీ చూసి నవ్వుకునేలా ఉండాలి. ఒక్కోసారి తమ రచనా పంధాని కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈమధ్య పత్రికలలో, టీవీలలో ప్రత్యేకంగా పేరడీకి స్థానం కల్పించడం, తద్వారా ఆహ్లాదం కలిగించడం ముదావహం.

పేరడీల పుస్తకావిష్కరణ

8.ఈ మధ్యకాలంలో మీ కలం నుండి ‘స్త్రీవాదం – పురుష రచయితలు’ అనే విభిన్నమైన అంశంతో పుస్తకం వెలువడినట్లుగా పత్రికలు చెబుతున్నాయి. ఈ రచన వెనుక నేపథ్యం ఏమిటి?

జ) పరిశోధన, విమర్శ నా అభిమాన అంశమని చెప్పాను కదా డాక్టర్ గారు! పి.హెచ్.డి. పూర్తి అయిపోయాక యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ వారి ఆర్థిక సౌజన్యంతో “ప్రపంచీకరణ – తెలుగు కవిత్వం” అనే అంశం మీద మైనర్ రీసర్చ్ ప్రాజెక్ట్ చేశాను.

గ్లోబలైజేషన్ భారతదేశంలోని అనేక రంగాలపై ఎలాంటి ప్రభావం చూపింది, వ్యవసాయ వాణిజ్య విద్య మానవసంబంధాల పై కలిగిన దుష్ప్రభావము గురించి విస్తృతంగా కవిత్వం వచ్చింది. వాటిని సేకరించి, వ్యాఖ్యానించి ప్రాజెక్టు సమర్పించాను. తర్వాత మంచి అంశం తీసుకొని మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టు చేయాలనుకుని చాలా ఆలోచించాను. యు.జి.సి. న్యూఢిల్లీలో “ఫెమినిజం – మేల్ రైటర్స్” అని నా టాపిక్ చెప్పగానే వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారో, ఈ మధ్య ఆ పుస్తకాన్ని ముద్రించినప్పుడు కూడా పాఠకుల నుంచి అంత ఆశ్చర్యం, ఆదరణ లభించింది. స్త్రీ సమస్యల గురించి, స్త్రీ మనోభావాల గురించి స్త్రీలు చెప్పటమే కాదు వాటి పట్ల సహ అనుభూతి (సానుభూతి కాదు. సహానుభూతి) కలిగిన కవులు, రచయితలు చాలామంది రచనలు చేశారు, చలం కొడవటిగంటి నుంచి కూడా. కె. శివారెడ్డి ‘ఆమె ఎవరైతే మాత్రం’లో చాలా అద్భుతమైన కవిత్వం రాసారు. ఎండ్లూరి సుధాకర్ ‘నల్లద్రాక్ష పందిరి’ కూడా. స్త్రీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లుని, అల్లకల్లోలాన్ని, అన్యాయాన్ని ఎదుర్కొంటుందో వివరంగా రాసిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ‘రమ నా కూతురు’, ‘బర్త్ సర్టిఫికెట్’ కథలు, పాపినేని శివశంకర్ ‘సగం తెరిచిన తలుపులు’ కథలు తీసుకున్నాను. అలాగే అన్వర్ అనే ముస్లిం యువతి జీవితంలోని ఒడిదుడుకులను సలీం ‘వెండి మేఘం’ అనే నవలలో మనసును తాకేలా చిత్రించారు. స్త్రీవాదం నేపథ్యంలో దీర్ఘాశి విజయ భాస్కర్ గారు, వల్లూరి శివప్రసాద్ గారు నాటకాలు రచించారు. వీటన్నిటిని తీసుకొని విశ్లేషిస్తూ ‘స్త్రీవాదం – పురుష రచయితలు’ అనే ప్రాజెక్టుని సమర్పించాను.

9.ఈ తరానికి ఏమాత్రం తెలియని వెయ్యిన్నొక్క నవలలు రాసి చరిత్ర సృష్టించిన శ్రీ కొవ్వలి వారి గురించి మరియు వారి జగజ్జాణ నవలను సంక్షిప్త రూపంలో ‘సంచిక’ అంతర్జాల పత్రిక ద్వారా పాఠకులకు అందించి, సాహిత్యకారుల్లో సైతం మీరు ప్రకంపనలు సృష్టించారు. ఈ రచన వెనుక మీరు ఎదుర్కొన్న సమస్యలేమిటి? నాటి రచయిత గురించిన సమాచారము, వారి రచనలను మీరు ఎలా సేకరించగలిగారు?

జ) మూడేళ్ల క్రితం మా బాబు ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా ట్రైనింగ్ పూర్తి చేస్తుండగా, సికింద్రాబాద్‌లో పోస్టింగ్స్ వస్తాయన్న ఊహతో, ఆశతో గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. కానీ ఆర్మీలో ‘మేనేజ్’ చేయడాలు, ‘రిక్వెస్ట్’‌‌లు ఉండవు. అనూహ్యంగా తనకి కెప్టెన్‌గా మంచుకొండలు మధ్య సియాచిన్ గ్లేసియర్‌లో పోస్టింగ్ వచ్చింది. ఉన్న ఊరు వదిలి పెట్టి హైదరాబాద్ వచ్చి కొంత ఒత్తిడికి గురయ్యాననే చెప్పాలి. ఆ సమయంలో పుస్తకాలే తోడయ్యాయి. చదువుకుంటూ కాలం గడుపుతున్న సమయంలో కరోనా లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంటికే పరిమితం అయ్యాం. చాల పత్రికల ప్రచురణలు ఆగిపోయాయి. చదివే పుస్తకాలనే మరింత లోతుగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ వ్యాసాలు రాసి వెబ్ మ్యాగజైన్స్ కి పంపసాగాను. ఆ క్రమంలో 1965 లో ‘భయంకర్’ రచించిన ‘జగజ్జాణ’ పాకెట్ సైజ్ 25 పుస్తకాల గురించి రాయాలనుకొన్నప్పుడు, ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర గారి ద్వారా భయంకర్ కలం పేరుతో రాసేది శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు అని తెలిసింది. సీనియర్ జర్నలిస్టు శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు కూడా కొన్ని విశేషాలు చెప్పారు. కొవ్వలి వెయ్యిన్నొక్క నవలలు రాసిన తెలుగు రచయిత అని తెలిసి ఆశ్చర్యపోయాను. వారి వివరాలు ఎక్కువగా లభించలేదు. కొంత సేకరిస్తుండగా కొవ్వలి వారి కుమారులు నాగేశ్వరావు గారు లక్ష్మీనారాయణ గారు నాకు ఫోన్ చేశారు. తండ్రిగారి గురించి ఎన్నో విశేషాలు చెప్పసాగారు. అన్నీ రాసుకుంటూ, క్రమపద్ధతిలో కొవ్వలి వారి జీవితచరిత్ర పాఠకుల్ని చదివించేలా, ఒకరకంగా కథారూపంగా ‘సంచిక’ వెబ్ మాగజైన్‌లో రాసాను, ఎడిటర్ కస్తూరి మురళీకృష్ణ ప్రోత్సాహంతో. హ్యారీ పోటర్‌ అద్భుత విజయం సాధించింది. బాహుబలి దేశదేశాల్లో విజయ ఢంకా మోగించింది. కాబట్టి జానపద కథలకి ఎప్పటికీ ఆదరణ ఉంటుంది అనిపించింది. కానీ ఈ తరం వారు తేలిక భాషలో ఉంటేనే చదువుతారు. పైగా 1650 పేజీల నవలని చదవరు. ఆనాటి కొవ్వలి వారి అద్భుతమైన మిన్టరీ నవల జగజ్జాణని ఈ తరం వారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో సరళంగా సంక్షిప్తంగా 125 పేజీలలో, ఎక్కడా కథకి లోపం కలక్కుండా రాశాను. ఇప్పుడు కూడా చాలామంది, ముఖ్యంగా అరవయ్యేళ్ళు దాటిన వారు ఆనాటి కొవ్వలి రచనలు తలుచుకుంటూ ఈ పుస్తకం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

త్యాగరాయ గాన సభలో కొవ్వలి పుస్తకావిష్కరణ

10.తెలుగు భాష పై మీకున్న మక్కువ మీ రచనలను బట్టి సులభంగా తెలుసుకోవచ్చు. మీ ప్రభావం మీ పిల్లలపై ఎంతవరకు ఉంది? నేటి తరం పిల్లలు పూర్తిగా పాఠ్యాంశాల మీదే దృష్టి సారించి, ఇతర పుస్తకాల పై అసలు ఆసక్తి చూపించటం లేదన్నది చాలామంది తల్లిదండ్రులు వెలిబుచ్చిన అభిప్రాయం. జనరల్ పుస్తకాలు చదవలేక పోతున్న నేటి తరం యువతీ యువకుల జీవనశైలిపై ఇది ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది?

జ) మా అమ్మ నాన్నలకు సాహిత్యాభిరుచి ఉండటంతో (నేను ప్రత్యేకంగా తెలుగు భాష తీసుకొని చదివినా) తమ్ముళ్ళు చెల్లెళ్ళు వేరే వేరే సబ్జెక్ట్‌లు తీసుకుని చదివినా కూడా సాహిత్యాభిరుచి ఉండేది, విస్తృతంగా చదవకపోయినా. అలాగే మా బాబు పాప కూడా నాతో పాటు సాహిత్య సభలకు రావడం, పుస్తకాల గురించి నేను చెప్తూ ఉండటం వల్ల వారు ఎక్కువగా చదవకపోయినా మామధ్య సాహిత్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

పుస్తకాలనేవి మన మస్తిష్కాలకు నేస్తం వంటివి. మేథస్సుకి పదును పెట్టేవి. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవి. కానీ నేటి విద్యార్థులు పాఠ్య పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు చదవక పోవడం చాలా దురదృష్టకరం. పుస్తకాలకే పరిమితమై పోవడంతో ప్రపంచం, దేశ పరిస్థితులు, చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులు పట్ల అవగాహన లేదు. జీవితంలోని ఒడిదుడుకులను, గెలుపోటములను సమానంగా స్వీకరించడం తెలియటం లేదు. అందుకే ప్రతి చిన్న ఆశాభంగానికి ఆత్మహత్యల దాక వెళుతున్నారు. తమని తాము తీర్చిదిద్దుకునే నేర్పు ఉండటం లేదు. పఠనాసక్తి కలిగించక పోవడానికి కొంత వరకు తల్లిదండ్రులు కూడా కారణమే. సంపాదన, టీవీ వ్యామోహంలో తల్లిదండ్రులు మునిగిపోతుంటే ఇక పిల్లల సంగతి చెప్పాలా!

ప్రభుత్వ కళాశాల, చీరాల. ముఖ్య అతిథిగా

11.సంస్కృతంలో ప్రాథమిక పఠనం లేకుండానే సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతం చదవడానికి విద్యార్థులు ఉత్సాహం చూపించడానికి కారణం – ఒక విద్యావేత్తగా మీ అభిప్రాయం చెప్పండి. అలా చదవటం ద్వారా ఎక్కువ శాతం మార్కులు విద్యార్థులు పొందుతున్నారు. ఇది మన మాతృభాష పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

జ) పూర్వకాలంలో సంస్కృతంలో రాస్తేనే పాండిత్యం ఉన్నట్లు భావించేవారు. తెలుగులో రాయటం మొదట్లో కొంత నిరసన వ్యక్తమైనా, తెలుగు భాష తనను తాను నిలబెట్టుకుంటూ స్వర్ణయుగాన్ని కూడా చవి చూసింది. అద్భుతమైన సాహిత్యాన్ని అందించింది. ఆంగ్లేయుల పాలనలో మనవారు విస్తృతంగా ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. నిజానికి ఆధునికాంధ్ర సాహిత్యంలోని అనేక ప్రక్రియలు ఆంగ్ల సాహిత్యం నుండి వచ్చాయి. మన భావ కవిత్వానికి ఆంగ్లంలోని రొమాంటిసిజమ్ ఆధారం. అంటే పూర్వం సంస్కృతం, ఇప్పుడు ఆంగ్లం తెలుగు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించిందని చెప్పవచ్చు. తప్పులేదు. కానీ ఇంటర్మీడియట్ లో ద్వితీయ భాషగా తెలుగు కాకుండా అందరూ సంస్కృతమే తీసుకోవడం దురదృష్టకరం. 90 నుండి 100 వరకు మార్కులు వస్తాయి అన్న భావమే కారణం. కానీ అక్కడక్కడ సంస్కృత శ్లోకాలు ఉటంకించినా మొత్తం తెలుగు లిపి లోనే రాస్తారు. ఇక సంస్కృత భాష తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది! నేటి ఈ విద్యా విధానం వల్ల ఆంగ్లం, సంస్కృతం, తెలుగు ఏదీ సమగ్రంగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది బాధాకరం.

12.మీ అవార్డులు, సన్మానాలు గురించి చెప్పండి.

జ) డాక్టర్ గారు! అదేమంత గొప్ప విషయం కాదండి. కానీ నేను సంతోషించే విషయం ఏమిటంటే కేవలం డిగ్రీలో స్పెషల్ తెలుగు మాత్రమే కాకుండా, మహిళా కళాశాలలు కాబట్టి యూనివర్శిటీ వారిని అభ్యర్థించి గుంటూరు లోనూ ఒంగోలు లోనూ తెలుగు ఎం.ఏ. ప్రవేశపెట్టించాను. విద్యార్థినులకు సమాజము, హక్కులు, గృహహింస పట్ల అవగాహన కోసం ‘విమెన్ డెవలప్మెంట్ సెల్’ ఏర్పాటు చేశాను. పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖమైన స్త్రీ రచయిత్రులు, సామాజిక కార్యకర్తలతో ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశాను. కేవలం తరగతి గదులతో పరిమితం కాకుండా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాను. వారిలో సృజనాత్మకశక్తి పెంపొందించడానికి ‘కళాప్రియ’ అనే రాత పత్రికను కూడా కొన్నాళ్ల నిర్వహించాను. అధ్యాపకురాలిగా ఇవన్నీ నాకు తృప్తి కలిగించిన విషయాలు. ఆ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నాను. జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ వారు నిర్వహించిన కార్యక్రమాలు రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్నాను.

ఆకాశవాణిలో, సిటీ కేబుల్, దూరదర్శన్ లో ప్రసంగాలు, చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్ లలో పత్రసమర్పణ చేసాను.

ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో ‘అన్నమాచార్య కీర్తనలు’ మీద రెండురోజుల జాతీయ సెమినార్ ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. ఇందిరాగాంధీ సేవా పురస్కారం, మదర్ తెరిసా సేవా పురస్కారం, ఎన్టీఆర్ మహిళా పురస్కారం, అధికార తెలుగు భాషా పురస్కారం, విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య పురస్కారం, గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం అందుకున్నాను. ఇటీవల జీవిత చరిత్రల విభాగంలో కొవ్వలి వారి పుస్తకానికి కీ.శే. చిన నాగయ్య స్మారక పురస్కారం, పరిశోధన రంగంలో శిఖామణి గారి కవిసంధ్య పురస్కారం ప్రకటించబడింది.

డాక్టర్ గారు! ఈ పాండమిక్ సమయంలో, స్తబ్దత నిండి ఉన్న సమయంలో – పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని కాసింత మనసు ఆనందంతో ఉండేలా మీరు చేసిన ఇంటర్వ్యూ నా వరకు చాలా సంతోషంగా ఉందండి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

Exit mobile version