Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాధారణ క్రైమ్ థ్రిల్లర్స్‌ని మించిన నవల ‘ఇన్ ఎ లోన్లీ ప్లేస్’

[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా డోరతీ బి. హ్యూస్ రాసిన ‘ఇన్ ఎ లోన్లీ ప్లేస్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]

డోరతీ బి. హ్యూస్ రాసిన ‘ఇన్ ఎ లోన్లీ ప్లేస్’ అనేది బిగి సడలని, ఆలోచింపజేసే నోయిర్ నవల. ఇది సాధారణ మిస్టర్ ఫార్ముల నవలకు అతీతంగా – అస్తిత్త్వం, మగతనం, ఇంకా రహస్య హింసని ప్రదర్శిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరపు లాస్ ఏంజిలిస్ నేపథ్యంగా అల్లిన ఈ నవల – మాజీ ఫైటర్ పైలట్ అయిన డిక్స్ స్టీల్‌ కథ. అతను ప్రస్తుతం అప్పు చేసిన డబ్బుతో, అరువు తెచ్చుకున్న బట్టలతో, అరువు తెచ్చుకున్న గుర్తింపుతో జీవిస్తున్నాడు, ఒక నవల రాస్తున్నట్లు చెప్పుకుంటూ జీవితంలో లక్ష్యం లేకుండా కొట్టుమిట్టాడుతున్నాడు. యుద్ధం తర్వాత నిజమైన ఉద్దేశమేదీ లేకుండా – భ్రమతో కూడిన, ప్రమాదం నిండిన నగరంలో తప్పిపోతాడు డిక్స్.

డోరతీ బి. హ్యూస్

డిక్స్ పాత్ర ఆకర్షణీయంగా ఉంటుంది, అదే సమయంలో కలవరపెట్టేదిగా ఉంటుంది. అతను తనను తాను ఆధునిక మనిషిగా, విజయవంతమైన వ్యక్తిగా వ్యక్తం చేసుకుంటాడు, కానీ దాని కింద నిరాశ, ఆగ్రహం, ఇంకా తనకు ఎక్కువ ఋణపడి ఉందని భావించే ప్రపంచం పట్ల పెరుగుతున్న కోపం ఉంటాయి. విజయం కోసం పనిచేయడం అతనికి ఇష్టం ఉండదు – కానీ అతను దాన్ని ఆశిస్తాడు. అతను LAPD కోసం పనిచేస్తున్న పాత సైనిక స్నేహితుడు బ్రబ్‌ని తిరిగి కలిసినప్పుడు, నవల ప్లాట్ చిక్కబడుతుంది. ఆడవాళ్ళను గొంతు కోసి చంపుతున్న సీరియల్ కిల్లర్ కేసును పరిశోధిస్తుంటాడు బ్రబ్. తెలివైన భార్య సిల్వియాతో అతని స్థిరమైన జీవితం – ఏ ఆధారమూ లేని డిక్స్ జీవితానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.

లారెల్ అనే అందమైన, మాటల తూటాలు విసిరే, నటి కావాలని కోరుకునే యువతిని డిక్స్ కలవడంతో కథ ఉద్రిక్తంగా మారుతుంది. ఆమె త్వరగా అతని దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె స్టైలిష్‌గా ఉంటుంది, తెలివైనది. అయితే ఆమె ఖరీదైన అభిరుచులు – డిక్స్ ఆర్థిక పరిస్థితికి సరిపోవు. డిక్స్ ధనవంతుడైన, నియంత్రణ లేని వ్యక్తిలా కనిపించడానికి ప్రయత్నించినప్పటికీ, లారెల్‌కి అతని పట్ల ఆకర్షణ తగ్గాకా, అతని అంతర్గత గందరగోళం మరింత తీవ్రమవుతుంది. అదే సమయంలో హత్యల దర్యాప్తు అతని ఇంటికి వరకూ వచ్చేస్తుంది.

హ్యూస్ కథ చెప్పే విధానాన్ని ముఖ్యంగా ప్రభావవంతంగా చేసినది – డిక్స్ దృక్కోణం నుండి రాయాలని ఆమె ఎంచుకోడం. ఈ టెక్నిక్ పాఠకుడిని అతని ఆలోచనలకు దగ్గరగా లాగుతుంది, అనుభవాన్ని తీవ్రంగా, కొన్నిసార్లు క్లాస్ట్రోఫోబిక్‌గా చేస్తుంది. డిక్స్ చెప్పేదానికి, అతను నిజంగా ఏం అనుభూతి చెందుతాడు లేదా ఏమి చేస్తాడో దాని మధ్య అంతరంలో కథలో అత్యంత ఉత్కంఠభరితమైన క్షణాలు ఎదురవుతాయి. ఈ ఉత్కంఠ ఒక రహస్యాన్ని ఛేదించడం నుండి రాదు, కానీ డిక్స్ ఎంత దూరం వెళ్ళవచ్చో, అసలు ఎందుకు వెళ్ళవచ్చో తెలుసుకోడం నుండి వస్తుంది.

ఈ నోయిర్‍లో రచయిత్రి హ్యూస్ సుపరిచితమైన భావార్థాలను (tropes) కూడా ఉపయోగిస్తారు – సమ్మోహక మహిళలు, డిటెక్టివ్, కపటిగా మారిన అందమైన నగరం – కానీ వాటిని అర్థం చేసుకునే పద్ధతిని, ప్రదర్శించే రీతిని ఊహించని విధంగా మార్చేస్తారు. లారెల్, సిల్వియా ఇద్దరూ ఊహించిన దానికంటే చాలా శక్తివంతమైన, అంతర్దృష్టిగల పాత్రలను పోషిస్తారు, నవల ప్రధాన భాగంలో విషపూరితమైన మగతనాన్ని ఎదుర్కోవడంలో, నేరస్థుడిని బహిర్గతం చేయడంలో కీలక పాత్రధారులు అవుతారు. రచయిత్రి నియంత్రణ, భ్రమ, ఇంకా అర్హతలను ఇతివృత్తాలను పొరలుగా చేయడానికి సొగసైన, పొందికైన వచనాన్ని ఉపయోగిస్తారు, తన ఆధిపత్యం జారిపోతున్నట్లు భావించినప్పుడు సాధారణ వ్యక్తి ఎంత ప్రమాదకరంగా ఉంటాడో ప్రదర్శిస్తారు.

‘ఇన్ ఎ లోన్లీ ప్లేస్’ నవల – నేరాలు ఎవరు చేశారో కనుక్కోవడం గురించి కాకుండా డిక్స్ స్టీల్ అనే వ్యక్తి – నిజంగా ఎవరో అర్థం చేసుకోవడం గురించి ఎక్కువగా చెబుతుంది. రచయిత్రి హ్యూస్ – నోయిర్ శైలిని నిశ్శబ్దంగా పునర్నిర్మిస్తూ, స్పష్టమైన సన్నివేశాల ద్వారా గుట్టు విప్పుతూ – ఆ వ్యక్తి గురించి పదునైన, కలవరపెట్టే చిత్రణను అందించారు. ఆమె ఈ రచన మగ రచయితల క్లాసిక్ నోయిర్‍లకు సమానమైన గుర్తింపును పొందాలి.

ఈ నవల చివరి పేజీ చదవడం పూర్తి చేశాకా, చాలా కాలం పాటు మనసులో నిలిచి ఉండేలా ఉత్కంఠను మానసిక అంతర్దృష్టితో కలపడం రచయిత్రి ప్రతిభను ఋజువు చేస్తుంది.

***

Book Title: In a Lonely Place
Author: Dorothy B. Hughes
Published By: Penguin Classics
Year of publication: 1947
No. of pages: 192
Price: ₹385.89
Link to buy:
https://www.amazon.in/Lonely-Place-Penguin-Modern-Classics/dp/0141192313

Exit mobile version